కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నేను నమ్ముతున్నాను’

‘నేను నమ్ముతున్నాను’

వారి విశ్వాసాన్ని అనుసరించండి

‘నేను నమ్ముతున్నాను’

మార్త తన సోదరుని సమాధిని మనోనేత్రాలతో చూడగలిగింది. అది రాయితో మూసిన ఒక గుహ. దుఃఖంతో ఆమె గుండె బరువెక్కింది. తనెంతో ప్రేమించిన తన సోదరుడైన లాజరు ఇకలేడన్న విషయాన్ని అస్సలు నమ్మలేకపోతోంది. లాజరు తుది శ్వాస విడిచిన తర్వాతి నాలుగు రోజులూ రోదనలతో, ఓదార్చడానికి వచ్చిపోయే వాళ్లతో, పరామర్శలతో నిండిపోయాయి.

ఇప్పుడు మార్త ముందు లాజరుకు అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు. యేసును చూడగానే ఆమెలో మళ్లీ దుఃఖం కట్టలు తెంచుకుంది, ఎందుకంటే ప్రపంచంలో ఆయనొక్కడే తన సోదరుణ్ణి కాపాడగలిగివుండేవాడు. అయితే, ఒలీవల కొండ దగ్గర బేతనియ అనే చిన్న గ్రామానికి సమీపంలో యేసు ఆమెతోపాటు ఉన్నందుకు ఆమెకు కొంత ఊరట దొరికింది. కొన్ని నిమిషాలు ఆయనతో ఉండడం వల్ల, ఆయన ముఖంలో ఉట్టిపడుతున్న దయను చూసి మళ్లీ ప్రోత్సాహం పొందింది. ఆమె విశ్వాసం గురించి, పునరుత్థానం మీద ఆమెకున్న నమ్మకాల గురించి ఎక్కువ ఆలోచించేలా సహాయం చేయడానికి యేసు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ సంభాషణ వల్ల మార్త, ‘నీవు లోకానికి రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముతున్నాను’ అంది. అవి ఆమె మాట్లాడిన అత్యంత ప్రాముఖ్యమైన మాటల్లో ఒకటి.—యోహాను 11:27.

మార్తకున్న విశ్వాసం చాలా గొప్పది. బైబిలు ఆమె గురించి కొన్ని విషయాలే చెబుతున్నా వాటిలో మనకు ఎన్నో పాఠాలు ఉన్నాయి, అవి మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి సహాయం చేస్తాయి. అదెలాగో తెలుసుకోవడానికి, మార్తకు సంబంధించిన మొదటి బైబిలు వృత్తాంతం ఇప్పుడు చూద్దాం.

‘విచారం, తొందర’

ఇది కొన్ని నెలల ముందు అంటే లాజరు మంచి ఆరోగ్యంతో బ్రతికి ఉన్నప్పటి సంగతి. బేతనియలోవున్న వాళ్లింటికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు. లాజరు, మార్త, మరియ అనే ముగ్గురు సోదర సోదరీలు ఒకే ఇంట్లో ఉండేవాళ్లు. మార్త వచ్చిన అతిథులకు సపర్యలు చేసేది, కొన్నిసార్లు బైబిల్లో ఆమె పేరు మొదట ప్రస్తావించబడింది కాబట్టి ఆమె వాళ్లలో పెద్దదై ఉంటుందని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. (యోహాను 11:5) ఆ ముగ్గురిలో ఎవరికైనా పెళ్లయిందో లేదో మనం తెలుసుకోలేం. ఏదేమైనా, వాళ్లు యేసుకు సన్నిహిత స్నేహితులయ్యారు. తనకెంతో వ్యతిరేకత, శత్రుత్వం ఎదురైన యూదయ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు యేసు వాళ్లింట్లోనే బస చేశాడు. శాంతికి నెలవైన ఆ ఇంట్లో ఉన్నందుకు, వాళ్లు చక్కగా మద్దతు ఇచ్చినందుకు యేసు ఎంతో సంతోషించాడు.

ఆ ఇంటిని సౌకర్యవంతంగా ఉంచడంలో, ఆతిథ్యం ఇవ్వడంలో మార్త ఎప్పుడూ ముందుండేది. ఆమె ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి, తరచూ ఏదో పని తొందరలో ఉన్నట్టు ఉండేది. యేసు వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు కూడా అంతే. తమ ముఖ్య అతిథి కోసం బహుశా ఆయనతోపాటు వచ్చే కొంతమంది కోసం ఆమె ఎన్నో రకాల వంటలతో వెంటనే గొప్ప విందు ఏర్పాటు చేసింది. ఆ రోజుల్లో ఆతిథ్యమివ్వడం చాలా ప్రాముఖ్యం. వచ్చిన అతిథికి ముద్దుపెట్టి లోపలికి ఆహ్వానించేవాళ్లు, చెప్పులు తీసి కాళ్లు కడిగేవాళ్లు, తలకు సుగంధ తైలాన్ని రాసేవాళ్లు. (లూకా 7:44-47) సాధారణంగా, వచ్చిన అతిథి కోసం మంచి విశ్రాంతి స్థలాన్ని, మంచి ఆహారాన్ని ఏర్పాటు చేసేవాళ్లు.

తమ ముఖ్య అతిథి కోసం మార్త మరియలు చాలా పనులు చేయాల్సివుంది. ఆ ఇద్దరిలో మరియ మరింత సున్నిత మనస్కురాలు, ఆలోచనాపరురాలు అని కొన్నిసార్లు అనిపిస్తుంది కాబట్టి, ఆమె మొదట్లో మార్తకు తప్పకుండా సహాయం చేసి ఉంటుంది. కానీ యేసు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ఆయన ఆ సందర్భాన్ని మంచిగా ఉపయోగించుకుని అక్కడున్న వాళ్లకు బోధించాడు. ఆ కాలంలోని మతనాయకుల్లా కాకుండా ఆయన స్త్రీలను గౌరవించాడు, తన పరిచర్య ముఖ్యాంశమైన దేవుని రాజ్యం గురించి వాళ్లకు మనస్ఫూర్తిగా బోధించాడు. యేసు బోధ వినే అవకాశం దొరికినందుకు మరియ ఎంతో సంతోషిస్తూ ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పిన ప్రతీ మాటను జాగ్రత్తగా విన్నది.

మార్త ఎంత కంగారు పడివుంటుందో మనం ఊహించవచ్చు. ఆమె చాలా వంటలను, అతిథులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయాలి కాబట్టి ఆమెలో ఆందోళన, కలవరం ఎక్కువయ్యాయి. పని తొందరలో ఆమె అటూఇటూ తిరుగుతూ తన సోదరి సహాయం చేయకుండా కూర్చొని ఉండడం చూసి ఆమె ముఖం ఎర్రబడిందా, గట్టిగా నిట్టూర్చిందా, లేదా కనుబొమ్మలు చిట్లించిందా? ఆమె అలా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే పనులన్నీ తను ఒక్కతే చేసుకోలేదు!

మార్త ఇక ఎంతమాత్రం తన కోపాన్ని అణచుకోలేకపోయింది. మాట్లాడుతున్న యేసును ఆపి ఒక్కసారిగా ఇలా అంది, “ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సోదరి నన్ను విడిచిపెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుము.” (లూకా 10:40) అవి కఠినమైన మాటలు. మార్త ఆ తర్వాత మరియను సరిదిద్దమని, పనిచేయమని ఆమెతో చెప్పమని యేసును అడిగింది.

యేసు ఇచ్చిన జవాబు, ఇప్పటివరకు బైబిలు చదివిన వాళ్లలో చాలామందికి ఆశ్చర్యం కలిగించినట్లే మార్తకు కూడా ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. యేసు ఆమెతో మృదువుగా ఇలా అన్నాడు, ‘మార్తా, మార్తా, నీవు అనేక పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైంది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పర్చుకుంది, అది ఆమె వద్దనుండి తీసివేయబడదు.’ (లూకా 10:41, 42) యేసు అన్న మాటలకు అర్థమేమిటి? మార్త అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తోందని లేదా మంచి వంటల్ని తయారుచేయడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదని ఆయన అంటున్నాడా?

యేసు మాటలకు అర్థం అది కాదు. మార్త ఉద్దేశాలు మంచివని, ప్రేమతోనే ఆమె అలా చేస్తోందని ఆయనకు బాగా తెలుసు. అలాగే గొప్ప ఆతిథ్యం అన్నిసార్లూ తప్పని ఆయన ఉద్దేశం కాదు. కొంతకాలం ముందు మత్తయి (ఆయనకు లేవీ అనే పేరు కూడా ఉంది) ఏర్పాటు చేసిన ‘గొప్ప విందుకు’ ఆయన సంతోషంగా వెళ్లాడు. (లూకా 5:29) మార్త తయారుచేస్తోన్న భోజనం గురించి కాదుగానీ, ఆమె దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందనే దానిగురించి యేసు మాట్లాడుతున్నాడు. ఆమె ఏవి ప్రాముఖ్యమైన విషయాలో గుర్తించలేనంతగా భారీగా భోజన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. ఇంతకీ ఏవి ప్రాముఖ్యమైన విషయాలు?

