కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు-ఎలా జీవించాడు?

యేసు-ఎలా జీవించాడు?

“నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చి, ఆయన పని ముగించడమే నా ఆహారం.” —యోహాను 4:34, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

పై మాటల్ని యేసు ఏ సందర్భంలో చెప్పాడో గమనిస్తే, ఆయనకు తన జీవితంలో అన్నిటికన్నా ఏది ప్రాముఖ్యమైనదో తెలుస్తుంది. యేసు, ఆయన శిష్యులు పర్వత ప్రాంతమైన సమరయ గుండా ప్రయాణం చేస్తూ దాదాపు పన్నెండు గంటలకు ఒక ఊరికి చేరుకున్నారు. (యోహాను 4:6) అప్పటికల్లా యేసుకు ఆకలి వేస్తుండవచ్చనుకుని శిష్యులు ఆయనకు తినడానికి ఆహారం ఇచ్చారు. (యోహాను 4:31-33) అప్పుడు యేసు తన జీవిత సంకల్పమేమిటో వాళ్లకు సంక్షిప్తంగా చెప్పాడు. ఆయన దృష్టిలో ఆహారం తినడం కన్నా దేవుడు చెప్పింది చేయడం చాలా ప్రాముఖ్యం. మాటల్లో, పనుల్లో దేవుడు తన నుండి ఏమి కోరుతున్నాడో అది చేయడానికే ఆయన జీవించాడు. దాని కోసం ఆయన ఏమేమి చేశాడు?

దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు, బోధించాడు

యేసు జీవించినంతకాలం ఏమి చేశాడనేదాని గురించి బైబిలు ఇలా వివరిస్తోంది, ‘రాజ్యాన్ని గురించిన సువార్త ప్రకటిస్తూ, బోధిస్తూ ఆయన గలిలయ అంతటా సంచరించాడు.’ (మత్తయి 4:23) దేవుని రాజ్యం గురించి ప్రకటించడం మాత్రమే కాదు, దాని గురించి బోధించాడు కూడా. ఆయన దాని గురించి ప్రజలకు ఉపదేశించాడు, వివరించాడు, సరైన కారణాలనిస్తూ ఒప్పించాడు. ఆయన సందేశంలోని ముఖ్యాంశం రాజ్యమే.

యేసు పరిచర్య చేసినంత కాలం దేవుని రాజ్యమంటే ఏమిటో, అది ఏమి చేస్తుందో తన శ్రోతలకు బోధించాడు. దేవుని రాజ్యం గురించిన సత్యాలు, వాటిలో ఒక్కో దాని గురించి యేసు ఏమి చెప్పాడో తెలియజేసే లేఖనాలు కింద ఉన్నాయి. వాటిని గమనించండి.

  • దేవుని రాజ్యమంటే పరలోకం నుండి పరిపాలించే ఒక ప్రభుత్వం. యెహోవా, ఆ రాజ్యానికి రాజుగా యేసును నియమించాడు.—మత్తయి 4:17; యోహాను 18:36.

  • ఆ రాజ్యం దేవుని నామాన్ని పవిత్రపరుస్తుంది, ఆయన కోరుకునేది పరలోకంలో జరుగుతున్నట్టే భూమ్మీద కూడా జరిగేలా చేస్తుంది.—మత్తయి 6:9, 10.

  • దేవుని రాజ్య పరిపాలనలో భూమంతా పరదైసులా అంటే ఒక అందమైన తోటలా మారుతుంది.—లూకా 23:42, 43.

  • దేవుని రాజ్యం త్వరలో పరిపాలన మొదలుపెట్టి, భూమి విషయంలో దేవుడు కోరుకునేది జరిగేలా చేస్తుంది. aమత్తయి 24:3, 7-12.

అద్భుతాలు చేశాడు

యేసు ముఖ్యంగా ‘బోధకునిగానే’ అందరికీ తెలుసు. (యోహాను 13:13) అయితే, తను చేసిన మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎన్నో అద్భుతాలు కూడా చేశాడు. ఆయన చేసిన ఈ అద్భుతాలను బట్టి రెండు విషయాలు తెలుసుకోవచ్చు. మొదటిది, దేవుడు ఆయనను పంపించాడని రుజువు చేశాయి. (మత్తయి 11:2-6) రెండవది, భవిష్యత్తులో దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలించేటప్పుడు మరింత విస్తృతస్థాయిలో ఆయన ఏమి చేయబోతున్నాడో ముందుగా తెలియజేశాయి. ఆయన చేసిన అద్భుతాల్లో కొన్నిటిని ఇప్పుడు పరిశీలించండి.

  • సముద్రంలో రేగిన పెద్ద తుఫానును, బలమైన గాలులను నిమ్మళింపజేశాడు.—మార్కు 4:39-41.

  • రోగులను బాగుచేశాడు. గుడ్డివాళ్లను, చెవిటివాళ్లను, కుంటివాళ్లను కూడా బాగుచేశాడు.—లూకా 7:21, 22.

