కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనస్థులారా, దేవుని వాక్య ప్రకారం నడుచుకోండి

యౌవనస్థులారా, దేవుని వాక్య ప్రకారం నడుచుకోండి

యౌవనస్థులారా, దేవుని వాక్య ప్రకారం నడుచుకోండి

“జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము.”—సామె. 4:5.

1, 2. (ఎ) అపొస్తలుడైన పౌలు తనలో జరిగిన పోరాటంలో ఎలా విజయం సాధించగలిగాడు? (బి) మీరు జ్ఞానాన్ని, బుద్ధిని ఎలా సంపాదించుకోవచ్చు?

 “మేలు చేయ గోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది” అని ఎవరన్నారో మీకు తెలుసా? స్వయంగా అపొస్తలుడైన పౌలే అలా అన్నాడు. ఆయన యెహోవాను ప్రేమించినప్పటికీ, కొన్నిసార్లు సరైనది చేయడానికి ఎంతో పోరాడాల్సి వచ్చింది. తనలో జరిగిన ఆ పోరాటాన్ని బట్టి పౌలుకు ఎలా అనిపించింది? “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను?” అని ఆయన రాశాడు. (రోమా. 7:21-24) పౌలు భావాలను మీరు అర్థం చేసుకోగలరా? సరైనది చేయడం కొన్నిసార్లు మీకు కష్టమనిపిస్తోందా? అలాంటి సందర్భాల్లో పౌలు అనుకున్నట్లే మీరు కూడా విఫలమైపోయారని అనుకుంటున్నారా? అలాగైతే, నిరాశపడకండి. ఎందుకంటే, పౌలు తనలో జరిగిన పోరాటంలో విజయం సాధించగలిగాడు, మీరు కూడా సాధించగలరు.

2 పౌలు ‘హితవాక్యం’ ప్రకారం నడుచుకున్నాడు కాబట్టే విజయం సాధించగలిగాడు. (2 తిమో. 1:13, 14) ఆ వాక్యం వల్ల, ఆయన పరీక్షల్ని సహించేందుకు, మంచి నిర్ణయాలు తీసుకునేందుకు కావాల్సిన జ్ఞానాన్ని, బుద్ధిని సంపాదించుకున్నాడు. జ్ఞానాన్ని, బుద్ధిని సంపాదించుకోవడానికి యెహోవా మీకు కూడా సహాయం చేయగలడు. (సామె. 4:5) తన వాక్యమైన బైబిల్లో ఆయన ఎంతో శ్రేష్ఠమైన సలహాలను ఇచ్చాడు. (2 తిమోతి 3:16, 17 చదవండి.) తల్లిదండ్రులతో వ్యవహరిస్తున్నప్పుడు, డబ్బును ఎలా ఖర్చుపెట్టాలో నిర్ణయించుకుంటున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు లేఖన సూత్రాల వల్ల మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చో ఆలోచించండి.

కుటుంబంలో . . .

3, 4. (ఎ) తల్లిదండ్రులు పెట్టే నియమాలకు లోబడడం మీకు ఎందుకు కష్టమనిపించవచ్చు? (బి) తల్లిదండ్రులు ఎందుకు నియమాలు పెడతారు?

3 మీ తల్లిదండ్రులు విధించే నియమాలను పాటించడం మీకు చాలా కష్టమనిపిస్తోందా? మీకు ఎందుకు అలా అనిపిస్తుండవచ్చు? ఓ కారణమేమిటంటే, ఎక్కువ స్వేచ్ఛ కావాలని మీరు కోరుకుంటుండవచ్చు. పెద్దవారౌతుండగా అలా అనిపించడం సహజమే. అయితే, కుటుంబంలో మీరు మీ తల్లిదండ్రుల మాట వినాలి.—ఎఫె. 6:1-3.

