కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఆత్మ ఫలము” దేవుణ్ణి మహిమపరుస్తుంది

“ఆత్మ ఫలము” దేవుణ్ణి మహిమపరుస్తుంది

“ఆత్మ ఫలము” దేవుణ్ణి మహిమపరుస్తుంది

“మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును.”—యోహా. 15:8.

1, 2. (ఎ) ఇతరులను ప్రోత్సహించడానికి మనకు ఎలాంటి అవకాశాలు దొరుకుతాయి? (బి) యెహోవా సేవను మరింతగా చేయడానికి ఆయనిచ్చిన ఏ వరం మనకు తోడ్పడుతుంది?

 ఈ రెండు సన్నివేశాలను గమనించండి. తనకన్నా వయసులో చిన్నదైన ఒక సహోదరి ఏదో బాధలో ఉన్నట్లు మరో సహోదరి గమనించింది. తర్వాత, ఆమెతో కలిసి పరిచర్య చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఒక ఇంటి నుండి మరో ఇంటికి వెళ్తున్నప్పుడు, ఆమె తనకు బాధ కలిగిస్తున్న విషయం గురించి ఆ సహోదరికి చెప్పుకుంది. ఆ తర్వాత అదే రోజు ఆమె తన ప్రార్థనలో ఆ సహోదరి ప్రేమపూర్వక శ్రద్ధ చూపించినందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించింది. నిజం చెప్పాలంటే, ఆమె అలాంటి ప్రేమపూర్వక శ్రద్ధను ఎంతగానో కోరుకుంది. మరో స్థలంలో, ఓ జంట ఇటీవలే వేరే దేశంలో సువార్త ప్రకటనా పని చేసి తిరిగి వచ్చారు. ఓ పార్టీలో వారు తమ అనుభవాలను ఉత్సాహంగా చెబుతుంటే ఓ యౌవన సహోదరుడు నిశ్శబ్దంగా వింటున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వేరే దేశంలో సువార్త ప్రకటించేందుకు తాను మిషనరీగా వెళ్తున్నప్పుడు ఆ జంటను, మిషనరీ అయ్యేందుకు ప్రోత్సహించిన వారి మాటలను ఆయన గుర్తుచేసుకుంటున్నాడు.

2 పై సన్నివేశాలను చదివినప్పుడు మీ జీవితంలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తులు లేదా మీ వల్ల తమ జీవితాల్లో మార్పులు చేసుకున్న వ్యక్తులు మీకు గుర్తుకువచ్చివుంటారు. అయితే, ఒక్క సంభాషణతో జీవితాలు మారిపోవడం అనేది అరుదు. అయినా ఇతరులను ప్రోత్సహించేందుకు, బలపరిచేందుకు ప్రతీరోజు మనకు ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. మన సహోదర సహోదరీలకు మరింతగా సహాయపడగలిగేలా, దేవుని సేవ మరింత చేయగలిగేలా మన సామర్థ్యాలను, లక్షణాలను పెంచేది ఏదైనా ఉంటే ఎంత బాగుంటుందో కదా? సరిగ్గా అలాంటి దాన్నే యెహోవా మనకు వరంగా ఇస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ. (లూకా 11:13) మన జీవితాల్లో దేవుని ఆత్మ పనిచేస్తే ఆయన సేవను మరింత ఎక్కువగా చేసేందుకు తోడ్పడే చక్కని లక్షణాలను అలవర్చుకోగలుగుతాం. అది ఎంత చక్కని వరం!—గలతీయులు 5:22, 23 చదవండి.

