కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ తన హృదయాన్ని కుమ్మరించింది

ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ తన హృదయాన్ని కుమ్మరించింది

వారి విశ్వాసాన్ని అనుసరించండి

ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ తన హృదయాన్ని కుమ్మరించింది

హన్నా తన బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ప్రయాణానికి సిద్ధమవుతోంది. అది చాలా సంతోషంగా ఉండాల్సిన సమయం; షిలోహులో ఉన్న గుడారంలో ఆరాధించడానికి ఆమె భర్త ఎల్కానా ప్రతి సంవత్సరం మొత్తం కుటుంబాన్ని అక్కడకు తీసుకువెళ్తాడు. అలాంటి సందర్భాల్లో సంతోషంగా ఉండాలని యెహోవా చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 16:15) హన్నా చిన్నతనం నుండే అలాంటి పండుగల్లో తప్పకుండా ఎంతో సంతోషించి ఉంటుంది. కానీ ఇటీవలి సంవత్సరాల్లో ఆమె పరిస్థితుల్లో మార్పు వచ్చింది.

ఆమెకు తనను ఎంతో ప్రేమించే భర్త దొరికాడు. అయితే, ఎల్కానాకు మరో భార్య కూడా ఉంది. ఆమె పేరు పెనిన్నా. ఆమె హన్నా జీవితాన్ని దుర్భరం చేయడమే పనిగా పెట్టుకుంది. ప్రతి సంవత్సరం వచ్చే ఇలాంటి సందర్భాలు కూడా హన్నాకు ఎంతో బాధ కలిగించేలా చేయడానికి ఆమె ఒక మార్గాన్ని ఎంచుకుంది. ఆమె ఏమి చేసేది? అంతకంటే ముఖ్యంగా, ఎంతో కష్టభరితమైన పరిస్థితులను కూడా తట్టుకోవడానికి హన్నాకు యెహోవామీద ఉన్న విశ్వాసం ఆమెకెలా సహాయం చేసింది? జీవితంలో సంతోషమే లేకుండా చేసే పరిస్థితులను మీరు ఎదుర్కొంటుంటే, హన్నా వృత్తాంతం మీకు ఎంతో ఓదార్పునిస్తుంది.

‘నీకు మనోవిచారం ఎందుకు కలిగింది?’

హన్నా జీవితంలోని రెండు సమస్యల గురించి బైబిలు తెలియజేస్తోంది. ఆ రెండిటి విషయంలోనూ ఆమె ఏమీ చేయలేని పరిస్థితి. మొదటి సమస్య ఏమిటంటే, ఆమె భర్త మరో స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ రెండవ భార్య ఈమెను ఎంతో ద్వేషించేది. రెండవ సమస్య ఏమిటంటే, హన్నాకు పిల్లలు లేరు. పిల్లలు కావాలని కోరుకునే ఏ భార్యకైనా అదెంతో కష్టమైన పరిస్థితి; అయితే హన్నా జీవించిన కాలంలో ఆ సంస్కృతిలో అది తీవ్రమైన వేదన కలిగించేది. ఇంటి పేరును కొనసాగించే సంతానం కోసం ప్రతి కుటుంబం ఎంతో కాంక్షించేది. పిల్లలు లేకపోవడం ఘోరమైన అవమానంగా పరిగణించబడేది.

పెనిన్నా పెట్టే బాధలు లేకపోతే హన్నా తనకు పిల్లలు లేకపోవడాన్ని సులువుగానే సహించగలిగేది. చాలామందిని పెళ్లి చేసుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. పగ, ద్వేషం, మనోవేదన తప్పకుండా తలెత్తుతాయి. చాలామందిని పెళ్లి చేసుకోవడం, ఒక భర్తకు ఒకే భార్య ఉండాలని ఏదెను తోటలో దేవుడు పెట్టిన ప్రమాణానికి పూర్తి విరుద్ధం. a (ఆదికాండము 2:24) దాన్ని బైబిలు ప్రోత్సహించడం లేదు. ఎల్కానా కుటుంబంలోని పరిస్థితి అలా చేసుకోవడం ఎందుకు మంచిది కాదో చక్కగా చూపిస్తోంది.