స్వయంగా యెహోవా దేవుని అద్వితీయ కుమారుడైన యేసే మార్త ఇంట్లో సత్యాన్ని బోధిస్తున్నాడు. ఆమె చేస్తున్న ఏర్పాట్లుగానీ రుచికరమైన భోజనంగానీ మరేదైనా గానీ అంతకన్నా ప్రాముఖ్యం కాదు. తన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి దొరికిన ప్రత్యేకమైన అవకాశాన్ని మార్త పోగొట్టుకుంటోందని యేసు బాధపడ్డాడు, కానీ దేనికి ప్రాముఖ్యతనివ్వాలో ఆమెనే నిర్ణయించుకోనిచ్చాడు. అయితే, మరియ దేనికి ప్రాముఖ్యతనివ్వాలో నిర్ణయించే హక్కు మార్తకు లేదు.

అందుకే యేసు, మార్తను దయగా సరిదిద్దుతూ ఆమెను శాంతపర్చడానికి రెండుసార్లు ఆమెను మృదువుగా పేరుపెట్టి పిలిచాడు, ‘అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడాల్సిన’ అవసరం లేదని అభయమిచ్చాడు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విందు దొరుకుతున్నప్పుడు, ఒకట్రెండు వంటలైనా సరిపోతాయి. అందుకే ఆయన మరియ ఎన్నుకున్న ‘ఉత్తమమైన దాన్ని’ తీసివేయలేదు, అంటే తన దగ్గర నుండి నేర్చుకోవడానికి ఆయన అడ్డుచెప్పలేదు.

మార్త ఇంట్లో జరిగిన ఆ సంఘటన నుండి నేటి క్రీస్తు అనుచరులు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మన ‘ఆధ్యాత్మిక అవసరం’ తీర్చుకోకుండా చేసే దేన్నీ అనుమతించకూడదు. (మత్తయి 5:3, NW) మనం మార్త ఉదార స్వభావాన్ని, కష్టపడి పనిచేసే స్ఫూర్తిని పాటించాలనుకున్నా, ఆతిథ్యం ఇస్తున్నప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేసేంతగా అంత ప్రాముఖ్యంకాని విషయాల గురించి ‘విచారపడకూడదు, తొందర పడకూడదు.’ ఎక్కువ వంటలతో భోజనం పెడదామని లేదా తిందామని కాదుగానీ ఒకరి విశ్వాసంతో ఒకరం పరస్పరం ప్రోత్సహించుకోవాలనే, ఆధ్యాత్మిక కృపావరాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మనం తోటి విశ్వాసులతో సహవసిస్తాం. (రోమీయులు 1:11, 12) అలాంటి సందర్భాల్లో అల్పాహారం ఏర్పాటు చేసినా సరిపోవచ్చు.

ప్రియ సోదరుడు చనిపోయి, తిరిగి బ్రతికాడు

యేసు ఇచ్చిన మృదువైన మందలింపుకు మార్త సరిగ్గా స్పందించి, పాఠం నేర్చుకుందా? తప్పకుండా నేర్చుకుని ఉంటుంది. అపొస్తలుడైన యోహాను మార్త సోదరుని గురించి ఆసక్తికరమైన ఒక వృత్తాంతాన్ని పరిచయం చేస్తున్నప్పుడు ఇలా అన్నాడు, ‘యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించాడు.’ (యోహాను 11:5) బేతనియలో యేసు మార్తను మందలించిన సంఘటన జరిగి అప్పటికి కొన్ని నెలలు గడిచాయి. మార్త ముఖం మాడ్చుకోలేదు, ఆయన ప్రేమతో సరిదిద్దినందుకు ఆయన మీద కోపాన్ని పెంచుకోలేదు కానీ దిద్దుబాటును స్వీకరించిందని తెలుస్తోంది. మనందరికీ కొన్నిసార్లు దిద్దుబాటు అవసరమౌతుంది కాబట్టి, ఈ విషయంలో కూడా ఆమె చూపించిన విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు.

