కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనస్థులారా, తోటివారి ఒత్తిడిని ఎదిరించండి

యౌవనస్థులారా, తోటివారి ఒత్తిడిని ఎదిరించండి

యౌవనస్థులారా, తోటివారి ఒత్తిడిని ఎదిరించండి

‘ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు రుచిగలదిగా ఉండనియ్యుడి.’—కొలొ. 4:6.

1, 2. ఇతరుల నుండి వేరుగా ఉండడం గురించి చాలామంది యౌవనస్థులు ఎలా భావిస్తారు? ఎందుకు?

 “తోటివారి ఒత్తిడి” గురించి మీరు వినేవుంటారు. అంతేకాక, బహుశా ఇప్పటికే మీరు దాన్ని ఎదుర్కొనివుంటారు కూడా. మీకు తప్పని తెలిసిన ఓ పనిని చేయమని కనీసం ఒక్కసారైనా ఎవరో ఒకరు మిమ్మల్ని ఒత్తిడి చేసివుంటారు. అలా జరిగినప్పుడు మీకెలా అనిపిస్తుంది? 14 ఏళ్ల క్రిస్టఫర్‌ ఇలా అన్నాడు: “కొన్నిసార్లు, అప్పటికప్పుడు నేను అక్కడ నుండి మాయమైపోతే బాగుంటుందనీ లేకపోతే నేను కూడా ఇతర విద్యార్థుల్లా ఉంటే అసలు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాల్సిన పనుండదనీ అనిపిస్తుంది.”

2 మీ తోటివారు మీపై బలమైన ప్రభావం చూపిస్తారా? ఒకవేళ చూపిస్తే, ఎందుకు అలా చూపిస్తారు? వారు మిమ్మల్ని అంగీకరించాలని మీరు కోరుకోవడం వల్ల అలా జరుగుతుందా? ఆ కోరిక కలిగివుండడం అన్నివేళలా తప్పేమీ కాదు. నిజానికి పెద్దవాళ్లు కూడా తమ తోటివారు తమను అంగీకరించాలని కోరుకుంటారు. పిల్లలైనా, పెద్దలైనా ఎవరూ ఇతరులు తమను తిరస్కరించాలని కోరుకోరు. నిజం చెప్పాలంటే, తప్పు చేయడాన్ని మీరు తిరస్కరించినప్పుడు కొంతమంది మిమ్మల్ని ఇష్టపడరు. దేవుని కుమారుడైన యేసు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా, ఆయన ఎల్లప్పుడూ సరైనదే చేశాడు. కొంతమంది ఆయనను అనుసరించి ఆయన శిష్యులయ్యారు, ఇతరులేమో ఆయనను తిరస్కరించి ఆయనను ‘ఎన్నిక చేయలేదు.’—యెష. 53:3.

తోటివారిలా ఉండాలనే ఒత్తిడి ఎంత బలంగా ఉంటుంది?

3. మీ తోటివారిలా ప్రవర్తించడం ఎందుకు సరైనది కాదు?

3 కొన్నిసార్లు, తోటివారు మిమ్మల్ని తిరస్కరించకూడదనే ఉద్దేశంతో మీరు వారిలాగే ప్రవర్తించాలనుకోవచ్చు. కానీ అలా చేయడం సరైనది కాదు. క్రైస్తవులు ‘పసిపిల్లల్లా, అలలచేత ఎగురగొట్టబడినట్లు’ ఉండకూడదు. (ఎఫె. 4:14) చిన్న పిల్లలు ఇతరుల్లా ప్రవర్తించడానికి చాలా సులభంగా మొగ్గు చూపుతారు. కానీ, ప్రస్తుతం యౌవనస్థులుగా ఉన్న మీరు మెల్లమెల్లగా పెద్దవాళ్లౌతారు. కాబట్టి, యెహోవా ప్రమాణాలు మీ మంచి కోసమేనని విశ్వసించి, మీ నమ్మకాల ప్రకారం జీవిస్తే మీకు మేలే జరుగుతుంది. (ద్వితీ. 10:12, 13) ఒకవేళ అలా చేయకపోతే, మీ జీవితం మీ చేతుల్లో లేనట్లే. నిజానికి, ఇతరుల ఒత్తిడికి మీరు లొంగిపోయినప్పుడు మీరు వారి చేతుల్లో కీలుబొమ్మలౌతారు.—2 పేతురు 2:19 చదవండి.

