కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘యెహోవా మనసును’ ఎవరు అర్థం చేసుకోగలరు?

‘యెహోవా మనసును’ ఎవరు అర్థం చేసుకోగలరు?

‘యెహోవా మనసును’ ఎవరు అర్థం చేసుకోగలరు?

‘యెహోవా మనసును ఎరిగి, ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగినవారము.’ —1 కొరిం. 2:16.

1, 2. (ఎ) ప్రజలు ఏ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు? (బి) మన ఆలోచనా తీరుకు, యెహోవా ఆలోచనా తీరుకు సంబంధించి మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

 అవతలి వ్యక్తులు ఎలా ఆలోచిస్తారో అర్థంచేసుకోవడం మీకు ఎప్పుడైనా కష్టమనిపించిందా? ఒకవేళ మీకు ఈ మధ్యే పెళ్లైవుంటే, మీ భాగస్వామి ఎలా ఆలోచిస్తారనే దానిగురించి పూర్తిగా తెలుసుకోవడం మీవల్ల కాదని మీకనిపిస్తుండవచ్చు. నిజానికి స్త్రీపురుషుల ఆలోచనా తీరు, మాట్లాడే తీరు వేర్వేరుగా ఉంటాయి. అంతెందుకు కొన్ని సంస్కృతుల్లో, స్త్రీపురుషులు ఒకే భాష మాట్లాడినా, వారు మాట్లాడే పద్ధతి వేర్వేరుగా ఉంటుంది. ప్రజల సంస్కృతులు, భాషలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి వారు వివిధ రకాలుగా ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారు. మీరు అవతలి వ్యక్తులను ఎంత బాగా తెలుసుకుంటే, అంత బాగా మీరు వాళ్ల ఆలోచనా తీరును అర్థం చేసుకోగలుగుతారు.

2 అందుకే యెహోవా ఆలోచించే తీరుకు, మనం ఆలోచించే తీరుకు ఎంతో తేడా ఉంటుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెప్పాడు: “నా తలంపులు మీ తలంపులవంటివి కావు మీ త్రోవలు నా త్రోవలవంటివి కావు.” తర్వాత ఆయన ఈ విషయాన్ని ఉదాహరిస్తూ, “ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి” అని చెప్పాడు.—యెష. 55:8, 9.

3. మనం ఏమి చేయడానికి ప్రయత్నిస్తే యెహోవాకు దగ్గరవ్వగలుగుతాం?

3 అయితే, యెహోవా ఆలోచనా తీరును అర్థం చేసుకోవడానికి అస్సలు ప్రయత్నించకూడదని దానర్థమా? కాదు. మనం యెహోవా ఆలోచనలన్నిటినీ ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా, మనం ఆయనతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పర్చుకోవచ్చని బైబిలు చెబుతోంది. (సామెతలు 3:32 చదవండి.) బైబిలులో రాయబడివున్న యెహోవా పనుల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే మనం ఆయనకు దగ్గరవ్వగలుగుతాం. (కీర్త. 28:5) అంతేకాక, “అదృశ్యదేవుని స్వరూపి” అయిన క్రీస్తు ‘మనసును’ అర్థంచేసుకోవడం ద్వారా కూడా మనం ఆయనకు దగ్గరవ్వగలుగుతాం. (1 కొరిం. 2:16; కొలొ. 1:15) మనం సమయం తీసుకుని, బైబిల్లోని వృత్తాంతాలను చదివి, వాటిని ధ్యానించినప్పుడు యెహోవా లక్షణాల గురించి, ఆయన ఆలోచనా తీరు గురించి మెల్లమెల్లగా అర్థం చేసుకోగలుగుతాం.

తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకోకుండా చూసుకోండి

4, 5. (ఎ) మనం ఏ తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పర్చుకోకుండా చూసుకోవాలి? వివరించండి. (బి) ఇశ్రాయేలీయులు ఎలా ఆలోచించారు?

