కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవులు ఐక్యంగా ఉంటే దేవుడు ఘనపర్చబడతాడు

క్రైస్తవులు ఐక్యంగా ఉంటే దేవుడు ఘనపర్చబడతాడు

క్రైస్తవులు ఐక్యంగా ఉంటే దేవుడు ఘనపర్చబడతాడు

‘ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై నడుచుకోండి.’—ఎఫె. 4:1-3.

1. మొదటి శతాబ్దంలోని ఎఫెసు సంఘ సభ్యులు దేవుణ్ణి ఎలా ఘనపరిచారు?

 మొదటి శతాబ్దపు ఎఫెసు సంఘంలోనివారు ఐక్యంగా ఉండడం వల్ల సత్యదేవుడైన యెహోవా ఘనపరచబడ్డాడు. వర్ధిల్లుతున్న వాణిజ్య కేంద్రమైన ఆ ఎఫెసులోవున్న సంఘంలో వివిధ రకాల ప్రజలు అంటే, దాసులను కలిగివున్న ధనవంతులైన యజమానులు, పేదవారైన దాసులు ఉండేవారు. (ఎఫె. 6:5, 9) వీరిలో, అపొస్తలుడైన పౌలు మూడు నెలలపాటు సమాజమందిరంలో బోధించినప్పుడు సత్యం నేర్చుకున్న యూదులూ, గతంలో అర్తెమిదేవిని పూజించి, మాంత్రిక విద్యను అభ్యసించిన ఇతరులూ ఉన్నారు. (అపొ. 19:8, 19, 26) నిజ క్రైస్తవత్వం వల్ల వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన ప్రజలు ఐక్యమయ్యారని దీన్నిబట్టి స్పష్టమౌతోంది. సంఘం ఐక్యంగా ఉండడంవల్ల యెహోవా ఘనపరచబడ్డాడని పౌలు గుర్తించాడు. ఆయనిలా రాశాడు: ‘దేవునికి సంఘంలో మహిమ కలుగునుగాక.’—ఎఫె. 3:20, 21.

2. ఎఫెసు సంఘ ఐక్యతకు ప్రమాదం వాటిల్లే ఏ పరిస్థితి ఏర్పడింది?

2 అయితే, ఎఫెసు సంఘ ఐక్యతకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. పౌలు ఆ సంఘ పెద్దలను ఇలా హెచ్చరించాడు: “శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.” (అపొ. 20:30) అంతేకాక, పౌలు హెచ్చరించినట్లు, “అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు” శక్తిని అంటే ఐక్యతను దెబ్బతీసే స్ఫూర్తిని కొంతమంది సహోదరులు పూర్తిగా విడిచిపెట్టలేదు.—ఎఫె. 2:2; 4:22.

ఐక్యత గురించి నొక్కి చెప్పే ఓ పత్రిక

3, 4. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక ఐక్యత గురించి ఎలా నొక్కి చెబుతోంది?

3 క్రైస్తవులు ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలంటే, వారిలో ప్రతి ఒక్కరూ ఐక్యత కోసం పట్టుదలగా కృషి చేయాలని పౌలు గుర్తించాడు. ఐక్యత గురించి నొక్కి చెప్పే ఓ పత్రికను ఎఫెసీయులకు రాసేలా ఆయనను దేవుడు ప్రేరేపించాడు. ఉదాహరణకు, “సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెను” అనే దేవుని సంకల్పం గురించి ఆయన రాశాడు. (ఎఫె. 1:10) అంతేకాక, క్రైస్తవులను ఓ భవన నిర్మాణానికి దోహదపడే వివిధ రాళ్లతో పోలుస్తూ ఆయనిలా రాశాడు: “ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు [‘యెహోవానందు,’ NW] పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది.” (ఎఫె. 2:20, 21) క్రైస్తవులుగా మారిన యూదులూ అన్యులూ కలిసి ఐక్యంగా ఉండాలని నొక్కిచెప్పడమేకాక, వారందరూ దేవుని చేత సృష్టించబడ్డారనే విషయాన్ని పౌలు గుర్తుచేశాడు. యెహోవాను, “పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి” అని సంబోధించాడు.—ఎఫె. 3:5, 6, 14, 15.