మార్త తన సోదరునికి జబ్బు చేసినప్పుడు ఆయనను చూసుకోవడంలో నిమగ్నమైంది. ఆయనకు ఉపశమనం కలిగించడానికి, ఆయన ఆరోగ్యం కుదుటపడడానికి తనకు చేతనైనదంతా చేసింది. అయినా లాజరు ఆరోగ్యం అంతకంతకూ క్షీణించింది. ఆయన సోదరీలు గంటల తరబడి, రోజుల తరబడి పక్కనే ఉండి చూసుకున్నారు. ఎన్నోసార్లు మార్త పీక్కుపోయిన తన సోదరుని ముఖం చూసి, సంవత్సరాలపాటు తాము కలిసి అనుభవించిన కష్టసుఖాలను గుర్తుచేసుకొని ఉంటుంది.

ఇక లాజరు పరిస్థితి చేయిదాటిపోయింది అనుకున్నప్పుడు మార్త, మరియ యేసుకు వర్తమానం పంపారు. అక్కడ నుండి రెండ్రోజుల ప్రయాణమంత దూరంలో యేసు సువార్త ప్రకటిస్తున్నాడు. ‘ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి అయ్యాడు’ అని వాళ్లు వర్తమానం పంపారు. (యోహాను 11:1, 3) యేసు తమ సోదరుణ్ణి ప్రేమిస్తున్నాడని వాళ్లకు తెలుసు, తన స్నేహితునికి సహాయం చేయడానికి ఆయన చేయగలిగినదంతా చేస్తాడని వాళ్లకు గట్టి నమ్మకం. పరిస్థితి చేయిదాటకముందే యేసు వస్తాడని వాళ్లు ఆశించారా? అలాగైతే, వాళ్ల ఆశలు పటాపంచలయ్యాయి, లాజరు చనిపోయాడు.

మార్త, మరియ ఎంతో దుఃఖంలోవున్నా ఆయనను సమాధి చేయడానికి ఏర్పాట్లు చేశారు, బేతనియ నుండీ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండీ వచ్చిన అనేకమంది సందర్శకులను చూసుకున్నారు. అప్పటికీ యేసు గురించి ఏ వార్తా లేదు. సమయం గడిచేకొద్దీ మార్తలో ఆందోళన ఎక్కువైంది. చివరకు, లాజరు చనిపోయి నాలుగు రోజులైన తర్వాత యేసు బేతనియ దగ్గరకు వచ్చేశాడని మార్త విన్నది. ఎప్పుడూ చురుగ్గా ఉండే మార్త ఎంతో విచారంలో ఉన్న ఈ సమయంలో కూడా మరియతో చెప్పకుండా యేసును కలవడానికి పరుగెత్తింది.—యోహాను 11:20.

మార్త యేసును చూడగానే కొన్ని రోజులుగా తననూ మరియను వేధించిన విషయాన్ని ఆయనకు చెప్పుకుంటూ, ‘ప్రభూ! నువ్విక్కడ ఉండివుంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు’ అంది. మార్తలో ఇంకా విశ్వాసం, ఆశ ఉన్నాయి. కాబట్టి ఆమె ఇలా అంది, ‘ఇప్పటికైనా నువ్వు అడిగితే దేవుడు నువ్వు అడిగింది ఇస్తాడని నాకు తెలుసు.’ యేసు ఆమె ఆశను బలపర్చడానికి వెంటనే ఇలా చెప్పాడు, “మీ సోదరుడు మళ్లీ బ్రతికి వస్తాడు.”—యోహాను 11:21-23, పరిశుద్ధ బైబిల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

భవిష్యత్తులో జరగబోయే పునరుత్థానం గురించి అంటే తిరిగి బ్రతకడం గురించి యేసు మాట్లాడుతున్నాడని మార్త అనుకుంది, అందుకే ఇలా జవాబిచ్చింది, ‘అంత్యదినమున పునరుత్థానంలో లేస్తాడని ఎరుగుదును.’ (యోహాను 11:24) పునరుత్థానం మీద ఆమెకున్న విశ్వాసం చాలా గొప్పది. ప్రేరేపిత లేఖనాల్లో పునరుత్థానం గురించి స్పష్టంగావున్నా సద్దూకయ్యులు అనే యూదా మత నాయకులు దాన్ని నమ్మేవాళ్లు కాదు. (దానియేలు 12:13; మార్కు 12:18) అయితే యేసు పునరుత్థానం గురించి బోధించాడనే కాదు, కొందరిని పునరుత్థానం చేశాడని కూడా మార్తకు తెలుసు, కానీ లాజరు విషయం వేరు ఎందుకంటే ఆయన చనిపోయి అప్పటికి నాలుగు రోజులైంది. కాబట్టి ఏమి జరగబోతుందో ఆమెకు తెలియదు.