3. (ఎ) మనం ‘ఆత్మ ఫలాన్ని’ అలవర్చుకుంటే యెహోవాను ఎలా మహిమపరుస్తాం? (బి) మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

3 పరిశుద్ధాత్మకు మూలం యెహోవా దేవుడు కాబట్టి, అది ఆయన వ్యక్తిత్వంలోని లక్షణాలను మనలో పెంచుతుంది. (కొలొ. 3:9, 10) దేవుణ్ణి అనుకరించేందుకు కృషిచేయడానికి గల ప్రాముఖ్యమైన కారణాన్ని యేసు తన అపొస్తలులతో మాట్లాడుతున్నప్పుడు సూచించాడు. ఆయనిలా అన్నాడు: “మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును.” a (యోహా. 15:8) మనం ‘ఆత్మ ఫలాన్ని’ అలవర్చుకుంటున్నప్పుడు అది మన మాటల్లో, చేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అలా మనం యెహోవాను మహిమపరుస్తాం. (మత్త. 5:16) ఆత్మ ఫలంలోని లక్షణాలకు, సాతాను ప్రపంచంలోని లక్షణాలకు మధ్య ఎలాంటి తేడాలు ఉన్నాయి? మనం ఆత్మ ఫలాన్ని ఎలా అలవర్చుకోవచ్చు? అలా అలవర్చుకోవడం మనకు ఎందుకు కష్టమనిపించవచ్చు? మనం ఈ ప్రశ్నలను పరిశీలించడంలో భాగంగా, ఆత్మ ఫలంలోని మొదటి మూడు లక్షణాలైన ప్రేమ, సంతోషం, సమాధానం గురించి ఇప్పుడు చర్చిద్దాం.

ఉన్నత ప్రమాణాన్ని బట్టి చూపించే ప్రేమ

4. ఎలాంటి ప్రేమ చూపించాలని యేసు తన అనుచరులకు బోధించాడు?

4 పరిశుద్ధాత్మ వల్ల మనలో కలిగే ప్రేమకూ లోకంలో సర్వసాధారణంగా కనిపించే ప్రేమకూ మధ్య స్పష్టమైన తేడా ఉంది. పరిశుద్ధాత్మ వల్ల మనలో కలిగే ప్రేమ ఉన్నత ప్రమాణంపై ఆధారపడి ఉంటుంది. కొండమీది ప్రసంగంలో యేసు ఆ రెండిటి మధ్యవున్న తేడాను స్పష్టంగా చూపించాడు. (మత్తయి 5:43-48 చదవండి.) పాపులు కూడా అవతలివారు వ్యవహరించినట్లే వ్యవహరిస్తారని యేసు అన్నాడు. అలాంటి ‘ప్రేమలో’ స్వయంత్యాగం కనిపించదు. అది కేవలం మంచి చేసినవారికి తిరిగి మంచి చేయడమే అవుతుంది. మన ‘పరలోక తండ్రికి’ పిల్లలమని నిరూపించుకోవాలంటే మనం వారిలా ఉండకూడదు. ఇతరులు మనతో ప్రవర్తించినట్లే వారితో ప్రవర్తించకుండా వారిని యెహోవా చూసినట్లే చూడాలి, ఆయన వారితో వ్యవహరించినట్లే వ్యవహరించాలి. అయితే, యేసు ఆజ్ఞాపించినట్లుగా మనం శత్రువులను ఎలా ప్రేమించగలుగుతాం?

5. మనల్ని హింసించేవారి పట్ల మనమెలా ప్రేమ చూపించవచ్చు?

5 ఒక బైబిలు ఉదాహరణను గమనించండి. ఫిలిప్పీలో ప్రకటనా పని చేస్తున్నప్పుడు పౌలును, సీలను బంధించి, చితకబాది ఆ తర్వాత లోపలి చెరసాలలో వేశారు. అక్కడ వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. ఆ సమయంలో బహుశా చెరసాల నాయకుడు కూడా వారితో క్రూరంగా వ్యవహరించివుంటాడు. భూకంపం వచ్చి అనుకోకుండా చెరసాల తలుపులు తెరుచుకున్నప్పుడు, ఆ నాయకునిపై పగ తీర్చుకోవడానికి తమకు అవకాశం దొరికిందని వారు అనుకున్నారా? లేదు. వారు నిజమైన శ్రద్ధతో, స్వయంత్యాగపూరిత ప్రేమతో వెంటనే చర్య తీసుకున్నారు. దానివల్ల ఆ నాయకుడూ ఆయన ఇంటివారూ విశ్వాసులయ్యారు. (అపొ. 16:19-34) పౌలు సీలల్లా మన కాలంలో చాలామంది సహోదరులు ‘హింసించేవారిని దీవించే’ విధంగా ప్రవర్తించారు.—రోమా. 12:14.