4 ఎఫెసీయులు నాలుగవ అధ్యాయాన్ని పరిశీలిస్తుండగా, మనం ఐక్యంగా ఉండడానికి ఎందుకు కృషి చేయాలో, అలా ఉండడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడో, అంతేకాక అలా ఉండడానికి మనకు ఏ లక్షణాలు దోహదపడతాయో చూస్తాం. మీరు ఆ అధ్యాయాన్ని పూర్తిగా చదివితే, ఈ ఆర్టికల్‌లో చర్చించబోయే విషయాల నుండి మరింత ప్రయోజనం పొందుతారు.

ఐక్యంగా ఉండాలంటే ఎందుకు పట్టుదలతో కృషి చేయాలి?

5. దేవదూతలు ఎందుకు ఐక్యంగా సేవించగలుగుతారు? ఐక్యంగా ఉండడం మనకు ఎందుకు మరింత కష్టం?

5 ‘ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై నడుచుకోండి’ అని పౌలు ఎఫెసులోని సహోదరులను ప్రోత్సహించాడు. (ఎఫె. 4:1-3) ఈ విషయంలో ఎందుకు కృషి చేయాల్సి ఉంటుందో అర్థం చేసుకోవడానికి దేవదూతల ఉదాహరణను పరిశీలించండి. ఈ భూమ్మీదున్న ఏ రెండు ప్రాణులూ పూర్తిగా ఒకేలా ఉండవు కాబట్టి, కోట్ల సంఖ్యలోవున్న దేవదూతల్లో కూడా ప్రతీ దూతకు యెహోవా దేవుడు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడనే ముగింపుకు రావచ్చు. (దాని. 7:10) దేవదూతలందరూ యెహోవా మాట విని, ఆయన చిత్తాన్ని చేస్తారు కాబట్టి వారికి వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్నా యెహోవాను ఐక్యంగా సేవించగలుగుతారు. (కీర్తన 103:20, 21 చదవండి.) నమ్మకస్థులైన ఆ దేవదూతలకు వేర్వేరు లక్షణాలు ఉంటే, క్రైస్తవులకు మాత్రం వేర్వేరు లక్షణాలతో పాటు వివిధ లోపాలు కూడా ఉన్నాయి. అందుకే క్రైస్తవులకు ఐక్యంగా ఉండడం మరింత కష్టమౌతుంది.

6. మనలో, మన సహోదరుల్లో వేర్వేరు లోపాలున్నా మనం ఒకరికొకరు సహకరించుకోవడానికి ఏ లక్షణాలు సహాయం చేస్తాయి?

6 అపరిపూర్ణ వ్యక్తులు ఒకరికొకరు సహకరించుకోవాలని ప్రయత్నించినప్పుడు వారి మధ్య తరచూ సమస్యలు వస్తాయి. ఉదాహరణకు, ఇద్దరు సహోదరులను తీసుకోండి. మొదటి వ్యక్తి సాత్వికంగల వ్యక్తే కానీ సమయాన్ని పాటించడు, రెండవ వ్యక్తి సమయాన్ని పాటిస్తాడు కానీ త్వరగా కోపపడే వ్యక్తి. వీరిద్దరూ కలిసి యెహోవా సేవలో పాల్గొన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉత్పన్నంకావచ్చు? అవతలి వ్యక్తిలో లోపముందని ఆ ఇద్దరు సహోదరులు అనుకోవచ్చు కానీ, వ్యక్తిగతంగా తమలో కూడా లోపాలున్నాయని మరచిపోతారు. అలాంటి సహోదరులు దేవుని సేవలో ఐక్యంగా ఎలా పాల్గొనవచ్చు? పౌలు ఆ తర్వాత రాసిన మాటల్లో సిఫారసు చేయబడిన లక్షణాలు వారికి ఎలా సహాయం చేస్తాయో గమనించండి. మనం ఆ లక్షణాలను అలవర్చుకోవడం ద్వారా ఐక్యతకు ఎలా దోహదపడవచ్చో ఆలోచించండి. పౌలు ఇలా రాశాడు: ‘మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.’—ఎఫె. 4:1-3.