4, 5. (ఎ) తోటివారి ఒత్తిడికి అహరోను ఎలా లొంగిపోయాడు? దీని నుండి మీరేమి నేర్చుకోవచ్చు? (బి) మిమ్మల్ని మీ తోటివారు ఏయే విధాలుగా బలవంతపెట్టవచ్చు?

4 మోషే అన్నయైన అహరోను ఒక సందర్భంలో తోటివారి ఒత్తిడికి లొంగిపోయాడు. తమకోసం ఓ దేవతను చేయమని ఇశ్రాయేలీయులు అహరోను మీదికి ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆయన వారు చెప్పినట్లే చేశాడు. అహరోను పిరికివాడేమీ కాదు. అంతకుముందు ఆయన, ఐగుప్తు దేశంలో అత్యంత శక్తివంతుడైన ఫరోను ఎదుర్కోవడానికి మోషేతో పాటు వెళ్లాడు. ఫరో ముందు దేవుని సందేశాన్ని ఆయన ధైర్యంగా ప్రకటించాడు. కానీ, తోటి ఇశ్రాయేలీయులు తన మీదికి ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మాత్రం ఆయన లొంగిపోయాడు. తోటివారి ఒత్తిడి ఒక వ్యక్తిని ఎంతగా ప్రభావితం చేస్తుందో కదా! ఐగుప్తు రాజైన ఫరోను ఎదుర్కోవడం కన్నా తన తోటివారి ఒత్తిడిని ఎదుర్కోవడం అహరోనుకు కష్టమనిపించింది.—నిర్గ. 7:1, 2; 32:1-4.

5 తోటివారి ఒత్తిడి యౌవనస్థులకే పరిమితం కాదని లేదా చెడు చేయాలనుకునేవారికి మాత్రమే ఎదురయ్యే సమస్య కాదని అహరోను ఉదాహరణను చూస్తే తెలుస్తోంది. తోటివారి ఒత్తిడి మీతో సహా, సరైనది చేయాలని నిజంగా కోరుకునే వారిమీద కూడా ప్రభావం చూపించవచ్చు. ఓ సాహసం చేయమని చెప్పడం ద్వారా, నిందించడం ద్వారా లేదా ఎగతాళి చేయడం ద్వారా మీరు తప్పు చేసేలా మీ తోటివారు మిమ్మల్ని బలవంతపెట్టవచ్చు. తోటివారి ఒత్తిడి ఏ రూపంలో వచ్చినా, దాన్ని ఎదుర్కోవడం కష్టమే. దాన్ని ఎదిరించడంలో విజయం సాధించాలంటే, మొదటిగా మీరు మీ నమ్మకాల విషయంలో విశ్వాసాన్ని పెంచుకోవాలి.

‘మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటూ ఉండండి’

6, 7. (ఎ) మీ నమ్మకాలు సరైనవేనని బలంగా విశ్వసించడం ఎందుకు ప్రాముఖ్యం? మీరు దాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు? (బి) మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మీరు ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?

