కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాకు కీర్తనలు పాడదాం!

యెహోవాకు కీర్తనలు పాడదాం!

యెహోవాకు కీర్తనలు పాడదాం!

“నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను.”—కీర్త. 146:2.

1. కొన్ని పాటలను కూర్చడానికి దావీదును ఏది ప్రేరేపించింది?

 తాను యౌవనుడిగా ఉన్నప్పుడు, బేత్లెహేముకు దగ్గర్లోవున్న పొలాల్లో తన తండ్రి గొర్రెల్ని కాస్తూ దావీదు ఎన్నో గంటలు గడిపేవాడు. ఆ సమయంలో ఆయన, అద్భుతమైన యెహోవా సృష్టిని అంటే, నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని, “అడవి మృగములను, ఆకాశ పక్షులను” గమనించాడు. తాను చూసినవాటిని బట్టి దావీదు ఎంతగా పులకించిపోయాడంటే, ఆ అద్భుతమైన సృష్టిని చేసిన వ్యక్తిని స్తుతించడానికి హృదయాన్ని ప్రేరేపించే పాటలను కూర్చాడు. ఆయన కూర్చిన చాలా పాటలు కీర్తనల పుస్తకంలో కనిపిస్తాయి. aకీర్తన 8:3, 4, 7-9 చదవండి.

2. (ఎ) సంగీతం ఓ వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపించగలదు? ఓ ఉదాహరణ చెప్పండి. (బి) యెహోవాతో దావీదుకున్న సంబంధం గురించి కీర్తన 34:7, 8 మరియు కీర్తన 139: 2-8 వచనాల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

2 బహుశా ఆ సమయంలోనే దావీదు సంగీతకారునిగా తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని ఉంటాడు. నిజానికి, సంగీతంలో ఆయన ఎంత నైపుణ్యాన్ని సాధించాడంటే, రాజైన సౌలు దగ్గర సితారా వాయించడానికి పిలిపించబడ్డాడు. (సామె. 22:29) మంచి సంగీతం విన్నప్పుడు ఎలాగైతే మనం ఉపశమనం పొందుతామో, అలాగే దావీదు వాయించిన సంగీతం విన్నప్పుడు విచారంలోవున్న సౌలు రాజు కూడా ఎంతో ఉపశమనాన్ని పొందాడు. దావీదు సితారా వాయించినప్పుడెల్లా సౌలు, “సేదదీరి బాగాయెను.” (1 సమూ. 16:23) ఈ దైవభక్తిగల సంగీతకారుడు, పాటల రచయిత కూర్చిన పాటలు నేటికీ ఎంతో విలువైనవి. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి! దావీదు పుట్టి 3,000 కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ భూవ్యాప్తంగా అన్ని నేపథ్యాల నుండి వచ్చిన లక్షలాదిమంది ప్రజలు ఓదార్పు, నిరీక్షణ కోసం దావీదు రాసిన కీర్తనలను క్రమంగా చదువుతుంటారు.—2 దిన. 7:5; కీర్తన 34:7, 8; 139:2-8 చదవండి.

సత్యారాధనలో సంగీతానికి ఎంతో ప్రాముఖ్యమైన స్థానం ఉంది

3, 4. దావీదు కాలంలో పవిత్రమైన సంగీతాన్ని ఉపయోగించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయబడ్డాయి?

3 దావీదుకు సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యాన్ని ఆయన అత్యుత్తమమైన రీతిలో అంటే యెహోవాను స్తుతించడానికి ఉపయోగించాడు. దావీదు ఇశ్రాయేలీయులపై రాజైన తర్వాత, మందిర గుడారానికి సంబంధించిన సేవల్లో చక్కని సంగీతం కూడా ఉండేలా ఏర్పాటుచేశాడు. “యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన” 288 మందితోపాటు, ఆలయ సేవలోవున్న లేవీయుల్లోని పదోవంతు కన్నా ఎక్కువమంది అంటే 4,000 మంది లేవీయులు కూడా “స్తుతించువారుగా” నియమించబడ్డారు.—1 దిన. 23:3, 5; 25:7.

