కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోండి

దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోండి

దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోండి

“వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.”—సామె. 14:15.

1, 2. (ఎ) ఏ నిర్ణయం తీసుకున్నా మన ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలి? (బి) మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

 ప్రతీరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటాం. చాలా నిర్ణయాలు మన జీవితంపై పెద్దగా ప్రభావం చూపించవు. కానీ, కొన్ని మాత్రం మన జీవితాన్ని ఎంతగానో మార్చేస్తాయి. మనం తీసుకునే నిర్ణయాలు చిన్నవైనా, పెద్దవైనా వాటితో దేవుణ్ణి ఘనపర్చాలన్నదే మన ముఖ్య ఉద్దేశం.—1 కొరింథీయులు 10:31 చదవండి.

2 మీకు నిర్ణయాలు తీసుకోవడం సులభం అనిపిస్తుందా లేదా కష్టం అనిపిస్తుందా? మనం క్రైస్తవ పరిణతిని సాధించాలంటే తప్పొప్పులను గుర్తించడం నేర్చుకోవాలి. అలాగే ఇతరుల నమ్మకాలను బట్టి కాదుగానీ మన నమ్మకాలను బట్టే నిర్ణయాలు తీసుకోవాలి. (రోమా. 12:1, 2; హెబ్రీ. 5:14) సరైన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకునేందుకు ఇంకా ఏ ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి? కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు చాలా కష్టం? మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోవాలంటే ఏమి చేయాలి?

అసలు మనం నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి?

3. మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు వేటికి చోటివ్వకూడదు?

3 దేవుని ప్రమాణాలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి మనం సంకోచిస్తే మన తోటి విద్యార్థులు, ఉద్యోగస్థులు మన నమ్మకాలపై మనకు పూర్తిగా విశ్వాసం లేదనీ వారు చెప్పినట్లే చేస్తామనీ అనుకోవచ్చు. వారు అబద్ధాలాడడం, మోసగించడం, దొంగిలించడం వంటివి చేసి మనల్ని కూడా తమతో చేతులు కలపమని లేదా తాము చేసిన తప్పులను రహస్యంగా ఉంచమని చెప్పి ‘సమూహమును వెంబడించేలా’ చేయవచ్చు. (నిర్గ. 23:2) అయితే దేవుణ్ణి ఘనపర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం తెలిసిన వ్యక్తి, భయంతో లేదా ఇతరుల మెప్పు పొందాలనే కోరికతో తన బైబిలు శిక్షిత మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పనీ చేయడు.—రోమా. 13:5.

4. మనకు సంబంధించిన నిర్ణయాలు తాము తీసుకోవాలని ఇతరులు ఎందుకు అనుకోవచ్చు?

4 మన కోసం నిర్ణయాలు తీసుకునే ప్రతి ఒక్కరూ మనకు హాని చేయాలని కోరుకోకపోవచ్చు. మన మంచిని కోరే స్నేహితులు తమ సలహాలు పాటించమని మనల్ని బలవంతపెట్టవచ్చు. మనం ఇంటికి దూరంగా నివసిస్తున్నా బంధువులు మన బాగోగుల గురించి ఎంతగానో ఆలోచిస్తారు కాబట్టి, మనకు సంబంధించిన ప్రాముఖ్యమైన నిర్ణయాల విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవచ్చు. ఉదాహరణకు, వైద్య చికిత్సనే తీసుకోండి. రక్తాన్ని దుర్వినియోగం చేయకూడదని బైబిలు స్పష్టంగా చెబుతోంది. (అపొ. 15:28, 29) అయితే, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కొన్ని విషయాల గురించి స్పష్టమైన నియమాలు ఏవీ లేవు. అలాంటప్పుడు, ఫలానా చికిత్సను అంగీకరించాలా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవాలి. a ఈ విషయాల్లో మన బంధుమిత్రులకు బలమైన అభిప్రాయాలు ఉండవచ్చు. అయితే అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక సమర్పిత క్రైస్తవుడు “తన బరువు తానే” భరించాలి. (గల. 6:4, 5) మనుష్యుల ఎదుట కాదుగానీ దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగివుండాలన్నదే మన ముఖ్య ఉద్దేశం.—1 తిమో. 1:5.

