కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏదెను తోట—నిజంగా ఉండేదా?

ఏదెను తోట—నిజంగా ఉండేదా?

ఏదెను తోటనిజంగా ఉండేదా?

మీకు ఆదాముహవ్వలు, ఏదెను తోట కథ తెలుసా? ప్రపంచవ్యాప్తంగా చాలామందికి అది బాగా తెలుసు. దాన్ని మీరే స్వయంగా చదివి తెలుసుకోవచ్చు. అది ఆదికాండం 1:26–3:24 వచనాల్లో ఉంది. దాని సారాంశం ఏంటంటే:

యెహోవా దేవుడు * నేలమట్టితో మనిషిని చేస్తాడు, అతనికి ఆదాము అని పేరుపెట్టి, ఏదెను అనే ప్రాంతంలోని తోటలో పెడతాడు. దేవుడే స్వయంగా ఆ తోటను నాటాడు. దానికి చక్కగా నీరు అందుతుంది, తోట నిండా చూడచక్కని పండ్లచెట్లు ఉన్నాయి. తోట మధ్యలో “మంచిచెడుల తెలివినిచ్చే చెట్టు” ఉంది. అయితే మనుషులు ఆ చెట్టు పండ్లు తినకూడదని, తింటే చనిపోతారని దేవుడు చెప్తాడు. కొంతకాలానికి యెహోవా ఆదాము పక్కటెముకల్లో ఒకటి తీసుకొని దానితో అతనికి ఒక సహాయకారిని చేస్తాడు, ఆమె పేరు హవ్వ. దేవుడు వాళ్లకు ఏదెను తోటను చూసుకునే బాధ్యతను అప్పగిస్తాడు, అలాగే పిల్లల్ని కని భూమిని నింపమని చెప్తాడు.

ఒకరోజు హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సర్పం ఆమెతో మాట్లాడుతుంది. దేవుడు తినకూడదని చెప్పిన పండును తినేలా ఆమెను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తుంది. దేవుడు వాళ్లకు అబద్ధం చెప్పాడని, ఆ చెట్టు పండు తింటే నిజానికి వాళ్లకు మంచి జరుగుతుందని, వాళ్లు దేవునిలా అవుతారని మాయమాటలు చెప్తుంది. హవ్వ ఆ మాటలు నమ్మి, దేవుడు తినొద్దన్న చెట్టు పండు తింటుంది. తర్వాత ఆదాము కూడా ఆమెలాగే దేవుని మాట వినకుండా పండు తింటాడు. అప్పుడు యెహోవా ఆదాముకు, హవ్వకు, సర్పానికి శిక్ష వేస్తాడు. మనుషుల్ని ఆ అందమైన తోట నుండి వెళ్లగొడతాడు; వాళ్లు మళ్లీ అందులోకి వెళ్లకుండా దేవదూతలు కాపలా ఉంటారు.

బైబిల్లోని ఆదికాండం పుస్తకంలో ఉన్న విషయాలు నిజమైనవి, చరిత్ర ప్రకారం సరైనవి అని ధృవీకరించడానికి ఒకప్పుడు పండితులు, మేధావులు, చరిత్రకారులు ఇష్టపడేవాళ్లు. కానీ ఈ రోజుల్లో అలాంటి విషయాలను విమర్శించడం ఎక్కువైంది. ఇంతకీ ఆదికాండం పుస్తకంలో ఉన్న ఆదాముహవ్వల గురించి, ఏదెను తోట గురించి సందేహాలు తలెత్తడానికి కారణమేంటి? అలాంటి నాలుగు సందేహాల గురించి ఇప్పుడు చూద్దాం.

1. ఏదెను తోట నిజంగా ఉందా?