4 మీ తల్లిదండ్రులు కొన్ని నియమాలను, విధులను ఎందుకు పెడుతున్నారో అర్థం చేసుకుంటే వాటిని పాటించడం మీకు సులభమౌతుంది. అయితే, 18 ఏళ్ల సౌజన్యకు a అనిపించినట్లే కొన్నిసార్లు మీకూ అనిపించవచ్చు. ఆమె తన తల్లిదండ్రుల గురించి ఇలా అంది: “నా వయసులో ఉన్నప్పుడు తమకు ఎలా అనిపించిందో వారు పూర్తిగా మరచిపోయారు. వారు నా అభిప్రాయాన్ని చెప్పనివ్వరు, నిర్ణయాలు తీసుకోనివ్వరు లేదా నన్ను పెద్దవాళ్లలా ఉండనివ్వరు.” తల్లిదండ్రులు ఇవ్వాల్సినంత స్వేచ్ఛను ఇవ్వడం లేదని సౌజన్యకు అనిపించినట్లే మీకూ అనిపించవచ్చు. అయితే, మీ తల్లిదండ్రులకు మీపై శ్రద్ధ ఉంది కాబట్టే మీకు నియమాలు విధిస్తారు. అంతేకాక, మీపై చూపించే శ్రద్ధ విషయంలో తాము యెహోవాకు జవాబుదారులని మీ క్రైస్తవ తల్లిదండ్రులకు తెలుసు.—1 తిమో. 5:8.

5. మీ తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే మీరు ఏ ప్రయోజనం పొందవచ్చు?

5 మీ తల్లిదండ్రులు పెట్టే నియమాలకు లోబడడాన్ని బ్యాంకు రుణాన్ని తీర్చడంతో పోల్చవచ్చు. మీరు ఎంత నమ్మకంగా డబ్బు తిరిగి చెల్లిస్తే అంత ఎక్కువగా ఆ బ్యాంకువాళ్లు మీకు రుణాలను ఇవ్వడానికి మొగ్గుచూపుతారు. అలాగే గౌరవాన్ని, విధేయతను చూపించే విషయంలో మీరు మీ తల్లిదండ్రులకు రుణపడి ఉన్నారు. (సామెతలు 1:8 చదవండి.) మీరు మీ తల్లిదండ్రులకు ఎంత ఎక్కువ విధేయత చూపిస్తే అంత ఎక్కువ స్వేచ్ఛను ఇవ్వడానికి వారు మొగ్గుచూపుతారు. (లూకా 16:10) ఒకవేళ మీరు వారు పెట్టిన నియమాలను పాటించకపోతే, వారు మీకిచ్చే స్వేచ్ఛను తగ్గించవచ్చు లేదా పూర్తిగా తీసేయవచ్చు.

6. పిల్లలు తమకు లోబడాలంటే తల్లిదండ్రులు ఏమి చేయాలి?

6 తాము పెట్టిన నియమాలకు తమ పిల్లలు లోబడాలంటే ఈ విషయంలో తల్లిదండ్రులు మాదిరినుంచాలి. యెహోవా నియమాలకు వారు ఇష్టపూర్వకంగా లోబడడం ద్వారా ఆయన నియమాలు భారమైనవి కావని పిల్లలకు చూపించాలి. అలా చూపిస్తే, తమ తల్లిదండ్రులు పెట్టే నియమాలు కూడా భారమైనవి కావని పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు. (1 యోహా. 5:3) అంతేకాక, కొన్ని విషయాల్లో తమ అభిప్రాయాన్ని చెప్పే అవకాశాన్ని కూడా యెహోవా తన సేవకులకు ఇవ్వడం గురించి బైబిలు మాట్లాడుతోంది. (ఆది. 18:22-32; 1 రాజు. 22:19-22) బహుశా, వివిధ విషయాల్లో తమ అభిప్రాయాన్ని చెప్పే అవకాశాన్ని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇవ్వవచ్చు.

7, 8. (ఎ) కొంతమంది యౌవనస్థులు దేనితో పోరాడాల్సిరావచ్చు? (బి) మీకు దొరికే క్రమశిక్షణ నుండి ప్రయోజనం పొందాలంటే మీరేమి గుర్తించాలి?

7 తల్లిదండ్రులు తమను అన్యాయంగా విమర్శిస్తున్నారన్న ఆలోచనలతో కూడా పిల్లలు పోరాడాల్సిరావచ్చు. కొన్నిసార్లు మీకు కూడా యౌవనస్థుడైన చేతన్‌కు అనిపించినట్లే అనిపించి ఉండవచ్చు. ఆయనిలా అన్నాడు: “మా అమ్మ ఎప్పుడూ నా తప్పులను కనిపెడుతూ ఉండే ఓ పోలీసు డిటెక్టివ్‌లా కనిపించేది.”

