కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ఎక్కడ ప్రార్థించాలి? ఎప్పుడు ప్రార్థించాలి?

మనం ఎక్కడ ప్రార్థించాలి? ఎప్పుడు ప్రార్థించాలి?

చాలా మతాలు పెద్దపెద్ద మందిరాల్లో, రోజులోని ఆయా సమయాల్లో ప్రార్థించాలని నొక్కిచెప్పడం మీరు గమనించేవుంటారు. బైబిలు మనం ఫలానా చోట, ఫలానా సమయాల్లో మాత్రమే ప్రార్థించాలని చెప్తుందా?

ప్రార్థించడానికి తగిన సందర్భాలు ఉన్నాయని బైబిలు చెప్తుంది. ఉదాహరణకు, తన అనుచరులతో కలిసి భోంచేయడానికి ముందు యేసు కృతజ్ఞతలు చెప్తూ దేవునికి ప్రార్థించాడు. (లూకా 22:17) అలాగే ఆయన శిష్యులు ఆరాధించడానికి ఒకచోటికి వచ్చినప్పుడు వాళ్లు కలిసి ప్రార్థించారు. అలా వాళ్లు, ఎంతోకాలం నుండి యూదుల సమాజమందిరాల్లో, యెరూషలేము ఆలయంలో పాటిస్తూ వస్తున్న అలవాటును కొనసాగించారు. ఆ ఆలయం “అన్నిదేశాల ప్రజలకు ప్రార్థన మందిరం” అవ్వాలని దేవుడు కోరుకున్నాడు.—మార్కు 11:17.

దేవుని సేవకులు ఒకచోటికి వచ్చి కలిసి ప్రార్థించినప్పుడు, వాళ్ల విన్నపాలకు మంచి ఫలితాలు వస్తాయి. వాళ్లంతా ఒకే ఆలోచనతో ఐక్యంగా ఉంటే, వాళ్ల తరఫున చేసిన ప్రార్థన బైబిలు సూత్రాల ప్రకారం ఉంటే దేవుడు సంతోషిస్తాడు. ఆయన ఒక పని చేయాలని అనుకోకపోయినా, ఆ ప్రార్థన వల్ల దాన్ని చేయాలని నిర్ణయించుకోవచ్చు కూడా. (హెబ్రీయులు 13:18, 19) యెహోవాసాక్షులు తమ కూటాల్లో క్రమంగా ప్రార్థిస్తారు. మీకు దగ్గర్లో ఉన్న ఒక రాజ్యమందిరానికి వచ్చి, మీరే స్వయంగా ఆ ప్రార్థనలు వినమని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.

అయితే కేవలం ఫలానా సమయంలోనే, ఫలానా చోటే ప్రార్థించాలని బైబిలు చెప్పట్లేదు. దేవుని సేవకులు రకరకాల సమయాల్లో, రకరకాల స్థలాల్లో ప్రార్థించారని మనం బైబిల్లో చదువుతాం. యేసు ఇలా చెప్పాడు: “నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, నీ గదిలోకి వెళ్లి, తలుపులు వేసుకుని, ఎవరూ చూడలేని నీ తండ్రికి ప్రార్థించు. అప్పుడు ప్రతీది చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు.”—మత్తయి 6:6.

మనం ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రార్థించవచ్చు

ఆ మాటలు ఒక చక్కని ఆహ్వానంలా ఉన్నాయి కదా. విశ్వ సర్వాధిపతికి మీరు ఏ సమయంలోనైనా ఏకాంతంగా ప్రార్థించవచ్చు, ఆయన మీ ప్రార్థనను వింటాడనే భరోసాతో ఉండవచ్చు. యేసు ప్రార్థించడం కోసం తరచూ ఒంటరిగా ఎందుకు ఉండేవాడో మనకు అర్థమౌతుంది! ఒకసారి ఆయన రాత్రంతా దేవునికి ప్రార్థిస్తూ గడిపాడు, ఒక అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం విషయంలో దేవుని నిర్దేశం అడగడానికి ఆయన అలా చేసివుంటాడు.—లూకా 6:12, 13.

బైబిల్లోని ఇతర స్త్రీపురుషులు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు లేదా పెద్దపెద్ద సమస్యలు ఎదురైనప్పుడు ప్రార్థించారు. కొన్నిసార్లు వాళ్లు బయటికి ప్రార్థించారు, కొన్నిసార్లు మనసులోనే ప్రార్థించారు; గుంపుగా ప్రార్థించారు, ఒంటరిగా ప్రార్థించారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, వాళ్లు ప్రార్థించారు. “ఎప్పుడూ ప్రార్థించండి” అని దేవుడే తన సేవకులకు చెప్తున్నాడు. (1 థెస్సలొనీకయులు 5:17) తన ఇష్టాన్ని చేసే వాళ్ల ప్రార్థనలు వినడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అది యెహోవా ప్రేమకు రుజువు కాదంటారా?

నిజమే, ప్రతీదాన్ని తప్పుపట్టే ఈ రోజుల్లో చాలామంది అసలు ప్రార్థన వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని అంటారు. ‘ప్రార్థన నిజంగా నాకు సహాయం చేస్తుందా?’ అని మీకు కూడా అనిపించవచ్చు.