7. ఇతర అపరిపూర్ణ క్రైస్తవులతో కలిసి ఐక్యంగా ఉండడానికి కృషి చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

7 సత్యారాధకులందరూ ఒకే శరీరానికి చెందినవారు కాబట్టి, ఇతర అపరిపూర్ణ మానవులతో కలిసి ఐక్యంగా దేవుణ్ణి సేవించడాన్ని నేర్చుకోవడం ఎంతో ప్రాముఖ్యం. “శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే.” (ఎఫె. 4:4-6) యెహోవా దేవుని ఆత్మ, ఆయన ఆశీర్వాదాలు తాను ఉపయోగిస్తున్న ఏకైక సంస్థపై ఉన్నాయి. సంఘంలో ఎవరైనా మనల్ని బాధపెడితే మనం సంఘాన్ని విడిచి వెళ్లిపోతామా? కేవలం సంఘంలోనే మనం నిత్యజీవపు మాటలను వినగలుగుతాం.—యోహా. 6:68.

‘మనుష్యుల్లో ఈవులు’ ఐక్యతకు దోహదపడతారు

8. అనైక్యతకు దారితీసే వాటితో మనం చేసే పోరాటంలో మనల్ని బలపరచడానికి యేసు ఎవరిని ఉపయోగిస్తున్నాడు?

8 సంఘాన్ని ఐక్యపరచడానికి ‘మనుష్యుల్లో ఈవులను’ యేసు ఎలా అనుగ్రహించాడో వివరించేందుకు, పౌలు ప్రాచీన కాలంలో సైనికులకు ఉండే ఒక అలవాటును పేర్కొన్నాడు. విజయం సాధించిన సైనికుడు, ఇంటి పనుల్లో తన భార్యకు సహాయం చేయడానికి చెరపట్టబడిన వ్యక్తిని బానిసగా తీసుకొచ్చేవాడు. (కీర్త. 68:1, 12, 18) అలాగే, యేసు ఈ లోకాన్ని జయించాడు కాబట్టి ఇష్టపూర్వకంగా సేవ చేసే అనేకమంది దాసులను పొందాడు. (ఎఫెసీయులు 4:7, 8 చదవండి.) ఆ దాసులను యేసు ఎలా ఉపయోగించుకున్నాడు? ‘మనమందరము విశ్వాసవిషయములో ఏకత్వముపొంది, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించాడు.’—ఎఫె. 4:11-13.

9. (ఎ) మన ఐక్యతను కాపాడడానికి ‘మనుష్యుల్లోని ఈవులు’ ఎలా సహాయం చేస్తారు? (బి) ప్రతీ క్రైస్తవుడు సంఘ ఐక్యతకు ఎందుకు దోహదపడాలి?

9 ప్రేమగల కాపరులుగా ఈ ‘మనుష్యుల్లోని ఈవులు’ మన ఐక్యతను కాపాడడానికి సహాయం చేస్తున్నారు. ఉదాహరణకు, ఇద్దరు సహోదరులు ‘వివాదము రేపుకుంటున్నట్లు’ ఓ సంఘ పెద్ద గమనిస్తే, ‘సాత్వికమైన మనస్సుతో అట్టివారిని మంచి దారికి తీసికొని రావాలన్న’ ఉద్దేశంతో వారికి వ్యక్తిగతంగా సలహా ఇవ్వడం ద్వారా సంఘ ఐక్యతకు ఎంతగానో దోహదపడగలడు. (గల. 5:26–6:1) బోధకులుగా ఈ ‘మనుష్యుల్లోని ఈవులు,’ బైబిలు బోధలకు అనుగుణంగావున్న బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనకు సహాయం చేస్తారు. అలా వారు, ఐక్యతకు దోహదపడతారు, క్రైస్తవ పరిణతి సాధించడానికి మనకు సహాయం చేస్తారు. అందుకే, “మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లు” ఉండము అని పౌలు రాశాడు. (ఎఫె. 4:13, 14) మన శరీరంలోని ప్రతీ అవయవం ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఎలా బలపర్చుకుంటాయో అలాగే, ప్రతీ క్రైస్తవుడు సహోదర ఐక్యతకు దోహదపడాలి.—ఎఫెసీయులు 4:15, 16 చదవండి.

