కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలు ఏమి చెబుతారు?

మీ పిల్లలు ఏమి చెబుతారు?

మీ పిల్లలు ఏమి చెబుతారు?

తల్లిదండ్రులకు: మీ పిల్లలతో కలిసి కొన్ని సన్నివేశాలను ప్రాక్టీసు చేయడం గురించి జనవరి 15, 2010 సంచికలోని 16-20 పేజీల్లో చూశాం. స్కూల్లో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో మీ పిల్లలకు నేర్పించడానికి మీకు సహాయం చేసే కొన్ని సలహాలు ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడ్డాయి. మీ కుటుంబ ఆరాధనా సాయంకాలమప్పుడు మీరు ఈ ఆర్టికల్‌లో ఉన్న సన్నివేశాలను ప్రాక్టీసు చేయాలనుకోవచ్చు.

యెహోవాసాక్షులైన పిల్లలకు ఎన్నో సవాళ్లు ఎదురౌతాయి. జెండా వందనం, పుట్టిన రోజు వేడుకలు, సెలవు దినానికి సంబంధించిన ఏర్పాట్లలో ఎందుకు పాల్గొనరని తోటి విద్యార్థులు తరచూ వారిని అడుగుతారు. మీ పిల్లలను ఎవరైనా అలాంటి ప్రశ్నలు అడిగితే, వారెలా జవాబిస్తారు?

కొంతమంది క్రైస్తవ పిల్లలు, “అది నా మతానికి విరుద్ధం కాబట్టి నేను దాన్ని చేయలేను” అని సూటిగా చెబుతారు. తమ నమ్మకాల విషయంలో స్థిరంగా ఉన్నందుకు అలాంటి పిల్లలను మెచ్చుకోవాలి. అలా వారు సూటిగా జవాబు చెప్పడం వల్ల ఇతరులు మరో ప్రశ్న అడగకపోవచ్చు. కానీ, మన నమ్మకాల విషయంలో ‘మనల్ని హేతువు అడిగే ప్రతివానికి సమాధానము చెప్పడానికి సిద్ధంగా ఉండాలని’ బైబిలు మనకు చెబుతోంది. (1 పేతు. 3:15) కాబట్టి, “నేను వాటిని చేయలేను” అని చెబితే సరిపోదు. కాబట్టి, కొందరు మనతో ఏకీభవించకపోయినా, మనమలా ఎందుకు చేయమో తెలుసుకోవడానికి ఇతరులు ఇష్టపడవచ్చు.

చాలామంది సాక్షులైన పిల్లలు, గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి వంటి ప్రచురణలను ఉపయోగించి తమ తోటి విద్యార్థులకు బైబిలు వృత్తాంతాలను చెప్పారు. వారు కొన్నింటిని ఎందుకు చేస్తారో, ఎందుకు చేయరో వివరించేందుకు ఈ వృత్తాంతాలు సహాయం చేస్తాయి. కొంతమంది విద్యార్థులు బైబిలు కథలను ఎంతో శ్రద్ధగా వింటారు, దానివల్ల అనేక బైబిలు అధ్యయనాలు ప్రారంభించబడ్డాయి. అయితే ఇంకొంతమందికి పూర్తి బైబిలు కథను వినడం కష్టమనిపించవచ్చు. అంతేకాక, కొన్ని బైబిలు వృత్తాంతాలను పూర్తిగా వివరించకపోతే స్కూలు పిల్లలు వాటిని అర్థం చేసుకోలేకపోవచ్చు. తన స్నేహితురాలు ఓ పుట్టిన రోజు పార్టీకి తనను ఆహ్వానించినప్పుడు పదకొండేళ్ల మిన్హీ ఆమెతో ఇలా చెప్పింది: “పుట్టిన రోజును జరుపుకోవాలని బైబిలు మనకు చెప్పడం లేదు. బాప్తిస్మమిచ్చు యోహాను అనే వ్యక్తి ఒక పుట్టిన రోజు వేడుకలో చంపబడ్డాడని బైబిలు చెబుతోంది.” తన స్నేహితురాలు ఆ జవాబును అర్థంచేసుకోనట్లు తనకు అనిపించిందని మిన్హీ గుర్తుచేసుకుంటోంది.

