కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యారాధన విషయంలో ఆసక్తి కలిగివుండండి

సత్యారాధన విషయంలో ఆసక్తి కలిగివుండండి

సత్యారాధన విషయంలో ఆసక్తి కలిగివుండండి

“కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు.”—మత్త. 9:37.

1. అత్యవసర భావాన్ని మీరు ఎలా వివరిస్తారు?

 మీరు ఓ ముఖ్యమైన పని కోసం వెళ్తున్నారనుకోండి. మీకు ఆలస్యమైతే ఏమి చేస్తారు? “సమయం లేదు, త్వరగా పోనివ్వు!” అని డ్రైవర్‌ను తొందరపెడతారు. అవును, ఏదైనా పని పూర్తిచేయడానికి సమయం తక్కువగా ఉంటే మీరు ఎంతో ఒత్తిడికి, ఆవేశానికి గురౌతారు. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, వీలైనంత త్వరగా చేయడానికి మీ శక్తినంతా ఉపయోగిస్తారు. అదే అత్యవసర భావం!

2. నేటి నిజ క్రైస్తవులకు ఏ అత్యవసరమైన పని ఉంది?

2 రాజ్య సువార్తను ప్రకటించడం, సమస్త జనులను శిష్యులనుగా చేయడం కన్నా అత్యవసరమైన పని నేటి నిజ క్రైస్తవులకు మరొకటి ఉండదు. (మత్త. 24:14; 28:19, 20) యేసు చెప్పిన మాటల్ని ఉల్లేఖిస్తూ, అంతం రావడానికి “ముందు” ఆ పనే జరగాలని శిష్యుడైన మార్కు రాశాడు. (మార్కు 13:10) అది సముచితమే. ఎందుకంటే, యేసు ఇలా అన్నాడు: “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు.” పంట కోతకు వచ్చినప్పుడు, కోతకాలం అయిపోకముందే దాన్ని సమకూర్చాలి.—మత్త. 9:37.

3. ప్రకటనా పని చేయడం అత్యవసరమని గుర్తించిన చాలామంది ఎలా స్పందించారు?

3 ప్రకటనా పని అంత ప్రాముఖ్యమైనది కాబట్టే, ఆ పని చేసేందుకు సాధ్యమైనంత సమయాన్ని, శక్తిని, అవధానాన్ని మనమివ్వాలి. మెచ్చుకోదగిన విషయమేమిటంటే, చాలామంది సహోదర సహోదరీలు అదే చేస్తున్నారు. పయినీర్లుగా, మిషనరీలుగా, బెతెల్‌ సభ్యులుగా పూర్తికాల సేవ చేసేందుకు కొంతమంది తమ జీవితాల్ని సరళం చేసుకున్నారు. వారు ఎంతో బిజీగా ఉంటారు. వారు ఎన్నో త్యాగాలు చేసివుండవచ్చు. అంతేకాక, వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయినా, యెహోవా వారిని మెండుగా ఆశీర్వదించాడు. వారి విషయంలో మనం ఎంతో సంతోషిస్తున్నాం. (లూకా 18:28-30 చదవండి.) పూర్తికాల సేవ చేయలేని మరికొందరు, ఈ ప్రాణ రక్షక పనిలో సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అందులో భాగంగా, తమ పిల్లలు కూడా రక్షణ పొందేందుకు సహాయం చేస్తున్నారు.—ద్వితీ. 6:6, 7.

4. కొంతమంది అత్యవసర భావాన్ని ఎందుకు కోల్పోతుండవచ్చు?