4 లేవీయులు వాద్యములను ఉపయోగించి పాడిన అనేక కీర్తనలను దావీదే కూర్చాడు. ఆయన కూర్చిన పాటలను లేవీయులు పాడుతున్నప్పుడు వినే అవకాశం దొరికిన ఇశ్రాయేలీయుల హృదయాలను ఆ పాటలు ఎంతగానో స్పృశించి ఉంటాయి. ఆ తర్వాత, నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకువచ్చినప్పుడు, “దావీదు—మీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములులోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వని చేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.”—1 దిన. 15:16.

5, 6. (ఎ) దావీదు పరిపాలనలో సంగీతానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వబడింది? (బి) ప్రాచీన ఇశ్రాయేలీయుల ఆరాధనలో సంగీతానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడేదని మనకెలా తెలుసు?

5 దావీదు కాలంలో సంగీతానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వబడింది? కేవలం రాజు సంగీతకారుడు అయినందువల్లా? కాదు. దానికి మరో కారణం ఉంది. శతాబ్దాల తర్వాత నీతిమంతుడైన హిజ్కియా రాజు ఆలయ సేవలను తిరిగి ప్రారంభించినప్పుడు ఆ కారణమేమిటో స్పష్టమైంది. 2 దినవృత్తాంతములు 29:25లో మనమిలా చదువుతాం: “దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతానును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు [హిజ్కియా] లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి యుండెను.”

6 పాటలు పాడుతూ తనను స్తుతించమని యెహోవాయే ప్రవక్తల ద్వారా తన ఆరాధికులను నిర్దేశించాడు. అంతేకాక, యాజక గోత్రానికి చెందిన గాయకులు పాటలు కూర్చడానికి, బహుశా వాటిని ప్రాక్టీసు చేయడానికి తగినంత సమయం వెచ్చించేలా, ఇతర లేవీయులు చేయాల్సిన పనుల నుండి వారికి మినహాయింపు కూడా ఇవ్వబడింది.—1 దిన. 9:33.

7, 8. రాజ్య గీతాలను పాడే విషయంలో సామర్థ్యం ఉండడం కన్నా ప్రాముఖ్యమైనది ఏమిటి?

7 “నాకు పాడడం అంతగా రాదు కాబట్టి, ఒకవేళ నేను ఆ కాలంలో జీవించి ఉంటే మందిర గుడారం దగ్గర పాడిన ప్రవీణుల్లో ఒకనిగా అసలు ఉండేవాడినే కాదు!” అని మీరనవచ్చు. అయితే, సంగీతకారులైన లేవీయుల్లో అందరూ ప్రవీణులు కారు. 1 దినవృత్తాంతములు 25:8 ప్రకారం, వారిలో ‘శిష్యులు’ లేక నేర్చుకునేవారు కూడా ఉన్నారు. బహుశా ఇశ్రాయేలు ఇతర గోత్రాల్లో కొందరు ప్రవీణులైన సంగీతకారులు, గాయకులు ఉన్నప్పటికీ సంగీతానికి సంబంధించిన పనిని యెహోవా లేవీయులకే అప్పగించాడనే విషయాన్ని గమనించండి. ప్రవీణులైనా, నేర్చుకునేవారైనా ఆ నమ్మకమైన లేవీయులందరు తమకివ్వబడిన పనిని చేయడానికి శాయశక్తులా కృషి చేశారు.

8 దావీదుకు సంగీతమంటే ఎంతో ఇష్టం, అంతేకాదు ఆయన దానిలో ప్రవీణుడు కూడా. అయితే, దేవుడు ఓ వ్యక్తికున్న సామర్థ్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాడా? కీర్తన 33:3లో దావీదు ఇలా రాశాడు: “ఆయననుగూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా [మీరు చేయగలిగినదంతా చేస్తూ,’ NW] వాయించుడి.” తనను స్తుతించడానికి మనం చేయగలిగినదంతా చేస్తున్నామా లేదా అనే దాన్నే యెహోవా పరిగణలోకి తీసుకుంటాడని ఈ మాటలను బట్టి తెలుస్తోంది.