8 దిద్దుబాటు లేదా క్రమశిక్షణ అనేది తరచూ విమర్శ రూపంలో వస్తుంది. సరైన కారణాన్నిబట్టి ఇచ్చే క్రమశిక్షణ సహితం అంగీకరించడానికి కష్టంగానే ఉంటుందని బైబిలు కూడా చెబుతోంది. (హెబ్రీ. 12:11) మీకు దొరికే క్రమశిక్షణ నుండి ప్రయోజనం పొందాలంటే మీరేమి చేయాలి? ముఖ్యంగా మీపై ఉన్న ప్రేమతోనే మీ తల్లిదండ్రులు మీకు ఉపదేశమిస్తారని మీరు గుర్తుంచుకోవాలి. (సామె. 3:12) మీరు చెడ్డ అలవాట్లను నేర్చుకోకూడదనీ, మంచి అలవాట్లను మీకు నేర్పించాలనీ వారు కోరుకుంటారు. అలా సరిదిద్దకపోతే తాము మిమ్మల్ని ద్వేషిస్తున్నట్లేనని మీ తల్లిదండ్రులు గుర్తిస్తారు. (సామెతలు 13:24 చదవండి.) ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు తప్పులు జరగడం సహజమేనని గుర్తించండి. తల్లిదండ్రులు మిమ్మల్ని సరిదిద్దినప్పుడు వారి మాటల్లోని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. “వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు.”—సామె. 3:13, 14.

9. అన్యాయం జరిగిందనుకొని, దాని గురించే ఆలోచిస్తూ ఉండే బదులు యౌవనస్థులు ఏమి చేయవచ్చు?

9 అయితే, తల్లిదండ్రులు కూడా పొరపాట్లు చేస్తారు. (యాకో. 3:2) మీకు క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు వారు కొన్నిసార్లు అనాలోచితంగా మాట్లాడవచ్చు. (సామె. 12:18) మీ తల్లిదండ్రులు దేనివల్ల అలా మాట్లాడే అవకాశం ఉంది? వారు ఏదైనా ఒత్తిడిలో ఉండవచ్చు లేదా తమ తప్పు వల్లే మీరు పొరపాట్లు చేస్తున్నారని వారనుకోవచ్చు. కాబట్టి, మీకు అన్యాయం జరిగిందనుకొని, దాని గురించే ఆలోచిస్తూ ఉండే బదులు మీకు సహాయం చేయడానికి వారు పట్టుదలతో చేసే ప్రయత్నానికి కృతజ్ఞత చూపించండి. క్రమశిక్షణను అంగీకరించే స్వభావం మీకున్నట్లైతే మీరు పెద్దవారైనప్పుడు అది మీకెంతో మేలు చేస్తుంది.

10. తల్లిదండ్రులు ఇచ్చే నియమాల్ని, క్రమశిక్షణను సులభంగా స్వీకరించి వాటి నుండి ప్రయోజనం పొందాలంటే మీరు ఏమి చేయాలి?

10 తల్లిదండ్రులు ఇచ్చే నియమాల్ని, క్రమశిక్షణను సులభంగా స్వీకరించి వాటి నుండి ప్రయోజనం పొందాలని మీరు కోరుకుంటున్నారా? అలాగైతే వారితో మీరు మాట్లాడే తీరును మెరుగుపర్చుకోవాలి. దీన్ని మీరెలా చేయవచ్చు? మొదటిగా, వారు చెప్పేది వినాలి. “వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను” అని బైబిలు చెబుతోంది. (యాకో. 1:19) వెంటనే మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నించే బదులు మీ భావావేశాల్ని అదుపులో ఉంచుకొని తల్లిదండ్రులు చెప్పేది వినండి. వారు ఎలా చెప్పారనేది కాకుండా ఏమి చెప్పారనే దానిగురించి ఆలోచించండి. ఆ తర్వాత మీ తప్పును ఒప్పుకొని వారు చెప్పింది మీకు అర్థమైందని చూపించండి. అలా చేస్తే, తాము చెప్పింది మీరు విన్నారని వారికి నమ్మకం కుదురుతుంది. ఒకవేళ మీరన్న మాటలకు లేదా చేసిన పనికి సంజాయిషీ ఇచ్చుకోవాలనుకుంటే అప్పుడేమిటి? చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు చెప్పింది పాటించేంతవరకు మీరు మీ ‘పెదవులను మూసుకోవడమే’ తెలివైన పని. (సామె. 10:19) తాము చెప్పింది మీరు విన్నారని మీ తల్లిదండ్రులకు అనిపిస్తే మీరు చెప్పేది వినడానికి వారు మరింత సుముఖంగా ఉంటారు. అలా మీరు దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నారని చూపిస్తారు.

డబ్బును ఖర్చుపెట్టే విషయంలో . . .

