కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘బలులు అర్పించడం కన్నా ఆజ్ఞను గైకొనడం శ్రేష్ఠం’

‘బలులు అర్పించడం కన్నా ఆజ్ఞను గైకొనడం శ్రేష్ఠం’

‘బలులు అర్పించడం కన్నా ఆజ్ఞను గైకొనడం శ్రేష్ఠం’

ప్రాచీన కాల ఇశ్రాయేలీయులను పరిపాలించిన మొట్టమొదటి రాజు పేరు సౌలు. సత్య దేవుడు ఆయనను ఎన్నుకున్నప్పటికీ చివరకు సౌలు అవిధేయుడయ్యాడు.

సౌలు ఎలాంటి తప్పులు చేశాడు? ఆయన వాటిని చేయకుండా ఉండగలిగేవాడా? ఆయన గురించి తెలుసుకుని మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

యెహోవా ఎవరిని రాజుగా చేయాలో చెప్పాడు

సౌలు రాజుగా నియమించబడకముందు, ప్రవక్తయైన సమూయేలు ఇశ్రాయేలులో దేవుని ప్రతినిధిగా సేవచేసేవాడు. అయితే, సమూయేలు వృద్ధుడయ్యాడు. అంతేకాక, ఆయన కుమారులు యెహోవాను నమ్మకంగా సేవించేవారు కాదు. అదే సమయంలో శత్రు సైన్యాలు ఇశ్రాయేలుపై దాడిచేయడానికి సిద్ధపడ్డాయి. తమకు న్యాయం తీర్చి, యుద్ధంలో తమను నడిపించగల ఒక రాజును నియమించమని ఇశ్రాయేలీయుల పెద్దలు సమూయేలును కోరారు. అప్పుడు సౌలును నాయకునిగా ఎన్నుకోమని ప్రవక్తయైన సమూయేలును యెహోవా నిర్దేశించాడు. అతడు “ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను విడిపించు[ను]” అని ఆయన చెప్పాడు.—1 సమూ. 8:4-7, 20; 9:16.

సౌలు “బహు సౌందర్యముగల యౌవనుడు.” అయితే, ఆయనకు అందంతోపాటు వినయం వంటి మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు సౌలు, “నేను బెన్యామీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా యింటి వారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు?” అని సమూయేలును అడిగాడు. తన తండ్రి కీషు “భాగ్యవంతు[డైనా]” సౌలు తన గురించి, తన కుటుంబం గురించి గొప్పగా ఊహించుకోలేదు.—1 సమూ. 9:1, 2, 21.

యెహోవా ఎవరిని ఇశ్రాయేలీయుల రాజుగా ఎన్నుకున్నాడో సమూయేలు ప్రజలకు చెప్పినప్పుడు సౌలు ఏమి చేశాడో చూడండి. ముందుగా, సౌలు ఒంటరిగా ఉన్నప్పుడు సమూయేలు ఆయనను అభిషేకించి ఇలా అన్నాడు: “దేవుడు నీకు తోడుగా నుండును గనుక . . . నీకు మంచిదని తోచినదాని చేయుము.” ఆ తర్వాత, యెహోవా ఎవరిని ఎన్నుకున్నాడో బహిరంగంగా తెలియజేయడం కోసం సమూయేలు ప్రజలను ఒక చోటికి సమకూర్చాడు. అయితే, యెహోవా సౌలును ఎన్నుకున్నాడని చెప్పే సమయానికి సౌలు అక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఆయన బిడియంతో దాక్కున్నాడు. సౌలు ఎక్కడ దాక్కున్నాడో యెహోవా చూపించిన తర్వాత, రాజుగా చేయబడ్డాడు.—1 సమూ. 10:7, 20-24.

యుద్ధ రంగంలో

ఇశ్రాయేలీయులను పరిపాలించే అర్హత తనకు లేదని అపోహపడినవారి అనుమానాలను సౌలు కొద్దికాలంలోనే పోగొట్టాడు. అమ్మోనీయులు ఒక ఇశ్రాయేలు పట్టణాన్ని దాడి చేయడానికి సిద్ధపడినప్పుడు “దేవుని ఆత్మ అతనిమీదికి [సౌలు మీదికి] బలముగా వచ్చెను.” ఆయన తన అధికారాన్ని ఉపయోగిస్తూ దేశంలోని యోధులను పిలిపించి, వారిని వ్యవస్థీకరించి, విజయానికి నడిపించాడు. యెహోవా వల్లే ఆ విజయం కలిగిందని గుర్తిస్తూ సౌలు, “నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను” అని అన్నాడు.—1 సమూ. 11:1-13.