ఎల్కానా హన్నాను ఎంతో ప్రేమించాడు. యూదుల సంప్రదాయం చెప్తున్నదాని ప్రకారం, ఎల్కానా మొదట హన్నాను పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు పెనిన్నాను పెళ్లి చేసుకున్నాడు. హన్నా అంటే ఎంతో అసూయపడే పెనిన్నా ఆమెను ఎన్నో విధాలుగా బాధపెట్టేది. హన్నాకు పిల్లలు పుట్టలేదు కానీ పెనిన్నాకు పిల్లలు పుట్టారు. పెనిన్నాకు పిల్లలు పుట్టేకొద్దీ తన గురించి తాను గొప్పగా అనుకోవడం మొదలుపెట్టింది. హన్నాను చూసి జాలిపడి ఆమెను ఓదార్చే బదులు, పెనిన్నా ఆమె బలహీనతను ఆసరాగా తీసుకుని మరింత బాధపెట్టింది. పెనిన్నా హన్నాకు ‘కోపం పుట్టించాలని’ ఆమెను ఎంతో విసిగించిందని బైబిలు చెప్తుంది. (1 సమూయేలు 1:6) పెనిన్నా కావాలనే అలా చేసింది. ఆమె హన్నాను బాధ పెట్టాలనుకుంది, అలాగే చేసింది.

ప్రతి సంవత్సరంలాగే షిలోహుకు వెళ్లే సమయం వచ్చినప్పుడు హన్నాను బాధపెట్టే మంచి అవకాశం పెనిన్నాకు దొరికింది. పెనిన్నాకు ఉన్న చాలామంది పిల్లల్లో ప్రతీ ఒక్కరికీ అంటే ‘ఆమె కుమారులకు, కుమార్తెలకు’ ఎల్కానా యెహోవాకు బలి అర్పించిన దానిలో నుండి పాళ్లు ఇచ్చాడు. అయితే, పిల్లలు లేని హన్నాకు ఆమె వంతుగా ఒక పాలు మాత్రమే దొరికింది. అప్పుడు పెనిన్నా హన్నాకు ఆమె గొడ్రాలితనాన్ని గుర్తుచేసి ఎంతగా బాధపెట్టిందంటే, దానికి హన్నా ఎంతో ఏడ్చింది, దాంతో ఆమె ఆకలి కూడా చచ్చిపోయింది. తనకు ఎంతో ప్రియమైన హన్నా వేదన అనుభవిస్తూ ఆహారం తినడం లేదని గమనించిన ఎల్కానా ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. ‘హన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? భోజనం మానడం దేనికి? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? పదిమంది కుమారుల కంటే నేను నీకు విశేషమైనవాడిని కానా?’ అని అడిగాడు.—1 సమూయేలు 1:4-8.

పిల్లలు లేకపోవడం వల్లే హన్నా వేదన పడుతుందని ఎల్కానా గ్రహించాడు. ప్రేమతో ఆయన అన్న మాటలు హన్నాను ఎంతో ఓదార్చివుంటాయి. b ఎల్కానా పెనిన్నా ద్వేషం గురించి ప్రస్తావించలేదు, హన్నా ఆయనకు ఆ విషయం చెప్పినట్టు కూడా బైబిల్లో లేదు. పెనిన్నా దుష్టబుద్ధిని బయటపెడితే తన పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని ఆమె అనుకునివుండవచ్చు. ఎల్కానా నిజంగా పరిస్థితిలో ఏమైనా మార్పు తీసుకురాగలడా? పెనిన్నా ద్వేషం మరింత పెరిగిపోయి, ఆమె పిల్లలు, సేవకులు కూడా ఆమెలాగే హన్నాను మరింత ద్వేషిస్తారా? ఆ ఇంట్లో హన్నా మరింత పరాయిదానిలా భావించే అవకాశం ఉంది.