11, 12. (ఎ) డబ్బు విషయంలో ఏమి చేయమని దేవుని వాక్యం మనకు చెబుతోంది? ఎందుకు? (బి) డబ్బును ఖర్చుచేసే విషయంలో మీ తల్లిదండ్రులు మీకెలా సహాయం చేయవచ్చు?

11 “ద్రవ్యము ఆశ్రయాస్పదము” అని బైబిలు చెబుతోంది. అయితే, డబ్బు కన్నా జ్ఞానం చాలా విలువైనదని అదే లేఖనం చెబుతోంది. (ప్రసం. 7:12) బైబిలు, డబ్బుకున్న విలువను అర్థం చేసుకోమని చెబుతోంది గానీ దాన్ని ప్రేమించమని కాదు. డబ్బు పట్ల ప్రేమను ఎందుకు పెంచుకోకూడదు? ఈ ఉదాహరణను పరిశీలించండి: చేయి తిరిగిన వంటవానికి పదునైన కత్తి ఎంతో ఉపయోగకరమైన వస్తువు. అదే కత్తి అజాగ్రత్తపరుని చేతిలో ఉంటే ఎంతో హాని జరుగుతుంది. అలాగే, డబ్బును వివేకంతో ఖర్చు చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. అయితే, “ధనవంతులగుటకు అపేక్షించువారు” తరచూ తమ స్నేహాలను, కుటుంబ బంధాలను, చివరకు దేవునితో తమకున్న సంబంధాన్ని కూడా పాడు చేసుకుంటారు. దానివల్ల, వారు “నానాబాధలతో” తమను తామే పొడుచుకుంటారు.—1 తిమోతి 6:9, 10 చదవండి.

12 డబ్బును వివేచనతో ఖర్చుపెట్టడాన్ని మీరు ఎలా నేర్చుకోవచ్చు? డబ్బును ఎలా ఖర్చుపెడితే బాగుంటుందో మీ తల్లిదండ్రులను అడగండి. “జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును. వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును” అని సొలొమోను రాశాడు. (సామె. 1:5) శ్రీజ అనే యౌవనస్థురాలు ఈ విషయంలో మంచి సలహా కోసం తన తల్లిదండ్రులను అడిగింది. ఆమె ఇలా అంది: “దేనికి ఎంత ఖర్చుపెట్టాలో మా నాన్న నాకు నేర్పించారు. ఆలోచించి డబ్బును ఖర్చు పెట్టడం, ఎంత ఖర్చు చేశానో రాసి పెట్టుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో కూడా చూపించాడు.” శ్రీజ వాళ్లమ్మ కూడా తనకు కొన్ని ఉపయోగకరమైన సలహాలు ఇచ్చింది. “వస్తువులను కొనుగోలు చేసే ముందు వాటి ఖరీదులను రెండు మూడు చోట్ల కనుక్కోవడం ఎంత ఉపయోగకరమో మా అమ్మ చెప్పింది” అని ఆమె అంది. దానివల్ల శ్రీజ ఎలా ప్రయోజనం పొందింది? దానికి ఆమె ఇలా జవాబిచ్చింది: “ఇప్పుడు నా ఖర్చులను నేనే చూసుకోగలుగుతున్నాను. నేను జాగ్రత్తగా ఖర్చు చేయగలుగుతున్నాను. అలా, అనవసరమైన అప్పుల్లో కూరుకుపోకుండా స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను.”

13. డబ్బును ఖర్చుపెట్టే విషయంలో మీకు మీరు ఎలా హద్దులు విధించుకోవచ్చు?

13 నచ్చిన ప్రతీ వస్తువును కొన్నట్లైతే లేదా కేవలం స్నేహితుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో డబ్బు ఖర్చు చేసినట్లైతే మీరు ఇట్టే అప్పుల్లో కూరుకుపోతారు. ఆ చిక్కుల్లో పడకూడదంటే మీరేమి చేయాలి? డబ్బును ఖర్చుచేసే విషయంలో మీకు మీరు కొన్ని హద్దులు విధించుకోవాలి. 20వ పడిలో ఉన్న సునీత అనే యౌవనస్థురాలు అదే చేసింది. ఆమె ఇలా చెప్పింది: “నేను స్నేహితులతో కలిసి బయటికి వెళ్లినప్పుడు ఎంత ఖర్చుపెట్టాలో ముందుగానే నిర్ణయించుకుంటాను . . . తమ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసే స్నేహితులతో, చూసిన వెంటనే ఓ వస్తువును కొనకుండా రెండు మూడు చోట్ల దాని ఖరీదును కనుక్కోమని ప్రోత్సహించే వారితో షాపింగ్‌ చేయడానికి ఇష్టపడతాను.”

