కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఆశీర్వాదం కోసం మనస్ఫూర్తిగా వెదకండి

యెహోవా ఆశీర్వాదం కోసం మనస్ఫూర్తిగా వెదకండి

యెహోవా ఆశీర్వాదం కోసం మనస్ఫూర్తిగా వెదకండి

‘దేవుడు తన్ను [“మనస్ఫూర్తిగా,” NW] వెదకువారికి ఫలము దయచేయువాడు.’—హెబ్రీ. 11:6.

1, 2. (ఎ) దేవుని ఆశీర్వాదాల కోసం చాలామంది ఏమి చేస్తుంటారు? (బి) యెహోవా ఆశీర్వాదాలు పొందాలనే కోరిక ముఖ్యంగా మనకెందుకు ఉండాలి?

 “దే వుడు మిమ్మల్ని దీవించును గాక!” కొన్ని దేశాల్లో ఒక వ్యక్తి తుమ్మినప్పుడు అపరిచితులు తరచూ ఆ మాటలు అంటుంటారు. వివిధ మతనాయకులు ప్రజల్ని, జంతువుల్ని, నిర్జీవ వస్తువుల్ని ఆశీర్వదించడాన్ని మనం చూస్తూనేవుంటాం. ఆశీర్వాదాలు లభిస్తాయనే నమ్మకంతో ప్రజలు వివిధ మతసంబంధమైన స్థలాలకు వెళ్తుంటారు. రాజకీయ నాయకులు కూడా తమ దేశంపై దేవుని ఆశీర్వాదం ఉండాలని క్రమంగా ప్రార్థిస్తుంటారు. ఆశీర్వాదం కోసం చేయబడే అలాంటి ప్రార్థనలు సరైనవేనని మీరనుకుంటున్నారా? అలాంటి ప్రార్థనల వల్ల తాము అనుకున్నవి వారు పొందుతారా? నిజానికి, ఎవరు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతారు? ఎందుకు?

2 అంత్యదినాల్లో అన్ని జనాంగాల నుండి వచ్చిన తన ప్రజలు పరిశుద్ధులుగా, సమాధానపరులుగా ఉంటూ ద్వేషం, వ్యతిరేకత ఎదురైనా భూదిగంతముల వరకు సువార్త ప్రకటిస్తారని యెహోవా ముందుగానే చెప్పాడు. (యెష. 2:2-4; మత్త. 24:14; ప్రక. 7:9, 14) అలాంటి ప్రజల్లో ఒకరిగా ఉండే బాధ్యతను స్వీకరించిన మనం కూడా దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటాం, అది మనకు కావాలి కూడా. ఎందుకంటే, దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం ఎన్నడూ విజయం సాధించలేము. (కీర్త. 127:1) అయితే, మనం దేవుని ఆశీర్వాదాన్ని ఎలా పొందవచ్చు?

విధేయత చూపించేవారు మెండుగా ఆశీర్వదించబడతారు

3. ఇశ్రాయేలీయులు విధేయత చూపిస్తే ఫలితం ఎలా ఉండేది?

3 సామెతలు 10:6, 7 చదవండి. ఇశ్రాయేలీయులు తన మాట వింటే ఎంతో సుభిక్షతను, భద్రతను అనుభవిస్తారని వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టడానికి కొన్ని రోజుల ముందు యెహోవా వారికి చెప్పాడు. (ద్వితీ. 28:1, 2) యెహోవా తనపట్ల విధేయత చూపించేవారిని మెండుగా ఆశీర్వదిస్తాడు.

4. నిజమైన విధేయత అంటే ఏమిటి?

4 ఇశ్రాయేలీయులు ఎలాంటి మనస్తత్వంతో విధేయత చూపించాల్సి ఉంది? తన ప్రజలు “సంతోషముతోను హృదయానందముతోను” తనను సేవించకపోతే యెహోవా సంతోషించడని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. (ద్వితీయోపదేశకాండము 28:45-47 చదవండి.) యెహోవా దేవుని నియమాలకు, తప్పదన్నట్లుగా విధేయత చూపిస్తే సరిపోదు. ఎందుకంటే అలాంటి విధేయత జంతువులు, దయ్యాలు కూడా చూపిస్తాయి. (మార్కు 1:27; యాకో. 3:3) దేవునిపై ప్రేమతో చూపించేదే నిజమైన విధేయత. యెహోవా ఆజ్ఞలు భారమైనవి కావనే నమ్మకం వల్ల, ‘తనను మనస్ఫూర్తిగా వెదికేవారికి ప్రతిఫలమిస్తాడన్న’ విశ్వాసం వల్ల కలిగే సంతోషంతోనే అలాంటి విధేయత చూపిస్తాం.—హెబ్రీ. 11:6; 1 యోహా. 5:3.