4 యెహోవా పనుల గురించి ధ్యానిస్తున్నప్పుడు, మన సొంత ప్రమాణాల ఆధారంగా ఆయన గురించి ఒక అభిప్రాయానికి రాకుండా చూసుకోవాలి. ఆ విషయం, కీర్తన 50:21 లోని యెహోవా మాటల్లో పరోక్షంగా సూచించబడింది: “నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి.” ఇవి, 175 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం ఒక బైబిలు పండితుడు చెప్పిన మాటల్లాగే ఉన్నాయి: “మనుష్యులు తమ సొంత ప్రమాణాలను బట్టే దేవుని గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటారు. అంతేగాక మనుష్యులకు వర్తించే నియమాలే దేవునికి కూడా వర్తిస్తాయని వాళ్లు అనుకుంటారు.”

5 మన సొంత ప్రమాణాలను బట్టి, ఇష్టాల్ని బట్టి యెహోవామీద మనకున్న అభిప్రాయం మారకుండా చూసుకోవాలి. ఇదెందుకు ప్రాముఖ్యం? అపరిపూర్ణ మానవులముగా మనం పరిమితంగా ఆలోచిస్తాం కాబట్టి, లేఖనాలను చదువుతున్నప్పుడు, యెహోవా చేసిన కొన్ని పనులు సరైనవి కావని మనకు అనిపించవచ్చు. ప్రాచీన ఇశ్రాయేలీయులు అలాగే ఆలోచించి, యెహోవా తమతో వ్యవహరించిన తీరు విషయంలో ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చారు. యెహోవా వాళ్లతో ఏమన్నాడో చూడండి: “యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అన్యాయమైనది?”—యెహె. 18:25.

6. యోబు ఏ పాఠం నేర్చుకున్నాడు? ఆయన అనుభవం నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

6 మన ఆలోచన పరిమితమైనదనీ కొన్నిసార్లు పూర్తిగా తప్పుదోవ పడుతుందనీ గుర్తుంచుకుంటే, మన సొంత ప్రమాణాలను బట్టి యెహోవా విషయంలో ఒక అభిప్రాయానికి రాకుండా ఉంటాం. యోబు ఈ పాఠమే నేర్చుకోవాల్సి వచ్చింది. బాధను అనుభవించిన సమయంలో యోబు కృంగిపోయి, కొంతమట్టుకు తన గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ ప్రాముఖ్యమైన విషయాల గురించి పట్టించుకోలేదు. అయితే యోబు వాటి గురించి ఆలోచించేలా ప్రేమతో యెహోవా సహాయం చేశాడు. యెహోవా యోబును 70 కన్నా ఎక్కువ ప్రశ్నలు అడిగాడు కానీ యోబు వాటిలో దేనికీ జవాబు చెప్పలేకపోయాడు. యెహోవా అలా అడగడం ద్వారా యోబు ఆలోచన ఎంత పరిమితమైనదో ఆయన తెలుసుకునేలా చేశాడు. దానికి యోబు వినయంగా స్పందించి, తన వైఖరిని సరిదిద్దుకున్నాడు.—యోబు 42:1-6 చదవండి.

‘క్రీస్తు మనసును’ అర్థం చేసుకోండి

7. యేసు చేసిన పనులను పరిశీలిస్తే, మనం యెహోవా ఆలోచనా తీరును అర్థం చేసుకోగలుగుతామని ఎందుకు చెప్పవచ్చు?

7 యేసు తన మాటల్లో, చేతల్లో తన తండ్రిని పరిపూర్ణంగా అనుకరించాడు. (యోహా. 14:9) కాబట్టి యేసు చేసిన పనులను పరిశీలిస్తే, యెహోవా ఆలోచనా తీరును అర్థంచేసుకోగలుగుతాం. (రోమా. 15:5; ఫిలి. 2:5) ఇప్పుడు మనం రెండు సువార్త వృత్తాంతాలను పరిశీలిద్దాం.