6 తోటివారి ఒత్తిడిని ఎదిరించాలంటే మొదటిగా మీ నమ్మకాలు, ప్రమాణాలు సరైనవని మీరు బలంగా విశ్వసించాలి. (2 కొరింథీయులు 13:5 చదవండి.) మీరు స్వతహాగా పిరికివారైనా మీకు అలాంటి బలమైన విశ్వాసముంటే ధైర్యంగా ఉండగలుగుతారు. (2 తిమో. 1:7, 8) ఒకవేళ ఒక వ్యక్తి స్వతహాగా ధైర్యవంతుడైనా, ఒక విషయంపై పూర్తి నమ్మకం లేకపోతే దాన్ని చేయడం ఆయనకు కష్టమౌతుంది. మీరు బైబిలు నుండి నేర్చుకున్న విషయాలు సత్యమని పరీక్షించి తెలుసుకోండి. ప్రాథమిక విషయాలతో మొదలుపెట్టండి. ఉదాహరణకు, మీకు దేవునిపై నమ్మకం ఉంది, దేవుడు ఉన్నాడని తాము ఎందుకు నమ్ముతారో ఇతరులు చెప్పడాన్ని కూడా మీరు విన్నారు. అయితే, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘దేవుడు ఉన్నాడని నేను ఎందుకు నమ్ముతున్నాను?’ మీలో అనుమానాలు కలగజేసుకోవడానికి కాదుగానీ మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికే ఆ ప్రశ్న వేసుకోండి. అలాగే, ఈ ప్రశ్నలు కూడా వేసుకోండి: ‘లేఖనాలు దైవ ప్రేరేపితమని నాకెలా తెలుసు?’ (2 తిమో. 3:16, 17) ‘ఇవి “అంత్యదినము[లు]” అని నేను ఎందుకు నమ్ముతున్నాను?’ (2 తిమో. 3:1-5) ‘యెహోవా ప్రమాణాలు నా మంచి కోసమేనని నేను ఎందుకు నమ్ముతున్నాను?’—యెష. 48:17, 18.

7 మీ దగ్గర జవాబు ఉండదేమో అనే భయంతో అలాంటి ప్రశ్నలు వేసుకోవడానికి మీరు సంకోచిస్తుండవచ్చు. దాన్ని ఒక ఉదాహరణతో పోల్చవచ్చు. మీ బైక్‌ మీద ఉండే ఇంధనపు ముల్లు ఇంధనం “అయిపోయినట్లు” చూపిస్తుందేమోననే భయంతో మీరు దాన్ని చూడడానికి సంకోచిస్తారా? ట్యాంకులో ఇంధనం అయిపోతే, దానికోసం మీరు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆ ముల్లును చూడడం అవసరం. అదేవిధంగా, మీ విశ్వాసాన్ని బలపర్చుకోవాలంటే మీ విశ్వాసంలోని లోపాలను గుర్తించడం అవసరం.—అపొ. 17:11.

8. జారత్వానికి దూరంగా ఉండమనే దేవుని ఆజ్ఞను పాటించడం జ్ఞానయుక్తమనే మీ నమ్మకాన్ని మీరు ఎలా బలపర్చుకోవచ్చో వివరించండి.

8 ఓ ఉదాహరణను పరిశీలించండి. “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అని బైబిలు మీకు చెబుతోంది. ‘నేను ఆ ఆజ్ఞను పాటించడం ఎందుకు జ్ఞానయుక్తం?’ అని ప్రశ్నించుకోండి. మీ తోటివారు అలాంటి ప్రవర్తనకు పాల్పడడానికి గల కారణాలన్నిటి గురించి ఆలోచించండి. జారత్వం చేసే వ్యక్తి, “తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు” అని చెప్పడానికి గల వివిధ కారణాల గురించి కూడా ఆలోచించండి. (1 కొరిం. 6:18) ఇప్పుడు ఆ కారణాలను పరిశీలించి, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘ఎలాంటి ప్రవర్తన శ్రేష్ఠమైనది? లైంగిక దుర్నీతికి పాల్పడడం వల్ల నిజంగా ఏమైనా మంచి జరుగుతుందా?’ ఆ విషయం గురించి మరింత ఆలోచించడానికి ఈ ప్రశ్న కూడా వేసుకోండి: ‘నేను లైంగిక అనైతికతకు పాల్పడితే నాలో ఎలాంటి భావాలు కలుగుతాయి?’ మొదట్లో, మీరు చేసిన పనిని మీ తోటివారు కొంతమంది ఇష్టపడవచ్చు కానీ, ఆ తర్వాత మీరు మీ తల్లిదండ్రులతో లేదా రాజ్యమందిరంలో తోటి క్రైస్తవులతో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. దేవునికి ప్రార్థించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మీకేమనిపించవచ్చు? కేవలం మీ తోటి విద్యార్థులను ప్రీతిపర్చడం కోసం, దేవుని ముందు మీకున్న పవిత్రమైన స్థానాన్ని వదిలేసుకుంటారా?