కొన్నిసార్లు, మన పుస్తకాల్లో ఉన్న ఓ చిత్రాన్ని గానీ ఓ వృత్తాంతాన్ని గానీ తోటి విద్యార్థికి చూపించవచ్చు. అయితే, మతసంబంధమైన ప్రచురణలను తెచ్చి ఇతర విద్యార్థులకు చూపించకూడదని స్కూలు యాజమాన్యం కోరితే అప్పుడేమిటి? చేతిలో ఏ ప్రచురణ లేకున్నా మన పిల్లలు సమర్థవంతంగా సాక్ష్యం ఇవ్వగలరా? తమ నమ్మకాలను సమర్థించుకోవడానికి మీరు మీ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?

పిల్లలతో కలిసి సన్నివేశాలను ప్రాక్టీసు చేయండి

తల్లిదండ్రులు తోటి విద్యార్థుల్లా నటిస్తూ, వివిధ సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో ఇంటి దగ్గర ప్రాక్టీసు చేస్తే ఎంతో మంచిది. పిల్లలు తమ నమ్మకాలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుండగా వారిని మెచ్చుకొని, జవాబు చెప్పే రీతిని వారు ఇంకా ఎలా మెరుగుపర్చుకోవచ్చో, అలా చేయడం ఎందుకు అవసరమో చెప్పండి. ఉదాహరణకు, తమ తోటి వయసువారు అర్థంచేసుకునే పదాలను వాడాలని పిల్లలకు చెప్పండి. “మనస్సాక్షి,” “యథార్థత” వంటి పదాలను తన తోటి విద్యార్థులు అర్థం చేసుకోలేదని తొమ్మిదేళ్ల జాషువా చెప్పాడు. కాబట్టి వారికి జవాబు చెప్పేటప్పుడు తాను సులభంగా అర్థమయ్యే పదాలను వాడాల్సొచ్చింది.—1 కొరిం. 14:9.

కొంతమంది స్కూలు పిల్లలు ప్రశ్న అడుగుతారు కానీ, జవాబు పెద్దగా ఉన్నట్లైతే తమ ఆసక్తిని కోల్పోతారు. వారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పేటప్పుడు వారిని కూడా మాట్లాడిస్తూ, వారితో తర్కిస్తే వారి ఆసక్తిని సజీవంగా ఉంచగలుగుతారు. పదేళ్ల హాన్యూల్‌ ఇలా చెబుతోంది: “నా తోటి విద్యార్థులు, నేను వివరించడాన్ని కాదుగానీ వారు కూడా మాట్లాడడాన్ని ఇష్టపడతారు.” అలా మాట్లాడించాలంటే వారిని ప్రశ్నలు అడిగి వారు చెప్పేది శ్రద్ధగా వినండి.

క్రైస్తవ పిల్లలు తోటి విద్యార్థులతో ఎలా తర్కించవచ్చో కింద ఇవ్వబడిన సన్నివేశాల్లో చూస్తాం. వీటిని కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, పిల్లలందరూ ఒకేలా ఉండరు, అంతేకాక వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు జవాబులు ఇవ్వాల్సి రావచ్చు. కాబట్టి, సాక్షులైన పిల్లలు తాము చెప్పాలనుకున్న విషయాన్ని మనసులో ఉంచుకొని సందర్భానికీ, తోటి విద్యార్థులకూ తగినట్లుగా దాన్ని తమ సొంత మాటల్లో చెప్పాలి. మీ ఇంట్లో స్కూలుకు వెళ్లే పిల్లలుంటే ఈ సన్నివేశాలను వారితో కలిసి ప్రాక్టీసు చేయండి.

పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి సమయం, కృషి అవసరం. క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లల మనస్సుల్లో బైబిలు సూత్రాలను నాటి, వాటి ప్రకారం జీవించేలా వారికి సహాయం చేయాలనుకుంటారు.—ద్వితీ. 6:7; 2 తిమో. 3:14.