5. యెహోవా వాగ్దానం మీద నమ్మకముంచడం వల్ల, ద్వితీయోపదేశకాండము 15:7, 8 లోని నియమాన్ని ఓ వ్యక్తి ఎలా పాటించగలిగేవాడు?

5 ద్వితీయోపదేశకాండము 15:7, 8 (చదవండి) వచనాల్లోని నియమాన్ని పాటించడం ద్వారా నమ్మకంతో కూడిన విధేయత ఎలా వెల్లడైందో గమనించండి. సణుగుకుంటూ ఆ నియమాన్ని పాటించినా, దానివల్ల బీదవాళ్లకు మొదట్లో కొంతవరకు మేలే జరిగివుంటుంది. కానీ, అలాంటి విధేయత మంచి సంబంధాలను పెంపొందించి దేవుని ప్రజల మధ్య ప్రేమపూర్వక వాతావరణాన్ని తెచ్చివుండేదా? అంతకంటే ప్రాముఖ్యంగా అది, యెహోవా తన ప్రజల అవసరాలు తీర్చగలడనే నమ్మకాన్నీ, యెహోవా దేవుని ఉదార స్వభావాన్ని అనుకరించే అవకాశం దొరికినందుకు కృతజ్ఞతనూ చూపించినట్లు అయ్యుండేదా? కానేకాదు. నిజమైన ఉదార స్వభావాన్ని కనబరిచే వ్యక్తి హృదయ పరిస్థితిని గమనించి ఆ వ్యక్తి చేసే ప్రతీ పనినీ, ప్రతీ ప్రయత్నాన్నీ ఆశీర్వదిస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. (ద్వితీ. 15:10) ఆ వాగ్దానంపై నమ్మకముంచేవారు దానికి తగిన క్రియలు చేసి మెండైన ఆశీర్వాదాలను పొందేవారు.—సామె. 28:20.

6. హెబ్రీయులు 11:6 ఏ అభయాన్నిస్తోంది?

6 హెబ్రీయులు 11:6లో, యెహోవా ప్రతిఫలమిస్తాడనే నమ్మకం గురించే కాక, ఆయన ఆశీర్వాదాన్ని పొందడానికి అవసరమైన మరో లక్షణం గురించి కూడా చెప్పబడింది. ‘తనను మనస్ఫూర్తిగా వెదికేవారికి’ ఆయన ప్రతిఫలమిస్తాడనే విషయాన్ని గమనించండి. మూల భాషలో ఇక్కడ ఉపయోగించబడిన పదం, ఏకాగ్రతతో తీవ్రంగా కృషి చేయడాన్ని సూచిస్తోంది. మనం యెహోవా ఆశీర్వాదాల్ని తప్పక పొందుతామనే అభయాన్ని అది ఇవ్వడం లేదా? ఎందుకంటే, ఆశీర్వాదాల్ని వాగ్దానం చేసింది “అబద్ధమాడనేరని” ఏకైక సత్య దేవుడు. (తీతు 1:1-4) తన వాగ్దానాలు నమ్మకమైనవని యెహోవా వేలాది సంవత్సరాలుగా నిరూపిస్తూనే ఉన్నాడు. ఆయన మాటలు ఎన్నడూ విఫలం కావు, ఖచ్చితంగా నెరవేరుతాయి. (యెష. 55:11) కాబట్టి, మనం నిజమైన విశ్వాసాన్ని చూపిస్తే యెహోవా మనకు కూడా ప్రతిఫలమిస్తాడనే గట్టి నమ్మకాన్ని కలిగివుండవచ్చు.

7. అబ్రాహాము ‘సంతానం’ ద్వారా మనం ఎలా ఆశీర్వదించబడతాం?