  • ఆహారాన్ని అద్భుతంగా ఎక్కువ చేసి, ఆకలితోవున్న జనసమూహాలకు ఆహారం పెట్టాడు.—మత్తయి 14:17-21; 15:34-38.

  • కనీసం మూడు సందర్భాల్లో, చనిపోయిన వాళ్లను తిరిగి బ్రతికించాడు.—లూకా 7:11-15; 8:41-55; యోహాను 11:38-44.

అలాంటి శక్తివంతమైన రాజు పరిపాలనలో భూమ్మీద జీవించడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి!

యెహోవా దేవుడు ఎలాంటివాడో తెలియజేశాడు

యెహోవా గురించి వేరేవాళ్లకు బోధించడానికి, యేసుక్రీస్తుగా అందరికీ తెలిసిన దేవుని సొంత కుమారుని కన్నా ఎక్కువ అర్హులైనవాళ్లు ఎవ్వరూ లేరు. ‘సర్వసృష్టికి ఆదిసంభూతునిగా’ అంటే దేవుడు మొదట సృష్టించినవానిగా యేసు, దేవదూతలందరికన్నా ఎక్కువకాలం పరలోకంలో యెహోవాతోపాటు జీవించాడు. (కొలొస్సయులు 1:15) తన తండ్రి ఆలోచనా విధానాన్ని బాగా తెలుసుకోవడానికి, ఆయన కోరే వాటి గురించి, ఆయన ప్రమాణాల గురించి, ఆయన మార్గాల గురించి నేర్చుకోవడానికి యేసుకు ఎన్ని అవకాశాలు దొరికివుంటాయో ఆలోచించండి.

‘తండ్రికి మాత్రమే కుమారుడు ఎవరో తెలుసు. కుమారునికి తండ్రి ఎవరో తెలుసు. కుమారుడు తన ఇష్టప్రకారం తండ్రిని వెల్లడి చేసినవాళ్లకు కూడా తెలుసు, అంతేకానీ ఇంకెవరికీ తెలీదు’ అని యేసు సరిగ్గానే చెప్పగలిగాడు. (లూకా 10:22, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) యేసు భూమ్మీద మానవునిగా జీవించినప్పుడు తన తండ్రి ఎలావుంటాడో ఎంతో ఇష్టంగా, చాలా ఉత్సాహంగా తెలియజేశాడు. యేసు మాట్లాడినదానికి, బోధించినదానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే, ఆయన పరలోకంలో సర్వోన్నతుడైన దేవుని మహోన్నతమైన సన్నిధిలో ఉన్నప్పుడు స్వయంగా తెలుసుకున్న వాటిని గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడాడు, బోధించాడు.—యోహాను 8:28.

యేసు తన తండ్రి గురించి తెలియజేయడాన్ని విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌ చేసే పనితో పోల్చవచ్చు. అలాంటి సాధనం హైవోల్టేజీ విద్యుత్‌ను సగటు వినియోగదారుడు ఉపయోగించుకోవడానికి అనువుగా లోవోల్టేజీ విద్యుత్‌గా మారుస్తుంది. అలాగే యేసు పరలోకంలో తన తండ్రి గురించి నేర్చుకున్న విషయాలను, భూమ్మీద ఉన్నప్పుడు సామాన్య మానవులు వెంటనే గ్రహించి సులభంగా పాటించగలిగేలా బోధించాడు.

యేసు తన తండ్రి గురించి తెలియజేసిన రెండు ముఖ్యమైన పద్ధతులను పరిశీలించండి.

  • యేసు బోధించేటప్పుడు యెహోవా గురించిన సత్యాన్ని అంటే ఆయన పేరును, ఆయన సంకల్పాన్ని, ఆయన మార్గాలను తెలియజేశాడు.—యోహాను 3:16; 17:6, 26.

  • యేసు తన పనుల ద్వారా యెహోవాకున్న ఎన్నో మంచి లక్షణాలను తెలియజేశాడు. ఆయన తన తండ్రి లక్షణాలు ఎంతో పరిపూర్ణంగా కనబర్చాడు, అందుకే ఆయన, ‘నా తండ్రి ఎలా ఉంటాడో తెలుసుకోవాలనుకుంటే నన్ను చూడండి’ అని చెప్పగలిగాడు.—యోహాను 5:19; 14:9.

యేసు జీవించిన పద్ధతి మనల్ని ఎంతో ముగ్ధుల్ని చేస్తుంది. ఆయన ఎందుకు చనిపోయాడో పరిశీలిస్తే, మనం నేర్చుకున్న దాని ప్రకారం నడుచుకుంటే ఎంతో ప్రయోజనం పొందుతాం. (w11-E 04/01)

a దేవుని రాజ్యం గురించి, అది త్వరలో పరిపాలన మొదలుపెడుతుందని ఎలా చెప్పవచ్చనే దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని “దేవుని రాజ్యం అంటే ఏమిటి?” అనే 8వ అధ్యాయాన్ని, “మనం ‘అంత్యదినములలో’ జీవిస్తున్నామా?” అనే 9వ అధ్యాయాన్ని చూడండి. ఈ పుస్తకాన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు.