కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ఎలా ప్రార్థించాలి?

మనం ఎలా ప్రార్థించాలి?

ప్రార్థన విషయానికి వచ్చినప్పుడు చాలా మత సంప్రదాయాలు భంగిమ, పదాలు, ఆచారాలు వంటి పైపై విషయాల మీద దృష్టి పెడతాయి. కానీ మనం అలాంటివాటి మీద కాకుండా ఇంకా ముఖ్యమైన వాటిమీద అంటే, మనం “ఎలా ప్రార్థించాలి?” అనే దానిమీద దృష్టి పెట్టడానికి బైబిలు సహాయం చేస్తుంది.

దేవుని నమ్మకమైన సేవకులు రకరకాల పరిస్థితుల మధ్య, రకరకాల భంగిమల్లో ప్రార్థించారని బైబిలు చూపిస్తుంది. వాళ్లు సందర్భాన్ని బట్టి ఒక్కోసారి మనసులోనే ప్రార్థించారు, ఒక్కోసారి పైకి ప్రార్థించారు. ఆకాశం వైపు చూస్తూ ప్రార్థించారు, లేదా మోకాళ్ల మీద వంగి ప్రార్థించారు. ప్రతిమల్ని, జపమాలల్ని, లేదా ప్రార్థన పుస్తకాల్ని ఉపయోగించే బదులు చక్కగా తమ హృదయంలో ఉన్న విషయాల్ని సొంత మాటల్లో చెప్తూ ప్రార్థించారు. ఇంతకీ దేవుడు వాళ్ల ప్రార్థనల్ని ఎందుకు విన్నాడు?

ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు, వాళ్లు ఒకేఒక్క దేవునికి అంటే యెహోవాకు ప్రార్థించారు. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. 1 యోహాను 5:14 లో ఇలా ఉంది: “మనకున్న నమ్మకం ఏమిటంటే, మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు.” అంటే, మన ప్రార్థనలు దేవుని ఇష్టానికి తగ్గట్టు ఉండాలి. దానర్థం ఏమిటి?

దేవుని ఇష్టానికి తగ్గట్టు ప్రార్థించాలంటే, ముందు మనం ఆయన ఇష్టం ఏమిటో తెలుసుకోవాలి. కాబట్టి బైబిలు చదవడం చాలాచాలా ముఖ్యం. అంటే, ఒక వ్యక్తి బైబిలు పండితుడైతే తప్ప దేవుడు అతని ప్రార్థన వినడా? దానర్థం అది కాదు. మనం తన ఇష్టం ఏమిటో తెలుసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ ప్రకారం పనిచేయడానికి ప్రయత్నించాలని దేవుడు కోరుకుంటున్నాడు. (మత్తయి 7:21-23) మనం బైబిల్లో నేర్చుకునే దానికి అనుగుణంగా ప్రార్థించాలి.

దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు, విశ్వాసంతో, యేసు పేరున ప్రార్థించాలి

మనం యెహోవా గురించి, ఆయన ఇష్టం గురించి తెలుసుకునే కొద్దీ మన విశ్వాసం పెరుగుతుంది. అది ప్రార్థించడానికి అవసరమైన ఇంకో ముఖ్య లక్షణం. యేసు ఇలా చెప్పాడు: “విశ్వాసంతో మీరు వేటికోసం ప్రార్థిస్తారో అవన్నీ పొందుతారు.” (మత్తయి 21:22) విశ్వాసం అంటే గుడ్డి నమ్మకం కాదు. బదులుగా, ఒక విషయం కంటికి కనిపించకపోయినా సరే బలమైన రుజువుల ఆధారంగా దాన్ని నమ్మడం. (హెబ్రీయులు 11:1) యెహోవాను మనం చూడలేకపోయినా, ఆయన నిజమైన వ్యక్తి అని, నమ్మదగినవాడని, తనమీద విశ్వాసంతో చేసే ప్రార్థనలకు జవాబివ్వాలని కోరుకుంటున్నాడని చూపించే రుజువులు బైబిలు నిండా ఉన్నాయి. అంతేకాదు, మనం ఎక్కువ విశ్వాసం కోసం ఎప్పుడైనా ప్రార్థించవచ్చు, మనకు అవసరమైనది ఇవ్వడానికి యెహోవా ఎంతో సంతోషిస్తాడు.—లూకా 17:5; యాకోబు 1:17.

ఎలా ప్రార్థించాలి అనేదానికి సంబంధించి ఇంకో ముఖ్యమైన విషయం గమనించండి. యేసు ఇలా చెప్పాడు: “నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు.” (యోహాను 14:6) కాబట్టి యెహోవా తండ్రిని చేరుకోవాలంటే యేసే మార్గం. అందుకే యేసు తన పేరున ప్రార్థించమని తన అనుచరులకు చెప్పాడు. (యోహాను 14:13; 15:16) దానర్థం మనం యేసుకు ప్రార్థించాలని కాదు. బదులుగా మనం యేసు పేరున ప్రార్థించాలి. అంటే యేసు వల్లే మనం పరిపూర్ణుడూ పవిత్రుడూ అయిన తండ్రి దగ్గరికి వెళ్లగలుగుతున్నాం అని గుర్తుంచుకొని ప్రార్థించాలి.

యేసు సన్నిహిత అనుచరులు ఒకసారి ఆయన్ని ఇలా అడిగారు: “ప్రభువా, ... ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించు.” (లూకా 11:1) వాళ్లు, ఇప్పటివరకు మనం నేర్చుకున్న ప్రాథమిక విషయాల గురించి తెలుసుకోవడానికి ఆ ప్రశ్న అడగలేదని స్పష్టంగా తెలుస్తుంది. బదులుగా, ప్రార్థనల్లో ఎలాంటి విషయాలు ఉండాలో వాళ్లు తెలుసుకోవాలని అనుకున్నారు. ఇంకోమాటలో చెప్పాలంటే, ‘మేము వేటి గురించి ప్రార్థించాలి?’ అని వాళ్లు అడుగుతున్నారు.