అసలు ఈ విషయం గురించి సందేహం ఎందుకు తలెత్తుతుంది? అందుకు తత్వశాస్త్రం ఒక కారణం కావచ్చు. దేవుని తోట ఇంకా ఎక్కడో ఉందని వందల సంవత్సరాల పాటు మత పండితులు అనుకునేవాళ్లు. అయితే భూమ్మీద పరిపూర్ణమైనది ఏదీ ఉండదని, పరలోకంలో మాత్రమే పరిపూర్ణత ఉంటుందని నమ్మిన ప్లేటో, అరిస్టాటిల్‌ లాంటి గ్రీకు తత్వవేత్తల ప్రభావం చర్చి మీద పడింది. దానివల్ల, మొదట్లో ఉన్న అందమైన తోట పరలోకానికి దగ్గరగా ఉండివుంటుందని వాళ్లు తర్కించారు. * అది చాలా ఎత్తైన ఒక పర్వతం మీద ఉండేదని, దిగజారిన భూమి ప్రభావం దానిమీద పడలేదని కొంతమంది చెప్పేవాళ్లు. అది ఉత్తర లేదా దక్షిణ ధృవాల్లో ఒకదాని దగ్గర ఉండేదని ఇంకొంతమంది అభిప్రాయం. అది చంద్రుని మీద లేదా దానికి దగ్గర్లో ఉండేదని మరికొందరు అనేవాళ్లు. దాంతో ఏదెను అనేది ఒక ఊహాకథలా తయారైంది. కొంతమంది ఆధునిక కాల పండితులు, అసలు ఏదెను అనే ప్రాంతం ఎప్పుడూ లేదని వాదిస్తూ దాని గురించిన పరిశోధనల్ని కొట్టిపారేస్తారు.

అయితే, ఆ తోట గురించి బైబిలు అలా చెప్పట్లేదు. ఆదికాండం 2:8-14 వచనాల్లో దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి. ఆ తోట ఏదెను అనే ప్రాంతంలో తూర్పు వైపున ఉందని, నాలుగు పాయలుగా చీలిపోయిన నది దానికి నీటిని సరఫరా చేస్తుందని బైబిలు చెప్తుంది. ఆ నాలుగు నదుల్లో ప్రతీ నది పేరు, అది ఎక్కడ ప్రవహిస్తుందనే చిన్న వివరం కూడా ఉంది. ఈ వివరాలు చాలాకాలం పాటు పండితుల్ని ఇబ్బందిపెట్టాయి. వాళ్లలో చాలామంది, ఆ ప్రాచీన స్థలం ప్రస్తుతం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఆ వచనాల్ని ఎంతో పరిశోధించారు. అయితే వాళ్లందరూ ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్న రకరకాల అభిప్రాయాలకు వచ్చారు. అంటే దానర్థం ఏదెను అనే ప్రాంతం, అందులోని తోట, దాని నదుల గురించిన వివరాలన్నీ తప్పా, కల్పితమా?

ఈ విషయం పరిశీలించండి: ఏదెను తోటలోని సంఘటనలు జరిగి ఇప్పటికి దాదాపు 6,000 సంవత్సరాలైంది. వాటిని మోషే రాశాడని తెలుస్తోంది. బహుశా ఎవరో చెప్పిన లేదా అప్పటికి అందుబాటులో ఉన్న దస్తావేజుల్లోని సమాచారం ఆధారంగా వాటిని రాసుంటాడు. మోషే రాసే సమయానికి ఆ సంఘటనలు జరిగి దాదాపు 2,500 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే, అప్పటికే అది ప్రాచీన చరిత్ర. వేల సంవత్సరాల కాలంలో ఆ నదులు ప్రవహించిన దిశ మారిపోయి ఉంటుందా? భూమి ఉపరితల పొర ఎప్పుడూ కదులుతూ మారిపోతూ ఉంటుంది. పైగా ఏదెను ఉన్న ప్రాంతంలో తరచూ భూకంపాలు వస్తుంటాయి, ప్రస్తుతం ప్రపంచంలో వచ్చే అతిపెద్ద భూకంపాల్లో 17 శాతం ఆ ప్రాంతంలోనే సంభవిస్తున్నాయి. అలాంటి ప్రాంతాల్లో మార్పులు జరగడం అనేది సర్వసాధారణం. అంతేకాదు, నోవహు జలప్రళయం వల్ల భూమి ఉపరితలం ఎంతగా మారిపోయిందంటే, దాని గురించి తెలుసుకోవడం మనకు అసాధ్యం. *

అయితే మనకు కొన్ని వాస్తవాలు తెలుసు. అవేంటంటే, ఆదికాండం పుస్తకం ఆ తోటను ఒక నిజమైన స్థలంగా చూపిస్తుంది. అందులో చెప్పిన నాలుగు నదుల్లో యూఫ్రటీసు, టైగ్రిస్‌ (హిద్దెకెలు) అనే రెండు నదులు ఇప్పటికీ ఉన్నాయి. వాటి జన్మ స్థానాలు కూడా ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ నదులు ఏ ప్రాంతాల గుండా ప్రవహించేవో, అక్కడ ఎలాంటి సహజ వనరులు సమృద్ధిగా ఉండేవో కూడా ఆదికాండం పుస్తకం చెప్తుంది. దాన్ని మొట్టమొదట చదివిన ప్రాచీన ఇశ్రాయేలు ప్రజలు అలా చదవడం వల్ల కొన్ని విషయాలు తెలుసుకుని ఉంటారు.

