కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాయే మన సర్వాధికారి!

యెహోవాయే మన సర్వాధికారి!

యెహోవాయే మన సర్వాధికారి!

“వర్తమానభూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా [యెహోవా], సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు.”—ప్రక. 11:17.

1. మొదటి కొరింథీయులు 7:31 లో పౌలు పరోక్షంగా దేన్ని సూచించాడని తెలుస్తోంది?

 “ఈ లోకపు నటన గతించుచున్నది” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (1 కొరిం. 7:31) ఆయన లోకాన్ని నాటకం జరిగే వేదికతో పోల్చాడని తెలుస్తోంది. ఓ నాటకంలో, సన్నివేశం అయిపోయేంతవరకు పాత్రదారులు మంచివారిగా లేదా చెడ్డవారిగా తమ పాత్రలను నిర్వహిస్తారు.

2, 3. (ఎ) యెహోవా సర్వాధిపత్యానికి ఏర్పడిన సవాలును దేనితో పోల్చవచ్చు? (బి) మనం ఏ ప్రశ్నలను చర్చిస్తాం?

2 నేడు కూడా ఓ ప్రాముఖ్యమైన నాటకం నడుస్తోంది, దానిలో మన పాత్ర కూడా ఉంది. అది ప్రత్యేకంగా యెహోవా దేవుని సర్వాధిపత్యం సరైనదని నిరూపించబడడానికి సంబంధించినది. ఈ నాటకాన్ని ఒకానొక దేశంలోని పరిస్థితితో పోల్చవచ్చు. ఒకవైపు, సరైన విధంగా స్థాపించబడి చట్టాన్ని అమలుచేసే ప్రభుత్వం ఉంటే మరోవైపు మోసం, హింస, హత్యలతో కూడిన ఓ దోషపూరిత సంస్థ ఉంది. ఈ అక్రమ సంస్థ, సరైన ప్రభుత్వానికి ఓ సవాలుగా నిలిచి, ఆ ప్రభుత్వం పట్ల పౌరులకున్న యథార్థతను పరీక్షిస్తుంది.

3 విశ్వస్థాయిలో కూడా నేడు అలాంటి పరిస్థితే ఉంది. ఒకవైపు ‘సర్వాధికారియైన యెహోవా’ స్థాపించిన సరైన ప్రభుత్వం ఉంది. (ప్రక. 15:3) మరోవైపు, “దుష్టుని” చేతుల్లోవున్న దోషపూరిత సంస్థ ఉంది. దాని నుండి ఇప్పుడు మానవులకు ప్రమాదం పొంచివుంది. (1 యోహా. 5:19) ఈ సంస్థ దేవుడు స్థాపించిన సరైన ప్రభుత్వానికి ఓ సవాలుగా నిలిచి, ఆయన సర్వోన్నత పరిపాలన పట్ల పౌరులకున్న యథార్థతను పరీక్షిస్తుంది. ఆ పరిస్థితి ఎలా ఏర్పడింది? దేవుడు దాన్ని ఎందుకు అనుమతించాడు? ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ ఏమి చేయవచ్చు?

నాటకంలోని అంశాలు

4. వెల్లడౌతున్న విశ్వవ్యాప్త నాటకంలో ఒకదానికొకటి సంబంధమున్న ఏ రెండు అంశాలున్నాయి?

4 వెల్లడౌతున్న విశ్వవ్యాప్త నాటకంలో ఒకదానికొకటి సంబంధమున్న ఈ రెండు అంశాలున్నాయి: యెహోవా సర్వాధిపత్యం, మానవుల యథార్థత. బైబిల్లో, ‘సర్వాధికారియైన ప్రభువు’ అని యెహోవా పిలువబడ్డాడు. ఉదాహరణకు, ప్రకటన గ్రంథం ఇలా చెబుతోంది: “వర్తమానభూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా [యెహోవా], సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు.” (ప్రక. 11:17) ‘సర్వాధిపత్యం’ అంటే అధికారం విషయంలో లేదా పరిపాలన విషయంలో ఆధిపత్యం కలిగివుండడం అని అర్థం. సర్వాధిపతి, సర్వోన్నత అధికారాన్ని కనబరుస్తాడు. యెహోవా దేవుడు మహోన్నతుడని అనడానికి ఎన్నో కారణాలున్నాయి.—దాని. 7:22.

