కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి దగ్గరవ్వండి

‘నీకు ఇష్టం’

‘నీకు ఇష్టం’

మనం ఎంతో ప్రేమించేవాళ్లు మన కళ్లముందు బాధపడుతూ చనిపోతుంటే గుండె విలవిలలాడుతుంది. ఆ సమయంలో మనం దుఃఖించడం సహజమే. అయితే మనకు సాంత్వననిచ్చే విషయమేమిటంటే, మనల్ని సృష్టించిన యెహోవా దేవుడు మన బాధను అర్థంచేసుకుంటాడు. అంతమాత్రమే కాదు, చనిపోయిన వాళ్లను తనకున్న అపరిమితమైన శక్తితో మళ్లీ బ్రతికించాలని ఆయనెంతో కోరుకుంటున్నాడు. ఈ విషయంలో యోబుకు ఎంత నమ్మకముందో ఆయన మాటల్లో తెలుస్తుంది. దాన్ని, యోబు 14:13-15లో గమనించండి.

ఈ సన్నివేశాన్ని పరిశీలించండి. దేవుని మీద ఎంతో విశ్వాసమున్న యోబుకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఆస్తి అంతా పోయింది, ఆయనెంతో ప్రేమించిన ఆయన పిల్లలందరూ చనిపోయారు, దానికితోడు ఆయనకు బాధాకరమైన జబ్బు చేసింది. ఎంతో కృంగిపోయిన యోబు దేవునికి ఇలా విన్నవించుకున్నాడు, ‘నువ్వు పాతాళంలో [సమాధిలో] నన్ను దాచిపెడితే ఎంతోమేలు.’ (13వ వచనం) పాతాళంలోకి అంటే సమాధిలోకి వెళ్తే బాధ నుండి విముక్తి పొందవచ్చని యోబు ఆశించాడు. దేవుడు దాచిపెట్టిన విలువైన సంపదలా, యోబు సమాధిలో కష్టాలు, బాధలు లేకుండా భద్రంగా ఉంటాడు. a

అయితే యోబు ఎప్పటికీ సమాధిలోనే ఉండిపోతాడా? అలా జరగదని యోబు నమ్మకం. ‘ఇంతకాలమని నియమించి తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో’ అని ఆయన ప్రార్థించాడు. తను సమాధిలో శాశ్వతంగా ఉండిపోనని, యెహోవా తనను మర్చిపోడని ఆయన బలంగా నమ్మాడు. తను సమాధిలో గడిపే సమయాన్ని ‘యుద్ధదినాలతో’ అంటే వేచివుండాల్సిన కాలంతో ఆయన పోల్చాడు. అయితే అదెంత కాలం? ‘నాకు విడుదల కలిగేంతవరకు’ అని ఆయన అన్నాడు. (14వ వచనం) సమాధిలో నుండి బయటకు వచ్చినప్పుడు, మరోలా చెప్పాలంటే, మళ్లీ బ్రతికినప్పుడు ఆ విడుదల కలుగుతుంది.

యోబు తనకు విడుదల దొరుకుతుందని ఎందుకంత బలంగా నమ్మాడు? ఎందుకంటే, చనిపోయిన తన నమ్మకమైన ఆరాధకుల గురించి మన ప్రేమగల సృష్టికర్త ఏమనుకుంటున్నాడో యోబుకు తెలుసు. ఆయనిలా చెప్పాడు, ‘నువ్వు పిలుస్తావు, నేను నీకు ప్రత్యుత్తరమిస్తాను. నీ హస్తకృత్యం ఎడల నీకు ఇష్టం కలుగుతుంది.’ (15వ వచనం) దేవుడు తనను సృష్టించాడని యోబు ఒప్పుకున్నాడు. గర్భంలో యోబు రూపొందడానికి కారణం జీవదాత అయిన దేవుడే కాబట్టి యోబు చనిపోయిన తర్వాత ఆయన యోబును తప్పకుండా మళ్లీ బ్రతికించగలడు.—యోబు 10:8, 9; 31:15.

యోబు మాటల్నిబట్టి యెహోవా ఎంతో ప్రేమగల దేవుడని అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఆయనకు యోబులాంటి వాళ్లంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అలాంటివాళ్లు తను ఇష్టపడే వ్యక్తులుగా దేవుడు తమను తీర్చిదిద్దడానికి అడ్డు చెప్పరు. (యెషయా 64:8) యెహోవా నమ్మకమైన ఆరాధకులు ఆయన దృష్టిలో ఎంతో విలువైనవాళ్లు. నమ్మకంగా ఉండి చనిపోయిన వాళ్లంటే ఆయనకు ‘ఇష్టం.’ ఇష్టం అని అనువదించబడిన హెబ్రీ పదం, “ఏదైనా ఒకదాన్ని తీవ్రంగా కోరుకోవడాన్ని తెలియజేయడానికి ఉపయోగించే శక్తివంతమైన పదాల్లో ఒకటి” అని ఒక పండితుడు చెబుతున్నాడు. యెహోవా చనిపోయిన తన ఆరాధకులను గుర్తుపెట్టుకుంటాడు. అంతేకాదు, వాళ్లను మళ్లీ బ్రతికించాలని కూడా ఆయనెంతో కోరుకుంటున్నాడు.

సంతోషకరమైన విషయమేమిటంటే, మొట్టమొదట రాయబడిన బైబిలు పుస్తకాల్లో ఒకటైన యోబు గ్రంథంలో, చనిపోయిన వాళ్లను మళ్లీ బ్రతికించాలని తను కోరుకుంటున్నట్టు యెహోవా తెలియజేశాడు. b మీరెంతో ప్రేమించే చనిపోయిన మీ వాళ్లను మళ్లీ మీతో కలపాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది తెలుసుకుంటే దుఃఖాన్ని తట్టుకోవడం తేలికవుతుంది. ప్రేమామయుడైన ఈ దేవుని గురించి, ఆయన మనల్ని తను ఇష్టపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటే మనం ఏమి చేయాలనేదాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటే ఆయన చేయాలనుకున్నది జరగడం కళ్లారా చూడవచ్చు. (w11-E 03/01)

a ‘నన్ను దాచిపెట్టు’ అన్న యోబు మాటలకు “అమూల్యమైన సంపదలా [నన్ను] భద్రంగా దాచిపెట్టు” అనే అర్థం ఉండవచ్చని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతోంది. ఆ మాటలకు, “నన్ను నిధిలా దాచు” అనే అర్థం కూడా ఉండవచ్చని మరో గ్రంథం చెబుతోంది.

b చనిపోయిన వాళ్లు నీతి విలసిల్లే కొత్త లోకంలో మళ్లీ బ్రతుకుతారని బైబిల్లోవున్న వాగ్ధానం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలో 7వ అధ్యాయాన్ని చూడండి.