మంచి లక్షణాలను అలవర్చుకోండి

10. అనైతిక ప్రవర్తన వల్ల ఐక్యత ఎలా దెబ్బతింటుంది?

10 పరిణతి చెందిన క్రైస్తవులుగా ఐక్యతను నెలకొల్పడానికి ప్రేమ చూపించడం ఎంతో ప్రాముఖ్యమనే విషయాన్ని ఎఫెసీయులు నాల్గవ అధ్యాయం వెల్లడిస్తోందని గమనించారా? అంతేకాక, ప్రేమ చూపించాలంటే ఏమేమి చేయాలో కూడా ఆ పత్రిక వెల్లడిస్తోంది. ఉదాహరణకు, ప్రేమ చూపించేవారు జారత్వాన్ని, కామాతురతను అస్సలు అనుమతించరు. “అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని” పౌలు తన సహోదరులకు చెప్పాడు. అన్యజనులు “సిగ్గులేనివారైయుండి . . . తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.” (ఎఫె. 4:17-19) మనం జీవిస్తున్న అనైతిక లోకం వల్ల కూడా మన ఐక్యత దెబ్బతింటుంది. ప్రజలు లైంగిక అనైతికతకు సంబంధించిన జోకులు వేసుకుంటారు, దానికి సంబంధించిన పాటలు పాడుతుంటారు, దానికి సంబంధించిన కార్యక్రమాలు చూస్తుంటారు, రహస్యంగా గానీ బహిరంగంగా గానీ లైంగిక అనైతికతకు పాల్పడుతుంటారు. అయితే, పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేకపోయినా, అవతలి వ్యక్తిపై మోజుపడుతున్నట్లుగా నటిస్తూ సరసాలడడం వల్ల కూడా ఓ క్రైస్తవుడు యెహోవా నుండి, సంఘం నుండి దూరంగా వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు? ఎందుకంటే అది సులభంగా జారత్వానికి దారితీస్తుంది. అంతేకాక, ఓ వివాహితుడు/రాలు ఇతరులతో సరసాలాడడం వల్ల వ్యభిచారానికి పాల్పడే ప్రమాదం ఉంది. ఇది పిల్లలను తమ తల్లిదండ్రుల నుండి, తప్పు చేయని భాగస్వామిని తన భర్త/భార్య నుండి క్రూరంగా విడదీస్తుంది. అది ఖచ్చితంగా అనైక్యతకు దారి తీస్తుంది. అలా చేయడాన్ని వారు “క్రీస్తు” నుండి ‘నేర్చుకోలేదని’ పౌలు సరైన కారణంతోనే రాశాడు.—ఎఫె. 4:20, 21.

11. ఏ మార్పు చేసుకోమని బైబిలు క్రైస్తవులను ప్రోత్సహిస్తోంది?

11 ఐక్యతకు భంగం కలిగించే ఆలోచనా విధానాలను విడిచిపెట్టి, ఇతరులతో సామరస్యంగా ఉండేందుకు దోహదపడే లక్షణాలను పెంపొందించుకోవాలని పౌలు నొక్కిచెప్పాడు. ఆయనిలా అన్నాడు: “కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశలవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.” (ఎఫె. 4:22-24) మనం ‘చిత్తవృత్తియందు ఎలా నూతనపరచబడవచ్చు?’ దేవుని వాక్యం నుండి, పరిణతిగల క్రైస్తవుల మంచి మాదిరి నుండి మనం నేర్చుకున్నవాటిని కృతజ్ఞతతో ధ్యానిస్తే ‘దేవుని పోలికగా సృష్టింపబడిన’ నూతన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోగలుగుతాం.

