కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రజాభిప్రాయాలకు తలొగ్గకండి

ప్రజాభిప్రాయాలకు తలొగ్గకండి

ప్రజాభిప్రాయాలకు తలొగ్గకండి

ఏది సరైనది ఏది సరికాదు, దేన్ని మెచ్చుకోవచ్చు దేన్ని మెచ్చుకోకూడదు వంటి విషయాల్లో ప్రజల అభిప్రాయాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. కాలం గడుస్తుండగా అవి మారతాయి కూడా. కాబట్టి, ఎంతోకాలం క్రితం జరిగిన సంఘటనల గురించిన బైబిలు వృత్తాంతాలను చదువుతున్నప్పుడు, దానికి సంబంధించి సొంత అంచనాలను వేసుకునే బదులు, అప్పటి ప్రజల అభిప్రాయాన్ని, విలువలను పరిగణలోకి తీసుకోవాలి.

ఉదాహరణకు, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో పదేపదే ప్రస్తావించబడిన గౌరవం, అవమానం అనే రెండు అంశాలనే తీసుకోండి. గౌరవం, అవమానం గురించి వివరించే వృత్తాంతాలను బాగా అర్థం చేసుకోవాలంటే అప్పటి ప్రజలు వాటిని ఎలా పరిగణించేవారో తెలుసుకోవాలి.

మొదటి శతాబ్దంలోని ప్రమాణాలు

“గ్రీకులు, రోమన్లు, యూదులు తమ సంస్కృతుల్లో గౌరవాన్ని, అవమానాన్ని అత్యంత ప్రాముఖ్యమైన అంశాలుగా పరిగణించేవారు” అని ఒక విద్వాంసుడు చెప్పాడు. “గౌరవం, పేరుప్రతిష్ఠలు, కీర్తి, ఇతరుల ఆమోదం, మర్యాద వంటివాటిని పొందడం కోసమే అన్నట్లుగా ప్రజలు జీవించేవారు చివరకు మరణించడానికి కూడా సిద్ధపడేవారు.” అలాంటి గుర్తింపును వారు ఎంతగానో కోరుకునేవారు కాబట్టి ఇతరుల అభిప్రాయాన్ని బట్టి ప్రభావితులయ్యేవారు.

శ్రీమంతులు, బానిసలు అనే భేదాలు తీవ్రంగా ఉండే సమాజంలోని ప్రజలు హోదా, స్థానం, గౌరవం వంటివే సర్వస్వం అని అనుకునేవారు. ఒక వ్యక్తి తన గురించి తాను ఏమనుకుంటున్నాడనేదేకాక, ఇతరులు ఆయన గురించి ఏమనుకుంటున్నారనేది కూడా లెక్కలోకి తీసుకుని, దాన్నే గౌరవంగా భావించేవారు. ఒక వ్యక్తిని గౌరవించడమంటే ఆశించిన ప్రకారం ఆయన ప్రవర్తిస్తున్నాడని బహిరంగంగా ఒప్పుకోవడమేనని వారు అనుకునేవారు. ఒక వ్యక్తికున్న డబ్బును, హోదాను, లేదా సమాజంలో ఆయనకున్న స్థానాన్ని బట్టి ముగ్దులౌతూ ఆయనను ప్రత్యేకంగా చూడడమే గౌరవించడమని కూడా అనుకునేవారు. మంచి పనులు చేయడం ద్వారా లేదా ఇతరులకన్నా బాగా రాణించడం ద్వారా ఒక వ్యక్తి గౌరవాన్ని సంపాదించవచ్చని అనుకునేవారు. దానికి భిన్నంగా ఎవరైనా అందరిముందు నీచంగా ఎగతాళి చేయబడితే ఆ వ్యక్తి అగౌరవపరచబడ్డాడని లేదా అవమానించబడ్డాడని ప్రజలు అనుకునేవారు. అలాంటి సందర్భాల్లో ఒక వ్యక్తి భావాలకు లేదా మనస్సాక్షికి చోటులేదు ఎందుకంటే, సమాజం తనను తిరస్కరించిందన్న ఆలోచన వల్లే ఓ వ్యక్తి తనకు అవమానం జరిగినట్లు భావించేవాడు.

