కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు ఎందుకు చనిపోయాడు?

యేసు ఎందుకు చనిపోయాడు?

‘మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు.’—మార్కు 10:45.

తనకు ఏమి జరుగుతుందో యేసుకు ముందే తెలుసు. తను ప్రశాంతంగా జీవించలేనని ఆయనకు అర్థమైంది. తన జీవితం 30లలోనే విషాద పరిస్థితుల్లో అర్థాంతరంగా ముగుస్తుందని ఆయనకు తెలుసు, ఆయన చనిపోవడానికి పూర్తిగా సిద్ధమయ్యాడు.

యేసు మరణానికి బైబిలు ఎంతో ప్రాముఖ్యతనిస్తోంది. క్రైస్తవ గ్రీకు లేఖనాలలో లేదా కొత్త నిబంధనలో యేసు మరణం గురించి దాదాపు 175 సార్లు నేరుగా ప్రస్తావించబడిందని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతోంది. అయితే, యేసు ఎందుకు బాధలుపడి చనిపోవాల్సివచ్చింది? ఆ విషయం మనం తెలుసుకోవాలి, ఎందుకంటే యేసు మరణం మన జీవితాల మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది.

తనకు ఏమి జరుగుతుందని యేసుకు ముందే తెలుసు?

యేసు తన జీవితంలోని చివరి సంవత్సరంలో, తను బాధలుపడి, చనిపోతానని తన శిష్యులకు ఎన్నోసార్లు చెప్పాడు. పస్కా అనే పండుగను చివరిసారిగా జరుపుకోవడానికి యెరూషలేముకు వెళ్తున్నప్పుడు దారిలో తన 12 మంది అపొస్తలులతో ఆయన ఇలా చెప్పాడు, ‘మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగించబడతాడు. వాళ్లు ఆయనకు మరణశిక్ష విధించి, ఆయనను అన్యజనులకు అప్పగిస్తారు. వాళ్లు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మివేసి, కొరడాలతో కొట్టి చంపేస్తారు.’ a (మార్కు 10:33, 34) తనకు అలా జరుగుతుందని యేసు ఎందుకంత బలంగా నమ్మాడు?

తన జీవితం ఎలా ముగుస్తుందో తెలియజేసిన హెబ్రీ లేఖనాల్లోని ఎన్నో ప్రవచనాల గురించి యేసుకు బాగా తెలుసు. (లూకా 18:31-33) కొన్ని ప్రవచనాలను, అవి ఎలా నెరవేరాయో వివరించే లేఖనాలను పరిశీలించండి.

మెస్సీయ గురించిన ప్రవచనాలు

తనకు ఇవన్నీ జరిగేలా యేసు సొంతగా ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు. అయినా ఈ ప్రవచనాలు, వేరే చాలా ప్రవచనాలు ఆయన విషయంలో నెరవేరాయి. దీన్నిబట్టి నిజంగానే దేవుడు ఆయనను పంపించాడని రుజువవుతోంది. b

అయితే, యేసు బాధలుపడి చనిపోవడం ఎందుకు అవసరమైంది?

ముఖ్యమైన వివాదాంశాలను పరిష్కరించడానికి యేసు చనిపోయాడు

ఏదెను తోటలో తలెత్తిన, విశ్వమంతటిలోకి ప్రాముఖ్యమైన వివాదాంశాల గురించి యేసుకు తెలుసు. తిరుగుబాటు చేసిన ఒక దేవదూత చెప్పిన మాట విని ఆదాము, హవ్వ దేవుడు చెప్పినట్టు నడుచుకోలేదు. వాళ్లు చేసిన తిరుగుబాటు వల్ల, దేవుని సర్వాధిపత్యం లేదా పరిపాలన విధానం ఎంతవరకు సరైనదనే ప్రశ్న తలెత్తింది. కష్టాలు ఎదురైనా సరే మానవులెవరైనా దేవునికి నమ్మకంగా ఉంటారా లేదా అనే ప్రశ్న కూడా వాళ్లు చేసిన పాపం వల్ల తలెత్తింది.—ఆదికాండము 3:1-6; యోబు 2:1-5.

