కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బల్గేరియాలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం వల్ల మంచి ఫలితాలొచ్చాయి

బల్గేరియాలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం వల్ల మంచి ఫలితాలొచ్చాయి

బల్గేరియాలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం వల్ల మంచి ఫలితాలొచ్చాయి

“కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి.”—మత్త. 9:37, 38.

యేసు చెప్పిన ఆ మాటలు బల్గేరియా దేశ పరిస్థితికి ఎంతో చక్కగా సరిపోతాయి, అది ఆగ్నేయ ఐరోపాలోవున్న ఓ అందమైన బాల్కన్‌ దేశం. డెబ్బై లక్షలకన్నా ఎక్కువ జనాభా ఉన్న ఆ ప్రాంతంలో రాజ్య సువార్త ప్రకటించేందుకు ఎంతోమంది పనివారు అవసరం. అక్కడ దాదాపు 1,700 మంది ప్రచారకులున్నారు. కానీ వారు ప్రకటనా పనితో తమ ప్రాంతాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. అందుకే 2009లో జరిగే ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఐరోపాలోని వివిధ దేశాల నుండి బల్గేరియన్‌ భాష మాట్లాడే సాక్షులను బల్గేరియాకు ఆహ్వానించడానికి పరిపాలక సభ ఆమోదం తెలిపింది. 2009 ఆగస్టు 14-16 తేదీల్లో సోఫియాలో జరిగే ‘మెలకువగా ఉండండి!’ అనే జిల్లా సమావేశానికి ముందు వేసవి కాలంలో ఏడు వారాల పాటు ఈ ప్రచార కార్యక్రమం ఉంటుంది.

చక్కని స్పందన వచ్చింది

సోఫియాలోని బ్రాంచి కార్యాలయ సహోదరులు ఫ్రాన్స్‌, జర్మనీ, గ్రీస్‌, ఇటలీ, పోలండ్‌, స్పెయిన్‌ దేశాల నుండి ఎంతమంది సాక్షులు స్పందిస్తారో చూద్దామని అనుకున్నారు. ఎందుకంటే ఈ ప్రచార పనిలో పాల్గొనడం కోసం వారు సెలవుపెట్టి, తమ సొంత ఖర్చులతో అక్కడికి వెళ్లాలి. వారాలు గడుస్తుండగా దరఖాస్తు పెట్టుకున్న సహోదరుల సంఖ్య అంతకంతకూ పెరగడం చూసి బ్రాంచి కార్యాలయం ఎంతో సంతోషించింది. ఆ సంఖ్య 292కు చేరింది. అంతమంది స్పందించడంతో బల్గేరియాలోని మూడు నగరాలకు అంటే కాజాన్లక్‌, సాన్డాన్స్కీ, సిలిస్ట్రలకు వారిని పంపించడం సాధ్యమైంది. స్థానిక పయినీర్లను, ప్రచారకులను కూడా ఈ ప్రత్యేక కార్యక్రమానికి మద్దతు ఇవ్వమని బల్గేరియాలోని ప్రాంతీయ పైవిచారణకర్తలు కోరారు. చివరకు 382 మంది స్వచ్ఛంద సేవకులు సువార్తను అరుదుగా చేరవేసే ప్రాంతాలకు సహితం వెళ్లి ఉత్సాహంగా ప్రకటించారు.

అక్కడకు వచ్చిన వారికి వసతి ఏర్పాటు చేయడం కోసం చుట్టుప్రక్కల సంఘాలను ముందుగానే కోరారు. వారి కోసం అపార్ట్‌మెంటులను అద్దెకు తీసుకున్నారు, తక్కువ ధరకు లభించే హోటల్‌ రూమ్‌లను బుక్‌ చేశారు. వేరే ప్రాంతాల నుండి వచ్చే సహోదరులకు ఏ ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సిన అవసరాలు చూసుకునే విధంగా స్థానిక సహోదరులు చాలా కష్టపడి పనిచేశారు. కాజాన్లక్‌, సాన్డాన్స్కీ, సిలిస్ట్ర నగరాల్లో కూటాలు జరుపుకోవడానికి హాళ్లను అద్దెకు తీసుకున్నారు. బయట నుండి వచ్చిన సహోదరులు సంఘ కూటాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కనీసం ఒక్క సాక్షి కూడా లేని ప్రాంతాల్లో 50 మంది ప్రచారకులు యెహోవాను స్తుతించడానికి కలుసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది.

ప్రత్యేక ప్రచార పని కోసం వేరే దేశాల నుండి వచ్చిన సహోదరులు ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. వేసవి కాలంలో బల్గేరియా ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ కన్నా ఎక్కువే ఉంటుంది. అయినా, ఉత్సాహవంతులైన ఆ సహోదర సహోదరీలను ఏదీ ఆపలేకపోయింది. మొదటి మూడు వారాల్లోనే, 50,000 కన్నా ఎక్కువ జనాభా ఉన్న డాన్యూబ్‌ నది తీర పట్టణమైన సిలిస్ట్రలో సమగ్ర సాక్ష్యమిచ్చారు. ఆ తర్వాత సహోదరులు చుట్టుప్రక్కల గ్రామాలకు కూడా వెళ్లి ప్రకటించారు. చివరకు సిలిస్ట్రకు పశ్చిమాన 55 కి.మీ దూరంలో ఉన్న టుట్రకాన్‌ వరకు వెళ్లి ప్రకటించారు. వారు సాధారణంగా ఉదయం 9:30కు ఆరంభించేవారు. మధ్యాహ్న భోజనం కోసం విరామం తీసుకొని చాలాసార్లు సాయంత్రం 7:00 గంటల వరకు ప్రకటించేవారు. లేదా అంతకన్నా ఆలస్యంగా ప్రకటనా పనిని ముగించేవారు. ఈ సహోదరులు చూపిస్తున్న ఉత్సాహం వల్ల కాజాన్లక్‌, సాన్డాన్స్కీలో ఉన్న సహోదరులు కూడా ప్రచార కార్యక్రమాన్ని చుట్టుప్రక్కల గ్రామాలకు, పట్టణాలకు చేరవేశారు.

ఎలాంటి ఫలితాలొచ్చాయి?

ఈ ఏడు వారాల్లో సహోదరులు గొప్ప సాక్ష్యం ఇచ్చారు. అపొస్తలుల కాలంలో చెప్పబడినట్లే, ఈ నగరాల్లోని ప్రజలు కూడా, ‘మీరు మా పట్టణాన్ని మీ బోధతో నింపేశారు’ అని చెప్పగలరు. (అపొ. 5:28) సహోదరులు దాదాపు 50,000 పత్రికలు ఇచ్చారు, 482 బైబిలు అధ్యయనాలను ప్రారంభించారు. సంతోషకరమైన విషయమేమిటంటే, సెప్టెంబరు 1, 2009 కల్లా సిలిస్ట్రలో కొత్త సంఘం ఏర్పడింది. కాజాన్లక్‌, సాన్డాన్స్కీలలో గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ ప్రత్యేక కార్యక్రమం వల్ల సువార్తను మొదటిసారి విన్నవారు మంచి ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తుండడం నిజంగా ఎంతో సంతోషాన్నిస్తుంది.

ఈ ప్రత్యేక ప్రచార పనిలో పాల్గొనేందుకు బల్గేరియన్‌ భాష మాట్లాడే ప్రత్యేక పయినీరు సహోదరి స్పెయిన్‌ నుండి వచ్చింది. మొదటి వారంలో ఆమె సిలిస్ట్రలోని వీధిలో వార్తాపత్రికలు అమ్మే కరీనా అనే స్త్రీని కలిసింది. కరీనా ఆసక్తి చూపించి ఒకసారి కూటానికి హాజరైంది. వెంటనే ఆమె బైబిలు అధ్యయనానికి అంగీకరించింది. ఆమె భర్త నాస్తికుడు కాబట్టి పార్కులో అధ్యయనం చేయమని కోరింది. ఆ అధ్యయనానికి ఆమె ఇద్దరు కూతుర్లు కూడా కూర్చునేవారు. పెద్ద కూతురైన డాన్యేలా బైబిలు సత్యాన్ని ఎంతగానో ఇష్టపడింది. ఆమె బైబిలు బోధిస్తోంది అనే పుస్తకాన్ని ఒక వారంలోనే చదివేసింది. తన ఆరాధనలో ప్రతిమలను ఉపయోగించకూడదని బైబిలు చెబుతున్న దాన్ని వెంటనే పాటించింది. ఆమె నేర్చుకున్న సత్యాలను తన స్నేహితులతో పంచుకోవడం ఆరంభించింది. సంఘ కూటానికి మొదటిసారి హాజరైన మూడు వారాలకే తనతో అధ్యయనం చేస్తున్న సహోదరితో ఆమె, “నేను మీలో ఒకరినని నాకు అనిపిస్తోంది. నేను కూడా ప్రకటనా పనిలో పాల్గొనాలంటే ఏమి చేయాలి?” అని అడిగింది. వాళ్ల అమ్మ, చెల్లెలుతోపాటు డాన్యేలా మంచి ప్రగతి సాధిస్తోంది.