విందులో ‘పైచోటున’ లేక ‘కడపటి చోటున’ కూర్చోమని ఒక వ్యక్తికి చెప్పబడడం గురించి యేసు ప్రస్తావించాడు. ఆ కాలంలోని ప్రజలు, తమకు కూర్చోవడానికి ఇవ్వబడే చోటునుబట్టి తాము గౌరవించబడినట్లు లేదా అవమానించబడినట్లు భావించేవారు. (లూకా 14:8-10) కనీసం రెండు సందర్భాల్లో “తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును” అని యేసు శిష్యులు వాదులాడుకున్నారు. (లూకా 9:46; 22:24) తమ కాలంలోని సమాజం ఎక్కువగా దేనికి ప్రాధాన్యతనిచ్చేదో దానికే వీరూ ప్రాధాన్యతనిచ్చారు. మరోవైపున పోటీతత్వంగల గర్విష్ఠులైన యూదా మతనాయకులు యేసు ప్రకటనా పని వల్ల తమ గౌరవానికి భంగం వాటిల్లిందని, అది తమ అధికారాన్ని ప్రశ్నించిందని భావించారు. జనసమూహాల ముందు యేసు కన్నా తాము గొప్పవారమని చూపించుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు అన్ని సందర్భాల్లో విఫలమయ్యాయి.—లూకా 13:11-17.

మొదటి శతాబ్దంలోని యూదులు, గ్రీకులు, రోమన్లు మరో రకంగా కూడా ఆలోచించేవారు. “బంధించబడి, తప్పుచేశారని అందరిముందు ఆరోపించబడితే” వారు దాన్ని అవమానంగా భావించేవారు. అలా బంధించబడినా లేదా చెరసాలలో వేయబడినా దాన్ని అవమానంగా భావించేవారు. నేరం చేసినా, చేయకపోయినా అలాంటి శిక్షవల్ల ఓ వ్యక్తి తన స్నేహితుల ముందు, కుటుంబ సభ్యుల ముందు, ఇతరుల ముందు అవమానానికి గురయ్యేవాడు. దానివల్ల ఆయన పేరుప్రతిష్ఠలకు మచ్చ ఏర్పడేది. అంతేకాక ఆయన ఆత్మగౌరవం దెబ్బతినేది, ఇతరులతో ఆయనకున్న సంబంధం కూడా పాడయ్యేది. బట్టలు ఊడదీయబడితే లేదా కొరడాలతో కొట్టబడితే దాన్ని బంధించబడడం కన్నా అవమానకరమైన విషయంగా భావించేవారు. అలా ఎవరికైనా జరిగితే అతని పరువుప్రతిష్ఠలు పోయే విధంగా ఎగతాళి చేసేవారు.

హింసాకొయ్యపై వేలాడదీసి చంపడాన్ని అన్నిటికన్నా ఘోరమైన అవమానంగా భావించేవారు. అలాంటి శిక్ష “బానిసలకు విధించబడేది . . . అది ఘోరమైన అవమానానికి, హింసకు సూచన” అని విద్వాంసుడైన మార్టీన్‌ హెంగల్‌ చెప్పాడు. అలాంటి అవమానానికి గురైన వ్యక్తితో స్నేహితులు, కుటుంబ సభ్యులు తమ సంబంధాన్ని తెంచుకోవాలని సమాజం ఒత్తిడి చేసేది. క్రీస్తు ఈ విధంగా చంపబడ్డాడు కాబట్టి సా.శ. మొదటి శతాబ్దంలో క్రైస్తవులుగా మారాలనుకున్న వారిని ప్రజలు అందరిముందు హేళన చేసేవారు. మ్రాను మీద చంపబడిన వ్యక్తి అనుచరులమని ఎవరైనా చెప్పుకోవడాన్ని బహుశా చాలామంది వెర్రితనంగా పరిగణించివుంటారు. “మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము . . . ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (1 కొరిం. 1:23, 24) ఇలాంటి పరిస్థితిని తొలి క్రైస్తవులు ఎలా ఎదుర్కొన్నారు?