9, 10. మీ నమ్మకాలపై మీకు బలమైన విశ్వాసం ఉంటే, తోటివారితో ఉన్నప్పుడు మీరెలా మరింత దృఢంగా ఉండగలుగుతారు?

9 మీరు యుక్తవయసులో ఉన్నట్లైతే, మీ ఆలోచనా సామర్థ్యం ఎంతో ఎక్కువగా పెరిగే వయసులో మీరు ఉన్నారని చెప్పవచ్చు. (రోమీయులు 12:1, 2 చదవండి.) మీరు ఒక యెహోవాసాక్షిగా ఉండడం మీకు ఎందుకు ప్రాముఖ్యమనే విషయం గురించి ఈ వయసులోనే బాగా ఆలోచించండి. అలా ఆలోచిస్తే, మీ నమ్మకాలపై మీకున్న విశ్వాసం బలపడుతుంది. తోటివారి ఒత్తిడి ఎదురైనప్పుడు, మీరు ఏమాత్రం సంకోచించకుండా గట్టి విశ్వాసంతో వారికి జవాబివ్వగలుగుతారు. యౌవనస్థురాలైన ఒక క్రైస్తవ సహోదరి ఇలా అంది: “నాకు తోటివారి ఒత్తిడి ఎదురైనప్పుడు, నా నమ్మకాల గురించి వారికి చెబుతాను. ‘పేరుకు’ మాత్రమే నేను ఈ ‘మతంలో’ లేను. నా ఆలోచనలు, లక్ష్యాలు, నైతిక విలువలు, నా జీవితం అన్నీ నా మతం ప్రకారమే ఉంటాయి.” మీరు కూడా ఖచ్చితంగా ఆ సహోదరిలాగే అనుకుంటారు.

10 సరైనదని మీకు తెలిసిన దాని విషయంలో మీరు దృఢంగా ఉండాలంటే ఎంతో కృషి అవసరం. (లూకా 13:24) అసలు అలా కృషి చేయడం వల్ల ఏదైనా మంచి జరుగుతుందా అని మీకు అనిపించవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. సరైనది చేయాలనే మీ నిర్ణయం విషయంలో మీరు చింతిస్తున్నట్లు లేదా సిగ్గుపడుతున్నట్లు మీ తోటివారికి అనిపిస్తే వారు మిమ్మల్ని మరింత ఒత్తిడి చేయవచ్చు. కానీ, మీరు బలమైన విశ్వాసంతో మాట్లాడితే, వారు ఎంత త్వరగా మిమ్మల్ని ఒత్తిడి చేయడం ఆపేస్తారో చూసి మీరు ఆశ్చర్యపోతారు.—లూకా 4:12, 13 పోల్చండి.

“యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు” ధ్యానించండి

11. తోటివారి ఒత్తిడిని ఎదుర్కోవడానికి సిద్ధపడడం ఎందుకు ప్రయోజనకరం?

11 తోటివారి ఒత్తిడిని ఎదిరించాలంటే మీరు మరో ముఖ్యమైన పని చేయాలి. అదేమిటంటే, ముందుగా సిద్ధపడడం. (సామెతలు 15:28 చదవండి.) దీనికి మీరు, తలెత్తగల పరిస్థితుల గురించి ముందుగా ఆలోచించాలి. మనం ముందుగా చేసే ఒక చిన్న ఆలోచన వల్ల తోటివారి నుండి ఓ పెద్ద ఒత్తిడి రాకుండా చూసుకోగలుగుతాం. ఉదాహరణకు, కొంచెం దూరంలో మీ తోటి విద్యార్థులు సిగరెట్‌ తాగడాన్ని మీరు చూశారనుకోండి. వారు మీకు ఓ సిగరెట్‌ ఇచ్చే అవకాశం ఉందా? తలెత్తగల సమస్య గురించి ఆలోచించి మీరు ఏమి చేయవచ్చు? సామెతలు 22:3 ఇలా చెబుతోంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.” బహుశా మీరు వెళ్లే దారి మార్చుకుంటే, అసలు మీకు ఏ సమస్య రాకపోవచ్చు. అది పిరికితనంతో చేసే పని కాదుగానీ తెలివైన పని.