7 యేసుక్రీస్తే అబ్రాహాము ‘సంతానంలోని’ ప్రథమ భాగమని స్పష్టమైంది. అభిషిక్త క్రైస్తవులు ఆ ‘సంతానంలోని’ రెండవ భాగంగా ఉన్నారు. “చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి [తమను] పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచే[సే]” పని వారికి అప్పగించబడింది. (గల. 3:7-9, 14, 16, 26-29; 1 పేతు. 2:9) యేసు తన ఆస్తిని చూసుకోవడానికి నియమించినవారిని మనం నిర్లక్ష్యం చేస్తే యెహోవాతో మంచి సంబంధాన్ని సంపాదించుకోలేము. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ సహాయం లేకుండా మనం దేవుని వాక్యంలో చదువుతున్నవాటి పూర్తి అర్థాన్ని గ్రహించలేము, వాటిని మన జీవితాల్లో ఎలా పాటించాలో తెలుసుకోలేము. (మత్త. 24:45-47) లేఖనాల నుండి నేర్చుకున్నవాటిని పాటిస్తే మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం.

దేవుని చిత్తానికి ప్రాముఖ్యతనివ్వండి

8, 9. దేవుడు చేసిన వాగ్దానానికి అనుగుణంగా యాకోబు ఎలా పట్టుదలతో కృషి చేశాడు?

8 దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి గట్టి పట్టుదలతో కృషి చేసే విషయంలో మనకు యాకోబు ఉదాహరణ గుర్తుకురావచ్చు. తన తాతయైన అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఎలా నెరవేరుతుందో తెలియకపోయినా తన తాతయ్య సంతానాన్ని దేవుడు బహుగా విస్తరింపజేసి వారిని గొప్ప జనాంగంగా చేస్తాడని యాకోబు నమ్మాడు. అందుకే యాకోబు, పెళ్లి చేసుకునేందుకు ఓ స్త్రీని వెదకడానికి సా.శ.పూ. 1781లో హారానుకు వెళ్లాడు. ఓ అందమైన స్త్రీని భార్యగా పొందాలన్నది కాదుగానీ, యెహోవాను ఆరాధించే ఆధ్యాత్మిక స్త్రీని పెళ్లి చేసుకోవాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే, అలాంటి స్త్రీ అయితేనే మంచి తల్లిగా ఉంటుందని తాననుకున్నాడు.

9 అయితే, యాకోబు తన బంధువైన రాహేలును కలుసుకున్నాడని మనకు తెలుసు. ఆ తర్వాత ఆయన ఆమెను ప్రేమించాడు కాబట్టి, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆమె తండ్రియైన లాబాను దగ్గర ఏడు సంవత్సరాలు పని చేయడానికి ఒప్పుకున్నాడు. ఇదేదో మరచిపోలేని ప్రేమకథ కాదు. తన తాతయైన అబ్రాహాముతో సర్వశక్తిగల దేవుడు చేసిన వాగ్దానం గురించి, అదే వాగ్దానాన్ని తన తండ్రియైన ఇస్సాకుతో కూడా చేయడం గురించి యాకోబుకు ఖచ్చితంగా తెలుసు. (ఆది. 18:18; 22:17, 18; 26:3-5, 24, 25) అంతేకాక, ఇస్సాకు తన కుమారుడైన యాకోబుతో ఇలా అన్నాడు: “సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు ఆయన నీకు, అనగా నీకును నీతోకూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును.” (ఆది. 28:3, 4) సరైన స్త్రీని పెళ్లి చేసుకొని, సంతానాన్ని కనడానికి యాకోబు చేసిన ప్రయత్నాన్ని చూస్తే యెహోవా చేసిన వాగ్దానంపై ఆయనకు ఎంత నమ్మకముందో తెలుస్తోంది.

10. యాకోబును ఆశీర్వదించడానికి యెహోవా ఎందుకు ఇష్టపడ్డాడు?

10 యాకోబు తన కుటుంబం కోసం సిరిసంపదలను వెదకలేదు. తన సంతానం విషయంలో యెహోవా చేసిన వాగ్దానంపై మనసు నిలిపాడు, యెహోవా చిత్తం ఎలా నెరవేరుతుందనే దాని గురించే ఆలోచించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి శాయశక్తులా కృషి చేయాలని యాకోబు నిర్ణయించుకున్నాడు. తాను వృద్ధుడయ్యేంతవరకు అదే మనస్తత్వాన్ని చూపించాడు. దానికి యెహోవా ఆయనను ఆశీర్వదించాడు కూడా.—ఆదికాండము 32:24-29 చదవండి.

11. వెల్లడి చేయబడిన దేవుని చిత్తానికి అనుగుణంగా మనం ఏ ప్రయత్నం చేయాలి?