5. యెహోవా సర్వాధిపత్యాన్ని మనం ఎందుకు సమర్థించాలి?

5 సృష్టికర్తగా యెహోవా దేవుడు ఈ భూమికేకాక, విశ్వమంతటికీ సర్వాధిపతి. (ప్రకటన 4:10, 11 చదవండి.) యెహోవా మన న్యాయాధిపతి, శాసనకర్త, రాజు కూడా. (యెష. 33:22) మనల్ని సృష్టించినందుకు ఆయనకు రుణపడివున్నాం, ఆయన మీద ఆధారపడివున్నాం. కాబట్టి, ఆయనను మన సర్వాధికారిగా ఎంచాలి. “యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలన చేయుచున్నాడు” అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే ఆయనకున్న సర్వోన్నత స్థానాన్ని సమర్థిస్తాం.—కీర్త. 103:19; అపొ. 4:24.

6. యథార్థత అంటే ఏమిటి?

6 యెహోవా సర్వాధిపత్యానికి మద్దతునివ్వాలంటే ఆయన పట్ల మనకున్న యథార్థతను కాపాడుకోవాలి. “యథార్థత” అంటే నైతిక పవిత్రత లేక సంపూర్ణత అని అర్థం. యథార్థతను చూపించే వ్యక్తి నిందారహితునిగా, న్యాయవంతునిగా ఉంటాడు. పూర్వీకుడైన యోబు అలాంటి వ్యక్తే.—యోబు 1:1.

నాటకం ఎలా మొదలైంది?

7, 8. యెహోవా సర్వాధిపత్యపు హక్కును సాతాను ఎలా సవాలు చేశాడు?

7 ఆరువేల కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం, ఒక ఆత్మప్రాణి యెహోవా సర్వాధిపత్యపు హక్కును సవాలు చేశాడు. ప్రజలు తనను ఆరాధించాలనే స్వార్థపూరిత కోరిక వల్ల అతడు తిరుగుబాటు చేశాడు. యెహోవా అబద్ధమాడాడని చెప్పి మొదటి మానవజతయైన ఆదాముహవ్వలను యెహోవా సర్వాధిపత్యానికి తిరుగుబాటు చేసేలా అతడు ప్రేరేపించాడు. అంతేకాక, యెహోవా నామానికి కళంకం తెచ్చేందుకు ప్రయత్నించాడు. (ఆదికాండము 3:1-5 చదవండి.) ఆ తిరుగుబాటుదారుడు గొప్ప శత్రువుగా, సాతానుగా (ఎదిరించువాడు), అపవాదిగా (కొండెములు చెప్పువాడు), సర్పంగా (మోసగాడు), మహాఘటసర్పంగా (మ్రింగివేయువాడు) తయారయ్యాడు.—ప్రక. 12:9.

8 సాతాను, యెహోవాకు ప్రత్యర్థ పాలకునిగా తయారయ్యాడు. అయితే, సర్వాధికారియైన యెహోవా ఇప్పుడు ఏమి చేస్తాడు? సాతానును, ఆదాముహవ్వలను వెంటనే నాశనం చేస్తాడా? ఆయనకు వారిని వెంటనే నాశనం చేసే శక్తివుంది. ఒకవేళ అలా చేసివుంటే ఆయనకు సాటిలేని శక్తి ఉందని రుజువయ్యేది. అంతేకాక, తన మాట వినకపోతే కలిగే శిక్ష విషయంలో యెహోవా నిజమే చెప్పాడని రుజువయ్యేది. అయితే యెహోవా అలా ఎందుకు చేయలేదు?

9. సాతాను దేన్ని ప్రశ్నించాడు?

9 సాతాను అబద్దమాడి, ఆదాముహవ్వలను దేవుని నుండి దూరం చేయడం ద్వారా మానవుల విధేయతను కోరే విషయంలో యెహోవాకున్న హక్కును సవాలు చేశాడు. మొదటి మానవ జతను దేవునికి తిరుగుబాటు చేసేలా ప్రేరేపించడం ద్వారా సాతాను తెలివిగల ప్రాణులందరి యథార్థతను కూడా ప్రశ్నించాడు. యెహోవా సర్వాధిపత్యానికి నమ్మకంగా ఉన్న యోబు విషయంలో సాతాను చెప్పిన మాటలను బట్టి దేవుని నుండి మానవులందరినీ దూరం చేయగలనని అతడు అనుకున్నాడని స్పష్టమౌతోంది.—యోబు 2:1-5.

10. యెహోవా తన సర్వాధిపత్యాన్ని సమర్థించుకోవడాన్ని వాయిదా వేయడం ద్వారా దేన్ని అనుమతించాడు?

10 యెహోవా తన సర్వాధిపత్యాన్ని సమర్థించుకోవడాన్ని వాయిదా వేయడం ద్వారా తన వాదనను నిరూపించుకోవడానికి సాతానుకు సమయాన్ని అనుమతించాడు. అంతేకాక, తన సర్వాధిపత్యం పట్ల యథార్థతను చూపించే అవకాశాన్ని యెహోవా మానవులకు కూడా ఇచ్చాడు. అయితే శతాబ్దాలు గడుస్తుండగా ఏమి జరిగింది? సాతాను శక్తివంతమైన ఓ దోషపూరిత సంస్థను స్థాపించాడు. యెహోవా చివరకు అపవాదిని, వాడి సంస్థను నాశనం చేసి తన సర్వాధిపత్యపు హక్కును తిరుగులేని విధంగా నిరూపించుకుంటాడు. రాబోయే మంచి ఫలితం గురించి యెహోవాకు ఎంత ఖచ్చితంగా తెలుసంటే, ఏదెనులో తిరుగుబాటు జరిగిన వెంటనే ఆయన దాని గురించి ప్రవచించాడు.—ఆది. 3:15.

11. యెహోవా సర్వాధిపత్యానికి సంబంధించి చాలామంది ఏమి చేస్తున్నారు?

11 యెహోవా సర్వాధిపత్యం విషయంలో, ఆయన నామాన్ని పరిశుద్ధపరిచే విషయంలో చాలామంది తమ విశ్వాసాన్ని, యథార్థతను కనబరిచారు. హేబెలు, హనోకు, నోవహు, అబ్రాహాము, శారా, మోషే, రూతు, దావీదు, యేసు, క్రీస్తు తొలి శిష్యులు, మన కాలంలోని లక్షలాదిమంది యథార్థపరులు వారిలో ఉన్నారు. యెహోవా నుండి మానవులందరినీ దూరం చేయగలనని ప్రగల్భాలు పలకడం ద్వారా అపవాది యెహోవా నామంపై నిందలు మోపాడు. ఆ నిందలను తీసివేయడంలో, సాతాను అబద్ధికుడని రుజువు చేయడంలో యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించేవారు భాగం వహిస్తున్నారు.—సామె. 27:11.

నాటకం ఎలా ముగుస్తుందో మనకు తెలుసు

12. యెహోవా దుష్టత్వాన్ని నిరంతరం సహించడని మనం ఎందుకు నమ్మవచ్చు?

12 యెహోవా త్వరలోనే తన సర్వాధిపత్యాన్ని నిరూపించుకుంటాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. ఆయన దుష్టత్వాన్ని ఎల్లకాలం సహించడు, అంతేకాదు మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని మనకు తెలుసు. నోవహు జలప్రళయమప్పుడు యెహోవా దుష్టులపై చర్య తీసుకున్నాడు. సొదొమ గొమొఱ్ఱాలను, ఫరోనూ అతని సైన్యాన్నీ ఆయన నాశనం చేశాడు. సీసెరా అతని సేన, సన్హెరీబు అతని అష్షూరు దండు మహోన్నతుని ముందు విజయం సాధించలేకపోయారు. (ఆది. 7:1, 23; 19:24, 25; నిర్గ. 14:30, 31; న్యాయా. 4:15, 16; 2 రాజు. 19:35, 36) అయితే, తన నామానికి వచ్చే అవమానాన్ని, తన సాక్షులపై వచ్చే హింసలను యెహోవా నిరంతరం సహించడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. అంతేకాక, యేసు ప్రత్యక్షతకు, ఈ దుష్ట విధానాంతానికి సూచనలను నేడు మనం చూస్తున్నాం.—మత్త. 24:3.

13. యెహోవా శత్రువులతో పాటు నాశనం కాకుండా మనమెలా తప్పించుకోవచ్చు?

13 దేవుని శత్రువులతోపాటు నాశనం కాకుండా ఉండాలంటే మనం యెహోవా సర్వాధిపత్యానికి నమ్మకంగా ఉన్నామని నిరూపించుకోవాలి. దాన్ని మనమెలా చేయవచ్చు? సాతాను దోషపూరిత పరిపాలనకు వేరుగా ఉండడం ద్వారా, అతని ప్రతినిధుల బెదిరింపులకు లొంగిపోకుండా ఉండడం ద్వారా అలా చేయవచ్చు. (యెష. 52:11; యోహా. 17:16; అపొ. 5:29) మనం సాతాను పరిపాలన నుండి వేరుగా ఉంటేనే మన పరలోక తండ్రి సర్వాధిపత్యాన్ని సమర్థించగలుగుతాం. అంతేకాక, యెహోవా తన నామం మీదికి వచ్చిన నిందను తీసివేసి, తన సర్వాధిపత్యాన్ని రుజువు చేసుకున్నప్పుడు మనం తప్పించబడే అవకాశం ఉంటుంది.

14. బైబిల్లోని వివిధ భాగాల్లో ఏ విషయాలు వెల్లడి చేయబడ్డాయి?

14 మానవులకూ యెహోవా సర్వాధిపత్యానికీ సంబంధించిన వివరాలు బైబిలంతటిలో ఉన్నాయి. బైబిల్లోని మొదటి మూడు అధ్యాయాలు సృష్టి గురించి, మానవులు ఎలా పాపులయ్యారనే దాని గురించి చెబుతుంటే, బైబిల్లోని చివరి మూడు అధ్యాయాలు మానవులు తిరిగి ఎలా మంచి స్థితికి చేరుకుంటారో తెలియజేస్తున్నాయి. మానవుల పట్ల, భూమి పట్ల, విశ్వం పట్ల తనకున్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సర్వాధికారియైన యెహోవా ఎలాంటి చర్యలు తీసుకున్నాడో బైబిల్లోని మధ్య పేజీలు వివరిస్తున్నాయి. సాతాను ఎలా వచ్చాడో, దుష్టత్వం లోకంలోకి ఎలా ప్రవేశించిందో ఆదికాండము పుస్తకం చూపిస్తోంది. దుష్టత్వం ఎలా తీసివేయబడుతుందో, అపవాది ఎలా నాశనం చేయబడతాడో, దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లే భూమ్మీద కూడా ఎలా నెరవేరుతుందో ప్రకటన పుస్తకంలోని చివరి అధ్యాయాలు వెల్లడి చేస్తున్నాయి. పాపం, మరణం ఎలా వచ్చాయో, ఈ భూమ్మీది నుండి అవి ఎలా తీసివేయబడతాయో, వాటి స్థానంలో యథార్థపరులకు పట్టలేనంత ఆనందం, నిత్యజీవం ఎలా వస్తాయో బైబిలు చెబుతోంది.

15. సర్వాధిపత్యానికి సంబంధించిన నాటకానికి తెరపడినప్పుడు మనం ప్రయోజనం పొందాలంటే ఏమి చేయాలి?

15 ఈ లోకపు నటన త్వరలో పూర్తిగా ముగుస్తుంది. సర్వాధిపత్యానికి సంబంధించి ఎన్నో శతాబ్దాలుగా జరుగుతున్న నాటకానికి తెరపడుతుంది. వేదిక పైనుండి సాతాను తీసివేయబడి చివరకు నాశనం చేయబడతాడు, ఇక అంతా దేవుని చిత్త ప్రకారమే ఉంటుంది. దీన్నుండి మనం ప్రయోజనం పొందాలన్నా దేవుని వాక్యంలో వాగ్దానం చేయబడిన అనేక ఆశీర్వాదాలను చవిచూడాలన్నా యెహోవా సర్వాధిపత్యాన్ని మనం ఇప్పుడే సమర్థించాలి. మనం, ఎటు వీలైతే అటు దూకే గోడ మీది పిల్లిలా ఉండకుండా యెహోవా పక్షాన ఉండాలి. అప్పుడే “యెహోవా నా పక్షమున నున్నాడు” అని మనం చెప్పగలుగుతాం.—కీర్త. 118:6, 7.

మన యథార్థతను కాపాడుకోగలుగుతాం

16. మానవులు దేవుని పట్ల తమకున్న యథార్థతను కాపాడుకోగలరని ఎందుకు నమ్మవచ్చు?

16 మనం యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించి, మన యథార్థతను కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.” (1 కొరిం. 10:13) పౌలు ప్రస్తావించిన శోధన ఎలా రావచ్చు? శోధనను తప్పించుకునే మార్గాన్ని యెహోవా ఎలా కలుగజేస్తాడు?

17-19. (ఎ) అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఎలాంటి శోధనకు లొంగిపోయారు? (బి) యెహోవా పట్ల యథార్థతను కాపాడుకోవడం మనకు సాధ్యమేనని ఎందుకు చెప్పవచ్చు?

17 అరణ్యంలో ఇశ్రాయేలీయుల అనుభవాలు చూపిస్తున్నట్లుగా, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించేలా చేసే పరిస్థితుల వల్ల “శోధన” రావచ్చు. (1 కొరింథీయులు 10:6-10 చదవండి.) ఇశ్రాయేలీయులు శోధనను ఎదిరించగలిగేవారే కానీ, యెహోవా అద్భుతరీతిగా వారికి ఒక నెలకు సరిపడా పూరేళ్లను ఇచ్చినప్పుడు వారు “చెడ్డవాటిని” ఆశించారు. కొంతకాలంపాటు ఆ ప్రజలకు మాంసం లేకపోయినా వారు తినడానికి కావాల్సినంత మన్నాను యెహోవా దయచేశాడు. అయినా, పూరేళ్లను సమకూర్చుకుంటున్నప్పుడు వారు అత్యాశను చూపించి శోధనకు లొంగిపోయారు.—సంఖ్యా. 11:19, 20, 31-35.

18 అంతకుముందు, ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి మోషే సీనాయి పర్వతం మీదికి వెళ్లినప్పుడు ఇశ్రాయేలీయులు దూడ ఆరాధనలో, సుఖభోగాల్లో మునిగిపోవడం వల్ల విగ్రహారాధకులుగా తయారయ్యారు. తమ నాయకుడు వారి ముందు లేడు కాబట్టి శోధనకు లొంగిపోయినా తమను చూసేవాళ్లు ఎవరూ లేరని వారనుకున్నారు. (నిర్గ. 32:1, 6) వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి కొద్దికాలం ముందు మోయాబు స్త్రీల ఎరకు చిక్కి వేలాదిమంది ఇశ్రాయేలీయులు వారితో లైంగిక అనైతికతకు పాల్పడ్డారు. ఆ సందర్భంలో, వారు చేసిన పాపం వల్ల వేలాదిమంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. (సంఖ్యా. 25:1, 9) కొన్నిసార్లు ఇశ్రాయేలీయులు తిరుగుబాటుతనంతో ఫిర్యాదు చేసే శోధనకు లొంగిపోయారు. ఒక సందర్భంలో వారు మోషేకు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. (సంఖ్యా. 21:5) దుష్టులైన, తిరుగుబాటుదారులైన కోరహు, దాతాను, అబీరాము, వారి సహచరులు నాశనం చేయబడిన తర్వాత కూడా, వారికి అన్యాయంగా శిక్ష విధించబడిందని తప్పుగా వాదిస్తూ ఇశ్రాయేలీయులు సణిగారు. దానివల్ల, దేవుడు ఒక తెగులును పంపి 14,700 మంది ఇశ్రాయేలీయులను సంహరించాడు.—సంఖ్యా. 16:41, 49.

19 ఇప్పుడు మాట్లాడుకున్న శోధనలన్నిటినీ ఇశ్రాయేలీయులు ఎదిరించగలిగి ఉండేవారే. కానీ వారు తమ విశ్వాసాన్ని కోల్పోయారు. అంతేకాక యెహోవాను, ఆయన తమపట్ల చూపించిన ప్రేమపూర్వక శ్రద్ధను, ఆయన మార్గాలు సరైనవనే విషయాన్ని మరచిపోయారు కాబట్టే, వారు శోధనకు లొంగిపోయారు. ఇశ్రాయేలీయుల్లాగే, మనం కూడా సహజంగా మానవులకు ఎదురయ్యే శోధనలనే ఎదుర్కొంటాం. వాటిని ఎదిరించడానికి మనం చేయగలిగినదంతా చేస్తూ, బలం కోసం యెహోవాపై ఆధారపడితే మన యథార్థతను కాపాడుకోగలం. ‘దేవుడు నమ్మదగినవాడు, మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనియ్యడు’ కాబట్టి, మనం మన యథార్థతను కాపాడుకోగలమని నమ్మవచ్చు. తన చిత్తం చేయడం మనకు అసాధ్యమనిపించే పరిస్థితి వచ్చేంతగా యెహోవా పరీక్షల్ని అనుమతించడు, మనల్ని ఎడబాయడు.—కీర్త. 94:14.

20, 21. మనం శోధించబడినప్పుడు “తప్పించుకొను మార్గమును” యెహోవా ఎలా కలుగజేస్తాడు?

20 శోధనను ఎదిరించడానికి కావాల్సిన బలాన్ని ఇవ్వడం ద్వారా యెహోవా “తప్పించుకొను మార్గమును” కలుగజేస్తాడు. ఉదాహరణకు, మన విశ్వాసాన్ని విడిచిపెట్టేలా చేయడానికి వ్యతిరేకులు మనలను శారీరకంగా హింసించవచ్చు. ఎక్కువ దెబ్బలు తినకుండా, హింసింపబడకుండా ఉండేందుకు లేదా బహుశా మరణాన్ని తప్పించుకునేందుకు వారు చెప్పినట్లు చేసేలా మనం శోధించబడవచ్చు. అయితే, దైవప్రేరణతో పౌలు 1 కొరింథీయులు 10:13లో ఇచ్చిన అభయాన్ని బట్టి, మనలను శోధనలకు గురిచేసే పరిస్థితి ఎక్కువకాలం కొనసాగదని మనకు తెలుసు. తనపట్ల ఉన్న యథార్థతను కాపాడుకోలేని పరిస్థితి వచ్చేంతగా యెహోవా శోధనను పెరగనివ్వడు. యెహోవా మన విశ్వాసాన్ని బలపరచి, మన యథార్థతను కాపాడుకోవడానికి కావాల్సిన ఆధ్యాత్మిక బలాన్ని మనకు ఇవ్వగలడు.

21 యెహోవా తన పరిశుద్ధాత్మను ఇచ్చి మనలను బలపరుస్తాడు. ఆ పరిశుద్ధాత్మ, శోధనను ఎదిరించేందుకు కావాల్సిన లేఖనాలను మనకు గుర్తుచేస్తుంది. (యోహా. 14:26) అందుకే మనం చెడు మార్గాన్ని అనుసరించేలా మోసపోము. ఉదాహరణకు, యెహోవా సర్వాధిపత్యానికీ మానవుల యథార్థతకూ సంబంధించిన వివాదాంశాలను మనం అర్థం చేసుకుంటాం. ఆ జ్ఞానంతోనే అనేకమంది మరణం వరకు నమ్మకంగా ఉండేలా దేవుని చేత బలపరచబడ్డారు. మరణం ద్వారా కాదు గానీ మరణం వరకు శోధనకు లొంగిపోకుండా దాన్ని సహించేందుకు యెహోవా సహాయం చేయడం ద్వారా వారికి మార్గం తెరవబడింది. మన విషయంలో కూడా యెహోవా అలాగే చేయగలడు. నిజానికి, యెహోవా “రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారముచేయుటకై పంపబడిన సేవకులైన” తన నమ్మకమైన దేవదూతలను కూడా ఉపయోగిస్తాడు. (హెబ్రీ. 1:14) తర్వాతి ఆర్టికల్‌ చూపిస్తున్నట్లుగా, దేవుని సర్వాధిపత్యాన్ని నిరంతరం సమర్థించే గొప్ప అవకాశాన్ని యథార్థపరులు మాత్రమే అనుభవిస్తారు. సర్వాధికారియైన యెహోవాను మనం హత్తుకొని ఉంటే మనమూ వారిలో ఒకరిగా ఉంటాం.

మీరెలా జవాబిస్తారు?

• యెహోవాను మన సర్వాధికారిగా ఎందుకు గుర్తించాలి?

• దేవుని పట్ల మన యథార్థతను కాపాడుకోవడమంటే ఏమిటి?

• యెహోవా తన సర్వాధిపత్యాన్ని త్వరలోనే నిరూపించుకుంటాడని మనకెలా తెలుసు?

1 కొరింథీయులు 10:13 లోని మాటలను బట్టి, మనం మన యథార్థతను కాపాడుకోవడం సాధ్యమేనని ఎందుకు చెప్పవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[24వ పేజీలోని చిత్రం]

యెహోవాకు తిరుగుబాటు చేసేలా సాతాను ఆదాముహవ్వలను ప్రేరేపించాడు

[26వ పేజీలోని చిత్రం]

యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించాలనే కృతనిశ్చయంతో ఉండండి