5. మన విశ్వాసమనే ఓడ బద్దలవకూడదంటే మనమేమి చేయాలి?

5 మనం నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంటే పెద్దపెద్ద ప్రమాదాలను కొనితెచ్చుకుంటాం. అలాంటి వ్యక్తి, “తన సమస్త మార్గములయందు అస్థిరుడు” అని శిష్యుడైన యాకోబు రాశాడు. (యాకో. 1:7, 8) ఆయన తుఫాను చెలరేగిన సముద్రంలో చుక్కానిలేని పడవలోవున్న వ్యక్తిలా, మారుతున్న మానవ అభిప్రాయాల తాకిడికి అటూఇటూ ఊగిసలాడుతుంటాడు. అతని విశ్వాసమనే ఓడ సులభంగా బద్దలై, ఆ తర్వాత అతడు ఇతరులను నిందించే అవకాశముంది. (1 తిమో. 1:19) మనకు అలా జరగకూడదంటే ఏమి చేయాలి? ‘విశ్వాసంలో స్థిరపరచబడాలి.’ (కొలొస్సయులు 2:6, 7 చదవండి.) దీనికోసం, దేవుని ప్రేరేపిత వాక్యంపట్ల విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. (2 తిమో. 3:14-17) వేటివల్ల మనం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు?

నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు కష్టం?

6. మనం భయపడితే ఏమి చేస్తాం?

6 తప్పుడు నిర్ణయాలు తీసుకుంటామేమో, విఫలమౌతామేమో లేదా మనం తెలివిలేనివారమని ఇతరులు అనుకుంటారేమో అనే భయం వల్ల మనకు నిర్ణయాలు తీసుకోవడం కష్టమనిపించవచ్చు. అలా అనిపించడం సహజమే. కష్టాలను లేదా తలవంపును తీసుకొచ్చే తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోవాలని ఎవరూ కోరుకోరు. దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల ప్రేమ ఉంటే మనం ఆ భయాలను తగ్గించుకోవచ్చు. ఎలా? దేవుని పట్ల మనకు ప్రేమ ఉంటే ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆయన వాక్యాన్ని, బైబిలు ప్రచురణలను పరిశీలిస్తాం. అలాచేస్తే ఎక్కువ పొరపాట్లు జరగవు. ఎందుకంటే బైబిలు, ‘జ్ఞానం లేని వారికి బుద్ధిని, యౌవనులకు తెలివిని వివేచనను’ కలుగజేస్తుంది.—సామె. 1:4.

7. దావీదు రాజు ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

7 మనం ఎల్లప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటామా? లేదు. మనందరం పొరపాట్లు చేస్తూ ఉంటాం. (రోమా. 3:23) ఉదాహరణకు, రాజైన దావీదు జ్ఞానవంతుడు, నమ్మకస్థుడు. కానీ కొన్నిసార్లు ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకొని కష్టాలను కొనితెచ్చుకున్నాడు, ఇతరులను కష్టపెట్టాడు. (2 సమూ. 12:9-12) అంతమాత్రాన, దేవుని అనుగ్రహమున్న నిర్ణయాలు తీసుకోవడం మానుకోలేదు. (1 రాజు. 15:4, 5) మనం గతంలో పొరపాట్లు చేసినా ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అలా చేయాలంటే, యెహోవా మన పాపాల్ని క్షమిస్తాడని దావీదులాగే మనమూ గుర్తుంచుకోవాలి. తనను ప్రేమించి, తనకు లోబడేవారికి దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు.—కీర్త. 51:1-4, 7-10.

