కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మర్యాదగా నడుచుకోవడం మీ పిల్లలకు నేర్పించండి

మర్యాదగా నడుచుకోవడం మీ పిల్లలకు నేర్పించండి

మర్యాదగా నడుచుకోవడం మీ పిల్లలకు నేర్పించండి

‘మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి’ అనే నానుడిని మీరు విన్నారా? మనం ఇతరులకు మర్యాద ఇస్తేనే వారి నుండి తిరిగి మర్యాదను పొందుతాం అని దానర్థం.

పిల్లలు మర్యాదగా నడుచుకోవడం చూడముచ్చటగా ఉంటుంది! వేర్వేరు వయసులున్న ప్రచారకులతో కలిసి ఇంటింటి పరిచర్య చేసే హోండూరాస్‌లోని ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇలా చెబుతున్నాడు: “నేను చెప్పే మాటలకన్నా, నాతోవున్న మంచి తర్ఫీదు పొందిన చిన్నపిల్లలు మర్యాదగా నడుచుకోవడమే ఇంటివారిని ఎక్కువగా ఆకట్టుకుంటుందని చాలాసార్లు గమనించాను.”

మంచి-మర్యాదలు కనుమరుగౌతున్న ఈ రోజుల్లో ఇతరులతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం అవసరమేకాక ప్రయోజనకరం కూడా. అంతేకాక, “క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి” అని బైబిలు మనకు చెబుతోంది. (ఫిలి. 1:27; 2 తిమో. 3:1-5) ఇతరులను గౌరవించాలని మన పిల్లలకు నేర్పించడం ప్రాముఖ్యం. పైకి మాత్రమే మర్యాదగా నడుచుకోవడం కాదుగానీ ఎదుటివారిని మనస్ఫూర్తిగా గౌరవించడం పిల్లలకు ఎలా నేర్పించవచ్చు? a

మంచి అలవాట్లను చూసి నేర్చుకుంటారు

పిల్లలు తమ చుట్టూవున్న వారిని చూసి నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలకు మంచి అలవాట్లను నేర్పించాలంటే ముందుగా తల్లిదండ్రులు మంచి ప్రవర్తన కలిగివుండాలి. (ద్వితీ. 6:6, 7) మర్యాదగా నడుచుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో మీ పిల్లలకు వివరించడం అవసరమే, కానీ అది మాత్రమే సరిపోదు. వారికి ఈ విషయాల గురించి ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ, మీరు మంచి మాదిరి ఉంచడం చాలా ప్రాముఖ్యం.

క్రైస్తవ కుటుంబంలో పెరిగిన ప్రమీల b విషయమే తీసుకోండి. వాళ్ల అమ్మ ఒంటరి తల్లి. అందరినీ గౌరవించడం ప్రమీల వ్యక్తిత్వంలో భాగమైంది. ఎలా? దానికి ఆమె ఇలా జవాబిచ్చింది: “అమ్మ అందరితోనూ మర్యాదగా ఉండేది కాబట్టి ఇతరులను గౌరవించడం మా అందరికీ అలవాటైంది.” వినయ్‌ అనే సహోదరుని ఉదాహరణ కూడా చూడండి. ఆయన భార్య అవిశ్వాసురాలు. ఆయన తన పిల్లలకు, తమ తల్లిని గౌరవించాలని నేర్పించాడు. ఆయన ఇలా చెబుతున్నాడు: “నేను నా భార్యను ఎప్పుడూ తక్కువచేసి మాట్లాడలేదు. అలా మా అబ్బాయిలు నన్ను చూసి వాళ్ల అమ్మను గౌరవించడం నేర్చుకునేలా చేయడానికి ప్రయత్నించాను.” వినయ్‌ తన పిల్లలకు బైబిల్లోని విషయాలను నేర్పించేవాడు, యెహోవా సహాయం కోసం ప్రార్థించేవాడు. వారిలో ఒక అబ్బాయి ఇప్పుడు యెహోవాసాక్షులకు చెందిన ఓ బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్నాడు. మరో అబ్బాయి పయినీరుగా సేవచేస్తున్నాడు. వాళ్ల అబ్బాయిలు తమ తల్లిదండ్రులిద్దరినీ ప్రేమిస్తారు, గౌరవిస్తారు.

“దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు” అని బైబిలు చెబుతోంది. (1 కొరిం. 14:33) యెహోవా ఏమి చేసినా క్రమంగానే ఉంటుంది. ఈ దైవిక లక్షణాన్ని తమ జీవితాల్లో చూపించడానికి కృషి చేస్తూ క్రైస్తవులు తమ ఇంటిని చక్కగా అమర్చుకుంటారు. ప్రతీరోజు స్కూలుకు వెళ్లే ముందు తమ మంచాన్ని సర్దుకోవాలని, బట్టలను పెట్టాల్సినచోట పెట్టాలని, ఇంటి పనుల్లో సహాయం చేయాలని కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించారు. సాధారణంగా ఇల్లు చక్కగా, శుభ్రంగా ఉండడం చూసినప్పుడు పిల్లలు కూడా తమ గదిని, వస్తువులను శుభ్రంగా ఉంచుకుంటారు.

తాము స్కూల్లో నేర్చుకునే దాని గురించి మీ పిల్లలు ఏమనుకుంటున్నారు? టీచర్లు తమ కోసం చేస్తున్న దానిపట్ల వారు కృతజ్ఞత చూపిస్తున్నారా? తల్లిదండ్రులుగా మీరు అలాంటి కృతజ్ఞతను చూపిస్తున్నారా? టీచర్ల గురించి, వారు అప్పగించిన పని గురించి మీకున్న అభిప్రాయాన్నే మీ పిల్లలు కూడా వృద్ధిచేసుకుంటారు. తమ టీచర్లకు థ్యాంక్స్‌ చెప్పాలని పిల్లలకు నేర్పించడం మంచిది. టీచర్లు, డాక్టర్లు, దుకాణదారులు, మరితరులు మనకు చేసినదానికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు వారిని మనం ఎంతో గౌరవించినట్లౌతుంది. (లూకా 17:15, 16) మర్యాదగా నడుచుకుంటూ చక్కని ప్రవర్తనను కలిగివుండే క్రైస్తవ పిల్లలు తమ స్కూల్లోని మిగతా పిల్లల్లా కాకుండా ప్రత్యేకంగా కనిపిస్తారు. అలా ప్రవర్తిస్తున్నందుకు మనం వారిని మెచ్చుకోవాలి.

సంఘంలోని క్రైస్తవులు గౌరవమర్యాదలు చూపించే విషయంలో మంచి మాదిరినుంచాలి. సంఘంలోవున్న యౌవనస్థులు “థ్యాంక్యూ,” “ప్లీజ్‌” వంటి పదాలను ఉపయోగిస్తూ గౌరవమర్యాదలతో ప్రవర్తించినప్పుడు ఎంతో సంతోషమనిపిస్తుంది. కూటాలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్లు జాగ్రత్తగా వింటూ యెహోవా మీద తమకున్న గౌరవాన్ని చూపించినప్పుడు పిల్లలు కూడా వారిని చూసి నేర్చుకోవాలనుకుంటారు. రాజ్యమందిరంలో మర్యాదగా నడుచుకునేవారిని చూసి, పిల్లలు తమ చుట్టుప్రక్కల వారితో మర్యాదగా నడుచుకోవడం నేర్చుకుంటారు. ఉదాహరణకు, నాలుగేళ్ల అమిత్‌ ఎవరైనా పెద్దవాళ్ల పక్కన్నుండి వెళ్లాల్సివచ్చినప్పుడు “కొంచెం దారిస్తారా!” అని మర్యాదగా అడగడం ఇప్పటికే నేర్చుకున్నాడు.

పద్ధతిగా ఎలా నడుచుకోవాలో పిల్లలకు నేర్పించడానికి తల్లిదండ్రులు ఇంకా ఏమి చేయవచ్చు? దేవుని వాక్యంలోవున్న ఎన్నో ఉదాహరణల నుండి తాము నేర్చుకున్న విషయాలను సమయం తీసుకుని పిల్లలకు చెప్పవచ్చు, చెప్పాలి కూడా.—రోమా. 15:4.

బైబిల్లోని ఉదాహరణలను ఉపయోగించి నేర్పించండి

ప్రధాన యాజకుడైన ఏలీకి నమస్కరించాలని సమూయేలుకు వాళ్ల అమ్మ తప్పక నేర్పించివుంటుంది. ఆమె సమూయేలును ఆలయ గుడారానికి తీసుకెళ్లేనాటికి బహుశా సమూయేలుకు కేవలం మూడు లేదా నాలుగు ఏళ్లు ఉండివుండవచ్చు. (1 సమూ. 1:28) “గుడ్‌ మార్నింగ్‌,” “గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌,” “గుడ్‌ ఈవినింగ్‌” వంటి పలకరింపులను ఇంట్లో ఉన్నప్పుడే మీ చిన్న పిల్లలకు నేర్పించడం మంచిది. అలా చేస్తే, బాలుడైన సమూయేలులా మీ పిల్లలు కూడా “యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లు[తారు].”—1 సమూ. 2:26.

మర్యాదకు, అమర్యాదకు మధ్యవున్న తేడాను చూపించడానికి బైబిల్లోని సంఘటనలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, దేవునికి నమ్మకంగా లేని అహజ్యా అనే ఇశ్రాయేలు రాజు ఒకసారి ప్రవక్తయైన ఏలీయాను పిలిపించడానికి ‘యాభై మందికి అధిపతియైన ఒకనిని, వాని యాభై మందిని’ పంపించాడు. ఆ అధికారి ప్రవక్త దగ్గరకు వెళ్లి ఆయన తనతో రావాల్సిందేనన్నట్లు మాట్లాడతాడు. దేవుని ప్రవక్తతో అలా మాట్లాడడం ఎంతమాత్రం సరి కాదు. అప్పుడు ఏలీయా, “నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను, నీ యేబదిమందిని దహించునుగాక” అని అన్నాడు. ఆయన చెప్పినట్లుగానే “అగ్ని ఆకాశమునుండి దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.”—2 రాజు. 1:9, 10.