8, 9. యోహాను 6:1-5లో ఉన్నట్లుగా, యేసు ఏ పరిస్థితుల్లో ఫిలిప్పును ఒక ప్రశ్న అడిగాడు? ఎందుకు అలా అడిగాడు?

8 ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. అది సా.శ. 32లో పస్కా పండుగకు కొన్నిరోజుల ముందు జరిగిన సంఘటన. యేసు అపొస్తలులు గలిలయ ప్రాంతమంతటా ప్రకటనా పని చేసి అప్పుడే తిరిగి వచ్చారు. వాళ్లు బాగా అలసిపోయివున్నారు కాబట్టి యేసు వాళ్లను గలిలయ సముద్రానికి ఈశాన్య దిక్కున ఉన్న ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. కానీ, వాళ్ల వెనకాలే వేలమంది అక్కడికి వెళ్లారు. వీళ్లలో చాలామందిని యేసు స్వస్థపర్చాడు, వాళ్లకు ఎన్నో విషయాలు బోధించాడు. ఆ తర్వాత ఒక సమస్య తలెత్తింది. ఆ ఏకాంత ప్రదేశంలో, అంతమంది తినడానికి ఆహారం ఎలా దొరుకుతుంది? ప్రజలకు ఆహారం అవసరమని గ్రహించి, యేసు ఆ ప్రాంతపు వాడైన ఫిలిప్పును, “వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుము?” అని అడిగాడు.—యోహా. 6:1-5.

9 యేసు ఫిలిప్పును ఎందుకు అలా అడిగాడు? ఏమి చేయాలనే దాని గురించి యేసు ఆందోళనపడ్డాడా? లేదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అలా అడిగాడు? ఆ సంఘటన జరిగినప్పుడు వాళ్లతోపాటు ఉన్న అపొస్తలుడైన యోహాను ఇలా వివరిస్తున్నాడు: “యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.” (యోహా. 6:6) యేసు తన శిష్యుల ఆధ్యాత్మిక ప్రగతిని పరీక్షించాడు. ఆయన వాళ్లను ఈ ప్రశ్న అడిగి, తన సామర్థ్యంపై వాళ్లకున్న విశ్వాసాన్ని వ్యక్తపర్చే అవకాశం వాళ్లకిచ్చాడు. ఈ సందర్భంలో శిష్యులు తమ విశ్వాసాన్ని వ్యక్తపర్చే అవకాశాన్ని చేజార్చుకుని తమ ఆలోచన ఎంత పరిమితమైనదో చూపించారు. (యోహాను 6:7-9 చదవండి.) వాళ్ల ఊహకు కూడా అందని పనిని తాను చేయగలనని యేసు చూపించాడు. ఆకలితో ఉన్న ఆ వేలమందికి అద్భుతరీతిలో ఆయన ఆహారం పెట్టాడు.—యోహా. 6:10-13.

10-12. (ఎ) యేసు ఒక గ్రీసు దేశస్థురాలి మనవిని వెంటనే అంగీకరించకపోవడానికి కారణం ఏమై ఉండవచ్చు? వివరించండి. (బి) మనమిప్పుడు ఏ విషయాన్ని పరిశీలిస్తాం?

10 పై పేరాలో ప్రస్తావించబడిన వృత్తాంతాన్ని బట్టి, మరో సందర్భంలో యేసు ఎలా ఆలోచించాడో అర్థం చేసుకోవచ్చు. యేసు జనసమూహాలకు ఆహారం పెట్టిన తర్వాత, అపొస్తలులతో కలిసి ఉత్తర దిశగా ప్రయాణిస్తూ, ఇశ్రాయేలు దేశ సరిహద్దు దాటి తూరు సీదోనుల చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ, ఒక గ్రీసు దేశస్థురాలు యేసు దగ్గరకు వచ్చి తన కుమార్తెను బాగుచేయమని ప్రాధేయపడింది. మొదట ఆయన స్పందించలేదు. కానీ ఆమె పదే పదే ప్రాధేయపడడంతో యేసు, “పిల్లలు మొదట తృప్తి పొందవలెను; పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదు” అని అన్నాడు.—మార్కు 7:24-27.