మాట్లాడడంలో మంచి పద్ధతులను నేర్చుకోండి

12. సత్యం మాట్లాడడం వల్ల ప్రజలు ఎలా ఐక్యమవ్వగలుగుతారు? సత్యం మాట్లాడడం కొంతమందికి ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

12 కుటుంబంలో గానీ సంఘంలో గానీ అందరూ ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి. నిర్మొహమాటంగా, దయగా మాట్లాడడం వల్ల ప్రజలు ఐక్యమవ్వగలుగుతారు. (యోహా. 15:15) ఒక క్రైస్తవుడు కుటుంబస్థులతోగానీ, సంఘస్థులతోగాని అబద్ధమాడితే ఏమి జరుగుతుంది? అది బయటపడితే ఆ వ్యక్తిపైవున్న నమ్మకం దెబ్బతింటుంది. “మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను” అని పౌలు ఎందుకు రాశాడో మీరు అర్థం చేసుకోవచ్చు. (ఎఫె. 4:25) బహుశా చిన్నప్పటి నుండి అబద్ధాలాడడం అలవాటైన వ్యక్తికి సత్యం మాట్లాడడం చాలా కష్టంగా ఉండవచ్చు. కానీ మార్పు చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నాన్ని యెహోవా మెచ్చుకొని ఆయనకు సహాయం చేస్తాడు.

13. దూషణను మానుకోవాలంటే ఏమి చేయాలి?

13 మనం ఎలా మాట్లాడాలనే విషయంలో ఖచ్చితమైన హద్దులు విధించడం ద్వారా అటు సంఘంలో, ఇటు కుటుంబంలో గౌరవానికి, ఐక్యతకు దోహదపడడాన్ని యెహోవా మనకు నేర్పిస్తున్నాడు. “దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” (ఎఫె. 4:29, 31) ఇతరులను బాధపెట్టే విధంగా మాట్లాడకూడదంటే వారి విషయంలో మరింత గౌరవపూర్వకమైన వైఖరిని పెంపొందించుకోవాలి. ఉదాహరణకు, తన భార్యను తిట్టే అలవాటు ఓ భర్తకు ఉన్నట్లైతే ఆమె విషయంలో తనకున్న వైఖరిని మార్చుకోవడానికి కృషి చేయాలి. ముఖ్యంగా యెహోవా స్త్రీలను ఎలా గౌరవిస్తున్నాడో నేర్చుకుంటుండగా అలా చేయాలి. కొంతమంది స్త్రీలను పరిశుద్ధాత్మతో అభిషేకించి, క్రీస్తుతోపాటు రాజులుగా పరిపాలించే అవకాశాన్ని కూడా యెహోవా వారికిచ్చాడు. (గల. 3:28; 1 పేతు. 3:7) స్త్రీల విషయానికొస్తే, భర్తపై అరిచే అలవాటున్న స్త్రీ కూడా, కోపం వచ్చినా యేసు తనను తాను ఎలా నిగ్రహించుకున్నాడనే దానిగురించి నేర్చుకుంటుండగా మార్పు చేసుకోవడానికి పురికొల్పబడాలి.—1 పేతు. 2:21-23.

14. కోపాన్ని వెళ్లగ్రక్కడం ఎందుకు ప్రమాదకరం?

14 దూషణకూ కోపాన్ని అదుపు చేసుకోకపోవడానికీ మధ్య దగ్గరి సంబంధముంది. కోపాన్ని అదుపుచేసుకోకపోవడం వల్ల కూడా ప్రజల ఐక్యత దెబ్బతింటుంది. కోపం అగ్నిలాంటిది. అది త్వరగా అదుపుతప్పి నాశనానికి దారితీయగలదు. (సామె. 29:22) కోపం రావడానికి సరైన కారణమే ఉన్నా ఒక వ్యక్తి తన కోపాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడు అమూల్యమైన సంబంధాలు దెబ్బతినవు. ఇతరులపై పగ పెంచుకోకుండా, తలెత్తిన సమస్య గురించి మళ్లీ ప్రస్తావించకుండా ఉంటూ క్షమించేవారిగా ఉండేందుకు క్రైస్తవులు కృషి చేయాలి. (కీర్త. 37:8; 103:8, 9; సామె. 17:9) పౌలు ఎఫెసీయులకు ఈ సలహాను ఇచ్చాడు: “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి.” (ఎఫె. 4:26, 27) ఒక వ్యక్తి కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే సంఘంలో అనైక్యతను, చివరికి కలహాలను కూడా సృష్టించడానికి సాతానుకు ఓ అవకాశాన్ని ఇచ్చినవాడౌతాడు.

