కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు మన ప్రార్థనలు విని వాటికి జవాబిస్తాడా?

దేవుడు మన ప్రార్థనలు విని వాటికి జవాబిస్తాడా?

ఆ ప్రశ్న ఎంతో ఆసక్తిని, కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. యెహోవా నేడు మనం చేసే ప్రార్థనలు వింటాడని బైబిలు చూపిస్తుంది. అయితే మన ప్రార్థనలు ఆయన వింటాడా లేదా అనేది చాలావరకు మనమీదే ఆధారపడి ఉంటుంది.

వేషధారుల్లా ప్రార్థించిన తన కాలంలోని మత నాయకుల్ని యేసు ఖండించాడు; వాళ్లు కేవలం నలుగురి ముందు నీతిమంతులుగా కనబడితే చాలని అనుకున్నారు. వాళ్లు “తమ ప్రతిఫలాన్ని పూర్తిగా” పొందుతారని యేసు చెప్పాడు, అంటే వాళ్లు ఎంతో కోరుకున్నట్టు మనుషుల దృష్టిలో గొప్పవాళ్లుగా ఉంటారు; కానీ వాళ్లకు నిజంగా అవసరమైనది పొందరు, అంటే దేవుడు వాళ్ల ప్రార్థనలు వినడు. (మత్తయి 6:5) ఈ రోజుల్లో కూడా చాలామంది తమకు నచ్చినట్టు ప్రార్థిస్తున్నారు కానీ దేవుని నచ్చినట్టు కాదు. ముందు ఆర్టికల్స్‌లో పరిశీలించిన బైబిలు సూత్రాల్ని వాళ్లు పాటించట్లేదు కాబట్టి దేవుడు వాళ్ల ప్రార్థనలు వినడు.

మరి మీ విషయం ఏమిటి? దేవుడు మీ ప్రార్థనలు విని, వాటికి జవాబిస్తాడా? దేవుడు మీ ప్రార్థనలు వింటాడా లేదా అనేది మీ జాతి, దేశం లేదా సామాజిక స్థాయి మీద ఆధారపడి ఉండదు. బైబిలు ఈ హామీ ఇస్తుంది: “దేవునికి పక్షపాతం లేదు ... ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.” (అపొస్తలుల కార్యాలు 10:34, 35) వాళ్లలో మీరూ ఉన్నారా? మీరు దేవునికి భయపడితే, ఆయన పట్ల ఎంతో గౌరవం చూస్తారు, ఆయన్ని బాధపెట్టే ఏ పనీ చేయరు. అలాగే మీరు దేవుని దృష్టిలో సరైనది చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ మీకు లేదా ఇతరులకు నచ్చినట్టు కాదు. దేవుడు మీ ప్రార్థనలు వినాలని మీరు నిజంగా కోరుకుంటున్నారా? దేవుడు వినాలంటే మీరెలా ప్రార్థించాలో బైబిలు తెలియజేస్తుంది. *

నిజమే, దేవుడు ఒక అద్భుతం చేసి తమ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని చాలామంది కోరుకుంటారు. కానీ, బైబిలు కాలాల్లో కూడా దేవుడు అలా అద్భుతరీతిలో జవాబిచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కొన్నిసార్లైతే, ఒక అద్భుతానికి మరో అద్భుతానికి మధ్య వందల సంవత్సరాలు గడిచిపోయేవి. పైగా, అపొస్తలుల కాలం తర్వాత అద్భుతాలు జరగడం ఆగిపోయిందని బైబిలు చూపిస్తుంది. (1 కొరింథీయులు 13:8-10) అంటే, ఈ రోజుల్లో చేసే ప్రార్థనలకు దేవుడు జవాబివ్వడని దానర్థమా? అస్సలు కాదు! ఈ రోజుల్లో దేవుడు జవాబిచ్చే కొన్ని ప్రార్థనల్ని పరిశీలించండి.

దేవుడు తెలివిని ఇస్తాడు. నిజమైన తెలివి అంతటికీ మూలం యెహోవాయే. తన నిర్దేశం కావాలని, దాని ప్రకారం జీవించాలని కోరుకునే వాళ్లకు యెహోవా ఎంతో ఉదారంగా తెలివిని ఇస్తాడు.—యాకోబు 1:5.

దేవుడు పవిత్రశక్తిని, దానితో వచ్చే ప్రయోజనాలన్నిటినీ ఇస్తాడు. పవిత్రశక్తి అనేది దేవుని చురుకైన శక్తి. దాని కన్నా బలమైన శక్తి ఏదీ లేదు. అది కష్టాల్ని సహించేలా మనకు సహాయం చేయగలదు. ఆందోళనగా ఉన్నప్పుడు మనకు ఎంతో మనశ్శాంతిని ఇవ్వగలదు. చక్కని లక్షణాలు అలవర్చుకునేలా మనకు సహాయం చేయగలదు. (గలతీయులు 5:22, 23) ఈ బహుమానాన్ని దేవుడు ఉదారంగా ఇస్తాడని యేసు తన అనుచరులకు భరోసా ఇచ్చాడు.—లూకా 11:13.

తన కోసం నిజాయితీగా వెతికే వాళ్లకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. (అపొస్తలుల కార్యాలు 17:26, 27) సత్యం తెలుసుకోవాలని నిజాయితీగా కోరుకునే ప్రజలు ప్రపంచమంతటా ఉన్నారు. వాళ్లు దేవుని గురించి, అంటే ఆయన పేరేంటి, భూమినీ మనుషుల్నీ ఆయన ఎందుకు చేశాడు, తాము దేవునికి ఎలా దగ్గర కావచ్చు అనేవాటి గురించి తెలుసుకోవాలనుకుంటారు. (యాకోబు 4:8) యెహోవాసాక్షులకు తరచూ అలాంటి ప్రజలు ఎదురుపడతారు. అప్పుడు వాళ్లు, ఆ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబుల్ని సంతోషంగా ఇతరులతో పంచుకుంటారు.

మీరు ఈ పత్రిక తీసుకున్నది అందుకేనా? మీరు కూడా దేవుని గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నారా? బహుశా ఈ విధంగా దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తున్నాడేమో.

^ పేరా 5 దేవుడు మీ ప్రార్థనలు వినాలంటే మీరెలా ప్రార్థించాలి అనేదాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తుంది? పుస్తకంలోని 17వ అధ్యాయం చూడండి.