8. పెళ్లి గురించి అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

8 నిర్ణయాలు తీసుకునే విషయంలో మన భయాలను మనం ఎలా తగ్గించుకోవచ్చు? కొన్నిసార్లు మన ముందు ఎన్నో సరైన ఎంపికలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. వివాహమనే అంశం గురించి అపొస్తలుడైన పౌలు ఏమి చెప్పాడో ఆలోచించండి. ఆయనిలా రాశాడు: “నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.” (1 కొరిం. 7:8, 9) పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిదని, అయితే అది ఒక్కటే సరైన ఎంపిక కాదని పౌలు చెప్పాడు.

9. మనం తీసుకునే నిర్ణయాల గురించి ఇతరులు ఏమనుకుంటారని మనం చింతించాలా? వివరించండి.

9 మనం తీసుకునే నిర్ణయాల గురించి ఇతరులు ఏమనుకుంటారోనని చింతించాలా? కొంతమేరకు అలా చింతించడం మంచిదే. ఉదాహరణకు, విగ్రహాలకు అర్పించబడ్డాయని మనకు అనిపించిన వాటిని తినడం గురించి పౌలు ఏమి చెప్పాడో గమనించండి. ఆ విషయంలో మనం తీసుకునే నిర్ణయం తప్పు కాకపోయినా, బలహీన మనస్సాక్షి ఉన్న ఇతరులకు అది అభ్యంతరం కలిగించవచ్చని ఆయన గుర్తించాడు. అందుకే, ఆయన ఏమి చేయాలనుకున్నాడు? “భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను” అని ఆయన అన్నాడు. (1 కొరిం. 8:4-13) కాబట్టి, మనం తీసుకునే నిర్ణయం ఇతరుల మనస్సాక్షికి అభ్యంతరం కలిగిస్తుందో లేదో ఆలోచించాలి. మరిముఖ్యంగా యెహోవాతో మనకున్న స్నేహాన్ని అది దెబ్బతీస్తుందో లేదో ఆలోచించాలి. (రోమీయులు 14:1-4 చదవండి.) దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోవాలంటే మనం ఏ బైబిలు సూత్రాలు పాటించాలి?

మంచి నిర్ణయాలు తీసుకునేందుకు ఆరు సలహాలు

10, 11. (ఎ) కుటుంబంలో మనం అహంకారాన్ని చూపించకుండా ఎలా ఉండవచ్చు? (బి) సంఘానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలు ఏమి గుర్తుంచుకోవాలి?

10 అహంకారం చూపించకండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, ‘ఈ నిర్ణయం తీసుకునే అధికారం నాకుందా?’ అని ప్రశ్నించుకోవాలి. సొలొమోను రాజు ఇలా రాశాడు: “అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.”—సామె. 11:2.

11 తల్లిదండ్రులు కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం పిల్లలకు ఇవ్వవచ్చు. అంతమాత్రాన, ఆ అధికారం తమదే అని పిల్లలు అనుకోకూడదు. (కొలొ. 3:20) కుటుంబంలో భార్యలకు, తల్లులకు కొంత అధికారం ఉంటుంది. కానీ వారు తమ భర్తల శిరస్సత్వాన్ని గుర్తించాలి. (సామె. 1:8; 31:10-18; ఎఫె. 5:23) అలాగే భర్తలు తమ అధికారం పరిమితమైనదని, తాము క్రీస్తుకు లోబడివుండాలని మరచిపోకూడదు. (1 కొరిం. 11:3) పెద్దలు సంఘానికి సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, తాము దేవుని వాక్యంలో ‘వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకుండా’ జాగ్రత్తపడతారు. (1 కొరిం. 4:6) అంతేకాక, నమ్మకమైన దాసుని నుండి వచ్చే నిర్దేశాలను ఖచ్చితంగా పాటించేందుకు కృషిచేస్తారు. (మత్త. 24:45-47) కాబట్టి మనం మన పరిమితులను గుర్తించి, మనకు అధికారం ఇవ్వబడినప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే మనకు, ఇతరులకు ఎంతో వేదనను, దుఃఖాన్ని తప్పించినవారమౌతాం.