అప్పుడు మరచిపోలేని ఈ మాటలు యేసు అన్నాడు, “పునరుత్థానమును జీవమును నేనే.” నిజానికి భూవ్యాప్తంగా చనిపోయిన వాళ్లను భవిష్యత్తులో పునరుత్థానం చేసే అధికారాన్ని యెహోవా దేవుడు తన కుమారునికి ఇచ్చాడు. యేసు మార్తతో ‘ఈ మాట నమ్ముతున్నావా?’ అని అడిగాడు. దానికి మార్త, ఈ ఆర్టికల్‌ మొదట్లో ప్రస్తావించిన జవాబిచ్చింది. ప్రవక్తలు ముందుగా ప్రవచించినట్లు లోకంలోకి రాబోయే క్రీస్తు లేదా మెస్సీయ యేసేనని, ఆయన యెహోవా దేవుని కుమారుడని మార్త నమ్మింది.—యోహాను 5:28, 29; 11:25-27.

అలాంటి విశ్వాసాన్ని యెహోవా దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు విలువైనదిగా ఎంచుతారా? ఆ తర్వాత మార్త కళ్ల ముందు జరిగిన సంఘటనలు దానికి స్పష్టమైన జవాబిస్తాయి. ఆమె తన సోదరిని తీసుకురావడానికి పరుగెత్తింది. ఆ తర్వాత యేసు మరియతో, ఆమెతోపాటు దుఃఖిస్తున్న వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు ఆయనెంతో బాధపడడం మార్త గమనించింది. ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధ కలుగుతుందో చూసి యేసు తన దుఃఖాన్ని దాచుకోకుండా కన్నీళ్లు పెట్టుకోవడం ఆమె చూసింది. ఆమె సోదరుడు ఉన్న సమాధి దగ్గర రాయి తీసివేయమని యేసు ఆజ్ఞ ఇవ్వడం ఆమె విన్నది.—యోహాను 11:28-39.

ఎప్పుడూ వాస్తవికంగా ఆలోచించే మార్త, లాజరు చనిపోయి అప్పటికే నాలుగు రోజులైంది కాబట్టి వాసన రావచ్చని అభ్యంతరం చెప్పింది. అందుకు యేసు, ‘నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా?’ అని ఆమెతో అన్నాడు. ఆమె నమ్మింది, యెహోవా దేవుని మహిమ కూడా చూసింది. అక్కడికక్కడే లాజరును తిరిగి బ్రతికించేందుకు దేవుడు తన కుమారునికి శక్తినిచ్చాడు. ‘లాజరూ, బయటకు రా!’ అని యేసు ఆజ్ఞాపించడం, ప్రేతవస్త్రాలతో చుట్టబడిన లాజరు అలాగే లేసి అడుగులో అడుగువేసుకుంటూ గుహలో నుండి తలుపు దగ్గరకు వస్తున్నప్పుడు సమాధి నుండి మెల్లగా వినబడిన శబ్దం, ‘అతని కట్లు విప్పి వెళ్లనివ్వండి’ అని యేసు చెప్పడం, ఆమె, ఆమె సోదరి ఒక్క ఉదుటున తమ సోదరుని దగ్గరకు వెళ్లి సంతోషంతో కౌగలించుకోవడం, ఇవన్నీ మార్త బ్రతికి ఉన్నంతకాలం ఆమె మనసులో ముద్రించుకుపోయివుంటాయి. (యోహాను 11:40-44) మార్త గుండెలోని భారం దిగిపోయింది!