4 పైన చూసినట్లుగా, అత్యవసర భావానికి కాల వ్యవధితో, నిర్ణీత గడువుతో, ఏదైనా ముగింపుతో సంబంధం ఉంది. మనం అంత్యదినాల్లో జీవిస్తున్నాం. అలా చెప్పేందుకు లేఖనాధారమైన, చారిత్రాత్మకమైన రుజువులు ఎన్నో ఉన్నాయి. (మత్త. 24:3, 33; 2 తిమో. 3:1-5) అయితే, అంతం ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. “యుగసమాప్తికి” సంబంధించిన “సూచన” ఇస్తున్నప్పుడు యేసు ఇలా అన్నాడు: “అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.” (మత్త. 24:36) అందుకే, ఎంతోకాలంగా అత్యవసర భావాన్ని చూపించిన కొంతమందికి, సంవత్సరాలు గడుస్తుండగా తమకున్న అత్యవసర భావాన్ని కాపాడుకోవడం కష్టమనిపిస్తుండవచ్చు. (సామె. 13:12) కొన్నిసార్లు మీకూ అలాగే అనిపిస్తుందా? యెహోవా, యేసుక్రీస్తు మనకు అప్పగించిన పని విషయంలో నేడు మనం అత్యవసర భావాన్ని ఎలా వృద్ధి చేసుకోవచ్చు లేదా కాపాడుకోవచ్చు?

మన మాదిరికర్తయైన యేసు ఏమి చేశాడో చూడండి

5. పరిచర్యకు సంబంధించి యేసు అత్యవసర భావాన్ని ఏయే విధాలుగా చూపించాడు?

5 దేవుని సేవ విషయంలో అత్యవసర భావాన్ని చూపించిన వారిలో యేసుక్రీస్తే అత్యుత్తమ మాదిరి. ఆయన అత్యవసర భావాన్ని చూపించడానికి గల ఒక కారణమేమిటంటే, కేవలం మూడున్నర సంవత్సరాల్లో తాను ఎంతో చేయాల్సివుంది. సత్యారాధనకు సంబంధించి ఎవ్వరూ చేయనంత పని ఆయన చేశాడు. ఆయన తన తండ్రి నామాన్నీ సంకల్పాన్నీ ప్రజలకు తెలియజేశాడు, రాజ్య సువార్తను ప్రకటించాడు, మతనాయకుల వేషధారణనూ వారి అబద్ధ బోధలనూ బట్టబయలు చేశాడు, యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడం కోసం మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. తాను వెళ్లిన ప్రతీ చోట ప్రజలకు బోధిస్తూ, సహాయం చేస్తూ, వారిని స్వస్థపరచడం ద్వారా యేసు స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించాడు. (మత్త. 9:35) అంత తక్కువ సమయంలో యేసు చేసినంతగా ఎవ్వరూ చేయలేదు, ఆయన కష్టపడినంతగా ఎవ్వరూ కష్టపడలేదు.—యోహా. 18:37.

6. యేసు తన జీవితంలో ముఖ్యంగా దేని గురించి ఆలోచించాడు?

6 యేసు తన పరిచర్య అంతటిలో ఎందుకు అవిశ్రాంతంగా పని చేశాడు? యెహోవా కాలపట్టిక ప్రకారం తన పనిని పూర్తి చేయడానికి తనకు ఎంత సమయం ఉందో దానియేలు ప్రవచనం నుండి యేసు గ్రహించాడు. (దాని. 9:27) కాబట్టి, ప్రవచనం ప్రకారం ఆయన పరిచర్య “అర్ధవారము” చివర్లో లేదా మూడున్నర సంవత్సరాల తర్వాత ముగుస్తుంది. సా.శ. 33 వసంత రుతువులో, యేసు విజయోత్సాహంతో యెరూషలేములోకి ప్రవేశించిన కొంచెం సమయం తర్వాత ఇలా అన్నాడు: “మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది.” (యోహా. 12:23) తాను త్వరలో చనిపోవాల్సిందేనని యేసుకు తెలిసినప్పటికీ ఆయన కష్టపడి పనిచేసేందుకు అదే ముఖ్య కారణం కాదు. తనకు దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకొని తన తండ్రి చిత్తం చేయడం గురించి, తోటి మానవుల పట్ల ప్రేమ చూపించడం గురించి ఆయన ముఖ్యంగా ఆలోచించాడు. ప్రజల పట్ల ఉన్న ప్రేమతోనే యేసు శిష్యులను తయారు చేసి వారికి శిక్షణను ఇచ్చాడు, ప్రకటనాపని కోసం వారిని పంపించాడు. తాను ప్రారంభించిన పనిని వారు కొనసాగించి తనకన్నా గొప్ప పనులు చేస్తారనే ఉద్దేశంతో ఆయన అలా పంపించాడు.—యోహాను 14:12 చదవండి.