15. మనదికాని వస్తువును తీసుకుంటే ఏమి జరగవచ్చు?

15 ఇతరుల వస్తువుల పట్ల గౌరవం చూపించడం ద్వారా కూడా మనం సంఘ ఐక్యతకు దోహదపడవచ్చు. మనమిలా చదువుతాం: ‘దొంగిలువాడు ఇక మీదట దొంగిలకూడదు.’ (ఎఫె. 4:28) యెహోవా ప్రజల్లో సాధారణంగానే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది. తనదికాని వస్తువును ఓ క్రైస్తవుడు తీసుకున్నప్పుడు ఆయన తనమీదున్న నమ్మకాన్ని పోగొట్టుకుంటాడు, దానివల్ల వారిమధ్య ఉన్న మంచి ఐక్యత దెబ్బతింటుంది.

దేవుని మీదున్న ప్రేమవల్లే మనం ఐక్యంగా ఉంటాం

16. మన మధ్యవున్న ఐక్యతను బలపరిచేలా మనం క్షేమాభివృద్ధికరంగా ఎలా మాట్లాడవచ్చు?

16 దేవుని మీదున్న ప్రేమ వల్లే క్రైస్తవులందరూ ఇతరులతో ప్రేమగా వ్యవహరిస్తారు కాబట్టి సంఘం ఐక్యంగా ఉంటుంది. యెహోవా చూపిస్తున్న దయపట్ల మనకు కృతజ్ఞత ఉంటే ఈ ఉపదేశాన్ని పాటించడానికి పట్టుదలతో కృషి చేస్తాం. “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి . . . ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.” (ఎఫె. 4:29, 32) మనలాంటి అపరిపూర్ణులను యెహోవా దయతో క్షమిస్తాడు. కాబట్టి, ఇతరుల లోపాలను చూసినప్పుడు మనం కూడా యెహోవాలాగే క్షమించాలి కదా?

17. ఐక్యత కోసం మనం ఎందుకు పట్టుదలతో కృషి చేయాలి?

17 తన ప్రజలు ఐక్యంగా ఉండడంవల్ల యెహోవా ఘనపర్చబడతాడు. ఐక్యతకు దోహదపడేలా యెహోవా దేవుని ఆత్మ మనకు వివిధ రకాలుగా సహాయం చేస్తుంది. ఆయన ఆత్మ ఇచ్చే నడిపింపుకు వ్యతిరేకంగా నడుచుకోవాలని మనం అస్సలు కోరుకోము. “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి” అని పౌలు రాశాడు. (ఎఫె. 4:30) ఐక్యత అనేది మనం కాపాడుకోవాల్సిన ఆస్తి. ఐక్యంగా ఉండే ప్రజలు సంతోషంగా ఉంటారు, యెహోవాను ఘనపరుస్తారు. “కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.”—ఎఫె. 5:1, 2.

మీరెలా జవాబిస్తారు?

• క్రైస్తవులు ఐక్యంగా ఉండడానికి ఏ లక్షణాలు సహాయం చేస్తాయి?

• మన ప్రవర్తన సంఘ ఐక్యతకు ఎలా దోహదపడుతుంది?

• ఒకరికొకరు సహకరించుకోవడానికి మన మాటలు ఎలా సహాయం చేస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[17వ పేజీలోని చిత్రం]

వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన ప్రజలు ఐక్యంగా ఉన్నారు

[18వ పేజీలోని చిత్రం]

సరసాలాడడం వల్ల వచ్చే ప్రమాదాలను మీరు అర్థం చేసుకున్నారా?