12. మీకు తోటివారి ఒత్తిడి ఎదురైనప్పుడు మీరు ఎలా జవాబు చెబితే మంచిది?

12 పైన చెప్పిన పరిస్థితిని మీరు తప్పించుకోలేకపోతే అప్పుడేమిటి? మిమ్మల్ని అనుమానిస్తూ, మీ తోటివారు ఇలా అడగవచ్చు: “ఇప్పటివరకు నీకు బాయ్‌ఫ్రెండ్‌ లేడా/గర్ల్‌ఫ్రెండ్‌ లేదా?” దీనికి జవాబు చెబుతున్నప్పుడు కొలొస్సయులు 4:6లోని ఉపదేశాన్ని పాటించడం మంచిది. అక్కడిలా ఉంది: “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” ఈ లేఖనం సూచిస్తున్నట్లుగా, అలాంటి ప్రశ్నకు ఎలా జవాబివ్వాలనేది పరిస్థితులనుబట్టి మారుతుంది. బహుశా మీరు ఓ బైబిలు ప్రసంగం ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ, దృఢంగా ఇచ్చే ఓ చిన్న జవాబు సరిపోవచ్చు. ఉదాహరణకు, మీరు ఆ ప్రశ్నకు “లేడు/లేదు” అని గానీ “అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం” అని గానీ జవాబు ఇవ్వవచ్చు.

13. తోటివారు అడిగే ఒకానొక ప్రశ్నకు జవాబు చెప్పేటప్పుడు వివేచనను ఉపయోగించడం ఎందుకు ప్రాముఖ్యం?

13 ఎక్కువ మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం ఉండదని అనిపించిన సందర్భాల్లో యేసు క్లుప్తంగా జవాబిచ్చాడు. హేరోదు తనను ప్రశ్నించినప్పుడైతే యేసు అసలు జవాబేమీ చెప్పలేదు. (లూకా 23:8, 9) అగౌరవంతో వేసే ప్రశ్నలకు అసలు జవాబు చెప్పకపోవడమే మంచిది. (సామె. 26:4; ప్రసం. 3:1, 7) ఉదాహరణకు, లైంగికంగా పవిత్రంగా ఉండడం గురించి మీ తోటివారు ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకుందాం. ముందు వారు మీ గురించి తప్పుగా మాట్లాడినప్పటికీ, మీ నమ్మకాలను చూసి నిజాయితీగానే ఆ ప్రశ్న వేశారని మీకు అనిపించవచ్చు. (1 పేతు. 4:4) ఆ సందర్భంలో, మీ బైబిలు ఆధారిత నమ్మకాల గురించి వివరంగా చెప్పాల్సిరావచ్చు. అలాగైతే, భయంతో వెనకడుగు వేయకండి. “సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా” ఉండండి.—1 పేతు. 3:15.

14. కొన్ని సందర్భాల్లో తోటివారి ఒత్తిడిని మీరెలా యుక్తిగా తిప్పికొట్టవచ్చు?