బల్గేరియన్‌ సహోదరుడైన ఓర్లిన్‌ ప్రత్యేక ప్రచార పనిలో పాల్గొనేందుకు ఇటలీ నుండి కాజాన్లక్‌కు వచ్చాడు. ఆయన ఒకరోజు ప్రకటనా పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తూ మార్గమధ్యంలో ఒక పార్కు బెంచీ మీద కూర్చొన్న ఇద్దరు యువకులకు సాక్ష్యమిచ్చాడు. వారికి బైబిలు బోధిస్తోంది అనే పుస్తకాన్ని ఇచ్చి తర్వాతి రోజు వారిని తిరిగి కలుస్తానని చెప్పాడు. ఓర్లిన్‌ తాను చెప్పినట్లే మరుసటి రోజు స్వెటోమిర్‌ను కలుసుకొని ఆయనతో బైబిలు అధ్యయనం ప్రారంభించాడు, అలా తర్వాతి రోజు కూడా బైబిలు అధ్యయనం చేశారు. తొమ్మిది రోజుల్లో ఓర్లిన్‌ ఆయనతో ఎనిమిది సార్లు అధ్యయనం చేశాడు. స్వెటోమిర్‌ ఇలా అన్నాడు: “మిమ్మల్ని కలవడానికి రెండు రోజుల ముందు తన గురించి తెలుసుకునేలా నాకు సహాయం చేయమని దేవునికి ప్రార్థించాను. ఒకవేళ ఆయన ఈ విషయంలో నాకు సహాయం చేస్తే నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటానని వాగ్దానం చేశాను.” ఓర్లిన్‌ ఇటలీకి తిరిగి వెళ్లిన తర్వాత స్థానిక సహోదరులు ఆయనతో బైబిలు అధ్యయనాన్ని కొనసాగించారు. ఆయన ఇప్పుడు సత్యాన్ని తన సొంతం చేసుకుంటున్నాడు.

త్యాగాలు చేసినవారికి ఎన్నో ఆశీర్వాదాలు వచ్చాయి

సువార్త ప్రకటించడం కోసం సెలవు పెట్టుకొని తమ సొంత ఖర్చులతో వేరే దేశానికి వెళ్లిన సహోదరులు ఎలా భావిస్తున్నారు? స్పెయిన్‌లో సంఘ పెద్దగా సేవ చేస్తున్న సహోదరుడు ఇలా అన్నాడు: “స్పెయిన్‌లోవున్న బల్గేరియన్‌ క్షేత్రంలోని సహోదరులు ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం వల్ల ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు. ఈ కార్యక్రమం, దానిలో పాల్గొన్న సహోదరులపై గొప్ప ప్రభావం చూపించింది.” ఇటలీ నుండి వచ్చిన ఒక వివాహిత జంట ఇలా రాశారు: “మా జీవితంలో ఇది అత్యంత అద్భుతమైన నెల. ఈ కార్యక్రమం మా జీవితాన్నే మార్చేసింది, మేము ఇప్పుడు కొత్త వ్యక్తులమనిపిస్తుంది.” బల్గేరియాలో స్థిరపడి ఆ దేశంలో అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవచేయడం గురించి ఈ దంపతులు తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టారు. క్రమ పయినీరుగా సేవ చేస్తున్న కారీనా అనే అవివాహిత సహోదరి ఈ ప్రత్యేక ప్రచార పని కోసం స్పెయిన్‌ నుండి సిలిస్ట్రకు వచ్చింది. ఆ తర్వాత, స్పెయిన్‌లో తాను చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి సిలిస్ట్రలో కొత్తగా స్థాపించబడిన సంఘానికి మద్దతివ్వడానికి బల్గేరియాకు వచ్చేసింది. బల్గేరియాలో ఒక సంవత్సరం పాటు ఉండేందుకు కావాల్సినంత డబ్బును కూడబెట్టుకుంది. కారీనా తాను తీసుకున్న నిర్ణయం గురించి ఇలా చెబుతోంది: “బల్గేరియాలో సేవచేయడానికి యెహోవా నన్ను అనుమతించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. చాలా కాలం ఇక్కడ ఉండగలనన్న నమ్మకం నాకు ఉంది. ఇప్పటికే నాకు ఐదు బైబిలు అధ్యయనాలు ఉన్నాయి, వాటిలో మూడు అధ్యయనాలవారు కూటాలకు హాజరవుతున్నారు.”

