కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని చూపించే రుజువులను గుర్తిస్తున్నారా?

దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని చూపించే రుజువులను గుర్తిస్తున్నారా?

దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని చూపించే రుజువులను గుర్తిస్తున్నారా?

ఇశ్రాయేలీయులు గానీ ఐగుప్తీయులు గానీ ముందెన్నడూ అలాంటి దాన్ని చూడలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలై వస్తున్నప్పుడు ఒక మేఘ స్తంభం వారి మీద నిలిచింది. ఆ తర్వాత, అది వారితోపాటే ఉండిపోయింది. రాత్రిపూట అదే అగ్ని స్తంభంగా మారేది. అది వారికి ఎంతటి ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది! ఆ సంఘటన జరిగి ఇప్పటికి దాదాపు 3,500 సంవత్సరాలు గడిచాయి. ఇంతకీ ఆ స్తంభం ఎక్కడ నుండి వచ్చింది? దాని ఉద్దేశం ఏమిటి? ఇశ్రాయేలీయులు ఆ ‘అగ్ని మేఘమయమైన స్తంభాన్ని’ ఎలా ఎంచారు? దాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?—నిర్గ. 14:24.

ఆ మేఘ స్తంభం ఎక్కడ నుండి వచ్చిందో, దాని ఉద్దేశం ఏమిటో తెలియజేస్తూ దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.” (నిర్గ. 13:21, 22) యెహోవా దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుండి విడుదల చేసి తీసుకురావడానికి, అరణ్య మార్గంలో నడిపించడానికి ఆ అగ్ని మేఘమయమైన స్తంభాన్ని ఉపయోగించాడు. దాన్ని వెంబడించాలంటే వారు అన్నివేళలా సిద్ధంగా ఉండాలి. దేవుని ప్రజలను వెంటాడుతున్న ఐగుప్తు సైన్యాలు సరిగ్గా వారిపై దాడి చేయబోయే సమయంలో ఆ స్తంభం ఇరు పక్షాల మధ్య నిలిచి ఇశ్రాయేలీయులను కాపాడింది. (నిర్గ. 14:19, 20) నేరుగా వాగ్దాన దేశానికి నడిపించే మార్గాన్ని ఆ స్తంభం వారికి చూపించలేదు కానీ వారు దాన్ని వెంబడిస్తేనే వాగ్దాన దేశంలోకి ప్రవేశించగలుగుతారు.

యెహోవా తమతో ఉన్నాడని నమ్మేందుకు ఆ స్తంభం ఓ రుజువుగా ఉంది. అది యెహోవాకు ప్రాతినిధ్యం వహించింది. ఆయన కొన్నిసార్లు దానిలో నుండి మాట్లాడాడు. (సంఖ్యా. 14:14; కీర్త. 99:7) అంతేకాక యెహోవా మోషేను తమ నాయకునిగా నియమించాడని ఇశ్రాయేలీయులు ఆ మేఘం ద్వారానే గుర్తించారు. (నిర్గ. 33:9) అలాగే, చివరిసారి మేఘం కనిపించినప్పుడు, యెహోషువను మోషే తర్వాతి నాయకుడిగా యెహోవా నియమించాడనే విషయాన్ని అది నిర్ధారించింది. (ద్వితీ. 31:14, 15) నిజానికి, తమను దేవుడు నడిపిస్తున్నాడని చూపించే రుజువును గుర్తించి, దాని నిర్దేశాన్ని అనుసరిస్తేనే ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించగలుగుతారు.