14 కొన్ని సందర్భాల్లో మీకు ఎదురయ్యే ఒత్తిడిని మీరు తిప్పికొట్టవచ్చు. అయితే, అలా చేసేటప్పుడు యుక్తిగా ప్రవర్తించాలి. ఉదాహరణకు, మీ తోటి విద్యార్థి మీకు సిగరెట్‌ చూపించి, ధైర్యం ఉంటే తాగు అని చెబుతూ దాన్ని మీకిచ్చాడనుకోండి. అప్పుడు మీరు, “నాకు వద్దు” అని చెప్పి, “నువ్వు అసలు సిగరెట్‌ తాగవనుకున్నానే” అని అతనితో అనవచ్చు. అలా చేయడం ద్వారా, మీకు ఎదురైన ఒత్తిడిని మీరు ఎలా తిప్పికొట్టారో గమనించారా? మీరు సిగరెట్‌ ఎందుకు తాగరో వివరించే బదులు మీ తోటి విద్యార్థి అసలు తాను ఎందుకు తాగుతున్నాడో ఆలోచించుకునేలా చేస్తారు.

15. మీ మీదికి ఒత్తిడి తీసుకువచ్చేవారి దగ్గరనుండి వెళ్లిపోవడం ఎప్పుడు మంచిది? ఎందుకు?

15 మీరెంత ప్రయత్నించినా ఒత్తిడి పెరుగుతుంటే అప్పుడేమిటి? అలాంటి సమయంలో అక్కడ నుండి వెళ్లిపోవడమే మంచిది. మీరు ఎంత ఎక్కువసేపు అక్కడ ఉంటే రాజీపడే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, అక్కడినుండి వెళ్లిపోండి. ఓడిపోయామనే భావన లేకుండా మీరు వెళ్లిపోవచ్చు. నిజానికి, అలా చేసి మీరు పరిస్థితిని మీ చేతుల్లోకి తీసుకున్నారు. మీరు మీ తోటివారి చేతుల్లో కీలుబొమ్మలు కాలేదు కానీ, యెహోవా హృదయాన్ని సంతోషపెట్టారు.—సామె. 27:11.

‘లాభకరమైన యోచనలు’ చేయండి

16. క్రైస్తవులమని చెప్పుకునే కొంతమంది నుండి ఎలా ఒత్తిడి రావచ్చు?

16 కొన్నిసార్లు, యెహోవాను సేవిస్తున్నామని చెప్పుకునే యౌవనస్థులే ఏదైనా తప్పు చేసేలా మీపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఉదాహరణకు, అలాంటి యౌవనస్థులు ఏర్పాటు చేసిన పార్టీకి మీరు వెళ్లారనుకోండి. అక్కడికి వెళ్లి చూసే సరికి అది పెద్దవాళ్ల పర్యవేక్షణలో జరగడం లేదని తెలిస్తే మీరేమి చేస్తారు? లేదా క్రైస్తవుణ్ణని చెప్పుకునే వ్యక్తి ఒక పార్టీలోకి మద్యం తీసుకొచ్చాడు, కానీ మీతో సహా అక్కడున్న ఇతర యౌవనస్థులంతా తాగే వయసు లేనివాళ్లే. అప్పుడు మీరేమి చేస్తారు? మీరు మీ బైబిలు శిక్షిత మనస్సాక్షి చెప్పేది వినాల్సిన సందర్భాలు ఎన్నో తలెత్తవచ్చు. 16 ఏళ్ల ఓ క్రైస్తవ సహోదరి ఇలా అంది: “మేము సినిమా మధ్యలోనే బయటకు వచ్చేశాం. ఎందుకంటే అందులో ఎక్కువ శాతం చెడ్డ మాటలే ఉన్నాయి. కానీ మాతో ఆ సినిమాకు వచ్చిన ఇతరులు మాత్రం సినిమా మొత్తం చూడాలని నిర్ణయించుకున్నారు. మేము చేసిన పనికి మా అమ్మానాన్నలు మమ్మల్ని మెచ్చుకున్నారు. కానీ, తాము చెడ్డవాళ్లలా కనిపించేలా చేశామని మాతో సినిమాకు వచ్చినవారికి మామీద కోపమొచ్చింది.”

17. ఏదైనా పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు, మీరు దేవుని ప్రమాణాలను పాటించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?