ఇటలీకి చెందిన ఓ సహోదరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంది కానీ, దీనికి కొద్దిరోజుల ముందు ఆమె ఒక కొత్త ఉద్యోగంలో చేరడంతో ఆమెకు అసలు సెలవులు లేవు. ఆమె ఆ ప్రచార కార్యక్రమానికి ఎలాగైనా వెళ్లాలనుకుంది కాబట్టి ఒక నెలపాటు జీతంరాని సెలవుల కోసం యాజమాన్యాన్ని కోరింది, ఒకవేళ వారు దానికి ఒప్పుకోకపోతే ఉద్యోగాన్ని వదిలేయడానికి కూడా సిద్ధపడింది. దానికి యజమాని “సరే, కానీ ఒక షరతు మీద నీకు సెలవులు ఇస్తాను: నువ్వు బల్గేరియాకు వెళ్లి అక్కడ నుండి ఒక పోస్టుకార్డు పంపించాలి” అని అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. యెహోవా తన ప్రార్థనలకు జవాబిచ్చాడని ఆ సహోదరికి నిశ్చయంగా అనిపించింది.

బల్గేరియాలోని వార్నాకు చెందిన స్టానిస్లావా అనే ఒక యువ సహోదరి మంచి జీతం వచ్చే పూర్తికాల ఉద్యోగం చేస్తుండేది. ఆమె సిలిస్ట్రలో జరిగే ప్రత్యేక ప్రచార పనిలో పాల్గొనేందుకు సెలవులు పెట్టింది. తన దేశంలో సువార్త ప్రకటించడం కోసం ఎంతో దూరం నుండి వచ్చిన చాలామంది పయినీర్ల సంతోషాన్ని చూసి ఆమె ఆనందబాష్పాలు రాల్చింది. బయట ఉద్యోగం చేస్తూ తన జీవితంలో తాను ఏమి సాధిస్తున్నానని ఆలోచించడం మొదలుపెట్టింది. రెండు వారాలు ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి క్రమ పయినీరు అయ్యింది. యౌవన కాలంలో తన సృష్టికర్తను గుర్తుచేసుకుంటున్నందుకు ఆమె ఇప్పుడు నిజంగా సంతోషిస్తోంది.—ప్రసం. 12:1, 2.

యెహోవా సేవలో ఉత్సాహంగా పాల్గొనడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి. సువార్తను ప్రకటించే, బోధించే ప్రాముఖ్యమైన పనుల్లో మీ సమయాన్ని, శక్తిని వెచ్చించడం కన్నా శ్రేష్ఠమైనది మరొకటి లేదు. జీవితాలను కాపాడే ఈ పరిచర్యలో మరింత ఎక్కువగా పాల్గొనడానికి మీరు ఏమైనా చేయగలరా? మీ దేశంలోనే అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఉండవచ్చు, అలాంటి ప్రాంతాలకు మీరు వెళ్లగలరా? లేదా మీ దేశంలో బైబిలు సత్యం కోసం పరితపిస్తున్న వారికి ప్రకటించేలా మీరు వేరే భాషను నేర్చుకోవడం గురించి ఆలోచించవచ్చు. పరిచర్యలో మరింత ఎక్కువగా పాల్గొనేలా మీరు ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నా యెహోవా మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తాడన్న నమ్మకంతో ఉండవచ్చు.—సామె. 10:22.

[32వ పేజీలోని బాక్సు/ చిత్రం]

మరచిపోలేని రోజు

ప్రత్యేక ప్రచార పనికోసం యూరోపియన్‌ దేశాల నుండి బల్గేరియాకు వచ్చిన చాలామంది సోఫియాలో జరిగే ‘మెలకువగా ఉండండి!’ అనే జిల్లా సమావేశానికి హాజరు కావాలని అనుకున్నారు. వేర్వేరు దేశాల నుండి వచ్చిన సహోదర సహోదరీలను కలుసుకోవడం స్థానిక సహోదరులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. పరిపాలక సభ సభ్యుడైన జెఫ్రీ జాక్సన్‌ బల్గేరియన్‌ భాషలో హెబ్రీ, గ్రీకు లేఖనాలు ఉన్న పూర్తి పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదం విడుదల చేసినప్పుడు అక్కడ సమావేశమైన 2,039 మంది ఎంతో పులకరించిపోయారు. ఆ శుక్రవారం రోజు హాజరైనవారంతా చాలాసేపు ఉత్సాహంగా హర్షధ్వానాలు చేస్తూ తమ కృతజ్ఞతను చూపించారు. చాలామంది ఆనందబాష్పాలు రాల్చారు. సులభంగా అర్థమయ్యే భాషలో తయారైన ఈ ఖచ్చితమైన అనువాదం యెహోవా గురించి తెలుసుకునేలా బల్గేరియాలోని సహృదయులకు సహాయం చేస్తుంది.

[30, 31వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

బల్గేరియా

సోఫియా

సాన్డాన్స్కీ

సిలిస్ట్ర

కాజాన్లక్‌

[31వ పేజీలోని చిత్రాలు]

ఆ ఏడు వారాల్లో గొప్ప సాక్ష్యం ఇవ్వబడింది