కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు—ఎక్కడ నుండి వచ్చాడు?

యేసు—ఎక్కడ నుండి వచ్చాడు?

‘పిలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి—నువ్వు ఎక్కడ నుండి వచ్చావని యేసును అడిగాడు. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇవ్వలేదు.’—యోహాను 19:8, 9.

రోమా గవర్నరైన పొంతు పిలాతు, యేసును విచారణ చేస్తున్నప్పుడు అలా అడిగాడు. యేసు ఇశ్రాయేలు దేశంలోని ఏ ప్రాంతానికి చెందినవాడో పిలాతుకు తెలుసు. (లూకా 23:6, 7) అంతేకాదు యేసు సాధారణమైన వ్యక్తి కాదని కూడా ఆయనకు తెలుసు. యేసు అంతకుముందు జీవించాడని పిలాతు అనుకునివుంటాడా? అన్యుడైన ఈ పాలకుడు సత్యాన్ని అంగీకరించి, దాని ప్రకారం నడుచుకోవాలని నిజంగా కోరుకుని ఉంటాడా? ఏదేమైనా, యేసు మాత్రం జవాబు చెప్పలేదు. పిలాతుకు సత్యం మీద, న్యాయం మీద కన్నా తన పదవి మీదే ఎక్కువ ఆసక్తి ఉందని త్వరలోనే తేలిపోయింది.—మత్తయి 27:11-26.

సంతోషకరమైన విషయమేమిటంటే, ఎవరైనా యేసు ఎక్కడ నుండి వచ్చాడో మనస్ఫూర్తిగా తెలుసుకోవాలనుకుంటే సులువుగా తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు పుట్టుపూర్వోత్తరాల గురించి బైబిలు స్పష్టంగా చెబుతోంది. ఈ విషయాలను పరిశీలించండి.

ఎక్కడ పుట్టాడు?

యేసు యూదయలోని బేత్లెహేము అనే గ్రామంలో, దయనీయ పరిస్థితుల్లో పుట్టాడు. కైసరు ఔగుస్తు జనాభా లెక్కల కోసం తమ పేర్లను నమోదు చేసుకోమని ఆజ్ఞ జారీ చేసినందుకు యేసు తల్లి మరియ, ఆమె భర్త యోసేపు ఆయన పూర్వీకుల స్థలమైన బేత్లెహేముకు వెళ్లాల్సివచ్చింది. ఆ సమయంలో ఆమెకు ‘ప్రసవ దినాలు నిండాయి.’ రద్దీగావున్న గ్రామంలో వసతి దొరకకపోవడంతో ఆ దంపతులు పశువుల పాకలో ఉండాల్సివచ్చింది, అక్కడే యేసు పుట్టాడు, ఆయనను పశువుల తొట్టిలో పడుకోబెట్టారు.—లూకా 2:1-7.

శతాబ్దాల క్రితం, యేసు పుట్టబోయే స్థలం గురించి బైబిల్లోని ఒక ప్రవచనం ఇలా తెలియజేసింది, ‘బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాలలో నువ్వు స్వల్ప గ్రామమైనా, నా కోసం ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు.’ a (మీకా 5:2) బేత్లెహేము యూదయ ప్రాంతంలోని పట్టణాల్లో ఒకటిగా లెక్కించలేనంత చిన్నదని తెలుస్తోంది. అయినా ఈ చిన్న గ్రామానికి భవిష్యత్తులో విశేషమైన ఘనత లభిస్తుంది. దేవుడు వాగ్దానం చేసిన మెస్సీయ లేదా క్రీస్తు బేత్లెహేము నుండి వస్తాడు.—మత్తయి 2:3-6; యోహాను 7:40-42.

ఎక్కడ పెరిగాడు?