7, 8. ఆలయాన్ని యేసు శుభ్రపరచినప్పుడు ఆయన శిష్యులు ఎలా స్పందించారు? యేసు ఎందుకు ఆ పని చేశాడు?

7 యేసు జీవితంలో జరిగిన ఒక సంఘటనను చూస్తే సత్యారాధనకు సంబంధించి ఆయనకు ఎంత ఆసక్తి ఉండేదో తెలుస్తుంది. అది సా.శ. 30 పస్కా పండుగ కాలం. యేసు తన పరిచర్యను ఆరంభించి అప్పటికి కొంతకాలమే అయింది. యేసు, ఆయన శిష్యులు యెరూషలేము దేవాలయానికి వెళ్లినప్పుడు అక్కడ, ‘ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మేవారు, రూకలు మార్చేవారు కూర్చోవడాన్ని చూశారు.’ అప్పుడు యేసు ఎలా స్పందించాడు? దాన్ని చూసిన శిష్యులపై అది ఎలాంటి ముద్ర వేసింది?—యోహాను 2:13-17 చదవండి.

8 ఆ సందర్భంలో యేసు అన్న మాటలను విని, ఆయన చేసిన పనిని చూసిన శిష్యులకు, “నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది” అని కీర్తనలో దావీదు రాసిన మాటలు గుర్తుకొచ్చాయి. (కీర్త. 69:9) ఎందుకంటే, యేసు చాలా సాహసంతో, ప్రమాదంతో కూడిన పనిచేశాడు. అక్రమ లాభాలను తెచ్చిపెట్టే ఆ వ్యాపారం వెనక ఆలయ అధికారులు అంటే యాజకులు, శాస్త్రులు, మరితరులు ఉన్నారు. వారి పనిని బట్టబయలు చేసి దాన్ని ఆపడం ద్వారా యేసు, ఆ కాలంలోని మతనాయకులకు తనను తాను శత్రువుగా చేసుకున్నాడు. యేసు శిష్యులు పరిస్థితిని సరిగ్గానే గ్రహించారు. ‘దేవుని ఇంటి’ విషయంలో లేదా సత్యారాధన విషయంలో యేసుకున్న “ఆసక్తి” స్పష్టంగా కనిపించింది. అయితే, ఆసక్తి అంటే ఏమిటి?

ఆసక్తి అంటే ఏమిటి?

9. ఆసక్తిని ఎలా వివరించవచ్చు?

9 ఒక నిఘంటువు ప్రకారం, “ఏదైనా ఒక పనిని మనస్ఫూర్తిగా చేయాలనే కోరిక, ఉత్సాహమే ఆసక్తి.” యేసు తన పరిచర్యలో ఈ లక్షణాలను చూపించాడు. పై పేరాలో ప్రస్తావించబడిన లేఖనం ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌లో ఇలా ఉంది: “నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది.” కొన్ని ప్రాచీన భాషల్లో, “ఆసక్తి” అనే పదం అక్షరార్థంగా “మండుతున్న హృదయం” అని అర్థమిచ్చే రెండు పదాలతో రూపొందింది. ఆలయంలో యేసు చేసిన పనిని చూసి ఆయన శిష్యులు దావీదు రాసిన మాటలను గుర్తుచేసుకున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. ఇంతకీ, ఆలయంలో ఆ పని చేసేలా యేసు హృదయాన్ని దహించివేసింది ఏమిటి?

10. “ఆసక్తి” అని బైబిల్లో ఉపయోగించబడిన పదానికి అర్థమేమిటి?