భిన్నమైన ప్రమాణాలు

మొదటి శతాబ్దపు క్రైస్తవులు చట్టానికి లోబడి, చెడు ప్రవర్తన వల్ల వచ్చే అవమానాన్ని తప్పించుకునేందుకు కృషి చేసేవారు. “మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు” అని అపొస్తలుడైన పేతురు రాశాడు. (1 పేతు. 4:15) అయితే, తన అనుచరులు తన నామం నిమిత్తం హింసల్ని ఎదుర్కొంటారని యేసు ముందుగానే చెప్పాడు. (యోహా. 15:20) “ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక . . . దేవుని మహిమపరచవలెను” అని పేతురు రాశాడు. (1 పేతు. 4:16) క్రీస్తు అనుచరునిగా శ్రమలను అనుభవించడాన్ని అవమానంగా భావించకపోవడం సమాజంలోని ప్రమాణాలను తిరస్కరించడంతో సమానమౌతుంది.

క్రైస్తవులు ఇతరుల ప్రమాణాల ప్రకారం ప్రవర్తించలేదు. మ్రాను మీద చంపబడిన వ్యక్తిని మెస్సీయగా పరిగణించడాన్ని మొదటి శతాబ్దపు ప్రజలు వెర్రితనంగా భావించారు. దానివల్ల, అందరూ అంగీకరించే ప్రమాణాలను పాటించాలనే ఒత్తిడి క్రైస్తవుల మీద మరింత పెరిగివుంటుంది. యేసే మెస్సీయ అని వారు విశ్వసించారు కాబట్టి ఎగతాళికి గురైనా వారు ఆయనను అనుకరించాలి. యేసు ఇలా చెప్పాడు: “వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడ వచ్చునప్పుడు సిగ్గుపడును.”—మార్కు 8:38.

క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టమని ప్రజలు మనమీద ఒత్తిడి తీసుకురావచ్చు. అనైతికమైన, మోసకరమైన లేదా క్రైస్తవులకు తగని కార్యకలాపాల్లో పాల్గొనమని మన తోటి విద్యార్థులు, పొరుగువారు లేదా తోటి ఉద్యోగస్థులు మనల్ని ఒత్తిడి చేయవచ్చు. సరైన సూత్రాలను పాటించే విషయంలో మనకున్న అభిప్రాయాలనుబట్టి మనం సిగ్గుపడేలా చేసేందుకు అలాంటివారు ప్రయత్నించవచ్చు. అలాంటప్పుడు మనం ఏమి చేయాలి?

అవమానాన్ని లెక్కచేయని వారిని అనుకరించండి

యెహోవాపట్ల తనకున్న యథార్థతను కాపాడుకోవడానికి యేసు అత్యంత అవమానకరమైన శిక్షను అనుభవించాడు. ఆయన ‘అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించాడు.’ (హెబ్రీ. 12:1, 2) యేసు శత్రువులు ఆయనను చెంపమీద కొట్టారు, ఆయనపై ఉమ్మివేశారు, ఆయన బట్టలు తీసేశారు, కొరడాలతో కొట్టారు, మ్రాను మీద వేలాడదీశారు, ఆయనను దూషించారు. (మార్కు 14:65; 15:29-32) తాను అవమానపర్చబడినట్లు భావించేలా చేయడానికి వారు ఎంత ప్రయత్నించినా యేసు దాన్ని లెక్కచేయలేదు. ఏ విధంగా? వారలా ప్రవర్తించినా యేసు అవమానపరచబడుతున్నాననే భావనను తన మనసులో రానివ్వలేదు. ఎందుకంటే తాను యెహోవా దృష్టిలో అవమానించబడలేదని యేసుకు తెలుసు. అంతేకాక, మనుష్యులు తనను ఘనపర్చాలని ఆయన కోరుకోలేదు. యేసు బానిసలా మరణించినా, ఆయనను పునరుత్థానం చేసి, తన తర్వాతి అత్యంత ఘనమైన స్థానాన్ని ఇవ్వడం ద్వారా యెహోవా యేసును ఘనపరిచాడు. ఫిలిప్పీయులు 2:8-11లో మనమిలా చదువుతాం: “[క్రీస్తుయేసు] ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.”