14. “ధనమోసము” విషయంలో మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

14 డబ్బును సంపాదించడం, దాన్ని జాగ్రత్తగా ఖర్చుపెట్టడం అనేవి జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలే కానీ, ‘ఆత్మవిషయమై దీనులైనవారే’ అంటే తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించినవారే నిజమైన సంతోషాన్ని పొందుతారని యేసు చెప్పాడు. (మత్త. 5:3) “ధనమోసము” వంటి విషయాలు ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక విషయాలపై ఉన్న శ్రద్ధను అణచివేస్తాయని యేసు హెచ్చరించాడు. (మార్కు 4:18, 19) కాబట్టి, మీరు దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ డబ్బు విషయంలో సరైన అభిప్రాయాన్ని కలిగివుండడం ఎంత ప్రాముఖ్యం!

ఒంటరిగా ఉన్నప్పుడు . . .

15. దేవుని పట్ల మీకున్న యథార్థత ఎప్పుడు ఎక్కువగా పరీక్షించబడుతుంది?

15 దేవుని పట్ల మీకున్న యథార్థత ఎప్పుడు ఎక్కువగా పరీక్షించబడుతుందని మీరు అనుకుంటున్నారు? నలుగురిలో ఉన్నప్పుడా లేక ఒంటరిగా ఉన్నప్పుడా? స్కూల్లో లేదా ఉద్యోగ స్థలంలో ఉన్నప్పుడు, యెహోవాతో మీకున్న సంబంధాన్ని పాడు చేసే ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి మీరు మరింత అప్రమత్తంగా ఉంటారు. కానీ తీరిక సమయంలో, మీరు అప్రమత్తంగాలేని సమయంలో మీ నైతిక ప్రమాణాలు దాడికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

16. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా యెహోవాకు విధేయత చూపించాలని మీరెందుకు కోరుకోవాలి?

16 ఒంటరిగా ఉన్నప్పుడు కూడా యెహోవాకు విధేయత చూపించాలని మీరెందుకు కోరుకోవాలి? మీరు యెహోవాను దుఃఖపరిచే అవకాశముంది లేదా ఆయన హృదయాన్ని సంతోషపరిచే అవకాశం ఉంది అని గుర్తుంచుకోండి. (ఆది. 6:5, 6; సామె. 27:11) యెహోవా “మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు” కాబట్టి మీరు చేసే పనులను బట్టి ఆయన సంతోషించవచ్చు లేదా బాధపడవచ్చు. (1 పేతు. 5:7) మీ ప్రయోజనం కోసమే మీరు తన మాట వినాలని ఆయన కోరుకుంటున్నాడు. (యెష. 48:17, 18) పూర్వం ఇశ్రాయేలులో, తన సేవకులు కొంతమంది తన ఉపదేశాన్ని పట్టించుకోనప్పుడు యెహోవా సంతాపపడ్డాడు. (కీర్త. 78:40, 41) అయితే, ప్రవక్తయైన దానియేలు విషయానికొస్తే యెహోవా ఆయనను ఎంతో ప్రేమించాడు. ఆయనను ఒక దేవదూత “బహు ప్రియుడవు” అని పిలిచాడు. (దాని. 10:11) ఎందుకు? ఎందుకంటే, దానియేలు నలుగురిలో ఉన్నప్పుడు మాత్రమే కాక ఒంటరిగా ఉన్నప్పుడు కూడా యెహోవా పట్ల యథార్థంగా ఉన్నాడు.దానియేలు 6:10 చదవండి.

17. వినోదాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు మీరు ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?

17 మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి యథార్థంగా ఉండాలంటే, ‘మేలు కీడులను వివేచించే జ్ఞానేంద్రియాలను’ వృద్ధి చేసుకోవాలి. సరైనదని మీకు తెలిసిన దాన్ని చేయడం ద్వారా వాటిని సాధకం చేసుకోవాలి. (హెబ్రీ. 5:14) ఉదాహరణకు, మీరు సంగీతాన్ని, సినిమాలను, ఇంటర్నెట్‌ సైట్లను ఎంచుకుంటున్నప్పుడు చెడ్డ వాటిని కాకుండా సరైన వాటిని ఎంచుకునేలా ఈ ప్రశ్నలు మీకు సహాయం చేస్తాయి: ‘నేను ఎంచుకున్నది నాలో కనికరాన్ని వృద్ధి చేస్తుందా లేక ఇతరుల “ఆపదను” చూసి సంతోషించేలా చేస్తుందా?’ (సామె. 17:5) ‘ఇది “మేలును” ప్రేమించేందుకు నాకు తోడ్పడుతుందా లేక “కీడును” ద్వేషించడాన్ని కష్టతరం చేస్తుందా?’ (ఆమో. 5:15) ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏమి చేస్తారనే దాన్ని బట్టే మీరు వేటిని అత్యంత విలువైనవిగా ఎంచుతారనేది తెలుస్తుంది.—లూకా 6:45.