సాధారణంగా కట్టుకథల్లో, కల్పితకథల్లో వెంటనే రుజువు చేసే లేదా తప్పని నిరూపించే వివరాలు చేర్చరు. బదులుగా అవి, “అనగనగనగా ఒక దూర దేశంలో” అంటూ మొదలౌతాయి. కానీ చరిత్ర అలా ఉండదు. అందులో ఏదెను తోట వృత్తాంతంలో ఉన్నట్టు సంఘటనలకు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి.

2. దేవుడు మట్టి నుండి ఆదామును, అతని పక్కటెముకతో హవ్వను చేశాడనే మాటను నిజంగా నమ్మొచ్చా?

మనిషి శరీరం హైడ్రోజన్‌, ఆక్సిజన్‌, కార్బన్‌వంటి రకరకాల మూలకాలతో తయారు చేయబడిందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్తుంది, అవే మూలకాలు మట్టిలో కూడా ఉంటాయి. కానీ ఆ మూలకాలతో ఒక జీవి ఎలా తయారైంది?

జీవం దానంతట అదే వచ్చిందని, మొదట సరళమైన ప్రాణులు వచ్చాయని, తర్వాత కోట్ల సంవత్సరాలపాటు అవి పరిణామం చెందడం వల్ల సంశ్లిష్టమైన ప్రాణులు వచ్చాయని చాలామంది శాస్త్రవేత్తలు చెప్తారు. అయితే “సరళమైన” అనే మాట ఏ ప్రాణికీ ఉపయోగించలేం. ఎందుకంటే ఒకేఒక్క కణం ఉన్న సూక్ష్మజీవులతో సహా ప్రాణులన్నిటి నిర్మాణం చాలా సంశ్లిష్టంగా ఉంటుంది. జీవం దానంతట అదే వచ్చిందని గానీ అలా వచ్చే అవకాశం ఉందని గానీ చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవు. బదులుగా, ఏ ప్రాణిని చూసినా, మనకన్నా ఎంతో మేధాశక్తి ఉన్న ఒకరు వాటిని తయారుచేశారనే తిరుగులేని రుజువు కనిపిస్తుంది. *​—రోమీయులు 1:20.

మీరు ఒక వాద్య బృందం వాయిస్తున్న సంగీతాన్ని విని లేదా ఒక అద్భుతమైన పెయింటింగ్‌చూసి ముగ్ధులై లేదా టెక్నాలజీతో రూపొందించిన ఒక గొప్ప వస్తువును బట్టి ఆశ్చర్యపోయి, ఆ తర్వాత వాటిని ఎవరూ చేయలేదని అంటారా? లేదు! ఒకసారి మనిషి శరీరం గురించి ఆలోచించండి. పైన చెప్పినవేవీ మనిషి శరీర నిర్మాణంలో ఉన్న సంశ్లిష్టత, అందం, తెలివితో సాటిరావు. మరి దానికి సృష్టికర్త లేడని ఎలా అనగలం? పైగా, భూమ్మీది ప్రాణులన్నిటిలో కేవలం మనిషి మాత్రమే దేవుని పోలికలో చేయబడ్డాడని ఆదికాండం పుస్తకం చెప్తుంది. (ఆదికాండం 1:26) అందుకే, మనుషుల్లో మాత్రమే దేవునికి ఉన్నట్టు కొత్తకొత్తవి సృష్టించాలనే కోరిక కనిపిస్తుంది. దానివల్ల వాళ్లు కొన్నిసార్లు అద్భుతమైన సంగీతాన్ని, పెయింటింగ్‌లను, సాంకేతిక పరికరాలను రూపొందిస్తారు. మరి దేవుడు మనకన్నా గొప్పగా తయారుచేస్తాడంటే మనం ఆశ్చర్యపోవాలా?

అలాంటప్పుడు మనిషి పక్కటెముకతో స్త్రీని సృష్టించడం దేవునికి పెద్ద కష్టమా? * దేవుడు కావాలనుకుంటే వేరే విధంగా స్త్రీని సృష్టించగలడు. కానీ అలా చేయడానికి ఒక మంచి ఉద్దేశం ఉంది. పురుషుడు-స్త్రీ పెళ్లి చేసుకుని, ఇద్దరూ “ఒక్క శరీరం” అన్నట్లు వాళ్ల మధ్య సన్నిహిత బంధం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. (ఆదికాండం 2:24) అలా పురుషుడు, స్త్రీ ఒకరికొకరు చక్కగా సహాయం చేసుకుంటూ, తమ మధ్య బంధాన్ని బలపర్చుకుంటూ ఉండడం ప్రేమ-తెలివిగల సృష్టికర్త ఉన్నాడనడానికి తిరుగులేని రుజువు, కాదంటారా?

అంతేకాదు, మనుషులందరూ ఒకే స్త్రీ నుండి, ఒకే పురుషుని నుండి వచ్చివుంటారని ఆధునిక జన్యు శాస్త్రవేత్తలు ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఆదికాండంలోని విషయాలు మనం ఖచ్చితంగా నమ్మవచ్చు.

3. తెలివినిచ్చే చెట్టు, జీవవృక్షం అనేవి పౌరాణిక కథల్ని గుర్తుచేస్తున్నాయి.

ఆ చెట్లకు ప్రత్యేకమైన లేదా అతీతమైన శక్తులు ఉన్నాయని ఆదికాండం పుస్తకం చెప్పట్లేదు. బదులుగా అవి నిజమైన చెట్లు, యెహోవాయే వాటికి ఒక సూచనార్థక అర్థాన్ని జతచేశాడు.

కొన్నిసార్లు మనుషులు కూడా అలాచేస్తారు. ఉదాహరణకు, కోర్టును ధిక్కరించడం నేరం అని ఒక జడ్జి హెచ్చరించవచ్చు. అతని ఉద్దేశం, కోర్టులో ఉన్న సామాన్లు, ఫాన్లు-లైట్లు, గోడల్ని అవమానించకూడదని కాదుగానీ కోర్టు దేనికైతే ప్రతీకగా ఉందో ఆ న్యాయవ్యవస్థను అవమానించకూడదని. అలాగే చాలామంది రాజులు రాజదండాన్ని, కిరీటాన్ని తమ సార్వభౌమ అధికారానికి గుర్తులుగా చూస్తుంటారు.

మరి ఆ రెండు చెట్లు వేటికి గుర్తుగా ఉన్నాయి? అది చెప్పడానికి ఎన్నో క్లిష్టమైన వివరణలు పుట్టుకొచ్చాయి. అయితే అసలైన జవాబు చాలా సరళంగా ఉంది, అదే సమయంలో దానికి లోతైన అర్థం ఉంది. మంచిచెడుల తెలివినిచ్చే చెట్టు ఏది మంచో, ఏది చెడో నిర్ణయించే విషయంలో దేవునికి మాత్రమే ఉన్న హక్కుకు గుర్తుగా ఉంది. (యిర్మీయా 10:23) అందుకే ఆ చెట్టు పండ్లు తినడాన్ని దొంగతనంగా, ఒక నేరంగా దేవుడు చూశాడు. అలాగే, జీవవృక్షం అనేది దేవుడు మాత్రమే ఇవ్వగల శాశ్వత జీవితం అనే బహుమతికి గుర్తుగా ఉంది.​—రోమీయులు 6:23.

4. సర్పం మాట్లాడడం అనేది కట్టుకథలా ఉంది.

నిజమే, ఆదికాండం పుస్తకంలోని ఈ భాగం కాస్త అయోమయంలో పడేస్తుంది, ముఖ్యంగా బైబిల్లోని మిగతా విషయాల్ని లెక్కలోకి తీసుకోకపోతే అలా అనిపిస్తుంది. అయితే లేఖనాలు ఈ ఆసక్తికరమైన మర్మాన్ని మెల్లమెల్లగా వెల్లడిచేశాయి.

సర్పాన్ని మాట్లాడేలా చేసింది ఎవరు? పాము ఎలా మాట్లాడిందో అర్థం చేసుకోవడానికి సహాయం చేసే కొన్ని విషయాలు ప్రాచీన ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. జంతువులు మాట్లాడలేకపోయినా, ఒక అదృశ్య ప్రాణి అవి మాట్లాడుతున్నట్టు కనిపించేలా చేయగలడని వాళ్లకు తెలుసు. మోషే బిలాము గురించి కూడా రాశాడు; బిలాము గాడిద ఒక మనిషిలా మాట్లాడేటట్టు చేయడానికి దేవుడు ఒక దేవదూతను పంపించాడు.​—సంఖ్యాకాండం 22:26-31; 2 పేతురు 2:15, 16.

ఇతర అదృశ్య ప్రాణులు, ముఖ్యంగా దేవునికి శత్రువులైన వాళ్లు అద్భుతాలు చేయగలరా? ఐగుప్తులోని ఇంద్రజాలం చేసే పూజారులు దేవుడు చేసిన లాంటి అద్భుతాలు చేయడం, ముఖ్యంగా కర్ర పాములా మారినట్టు కనిపించేలా చేయడం మోషే చూశాడు. వాళ్లకు అలాంటి పనులు చేసే శక్తి, దేవుని శత్రువులైన అదృశ్య ప్రాణుల నుండి మాత్రమే వస్తుంది.​—నిర్గమకాండం 7:8-12.

యోబు పుస్తకం కూడా మోషేనే రాసుంటాడు. యెహోవా సేవకులందరి యథార్థత గురించి అబద్ధాలు చెప్పిన దేవుని ముఖ్య శత్రువైన సాతాను గురించి అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. (యోబు 1:6-11; 2:4, 5) ఏదెనులో పాము మాట్లాడుతున్నట్లు చూపించి, దేవునికి యథార్థంగా ఉండకుండా పాము ద్వారా హవ్వను మోసం చేసింది సాతానే అని ప్రాచీన ఇశ్రాయేలీయులు ఆలోచించి ఉంటారా? ఖచ్చితంగా అందుకు అవకాశముంది.

సర్పంతో అబద్ధం చెప్పించిన వ్యక్తి సాతాను అయ్యుండొచ్చా? యేసు సాతానును “అబద్ధాలకోరు, అబద్ధానికి తండ్రి” అని పిలిచాడు. (యోహాను 8:44) “అబద్ధానికి తండ్రి” అంటే మొట్టమొదటి అబద్ధం అతనే చెప్పివుండాలి కదా? మొట్టమొదటి అబద్ధం సర్పం హవ్వతో మాట్లాడిన మాటల్లో కనిపిస్తుంది. తినొద్దన్న పండును తింటే చనిపోతారని దేవుడు హెచ్చరిస్తే, అందుకు విరుద్ధంగా సర్పం ఇలా అన్నాడు: “మీరు చావనే చావరు.” (ఆదికాండం 3:4) కాబట్టి సాతానే సర్పంతో అబద్ధం చెప్పించాడని యేసుకు తెలుసు. అపొస్తలుడైన యోహానుకు యేసు బయల్పర్చిన ప్రకటన గ్రంథం సాతానును “మొదటి సర్పం” అని పిలుస్తుంది; కాబట్టి ఇక ఎలాంటి సందేహానికి చోటు లేదు.​—ప్రకటన 1:1; 12:9.

శక్తిమంతుడైన అదృశ్య ప్రాణి ఒక సర్పాన్ని మాట్లాడుతున్నట్టు చూపించడం నమ్మలేని విషయంలా ఉందా? అదృశ్య ప్రాణుల కన్నా ఎంతో తక్కువ శక్తి ఉన్న మనుషులు కూడా బొమ్మ మాట్లాడుతున్నట్టు (ventriloquism) చూపించగలరు, సినిమాల్లో ఎన్నెన్నో వింతలు (special effects) చూపించగలరు.

తిరుగులేని రుజువు

ఆదికాండంలోని విషయాలు కట్టుకథలు అని సందేహించడానికి ఎలాంటి సరైన కారణం లేదని ఇప్పుడు మీరు ఒప్పుకోరా? అంతేకాదు, అది నిజమైన చరిత్ర అని చెప్పడానికి ఒక తిరుగులేని రుజువు ఉంది.