12. (ఎ) మనం ఎందుకు పరిశోధన చేయాలి? (బి) దాన్నెలా చేయవచ్చు?

12 పరిశోధన చేయండి. సొలొమోను ఇలా రాశాడు: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.” (సామె. 21:5) ఉదాహరణకు, మీరు ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా? అలాగైతే, భావోద్వేగాలకు లోనై నిర్ణయం తీసుకోకండి. ముందు వ్యాపారానికి సంబంధించిన వాస్తవాలన్నీ సేకరించండి, అలాంటి విషయాలు బాగా తెలిసినవారి సలహా అడగండి, దానికి సంబంధించి బైబిల్లో ఏ సూత్రాలు ఉన్నాయో తెలుసుకోండి. (సామె. 20:18) మీ పరిశోధనలో భాగంగా మీరు రెండు లిస్టులను తయారు చేసుకోండి. ఒక లిస్టులో దానివల్ల వచ్చే ప్రయోజనాలను రాసుకోండి, రెండో దాంట్లో నష్టాలు రాసుకోండి. నిర్ణయం తీసుకునే ముందు ‘లెక్క చూసుకోండి.’ (లూకా 14:28) మీ నిర్ణయం వల్ల మీ ఆర్థిక, ఆధ్యాత్మిక పరిస్థితులు ఎలా మారతాయో ఆలోచించండి. నిజమే, పరిశోధన చేయాలంటే కొంత సమయం తీసుకొని, కృషి చేయాల్సి ఉంటుంది. కానీ అలాచేస్తే, ఆ తర్వాత అనవసరమైన ఒత్తిడి కలిగించే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండగలుగుతారు.

13. (ఎ) యాకోబు 1:5లో మనకు ఏ హామీ ఇవ్వబడింది? (బి) జ్ఞానం కోసం ప్రార్థిస్తే మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

13 జ్ఞానం కోసం ప్రార్థించండి. నిర్ణయాలు తీసుకోవడానికి యెహోవా సహాయం కోరితేనే మన నిర్ణయాలతో ఆయనను ఘనపర్చగలుగుతాం. శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.” (యాకో. 1:5) నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు దేవుడు ఇచ్చే జ్ఞానం అవసరమని ఒప్పుకునేందుకు సిగ్గుపడనవసరంలేదు. (సామె. 3:5, 6) ఎంతైనా మన సొంత జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుంటే మనం సులభంగా పక్కదారిపడతాం. దేవుని జ్ఞానం కోసం ప్రార్థిస్తూ ఆయన వాక్యంలోని సూత్రాల కోసం పరిశోధిస్తే, మనకు పరిశుద్ధాత్మ సహాయం దొరుకుతుంది. ఆ సహాయంతో, మనం ఫలానా నిర్ణయం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నామో గుర్తించగలుగుతాం.—హెబ్రీ. 4:12; యాకోబు 1:22-25 చదవండి.

14. మనం నిర్ణయాన్ని ఎందుకు వాయిదావేయకూడదు?

14 నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకునే ముందు పరిశోధన చేసి, జ్ఞానం కోసం ప్రార్థించండి. అంతేకాని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఒక తెలివైన వ్యక్తి “తన నడతలను” పరిశీలించుకోవడానికి సమయం తీసుకుంటాడు. (సామె. 14:15) అలాగని, నిర్ణయాన్ని వాయిదావేయకండి. సాధారణంగా, వాయిదావేసే వ్యక్తి కుంటిసాకులు చెబుతాడు. (సామె. 22:13) అలాంటి వ్యక్తి చివరకు ఒక నిర్ణయమైతే తీసుకుంటాడు. తన జీవితాన్ని నిర్దేశించే అధికారాన్ని ఇతరుల చేతుల్లో పెట్టడమే ఆ నిర్ణయం.