యెహోవా సర్వాధిపత్యం, మానవులు దేవునికి నమ్మకంగా ఉండడం అనే రెండు వివాదాంశాలకు యేసు ధీటైన జవాబిచ్చాడు. యేసు “మరణం” వరకు సంపూర్ణ విధేయత చూపించడం ద్వారా, దేవుని సర్వాధిపత్యం అంటే ఆయన పరిపాలన విధానం సరైనదని నిరూపించాడు. (ఫిలిప్పీయులు 2:8) అంతేకాదు, ఎంతో తీవ్రమైన కష్టాలు ఎదురైనా సరే ఒక పరిపూర్ణ మానవుడు, యెహోవా దేవునికి పూర్తి నమ్మకంగా ఉండడం సాధ్యమేనని యేసు నిరూపించాడు.

మానవులను విడిపించడానికి యేసు చనిపోయాడు

దేవుడు వాగ్దానం చేసిన మెస్సీయ బాధలుపడి, చనిపోవడంవల్ల మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని యెషయా ప్రవక్త ప్రవచించాడు. (యెషయా 53:5, 10) యేసు దీన్ని స్పష్టంగా అర్థంచేసుకున్నాడు, అందుకే ఆయన ఇష్టపూర్వకంగా, ‘అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం’ ఇచ్చాడు. (మత్తయి 20:28) ఆయన తన ప్రాణాన్ని బలి అర్పించడం వల్ల, అపరిపూర్ణ మానవులు యెహోవా దేవునితో ఒక మంచి సంబంధం కలిగివుండడానికి, పాపమరణాల నుండి తప్పించుకోవడానికి మార్గం ఏర్పడింది. యేసు మరణం వల్ల, ఆదాముహవ్వలు పోగొట్టుకున్నదాన్ని మనం తిరిగి పొందే అవకాశం దొరికింది. అంటే భూమ్మీద ఏలోటూ లేని పరిస్థితుల్లో ఎప్పటికీ జీవించివుండే నిరీక్షణ లభించింది. cప్రకటన 21:3, 4.

మీరు ఏమి చేయవచ్చు?

వరుసగా వచ్చిన ఈ ఆర్టికల్స్‌లో యేసు గురించి అంటే ఆయన ఎక్కడ నుండి వచ్చాడు, ఎలా జీవించాడు, ఎందుకు చనిపోయాడు అనే విషయాల గురించి బైబిలు ఏమి బోధిస్తుందో పరిశీలించాం. యేసు గురించిన ఆ సత్యాలు తెలుసుకుంటే ఆయన మీదున్న అపోహలు తొలగిపోతాయి. అంతేకాదు, ఆ సత్యాల ప్రకారం నడుచుకుంటే ఆశీర్వాదాలు పొందవచ్చు, ఇప్పుడు శ్రేష్ఠమైన జీవితం గడపవచ్చు, భవిష్యత్తులో ఎప్పటికీ జీవించి ఉండవచ్చు. మనం అలాంటి ప్రయోజనాలు పొందాలంటే ఏమి చేయాలో బైబిలు చెబుతోంది.

  • యేసుక్రీస్తు గురించి, యెహోవా సంకల్పంలో ఆయన పాత్ర గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోండి.—యోహాను 17:3.

  • యేసు మీద విశ్వాసముంచండి, ఆయనను మీ రక్షకునిగా అంగీకరిస్తున్నారని మీ జీవన విధానం ద్వారా చూపించండి.—యోహాను 3:36; అపొస్తలుల కార్యములు 5:31.

దేవుని ‘అద్వితీయ కుమారుడైన’ యేసుక్రీస్తు గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకునేందుకు మీకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు. యేసుక్రీస్తు ద్వారా మనం “నిత్యజీవము” అనే బహుమానం పొందవచ్చు.—యోహాను 3:16. (w11-E 04/01)

a యేసు తన గురించి మాట్లాడేటప్పుడు తరచూ ‘మనుష్యకుమారుడు’ అనే పదాన్ని ఉపయోగించాడు. (మత్తయి 8:20) ఈ మాటనుబట్టి, యేసు పూర్తి మానవుడు మాత్రమే కాదు, బైబిలు ప్రవచనంలో ప్రస్తావించబడిన ‘మనుష్యకుమారుడు’ అని కూడా తెలుస్తోంది.—దానియేలు 7:13, 14.

b యేసు విషయంలో నెరవేరిన ప్రవచనాల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని అనుబంధంలో ఉన్న “యేసుక్రీస్తు—వాగ్దానం చేయబడిన మెస్సీయ” అనే అంశాన్ని చూడండి. ఈ పుస్తకాన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు.

c యేసు మరణానికున్న బలి విలువ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని “విమోచన క్రయధనం—దేవుడిచ్చిన అతిగొప్ప బహుమానం” అనే 5వ అధ్యాయాన్ని చూడండి.