బైబిలు యేసుక్రీస్తును “నమ్మకమైన సత్యసాక్షి” అని పిలుస్తుంది. (ప్రకటన 3:14) ఆయన పరిపూర్ణుడు, ఆయన ఎన్నడూ అబద్ధం చెప్పలేదు లేదా సత్యాన్ని ఏ రకంగానూ వక్రీకరించలేదు. అంతేకాదు, తాను ఈ భూమ్మీదికి రాకముందు ఎంతోకాలం నుండి ఉనికిలో ఉన్నానని చెప్పాడు. నిజానికి “లోకం ఉనికిలోకి రాకముందు” యేసు తన తండ్రైన యెహోవాతోపాటు ఉన్నాడు. (యోహాను 17:5) కాబట్టి భూమ్మీద జీవం మొదలైనప్పుడు యేసు ఉనికిలో ఉన్నాడు. మరి అత్యంత నమ్మదగిన ఈ సాక్షి ఏమని చెప్తున్నాడు?

యేసు ఆదాముహవ్వల గురించి వాళ్లు నిజమైన మనుషులు అన్నట్టు మాట్లాడాడు. ఒక పురుషుడు ఒక్క స్త్రీనే పెళ్లి చేసుకోవాలనే యెహోవా ప్రమాణం గురించి చెప్పే సందర్భంలో ఆయన ఆదాముహవ్వల పెళ్లి గురించి ప్రస్తావించాడు. (మత్తయి 19:3-6) అసలు వాళ్లు ఎప్పుడూ జీవించి ఉండకపోతే, వాళ్లు నివసించిన ఏదెను తోట కల్పితం అయితే, యేసు మోసపోయి ఉండాలి లేదా అబద్ధం చెప్పి ఉండాలి. కానీ ఆ రెండూ అసంభవం! ఏదెను తోటలో కష్టాలు మొదలైనప్పుడు యేసు పరలోకంలో ఉండి అంతా చూశాడు. కాబట్టి అంతకన్నా నమ్మదగిన రుజువు ఇంకేదైనా ఉంటుందా?

ఆదికాండంలోని విషయాల్ని నమ్మకపోతే ఒకరకంగా యేసు మీద కూడా విశ్వాసం ఉంచలేం. అంతేకాదు, బైబిల్లోని అత్యంత ముఖ్యమైన బోధల్ని, అద్భుతమైన వాగ్దానాల్ని అర్థంచేసుకోలేం. అలా ఎందుకు చెప్పవచ్చో ఇప్పుడు చూద్దాం.

[అధస్సూచీలు]

^ దేవుని పేరు యెహోవా అని బైబిల్లో ఉంది.

^ అలాంటి ఆలోచన బైబిలుకు అనుగుణంగా లేదు. దేవుడు చేసిన ప్రతీది పరిపూర్ణంగా ఉంటుందని బైబిలు చెప్తుంది; అపరిపూర్ణతకు దేవుడు కారణం కాదు. (ద్వితీయోపదేశకాండం 32:4, 5) దేవుడు భూమ్మీది సృష్టిని చేసిన తర్వాత, తాను చేసిన ప్రతీది “చాలా బాగుంది” అని చెప్పాడు.—ఆదికాండం 1:31.

^ దేవుడు తీసుకొచ్చిన జలప్రళయం వల్ల, ఏదెను తోట జాడ కూడా లేకుండా పూర్తిగా నాశనమైపోయింది. యెహెజ్కేలు 31:18 చదివితే, క్రీ.పూ. ఏడవ శతాబ్దం కల్లా “ఏదెనులోని చెట్లు” నాశనమై అప్పటికే చాలాకాలం గడిచిందని తెలుస్తుంది. కాబట్టి, ఆ తర్వాతి కాలాల్లో ఏదెను తోట కోసం వెదికిన వాళ్లంతా తప్పుదారి పట్టారని తెలుస్తుంది.

^ యెహోవాసాక్షులు ప్రచురించిన జీవారంభం—అడగాల్సిన ఐదు ప్రశ్నలు (ఇంగ్లీష్‌) అనే బ్రోషూరు చూడండి.

^ ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే, పక్కటెముకకు త్వరగా బాగయ్యే సామర్థ్యం ఉంటుందని ఆధునిక వైద్యశాస్త్రం చెప్తుంది. అది ఇతర ఎముకల్లా ఉండదు, దాని బంధన కణజాల పొర (membrane of connective tissue) పాడవ్వకుండా ఉంటే పక్కటెముక మళ్లీ పెరుగుతుంది.