15, 16. నిర్ణయాన్ని అమలుచేయడానికి ఏమి అవసరం?

15 నిర్ణయాన్ని అమలుచేయండి. మనం నిర్ణయాన్ని శ్రద్ధగా అమలుచేయకపోతే, ఆ నిర్ణయం తీసుకునేందుకు పడిన శ్రమంతా వృథా అవుతుంది. “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము” అని సొలొమోను రాశాడు. (ప్రసం. 9:10) అనుకున్న ఫలితాలు రావాలంటే నిర్ణయాన్ని అమలుచేసేందుకు కావాల్సిన వనరులను ఉపయోగించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు, ఒక ప్రచారకుడు పయినీరు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడనుకోండి. ఆయన ఆ సేవ చేయగలడా? ఉద్యోగం, వినోద కార్యక్రమాలు తన శక్తిని, తాను పరిచర్యకు కేటాయించాల్సిన సమయాన్ని హరించకుండా జాగ్రత్తపడితే చేయగలడు.

16 మంచి నిర్ణయాలను అమలుచేయడం అన్నిసార్లూ అంత సులభం కాదు. ఎందుకంటే, “లోకమంతయు దుష్టుని యందున్నది.” (1 యోహా. 5:19) అంతేకాక, మనం “ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను” పోరాడాలి. (ఎఫె. 6:12) దేవుణ్ణి ఘనపర్చాలని నిర్ణయించుకునేవారు పోరాడాల్సి ఉంటుందని అపొస్తలుడైన పౌలు, శిష్యుడైన యూదా చెప్పారు.—1 తిమో. 6:12; యూదా 3.

17. మనం తీసుకునే నిర్ణయాల విషయంలో యెహోవా ఏమి ఆశిస్తున్నాడు?

17 తీసుకున్న నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించుకొని అవసరమైన మార్పులు చేసుకోండి. నిర్ణయాలన్నిటినీ మనం అనుకున్నట్లు అమలుచేయలేం. ‘అదృష్టవశముచేత [“అనూహ్యంగా,” NW] కాలవశము చేత’ మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. (ప్రసం. 9:11) అయినా, సమస్యలు వచ్చినప్పుడు మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు మనం కట్టుబడివుండాలని యెహోవా కోరుతున్నాడు. యెహోవాకు జీవితాన్ని సమర్పించుకోవడం, వివాహ ప్రమాణం చేయడం వంటి నిర్ణయాలను మనం మార్చలేం. అలాంటి నిర్ణయాలకు మనం కట్టుబడివుండాలని దేవుడు ఆశిస్తున్నాడు. (కీర్తన 15:1, 2, 4 చదవండి.) మనం ఎన్నో చిన్నచిన్న నిర్ణయాలు తీసుకుంటుంటాం. తెలివైన వ్యక్తి తాను తీసుకున్న నిర్ణయాలను అప్పుడప్పుడు పరిశీలించుకుంటూ ఉంటాడు. తన నిర్ణయంలో చిన్నచిన్న మార్పులు చేసుకునేందుకు లేదా దాన్ని పూర్తిగా మార్చుకునేందుకు సిద్ధంగా ఉంటాడు. అంతేగానీ అహంకారానికి, మొండితనానికి చోటివ్వడు. (సామె. 16:18) తన జీవన విధానం ద్వారా ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపర్చాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం.

దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఇతరులకు నేర్పించండి

18. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎలా నేర్పించవచ్చు?

