కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అపవాదిని దేవుడు సృష్టించాడా?

అపవాదిని దేవుడు సృష్టించాడా?

మా పాఠకుల ప్రశ్న

అపవాదిని దేవుడు సృష్టించాడా?

▪ దేవుడే ‘అన్నిటినీ సృష్టించాడు’ అని బైబిలు చెబుతోంది కాబట్టి అపవాదిని కూడా ఆయనే సృష్టించి ఉంటాడని కొంతమంది అంటారు. (ఎఫెసీయులు 3:9, పరిశుద్ధ బైబిల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; ప్రకటన 4:10, 11) అయితే, అపవాదిని దేవుడు సృష్టించలేదని బైబిలు స్పష్టంగా చెబుతోంది.

యెహోవా సృష్టించిన దూత ఆ తర్వాత అపవాదిగా మారాడు. కాబట్టి, ఈ దూత దేవుని ముఖ్య విరోధిగా ఉనికిలో ఉండడమనే విషయానికి, సృష్టికర్తగా యెహోవా గురించి బైబిలు చెబుతున్న దానికి పొందిక ఉండాలి. ఆయన గురించి బైబిలు ఇలా చెబుతోంది, ‘ఆయన కార్యం సంపూర్ణం, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకోదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు.’ (ద్వితీయోపదేశకాండము 32:3-5) ఈ మాటలనుబట్టి, సాతాను ఒకప్పుడు పరిపూర్ణుడు, నీతిమంతుడు, పరలోకంలోవున్న దేవుని కుమారుల్లో ఒకడు అని చెప్పవచ్చు. యోహాను 8:44లో యేసు, అపవాది ‘సత్యంలో నిలిచినవాడు కాడు’ అన్నాడు. ఆ మాటలు సాతాను ఒకప్పుడు సత్యవంతుడు, నిర్దోషి అని చూపిస్తున్నాయి.

అయితే, యెహోవా సృష్టించిన మిగతా దేవదూతలకు, మానవులకు ఉన్నట్టే, సాతానుగా మారిన దూతకు కూడా మంచిచెడుల్లో ఒకదాన్ని ఎంపికచేసుకునే స్వేచ్ఛ ఉంది. ఆ దూత దేవునికి వ్యతిరేకమైన మార్గాన్ని ఎంపికచేసుకుని, తనతో చేతులు కలిపేలా మొదటి మానవ దంపతులను ప్రేరేపించడం ద్వారా సాతానుగా మారాడు. సాతాను అంటే “ఎదురుతిరిగేవాడు.”—ఆదికాండము 3:1-5.

ఆ దుష్ట దూత అపవాదిగా అంటే “చాడీలు చెప్పేవాడిగా” కూడా తయారయ్యాడు. సాతాను, సర్పం వెనకాల అదృశ్యంగా ఉంటూ సృష్టికర్త స్పష్టంగా ఇచ్చిన ఆజ్ఞను మీరేలా హవ్వను మోసపర్చడానికి కుయుక్తితో అబద్ధాలు చెప్పాడు. అందుకే యేసు సాతానును, ‘అబద్ధానికి తండ్రి’ అన్నాడు.—యోహాను 8:44, పరిశుద్ధ బైబిల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

అయితే, ఎలాంటి లోపంలేని, ఎలాంటి చెడు ప్రభావంపడని పరిపూర్ణ దేవదూతలో అలాంటి చెడ్డ కోరిక ఎలా కలిగింది? దేవునికి మాత్రమే చెందాల్సిన ఆరాధన తను పొందాలని ఆశించి, మానవులను యెహోవా పరిపాలన కింద ఉంచకుండా తన పరిపాలన కిందకు తెచ్చుకునే అవకాశమున్నట్టు అతడు చూశాడని స్పష్టమౌతోంది. పరిపాలించవచ్చనే ఆలోచనను మనసులో నుండి తొలగించుకునే బదులు దాని గురించే ఆలోచిస్తూ చివరకు దాన్ని కార్యరూపంలో పెట్టాడు. ఆ ప్రక్రియ గురించి యాకోబు పత్రికలో ఇలా ఉంది, ‘[ఒక వ్యక్తి] దురాశకు లోనై ఆశల్లో చిక్కుకుపోయినప్పుడు నీతికి దూరమై చెడు చేయాలనే బుద్ధి పుడుతుంది. దురాశ గర్భం దాల్చి పాపాన్ని ప్రసవిస్తుంది.’—యాకోబు 1:14, 15, పరిశుద్ధ బైబిల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; 1 తిమోతి 3:6.

ఉదాహరణకు, ఒక అకౌంటెంట్‌ తన స్వలాభం కోసం కంపెనీ నుండి దోచుకోవడానికి తప్పుడు రికార్డులను పుట్టించే అవకాశం ఉందని చూశాడనుకుందాం. ఆయన ఆ చెడు ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని మనసులో నుండి తొలగించుకోవచ్చు. కానీ అలా కాకుండా దాని గురించే ఆలోచిస్తూ ఉంటే ఆ కోరిక బలపడి దాన్ని కార్యరూపంలో పెట్టే అవకాశముంది. ఆయనలా చేస్తే దొంగ అవుతాడు. తను చేసిన నేరం గురించి అబద్ధాలు చెబితే, అబద్ధికుడు కూడా అవుతాడు. అదే విధంగా, దేవుడు సృష్టించిన దూత తప్పుడు కోరికలను పెంచుకొని వాటిని కార్యరూపంలో పెట్టడం ద్వారా, తనకివ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ మోసం చేసి, తన తండ్రికి ఎదురు తిరిగి అపవాదియైన సాతాను అయ్యాడు.

సంతోషకరంగా, దేవుడు సరైనదని అనుకున్న సమయంలో అపవాదియైన సాతాను నాశనం చేయబడతాడు. (రోమీయులు 16:20) ఈలోపు యెహోవా దేవుని ఆరాధికులు సాతాను కుతంత్రాల గురించి తెలుసుకోగలుగుతున్నారు, అతని కుట్రల నుండి తప్పించుకోగలుగుతున్నారు. (2 కొరింథీయులు 2:11; ఎఫెసీయులు 6:11) అందుకే, ‘అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు.’—యాకోబు 4:7. (w11-E 03/01)

[21వ పేజీలోని బ్లర్బ్‌]

పరిపూర్ణ దూత దేవునికి వ్యతిరేకమైన మార్గాన్ని ఎంపికచేసుకోవడం ద్వారా సాతాను అయ్యాడు