10 దావీదు రాసిన కీర్తనలోని “ఆసక్తి” అనే పదం ఒక హెబ్రీ పదం నుండి తీసుకోబడింది. ఆ పదం, బైబిల్లోని కొన్ని భాగాల్లో తరచూ “రోషము” అని అనువదించబడింది. నూతనలోక అనువాదంలో కొన్నిసార్లు అది ‘ఏక భక్తిని కోరడం’ అని అనువదించబడింది. (నిర్గమకాండము 20:5; 34:14; యెహోషువ 24:19 చదవండి.) ఒక బైబిలు నిఘంటువు ఆ పదం గురించి ఇలా చెబుతోంది: “ఈ పదం తరచూ వివాహ బంధానికి సంబంధించి ఉపయోగించబడుతుంది . . . ఒక వ్యక్తి తన భర్త/భార్య మీద తనకున్న హక్కును దృఢంగా సమర్థించుకున్నట్లే, తన ప్రజలు తనను మాత్రమే ఆరాధించాలని కోరే విషయంలో తనకున్న హక్కును దేవుడు సమర్థించుకుంటాడు, నిరూపించుకుంటాడు.” కాబట్టి, ఆసక్తి అని బైబిల్లో ఉపయోగించబడిన పదం, ఇష్టమైన ఆట వంటివాటి పట్ల చూపించే గట్టి పట్టుదల లేదా ఉత్సాహం కన్నా ఎక్కువైనదాన్నే సూచిస్తుంది. దావీదు చూపించిన ఆసక్తి రోషముతో కూడినది. ఆ రోషము వ్యతిరేకతను లేదా దూషణను సహించదు కానీ, మంచి పేరును కాపాడాలని లేదా జరిగిన హానిని సరిచేయాలని బలంగా కోరుకుంటుంది.

11. యేసు ఎందుకు చాలా కష్టపడి పనిచేశాడు?

11 ఆలయంలో యేసు చేసిన దాన్ని చూసి ఆయన శిష్యులు సరిగ్గానే దావీదు రాసిన మాటలను గుర్తు చేసుకున్నారు. యేసు, తనకు పరిమిత సమయం ఉన్నందువల్ల మాత్రమే కాదుగానీ, తన తండ్రి నామం విషయంలో, సత్యారాధన విషయంలో తనకున్న ఆసక్తి లేక రోషం వల్లనే చాలా కష్టపడి పనిచేశాడు. దేవుని నామం మీదికి వచ్చిన నిందను, దూషణను చూసినప్పుడు ఆయన రోషంతో పరిస్థితిని చక్కదిద్దడానికి చొరవ తీసుకున్నాడు. అంతేకాక, మతనాయకులు దీనులైన ప్రజలను అణచివేయడాన్ని, మోసం చేయడాన్ని చూసి అదే రోషంతో ఆయన వారిని ప్రజలందరి ముందు తీవ్రంగా విమర్శించాడు, ప్రజలకు ఉపశమనం కలిగించాడు.—మత్త. 9:36; 23:2, 4, 27, 28, 33.

సత్యారాధన విషయంలో ఆసక్తి కలిగివుండండి

12, 13. నేటి నామకార్థ క్రైస్తవ మతనాయకులు (ఎ) దేవుని నామం విషయంలో, (బి) దేవుని రాజ్యం విషయంలో ఏమి చేశారు?

12 నేడు దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకునేవారి లక్షణాలు, పనులు యేసు కాలంలోని వారిలాగే ఉన్నాయి, చెప్పాలంటే అంతకన్నా ఘోరంగానే ఉన్నాయి. ఉదాహరణకు, ఎలా ప్రార్థించాలో యేసు తన శిష్యులకు నేర్పిస్తున్నప్పుడు మొదటిగా దేవుని నామం గురించి ప్రార్థించమని చెప్పాడని గుర్తుచేసుకోండి. ఆయనిలా నేర్పించాడు: “నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” (మత్త. 6:9, 10) నేటి మతనాయకులు, ముఖ్యంగా నామకార్థ క్రైస్తవ మతనాయకులు దేవుని నామం గురించి, దాన్ని పరిశుద్ధపరచడం, ఘనపర్చడం గురించి నేర్పించడాన్ని మనం చూస్తున్నామా? లేదు. బదులుగా వారు త్రిత్వం, అమర్త్యమైన ఆత్మ, నరకం వంటి అబద్ధ సిద్ధాంతాలు బోధించడం ద్వారా దేవుని విషయంలో ప్రజలకు తప్పుడు అభిప్రాయం ఏర్పడేలా చేశారు, ఆయనను ఒక నిగూఢమైన వ్యక్తిగా, అవగాహనకు అంతుపట్టనివానిగా, క్రూరునిగా, ఇతరులను బాధపెడుతూ సంతోషించే వ్యక్తిగా చిత్రీకరించారు. అంతేకాక, తమ అవమానకరమైన ప్రవర్తనతో, వేషధారణతో వారు దేవుని మీదికి నిందను తీసుకొచ్చారు. (రోమీయులు 2:21-24 చదవండి.) దేవుని నామం మరుగున పడేలా తాము చేయగలిగినదంతా చేశారు, చివరకు ఆయన పేరును తమ బైబిలు అనువాదాల్లో నుండి తీసేశారు కూడా. వారు అలా చేయడం ద్వారా ప్రజలు దేవునికి సన్నిహితం కాకుండా, ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పర్చుకోకుండా చేశారు.—యాకో. 4:7, 8.