6. తోటి విశ్వాసులపై మనం ఏయే విధాలుగా స్వయంత్యాగపూరిత ప్రేమను చూపించవచ్చు? (21వ పేజీలోని బాక్సు చూడండి.)

6 తోటి విశ్వాసుల విషయానికొస్తే మనం ఏమి చేయడానికి కూడా వెనకాడకూడదో గమనించండి. “సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.” (1 యోహాను 3:16-18 చదవండి.) అయితే, చిన్నచిన్న విధాలుగా కూడా మనం సహోదరులపై ప్రేమ చూపించవచ్చు. ఉదాహరణకు, మనం మన సహోదరుణ్ణి నొప్పించే విధంగా మాట్లాడినప్పుడు లేదా నొప్పించే పని చేసినప్పుడు ఆయనతో సమాధానపడడానికి చొరవ తీసుకోవడం ద్వారా ప్రేమ చూపించవచ్చు. (మత్త. 5:23, 24) ఒకవేళ మనల్నే ఎవరైనా బాధపెడితే ఏమి చేయవచ్చు? మనం ‘క్షమించడానికి సిద్ధంగా ఉంటామా’ లేదా వారిపై కోపాన్ని మనసులో ఉంచుకుంటామా? (కీర్త. 86:5) పరిశుద్ధాత్మ వల్ల కలిగే ప్రగాఢమైన ప్రేమతో మనం ‘యెహోవా మనల్ని క్షమించినట్లే’ ఇతరులను క్షమిస్తూ వారి చిన్నచిన్న పొరపాట్లను చూసీచూడనట్లు వదిలేస్తాం.—కొలొ. 3:13, 14; 1 పేతు. 4:8.

7, 8. (ఎ) దేవుని పట్ల ప్రేమకూ ఇతరుల పట్ల ప్రేమకూ మధ్య ఎలాంటి సంబంధం ఉంది? (బి) దేవునిపై ప్రేమను ఎలా పెంచుకోవచ్చు? (కింద ఉన్న చిత్రాన్ని చూడండి.)

7 మన సహోదరుల పట్ల స్వయంత్యాగపూరిత ప్రేమను ఎలా అలవర్చుకోవచ్చు? దేవుని పట్ల ప్రేమను పెంచుకుంటే అది సాధ్యమౌతుంది. (ఎఫె. 5:1, 2; 1 యోహా. 4:9-11, 20, 21) బైబిలు చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మనం యెహోవాతో సమయం గడుపుతాం. దానివల్ల మనం ప్రోత్సాహాన్ని పొందుతాం, మన పరలోక తండ్రిపై ప్రేమను పెంచుకుంటాం. అయితే యెహోవాకు దగ్గరవ్వడానికి మనం సమయం కేటాయించాల్సి ఉంటుంది.

8 ఉదాహరణకు బైబిలు చదవడానికి, ధ్యానించడానికి, ప్రార్థన చేయడానికి మీకు ప్రతీరోజు ఒకానొక సమయంలోనే వీలౌతుందనుకుందాం. యెహోవాతో మీరు గడిపే సమయానికి ఏదీ ఆటంకంగా మారకుండా చూసుకునేందుకు గట్టిగా ప్రయత్నించరా? నిజమే, మనం ప్రార్థించడాన్ని ఎవ్వరూ ఆపలేరు. అంతేకాక, మనలో చాలామందిమి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బైబిలు చదవగలుగుతాం. అయినా, యెహోవాతో సమయం గడపలేనంతగా వ్యక్తిగత పనుల్లో మునిగిపోకుండా ఉండడానికి మనం కృషిచేయాలి. ప్రతీరోజు యెహోవాకు దగ్గరవ్వడానికి మీరు సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారా?

‘పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఆనందం’

9. పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఆనందానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి?

