కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏదెను తోట—అది మనుషుల మొదటి గృహమా?

ఏదెను తోట—అది మనుషుల మొదటి గృహమా?

ఏదెను తోట—అది మనుషుల మొదటి గృహమా?

మీరు ఒక తోటలో ఉన్నట్టు ఊహించుకోండి. మీ ఆలోచనను పక్కకు మళ్లించే విషయాలేవీ అక్కడ లేవు, రద్దీ నగరాల్లో వినిపించే ఎలాంటి శబ్దాలూ మీకు వినిపించట్లేదు. తోట చాలా విశాలంగా ఉంది, ఆ ప్రశాంతతను పోగొట్టేదేదీ అక్కడ లేదు. మరిముఖ్యంగా, మీ మనసు ఎలాంటి ఆందోళనలు లేకుండా నెమ్మదిగా ఉంది. మీ ఒంట్లో కూడా ఎలాంటి జబ్బులు, అలెర్జీలు, నొప్పులు లేవు. మీ జ్ఞానేంద్రియాలు పరిసరాల్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాయి.

రంగురంగుల పూలు, మిలమిల మెరిసే సెలయేరు, సూర్యకాంతిలో-చెట్లనీడలో పచ్చగడ్డి, మొక్కలు మీ కళ్లకు కనువిందు చేస్తున్నాయి. పిల్లగాలి మృదువుగా ఒంటిని తాకుతోంది, ముక్కు ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తోంది. టపటప కొట్టుకునే ఆకులు, గలగల ప్రవహించే సెలయేరు, పక్షుల కిలకిలారావాలు, కీటకాల చప్పుళ్లు మీ చెవులకు విందు చేస్తున్నాయి. ఆ దృశ్యాన్ని ఊహించుకున్నప్పుడు, ‘నేనూ అక్కడ ఉంటే బావుండు!’ అని మీకు అనిపించట్లేదా?

మనుషులు మొదట్లో అలాంటి చోటే ఉండేవాళ్లని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నమ్ముతారు. దేవుడు ఆదాముహవ్వల్ని ఏదెను తోటలో పెట్టి అందులో నివసించమన్నాడని వందల సంవత్సరాలుగా యూదా, క్రైస్తవ, ఇస్లాం మతాల్లో బోధిస్తున్నారు. బైబిలు ప్రకారం, ఆదాముహవ్వలు ఆ తోటలో ప్రశాంతంగా, సంతోషంగా జీవించారు. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండేవి కాదు, జంతువులు హాని చేసేవి కాదు, ప్రేమతో అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో శాశ్వతంగా జీవించే అవకాశమిచ్చిన దేవునితో వాళ్లకు మంచి స్నేహం ఉండేది.​—ఆదికాండం 2:15-24.

పూర్వం అందమైన పరిసరాల్లో జీవించడం గురించి హిందువులకు కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ప్రపంచం అందమైన తోటలా ఉండే స్వర్ణ యుగాల్లో గొప్పగొప్ప ఆధ్యాత్మిక నాయకులు పుడతారని బౌద్ధులు నమ్ముతారు. ఆఫ్రికాలోని చాలా మతాల్లో చెప్పే కథలు మనకు ఆదాముహవ్వల్ని గుర్తుచేస్తాయి.

మొదట్లో అందమైన తోటలాంటి పరిస్థితులు ఉండేవనే అభిప్రాయం చాలా మతాల్లో, సాంప్రదాయాల్లో కనిపిస్తుంది. ఒక రచయిత ఇలా అన్నాడు: “పరిపూర్ణత, స్వేచ్ఛ, శాంతి, సంతోషం, సమృద్ధి కలగలసిన, ఒత్తిడి గానీ ఆందోళన గానీ గొడవలు గానీ ... లేని అందమైన జీవితం (పరదైసు) చరిత్ర తొలినాళ్లలో ఉండేదని చాలా నాగరికతల్లో ప్రజలు నమ్మేవాళ్లు. ఆ నమ్మకం, తాము కోల్పోయిన పరదైసును కోరుకునేలా, దాన్ని తిరిగి సాధించడానికి మార్గాన్ని వెదికేలా సమాజాన్ని కదిలించింది.”

ఆ కథలూ సాంప్రదాయాలన్నీ బహుశా ఒకే చోట మొదలై ఉండొచ్చా? మనుషులు అలా పరదైసును కోరుకోవడానికి, వాళ్ల జ్ఞాపకాల్లో ఉండిపోయిన నిజమైన సంఘటనలే కారణమా? చాలాకాలం క్రితం నిజంగానే ఏదెను తోట ఉండేదా? ఆదాముహవ్వలు నిజంగా ఉండేవాళ్లా?

అలాంటి ఆలోచనను విమర్శకులు ఎగతాళి చేస్తారు. ఈ సైన్స్‌ యుగంలో అలాంటి కథల్ని పురాణాలు, కట్టుకథలు అంటూ చాలామంది కొట్టిపారేస్తారు. ఆశ్చర్యం ఏంటంటే, అలా విమర్శించే వాళ్లంతా దేవుడంటే నమ్మకం లేనివాళ్లు కాదు. చాలామంది మతనాయకులు కూడా ఏదెను తోట అనేది అసలెప్పుడూ లేదని బోధిస్తున్నారు. అది కేవలం ఒక పోలిక, కట్టుకథ, నీతికథ, ఉదాహరణ మాత్రమే అని వాళ్లంటారు.

బైబిల్లో ఉదాహరణలు ఉన్న మాట నిజమే. యేసు కూడా ఎన్నో సుప్రసిద్ధ ఉదాహరణలు చెప్పాడు. కానీ ఏదెను తోటలోని సంఘటనల్ని బైబిలు ఒక ఉదాహరణలా కాకుండా నిజమైన చరిత్రలా చెప్తుంది. ఒకవేళ ఆ సంఘటనలు ఎప్పుడూ జరగలేదని మనం అనుకుంటే, బైబిల్లోని మిగతా విషయాల్ని మాత్రం ఎలా నమ్మగలం? కొంతమంది ఏదెను తోటను ఎందుకు నమ్మరో, వాళ్లు చెప్పే కారణాలు సరైనవో కావో ఇప్పుడు చూద్దాం. అలాగే, ఏదెను తోట కథనం గురించి మనలో ప్రతీ ఒక్కరం ఎందుకు పట్టించుకోవాలో కూడా పరిశీలిద్దాం.