పెనిన్నా కలిగిస్తున్న వేదనంతా ఎల్కానాకు తెలిసినా తెలియక పోయినా, యెహోవా దేవుడు మాత్రం అదంతా చూశాడు. ఆయన వాక్యం మనకు విషయమంతా స్పష్టంగా తెలియజేస్తూ, చాలా చిన్నవిగా అనిపించే విషయాల్లో కూడా అసూయాద్వేషాలు చూపించే వాళ్లకు గంభీరమైన హెచ్చరికనిస్తుంది. మరోవైపు హన్నాలాంటి నిర్దోషులు, సమాధానపరులు సరైన సమయమని దేవుడు అనుకున్నప్పుడు సరైన మార్గమని ఆయన అనుకున్న విధంగా పరిస్థితులను చక్కబరుస్తాడని తెలుసుకుని ఓదార్పు పొందవచ్చు. (ద్వితీయోపదేశకాండము 32:4) ఈ విషయం హన్నాకు తెలిసేవుంటుంది, అందుకే ఆమె సహాయం కోసం యెహోవాను ఆశ్రయించింది.

‘దుఃఖించడం మానేసింది’

పొద్దుపొద్దున్నే అందరూ హడావిడిగా ఉన్నారు. పిల్లలతో సహా అందరూ ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. ఆ పెద్ద కుటుంబం షిలోహుకు చేరుకోవాలంటే, కొండలు, గుట్టలు ఉన్న ఎఫ్రాయిములో 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలి. c కాలినడకన వెళితే ఒకట్రెండు రోజుల ప్రయాణం. తన సవితి ఎలా ప్రవర్తిస్తుందో హన్నాకు తెలుసు. అయినా, హన్నా ఇంటి దగ్గరే ఉండిపోలేదు. ఈనాటి దేవుని ఆరాధకులకు కూడా ఆమె ఆదర్శప్రాయంగా ఉంది. ఇతరుల చెడు ప్రవర్తనను చూసి మనం దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడం ఎప్పుడూ జ్ఞానయుక్తం కాదు. మనం అలా చేస్తే, సహించడానికి మనల్ని బలపర్చే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం.

ఈ పెద్ద కుటుంబం, వంపులు తిరిగిన కొండదారులపై ఒకరోజు ప్రయాణం తర్వాత షిలోహు దగ్గరకు వచ్చింది. దాదాపు చుట్టూ ఎత్తయిన కొండలున్న ఒక కొండపై ఇది ఉంది. వాళ్లు షిలోహుకు సమీపిస్తుండగా, హన్నా ప్రార్థనలో యెహోవాకు ఏమి చెప్పాలనేదాని గురించి ఎంతో ఆలోచించివుంటుంది. వాళ్లు అక్కడికి చేరుకున్న తర్వాత కుటుంబమంతా కలిసి భోజనం చేశారు. వీలైనంత త్వరగా హన్నా వాళ్ల నుండి దూరంగా వెళ్లి యెహోవా గుడారాన్ని చేరుకుంది. అక్కడ ఆలయ స్తంభం దగ్గర ప్రధాన యాజకుడైన ఏలీ కూర్చుని ఉన్నాడు. హన్నా మనసంతా తన దేవునిపైనే ఉంది. గుడారం దగ్గరైతే దేవుడు తన ప్రార్థన వింటాడని నమ్మింది. ఆమె బాధను ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా, పరలోకంలోవున్న ఆమె తండ్రి అర్థంచేసుకుంటాడు. ఆమెలో దుఃఖం పొంగుకొస్తుండగా ఆమె ఏడవడం మొదలుపెట్టింది.

హన్నా వెక్కి వెక్కి ఏడుస్తుండడంతో ఆమె శరీరమంతా వణికిపోయింది. ఆమె తనలో తాను యెహోవాతో మాట్లాడడం మొదలుపెట్టింది. తన బాధను చెప్పుకోవడానికి మనసులో మాటలు కూడగట్టుకుంటుండగా ఆమె పెదవులు కదిలాయి. ఆమె చాలాసేపు తన తండ్రికి ప్రార్థన చేస్తూ, తన హృదయాన్ని కుమ్మరించింది. అయితే, ఆమె తనకు సంతానం కావాలనే కోరికను తీర్చమని మాత్రమే దేవుణ్ణి అడగలేదు. దేవుని ఆశీర్వాదాలు పొందడమే కాదు, ఆయనకు తాను ఇవ్వగలిగింది ఇవ్వాలని కూడా ఆమె ఎంతో కోరుకుంది. అందుకే ఆమె తనకు కుమారుడు జన్మిస్తే, ఆ బిడ్డ జీవితాన్ని యెహోవా సేవకు సమర్పిస్తానని చెప్తూ, ఒక మ్రొక్కుబడి చేసుకుంది.—1 సమూయేలు 1:9-11.