9 దేవుని ఆత్మ ఫలానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అదెప్పుడూ స్థిరంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మ ఫలంలోని రెండవ లక్షణమైన సంతోషం గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. సంతోషాన్ని ప్రతికూల వాతావరణంలో కూడా చక్కగా పెరిగే మొక్కతో పోల్చవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది దేవుని సేవకులు ‘పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఆనందంతో గొప్ప ఉపద్రవంలో’ కూడా ‘వాక్యాన్ని అంగీకరించారు.’ (1 థెస్స. 1:6) మరికొంతమంది సహోదరులు ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తున్నారు. అయినా వారు, “ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు” యెహోవా వారికి తన పరిశుద్ధాత్మను ఇచ్చి బలపరుస్తున్నాడు. (కొలొ. 1:9-12) ఇంతకీ ఏ కారణాలను బట్టి మనం ఆనందిస్తాం?

10. ఏ కారణాలను బట్టి మనం ఆనందిస్తాం?

10 సాతాను లోకంలోని ‘ధనం అస్థిరమైనది.’ కానీ యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ధనం శాశ్వతమైనది. (1 తిమో. 6:17; మత్త. 6:19, 20) నిరంతర జీవితాన్ని యెహోవా మన ముందు ఉంచినందుకు, ప్రపంచవ్యాప్త సహోదరత్వంలో భాగంగా ఉండే గొప్ప అవకాశం మనకున్నందుకు మనం ఎంతో ఆనందిస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాతో మనకున్న సంబంధాన్ని బట్టి ఆనందిస్తాం. దావీదు దేశదిమ్మరిగా తిరగాల్సి వచ్చినప్పటికీ యెహోవాను స్తుతించాడు. మనం కూడా ఆయనలాగే స్తుతించాలనుకుంటాం. ఆయనిలా పాడాడు: ‘నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును. కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను.’ (కీర్త. 63:3, 6) అవును, కష్టాలు ఎదురైనా మనం ఆనందంతో యెహోవాను స్తుతించాలని కోరుకుంటాం.

11. మనం ఆనందంగా యెహోవాను సేవించడం ఎందుకు ప్రాముఖ్యం?

11 అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఇలా చెప్పాడు: “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.” (ఫిలి. 4:4) క్రైస్తవులు ఆనందంగా యెహోవాను సేవించడం ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే, సాతాను యెహోవా సర్వాధిపత్యంపై దాడి చేసినప్పుడు మానవులెవ్వరూ ఇష్టపూర్వకంగా యెహోవాను సేవించరని నిందించాడు. (యోబు 1:9-11) ఆనందంతో కాకుండా ఏదో చేయాలి కదా అన్నట్లు యెహోవా సేవచేస్తే మన స్తుతియాగాలు అసంపూర్ణమౌతాయి. కాబట్టి, మనం కీర్తనకర్త ఇచ్చిన ఈ ఉపదేశాన్ని పాటించడానికి ప్రయత్నిస్తాం: “సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.” (కీర్త. 100:2) మనం సంతోషంతో ఇష్టపూర్వకంగా సేవచేస్తే యెహోవాను మహిమపరుస్తాం.

12, 13. ప్రతికూల ఆలోచనలను తీసేసుకోవడానికి మనం ఏమి చేయవచ్చు?

12 కొన్నిసార్లు, సమర్పిత సేవకులు కూడా నిరుత్సాహానికి లోనై సానుకూలంగా ఆలోచించలేకపోతారు. (ఫిలి. 2:25-30) అలాంటి సమయాల్లో మనం ఏమి చేయవచ్చు? ‘ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు ఆత్మ పూర్ణులైయుండుడి’ అని ఎఫెసీయులు 5:18, 19 చెబుతోంది. మనం ఆ సలహాను ఎలా పాటించవచ్చు?

13 ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు మనం యెహోవాకు ప్రార్థించి, ఖ్యాతిగల లేదా స్తుతించదగిన విషయాల గురించి ధ్యానించడానికి ప్రయత్నించవచ్చు. (ఫిలిప్పీయులు 4:6-9 చదవండి.) రాజ్య గీతాల రికార్డింగులను వింటున్నప్పుడు లోగొంతుతో పాడడం వల్ల ఉత్తేజాన్ని పొందవచ్చని, సానుకూలంగా ఆలోచించవచ్చని కొంతమంది గుర్తించారు. ఓ సహోదరుడు తనకు ఎదురైన ఓ కష్టాన్ని బట్టి తరచూ విసుగు చెందేవాడు, నిరుత్సాహపడేవాడు. ఆయన ఇలా గుర్తుచేసుకున్నాడు: “నేను యెహోవాకు మనస్ఫూర్తిగా ప్రార్థించడమేకాక కొన్ని రాజ్య గీతాలను కూడా కంఠస్థం చేశాను. ఆ రమణీయమైన స్తుతి గీతాలను బిగ్గరగా గానీ లోగొంతుతో గానీ పాడుతున్నప్పుడు మనశ్శాంతిని పొందాను. అంతేకాక, ఆ సమయంలోనే యెహోవాకు సన్నిహితమవండి అనే పుస్తకం విడుదలైంది. తర్వాతి సంవత్సరంలో నేను ఆ పుస్తకాన్ని రెండుసార్లు చదివాను. అది ఉపశమనాన్ని ఇచ్చే తైలంలా పనిచేసింది. యెహోవా నా ప్రయత్నాలను ఆశీర్వదించాడని నేను గుర్తించాను.”

‘ఐక్యపరిచే సమాధానమనే బంధం’

14. దేన్ని చూస్తే పరిశుద్ధాత్మ వల్ల కలిగే సమాధానం స్పష్టంగా కనిపిస్తుంది?

14 అంతర్జాతీయ సమావేశాల్లో వేర్వేరు దేశాల నుండి వచ్చినవారు తమ సహోదర సహోదరీలతో సహవాసాన్ని ఆనందిస్తారు. అలాంటి సందర్భాల్లో దేవుని ప్రజలు అనుభవిస్తున్న సమాధానాన్ని సూచించే ప్రపంచవ్యాప్త ఐక్యత స్పష్టంగా కనిపిస్తుంది. శత్రువులుగా ఉండాల్సినవారు, “సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై” ఉండడాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. (ఎఫె. 4:1) అందుకోసం వారు ఎలాంటి మార్పులు చేసుకోవాల్సి వచ్చిందో ఆలోచిస్తే, వారు ఐక్యంగా ఉండడం ఎంత గొప్ప విషయమో అర్థమౌతుంది.

15, 16. (ఎ) పేతురు ఎలాంటి వాతావరణంలో పెరిగాడు? దానివల్ల ఆయనకు ఏ సమస్య ఎదురైంది? (బి) పేతురు తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి యెహోవా ఎలా సహాయం చేశాడు?

15 వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన ప్రజలను ఐక్యపరచడం కష్టమే. ఆ ఐక్యతను తీసుకురావాలంటే ఎలాంటి మార్పులు చేసుకోవాల్సి ఉంటుందో అర్థం చేసుకోవడానికి మనం మొదటి శతాబ్దంలోని అపొస్తలుడైన పేతురు ఉదాహరణను పరిశీలిద్దాం. సున్నతి పొందని అన్యులను తానెలా చూసేవాడో ఆయన మాటల్లోనే తెలుస్తుంది. ఆయనిలా అన్నాడు: “అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడనియైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు.” (అపొ. 10:24-29; 11:1-3) కేవలం తోటి యూదులను మాత్రమే ప్రేమించమని ధర్మశాస్త్రం చెబుతోందనే నమ్మకం ఆ కాలంలోని వారికి ఉండేది. పేతురుకు కూడా చిన్నప్పటినుండి ఆ అభిప్రాయమే ఉండివుంటుంది. అందుకే, అన్యులను శత్రువులుగా ఎంచుతూ వారిని ద్వేషించడం తప్పేమీ కాదని ఆయన అనుకొనివుంటాడు. b

16 తాను కొర్నేలి ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు పేతురు ఎంత ఇబ్బందిపడి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. అన్యుల విషయంలో సదభిప్రాయం లేని వ్యక్తి ‘సమాధానమనే బంధం చేత’ ఎప్పటికైనా వారితో “చక్కగా” కలిసిపోవడం సాధ్యమేనా? (ఎఫె. 4:1, 16) సాధ్యమే. ఎందుకంటే అప్పటికి కొన్ని రోజుల క్రితమే యెహోవా ఆత్మ పేతురు హృదయాన్ని తెరిచింది. దానివల్ల ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకొని, దురభిమానాన్ని తీసేసుకోగలిగాడు. జాతి, తెగ అనే భేదం లేకుండా ప్రజలతో వ్యవహరిస్తానని యెహోవా ఓ దర్శనంలో పేతురుకు స్పష్టం చేశాడు. (అపొ. 10:10-15) అందుకే, “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” అని పేతురు కొర్నేలితో చెప్పగలిగాడు. (అపొ. 10:34, 35) పేతురు మారాడు, ప్రపంచవ్యాప్త ‘సహోదరులతో’ నిజంగా కలిసిపోయాడు.—1 పేతు. 2:17.

17. దేవుని ప్రజల మధ్యవున్న ఐక్యత ఎందుకు ప్రత్యేకమైనది?

17 పేతురు అనుభవాన్ని చూస్తే, నేటి దేవుని ప్రజలు ఎలాంటి గొప్ప మార్పులు చేసుకుంటున్నారో అర్థమౌతుంది. (యెషయా 2:3, 4 చదవండి.) “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు” వచ్చిన లక్షలాదిమంది ప్రజలు, ‘ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తానికి’ అనుగుణంగా తమ ఆలోచనా తీరును మార్చుకున్నారు. (ప్రక. 7:9; రోమా. 12:2) వారిలో చాలామంది సాతాను లోకంలో ఉన్న ద్వేషం, శత్రుత్వం, విభజనలను బట్టి ఒకప్పుడు ప్రభావితులైనవారే. కానీ, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వారు ‘సమాధానాన్ని కలుగజేసే వాటినే ఆసక్తితో అనుసరించడం’ నేర్చుకున్నారు. (రోమా. 14:19) అలాంటి ఐక్యత వల్ల యెహోవా స్తుతించబడతాడు.

18, 19. (ఎ) సంఘంలో సమాధానానికి, ఐక్యతకు ప్రతీ ఒక్కరం ఎలా తోడ్పడవచ్చు? (బి) మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

18 సంఘంలో సమాధానానికి, ఐక్యతకు మనలో ప్రతీ ఒక్కరం ఎలా తోడ్పడవచ్చు? నేడు చాలా సంఘాల్లో ఇతర రాష్ట్రాల నుండి లేదా దేశాల నుండి వచ్చిన సహోదరులు ఉన్నారు. కొంతమంది సంస్కృతి వేరుగా ఉండవచ్చు లేదా వారికి మన భాష సరిగా రాకపోతుండవచ్చు. వారితో మాట్లాడి వారి గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామా? మనం అలా చేయాలని దేవుని వాక్యం చెబుతోంది. యూదులు, అన్యులు ఉన్న రోమా సంఘానికి పౌలు ఇలా చెప్పాడు: “క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి.” (రోమా. 15:7) మీరు పరిచయం పెంచుకోవాల్సిన సహోదర సహోదరీలు ఎవరైనా మీ సంఘంలో ఉన్నారా?

19 పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలంటే మనం ఇంకా ఏమి చేయాలి? ఈ ప్రశ్నకు జవాబు తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం. దానిలో పరిశుద్ధాత్మ ఫలంలోని ఇతర లక్షణాల గురించి చర్చిస్తాం.

[అధస్సూచీలు]

a యేసు ప్రస్తావించిన ఫలంలో ‘ఆత్మ ఫలమే’ కాక క్రైస్తవులు రాజ్యసువార్త ప్రకటించడం ద్వారా యెహోవాకు అర్పించే “జిహ్వాఫలము” కూడా ఉంది.—హెబ్రీ. 13:15.

b “కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను” అని లేవీయకాండము 19:18 చెబుతోంది. ఈ లేఖనంలోని ‘నీ ప్రజలు,’ ‘నీ పొరుగువాడు’ అనే పదాలు కేవలం యూదుల్నే సూచిస్తున్నాయని యూదా మతనాయకులు అనుకునేవారు. ఇశ్రాయేలీయులు అన్యజనుల నుండి వేరుగా ఉండాలని ధర్మశాస్త్రం బోధించింది. కానీ, అన్యులను శత్రువులుగా చూస్తూ వారిని ద్వేషించాలనే మొదటి శతాబ్దంలోని మతనాయకుల అభిప్రాయాన్ని ఇది సమర్థించడం లేదు.

మీరెలా జవాబిస్తారు?

• సహోదరుల పట్ల మనం స్వయంత్యాగపూరిత ప్రేమను ఎలా చూపించవచ్చు?

• మనం సంతోషంగా యెహోవాను సేవించడం ఎందుకు ప్రాముఖ్యం?

• సంఘంలో సమాధానానికి, ఐక్యతకు మనమెలా తోడ్పడవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[21వ పేజీలోని బాక్సు]

“వీరే నిజమైన క్రైస్తవులు”

బిట్వీన్‌ రెసిస్టెన్స్‌ అండ్‌ మార్టర్డమ్‌—జెహోవస్‌ విట్నెసెస్‌ ఇన్‌ ద థర్డ్‌ రైక్‌ అనే పుస్తకం యౌవనస్థుడైన ఒక యూదా ఖైదీ మాటలను ప్రస్తావిస్తోంది. నోయన్‌గామ్మ సామూహిక నిర్బంధ శిబిరంలో మొట్టమొదటిసారిగా యెహోవాసాక్షులను కలిసినప్పుడు జరిగిన సంఘటనల గురించి ఆయన ఇలా అన్నాడు:

“డాకవ్‌ నుండి వచ్చిన యూదులమైన మేము శిబిరంలోకి అడుగుపెట్టగానే, ఇతర యూదులు తమ దగ్గరున్న వాటిని మాతో ఎక్కడ పంచుకోవాల్సి వస్తుందో అని ప్రతీ వస్తువును దాచిపెట్టుకోసాగారు . . . [శిబిరం] బయట ఉన్నప్పుడు మేము ఒకరికొకరం అండగా ఉండేవాళ్లం. కానీ ఇక్కడ చావుబతుకుల మధ్య ప్రతీ ఒక్కరు ఇతరులను మరచిపోయి, ముందు సొంత ప్రాణాల్ని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ, బైబిలు విద్యార్థులు ఏమి చేస్తున్నారో తెలుసా? వారు ఆ సమయంలో నీళ్ల పైపులను మరమ్మత్తు చేస్తూ ఎంతో కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. వాతావరణం ఎంతో చల్లగా ఉన్నా వారు రోజంతా చన్నీళ్లలో నిల్చొని పనిచేస్తున్నారు. వారు ఆ పరిస్థితిని ఎలా భరిస్తున్నారో ఎవ్వరికీ అర్థంకాలేదు. యెహోవా తమకు బలాన్ని ఇస్తున్నాడని వారు చెప్పారు. మాలాగే వారు ఎంతో ఆకలితో ఉన్నారు కాబట్టి తినడానికి వారికి కూడా బ్రెడ్డు ఎంతో అవసరం. కానీ వారు ఏమి చేశారు? తాము అక్కడ తీసుకున్న బ్రెడ్డు అంతా జమ చేసి, తమ కోసం సగం తీసుకొని మిగతా సగాన్ని అప్పుడే డాకవ్‌ నుండి వచ్చిన తోటి విశ్వాసులకు ఇచ్చారు. అలా వచ్చినవారిని ఆహ్వానించి, ముద్దుపెట్టుకున్నారు. వారు తినే ముందు ప్రార్థన చేసుకున్నారు. ఆ తర్వాత అందరు సంతృప్తిగా, సంతోషంగా కనిపించారు. తమకు ఇక ఆకలేయడం లేదని వారన్నారు. వీరే నిజమైన క్రైస్తవులు అని అప్పుడే నాకు అనిపించింది.”

[19వ పేజీలోని చిత్రాలు]

యెహోవాకు దగ్గరవ్వడానికి ప్రతీరోజు సమయాన్ని కేటాయించగలిగేలా అవసరమైన సర్దుబాట్లు చేసుకుంటున్నారా?