ఇక్కడ ఇవ్వబడిన సన్నివేశాలను తర్వాతి కుటుంబ ఆరాధనా సాయంకాలమప్పుడు మీ పిల్లలతో కలిసి ప్రాక్టీసు చేయండి. అలా చేయడం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో చూడండి. అయితే జవాబులను, పదాలను కంఠస్థం చేయించడం మీ లక్ష్యం కాదని గుర్తుంచుకోండి. నిజానికి, మీరు వేర్వేరు ప్రశ్నలు అడుగుతూ వాటికి మీ పిల్లలు ఎలా జవాబు చెబుతున్నారో గమనిస్తూ సన్నివేశాన్ని రెండుమూడుసార్లు ప్రాక్టీసు చేయవచ్చు. వారు తమ నమ్మకాల గురించి వివరించేటప్పుడు సరైన కారణాలను ఇస్తూ మరింత యుక్తిగా ఎలా మాట్లాడవచ్చో నేర్పించండి. అలా కొంతకాలానికి, తమ తోటి విద్యార్థుల ముందు, టీచర్ల ముందు, పొరుగువారి ముందు తమ నమ్మకాలను ఎలా సమర్థించుకోవచ్చో మీరు మీ పిల్లలకు నేర్పిస్తారు.

[4వ పేజీలోని బాక్సు/ చిత్రాలు]

పుట్టిన రోజు వేడుకలు

సింధూ: హాయ్‌ నిఖిల్‌, నా పుట్టిన రోజు పార్టీకి నిన్ను ఆహ్వానించాలనుకుంటున్నాను.

నిఖిల్‌: నన్ను గుర్తుంచుకొని పిలుస్తున్నందుకు థ్యాంక్స్‌ సింధూ. అయితే, నువ్వు పుట్టిన రోజు పార్టీ ఎందుకు చేసుకుంటున్నావో తెలుసుకోవచ్చా?

సింధూ: నా పుట్టిన రోజును జరుపుకోవడానికి చేసుకుంటున్నాను, నువ్వు నీ పుట్టిన రోజును జరుపుకోవా ఏంటి?

నిఖిల్‌: లేదు.

సింధూ: ఎందుకు? నేను పుట్టినప్పుడైతే మా కుటుంబం సంతోషించింది.

నిఖిల్‌: మా కుటుంబం కూడా నేను పుట్టినప్పుడు సంతోషించింది. అంతమాత్రాన ప్రతీ సంవత్సరం దాన్ని జరుపుకోవాల్సిన అవసరం లేదని నాకనిపిస్తుంది. ఎందుకంటే, పుట్టిన రోజు పార్టీలప్పుడు, దాన్ని చేసుకునే వాళ్లు తామే అందరికన్నా ప్రాముఖ్యమైన వాళ్లని అనుకుంటారు. కానీ, అందరికన్నా ప్రాముఖ్యమైన వ్యక్తి దేవుడు కదా? మనకు జీవాన్ని ఇచ్చినందుకు మనం ఆయనకు ప్రతీరోజు కృతజ్ఞతలు చెప్పవద్దా? దానికోసం పుట్టినరోజు వచ్చేంతవరకు ఆగాలా?

సింధూ: అంటే, నేను నా పుట్టిన రోజు పార్టీ చేసుకోకూడదని చెబుతున్నావా?

నిఖిల్‌: అది నీ ఇష్టం సింధూ. అయితే, నువ్వు ఒకసారి దీని గురించి ఆలోచించు. పుట్టిన రోజున బహుమతులు తీసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు కానీ, తీసుకోవడం కన్నా ఇవ్వడం ఎక్కువ సంతోషాన్నిస్తుందని బైబిలు చెబుతోంది. కాబట్టి పుట్టిన రోజున మనం మన గురించే ఆలోచించుకునే బదులు, దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ఇతరుల గురించి ఆలోచిస్తూ వారికి ఏదైనా మంచి చేస్తే బాగుంటుంది కదా?

సింధూ: నేనెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. అయితే, మీ అమ్మానాన్నలు నీకు ఎప్పుడూ బహుమతులు ఇవ్వరా?

నిఖిల్‌: తప్పకుండా ఇస్తారు. కానీ, అందుకోసం మా అమ్మానాన్నలు నా పుట్టిన రోజు వరకు ఎదురుచూడరు. వారు నాకు ఎన్నిసార్లు బహుమతులు ఇవ్వాలనుకుంటే అన్నిసార్లు ఇస్తారు. అసలు, పుట్టిన రోజు వేడుకలు ఎలా మొదలయ్యాయో నీకు తెలుసుకోవాలని ఉందా?