దావీదు కాలం తర్వాత సత్యారాధనలో సంగీతానికున్న పాత్ర

9. సొలొమోను పరిపాలనలో ఆలయ ప్రతిష్ఠాపనకు మీరు హాజరైవుంటే ఏమి చూసి ఉండేవారు, ఏమి విని ఉండేవారు?

9 సొలొమోను పరిపాలిస్తున్నప్పుడు సత్యారాధనలో సంగీతానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఆలయ ప్రతిష్ఠాపన సమయంలో, అక్కడ 120 మంది బూరలు ఊదే యాజకులతోసహా పూర్తి వాద్యబృందం ఉంది. (2 దినవృత్తాంతములు 5:12, 13ఎ చదవండి.) “బూరలు ఊదువారును [వీరందరూ యాజకులే] పాటకులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు . . . యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి” అని బైబిలు చెబుతోంది. వారి ఉత్సాహధ్వని ఆకాశం వైపు వెళ్లిన వెంటనే, యెహోవా దాన్ని అంగీకరించాడనే దానికి సూచనగా ఒక “మేఘము యెహోవా మందిరమునిండ నిండెను.” బూరల ధ్వని, వేలాదిమంది గాయకుల స్వరం కలిసి వినబడినప్పుడు, దాన్ని విన్నవారు ఎంతో పులకించిపోయి ఉంటారు, వారిలో భక్తిపూర్వక భయం నిండివుంటుంది.—2 దిన. 5:13, 14.

10, 11. తొలి క్రైస్తవులు తమ ఆరాధనలో సంగీతాన్ని ఉపయోగించారని ఏది చూపిస్తోంది?

10 మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా తమ ఆరాధనలో సంగీతాన్ని ఉపయోగించారు. అయితే, వారు మందిర గుడారాల్లో లేదా ఆలయాల్లో కాదుగానీ, కొంతమంది వ్యక్తుల ఇళ్లలో సమకూడేవారు. హింస, మరితర కారణాల వల్ల, తరచూ వారి పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినా వారు అలా సమకూడేవారు, పాటలతో దేవుణ్ణి స్తుతించేవారు.

11 ‘సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికొకడు బుద్ధి చెప్పుచు’ ఉండమని అపొస్తలుడైన పౌలు కొలొస్సయిలోని సహోదరులకు చెప్పాడు. (కొలొ. 3:16) పౌలు సీలలు చెరసాలలో వేయబడినప్పుడు తమ దగ్గర పాటల పుస్తకం లేకపోయినా, “దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి.” (అపొ. 16:25) ఒకవేళ మీరు జైళ్లో వేయబడితే, ఎన్ని రాజ్య గీతాలను గుర్తుచేసుకొని పాడగలుగుతారు?

12. రాజ్య గీతాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?

12 సత్యారాధనలో సంగీతానికి ఎంతో ప్రాముఖ్యమైన స్థానం ఉంది కాబట్టి, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేను దానికి ఇవ్వాల్సిన విలువను ఇస్తున్నానా? సహోదర సహోదరీలతో కలిసి ప్రారంభ పాటను పాడేలా కూటాలకు, సమావేశాలకు త్వరగా వెళ్లడానికి నేను చేయగలిగినదంతా చేస్తున్నానా? నేను పాటను అర్థంచేసుకుంటూ పాడతానా? దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకూ సేవా కూటానికీ మధ్య పాడే పాటను, బహిరంగ ప్రసంగానికీ కావలికోట అధ్యయనానికీ మధ్య పాడే పాటను విరామ సమయంగా ఎంచకూడదని, బహుశా కాళ్లు పట్టేశాయని అనవసరంగా సీట్లలో నుండి లేచి కొద్దిసేపు అటూఇటూ తిరిగేందుకు దాన్ని అవకాశంగా తీసుకోవద్దని నేను నా పిల్లలకు చెబుతానా?’ పాటలు పాడడం మన ఆరాధనలో భాగం. కాబట్టి, పాడడంలో ప్రవీణులమైనా లేదా నేర్చుకునేవారమైనా మనందరం యెహోవాను స్తుతించేందుకు మన గళాన్ని కలపగలుగుతాం, కలపాలి కూడా.—2 కొరింథీయులు 8:12ను పోల్చండి.