13 దేవుని రాజ్యం గురించి కూడా ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పించాడు. ఆయనిలా అన్నాడు: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్త. 6:9, 10) నామకార్థ క్రైస్తవ మతనాయకులు ఆ ప్రార్థనను ఎన్నోసార్లు వల్లించినా రాజకీయ సంస్థలకు, ఇతర మానవ సంస్థలకు మద్దతివ్వాలని ప్రజలను ప్రేరేపించారు. అంతేకాక, దేవుని రాజ్యం గురించి సాక్ష్యమిచ్చే వారిని వారు చిన్నచూపు చూస్తున్నారు. దానివల్ల, క్రైస్తవులమని చెప్పుకునే చాలామంది దేవుని రాజ్యం గురించి చర్చించుకోవడం లేదు, దానిపై విశ్వాసం కూడా ఉంచడం లేదు.

14. నామకార్థ క్రైస్తవ మతనాయకులు దేవుని వాక్యాన్ని ఎలా నీరుగార్చారు?

14 దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు యేసు స్పష్టంగా ఇలా అన్నాడు: “నీ వాక్యమే సత్యము.” (యోహా. 17:17) యేసు పరలోకానికి తిరిగి వెళ్లిపోయే ముందు, తన ప్రజలకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ణ్ణి]” నియమిస్తానని తెలియజేశాడు. (మత్త. 24:45) నామకార్థ క్రైస్తవ మతనాయకులు ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నామని చెప్పుకుంటున్నా, యజమాని తమకు అప్పగించిన పనిని నమ్మకంగా చేశారా? లేదు. వారు బైబిల్లో కట్టుకథలు ఉన్నాయని చెబుతున్నారు. తమ మందను ఆధ్యాత్మిక ఆహారంతో పోషించి వారికి ఓదార్పును, అవగాహనను ఇచ్చే బదులు తమ సభ్యులను ప్రీతిపర్చేందుకు మానవ తత్వ జ్ఞానాన్ని బోధించారు. అంతేకాక, ప్రజలకు ఇష్టమైన కొత్త నైతిక ప్రమాణాలకు మద్దతివ్వడానికి వారు దేవుడు ఏర్పరచిన నైతిక ప్రమాణాల్ని నీరుగార్చారు.—2 తిమో. 4:3, 4.

15. దేవుని పేరిట మతనాయకులు చేసిన వాటన్నిటిని బట్టి మీకేమనిపిస్తుంది?

15 బైబిల్లో పేర్కొనబడిన దేవుని పేరిట కొంతమంది చేసిన పనుల వల్ల చాలామంది యథార్థహృదయులు నిరాశ చెందారు. అంతేకాక దేవునిపై, బైబిలుపై తమకున్న విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. వారు సాతానుకు, అతడి దుష్ట వ్యవస్థకు చిక్కారు. ప్రతీరోజు మతనాయకులు చేస్తున్న పనులను చూస్తున్నప్పుడు, వాటి గురించి వింటున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? యెహోవా సేవకులుగా, యెహోవా నామం మీదికి వచ్చిన నిందను, దూషణను చూసినప్పుడు, వాటిని తీసివేయడానికి చేయగలిగినదంతా చేయాలని మీకనిపించదా? యథార్థహృదయులు మోసగించబడడాన్ని, అణచివేయబడడాన్ని చూసినప్పుడు అలాంటి వారికి ఓదార్పునివ్వాలని మీకనిపించదా? తన కాలంలోని ప్రజలు, “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున” యేసు వారిమీద కనికరపడడమేకాక, “వారికి అనేక సంగతులను బోధింపసాగెను.” (మత్త. 9:36; మార్కు 6:34) సత్యారాధన విషయంలో యేసులాగే ఆసక్తిని కలిగివుండడానికి మనకు సరైన కారణాలే ఉన్నాయి.