సింధూ: అవును, ఇంతకీ ఎలా మొదలయ్యాయి?

నిఖిల్‌: సరే, చాలాకాలం క్రితం జరిగిన ఓ పుట్టిన రోజుకు సంబంధించిన ఆసక్తికరమైన కథ నీకు రేపు చెబుతాను.

జాతీయ గీతం

శృతి: శ్వేత, నువ్వు జాతీయ గీతాన్ని ఎందుకు పాడవు?

శ్వేత: థ్యాంక్స్‌ శృతి. అయితే ఒక విషయం అడగవచ్చా, నువ్వెందుకు పాడతావు?

శృతి: ఎందుకంటే నేను నా దేశాన్నిబట్టి గర్వపడుతున్నాను.

శ్వేత: ఈ దేశంలో ఉంటున్నందుకు నేను కూడా సంతోషిస్తున్నాను. అయితే, ఏ దేశమూ మరో దేశం కంటే గొప్పదని నేను అనుకోవడం లేదు.

శృతి: నేను మాత్రం అన్ని దేశాలకన్నా నా దేశం గొప్పదని అనుకుంటున్నాను.

శ్వేత: నేను ఎప్పుడూ విషయాలను దేవుడు చూస్తున్నట్లు చూడడానికి ప్రయత్నిస్తాను. దేవునికి పక్షపాతం లేదని బైబిలు చెబుతోంది. ఆయన అన్ని దేశాల ప్రజలను ప్రేమిస్తాడు. అందుకే నేను నా దేశాన్ని గౌరవిస్తున్నా జాతీయ గీతాన్ని పాడడంగానీ జెండా వందనం చేయడం గానీ చేయను.

శృతి: నువ్వు కాస్త అతిగా ఆలోచిస్తున్నావు శ్వేత.

శ్వేత: ఇలా ఆలోచించేది నేను ఒక్కదాన్నే కాదు. నాలాగే ఆలోచించిన కొంతమంది యౌవనస్థుల గురించి బైబిలు చెబుతోంది. ఓ రాజకీయ చిహ్నాన్ని ఆరాధించాలని, అలా చేయనివారిని చంపేస్తామని రాజు హెచ్చరించినా వారు ఆరాధించలేదు.

శృతి: నిజమా? దీని గురించి నేను ఎప్పుడూ వినలేదే.

శ్వేత: నీకు దాని గురించి తెలుసుకోవాలనుంటే బ్రేక్‌ టైంలో చెబుతాను.

రాజకీయాలపై అభిప్రాయం

సుమన్‌: ఆకాశ్‌, నిన్ను ఓటు వేయమంటే ఎవరికి వేస్తావు?

ఆకాశ్‌: నేను ఎవరికీ వేయను.

సుమన్‌: ఎందుకని?

ఆకాశ్‌: ఎందుకంటే నేను ఓటు ఎప్పుడో వేసేశాను.

సుమన్‌: కానీ నువ్వు ఇప్పుడే ఓటు వేయలేవు కదా?

ఆకాశ్‌: వేయగలను, నేను ఇప్పటికే అన్నిటికన్నా గొప్ప ప్రభుత్వాన్ని ఎంచుకున్నాను.

సుమన్‌: అది ఏ ప్రభుత్వం?

ఆకాశ్‌: అది యేసు పరిపాలించే ప్రభుత్వం, పరిపాలించడానికి ఆయన సరిగ్గా సరిపోతాడు. ఎందుకో తెలుసుకోవాలనుందా?

సుమన్‌: లేదు.

ఆకాశ్‌: సరే, నీకు ఎప్పుడైనా తెలుసుకోవాలనిపిస్తే అడుగు, తప్పకుండా చెబుతాను.

[చిత్రం]

“హాయ్‌ నిఖిల్‌, నా పుట్టిన రోజు పార్టీకి నిన్ను ఆహ్వానించాలనుకుంటున్నాను”

[3వ పేజీలోని చిత్రం]

“నువ్వు జాతీయ గీతాన్ని ఎందుకు పాడవు?”