అందుకే, హన్నా ప్రార్థన విషయంలో దేవుని సేవకులందరికీ ఆదర్శప్రాయంగా ఉంది. ప్రేమగల తల్లిదండ్రుల మీద నమ్మకముంచే పిల్లవాడు తన బాధల గురించి వాళ్లకు చెప్పుకున్నట్లు మనం ఎలాంటి సంకోచం లేకుండా అన్ని విషయాలు తనకు చెప్పుకోవాలని యెహోవా తన ప్రజలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. (కీర్తన 62:8; 1 థెస్సలొనీకయులు 5:17) యెహోవాకు ప్రార్థన చేయడం గురించి ఈ ఓదార్పుకరమైన మాటలు రాయడానికి అపొస్తలుడైన పేతురు ప్రేరేపించబడ్డాడు, “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”—1 పేతురు 5:7.

అయితే, మానవులు యెహోవా అర్థం చేసుకున్నంతగా అర్థంచేసుకోరు, ఆయనంత సహానుభూతి చూపించరు. హన్నా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక స్వరం విని, ఉలిక్కిపడింది. అది ఆమెను గమనిస్తున్న ప్రధాన యాజకుడైన ఏలీ స్వరం. ఆయన ఆమెతో, ‘ఎంతవరకు నువ్వు మత్తురాలిగా ఉంటావు? ద్రాక్షారసాన్ని నీ దగ్గర నుండి తీసివేయి’ అన్నాడు. ఆయన హన్నా పెదవులు కదలడం, ఆమె వెక్కి వెక్కి ఏడ్వడం, ఆమె మానసిక స్థితిని గమనించాడు. ఆయన ఏమి జరిగిందని అడిగి తెలుసుకోకుండా ఆమె మత్తులో ఉందని పొరబడ్డాడు.—1 సమూయేలు 1:12-14.

అంత బాధలో ఉన్న హన్నాకు, అంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి తనమీద అన్యాయంగా అలాంటి నింద వేయడం ఎంత బాధ కలిగించివుంటుందో! అయినా కూడా హన్నా విశ్వాసం విషయంలో మంచి మాదిరిని ఉంచింది. ఒక వ్యక్తి అపరిపూర్ణతలవల్ల ఆమె యెహోవాను ఆరాధించడం ఆపలేదు. ఆమె ఏలీకి మర్యాదపూర్వకంగా తన పరిస్థితిని వివరించింది. ఆయన తన పొరపాటు గ్రహించి కాస్త మృదు స్వరంతో ఇలా సమాధానమిచ్చాడు, ‘నువ్వు క్షేమంగా వెళ్లు; ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక.’—1 సమూయేలు 1:15-17.

హన్నా యెహోవాకు ప్రార్థన చేస్తూ తన హృదయాన్ని కుమ్మరించడంవల్ల, ఆయన గుడారంలో ఆయనను ఆరాధించడంవల్ల ఏమి జరిగింది? బైబిలు ఇలా తెలియజేస్తుంది, ‘ఆ స్త్రీ తన దారిన వెళ్లిపోయి భోజనం చేస్తూ ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండడం మానేసింది.’ (1 సమూయేలు 1:18) హన్నా ఎంతో ఉపశమనం పొందింది. ఒక విధంగా చెప్పాలంటే, ఆమె తన మనోభారాన్ని తన కంటే ఎంతో బలవంతుడైన తన పరలోక తండ్రి భుజాల మీద పెట్టేసింది. (కీర్తన 55:22) ఆయన పరిష్కరించలేనంత పెద్ద సమస్య ఏదైనా ఉందా? లేదు. ఆయన పరిష్కరించలేని సమస్యంటూ అసలు ఏదీ ఉండదు!