11 యేసు ఆ స్త్రీకి ముందే ఎందుకు సహాయం చేయలేదు? యేసు ఫిలిప్పుకు ఇచ్చినట్లే తన విశ్వాసాన్ని వ్యక్తపర్చే అవకాశాన్ని ఆ స్త్రీకి కూడా ఇస్తూ ఆమెను పరీక్షించాడా? ఆయన మాట్లాడిన తీరు గురించి బైబిల్లో లేకపోయినా ఆయన మాటలనుబట్టి ఆమె నిరుత్సాహపడలేదు. ఆయన ఆమె ప్రజల్ని, ‘కుక్కపిల్లలతో’ పోల్చడమనేది సున్నితమైన పోలిక. ఈ సందర్భంలో యేసు, పిల్లవాడు అడిగింది ఇవ్వాలని మనసులో ఉన్నా దాన్ని పైకి చూపించకుండా, పిల్లవాడు ఎంత పట్టుదలతో అడుగుతున్నాడో పరీక్షించే ఒక తండ్రిలా ప్రవర్తించివుంటాడు. ఏదేమైనా, ఆమె తన విశ్వాసాన్ని వ్యక్తపర్చినప్పుడు యేసు సంతోషంగా ఆమె మనవిని అంగీకరించాడు.—మార్కు 7:28-30 చదవండి.

12 ఈ రెండు సువార్త వృత్తాంతాలను బట్టి ‘క్రీస్తు మనసును’ చక్కగా అర్థం చేసుకున్నాం. వీటి ఆధారంగా, యెహోవా మనసును మరింత బాగా ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం.

యెహోవా మోషేతో వ్యవహరించిన తీరు

13. యేసు ఆలోచనా తీరును మనమెందుకు చక్కగా అర్థంచేసుకోవాలి?

13 యేసు ఆలోచనా తీరును చక్కగా అర్థం చేసుకుంటే, మనకు అర్థంచేసుకోవడానికి కష్టమనిపించే ఇతర లేఖన వృత్తాంతాలను అర్థంచేసుకోగలుగుతాం. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు ఆరాధన కోసం ఒక దూడను చేసుకున్నప్పుడు యెహోవా మోషేతో చెప్పిన మాటలను గమనించండి. “నేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి, [‘వారిమీద నా కోపాగ్ని రగులుకోనియ్యి, వారిని దహించివెయ్యనియ్యి’ పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.] నిన్ను గొప్ప జనముగా చేసెదను” అని యెహోవా చెప్పాడు.—నిర్గ. 32:9, 10.

14. యెహోవా మాటలకు మోషే ఎలా స్పందించాడు?

14 ఆ వృత్తాంతం ఇంకా ఇలా చెబుతోంది: “మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని—యెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలమువలన ఐగుప్తుదేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల? —ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడుచేయక దానిగూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రాహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితో—ఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను. అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడునుగూర్చి సంతాపపడెను.”—నిర్గ. 32:11-14. a

15, 16. (ఎ) యెహోవా చెప్పిన మాటలను బట్టి మోషేకు ఏ అవకాశం దొరికింది? (బి) యెహోవా ‘సంతాపపడ్డాడు’ అంటే అర్థమేమిటి?

15 యెహోవా ఆలోచనా తీరును మోషే నిజంగా సరిదిద్దాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా లేదు! యెహోవా దేవుడు తాను చేయాలనుకున్నదాన్ని చెప్పినా అదే ఆయన చివరి తీర్పు కాదు. నిజానికి ఆ సందర్భంలో యెహోవా మోషేను పరీక్షించాడు. b ఇది ఆ తర్వాతి కాలంలో యేసు ఫిలిప్పును, గ్రీసు దేశస్థురాలిని పరీక్షించినట్లే ఉంది. యెహోవా మోషేను పరీక్షించడానికి కొంతకాలం ముందు తనకు, ఇశ్రాయేలీయులకు మధ్యవర్తిగా ఉండడానికి ఆయన మోషేను నియమించాడు, అతని స్థానాన్ని గౌరవించాడు. మోషే ఇశ్రాయేలీయుల ప్రవర్తనను బట్టి విసిగిపోతాడా? యెహోవా చెప్పిన మాటలను అవకాశంగా తీసుకొని మోషే యెహోవాతో, ఇశ్రాయేలీయులను మర్చిపొమ్మని, తన సంతానాన్ని ఒక గొప్ప జనాంగంగా చేయమని చెబుతాడా?