యేసు వాళ్లు ఐగుప్తులో కొంతకాలం ఉన్న తర్వాత, యెరూషలేముకు ఉత్తరాన 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న గలిలయ ప్రాంతంలోని ఒక పట్టణమైన నజరేతుకు వెళ్లారు. అప్పటికి యేసుకు మూడేళ్లు కూడా ఉండవు. ఈ అందమైన ప్రదేశంలో రైతులు, గొర్రెల కాపరులు, జాలర్లు తమతమ పనులు చూసుకునేవాళ్లు. అక్కడే యేసు పెద్ద కుటుంబంలో పెరిగాడు, బహుశా వాళ్లు అంత ధనవంతులు కాకపోయివుండవచ్చు.—మత్తయి 13:55, 56.

మెస్సీయ ‘నజరేయుడు’ అయ్యుంటాడని బైబిల్లోని ఒక ప్రవచనం శతాబ్దాల ముందే తెలియజేసింది. ‘ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరేలా’ యేసు వాళ్లు ‘నజరేతు’ అనే ఊరిలో నివసించారని సువార్త రచయిత మత్తయి రాశాడు. (మత్తయి 2:19-23) నజరేయుడు అనే పేరుకు, “అంకురము” అని అనువదించబడిన హీబ్రూ పదంతో సంబంధం ఉందనిపిస్తోంది. దావీదు రాజు తండ్రి అయిన యెష్షయి వంశం నుండి మెస్సీయ వస్తాడు కాబట్టి మెస్సీయను యెష్షయి నుండి వచ్చే “అంకురము” అని చెప్పిన యెషయా ప్రవచనం గురించి మత్తయి మాట్లాడుతున్నాడని తెలుస్తోంది. (యెషయా 11:1) నిజానికి యేసు, దావీదు ద్వారా యెష్షయి వంశీకుడు.—మత్తయి 1:6, 16; లూకా 3:23, 31, 32.

అసలు ఎక్కడ నుండి వచ్చాడు?

బేత్లెహేములోని పశువుల పాకలో పుట్టడానికి ఎంతోకాలం ముందు నుండే యేసు ఉనికిలో ఉన్నాడని బైబిలు బోధిస్తోంది. యేసు ‘పూర్వకాలం నుండి, అనాది కాలం నుండి’ ఉనికిలో ఉన్నాడని కూడా ముందు ప్రస్తావించిన మీకా ప్రవచనం చెబుతోంది. (మీకా 5:2, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) దేవుడు మొదట సృష్టించిన యేసు భూమ్మీద మనిషిగా పుట్టకముందు పరలోకంలో దేవదూతగా ఉన్నాడు. యేసే స్వయంగా ‘నేను పరలోకం నుండి వచ్చాను’ అని చెప్పాడు. (యోహాను 6:38; 8:23) అదెలా సాధ్యం?

యెహోవా b దేవుడు పరలోకంలోవున్న తన కుమారుని ప్రాణాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో ఒక అద్భుతం చేసి యూదా కన్యక అయిన మరియ గర్భంలోకి మార్చాడు, అలా యేసు పరిపూర్ణ మానవుడిగా పుట్టగలిగాడు. అలాంటి అద్భుతం చేయడం సర్వశక్తిగల దేవునికి పెద్ద కష్టం కాదు. మరియతో మాట్లాడిన దేవదూత చెప్పినట్లు, “దేవునికి సాధ్యంకానిది ఏదీ లేదు.”—లూకా 1:30-35, 37, పరిశుద్ధ బైబిల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

యేసు ఎక్కడ నుండి వచ్చాడనేదే కాదు ఆయన గురించి బైబిలు ఇంకా ఎక్కువే చెప్తోంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే నాలుగు సువార్తలు ఆయన ఎలా జీవించాడనే దాని గురించి ఎంతో చెబుతున్నాయి. (w11-E 04/01)

a బేత్లెహేముకు ముందు ఎఫ్రాతా అనే పేరు ఉండేదని తెలుస్తోంది.—ఆదికాండము 35:19.

b దేవుని పేరు యెహోవా అని బైబిలు చెప్తోంది.