దుఃఖంతో కృంగిపోయినట్లు అనిపించినప్పుడు, మనం హన్నాను ఆదర్శంగా తీసుకుని, దేవుని ముందు మన హృదయాన్ని కుమ్మరించడం మంచిది, ఆయన “ప్రార్థన ఆలకించువాడు” అని బైబిలు చెప్తోంది. (కీర్తన 65:2) మనం కూడా విశ్వాసంతో అలా చేస్తే, మన దుఃఖం పోయి, ‘సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం’ మనకు దొరుకుతుంది.—ఫిలిప్పీయులు 4:6, 7.

‘మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదీ లేదు’

మర్నాడు ఉదయం హన్నా ఎల్కానాతోపాటు మళ్లీ గుడారానికి వచ్చింది. ఆమె ఆయనకు తన విన్నపం గురించి తన మ్రొక్కుబడి గురించి చెప్పివుంటుంది. ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం, భార్య తన భర్త అనుమతి లేకుండా చేసిన మ్రొక్కుబడిని రద్దు చేసే అధికారం భర్తకు ఉండేది. (సంఖ్యాకాండము 30:10-15) కానీ, నమ్మకస్థుడైన ఆ వ్యక్తి ఆమె మ్రొక్కుబడిని రద్దు చేయలేదు. కానీ, ఇంటికి బయలుదేరే ముందు ఆయన, హన్నా కలిసి గుడారంలో యెహోవాను ఆరాధించారు.

ఇక తాను హన్నాను బాధించలేనని పెనిన్నా ఎప్పుడు గ్రహించింది? బైబిలు దాని గురించి చెప్పడం లేదు, కానీ ‘దుఃఖముఖిగా ఉండడం మానేసింది’ అనే పదబంధాన్నిబట్టి, అప్పటి నుండి హన్నా దుఃఖించడం మానేసి సంతోషంగా ఉందని తెలుస్తోంది. ఏదేమైనా, తను విసిగించడంవల్ల ప్రయోజనమేమీ లేదని పెనిన్నా త్వరలోనే తెలుసుకుంది. బైబిలు ఆమె పేరు మళ్లీ ఎప్పుడూ ప్రస్తావించలేదు.

కొన్ని నెలలు గడిచిపోయాయి. ప్రశాంతంగా ఉంటున్న హన్నాకు ఒకేసారి చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆమె గర్భవతి అయ్యింది! ఆ సంతోషంలో ఆమె తనను ఎవరు ఆశీర్వదించారో ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె వాడికి సమూయేలు అని పేరు పెట్టింది. దానికి “దేవుని పేరు” అని అర్థం. హన్నాలా, దేవుని పేరును ఉపయోగించడాన్ని అది సూచిస్తుండవచ్చు. ఆ సంవత్సరం ఎల్కానా ఆయన కుటుంబం షిలోహుకు వెళ్తున్నప్పుడు ఆమె వాళ్లతోపాటు వెళ్లలేదు. మూడు సంవత్సరాలపాటు, పిల్లవాడు పాలు తాగడం మానేసే వరకు పిల్లవాడితోపాటు ఇంటి దగ్గరే ఉండిపోయింది. తర్వాత తన ప్రియ కుమారుణ్ణి విడిచిపెట్టి రావడానికి కావాల్సిన బలాన్ని సమకూర్చుకుంది.

విడిచిపెట్టి రావడం హన్నాకు అంత సులువై ఉండకపోవచ్చు. షిలోహులో, గుడారంలో సేవ చేసే కొంతమంది స్త్రీలు సమూయేలును బాగా చూసుకుంటారని హన్నాకు తెలుసు. అయినా అబ్బాయి చాలా చిన్నవాడు. తను తన బిడ్డతోపాటు ఉండాలని ఏ తల్లి మాత్రం కోరుకోదు? అయినా సరే, హన్నా, ఎల్కానా సణుగుతూ కాదుగానీ, కృతజ్ఞతతో పిల్లవాణ్ణి తీసుకుని వెళ్లారు. వాళ్లు దేవుని గుడారంలో బలులు అర్పించి, సంవత్సరాల క్రితం హన్నా చేసుకున్న మ్రొక్కుబడిని ఏలీకి గుర్తుచేస్తూ, సమూయేలును ఆయనకు అప్పగించారు.