16 మోషే స్పందించిన తీరునుబట్టి, యెహోవా న్యాయంగల దేవుడనే నమ్మకం ఆయనకుందని స్పష్టమౌతోంది. ఆయన తన స్వార్థం గురించి ఆలోచించలేదు గానీ, యెహోవా పేరుకు రాగల మచ్చ గురించి ఆలోచించాడని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. అలా, ‘యెహోవా మనసును’ అర్థంచేసుకున్నానని మోషే చూపించాడు. (1 కొరిం. 2:16) దాని ఫలితమేమిటి? యెహోవా దేవుడు వాళ్ళను నాశనం చేయాలని స్థిరంగా నిశ్చయించుకోలేదు కాబట్టి, లేఖనం చెబుతున్నట్లు ‘ఆయన సంతాపపడ్డాడు.’ ఇక్కడ ఉపయోగించబడిన ‘సంతాపపడ్డాడు’ అనే మాటకు హెబ్రీ భాషలో, యెహోవా జనాంగం మీదకు తీసుకువస్తానని అనుకున్న నాశనాన్ని తీసుకురాలేదని అర్థం అంతే.

యెహోవా అబ్రాహాముతో వ్యవహరించిన తీరు

17. అబ్రాహాము మాట్లాడుతున్నప్పుడు యెహోవా ఏ విధంగా చాలా ఓపికను చూపించాడు?

17 తనపట్ల ఉన్న విశ్వాసాన్ని వ్యక్తంచేసే అవకాశం యెహోవా తన సేవకులకు ఇస్తాడని మరో ఉదాహరణ కూడా చూపిస్తోంది. అబ్రాహాము సొదొమ నగరానికి సంబంధించి యెహోవాతో మాట్లాడిన సందర్భాన్ని గమనించండి. ఆ వృత్తాంతంలో, అబ్రాహాము అడిగిన ఎనిమిది ప్రశ్నలను యెహోవా ఎంతో ఓపికగా విన్నాడు. మాటల మధ్యలో అబ్రాహాము భావావేశానికి లోనై యెహోవాను ఇలా అభ్యర్థించాడు: “ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?”—ఆది. 18:22-33.

18. యెహోవా అబ్రాహాముతో వ్యవహరించిన తీరు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

18 ఈ వృత్తాంతాన్ని బట్టి యెహోవా ఆలోచనా తీరు గురించి ఏమి నేర్చుకోవచ్చు? అబ్రాహాము తనతో చర్చిస్తేనే యెహోవా సరైన నిర్ణయానికి రాగలడా? లేదు. తన నిర్ణయానికి గల కారణాలను యెహోవా ముందే చెప్పివుండేవాడు. కానీ ఆ ప్రశ్నలను అడగనివ్వడం ద్వారా యెహోవా తన నిర్ణయాన్ని అంగీకరించడానికి, తన ఆలోచనా తీరును అర్థం చేసుకోవడానికి అబ్రాహాముకు సమయమిచ్చాడు. దానివల్ల, యెహోవా ఎంత కనికరంగలవాడో, ఎంత న్యాయవంతుడో అబ్రాహాము అర్థం చేసుకోగలిగాడు. ఆ సందర్భంలో, యెహోవా ఒక స్నేహితునితో వ్యవహరించినట్లు అబ్రాహాముతో వ్యవహరించాడు.—యెష. 41:8; యాకో. 2:23.

మనమేమి నేర్చుకోవచ్చు?

19. మనం యోబును ఎలా అనుకరించవచ్చు?

19 ‘యెహోవా మనసు’ గురించి మనమేమి నేర్చుకున్నాం? ఆయన వాక్యం సహాయంతో యెహోవా మనసు గురించి మనకున్న అవగాహనను సరిదిద్దుకోవాలి. మనకున్నటువంటి పరిమితులే యెహోవాకు ఉన్నాయని మనం అనుకోకూడదు. మన సొంత ప్రమాణాలతో, మన ఆలోచనా తీరుతో ఆయన మీద ఒక అభిప్రాయానికి రాకూడదు. యోబు ఇలా అన్నాడు: ‘దేవుడు నావలె నరుడు కాడు. నేను ఆయనతో వ్యాజ్యెమాడజాలను మేము కలిసి న్యాయవిమర్శకు పోలేము.’ (యోబు 9:32) యోబులాగే, యెహోవా మనసును మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నప్పుడు మనం తప్పక ఇలా అంటాం: “ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు?”—యోబు 26:14.

20. ఏదైనా లేఖన వృత్తాంతం అర్థం చేసుకోవడానికి కష్టమనిపిస్తే ఏమి చేయాలి?

20 మనం బైబిలు చదువుతున్నప్పుడు ఏదైనా అర్థంకాని లేఖన వృత్తాంతం, ముఖ్యంగా యెహోవా మనసును అర్థం చేసుకోవడానికి కష్టమనిపించే లేఖన వృత్తాంతం వస్తే మనమేమి చేయాలి? వాటి గురించి మనం పరిశోధన చేసిన తర్వాత కూడా అర్థంకాకపోతే, యెహోవా మీద మనకున్న నమ్మకానికి అదో పరీక్ష అనుకోవాలి. అలాంటి లేఖన వృత్తాంతాల వల్ల యెహోవా లక్షణాల మీద మనకున్న విశ్వాసాన్ని వ్యక్తంచేసే అవకాశం దొరుకుతుందని గుర్తుంచుకోండి. ఆయన చేసే ప్రతీది మనం అర్థంచేసుకోలేమనే విషయాన్ని మనం వినయంగా అంగీకరిద్దాం. (ప్రసం. 11:5) అపొస్తలుడైన పౌలు మాటలతో మనందరం తప్పకుండా ఏకీభవిస్తాం: “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గము లెంతో అగమ్యములు. ప్రభువు [యెహోవా] మనసును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.”—రోమా. 11:33-36.

[అధస్సూచీలు]

a ఇలాంటి వృత్తాంతమే సంఖ్యాకాండము 14:11-20లో కూడా ఉంది.

b పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం ప్రకారం నిర్గమకాండము 32:10 లోని అధస్సూచి ఇలా ఉంది: “నా కోపాగ్ని రగుల్కోనియ్యి, దహించివెయ్యనియ్యి.” కొంతమంది బైబిలు పండితులు చెబుతున్నట్లుగా, “ఇది ప్రజల పక్షంగా బ్రతిమాలడానికి మోషేకు ఒక ఆహ్వానం.” (కీర్త. 106:23; యెహె. 22:30) ఏదేమైనా, మోషే ఏమాత్రం సంకోచించకుండా తన అభిప్రాయాన్ని యెహోవాకు తెలియజేశాడు.

మీకు జ్ఞాపకమున్నాయా?

• మన సొంత ప్రమాణాల ఆధారంగా యెహోవాపై ఒక అభిప్రాయానికి రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

• మనం యేసు చేసిన పనుల గురించి అర్థం చేసుకుంటే యెహోవాకు ఎలా దగ్గరవ్వగలుగుతాం?

• మోషేతో, అబ్రాహాముతో యెహోవా మాట్లాడిన మాటల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

[5వ పేజీలోని చిత్రాలు]

మోషేతో, అబ్రాహాముతో యెహోవా వ్యవహరించిన తీరునుబట్టి యెహోవా ఆలోచనా తీరు గురించి మనం ఏమి నేర్చుకుంటాం?