కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూమి విషయంలో దేవుని సంకల్పం ఏమిటి?

భూమి విషయంలో దేవుని సంకల్పం ఏమిటి?

దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి

భూమి విషయంలో దేవుని సంకల్పం ఏమిటి?

ఈ ఆర్టికల్‌ సాధారణంగా మీకు వచ్చే సందేహాలను ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి జవాబులు మీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కూడా ఈ ఆర్టికల్‌ తెలియజేస్తుంది. ఆ జవాబులను మీతో చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.

1. భూమి విషయంలో దేవుని సంకల్పం ఏమిటి?

భూమి మానవుల నివాసస్థలం. పరలోకంలో జీవించడానికి దేవదూతలను సృష్టించిన తర్వాత భూమ్మీద జీవించడానికి దేవుడు మానవులను చేశాడు. (యోబు 38:4, 7) అలా యెహోవా మొదటి మానవుణ్ణి ఏదెను అనే అందమైన తోటలో ఉంచి, భూమ్మీద ఎప్పటికీ జీవించే అవకాశాన్ని వాళ్లకూ వాళ్ల పిల్లలకూ ఇచ్చాడు.—ఆదికాండము 2:15-17; కీర్తన 115:16 చదవండి.

భూమ్మీద కొంతభాగంలోనే ఏదెను తోట ఉండేది. మొదటి మానవ దంపతులైన ఆదాము, హవ్వ పిల్లలను కనాలి. వాళ్ల సంఖ్య పెరిగేకొద్దీ వాళ్లు భూమిని సాగుచేసి దాన్ని అందమైన తోటగా తయారుచేయాలి. (ఆదికాండము 1:28) భూమి ఎప్పటికీ నాశనం కాదు.—కీర్తన 104:5 చదవండి.

2. భూమి ఇప్పుడు అందమైన తోటలా ఎందుకు లేదు?

ఆదాము, హవ్వ దేవుడు చెప్పినట్లు నడుచుకోలేదు, అందుకే ఆయన వాళ్లను ఏదెను తోట నుండి పంపించేశాడు. భూమి ఇక ఏ మాత్రం అందమైన తోటలా లేదు, దాన్ని ఏ మానవుడూ మళ్లీ ఏదెను తోటలా తయారుచేయలేకపోయాడు. ‘భూమి దుష్టుల చేతికి అప్పగించబడింది’ అని బైబిలు చెబుతోంది.—యోబు 9:24; ఆదికాండము 3:23, 24 చదవండి.

మానవుల విషయంలో యెహోవా మొదట్లో ఏమి సంకల్పించాడో దాన్ని ఆయన మర్చిపోలేదు. (యెషయా 45:18) మానవులు ఎలా జీవించాలని ఆయన అనుకున్నాడో అలా జీవించేలా చేస్తాడు.—కీర్తన 37:11 చదవండి.

3. దేవుడు భూమ్మీద శాంతిని తిరిగి ఎలా తీసుకొస్తాడు?

మానవులు శాంతిని అనుభవించాలంటే, దేవుడు మొదట దుష్టులను తీసేయాలి. హార్‌మెగిద్దోను అనే యుద్ధంలో దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్లందర్నీ దేవదూతలు నాశనం చేస్తారు. సాతాను వెయ్యి సంవత్సరాలు బంధించబడతాడు. కానీ దేవుడు తనను ప్రేమించే ప్రజలను కాపాడతాడు, వాళ్లు భూమ్మీద కొత్త పరిస్థితుల్లో జీవిస్తారు.—ప్రకటన 16:14-16; 20:1-3; 21:3, 4 చదవండి.

4. బాధలు ఎప్పుడు పోతాయి?

ఆ వెయ్యి సంవత్సరాలు యేసు పరలోకం నుండి భూమిని పరిపాలిస్తాడు, అప్పుడు ఈ భూమిని తిరిగి ఒక అందమైన తోటలా మారుస్తాడు. అంతేకాదు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ల పాపాలను కూడా తుడిచేస్తాడు. అలా యేసు రోగాలను, వృద్ధాప్యాన్ని, మరణాన్ని పూర్తిగా తీసేస్తాడు.—యెషయా 11:9; 25:8; 33:24; 35:1 చదవండి.

దేవుడు భూమ్మీది నుండి దుష్టత్వాన్ని ఎప్పుడు తీసేస్తాడు? అంతం దగ్గర్లోనే ఉందని చూపించే ‘సూచనను’ యేసు ఇచ్చాడు. ప్రస్తుత లోక పరిస్థితులు మానవుల మనుగడకే ప్రమాదకరంగా తయారయ్యాయి, అవి మనం “యుగసమాప్తి” కాలంలో జీవిస్తున్నామని చూపిస్తున్నాయి.—మత్తయి 24:3, 7-14, 20-22; 2 తిమోతి 3:1-5 చదవండి.

5. భూమి మళ్లీ అందమైన తోటలా మారినప్పుడు దానిలో ఎవరు జీవిస్తారు?

ప్రజలను శిష్యులుగా చేయమని, వాళ్లకు దేవుని ప్రేమ గురించి బోధించమని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్తయి 28:19, 20) భూమ్మీద కొత్త పరిస్థితుల్లో జీవించే విధంగా యెహోవా, ప్రపంచవ్యాప్తంగావున్న లక్షలాదిమందిని సిద్ధం చేస్తున్నాడు. (జెఫన్యా 2:3) పురుషులు మంచి భర్తలుగా, మంచి తండ్రులుగా ఎలా ఉండవచ్చో, స్త్రీలు మంచి భార్యలుగా, మంచి తల్లులుగా ఎలా ఉండవచ్చో యెహోవాసాక్షుల రాజ్యమందిరాల్లో నేర్చుకుంటారు. త్వరలోనే మంచి పరిస్థితులు వస్తాయని ఎందుకు నమ్మవచ్చో పిల్లలూ తల్లిదండ్రులూ కలిసి తెలుసుకుంటారు.—మీకా 4:1-4 చదవండి.

దేవుణ్ణి ప్రేమించే ప్రజలను, ఆయనను సంతోషపర్చే పద్ధతిని నేర్చుకునే ప్రజలను మీరు రాజ్యమందిరంలో కలుస్తారు.—హెబ్రీయులు 10:24, 25 చదవండి. (w11-E 04/01)

ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలోని, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?, 3వ అధ్యాయం చూడండి.