తనకు విధించబడిన శిక్ష వల్ల కలిగే అవమానాన్ని యేసు అస్సలు పట్టించుకోలేదని దానర్థం కాదు. తాను తిరస్కరించబడి దూషించబడడం వల్ల తన తండ్రిపైకి రాగల అవమానం గురించి చింతించాడు. అలాంటి అవమానం జరగకుండా చూడమని యేసు యెహోవాను కోరాడు. ఆయన “ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము” అని ప్రార్థించాడు. అయినా ఆయన దేవుని చిత్తానికే లోబడ్డాడు. (మార్కు 14:36) యేసు తనపైకి వచ్చిన ఒత్తిళ్లను అధిగమించగలిగాడు, అవమానాన్ని లెక్కచేయలేదు. ఆ కాలంలో ప్రజల ఆమోదం పొందిన ప్రమాణాలను పూర్తిగా అనుసరించేవారు మాత్రమే ఆయనకు జరిగినదాన్ని అవమానంగా భావించారు. కానీ యేసు ఆ ప్రమాణాలను అనుసరించలేదు.

యేసు శిష్యులు కూడా చెరసాలలో వేయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు. ఆ కారణంగా, వారు చాలామంది ముందు అవమానించబడ్డారు. ప్రజలు వారిని హీనంగా చూశారు, తిరస్కరించారు. అయినా వారు నిరుత్సాహపడలేదు. నిజమైన శిష్యులు ప్రజాభిప్రాయాలకు తలొగ్గలేదు, అవమానాన్ని లెక్కచేయలేదు. (మత్త. 10:17; అపొ. 5:40; 2 కొరిం. 11:23-25) ‘తమ సిలువను ఎత్తికొని యేసును వెంబడించాలి’ అని వారికి తెలుసు.—లూకా 9:23, 26.

మన విషయమేమిటి? లోకం వెర్రితనముగా, బలహీనమైనవిగా, నీచమైనవిగా పరిగణించేవాటిని దేవుడు జ్ఞానవంతమైనవిగా, శక్తివంతమైనవిగా, గౌరవప్రదమైనవిగా పరిగణిస్తాడు. (1 కొరిం. 1:25-28) కాబట్టి, పూర్తిగా ప్రజాభిప్రాయానికి తలొగ్గడం మూర్ఖత్వమనీ అవివేకమనీ మీరు ఒప్పుకోరా?

గౌరవాన్ని కోరుకునేవారు తమ గురించి ప్రజలు ఏమనుకుంటారనే దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. కానీ మనం మాత్రం యేసులా, మొదటి శతాబ్దంలోని ఆయన అనుచరుల్లా యెహోవా మన స్నేహితునిగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి యెహోవా దేన్ని గౌరవప్రదమైనదిగా పరిగణిస్తాడో దాన్ని గౌరవప్రదమైనదిగా, ఆయన దేన్ని అవమానకరమైనదిగా పరిగణిస్తాడో దాన్ని అవమానకరమైనదిగా పరిగణిస్తాం.

[4వ పేజీలోని చిత్రం]

అవమానం విషయంలో యేసు ప్రజాభిప్రాయాలకు తలొగ్గలేదు