11 యెహోవా తన సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తాడనే విషయం యాకోబుకు తెలియనట్లే మనకు కూడా తెలియదు. కానీ బైబిలు అధ్యయనం చేయడం ద్వారా, ‘యెహోవా దినానికి’ సంబంధించి మనం ఎలాంటి సంఘటనల కోసం ఎదురుచూడవచ్చో కొంత గ్రహించగలుగుతాం. (2 పేతు. 3:10, 17) ఉదాహరణకు, ఆ దినం ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ, అది త్వరలోనే వస్తుందని మాత్రం తెలుసు. ప్రస్తుతం మిగిలివున్న కొంచెం సమయంలో మనం సమగ్రంగా సాక్ష్యమివ్వడం ద్వారా మనల్ని, మన బోధ వినేవారిని రక్షించుకుంటామని బైబిలు చెబుతున్న మాటను మనం విశ్వసిస్తాం.—1 తిమో. 4:16.

12. మనం ఏ నమ్మకాన్ని కలిగివుండవచ్చు?

12 అంతం ఏ సమయంలోనైనా రావచ్చని మనకు తెలుసు. ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా సాక్ష్యం ఇవ్వబడేంతవరకూ వేచి ఉండాల్సిన అవసరం యెహోవాకు లేదు. (మత్త. 10:23) అంతేకాక, మంచి ఫలితాలు సాధించేలా ప్రకటనాపనిని ఎలా చేయవచ్చనే దానిగురించి కూడా మనం నిర్దేశాలు పొందుతున్నాం. విశ్వాసంతో మనం మనకున్న వనరులన్నిటినీ ఉపయోగిస్తూ ఈ పనిలో శాయశక్తులా పాల్గొంటాం. మనం ఎప్పుడూ చాలా ఫలవంతమైన ప్రాంతంలోనే ప్రకటిస్తామా? నిజానికి ఫలాని ప్రాంతం ఫలవంతమైనదో కాదో మనకెలా ముందుగా తెలుస్తుంది? (ప్రసంగి 11:5, 6 చదవండి.) యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ప్రకటించడమే మన పని. (1 కొరిం. 3:6, 7) మనం పట్టుదలతో చేసే ప్రయత్నాలను యెహోవా చూస్తాడనీ తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అవసరమైన నిర్దేశాన్నిస్తాడనీ మనం నమ్మవచ్చు.—కీర్త. 32:8.

పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించండి

13, 14. తన సేవకులను సమర్థుల్ని చేసే శక్తి దేవుని పరిశుద్ధాత్మకు ఉందని ఎలా రుజువైంది?

13 ఓ నియామకాన్ని నెరవేర్చడానికి లేదా ప్రకటనా పనిలో పాల్గొనడానికి సమర్థులం కాదని మనకనిపిస్తే ఏమి చేయాలి? ఆయన సేవ చేయడానికి మనకున్న సామర్థ్యాలను పెంచుకునేలా పరిశుద్ధాత్మను ఇవ్వమని మనం యెహోవాను అడగాలి. (లూకా 11:13 చదవండి.) ఓ వ్యక్తి పరిస్థితులు గతంలో ఎలావున్నా, తనకు అనుభవం లేకపోయినా ఫలాని పని చేయడానికి లేదా సేవా నియామకాన్ని నిర్వర్తించడానికి యెహోవా ఆత్మ ఆయనను సమర్థుణ్ణి చేయగలదు. ఉదాహరణకు కాపరులుగా, దాసులుగా ఉన్న ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలై వచ్చిన తర్వాత తమ శత్రువులతో యుద్ధం చేసి గెలుపొందేలా యెహోవా ఆత్మ వారిని శక్తివంతుల్ని చేసింది. అసలు వారికి అంతకుముందు యుద్ధంలో పాల్గొన్న అనుభవమే లేదు. (నిర్గ. 17:8-13) కొంతకాలానికి, యెహోవా నిర్దేశించినట్లు మందిర గుడారాన్ని కళాత్మకంగా కట్టడానికి అదే పరిశుద్ధాత్మ బెసలేలు, అహోలీయాబులను సమర్థులను చేసింది.—నిర్గ. 31:2-6; 35:30-35.

