కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనస్థులారా, మీ జీవితంలో మీరేమి చేస్తారు?

యౌవనస్థులారా, మీ జీవితంలో మీరేమి చేస్తారు?

యౌవనస్థులారా, మీ జీవితంలో మీరేమి చేస్తారు?

“గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు.”—1 కొరిం. 9: 27.

1, 2. పెద్దవారౌతుండగా మీరు సఫలులవ్వాలంటే మీకు ఏమి అవసరం?

 మీకు తెలియని ప్రాంతం గుండా మీరు ప్రయాణిస్తున్నట్లైతే మీతో పాటు ఓ మ్యాపును, దిక్సూచిని తీసుకువెళ్లాలని మీరనుకోవచ్చు. మ్యాపు వల్ల, ప్రయాణంలో మీరు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారో తెలుసుకోగలుగుతారు, సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతారు. దిక్సూచి వల్ల, మీరు ఎంచుకున్న మార్గంలో వెళ్లగలుగుతారు. అయితే, మీ గమ్యం ఏదో మీకు తెలియకపోతే, ఆ రెండిటి వల్ల అంత ఉపయోగమేమీ ఉండదు. ఎక్కడకు వెళ్లాలో స్పష్టంగా తెలిస్తే మనం ఊరికే అటూఇటూ తిరగము.

2 పెద్దవారౌతుండగా మీరు కూడా పైన చెప్పిన లాంటి పరిస్థితినే ఎదుర్కొంటారు. అయితే, మీరు ఆధారపడదగిన ఓ మ్యాపు, ఓ దిక్సూచి మీకు ఉన్నాయి. బైబిలు, సరైన మార్గాన్ని ఎంచుకునేందుకు సహాయం చేసే మ్యాపు లాంటిది. (సామె. 3:5, 6) మీ మనస్సాక్షికి మంచి శిక్షణను ఇస్తే, మీరు సరైన మార్గంలో వెళ్తూ ఉండేందుకు అది దిక్సూచిలా పనిచేస్తుంది. (రోమా. 2:15) జీవితంలో మీరు సఫలులవ్వాలంటే మీ గమ్యం ఏమిటో మీకు తెలిసుండాలి. అంతేకాక, మీకు స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి.

3. జీవితంలో లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయని 1 కొరింథీయులు 9:26, 27లో పౌలు రాశాడు?

3 జీవితంలో లక్ష్యాలను పెట్టుకొని, వాటిని చేరుకునేందుకు కృషి చేస్తే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో పౌలు చెప్పాడు. ఆయనిలా రాశాడు: “నేను గురి చూడనివానివలె పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు.” (1 కొరిం. 9:26, 27) మీకు లక్ష్యాలు ఉన్నట్లైతే గురి చూసి పరుగెత్తగలుగుతారు. త్వరలోనే మీరు మీ జీవితంలో ఆరాధన, ఉద్యోగం, వివాహం, కుటుంబం వంటివాటికి సంబంధించి కొన్ని ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు, మిమ్మల్ని తికమకపెట్టే అవకాశాలెన్నో మీ ముందు ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. కానీ, మీరు సరైన మార్గాన్ని ముందుగానే ఎంచుకున్నట్లైతే తప్పుడు మార్గంలో వెళ్లరు. అయితే, మీ నిర్ణయాలు దేవుని వాక్యంలోని సత్యాలపై, సూత్రాలపై ఆధారపడి ఉండాలి.—2 తిమో. 4:4, 5.

4, 5. (ఎ) మీకోసం మీరు లక్ష్యాలను పెట్టుకోకపోతే ఏమి జరగవచ్చు? (బి) జీవితంలో మీరు చేసుకునే ఎంపికలు దేవుణ్ణి సంతోషపెట్టాలనే కోరిక చేత ఎందుకు నిర్దేశించబడాలి?

4 మీకోసం మీరు లక్ష్యాలను పెట్టుకోకపోతే మీ తోటివారు, మీ టీచర్లు మీకు ఫలానిది మంచిదని చెప్పి తమ అభిరుచుల్ని మీపై రుద్దవచ్చు. కొన్నిసార్లు మీకు స్పష్టమైన లక్ష్యాలున్నా, కొందరు తమ అభిప్రాయాలను చెబుతుండవచ్చు. వారిచ్చే సలహాలను వింటున్నప్పుడు, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘వారు ప్రస్తావించే లక్ష్యాలు, యౌవన కాలంలో నా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడానికి నాకు సహాయం చేస్తాయా? లేక నన్ను పక్కదారి పట్టిస్తాయా?’—ప్రసంగి 12:1, 2 చదవండి.

5 జీవితంలో మీరు చేసుకునే ఎంపికలు దేవుణ్ణి సంతోషపెట్టాలనే కోరిక చేత ఎందుకు నిర్దేశించబడాలి? ఒక కారణమేమిటంటే, ప్రస్తుతం మనకున్న ప్రతీ మంచిదాన్ని యెహోవాయే ఇచ్చాడు. (యాకో. 1:17) కృతజ్ఞత చూపించే విషయంలో ప్రతీ ఒక్కరూ యెహోవాకు రుణపడివున్నారు. (ప్రక. 4:10, 11) మీరు లక్ష్యాలను ఏర్పరచుకునేటప్పుడు యెహోవాను మనసులో ఉంచుకోవాలి. ఆయనపట్ల మీకున్న కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి అంతకన్నా మంచి మార్గమేదైనా ఉందంటారా? అయితే, ఏ లక్ష్యాలను పెట్టుకుంటే మీరు ప్రయోజనం పొందుతారో, వాటిని చేరుకోవడానికి మీరేమి చేయాలో ఇప్పుడు పరిశీలిద్దాం.

మీరు ఏ లక్ష్యాలను పెట్టుకోవచ్చు?

6. మీరు ఏ ప్రాథమిక లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు? ఎందుకు?

6 ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడినట్లు, బైబిల్లోని విషయాలు సత్యమని పరీక్షించి తెలుసుకోవడాన్ని మీ ప్రాథమిక లక్ష్యంగా చేసుకోవచ్చు. (రోమా. 12:2; 2 కొరిం. 13:5) మీ తోటివారు పరిణామ సిద్ధాంతాన్ని లేదా ఇతర అబద్ధ మత సిద్ధాంతాలను నమ్ముతుండవచ్చు. ఎందుకంటే వాటినే నమ్మాలని ఇతరులు వారికి చెప్పారు. మీరైతే, ఇతరులు చెప్పారు కదా అని దేనినీ నమ్మాల్సిన అవసరం లేదు. మీరు మీ పూర్ణ మనస్సుతో తనను సేవించాలని యెహోవా కోరుతున్నాడని గుర్తుంచుకోండి. (మత్తయి 22:36, 37 చదవండి.) రుజువులపై ఆధారపడిన విశ్వాసాన్ని మీరు పెంపొందించుకోవాలని మన పరలోక తండ్రి కోరుకుంటున్నాడు.—హెబ్రీ. 11:1.

7, 8. (ఎ) మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మీరు ఏ స్వల్పకాల లక్ష్యాలను పెట్టుకోవచ్చు? (బి) కొన్ని స్వల్పకాల లక్ష్యాలను చేరుకోవడం వల్ల మీరు ఏ ప్రయోజనం పొందుతారు?

7 మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడం కోసం, మీరు చేరుకోగలిగే స్వల్పకాల లక్ష్యాలను పెట్టుకోండి. మొదటిగా, ప్రతీరోజు ప్రార్థించాలనే లక్ష్యాన్ని మీరు పెట్టుకోవచ్చు. మీ ప్రార్థనలు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా, నిర్దిష్టమైనవిగా ఉండాలంటే మీ ప్రార్థనలో చేర్చగలిగేలా ఆ రోజులో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు పెట్టుకోవచ్చు లేదా వాటిని రాసి పెట్టుకోవచ్చు. మీకు ఎదురైన సవాళ్ల గురించే కాక, మీకు సంతోషాన్నిచ్చిన విషయాల గురించి కూడా ప్రార్థించడం మరచిపోకండి. (ఫిలి. 4:6) రెండవదిగా, ప్రతీరోజు బైబిలు చదవాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. మీరు రోజుకు దాదాపు నాలుగు పేజీలు చదివితే ఒక సంవత్సరంలోనే మొత్తం బైబిలును పూర్తి చేయగలరని మీకు తెలుసా? a కీర్తన 1:2 ఇలా చెబుతోంది: “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.”

8 మూడవదిగా, ప్రతీ సంఘ కూటంలో ఒక జవాబు చెప్పేందుకు సిద్ధపడాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. మొదట్లో మీరు జవాబును గానీ, లేఖనాన్ని గానీ చదవాలనుకోవచ్చు. ఆ తర్వాత, మీ సొంత మాటల్లో జవాబు చెప్పాలనే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. నిజానికి, మీరు జవాబు చెప్పిన ప్రతీసారి యెహోవాకు ఓ కానుకను అర్పిస్తారు. (హెబ్రీ. 13:15) మీరు ఈ స్వల్పకాల లక్ష్యాల్లో కొన్నింటిని చేరుకున్నారంటే, మీ ఆత్మవిశ్వాసం, యెహోవా పట్ల మీకున్న కృతజ్ఞత పెరుగుతాయి. ఆ తర్వాత మీరు దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు.

9. మీరింకా రాజ్య ప్రచారకులు కానట్లైతే, ఎలాంటి దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకోవచ్చు?

9 మీరు ఏ దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకోవచ్చు? మీరు ఇంకా ప్రకటనాపనిలో పాల్గొనడం మొదలుపెట్టకపోతే, రాజ్య ప్రచారకులవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. గౌరవప్రదమైన ఈ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, మీరు ప్రకటనా పనిలో క్రమంగా పాల్గొనాలనీ మంచి ఫలితాలు సాధించాలనీ ఒక్క నెల కూడా ప్రకటనా పని చేయకుండా ఉండకూడదనీ అనుకుంటారు. పరిచర్యలో బైబిలును ఉపయోగించడాన్ని కూడా నేర్చుకోవాలనుకుంటారు. మీరలా చేస్తే, ప్రకటనా పనిలో మరింత సంతోషాన్ని పొందుతున్నారని మీరు గుర్తించవచ్చు. ఆ తర్వాత, మీరు ఇంటింటి పరిచర్యలో మరింత సమయాన్ని వెచ్చించడానికి లేదా ఒక బైబిలు అధ్యయనాన్ని నిర్వహించడానికి ప్రయత్నించవచ్చు. బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులుగా, బాప్తిస్మానికి అర్హత సంపాదించుకొని యెహోవా సమర్పిత సేవకులుగా తయారవ్వాలనే లక్ష్యం కన్నా మెరుగైనది మరొకటి ఉందా?

10, 11. బాప్తిస్మం తీసుకున్న యౌవనస్థులు ఏ దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకోవచ్చు?

10 మీరిప్పటికే బాప్తిస్మం తీసుకున్న యెహోవా సేవకులైతే, మీరు చేరుకోగల దీర్ఘకాలిక లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు, అరుదుగా ప్రకటించిన ప్రాంతంలో ప్రకటించేందుకు మీరు అప్పుడప్పుడు వేరే సంఘాలకు సహాయం చేయాలనుకోవచ్చు. అంతేకాక మీకున్న బలాన్ని, మంచి ఆరోగ్యాన్ని సహాయ పయినీరు సేవ కోసం లేదా క్రమ పయినీరు సేవ కోసం ఉపయోగించాలనుకోవచ్చు. యౌవనకాలంలో మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునేందుకు పూర్తికాల సేవే ఉత్తమమైన మార్గమని ఆ సేవలో సంతోషాన్ని అనుభవిస్తున్న వేలాది మంది పయినీర్లు చెబుతారు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఉంటూనే ఈ లక్ష్యాలను చేరుకోవచ్చు. మీరు వీటిని చేరుకోవడం వల్ల మీ స్థానిక సంఘం కూడా ప్రయోజనం పొందుతుంది.

11 అయితే, మీ స్థానిక సంఘమే కాక ఇతర సంఘాలు కూడా ప్రయోజనం పొందేందుకు మీరు సహాయం చేసేలా వేరే దీర్ఘకాలిక లక్ష్యాలు మీకు తోడ్పడతాయి. ఉదాహరణకు, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న వేరే ప్రాంతంలో లేదా దేశంలో సేవ చేసేందుకు మీరు ప్రణాళిక వేసుకోవచ్చు. రాజ్యమందిర నిర్మాణ పనిలో లేదా విదేశాల్లో బ్రాంచి వసతులను నిర్మించే పనిలో సహాయం చేయాలని మీరు అనుకోవచ్చు. బహుశా మీరు బెతెల్‌ సేవ చేయవచ్చు లేదా మిషనరీ అవ్వొచ్చు. అయితే, ఇక్కడ ప్రస్తావించబడిన దీర్ఘకాలిక లక్ష్యాల్లో చాలా వాటిని చేరుకోవాలంటే, మొదటిగా మీరు బాప్తిస్మం తీసుకోవాలి. మీరింకా బాప్తిస్మం తీసుకోనట్లైతే, మీ జీవితంలోని ఈ మైలురాయిని చేరుకోవడానికి మీరేమి చేయాలో ఇప్పుడు పరిశీలించండి.

బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యాన్ని మీరెలా చేరుకోవచ్చు?

12. కొంతమంది ఎందుకు బాప్తిస్మం తీసుకుంటారు? అయితే ఆ కారణాలు ఎందుకు సరిపోవు?

12 అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? కొంతమంది, పాపం చేయకుండా ఉండేందుకు అది తమను కాపాడుతుందని అనుకుంటారు. మరికొంతమంది, తమ తోటివారు బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి తాము కూడా తీసుకోవాల్సిందేనని అనుకుంటారు. ఇంకొంతమంది యౌవనస్థులు తమ తల్లిదండ్రులను సంతోషపెట్టడం కోసం అలా చేస్తారు. అయితే బాప్తిస్మం, మీరు రహస్యంగా చేయాలనుకునే పనులను చేయకుండా ఉండేలా మిమ్మల్ని కాపాడే ఓ ఒప్పందం కాదు లేదా ఇతరులు ఒత్తిడి చేసినందువల్ల తీసుకునే చర్య కూడా కాదు. ఒక యెహోవాసాక్షిగా ఉండడమంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకుని, ఆ బాధ్యతను తీసుకోవడానికి ఇష్టపూర్వకంగా సిద్ధపడిన తర్వాతే మీరు బాప్తిస్మం తీసుకోవాలి.—ప్రసం. 5:4, 5.

13. మీరు ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి?

13 బాప్తిస్మం తీసుకోవడానికి ఒక కారణమేమిటంటే, ‘బాప్తిస్మం ఇస్తూ శిష్యులను చేయండి’ అని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. అంతేకాక, యేసే స్వయంగా బాప్తిస్మం తీసుకుని ఈ విషయంలో మాదిరిని ఉంచాడు. (మత్తయి 28:19, 20; మార్కు 1:9 చదవండి.) రక్షణ పొందాలనుకునే వారికి బాప్తిస్మం ఓ ప్రాముఖ్యమైన చర్య. నోవహు ఒక ఓడను నిర్మించుకొని ఆయన, ఆయన కుటుంబం దానిలోకి ప్రవేశించి జలప్రళయం నుండి కాపాడబడ్డారని చెప్పిన తర్వాత, పేతురు ఇలా రాశాడు: ‘యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది.’ (1 పేతు. 3:19-21) అయితే, బాప్తిస్మం తీసుకునేది కేవలం రక్షణ పొందేందుకు మాత్రమే కాదు. బదులుగా మీరు యెహోవాను ప్రేమిస్తారు, ఆయనను మీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో, పూర్ణబలంతో సేవించాలనుకుంటారు కాబట్టే బాప్తిస్మం తీసుకుంటారు.—మార్కు 12:29, 30.

14. బాప్తిస్మం తీసుకోవడానికి కొంతమంది ఎందుకు వెనకాడతారు? కానీ మీకు ఏ అభయం ఉంది?

14 ఏదో ఒక రోజు బహిష్కరించబడతామేమో అనే భయంతో కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడతారు. మీరూ ఇలాగే భయపడుతున్నారా? అలాంటి భయం ఉండడం కొంతమట్టుకు మంచిదే. యెహోవాసాక్షిగా ఉండడమనేది ఎంత గంభీరమైన బాధ్యతో మీరు గుర్తిస్తున్నారని అది చూపిస్తుంది. ఇది కాకుండా ఇంకేదైనా కారణం ఉండవచ్చా? దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడమే సర్వోత్తమమని మీకింకా నమ్మకం కుదిరి ఉండకపోవచ్చు. అలాగైతే, బైబిలు ప్రమాణాలను పట్టించుకోనివారు ఎదుర్కొంటున్న దుష్ఫలితాల గురించి ఆలోచిస్తే మీరు ఒక నిర్ణయానికి రాగలుగుతారు. మరొకటి ఏమిటంటే, మీకు దేవుని ప్రమాణాల పట్ల ప్రేమ ఉన్నప్పటికీ వాటి ప్రకారం జీవించగలరనే నమ్మకం మీకు లేకపోవచ్చు. అలాంటి ఆలోచన మంచిదే ఎందుకంటే అది మీరు వినయస్థులని చూపిస్తుంది. నిజానికి, అపరిపూర్ణ మానవులందరి హృదయాలు మోసకరమైనవని బైబిలు చెబుతోంది. (యిర్మీ. 17:9) అయితే, మీరు ఎల్లప్పుడూ దేవుని ‘వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా’ నడుచుకున్నట్లైతే సఫలులౌతారు. (కీర్తన 119:9 చదవండి.) మీరు బాప్తిస్మం తీసుకోకపోవడానికి కారణాలు ఏవైనా, వాటి గురించి బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి రావాల్సిందే. b

15, 16. బాప్తిస్మం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఎలా తెలుసుకోవచ్చు?

15 అయితే, బాప్తిస్మం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఎలా తెలుసుకోవచ్చు? దానికోసం మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘బైబిలు ప్రాథమిక బోధల్ని నేను ఇతరులకు వివరించగలుగుతానా? నా తల్లిదండ్రులు పాల్గొననప్పుడు కూడా నేను పరిచర్యలో పాల్గొంటానా? నేను క్రైస్తవ కూటాలన్నిటికీ వెళ్లడానికి కృషి చేస్తానా? నేను తోటివారి ఒత్తిడిని ఎదిరించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నా తల్లిదండ్రులు, స్నేహితులు యెహోవాను సేవించడం మానేసినా నేను ఆయనను సేవిస్తూనే ఉంటానా? దేవునితో నాకున్న సంబంధం గురించి నేను ప్రార్థించానా? ప్రార్థనలో నేను యెహోవాకు సంపూర్ణంగా సమర్పించుకున్నానా?’

16 బాప్తిస్మం తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే, అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన నిర్ణయమని అర్థం చేసుకునేంత పరిణతిని మీరు సాధించారా? పరిణతి అంటే వేదిక పైనుండి మంచి ప్రసంగాలను ఇవ్వడం లేదా కూటాల్లో ఆకట్టుకునే వ్యాఖ్యానాలు చేయడం మాత్రమే కాదు. బైబిలు సూత్రాలను అర్థం చేసుకొని, వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘పరిణతిగలవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.’ (హెబ్రీయులు 5:14, NW) జీవితంలో మీరు ఆ స్థాయికి ఎదిగారంటే, యెహోవాకు మీరు నిజంగా సమర్పించుకున్నారని చూపించేలా జీవిస్తూ ఆయనను హృదయపూర్వకంగా సేవించే గొప్ప అవకాశం మీ ముందున్నట్లే.

17. బాప్తిస్మం తర్వాత మీకు ఎదురయ్యే పరీక్షల్ని ఎలా తట్టుకోవచ్చు?

17 బాప్తిస్మం తీసుకున్న కొత్తలో దేవుణ్ణి సేవించాలనే ఉత్సాహం మీలో ఉరకలేస్తుంది. అయితే, కొంతకాలానికే మీ విశ్వాసాన్ని, ఓర్పును పరీక్షించే పరిస్థితులు ఎదురుకావచ్చు. (2 తిమో. 3:12) ఆ పరీక్షలతో మీరు ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుందని అనుకోకండి. మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి. సంఘంలో పరిణతిగల సహోదర సహోదరీలను సంప్రదించండి. మీకు మద్దతు ఇవ్వగల వారితో స్నేహం చేయండి. యెహోవాకు మీపట్ల శ్రద్ధ ఉందనీ ఎలాంటి పరీక్షలనైనా ఎదుర్కొనేందుకు కావాల్సిన శక్తిని ఆయన మీకు ఇస్తాడనీ ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.—1 పేతు. 5:6, 7.

మీ లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చు?

18, 19. మీరు వేటికి ప్రాముఖ్యతనిస్తున్నారో పరిశీలించుకోవడం వల్ల ఎలా ప్రయోజనం పొందవచ్చు?

18 మీకు మంచి ఉద్దేశాలున్నప్పటికీ, మీరు చేయాలనుకున్న పనులను, చేయాల్సిన పనులను చేయడానికి మీకు సమయం అస్సలు సరిపోవడం లేదని మీకు అనిపిస్తోందా? అలాగైతే మీరు వేటికి ప్రాముఖ్యతనిస్తున్నారో పరిశీలించుకోండి. ఉదాహరణకు, ఓ ప్లాస్టిక్‌ బకెట్‌ తీసుకొని అందులో పెద్దపెద్ద రాళ్లను వేయండి. ఆ తర్వాత దానిలో ఇసుకను నింపండి. ఇప్పుడు బకెట్‌ రాళ్లతో, ఇసుకతో నిండివుంటుంది. మరోలా కూడా చేసి చూడండి. ఆ బకెట్‌ను ఖాళీ చేసి అదే ఇసుకను, రాళ్లను దగ్గర పెట్టుకోండి. కానీ ఈసారి, ముందు ఇసుక పోసి ఆ తర్వాత రాళ్లను వేయడానికి ప్రయత్నించండి. అయితే, రాళ్లను వేయడానికి బకెట్‌లో స్థలం సరిపోదు. ఎందుకంటే మీరు, బకెట్‌లో ముందు ఇసుక పోశారు.

19 సమయం విషయంలో కూడా మీకు అలాంటి సమస్యే ఎదురౌతుంది. వినోదం వంటి విషయాలకు మొదటి స్థానం ఇస్తే పెద్దపెద్ద విషయాలకు అంటే ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సమయం ఎన్నడూ సరిపోదు. కానీ, “మీరు శ్రేష్ఠమైన కార్యముల[కు]” ప్రాముఖ్యతనివ్వాలనే బైబిలు ఉపదేశాన్ని పాటిస్తే, రాజ్యానికి సంబంధించిన పనులకూ కొంత వినోదానికీ సమయం సరిపోతుంది.—ఫిలి. 1:9, 10.

20. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు ప్రయత్నిస్తుండగా మీలో చింతలు, సందేహాలు కలిగితే మీరేమి చేయాలి?

20 బాప్తిస్మంతో సహా మీకున్న ఇతర లక్ష్యాలను చేరుకోవడానికి మీరు ప్రయత్నిస్తుండగా కొన్నిసార్లు మీలో చింతలు, సందేహాలు కలగవచ్చు. అలా జరిగినప్పుడు, మీ ‘భారాన్ని యెహోవాపై మోపండి, ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు.’ (కీర్త. 55:22) మానవ చరిత్రలోనే అత్యంత ఉత్తేజకరమైన, ప్రాముఖ్యమైన పనిలో అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించే, బోధించే పనిలో భాగం వహించే గొప్ప అవకాశం ఇప్పుడు మీకుంది. (అపొ. 1:8) ఆ పనిని ఇతరులు చేస్తుంటే చూస్తూ ఉండాలని మీరు అనుకోవచ్చు లేదా మీరు కూడా ఆ పనిలో చురుగ్గా పాల్గొనవచ్చు. దేవుణ్ణి సేవిస్తూ ఆయన రాజ్యానికి మద్దతును ఇవ్వడంలో మీ సామర్థ్యాలను ఉపయోగించడానికి వెనకాడకండి. మీ ‘యువదశలోనే మీ సృష్టికర్తను’ సేవించడాన్ని బట్టి మీరు ఎన్నడూ బాధపడరు.—ప్రసం. 12:1, 2, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

[అధస్సూచీలు]

మీరెలా జవాబిస్తారు?

• మీరు లక్ష్యాలను ఎందుకు పెట్టుకోవాలి?

• ఏ లక్ష్యాలను చేరుకుంటే మీరు ప్రయోజనం పొందుతారు?

• బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే మీరేమి చేయాలి?

• మీరు వేటికి ప్రాముఖ్యతనిస్తున్నారో పరిశీలించుకోవడం, మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రం]

ప్రతీరోజు బైబిలు చదవాలనే లక్ష్యం మీకుందా?

[15వ పేజీలోని చిత్రం]

బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యాన్ని మీరెలా చేరుకోవచ్చు?

[16వ పేజీలోని చిత్రం]

ఈ ఉదాహరణ నుండి మీరేమి నేర్చుకోవచ్చు?