18. మీరు రహస్యంగా తప్పుడు ప్రవర్తనకు పాల్పడుతున్నట్లైతే ఏమి చేయాలి? ఎందుకు?

18 ఫలానిది తప్పని తెలిసినా, దాన్ని మీరు రహస్యంగా చేస్తున్నట్లైతే మీరేమి చేయాలి? “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును” అని గుర్తుంచుకోండి. (సామె. 28:13) తప్పుడు ప్రవర్తనకు పాల్పడుతూ “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపర్చ[డం]” ఎంత అవివేకం! (ఎఫె. 4:30) కాబట్టి, మీరు ఏదైనా తప్పు చేస్తే దేవుని ముందు, తల్లిదండ్రుల ముందు దాన్ని ఒప్పుకోవాల్సిందే. అలా చేస్తే మీరు ప్రయోజనం పొందుతారు. ఈ విషయంలో ‘సంఘ పెద్దలు’ మీకు ఎంతగానో సహాయం చేయగలరు. శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “వారు ప్రభువు నామమున [తప్పు చేసిన వ్యక్తికి] నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.” (యాకో. 5:14, 15) అయితే, పెద్దలను సమీపిస్తున్నప్పుడు కొంత అవమానంగా అనిపించవచ్చు, బహుశా అది కొన్ని చేదు పరిణామాలకు కూడా దారితీయవచ్చు. కానీ, సహాయం కోరే ధైర్యం మీలో ఉంటే, మరింత హాని జరగకుండా చూసుకుంటారు, మంచి మనస్సాక్షిని తిరిగి పొందడం వల్ల కలిగే ప్రశాంతతను అనుభవిస్తారు.—కీర్త. 32:1-5.

యెహోవా హృదయాన్ని సంతోషపర్చండి

19, 20. యెహోవా మీ విషయంలో ఏమి కోరుకుంటున్నాడు? దానికోసం మీరేమి చేయాలి?

19 యెహోవా ‘సంతోషంగల దేవుడు.’ మీరు కూడా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 తిమో. 1:8-11, NW) ఆయనకు మీపై ఎంతో శ్రద్ధ ఉంది. సరైనది చేయడానికి మీరు చేసే కృషిని ఎవ్వరూ గుర్తించకపోయినా యెహోవా మాత్రం గుర్తిస్తాడు. యెహోవా చూడలేనిదంటూ ఏదీ లేదు. తప్పులను కనిపెట్టాలనే ఉద్దేశంతో కాదుగానీ సరైనది చేయాలని ప్రయత్నించే మీకు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే యెహోవా మిమ్మల్ని చూస్తున్నాడు. “తనయెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.”—2 దిన. 16:9.

20 కాబట్టి, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ, దానిలోని సలహాలను పాటించండి. అలా చేస్తే, ముళ్లలాంటి సమస్యలను అధిగమించడానికి, కష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని, బుద్ధిని మీరు సంపాదించుకుంటారు. మీరు మీ తల్లిదండ్రులను, యెహోవాను సంతోషపెట్టడమే కాక జీవితంలో నిజమైన సంతోషాన్ని అనుభవిస్తారు.

[అధస్సూచి]

a అసలు పేర్లు కావు.

మీరెలా జవాబిస్తారు?

• తల్లిదండ్రులు ఇచ్చే నియమాల్ని, క్రమశిక్షణను సులభంగా స్వీకరించి వాటి నుండి ప్రయోజనం పొందాలంటే యౌవనస్థులు ఏమి చేయాలి?

• డబ్బు విషయంలో సరైన అభిప్రాయాన్ని పెంపొందించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

• ఒంటరిగా ఉన్నప్పుడు కూడా యెహోవా పట్ల మీకున్న యథార్థతను ఎలా కాపాడుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[6వ పేజీలోని చిత్రం]

ఒంటరిగా ఉన్నప్పుడు మీరు యెహోవాకు యథార్థంగా ఉంటారా?