చనిపోయినవాళ్లు పునరుత్థానమవడం కేవలం ఒక కల కాదని ఈ వృత్తాంతం నుండి తెలుస్తోంది. అది సంతోషకరమైన బైబిలు బోధ. పునరుత్థానాలు నిజంగా జరిగాయని చరిత్ర కూడా రుజువు చేస్తోంది. మార్త, మరియ, లాజరు విషయంలో చేసినట్లే విశ్వాసం చూపించిన వాళ్లకు ప్రతిఫలమివ్వాలని యెహోవా, ఆయన కుమారుడైన యేసు ఎంతో కోరుకుంటారు. మార్తలా బలమైన విశ్వాసాన్ని చూపిస్తే మీకూ అలాంటి బహుమానాలే ఇస్తారు. a

‘మార్త ఉపచారం చేసింది’

బైబిలు మార్త గురించి ఇంకొక్కసారి మాత్రమే ప్రస్తావిస్తుంది. యేసు భూమ్మీద జీవించిన ఆఖరి వారంలో అది మొదటి రోజు. తనకు ఏయే శ్రమలు వస్తాయో బాగా తెలిసిన యేసు మళ్లీ, సంతోషానికి నెలవైన బేతనియలోని మార్త వాళ్ల ఇంట్లోనే ఉండాలనుకున్నాడు. అక్కడ నుండి 3 కి.మీ. దూరంలోవున్న యెరూషలేముకు ఆయన నడిచివెళ్లేవాడు. కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో యేసు, లాజరు భోజనం చేస్తున్నప్పుడు బైబిలు మార్త గురించి చివరిసారి ఇలా చెప్పడం చూస్తాం, ‘మార్త ఉపచారం చేసింది.’—యోహాను 12:2.

ఆమె కష్టపడి పనిచేసేదని అనడానికి ఆ మాటలే నిదర్శనం! బైబిలు మొదటిసారి ఆమె గురించి ప్రస్తావించినప్పుడు ఆమె పనిచేస్తోంది, చివరిసారి ప్రస్తావించినప్పుడు కూడా ఆమె పనిచేస్తూ తన చుట్టూవున్న వాళ్ల అవసరాలను తీర్చడానికి శాయశక్తులా కృషి చేస్తోంది. నేడు మార్తలాంటి ధైర్యం, ఔదార్యం కలిగి, కష్టపడి పనిచేస్తూ ఎల్లప్పుడూ తమ విశ్వాసాన్ని క్రియల్లో చూపించే స్త్రీలు క్రీస్తు అనుచరులున్న సంఘాల్లో ఉండడం ఒక ఆశీర్వాదం. మార్త ఎప్పుడూ అలాగే చేసివుండవచ్చు. అలా చేసివుంటే ఆమె తెలివిగా నడుచుకున్నట్టే, ఎందుకంటే ఆమె అనుభవించాల్సిన కష్టాలు ఇంకా ఉన్నాయి.

కొన్ని రోజులకే తను ఎంతో అభిమానించిన ప్రభువైన యేసు ఘోరంగా చనిపోయినప్పుడు ఆ దుఃఖాన్ని మార్త భరించాల్సి వచ్చింది. అంతేకాదు, యేసును చంపిన మోసగాళ్లయిన నరహంతకులే లాజరును కూడా చంపాలని ప్రయత్నించారు. లాజరు పునరుత్థానంతో చాలామంది విశ్వాసం బలపడుతుంది కాబట్టే వాళ్లు ఆయనను చంపాలనుకున్నారు. (యోహాను 12:9-11) మరణం వల్ల చివరకు తన సోదరితో, సోదరునితో మార్తకున్న ప్రేమ బంధాలు తెగిపోయాయి. అది ఎప్పుడు, ఎలా జరిగిందో మనకు తెలియదు కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితం. అదేమిటంటే ఆమెకున్న బలమైన విశ్వాసం వల్లే ఆమె చివరి వరకు సహించగలిగింది. అందుకే నేటి క్రైస్తవులు మార్త విశ్వాసాన్ని అనుసరించడం మంచిది. (w11-E 04/01)

[అధస్సూచి]

a పునరుత్థానం గురించి బైబిలు ఏమి చెబుతుందో ఎక్కువ తెలుసుకోవాలంటే, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 7వ అధ్యాయం చూడండి. దానిని యెహోవాసాక్షులు ప్రచురించారు.

[23వ పేజీలోని చిత్రం]

మార్త దుఃఖంలోవున్నా, తన విశ్వాసాన్ని బలపర్చే విషయాల మీద దృష్టి పెట్టేందుకు యేసు చేసిన సహాయాన్ని అంగీకరించింది

[24వ పేజీలోని చిత్రం]

మార్త ‘విచారంలో, తొందరలో’ ఉన్నా దిద్దుబాటును వినయంతో స్వీకరించింది

[27వ పేజీలోని చిత్రం]

తన సోదరుడు పునరుత్థానమవడం చూసినప్పుడు యేసు మీద మార్త ఉంచిన విశ్వాసానికి ప్రతిఫలం దొరికింది