సౌలుకు మంచి లక్షణాలతోపాటు దేవుని ఆశీర్వాదం కూడా ఉంది. అంతేకాదు, ఆయన యెహోవా శక్తిని గుర్తించాడు. అయితే ఇశ్రాయేలీయులు, వారి రాజు విజయం సాధిస్తూనే ఉండాలంటే ఏమి చేయడం ప్రాముఖ్యమో చెబుతూ సమూయేలు ప్రవక్త ప్రజలతో ఇలా అన్నాడు: “మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును, మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినయెడల మీకు క్షేమము కలుగును.” ఇశ్రాయేలీయులు దేవునికి నమ్మకంగావుంటే ఏ నిశ్చయతతో ఉండవచ్చు? సమూయేలు ఇలా చెప్పాడు: “యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగియున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.”—1 సమూ. 12:14, 22.

అప్పుడైనా, ఇప్పుడైనా దేవుని ఆమోదం ఉండాలంటే ఆయనకు విధేయులై ఉండాలి. తన సేవకులు తన ఆజ్ఞలను పాటించినప్పుడు యెహోవా వారిని ఆశీర్వదిస్తాడు. అయితే వారు యెహోవాకు అవిధేయులైతే ఏమి జరుగుతుంది?

“నీవు అవివేకపు పని చేసితివి”

ఆ తర్వాత, ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా సౌలు చేసిన పనికి వారు కోపంతో, “సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన” సైన్యాన్ని సమకూర్చుకొని ఆయన మీదికి ఎదురుతిరిగారు. “ఇశ్రాయేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి.” (1 సమూ. 13:5, 6) అప్పుడు సౌలు ఏమి చేశాడు?

తాను బలులు అర్పించే గిల్గాలు అనే చోటుకు వచ్చి తనను కలుసుకోమని సమూయేలు సౌలుతో చెప్పాడు. సౌలు వేచి చూశాడు కానీ సమూయేలు రావడం ఆలస్యమైంది, తన సైనికులు అక్కడి నుండి చెదిరిపోవడం మొదలుపెట్టారు. అది చూసి సౌలు తానే బలులు అర్పించడానికి సిద్ధపడ్డాడు. అలా ఆయన అర్పించడం పూర్తి చేసే సమయానికి సమూయేలు అక్కడకు చేరుకున్నాడు. సౌలు చేసింది విన్నప్పుడు సమూయేలు అతనితో, “నీ దేవుడైన యెహోవా నీ కిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి; నీ రాజ్యమును ఇశ్రాయేలీయులమీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి యుండెను; అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనులమీద అతనిని అధిపతినిగా నియమించును” అని అన్నాడు.—1 సమూ. 10:8; 13:8, 13, 14.

బలి అర్పించడానికి సమూయేలు వచ్చేంతవరకు వేచివుండాలనే యెహోవా ఆజ్ఞకు సౌలు అవిశ్వాసంతో, గర్వంతో అవిధేయుడయ్యాడు. అంతకుముందు ఇశ్రాయేలీయుల సైన్యాధిపతిగావున్న గిద్యోను ప్రవర్తనకు, సౌలు ప్రవర్తనకు మధ్య ఎంతో తేడా ఉంది. 32,000 మందివున్న గిద్యోను సైన్యాన్ని 300కు తగ్గించమని యెహోవా చెప్పినప్పుడు ఆయన అలాగే చేశాడు. ఎందుకంటే, ఆయనకు యెహోవా మీద నమ్మకముంది. గిద్యోను తమపై దాడిచేయడానికి వచ్చిన 1,35,000 మందిని దేవుని సహాయంతో ఓడించాడు. (న్యాయా. 7:1-7, 17-22; 8:10) యెహోవా సౌలుకు కూడా సహాయం చేసివుండేవాడు. అయితే సౌలు, దేవునికి అవిధేయత చూపించడంవల్ల ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను దోచుకున్నారు.—1 సమూ. 13:17, 18.

కష్టాలు ఎదురైనప్పుడు మనం ఎలా నిర్ణయాలు తీసుకుంటాం? దేవుడిచ్చిన సూత్రాలను పట్టించుకోకపోతేనే మంచిదని విశ్వాసం లోపించినవారు అనుకోవచ్చు. సమూయేలు అక్కడ లేడు కాబట్టి తాను చేసింది తెలివైన పనేనని సౌలు అనుకొనివుండవచ్చు. అయితే, దేవుని అంగీకారాన్ని పొందడానికి తీర్మానించుకున్నవారు, తాము తీసుకునే నిర్ణయాల్లో బైబిలు సూత్రాలను పాటించడమే సరైనదని అనుకుంటారు.

యెహోవా సౌలును తిరస్కరించాడు

అమాలేకీయులపై ముట్టడి చేసినప్పుడు సౌలు మరొక పెద్ద తప్పు చేశాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు అమాలేకీయులు వారిపై అకారణంగా దండెత్తడం వల్ల యెహోవా అమాలేకీయులను ఖండించాడు. (నిర్గ. 17:8; ద్వితీ. 25:17, 18) అంతేకాదు న్యాయాధిపతుల కాలంలో, దేవుని ప్రజలపై దాడిచేయడానికి అమాలేకీయులు ఇతరులతో చేతులు కలిపారు. (న్యాయా. 3:12, 13; 6:1-3, 33) వారు ఇశ్రాయేలీయులకు చేసింది యెహోవా గుర్తుంచుకున్నాడు కాబట్టి వారిపై తన తీర్పును అమలుచేయాలని సౌలుకు ఆజ్ఞ ఇచ్చాడు.—1 సమూ. 15:1-3.

శత్రువులైన అమాలేకీయులను తుడిచిపెట్టమని, వారికున్న వాటన్నిటిని పూర్తిగా నాశనం చేయమని యెహోవా ఆజ్ఞ ఇస్తే సౌలు దాన్ని పాటించకుండా వారి రాజును, వారి జంతువులలో మంచివాటిని స్వాధీనం చేసుకున్నాడు. అలా ఎందుకు చేశావని సమూయేలు నిలదీసినప్పుడు సౌలు తన తప్పును ప్రజల మీద నెట్టడానికి ప్రయత్నిస్తూ ఇలా అన్నాడు: “యెహోవాకు బలులనర్పించుటకు జనులు గొఱ్ఱెలలోను ఎడ్లలోను మంచివాటిని ఉండనిచ్చిరి.” జంతువులను నిజంగా దేవునికి బలి అర్పించాలని సౌలు అనుకున్నాడో లేదో కానీ ఆయన యెహోవా ఆజ్ఞకు మాత్రం లోబడలేదు. సౌలు ఇక ఎంతమాత్రం ‘తన దృష్టికి తాను అల్పుడుగా’ లేడు. సౌలు యెహోవాకు అవిధేయుడయ్యాడని సమూయేలు చెబుతూ ఇలా అన్నాడు: ‘తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించునట్లు ఒకడు దహనబలులను, బలులను అర్పించుట వల్ల ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనడం శ్రేష్ఠం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించావు కాబట్టి రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించాడు.’—1 సమూ. 15:15, 17, 22, 23.

ఇశ్రాయేలీయుల మొదటి రాజైన సౌలు నుండి యెహోవా తన పరిశుద్ధాత్మను, దీవెనను వెనక్కి తీసుకున్నప్పుడు “దురాత్మ” ఆయనను లొబరుచుకుంది. తన తర్వాత రాజుగా ఉండడానికి యెహోవా ఎన్నుకున్న దావీదుపై సౌలు అనుమానాన్ని, ఈర్ష్యను పెంచుకున్నాడు. సౌలు ఎన్నోసార్లు దావీదును చంపడానికి ప్రయత్నించాడు. “యెహోవా దావీదునకు తోడుగా నుండుట” సౌలు చూసి, “యెల్లప్పుడును దావీదు మీద విరోధముగా ఉండెను” అని బైబిలు చెబుతోంది. సౌలు దావీదును చంపడానికి వెంటాడమేకాక 85 మంది యాజకులను, మరితరులను చంపమని ఆజ్ఞ కూడా ఇచ్చాడు. సౌలు చేతిని యెహోవా విడిచిపెట్టాడంటే అందులో ఆశ్చర్యం లేదు.—1 సమూ. 16:14; 18:11, 25, 28, 29; 19:10, 11; 20:32, 33; 22:16-19.

ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులపై మళ్లీ దాడిచేసినప్పుడు సౌలు, దురాత్మల సహాయం కోసం వృథాగా ప్రయత్నించాడు. మరుసటి రోజు ఆయన యుద్ధంలో తీవ్రంగా గాయపడి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. (1 సమూ. 28:4-8; 31:3, 4) అవిధేయత చూపించిన ఇశ్రాయేలీయుల మొదటి రాజు గురించి బైబిలు ఇలా చెబుతోంది: “యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయుదానిని వెదకినందుకును సౌలు హతమాయోను.”—1 దిన. 10:13, 14.

సౌలు చెడ్డ మాదిరిని బట్టి, యెహోవాకు అర్పించే ఎలాంటి బలి కన్నా కూడా ఆయనకు చూపించే విధేయతే శ్రేష్ఠమని స్పష్టమౌతోంది. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని అపొస్తలుడైన యోహాను రాశాడు. (1 యోహా. 5:3) యెహోవాతో మనకున్న స్నేహం చిరకాలం నిలవాలంటే ఆయనకు విధేయత చూపించాలనే ప్రాముఖ్యమైన సత్యాన్ని ఎప్పటికీ మరచిపోకూడదు.

[21వ పేజీలోని చిత్రం]

రాజుగా చేయబడినప్పుడు సౌలు వినయస్థుడే

[23వ పేజీలోని చిత్రం]

‘బలులు అర్పించడం కన్నా ఆజ్ఞను గైకొనడం శ్రేష్ఠం’ అని సమూయేలు సౌలుతో ఎందుకు చెప్పాడు?