ఆ తర్వాత రాజు, ఏలీయాను తీసుకురావడానికి యాభై మందిపై అధిపతిగా ఉన్న మరో అధికారిని పంపించాడు. ఈయన కూడా ఏలీయా తనతో రావాలని ఆజ్ఞాపించడానికి ప్రయత్నించాడు. మళ్లీ ఆకాశమునుండి అగ్ని దిగి వచ్చింది. కానీ ఆ తర్వాత, యాభై మందిపై అధిపతిగా ఉన్న మూడవ అధికారి ఏలీయా దగ్గరకు వచ్చాడు. ఈయన మాత్రం మర్యాదగా ప్రవర్తిస్తూ ప్రవక్తను ఆజ్ఞాపించకుండా ఆయన ముందు మోకాళ్లూని, “దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీదాసులైన యీ యేబదిమంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. చిత్తగించుము; ఆకాశమునుండి అగ్ని దిగి వెనుకటి పంచ దశాధిపతులను ఇద్దరిని వానివాని యేబదిమందితో కూడ దహించెను; అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము” అని వేడుకున్నాడు. భయపడుతున్నప్పటికీ తనను గౌరవిస్తున్న అలాంటి వ్యక్తి మీదకు అగ్ని దిగిరావాలని దేవుని ప్రవక్త కోరతాడా? అలా ఎప్పటికీ చేయడు. అంతేకాదు, ఆ అధికారితో వెళ్లమని యెహోవా దూత ఏలీయాకు చెప్పాడు. (2 రాజు. 1:11-15) ఎదుటి వారిని గౌరవించడం ఎంత ప్రాముఖ్యమో దీనిని బట్టి తెలుస్తుంది.

దేవాలయం దగ్గర రోమా సైనికులు తనను బంధించినప్పుడు అపొస్తలుడైన పౌలు తనకు మాట్లాడే హక్కు ఉందన్నట్లు ప్రవర్తించలేదు. ఆయన గౌరవపూర్వకంగా అక్కడున్న అధికారిని “నేను నీతో ఒకమాట చెప్పవచ్చునా?” అని అడిగాడు. దానివల్ల, తన వాదనను వినిపించే అవకాశం పౌలుకు దొరికింది.—అపొ. 21:37-40.

యేసును విచారిస్తున్నప్పుడు ఒక బంట్రౌతు ఆయనను ముఖం మీద కొట్టాడు. అయితే, అతను చేసింది తప్పని సరైన విధంగా ఎలా చెప్పాలో యేసుకు తెలుసు. అందుకే ఆయన, “నేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన యెడల నన్నేల కొట్టుచున్నావు”? అని అడిగాడు. యేసు మాట్లాడిన తీరులో తప్పుందని ఎవరూ అనలేకపోయారు.—యోహా. 18:22, 23.

మనల్ని తీవ్రంగా సరిదిద్దినప్పుడు మనం ఎలా స్పందించవచ్చో, ఒకప్పుడు మనం చేసిన తప్పులు లేదా పొరపాట్లను మర్యాదపూర్వకంగా ఎలా ఒప్పుకోవచ్చో కూడా దేవుని వాక్యంలోని ఉదాహరణలు తెలియజేస్తున్నాయి. (ఆది. 41:9-13; అపొ. 8:20-24) ఉదాహరణకు, దావీదుతో నాబాలు అమర్యాదగా ప్రవర్తించినందుకు నాబాలు భార్య అబీగయీలు దావీదుకు క్షమాపణ చెప్పింది. అంతేకాదు, ఆమె దావీదు కోసం ఎన్నో ఆహార పదార్థాలను కానుకగా తీసుకెళ్లింది. ఆమె చేసిన పనికి దావీదు ఎంతగా ముగ్ధుడయ్యాడంటే నాబాలు చనిపోయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు.—1 సమూ. 25:23-41.

మీ పిల్లలు అననుకూల పరిస్థితుల్లో గౌరవాన్ని చూపించాలన్నా లేదా ఎప్పుడూ మంచి ప్రవర్తన కలిగివుండాలన్నా వారికి మంచి-మర్యాదలు బోధించండి. అలా ఇతరుల ‘ఎదుట మన వెలుగును’ ప్రకాశింపజేసినప్పుడు ‘పరలోకమందున్న మన తండ్రి మహిమపరచబడతాడు.’—మత్త. 5:16.

[అధస్సూచీలు]

a అయితే పెద్దవారిని గౌరవించడానికీ తమకు హానిచేయాలనుకునే వారికి లొంగిపోవడానికీ మధ్యవున్న తేడా ఏమిటో తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ విషయంలో గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి అనే పుస్తకంలో 32వ అధ్యాయం చూడండి.

b అసలు పేర్లు కావు.