సమయం గడుస్తుండగా మన అవసరాలు మారతాయి

13, 14. సంఘకూటాల్లో హృదయపూర్వకంగా పాడడం ఎందుకు ప్రాముఖ్యం? ఒక ఉదాహరణ చెప్పండి.

13 రాజ్య గీతాలు చాలా ప్రాముఖ్యమైనవని చెప్పేందుకున్న ఓ కారణాన్ని వివరిస్తూ, జాయన్స్‌ వాచ్‌టవర్‌ 100 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం ఇలా అంది: “దేవుని ప్రజల మనసుల్లో, హృదయాల్లో సత్యం లోతుగా నాటుకోవాలంటే దానికి సంబంధించిన పాటలు పాడడం ఓ మంచి విధానం.” మన పాటల్లోని చాలా పదాలు లేఖన భాగాలకు సంబంధించినవి కాబట్టి, కొన్ని పాటల్లోని పదాలనైనా మనం నేర్చుకున్నట్లైతే సత్యం మన హృదయంలో లోతుగా నాటుకుంటుంది. సంఘమంతా హృదయపూర్వకంగా పాడడాన్ని చూసినప్పుడు, మన కూటాలకు మొదటిసారిగా వచ్చినవారు తరచూ పులకించిపోయారు.

14 సి. టి. రస్సెల్‌ 1869లో ఓ రోజు సాయంత్రం తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు ఆయనకు ఓ భవనం లోపల నుండి పాట వినిపించింది. అప్పటికే, దేవుని గురించిన సత్యాన్ని ఇక ఎప్పటికీ తెలుసుకోలేనని ఆయన అనుకున్నాడు. కాబట్టి, వ్యాపారానికి అంకితమైపోయి బాగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అలా చేస్తే, ప్రజలకు దేవుని గురించిన సత్యం నేర్పించలేకపోయినా వారి భౌతిక అవసరాలు తీర్చవచ్చనుకున్నాడు. సహోదరుడు రస్సెల్‌, దుమ్ముపట్టిన, చీకటిగావున్న ఆ హాలులోకి వెళ్లి అక్కడ మత సేవలు జరగడాన్ని చూసి అక్కడే కూర్చొని విన్నాడు. ఆ రాత్రి తాను విన్న విషయాలు, “బైబిలు దైవప్రేరేపితమనే విషయంపై సన్నగిల్లిన [తన] విశ్వాసాన్ని దేవుని సహాయంతో తిరిగి బలపర్చుకోవడానికి సరిపోయాయి” అని రస్సెల్‌ ఆ తర్వాత రాశాడు. పాటవల్లే సహోదరుడు రస్సెల్‌ మొదట్లో కూటానికి ఆకర్షితుడయ్యాడనే విషయాన్ని గమనించండి.

15. అవగాహనలో వచ్చిన ఎలాంటి మార్పులవల్ల పాటల పుస్తకానికి మార్పులు చేయాల్సి వచ్చింది?

15 సమయం గడుస్తుండగా, లేఖనాల అవగాహనలో మార్పులు వచ్చాయి. సామెతలు 4:18 ఇలా చెబుతోంది: “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.” మన అవగాహనలో వచ్చిన మార్పులవల్ల పాటల్లో కూడా మార్పులు చేయడం అవసరమైంది. చాలా దేశాల్లోని యెహోవాసాక్షులు, యెహోవాకు స్తుతిగీతాలు పాడండి (ఆంగ్లం) b అనే పాటల పుస్తకాన్ని గత 25 సంవత్సరాలుగా ఉపయోగిస్తూ వచ్చారు. ఆ పుస్తకం మొదట విడుదల చేయబడినప్పటి నుండి చాలా విషయాలపై మన అవగాహన పెరిగింది. అంతేకాదు, ఆ పుస్తకంలోని కొన్ని పదాలు సరైనవి కావని తెలిసింది. ఉదాహరణకు, మనమిప్పుడు “నూతన క్రమం” అనే మాటకు బదులు “నూతన లోకం” అనే మాటను ఉపయోగిస్తున్నాం. అంతేకాదు, ప్రేమ, సంతోషం, సమాధానం అనేవి “ఆత్మఫలాలు” కావని, అవి “ఆత్మఫలంలోని” వివిధ అంశాలని తెలుసుకున్నాం. కాబట్టి, సిద్ధాంతపరమైన విషయాలనుబట్టి మన పాటల పుస్తకానికి మార్పులు అవసరమయ్యాయి.