వారు ఆ రుజువును పట్టించుకోవడం మానేశారు

మొదటిసారి ఆ స్తంభాన్ని చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతో ఆశ్చర్యపోయివుంటారు. అయితే ఆ అద్భుతం ఎప్పుడూ తమ కళ్ల ముందే ఉన్నా, యెహోవాపై తమకున్న నమ్మకాన్ని వారు చివరివరకు నిలబెట్టుకోలేకపోయారు. వారు చాలాసార్లు దేవుని నడిపింపుకు ఎదురుతిరిగారు. ఐగుప్తు సైన్యాలు వెంటాడినప్పుడు, యెహోవా తమను రక్షించలేడని వారనుకున్నారు. పైగా తమను చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చాడని దేవుని సేవకుడైన మోషేను వారు నిందించారు. (నిర్గ. 14:10-12) ఎర్రసముద్రం దాటిన తర్వాత ఆహారం, నీళ్లు లేవనుకుని వారు మోషే అహరోనుల మీదే కాక యెహోవా మీద కూడా సణిగారు. (నిర్గ. 15:22-24; 16:1-3; 17:1-3, 7) ఆ తర్వాత కొన్ని వారాలకు, బంగారు దూడను చేయమని అహరోనును ఒత్తిడి చేశారు. ఒక్కసారి ఊహించండి! ఇశ్రాయేలీయులు పాళెములో ఒకవైపు ఐగుప్తు నుండి తమను విడుదలచేసి బయటకు తీసుకువచ్చిన యెహోవాకు రుజువుగా ఉన్న ఆ మహిమాన్వితమైన అగ్ని మేఘమయమైన స్తంభాన్ని చూస్తున్నా, మరోవైపు దానికి సమీపంలోనే నిర్జీవమైన విగ్రహాన్ని ఆరాధిస్తూ “ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే” అని వారు అన్నారు. ఆ విధంగా వారు దేవుణ్ణి ‘ఎంతో అగౌరవపరిచే పనులు’ చేశారు.—నిర్గ. 32:4; నెహె. 9:18, NW.

ఇశ్రాయేలీయులు యెహోవాకు ఎదురుతిరగడం ద్వారా ఆయన నడిపింపును లెక్కచేయలేదు. కళ్లు కనిపించకపోవడం కాదుగానీ యెహోవా ఎలా నడిపిస్తున్నాడో, ఆ నడిపింపును ఎలా పాటించాలో గ్రహించలేకపోవడమే వారి అసలు సమస్య. వారు స్తంభాన్నైతే చూస్తున్నారు గానీ యెహోవా దానితోనే తమను నడిపిస్తున్నాడని మరచిపోయారు. తమ పనుల ద్వారా వారు “ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము” కలిగించినప్పటికీ, కృపతో ఆయన ఆ స్తంభాన్ని ఉపయోగించి వాగ్దాన దేశం చేరే వరకు వారిని నడిపించాడు.—కీర్త. 78:40-42, 52-54; నెహె. 9:19.

మనల్ని దేవుడు నడిపిస్తున్నాడనేందుకు ఉన్న రుజువును చూడండి

ఆధునిక కాలంలో కూడా స్పష్టమైన నడిపింపును ఇవ్వకుండా యెహోవా తన ప్రజలను విడిచిపెట్టలేదు. తమ దారిని తమనే వెతుక్కోమని ఇశ్రాయేలీయులకు చెప్పనట్లే, నేడు కూడా నూతనలోకానికి దారిని మనల్నే వెతుక్కోమని యెహోవా చెప్పట్లేదు. సంఘాన్ని నడిపించేందుకు ఆయన యేసుక్రీస్తును నియమించాడు. (మత్త. 23:10; ఎఫె. 5:23) ఆత్మాభిషిక్త క్రైస్తవులతో కూడిన నమ్మకమైన దాసుని తరగతికి యేసుక్రీస్తు కొంత అధికారమిచ్చాడు. ఆ దాసుని తరగతి క్రైస్తవ సంఘంలోని పర్యవేక్షకులను నియమిస్తుంది.—మత్త. 24:45-47; తీతు 1:5-9.

ఆ నమ్మకమైన దాసుని లేదా గృహనిర్వాహకుని తరగతిని మనం ఎలా గుర్తించవచ్చు? ఆ దాసుని గురించి యేసు ఇలా వివరించాడు: “తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి, వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.”—లూకా 12:42, 43.

గృహనిర్వాహకుని తరగతివారు యెహోవాను, యేసును, బైబిలు సత్యాలను, దేవుని ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టరు కాబట్టి వారు ‘నమ్మకమైనవారు.’ అంతేగాక వారు ‘బుద్ధిమంతులు’ కాబట్టి అత్యంత ప్రాముఖ్యమైన “రాజ్యసువార్త” ప్రకటనా పనిని, “సమస్త జనులను శిష్యులనుగా” చేసే పనిని మంచి వివేచనతో నిర్దేశిస్తారు. (మత్త. 24:14; 28:19, 20) ఆ గృహనిర్వాహక తరగతి ఆరోగ్యకరమైన, పోషకవిలువలున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని “తగినవేళ” నమ్మకంగా అందిస్తోంది. సత్యారాధకుల సంఖ్య పెరగడం, ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సరైన మార్గనిర్దేశం ఇవ్వడం, బైబిలు సత్యాలను మరింత బాగా గ్రహించడం, శత్రువుల చేతుల్లో నాశనమవకుండా కాపాడబడడం, సంపూర్ణమైన మనశ్శాంతి కలిగివుండడం, ఇలా అన్ని విషయాల్లో యెహోవా ఆశీర్వాదాలను చూస్తే దాసుని తరగతికి ఆయన ఆమోదం ఉందని తెలుస్తుంది.—యెష. 54:17; ఫిలి. 4:7.

దేవుని నడిపింపుకు లోబడండి

దేవుని నడిపింపు పట్ల మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు? అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: ‘మీపై నాయకులుగా ఉన్నవారి మాట విని, వారికి లోబడి ఉండండి.’ (హెబ్రీ. 13:17) అన్ని సందర్భాల్లో వారికి లోబడడం అంత సులభం కాదు. దాన్ని అర్థం చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు మోషే కాలంలోని ఓ ఇశ్రాయేలీయునిగా ఊహించుకోండి. మీరు కొంత దూరం నడిచాక ఆ స్తంభం ఒక చోట ఆగిపోయింది. అది అక్కడే ఎంతసేపు ఉంటుంది? ఒక రోజా? ఒక వారమా? కొన్ని నెలలా? ‘నా వస్తువులన్నిటినీ మూటలోనుండి బయటికి తీస్తే ఎలా ఉంటుంది?’ అని మీరు ఆలోచించవచ్చు. మొదట, మీకు బాగా అవసరమైన వాటిని బయటకు తీస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత, మీ వస్తువులను వెతికీవెతికీ విసుకు పుట్టి అన్నిటినీ బయటకు తీయడం మొదలుపెడతారు. మీరలా అన్నిటిని బయటకు తీయగానే ఆ స్తంభం పైకి ఎత్తబడడం మీకు కనిపిస్తుంది. అప్పుడు వాటన్నిటిని మళ్లీ సర్దుకోవాలి! అలా చేయడం అంత సులభమేమీ కాదు. అయినా అది “పైకెత్తబడగానే” ఇశ్రాయేలీయులు ప్రయాణం మొదలుపెట్టాలి.—సంఖ్యా. 9:17-22.

మనం దేవుని నిర్దేశాన్ని పొందినప్పుడు ఏమి చేస్తాం? వెంటనే దాన్ని పాటిస్తామా? లేదా ఎప్పటిలాగే మనకున్న అలవాటు ప్రకారం నడుచుకుంటామా? గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించడం, వేరే భాష మాట్లాడే ప్రజలకు ప్రకటించడం, క్రమంగా కుటుంబ ఆరాధనలో భాగం వహించడం, ఆసుపత్రి అనుసంధాన కమిటీలకు సహకరించడం, సమావేశాల్లో మంచిగా ప్రవర్తించడం వంటి విషయాల్లో తాజా నిర్దేశాలేమిటో మనకు బాగా తెలుసా? ఉపదేశాన్ని అంగీకరించడం ద్వారా కూడా దేవుని నడిపింపు పట్ల కృతజ్ఞతను చూపిస్తాం. ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మన సొంత జ్ఞానం మీద కాదుగానీ యెహోవా మీద, ఆయన సంస్థ మీద ఆధారపడతాం. తుఫాను చెలరేగినప్పుడు ఒక పిల్లవాడు తల్లిదండ్రుల సంరక్షణ కోరినట్లే, ఈ లోకంలోని సమస్యలు పెనుతుఫానులా వచ్చినప్పుడు మనం యెహోవా సంస్థను ఆశ్రయిస్తాం.

దేవుని సంస్థలోని భూసంబంధమైన భాగంలో నాయకత్వం వహించేవారు కూడా మోషేలా అపరిపూర్ణులే. అయితే అప్పట్లో, మోషేను దేవుడే నియమించాడనడానికి, దేవుని ఆమోదం ఆయనకు ఉందనడానికి ఆ స్తంభం వారి కళ్ల ముందే ఒక రుజువుగా ఉండేది. అంతేగాక, ఎప్పుడు బయలుదేరాలనేది ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరు తనకు తానుగా నిర్ణయించుకోకూడదని గమనించండి. వారు “మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి” నడక ప్రారంభించేవారు. (సంఖ్యా. 9:23) కాబట్టి, బయలుదేరమనే సంకేతాన్ని దేవుని ప్రతినిధియైన మోషే ఇచ్చి ఉండవచ్చు.

నేడు కూడా, మనం చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు యెహోవా దేవుని గృహనిర్వాహక తరగతి స్పష్టమైన సంకేతాన్నిస్తోంది. ఎలా? కావలికోటలోని, మన రాజ్య పరిచర్యలోని ఆర్టికల్స్‌ ద్వారా, కొత్త ప్రచురణల ద్వారా, సమావేశాల్లో ఇవ్వబడే ప్రసంగాల ద్వారా సంకేతాన్నిస్తోంది. అంతేకాక ఉత్తరాల ద్వారా, సంఘ బాధ్యతలు గల సహోదరులు హాజరయ్యే శిక్షణా తరగతుల ద్వారా, ప్రయాణ పర్యవేక్షకుల ద్వారా కూడా సంఘాలకు నిర్దేశాలను ఇస్తోంది.

దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని చూపించే రుజువులను మీరు స్పష్టంగా గుర్తిస్తున్నారా? యెహోవా దేవుడు ఈ చివరి రోజుల్లో సాతాను లోకమనే ‘అరణ్యం’ గుండా తన ప్రజలమైన మనల్ని తన సంస్థ ద్వారానే నడిపిస్తున్నాడు. అందువల్లే మనం ఐక్యతను, ప్రేమను, భద్రతను కలిగివుండగలుగుతున్నాం.

ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత, యెహోషువ వారితో ఇలా అన్నాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నియు మీకు కలిగెను.” (యెహో. 23:14) అలాగే, నేటి దేవుని ప్రజలు కూడా ఆయన వాగ్దానం చేసిన నూతన లోకంలోకి తప్పకుండా ప్రవేశిస్తారు. కానీ మనలో ప్రతి ఒక్కరం అక్కడ ఉంటామా లేదా అనేది దేవుని నిర్దేశాన్ని మనం వినయంతో, హృదయపూర్వకంగా పాటిస్తున్నామా లేదా అనేదాని మీదే ఆధారపడివుంటుంది. కాబట్టి, యెహోవా మనల్ని నడిపిస్తున్నాడని చూపించే రుజువులను మనందరం గుర్తిస్తూ ఉందాం.

[5వ పేజీలోని చిత్రాలు]

నేడు యెహోవా సంస్థ మనల్ని నడిపిస్తోంది

సమావేశాల్లో విడుదలయ్యేవి

దైవపరిపాలన శిక్షణా కార్యక్రమాలు

క్షేత్రసేవ కూటాల్లో శిక్షణ