17 పై అనుభవం చూపిస్తున్నట్లుగా, మీ బైబిలు శిక్షిత మనస్సాక్షి చెప్పినట్లు చేస్తే, కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ, సరైనదని మీకు తెలిసిన దాన్నే చేయండి. దానికోసం ముందుగానే సిద్ధపడండి. మీరు ఒకవేళ ఏదైనా పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు, అక్కడి పరిస్థితి మీరు ఊహించినట్లు లేకపోతే బయటకు వచ్చే మార్గం గురించి ముందుగానే ఆలోచించుకోండి. ఇంటికి త్వరగా వచ్చేందుకు కొంతమంది యౌవనస్థులు, తమ తల్లిదండ్రులు తమకు ఫోను చేసేలా ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు. (కీర్త. 26:4, 5) అలాంటి “యోచనలు లాభకరములు.”—సామె. 21:5.

“నీ యౌవనమందు సంతోషపడుము”

18, 19. (ఎ) మీరు సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడనే నమ్మకాన్ని మీరెందుకు కలిగివుండవచ్చు? (బి) తోటివారి ఒత్తిడిని ఎదిరించే వారి గురించి యెహోవా ఎలా భావిస్తాడు?

18 జీవితాన్ని ఆనందించేలా యెహోవా మిమ్మల్ని సృష్టించాడు. మీరు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (ప్రసంగి 11:9 చదవండి.) మీ తోటివారిలో చాలామంది అనుభవించేది కేవలం ‘అల్పకాల పాపభోగము’ అని గుర్తుంచుకోండి. (హెబ్రీ. 11:24-26) కానీ, మీరు అంతకన్నా మెరుగైనదాన్ని అనుభవించాలని సత్య దేవుడు కోరుకుంటున్నాడు. మీరు నిత్యం సంతోషంగా ఉండాలన్నదే ఆయన కోరిక. కాబట్టి, దేవుని దృష్టిలో తప్పని మీకు తెలిసిన దాన్ని చేయాలనే శోధన మీకు ఎదురైనప్పుడు, యెహోవా మీ నుండి కోరేదాన్ని చేస్తే మీకు భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని గుర్తుంచుకోండి.

19 యౌవనస్థులారా, మీ తోటివారు చెప్పినట్లు చేస్తే వారు ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడవచ్చు కానీ, ఏళ్లు గడిచాక వారిలో చాలామందికి అసలు మీ పేరు కూడా గుర్తుండకపోవచ్చని తెలుసుకోండి. కానీ, మీరు వారి నుండి వచ్చే ఒత్తిడిని ఎదిరిస్తే యెహోవా దాన్ని గమనించి మిమ్మల్ని, మీరు చూపించిన విశ్వాసాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాడు. ఆయన “ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా” మీమీద ‘దీవెనలను కుమ్మరిస్తాడు.’ (మలా. 3:10) అంతేకాక, బలహీనంగా ఉన్నారని మీకు అనిపించినప్పుడు యెహోవా తన పరిశుద్ధాత్మను మీకు ధారాళంగా ఇస్తాడు. తోటివారి ఒత్తిడిని ఎదిరించేందుకు యెహోవా మీకు తప్పక సహాయం చేయగలడు.

మీకు జ్ఞాపకమున్నాయా?

• తోటివారి ఒత్తిడి ఎలాంటి ప్రభావం చూపించగలదు?

• తోటివారి ఒత్తిడిని ఎదిరించడానికి బలమైన విశ్వాసం ఎందుకు ప్రాముఖ్యం?

• తోటివారి ఒత్తిడిని ఎదిరించేందుకు మీరెలా సిద్ధపడవచ్చు?

• మీరు చూపించే విశ్వాసాన్ని యెహోవా విలువైనదిగా ఎంచుతాడని మీకెలా తెలుసు?

[అధ్యయన ప్రశ్నలు]

[8వ పేజీలోని చిత్రం]

అహరోను బంగారు దూడను చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడు?

[10వ పేజీలోని చిత్రం]

ముందుగా సిద్ధపడండి—ఏమి చెప్పాలో ముందే నిర్ణయించుకోండి