16. ఎఫెసీయులు 5:19లో పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించేందుకు కొత్త పాటల పుస్తకం ఎలా సహాయం చేస్తుంది?

16 సిద్ధాంతపరమైన కారణాలను బట్టి, మరితర కారణాలను బట్టి, యెహోవాకు కీర్తనలు పాడదాం అనే ఓ కొత్త పుస్తకాన్ని ప్రచురించేందుకు పరిపాలక సభ ఆమోదించింది. కొత్త ఆంగ్ల పాటల పుస్తకంలో పాటల సంఖ్య 135కు తగ్గించబడింది. ప్రస్తుతం తెలుగులో 55 పాటలున్న బ్రోషురు అందుబాటులో ఉంది. కాబట్టి వాటిలో కనీసం కొన్నింటినైనా కంఠస్థం చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ఇది ఎఫెసీయులు 5:19లో పౌలు ఇచ్చిన ఉపదేశానికి అనుగుణంగా ఉంది.—చదవండి.

మీరు మీ కృతజ్ఞతను చూపించవచ్చు

17. క్రైస్తవ కూటాల్లో సరిగ్గా పాడకపోతే ఇతరులు నవ్వుతారేమోననే భయాన్ని తీసేసుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

17 క్రైస్తవ కూటాల్లో సరిగ్గా పాడకపోతే ఇతరులు నవ్వుతారేమోననే భయంతో మనం గట్టిగా పాడకుండా ఉండాలా? ఒకసారి దీని గురించి ఆలోచించండి: మాట్లాడేటప్పుడు మనందరం ఎన్నోసార్లు “తప్పిపోతాం” లేదా తడబడతాం కదా? (యాకో. 3:2) అయినా, ఇంటింటి సేవలో యెహోవాను స్తుతించడానికి మనం మన అపరిపూర్ణ మాటల్నే ఉపయోగిస్తాం. అలాంటప్పుడు, పాట పాడడం ద్వారా యెహోవాను స్తుతించడానికి మన అపరిపూర్ణ స్వరాన్ని ఎందుకు ఉపయోగించకూడదు? తనను స్తుతించడానికి మానవులు తమ స్వరాలను ఉపయోగించినప్పుడు “మానవునకు నోరిచ్చిన” యెహోవా ఎంతో సంతోషిస్తాడు.—నిర్గ. 4:11.

18. చాలామంది సహోదర సహోదరీలు కొత్త పాటలను ఎలా నేర్చుకోగలిగారు?

18 యెహోవాకు కీర్తనలు పాడదాం—సంగీతం సీడీల సహాయంతో చాలామంది సహోదర సహోదరీలు కొత్త పాటలను నేర్చుకోగలిగారు. ఆ సంగీతాన్ని వినడానికి చాలామంది ఇష్టపడతారు. ఇంట్లో ఉన్నప్పుడు తరచూ మీరు వాటిని వింటే కొత్తపాటల్లో కనీసం కొన్నింటినైనా త్వరగా నేర్చుకుంటారు, రాజ్యమందిరంలో మరింత ధైర్యంతో గట్టిగా పాడగలుగుతారు.

19. రాజ్య గీతాల కోసం వాద్యబృంద సంగీతం ఎలా సిద్ధం చేయబడుతుంది?