16, 17. (ఎ) మనం పరిచర్యలో ఎందుకు కష్టపడి పనిచేస్తాం? (బి) మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

16 మనం ఆసక్తితో పరిచర్యను చేసినప్పుడు మన జీవితాల్లో 1 తిమోతి 2:3, 4లో పౌలు రాసిన మాటలకు ప్రత్యేకమైన అర్థముంటుంది. (చదవండి.) మనం పరిచర్యలో కష్టపడి పనిచేసేది అంత్యదినాల్లో జీవిస్తున్నామని తెలిసినందువల్ల మాత్రమే కాదు. కానీ ప్రజలు తనను ఆరాధించడాన్ని, సేవించడాన్ని నేర్చుకొని ఆశీర్వాదాలు పొందేలా వారు సత్యం గురించిన జ్ఞానాన్ని కలిగివుండాలన్నదే దేవుని చిత్తమని గుర్తించాం కాబట్టి మనం పరిచర్యలో కష్టపడి పనిచేస్తాం. ముఖ్యంగా అంతం సమీపిస్తున్నందుకు మాత్రమే కాదుగానీ మనం దేవుని నామాన్ని ఘనపరచి, ఆయన చిత్తం గురించి తెలుసుకునేలా ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అలా చేస్తాం. మనం సత్యారాధన విషయంలో ఆసక్తిని కలిగివున్నాం.—1 తిమో. 4:16.

17 యెహోవా ప్రజలముగా మనం, మానవుల పట్ల, భూమి పట్ల యెహోవాకున్న సంకల్పం గురించిన నిజమైన జ్ఞానం చేత ఆశీర్వదించబడ్డాం. ప్రజలు సంతోషాన్ని అనుభవించేలా, భవిష్యత్తుపై ఆశ కలిగి జీవించేలా వారికి సహాయం చేసే స్థితిలో మనం ఉన్నాం. సాతాను విధానం మీదికి నాశనం వచ్చినప్పుడు తప్పించుకునే మార్గాన్ని వారికి చూపించవచ్చు. (2 థెస్స. 1:6-8) యెహోవా దినం ఆలస్యమౌతున్నట్లుందని నిరాశపడే బదులు, సత్యారాధన విషయంలో ఆసక్తిని కలిగివుండేందుకు మనకు ఇంకా సమయం ఉందని సంతోషించాలి. (మీకా 7:7; హబ. 2:3) మనం అలాంటి ఆసక్తిని ఎలా పెంపొందించుకోవచ్చు? దీన్ని మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

మీరు వివరించగలరా?

• యేసు తన పరిచర్య అంతటిలో ఎందుకు అవిశ్రాంతంగా పని చేశాడు?

• “ఆసక్తి” అని బైబిల్లో ఉపయోగించబడిన పదానికి అర్థమేమిటి?

• సత్యారాధన విషయంలో ఆసక్తిని కలిగివుండేలా చేసే దేన్ని నేడు మనం చూస్తున్నాం?

[అధ్యయన ప్రశ్నలు]

[8వ పేజీలోని చిత్రం]

తన తండ్రి చిత్తం చేయడం, తోటి మానవుల పట్ల ప్రేమ చూపించడం గురించే యేసు ముఖ్యంగా ఆలోచించాడు

[10వ పేజీలోని చిత్రం]

సత్యారాధన విషయంలో ఆసక్తి కలిగివుండడానికి మనకు

సరైన కారణాలే ఉన్నాయి