ఆ తర్వాత హన్నా చేసిన ప్రార్థన తన ప్రేరేపిత వాక్యంలో భాగమయ్యేలా చేయడానికి తగినదని యెహోవాకు అనిపించింది. 1 సమూయేలు 2:1-10లో రాయబడివున్న ఆమె మాటలను మనం చదువుతున్నప్పుడు ప్రతీ వాక్యంలోనూ ఆమెకెంత విశ్వాసం ఉందో తెలుస్తుంది. యెహోవా తన శక్తిని అద్భుతమైన విధంగా ఉపయోగించినందుకు, అహంకారులను అణిచివేయడంలో, అణిచివేయబడిన వాళ్లను ఆశీర్వదించడంలో, మనుషులు చనిపోయేలా చేయడంలో, వాళ్లను మరణం నుండి కాపాడడంలో ఆయనకున్న సాటిలేని సామర్థ్యాన్నిబట్టి ఆమె యెహోవాను స్తుతించింది. ఆమె తన తండ్రి విశేషమైన పరిశుద్ధతను, ఆయన న్యాయాన్ని, ఆయన నమ్మకత్వాన్నిబట్టి ఆయనను స్తుతించింది. మంచి కారణంతో హన్నా ఇలా చెప్పగలిగింది, ‘మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదీ లేదు.’ యెహోవా ఎంతో నమ్మదగినవాడు, మార్పులేనివాడు. ఆయన సహాయం కోసం తనను ఆశ్రయించే వాళ్లందరికీ, అణిచివేయబడిన వాళ్లందరికీ ఆశ్రయంగా ఉంటాడు.

యెహోవా మీద అంత విశ్వాసమున్న తల్లి దొరకడం బాలుడైన సమూయేలుకు ఒక ఆశీర్వాదమే. ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడవుతుండగా, అతని తల్లి అతని దగ్గర లేకపోయినా, అతను మాత్రం ఆమె తనను నిర్లక్ష్యం చేస్తోందని ఎప్పుడూ అనుకోలేదు. హన్నా ప్రతీ సంవత్సరం షిలోహుకు వచ్చేటప్పుడల్లా సమూయేలు గుడారంలో సేవ చేసేటప్పుడు వేసుకోవడానికని అతని కోసం ఎంతో ప్రేమతో ఒక చిన్న అంగీ కుట్టి తీసుకుని వచ్చేది. (1 సమూయేలు 2:19) ఆమె ఆ కొత్త అంగీ తీసుకుని వచ్చి బాలుడైన సమూయేలుకు తొడిగి, దాన్ని సరిచేస్తూ ఆ అబ్బాయితో ప్రేమగా, ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ అతనివైపు మురిపెంగా చూడడం మనం ఊహించుకోవచ్చు.

అలాంటి తల్లి ఉండడం సమూయేలుకు నిజంగా ఒక ఆశీర్వాదమే, ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడై తన తల్లిదండ్రులకు, మొత్తం ఇశ్రాయేలుకు ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు.

అయితే యెహోవా హన్నాను మర్చిపోలేదు. యెహోవా ఆమెను ఆశీర్వదించడంతో, ఆమెకు మరో ఐదుగురు పిల్లలు పుట్టారు. (1 సమూయేలు 2:21) హన్నాకు తన తండ్రి అయిన యెహోవాతో ఉన్న బంధమే ఆమె పొందిన గొప్ప ఆశీర్వాదం. సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ ఆ బంధం మరింత బలపడుతూ వచ్చింది. మీరు కూడా హన్నాలా విశ్వాసంతో ఉంటే మీకు కూడా అలాగే జరుగుతుంది. (w10-E 07/01)

[అధస్సూచీలు]

a చాలామందిని పెళ్లి చేసుకోవడాన్ని దేవుడు తన ప్రజల మధ్య కొంతకాలంపాటు ఎందుకు అనుమతించాడో తెలుసుకోవడానికి కావలికోట 2003, ఆగస్టు 1లో “పాఠకుల ప్రశ్నలు” అనే భాగాన్ని చూడండి.

b యెహోవా ‘హన్నాకు సంతులేకుండా చేశాడు’ అని బైబిలు చెప్తున్నప్పటికీ, ఎంతో వినయస్థురాలు, నమ్మకస్థురాలు అయిన ఈ స్త్రీని దేవుడు ఇష్టపడివుండకపోవచ్చు అనడానికి ఎలాంటి ఆధారం లేదు. (1 సమూయేలు 1:5) దేవుడు కొంతకాలంపాటు జరగడానికి అనుమతించిన కొన్ని సంఘటనలను ఆయనే జరిగించినట్లు బైబిలు కొన్నిసార్లు చెప్తుంది.

c ఎల్కానా సొంత పట్టణమైన రామా, యేసు కాలంలో అరిమత్తయియ అని పిలువబడిన స్థలమే కావచ్చన్న దాని ఆధారంగా ఈ దూరం లెక్కించబడింది.