19 సమావేశాల్లో సంగీతం ప్లే చేయబడుతున్నప్పుడు, మనం దాన్ని తేలిగ్గా తీసుకునే అవకాశముంది. కానీ, ఆ సంగీతాన్ని తయారు చేయడానికి ఎంతో కృషి జరుగుతుంది. సంగీతం ఎంచుకోబడిన తర్వాత స్వరచిహ్నాలను జాగ్రత్తగా రాసి వాటిని వాయించడానికి 64 మంది ఉన్న వాచ్‌టవర్‌ వాద్యబృందానికి ఇవ్వాలి. ఆ సంగీతకారులు ఎన్నో గంటలపాటు సంగీతాన్ని బాగా అధ్యయనం చేసి, ప్రాక్టీసు చేసిన తర్వాత చివరకు, న్యూయార్క్‌లోని ప్యాటర్‌సన్‌లో ఉన్న స్టూడియోల్లో రికార్డు చేస్తారు. ఆ బృందంలోని 10 మంది అమెరికా వాసులు కాదు. దైవపరిపాలనా కార్యక్రమాల కోసం చక్కని సంగీతాన్ని అందించడంలో భాగంవహించడాన్ని వీరంతా గొప్ప అవకాశంగా ఎంచుతారు. వారు ప్రేమతో చేసిన కృషి పట్ల మనం మన కృతజ్ఞతను చూపించవచ్చు. సంగీతాన్ని వినమని కార్యక్రమ చైర్మన్‌ మనల్ని ఆహ్వానించినప్పుడు, మనం మన సీట్లలో కూర్చొని ప్రేమతో తయారు చేయబడిన సంగీతాన్ని నిశ్శబ్దంగా విందాం.

20. మీరు ఏమి చేయాలని నిశ్చయించుకున్నారు?

20 తనను స్తుతించడానికి మనం పాడే పాటలను యెహోవా శ్రద్ధగా వింటాడు. ఆయన వాటిని ప్రాముఖ్యమైనవిగా ఎంచుతాడు. కాబట్టి, ఆరాధన కోసం సమకూడినప్పుడెల్లా నిండు హృదయంతో గట్టిగా పాడడం ద్వారా మనం ఆయన హృదయాన్ని సంతోషపెట్టగలుగుతాం. మనం ప్రవీణులమైనా కాకపోయినా ‘యెహోవాకు కీర్తనలు పాడదాం!’—కీర్త. 104:33.

[అధస్సూచీలు]

a ఆసక్తికరంగా, దావీదు చనిపోయిన పది శతాబ్దాల తర్వాత, బేత్లెహేము దగ్గర్లోని పొలాల్లో తమ మందల్ని కాస్తున్న గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూతలు వచ్చి మెస్సీయ పుట్టాడనే విషయాన్ని చెప్పారు.—లూకా 2:4, 5, 8, 13, 14.

b మొత్తం 225 పాటలున్న పుస్తకం 100 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉండేది. కానీ, 16 సంవత్సరాల క్రితం విడుదల చేయబడిన తెలుగు పాటల బ్రోషుర్‌లో 29 పాటలు మాత్రమే ఉండేవి.

మీరేమి అనుకుంటున్నారు?

• సత్యారాధనలో సంగీతానికి ఎంతో ప్రాముఖ్యమైన స్థానం ఉందని ఏ ప్రాచీనకాల ఉదాహరణలు చూపిస్తున్నాయి?

మత్తయి 22:37లో యేసు ఇచ్చిన ఆజ్ఞకు లోబడడానికి, రాజ్య గీతాలను హృదయపూర్వకంగా పాడడానికి మధ్యవున్న సంబంధమేమిటి?

• రాజ్య గీతాలపట్ల మన కృతజ్ఞతను ఏయే విధాలుగా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[23వ పేజీలోని చిత్రం]

పాట పాడుతున్నప్పుడు అనవసరంగా సీటు దగ్గర నుండి వెళ్లకుండా మీరు మీ పిల్లల్ని ఆపుతారా?

[24వ పేజీలోని చిత్రం]

కొత్త పాటల పుస్తకంలోని పాటల్ని ఇంటి దగ్గర నేర్చుకుంటున్నారా?