18 దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తమ పిల్లలకు నేర్పించడానికి తల్లిదండ్రులు ఎంతో కృషిచేయాలి. మంచి మాదిరి ఉంచడం ద్వారా వారికి చక్కగా బోధించవచ్చు. (లూకా 6:40) సముచితమైనప్పుడు తల్లిదండ్రులు తాము ఒకానొక నిర్ణయం ఎలా తీసుకున్నారో పిల్లలకు వివరించవచ్చు. అంతేకాక, పిల్లలను కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోనిచ్చి, ఆ నిర్ణయాలవల్ల మంచి ఫలితాలొస్తే వారిని మెచ్చుకోవచ్చు. పిల్లవాడు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏమి చేయవచ్చు? అలాంటప్పుడు తల్లిదండ్రులు సాధారణంగా వారిని దాని చెడు పర్యవసానాల నుండి కాపాడడానికి ప్రయత్నిస్తారు కానీ అన్ని సందర్భాల్లో అది వారికి మేలు చేయకపోవచ్చు. ఉదాహరణకు, చాలా రాత్రి అయ్యేవరకు మీ పిల్లవాడు టీవీ చూశాడనుకోండి. పొద్దున ఆలస్యంగా లేస్తాడు. దానివల్ల అతను స్కూల్‌ బస్సును అందుకోలేకపోతాడు. అప్పుడు మీరు అతణ్ణి మీ వాహనంపై స్కూల్‌లో దింపే బదులు వేరే బస్సులో వెళ్లమని చెబితే అతను ఆలస్యంగా స్కూల్‌కు చేరుకోవచ్చు కానీ, భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించడం నేర్చుకుంటాడు.—రోమా. 13:3, 4.

19. మన బైబిలు విద్యార్థులకు ఏమి బోధించాలి? దాని కోసం మనం ఏమి చేయాలి?

19 ఇతరులకు బోధించమని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్త. 28:20) బైబిలు విద్యార్థులు మంచి నిర్ణయాలు తీసుకునేలా వారికి నేర్పించడం బోధకులుగా మనకున్న ఒక ప్రాముఖ్యమైన బాధ్యత. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలంటే, ప్రతీసారి ఏమి చేయాలో వారికి చెప్పకూడదు. వారు సొంత నిర్ణయాలు తీసుకునేందుకు బైబిలు సూత్రాలను ఎలా అన్వయించుకోవచ్చో బోధించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అదీగాక, “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.” (రోమా. 14:12) అందుకే, దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రాముఖ్యం.

[అధస్సూచి]

a ఈ అంశం గురించిన సమాచారం కోసం దేవుని ప్రేమ పుస్తకంలోని 246-249 పేజీల్లోవున్న “రక్తంలోని సూక్ష్మభాగాలు, శస్త్ర చికిత్సా పద్ధతులు” అనే ఆర్టికల్‌ను, మన రాజ్య పరిచర్య, నవంబరు 2006, 3-6 పేజీల్లో ప్రచురించబడిన “రక్తంలోని సూక్ష్మభాగాలను, నా రక్తం ఇమిడివున్న వైద్యవిధానాలను నేనెలా దృష్టిస్తాను?” అనే ఆర్టికల్‌ను చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• మనం నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు నేర్చుకోవాలి?

• మనం భయపడితే ఏమి చేస్తాం? ఆ భయాలను ఎలా తీసేసుకోవచ్చు?

• దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోవాలంటే మనం ఏ ఆరు సలహాలను పాటించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[16వ పేజీలోని బాక్సు/చిత్రం]

మంచి నిర్ణయాలు తీసుకునేందుకు సలహాలు

1 అహంకారం చూపించకండి

2 పరిశోధన చేయండి

3 జ్ఞానం కోసం ప్రార్థించండి

4 నిర్ణయం తీసుకోండి

5 నిర్ణయాన్ని అమలుచేయండి

6 నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించుకొని మార్పులు చేసుకోండి

[15వ పేజీలోని చిత్రం]

ఎటూ తేల్చుకోలేని వ్యక్తి తుఫాను చెలరేగిన సముద్రంలో చుక్కానిలేని పడవలోవున్న వ్యక్తిలాంటివాడు