14 ఆ శక్తివంతమైన పరిశుద్ధాత్మ నేటి దేవుని సేవకులకు కూడా సహాయం చేస్తోంది. ఆధునిక కాలంలో సొంత ముద్రణా పనిని చేపట్టే సమయం వచ్చినప్పుడు సంస్థాపరమైన అవసరాలను చూసుకోవడానికి దేవుని సేవకులకు అది సహాయం చేసింది. అప్పట్లో ముద్రణాపనిని పర్యవేక్షిస్తున్న సహోదరుడు ఆర్‌.జే. మార్టిన్‌ ఒక ఉత్తరంలో, 1927వ సంవత్సరానికల్లా ఏమి సాధించబడిందో వివరించాడు. ‘ప్రభువు సరైన సమయంలో ద్వారాన్ని తెరిచాడు. ఓ పెద్ద ముద్రణాయంత్రాన్ని సంపాదించాం. అసలు దాని నిర్మాణం గురించి, పనితీరు గురించి మాలో ఎవ్వరికీ ఏమీ తెలియదు. తన సేవలో శాయశక్తులా కృషి చేస్తున్నవారి ఆలోచనా సామర్థ్యాన్ని, నైపుణ్యాలను ఎలా పెంచాలో ప్రభువుకు తెలుసు. కొన్ని వారాల్లోనే మేము ఆ ముద్రణాయంత్రాన్ని చక్కగా ఉపయోగించడం మొదలుపెట్టాం. ఆ యంత్రం ఇంకా పనిచేస్తోంది, అది ఇంతగా పనిచేస్తుందని దాన్ని తయారు చేసినవారికి కూడా తెలియదు.’ తన సేవకులు పట్టుదలతో చేస్తున్న అలాంటి ప్రయత్నాలను యెహోవా ఇప్పటికీ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు.

15. శోధనలు ఎదుర్కొంటున్న వారికి రోమీయులు 8:11 లోని మాటలు ఎలా ప్రోత్సాహాన్నిస్తాయి?

15 యెహోవా దేవుని పరిశుద్ధాత్మ ఎన్నో విధాలుగా పనిచేస్తుంది. తన సేవకులందరికీ అది అందుబాటులో ఉండడమేకాక, జీవితంలో ఎదురయ్యే పెద్దపెద్ద ఆటంకాలను కూడా అధిగమించడానికి సహాయం చేస్తుంది. ఒకానొక విషయం మనల్ని ఎంతగానో శోధిస్తున్నట్లు అనిపిస్తే అప్పుడేమిటి? రోమీయులు 7:21, 25 మరియు 8:11 లోని పౌలు మాటల నుండి మనం బలాన్ని పొందవచ్చు. “మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ” మనపై కూడా పనిచేసి, శరీరాశలతో చేసే పోరాటంలో విజయం సాధించేందుకు శక్తినిస్తుంది. పౌలు ఆ మాటలను అభిషిక్తుల కోసం రాసినప్పటికీ దానిలోని సూత్రం దేవుని సేవకులందరికీ వర్తిస్తుంది. క్రీస్తుపట్ల విశ్వాసం ఉంచుతూ, చెడు కోరికల్ని చంపుకోవడానికి గట్టి కృషి చేస్తూ, పరిశుద్ధాత్మ నిర్దేశానికి లోబడి జీవిస్తూ ఉన్నట్లైతే మనమందరం జీవాన్ని పొందుతాం.

16. దేవుని పరిశుద్ధాత్మను పొందేందుకు మనం ఏమి చేయాలి?

16 మనం ఏమీ ప్రయత్నించకుండా, దేవుడు తన చురుకైన శక్తిని మనకు ఇస్తాడని ఆశించవచ్చా? లేదు. దానికోసం ప్రార్థించాలి, పట్టుదలగా దేవుని ప్రేరేపిత వాక్యంతో మన మనసుల్ని నింపుకోవాలి. (సామె. 2:1-6) అంతేకాక, క్రైస్తవ సంఘాన్ని దేవుని ఆత్మ నడిపిస్తుంది కాబట్టి, మనం క్రమంగా సంఘ కూటాలకు హాజరవడం ద్వారా, “సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట” వినడానికి ఇష్టపడుతున్నామని చూపించవచ్చు. (ప్రక. 3:6) దానికితోడు, మనం వినయం చూపిస్తూ నేర్చుకున్న విషయాలను పాటించాలి. సామెతలు 1:23లో మనకు ఈ ఉపదేశం ఉంది: “నా గద్దింపు విని తిరుగుడి. ఆలకించుడి, నా ఆత్మను మీమీద కుమ్మరించుదును.” నిజానికి, దేవుణ్ణి తమ పరిపాలకునిగా అంగీకరించి ‘విధేయత చూపించేవారికి’ ఆయన తన పరిశుద్ధాత్మను ఇస్తాడు.—అపొ. 5:32.

17. మన ప్రయత్నాలను దేవుడు ఆశీర్వదించినప్పుడు వచ్చే ప్రయోజనాన్ని దేనితో పోల్చవచ్చు?

17 దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి పట్టుదలతో కృషి చేయడం అవసరమే కానీ, కేవలం మన కష్టం వల్లే యెహోవా మనల్ని మెండుగా ఆశీర్వదించాడని మనం అనుకోకూడదు. మన ప్రయత్నాలను దేవుడు ఆశీర్వదించినప్పుడు వచ్చే ప్రయోజనాన్ని, మంచి ఆహారం తింటే మన శరీరాలు పొందే ప్రయోజనంతో పోల్చవచ్చు. మనం ఆహారాన్ని తిని, దాని నుండి కావాల్సిన బలాన్ని పొందేలా దేవుడు మన శరీరాలను రూపొందించాడు. అంతేకాదు, ఆయన ఆహారాన్ని కూడా ఇస్తున్నాడు. మనం తినే ఆహారంలో పోషక విలువలు ఎలా సమకూరుతాయో మనకు పూర్తిగా తెలియదు. మనం తినే ఆహారం నుండి మనకు బలం ఎలా వస్తుందనేది కూడా చాలామంది వివరించలేరు. మన శరీరంలో ఒక ప్రక్రియ జరుగుతుందని మాత్రమే మనకు తెలుసు, మనం ఆహారం తినడం ద్వారా దానికి తోడ్పడతాం. పౌష్ఠికాహారం తీసుకుంటే, మరింత ప్రయోజనం పొందుతాం. అదేవిధంగా, నిత్యజీవం పొందాలంటే ఏమి చేయాలో యెహోవా మనకు తెలియజేస్తాడు, అలా చేసేందుకు కావాల్సిన సహాయాన్ని కూడా అందిస్తాడు. కాబట్టి, ఎక్కువ పని చేసేది యెహోవాయే అని స్పష్టమౌతోంది, మన స్తుతికి ఆయనే అర్హుడు. అయినా, మనం యెహోవా ఆశీర్వాదాన్ని పొందాలంటే ఆయన చిత్తానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఆయనకు మద్దతివ్వాలి.—హగ్గ. 2:18, 19.

18. మీరు ఏ కృతనిశ్చయంతో ఉన్నారు, ఎందుకు?

18 కాబట్టి, ప్రతీ నియామకాన్ని మనస్ఫూర్తిగా నిర్వర్తించండి. విజయం సాధించడానికి ఎల్లప్పుడూ యెహోవాపై ఆధారపడండి. (మార్కు 11:23, 24) మీరు అలా చేస్తుండగా, “వెదకువానికి దొరకును” అనే నమ్మకాన్ని కలిగివుండండి. (మత్త. 7:8) ఆత్మాభిషిక్తులు పరలోకంలో “జీవకిరీటము” అనే ఆశీర్వాదాన్ని పొందుతారు. (యాకో. 1:12) అబ్రాహాము సంతానం ద్వారా ఆశీర్వాదం పొందడానికి కృషి చేసే ‘వేరే గొర్రెలు,’ క్రీస్తు ఇలా చెప్పడాన్ని విని ఎంతో సంతోషిస్తారు: “నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.” (యోహా. 10:16; మత్త. 25:34) అవును, “యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు, . . . వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్త. 37:22, 29.

మీరు వివరించగలరా?

• నిజమైన విధేయత అంటే ఏమిటి?

• దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి ఏమి చేయాలి?

• మనం దేవుని పరిశుద్ధాత్మను పొందాలంటే ఏమి చేయాలి? అది మనపై ఎలా పనిచేస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రాలు]

యెహోవా ఆశీర్వాదాన్ని పొందడానికి యాకోబు దేవదూతతో పోరాడాడు.

మీరూ ఆయనలాగే పట్టుదలతో కృషి చేస్తారా?

[10వ పేజీలోని చిత్రం]

దేవుని పరిశుద్ధాత్మ, నిర్మాణ పనిలో రాణించడానికి బెసలేలు, అహోలీయాబులను సమర్థుల్ని చేసింది