[27వ పేజీలోని బాక్సు]

రెండు విశేషమైన ప్రార్థనలు

1 సమూయేలు 1:11లో, 2:1-10లో రాయబడివున్న హన్నా చేసిన రెండు ప్రార్థనల్లో ఎన్నో విశేషమైన విషయాలున్నాయి. కొన్నిటిని పరిశీలిద్దాం:

▪ హన్నా చేసిన రెండు ప్రార్థనల్లో మొదటిదాన్ని ‘సైన్యములకు అధిపతి అయిన యెహోవా’ అని సంబోధిస్తూ చేసింది. అలా ఉపయోగించినట్లు బైబిల్లో రాయబడివున్న వాళ్లలో ఈమె మొదటి వ్యక్తి. ఆ పదబంధం ప్రాచీన బైబిల్లో మొత్తం 285 సార్లు ఉంది. ఎంతో పెద్ద సంఖ్యలోవున్న దేవదూతల మీద దేవుడు ఆధిపత్యం వహిస్తాడని ఆ పదబంధం సూచిస్తుంది.

▪ హన్నా రెండవసారి ప్రార్థించింది, తనకు కుమారుడు పుట్టినప్పుడు కాదుగానీ, ఎల్కానాతో కలిసి ఆ బాలుణ్ణి షిలోహులో యెహోవా సేవకు అప్పగించడానికి వెళ్లినప్పుడని గమనించండి. కాబట్టి, హన్నా పోరుపెట్టే తన సవితి నోరు మూసివేయబడినందుకు కాదుగానీ, యెహోవా తనను ఆశీర్వదించినందుకు ఎంతో సంతోషించింది.

▪ “యెహోవా మూలంగా నా కొమ్ము ఎత్తబడింది” అని హన్నా అన్నట్లు పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం అనే బైబిల్లో ఉంది. ఆమె అలా అన్నప్పుడు, కొమ్ములను ఎంతో బలంగా ఉపయోగించే బలమైన జంతువైన ఎద్దు ఆమె మనసులో మెదిలివుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే, ‘యెహోవా, నన్ను బలపర్చు’ అని హన్నా అంటోంది.—1 సమూయేలు 2:1.

▪ దేవుడు “అభిషేకించినవాని” గురించి హన్నా పలికిన మాటలు ప్రవచనాత్మకమైనవిగా పరిగణించబడుతున్నాయి. “మెస్సీయ” అని అనువదించబడే పదమే ఇక్కడ ఉపయోగించబడింది. భవిష్యత్‌ అభిషిక్త రాజును ఉద్దేశించి ఈ పదం ఉపయోగించినట్లు బైబిల్లో రాయబడి ఉన్నవాళ్లలో హన్నా మొదటి వ్యక్తి.—1 సమూయేలు 2:10.

▪ దాదాపు 1,000 సంవత్సరాల తర్వాత యేసు తల్లి మరియ హన్నా వ్యక్తపర్చినలాంటి భావాలనే తన సొంత మాటల్లో వ్యక్తపరుస్తూ యెహోవాను స్తుతించింది.—లూకా 1:46-55.

[26వ పేజీలోని చిత్రం]

హన్నా తనకు పిల్లలు పుట్టనందుకు ఎంతో బాధపడింది. హన్నాను మరింత బాధపెట్టడానికి పెనిన్నా తను చేయగలినదంతా చేసింది

[26, 27వ పేజీలోని చిత్రం]

ఏలీ హన్నాను తప్పుగా అర్థంచేసుకున్నా, ఆమె దానికి బాధపడలేదు

[27వ పేజీలోని చిత్రం]

హన్నాలా మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారా?