కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం యథార్థవంతులముగా నడుచుకుందాం

మనం యథార్థవంతులముగా నడుచుకుందాం

మనం యథార్థవంతులముగా నడుచుకుందాం

“నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను.”—కీర్త. 26:11.

1, 2. తన యథార్థత గురించి యోబు ఏమి అన్నాడు? యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఆయన గురించి ఏమి సూచించబడింది?

 ఇప్పటిలాగే ప్రాచీన కాలాల్లో కూడా వస్తువులను తరచూ త్రాసులో కొలిచేవారు. తూకం వేయాల్సిన వస్తువును ఒకవైపు తూనికరాళ్లను మరోవైపు పెట్టి కొలుస్తారు. దేవుని ప్రజలు సరైన త్రాసును, న్యాయమైన తూనికరాళ్లను ఉపయోగించి తూకం వేయాలి.—సామె. 11:1.

2 సాతాను చేతుల్లో కష్టాలను అనుభవిస్తున్నప్పుడు దైవభయంగల యోబు ఇలా అన్నాడు: “నేను యథార్థుడనై యున్నానని దేవుడు [యెహోవా] తెలిసికొనునట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక.” (యోబు 31:6, 7) ఒక వ్యక్తి యథార్థతను పరీక్షించే అనేక పరిస్థితుల గురించి యోబు ఆ సందర్భంలో ప్రస్తావించాడు. అయితే, యోబు గ్రంథం 31వ అధ్యాయంలోని తన మాటలనుబట్టి, యోబు తన యథార్థతను విజయవంతంగా రుజువు చేసుకున్నాడని స్పష్టమౌతోంది. మనమూ ఆయనలాగే ప్రవర్తించేందుకు ఆయన మంచి మాదిరి మనల్ని ప్రోత్సహించవచ్చు. అంతేకాక, కీర్తనకర్తయైన దావీదులా, “నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను” అని మనమూ పూర్తి నమ్మకంతో చెప్పవచ్చు.—కీర్త. 26:11.

3. పెద్దాచిన్నా విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

3 తీవ్రమైన పరీక్షలు ఎదురైనా యోబు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. యోబుకు వచ్చినంత తీవ్రమైన పరీక్షలు ఎవరికీ రావని, ఆయన చూపించినంత గొప్ప యథార్థతను ఎవరూ చూపించలేరని కొంతమంది అనవచ్చు. నిజమే, యోబు పడినన్ని బాధలు మనం పడడంలేదు. అయినా, యథార్థపరులముగా నడుచుకుంటున్నామని, యెహోవా సర్వాధిపత్యానికి మద్దతునిస్తున్నామని చూపించాలంటే మనం పెద్దాచిన్నా విషయాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి.—లూకా 16:10 చదవండి.

నైతిక విషయాల్లో యథార్థంగా ఉండడం ప్రాముఖ్యం

4, 5. యథార్థపరుడైన యోబు ఎలా ప్రవర్తించలేదు?

4 యోబులాగే, మనం యెహోవా పట్ల మనకున్న యథార్థతను కాపాడుకోవాలంటే నైతిక విషయాల్లో ఆయన ప్రమాణాలను పాటించాలి. ఆయనిలా అన్నాడు: “నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును? . . . నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక.”—యోబు 31:1, 9, 10.

5 దేవుని పట్ల యథార్థతను కాపాడుకోవాలని యోబు తీర్మానించుకున్నాడు. అందుకే ఆయన మోహపు చూపుతో అదే పనిగా స్త్రీలను చూడలేదు. వివాహితుడిగా, ఆయన పెళ్లికాని స్త్రీలతో సరసాలాడలేదు లేదా చెడు ఉద్దేశాలు మనసులో ఉంచుకొని పరుని భార్యతో ప్రవర్తించలేదు. లైంగిక విషయాల్లో పవిత్రంగా ఉండడం గురించి కొండమీది ప్రసంగంలో యేసు ఓ శక్తివంతమైన వ్యాఖ్యానం చేశాడు. యథార్థవంతులుగా ఉండాలనుకునేవారు దాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.—మత్తయి 5:27, 28 చదవండి.

మోసకరమైన పద్ధతులను ఎన్నడూ అనుసరించకండి

6, 7. (ఎ) యోబు విషయంలో చేసినట్లే, దేవుడు మన యథార్థతను పరిశీలించడానికి దేన్ని ఉపయోగిస్తాడు? (బి) మనం మోసపరులముగా ఎందుకు ఉండకూడదు?

6 మనం యథార్థపరులముగా ఉండాలనుకుంటే మోసకరమైన పద్ధతులను అనుసరించకూడదు. (సామెతలు 3:31-33 చదవండి.) యోబు ఇలా అన్నాడు: “అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల మోసముచేయుటకై నా కాలు త్వరపడినయెడల నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసికొనునట్లు న్యాయమైన త్రాసులో ఆయన [యెహోవా] నన్ను తూచును గాక.” (యోబు 31:5-7) మానవులందరినీ యెహోవా “న్యాయమైన త్రాసులో” తూస్తాడు. యోబు విషయంలో చేసినట్లే, యెహోవా తన పరిపూర్ణ న్యాయ ప్రమాణాలను ఉపయోగించి మనం యథార్థపరులమో కాదో తెలుసుకుంటాడు.

7 మనం మోసపరులముగా తయారైతే మన యథార్థతను కాపాడుకోలేం. యథార్థపరులు “కుయుక్తిగా నడుచుకొనక . . . అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నా[రు].” (2 కొరిం. 4:1, 2) మన మాటలు లేదా క్రియలు మోసకరంగా ఉండడం వల్ల సహాయం కోసం తోటి విశ్వాసి దేవునికి మొరపెట్టే పరిస్థితి వస్తే అప్పుడేమిటి? అది మనకు అస్సలు మంచిది కాదు. “నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము” అని కీర్తనకర్త పాడాడు. (కీర్త. 120:1, 2) దేవుడు మన “హృదయములను అంతరింద్రియములను పరిశీలిం[చడం]” ద్వారా మన అంతరంగంలో ఏముందో చూసి మనం నిజంగా యథార్థపరులమో కాదో తెలుసుకోగలుగుతాడని మనం గుర్తుంచుకోవాలి.—కీర్త. 7:8-10.

ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు మంచి మాదిరిగా ఉండాలి

8. యోబు ఇతరులతో ఎలా వ్యవహరించాడు?

8 మన యథార్థతను కాపాడుకోవాలంటే మనం న్యాయాన్ని, వినయాన్ని, ఇతరుల పట్ల శ్రద్ధను కనబరచిన యోబులా ఉండాలి. యోబు ఇలా అన్నాడు: “నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యెమాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.”—యోబు 31:13-15.

9. తన సేవకులతో వ్యవహరిస్తున్నప్పుడు యోబు ఎలాంటి లక్షణాలను కనబరిచాడు? ఈ విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి?

9 యోబు కాలంలో, న్యాయ విచారణలు సులభమైన రీతిలో, ఓ క్రమపద్ధతిలో జరిగేవని తెలుస్తోంది. అంతేకాదు న్యాయసభలు దాసులకు కూడా అందుబాటులో ఉండేవి. యోబు తన సేవకులతో న్యాయంగా, దయగా వ్యవహరించేవాడు. మనం యథార్థపరులముగా నడుచుకోవాలంటే అలాంటి లక్షణాలనే కనబరచాలి. మనం క్రైస్తవ సంఘంలో పెద్దలుగా సేవచేస్తుంటే అలా చేయడం మరింత ప్రాముఖ్యం.

ఉదార స్వభావాన్ని చూపించండి, దురాశాపరులుగా ఉండకండి

10, 11. (ఎ) యోబు ఉదార స్వభావాన్ని, సహాయం చేసే గుణాన్ని చూపించాడని మనకెలా తెలుసు? (బి) యోబు 31:16-25 లోని మాటలు, తర్వాతి కాలంలో రాయబడిన ఏ లేఖన ఉపదేశాలను గుర్తుచేయవచ్చు?

10 యోబు ఉదార స్వభావాన్ని, సహాయం చేసే గుణాన్ని చూపించాడే గానీ స్వార్థాన్ని, దురాశను కాదు. ఆయనిలా అన్నాడు: “విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసినయెడలను, తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచెమైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, . . . గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను, నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.” యోబు, “నా ఆశ్రయము నీవే” అని బంగారంతో చెప్పివుంటే, యథార్థపరుడిగా ఉండగలిగేవాడు కాదు.—యోబు 31:16-25.

11 పద్య రూపంలో చెప్పబడిన ఆ మాటలు శిష్యుడైన యాకోబు మాటలను గుర్తుచేస్తున్నాయి. ఆయనిలా అన్నాడు: “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా—దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్ను తాను కాపాడుకొనుటయునే.” (యాకో. 1:27) “మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు” అని యేసు ఇచ్చిన హెచ్చరికను కూడా మనం గుర్తుచేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయన, “దేవునియెడల ధనవంతుడుకా[కుండా]” చనిపోయిన ఓ దురాశాపరుడైన ధనవంతుని గురించిన ఉపమానం చెప్పాడు. (లూకా 12:15-21) మనం యథార్థపరులముగా ఉండాలంటే పాపభరితమైన లోభత్వానికి లేక దురాశకు లొంగిపోకూడదు. లోభత్వం అనేది విగ్రహారాధనతో సమానం. ఎందుకంటే దురాశాపరుడు దేన్నైనా ఆశించినప్పుడు ఆయన అవధానం యెహోవాపై కాక దానిపైనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఆయనకు ఓ విగ్రహం అవుతుంది. (కొలొ. 3:5) మనం ఒకే సమయంలో అటు యథార్థపరులముగా ఇటు దురాశాపరులముగా ఉండలేము.

సత్యారాధనను హత్తుకొని ఉండండి

12, 13. విగ్రహారాధనకు దూరంగా ఉండే విషయంలో యోబు ఎలాంటి మాదిరి ఉంచాడు?

12 యథార్థపరులు సత్యారాధన నుండి పక్కకు మళ్లరు. యోబు విషయంలో కూడా అది నిజం. ఆయనిలా అన్నాడు: “సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును. అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరమగును.”—యోబు 31:26-28.

13 యోబు ప్రాణంలేని వాటిని ఆరాధించలేదు. ఆకాశంలోవున్న చంద్రుని లాంటి వాటిని చూసి తన హృదయం రహస్యంగా ప్రేరేపించబడి ‘తన నోరు తన చేతిని ముద్దుపెట్టుకుంటే,’ అంటే పూజ్యభావంతో తన చేతితో ముద్దును విసిరివుంటే, యోబు దేవుణ్ణి విసర్జించి విగ్రహారాధకుడు అయ్యుండేవాడు. (ద్వితీ. 4:15, 19) దేవుని పట్ల మనకున్న యథార్థతను కాపాడుకోవాలంటే మనం అన్నిరకాల విగ్రహారాధనకు దూరంగా ఉండాలి.—1 యోహాను 5:21 చదవండి.

పగతీర్చుకునే వారిగా, వేషధారులుగా ఉండకండి

14. యోబు ఎవరినీ ద్వేషించలేదని మనం ఎందుకు చెప్పవచ్చు?

14 యోబు ఎవరినీ ద్వేషించలేదు, క్రూరంగా ప్రవర్తించలేదు. ఆ లక్షణాలను చూపించే వ్యక్తి యథార్థపరుడు కాదని యోబుకు తెలుసు. అందుకే ఆయనిలా అన్నాడు: “నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.”—యోబు 31:29, 30.

15. మనల్ని ద్వేషించే వారికి కీడు జరగడం చూసి మనం ఎందుకు సంతోషించకూడదు?

15 నీతిమంతుడైన యోబు, తనను ద్వేషించే వ్యక్తికి కీడు జరగడం చూసి ఎన్నడూ సంతోషించలేదు. ఆ తర్వాత రాయబడిన ఒక సామెత ఇలా హెచ్చరిస్తోంది: “నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో.” (సామె. 24:17, 18) యెహోవా హృదయాలను చదవగలడు కాబట్టి ఇతరులకు కీడు జరగడం చూసి మనం రహస్యంగా సంతోషిస్తే అది ఆయనకు తెలుస్తుంది. అలాంటి ప్రవర్తనను ఆయన అస్సలు అంగీకరించడు. (సామె. 17:5) “పగతీర్చుటయు, ప్రతిఫలమిచ్చుటయు నావే” అని దేవుడు చెబుతున్నాడు కాబట్టి ఆయన మనతో కూడా అలాగే వ్యవహరించవచ్చు.—ద్వితీ. 32:35.

16. మనం ధనవంతులం కాకపోయినా అతిథిప్రియులముగా ఎలా ఉండవచ్చు?

16 యోబు అతిథిప్రియుడు. (యోబు 31:31, 32) మనం ధనవంతులం కాకపోయినా “ఆతిథ్యము ఇ[స్తూ]” ఉండవచ్చు. (రోమా. 12:13) “పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు” అనే విషయం గుర్తుపెట్టుకొని మనం ఇతరులకు సాధారణ భోజనమైనా పెట్టవచ్చు. (సామె. 15:17) ప్రేమగల వాతావరణంలో తోటి క్రైస్తవులతో కలిసి సాధారణ భోజనం చేసినా ఎంతో సంతోషాన్ని, ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందవచ్చు.

17. గంభీరమైన పాపాలను దాచిపెట్టడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు?

17 యోబు వేషధారి కాడు కాబట్టి ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించినవారు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రోత్సాహాన్ని పొందివుండవచ్చు. మొదటి శతాబ్దపు సంఘంలోకి జొరబడి ‘లాభము నిమిత్తం మనుష్యులను కొనియాడిన’ దైవభయంలేని కొందరిలా ఆయన లేడు. (యూదా 3, 4, 16) అంతేకాదు, ఇతరులకు తెలిస్తే తనను తిరస్కరిస్తారేమోనని భయపడి యోబు ‘తన పాపాలను రొమ్ములో కప్పుకోలేదు’ లేదా తన దోషాలను దాచిపెట్టలేదు. తాను ఏమైనా తప్పులు చేసివుంటే దేవుని ముందు ఒప్పుకోవాలి కాబట్టి యోబు ఆయన చేత పరీక్షించబడడానికి ఇష్టపడ్డాడు. (యోబు 31:33-37) మనం ఏదైనా గంభీరమైన పాపం చేస్తే, మన పరువును కాపాడుకోవడం కోసం దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించకూడదు. మనం యథార్థతను కాపాడుకోవడానికి కృషి చేస్తున్నామని ఎలా చూపించవచ్చు? మన తప్పును ఒప్పుకోవడం ద్వారా, పశ్చాత్తాపపడడం ద్వారా, ఆధ్యాత్మిక సహాయాన్ని కోరడం ద్వారా, జరిగిన నష్టాన్ని పూరించడానికి చేయగలిగినదంతా చేయడం ద్వారా చూపించవచ్చు.—సామె. 28:13; యాకో. 5:13-15.

యథార్థపరుడు విచారించబడ్డాడు

18, 19. (ఎ) యోబు ఎవరినీ దోచుకోలేదని ఎందుకు చెప్పవచ్చు? (బి) తాను తప్పు చేశాడని రుజువైతే యోబు ఏమి చేయడానికి వెనకాడలేదు?

18 యోబు నిజాయితీపరుడు, కపటంలేనివాడు. అందుకే ఆయనిలా చెప్పగలిగాడు: “నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన యెడలను గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక.” (యోబు 31:38-40) యోబు ఎన్నడూ ఇతరుల భూమిని లాక్కోలేదు, తన పనివారిని దోచుకోలేదు. ఆయనలాగే మనమూ పెద్దాచిన్నా విషయాల్లో యెహోవా పట్ల మనకున్న యథార్థతను కాపాడుకోవాలి.

19 తన ముగ్గురు స్నేహితుల ముందు, యౌవనస్థుడైన ఎలీహు ముందు తాను జీవించిన విధానం గురించి యోబు మాట్లాడాడు. తన “చేవ్రాలు గురుతు” లేదా సంతకం ఉన్న తన జీవితాన్ని పరిశీలించి తన మీద నేరారోపణ చేయగలవారెవరైనా ఉంటే రమ్మని యోబు అన్నాడు. తాను తప్పు చేశాడని రుజువైతే శిక్ష అనుభవించడానికైనా యోబు వెనకాడలేదు. అలా ఆయన తన వాదనను చెప్పి, దైవిక న్యాయస్థానం నుండి వచ్చే తీర్పు కోసం వేచిచూశాడు. “యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.”—యోబు 31:35, 40.

మీరు యథార్థతను కాపాడుకోగలరు

20, 21. (ఎ) యోబు యథార్థతను ఎలా కాపాడుకోగలిగాడు? (బి) మనం దేవుని పట్ల ప్రేమను ఎలా పెంపొందించుకోవచ్చు?

20 యోబు యెహోవాను ప్రేమించాడు, యెహోవా కూడా ఆయనను ప్రేమించి సహాయం చేశాడు కాబట్టి ఆయన తన యథార్థతను కాపాడుకోగలిగాడు. యోబు ఇలా అన్నాడు: “జీవము ననుగ్రహించి నాయెడల కృప [యథార్థమైన ప్రేమ] చూపితివి [యెహోవా] నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.” (యోబు 10:12) అంతేకాక, ఇతరుల పట్ల యథార్థమైన ప్రేమ చూపించనివారు సర్వశక్తుడైన దేవుని పట్ల భక్తిపూర్వక భయాన్ని చూపించడం మానుకుంటారని గుర్తించి యోబు ఇతరుల పట్ల ప్రేమ చూపించాడు. యథార్థపరులు దేవుణ్ణి, పొరుగువారిని ప్రేమిస్తారు.—మత్త. 22:37-40.

21 ప్రతీరోజు బైబిలు చదవడం ద్వారా, దానిలో దేవుని గురించి చెప్పబడిన విషయాలను ధ్యానించడం ద్వారా ఆయన పట్ల ప్రేమను పెంపొందించుకోవచ్చు. హృదయపూర్వక ప్రార్థనలో యెహోవాను స్తుతించి, మనపట్ల ఆయన చూపిస్తున్న మంచితనానికి మనం కృతజ్ఞతలు చెప్పవచ్చు. (ఫిలి. 4:6, 7) మనం యెహోవాకు పాటలు పాడవచ్చు, తన ప్రజలతో క్రమంగా సహవసించి ప్రయోజనం పొందవచ్చు. (హెబ్రీ. 10:23-25) అయితే, “ఆయన రక్షణసువార్తను” ప్రకటిస్తూ పరిచర్యలో పాల్గొన్నప్పుడు కూడా దేవుని పట్ల మనకున్న ప్రేమ మరింత పెరుగుతుంది. (కీర్త. 96:1-3) అలా చేసినప్పుడు కీర్తనకర్తలాగే మనం మన యథార్థతను కాపాడుకోవచ్చు, ఆయనిలా పాడాడు: “నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.”—కీర్త. 73:28.

22, 23. యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించేవారముగా మనం చేసే కార్యాలను గతంలో యథార్థపరులు చేసిన కార్యాలతో ఎలా పోల్చవచ్చు?

22 గత శతాబ్దాల్లో యెహోవా, యథార్థపరులకు ఎన్నో నియామకాలను ఇచ్చాడు. నోవహు ఓడను తయారుచేశాడు, “నీతిని ప్రకటిం[చాడు].” (2 పేతు. 2:5) యెహోషువ ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోకి నడిపించాడు. “ధర్మశాస్త్రగ్రంథమును . . . దివారాత్రము” చదివి దాని ప్రకారం నడుచుకున్నాడు కాబట్టే ఆయన విజయం సాధించాడు. (యెహో. 1:7, 8) మొదటి శతాబ్దపు క్రైస్తవులు శిష్యులను తయారుచేశారు, లేఖనాలను అధ్యయనం చేయడానికి క్రమంగా సమకూడారు.—మత్త. 28:19, 20.

23 నీతిని ప్రకటించడం ద్వారా, శిష్యులను తయారుచేయడం ద్వారా, లేఖన ఉపదేశాలను పాటించడం ద్వారా, కూటాల్లోనూ సమావేశాల్లోనూ తోటి విశ్వాసులతో సహవసించడం ద్వారా మనం యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించవచ్చు, మన యథార్థతను కాపాడుకోవచ్చు. అవన్నీ చేస్తే మనం ధైర్యంగా ఉండడమేకాక ఆధ్యాత్మికంగా బలంగా ఉండగలుగుతాం, దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చగలుగుతాం. పరలోక తండ్రి సహాయం, ఆయన కుమారుని సహాయం మనకుంది కాబట్టి అది అంత కష్టమేమీ కాదు. (ద్వితీ. 30:11-14; 1 రాజు. 8:57) అంతేకాక, యథార్థవంతులుగా నడుచుకుంటూ యెహోవాను సర్వాధిపతిగా ఘనపరుస్తున్న ప్రపంచవ్యాప్త “సహోదరుల” మద్దతు కూడా మనకుంది.—1 పేతు. 2:17.

మీరెలా జవాబిస్తారు?

• యెహోవా నైతిక ప్రమాణాలను మనమెలా పరిగణించాలి?

• యోబులో మీకు నచ్చిన లక్షణాలేమిటి?

యోబు 31:29-37 ప్రకారం, యోబు ఎలా ప్రవర్తించాడు?

• దేవుని పట్ల యథార్థతను కాపాడుకోవడం సాధ్యమేనని ఎందుకు చెప్పవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[29వ పేజీలోని చిత్రం]

యెహోవా పట్ల తనకున్న యథార్థతను యోబు కాపాడుకున్నాడు.

మనమూ కాపాడుకోవచ్చు!

[32వ పేజీలోని చిత్రం]

మనం మన యథార్థతను కాపాడుకోగలం!