కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరదైసులో నిరంతరం జీవించడం విసుగు పుట్టించదా?

పరదైసులో నిరంతరం జీవించడం విసుగు పుట్టించదా?

మా పాఠకుల ప్రశ్న

పరదైసులో నిరంతరం జీవించడం విసుగు పుట్టించదా?

▪ పరదైసులో నిరంతరం జీవించివుండే అవకాశం గురించి బైబిలు తెలియజేస్తుంది. (కీర్తన 37:29; లూకా 23:43) ఎలాంటి లోపంలేని పరిస్థితుల్లో నిరంతరం జీవించడం విసుగు పుట్టించదా?

అది మంచి ప్రశ్నే. ఎంతోకాలంగా విసిగిపోయిన వ్యక్తి ఆందోళనకు, కృంగుదలకు గురై, ప్రమాదకరమైన పనులు చేయడానికి మొగ్గుచూపే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. జీవితానికి ఎలాంటి సంకల్పం లేదనుకునేవాళ్లకు లేదా రోజువారీ పనుల్లో విసిగిపోయిన వాళ్లకు అలా జరిగే అవకాశముంది. పరదైసులో ప్రజలు ఎలాంటి సంకల్పం లేకుండా జీవిస్తారా? రోజువారీ పనులు ఆసక్తికరంగా ఉండవా?

మొదటిగా, బైబిలు గ్రంథకర్త అయిన యెహోవా దేవుడే మనకు నిరంతర జీవితం ఇవ్వాలనుకుంటున్నాడనే విషయం గమనించండి. (యోహాను 3:16; 2 తిమోతి 3:16, 17) ఆయన ముఖ్య లక్షణం ప్రేమే. (1 యోహాను 4:8) యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మనం ఇప్పుడు అనుభవించే మంచి వాటన్నిటినీ ఆయనే మనకిచ్చాడు.—యాకోబు 1:17.

మనం సంతోషంగా ఉండాలంటే అర్థవంతమైన పని అవసరమని మన సృష్టికర్తకు తెలుసు. (కీర్తన 139:14-16; ప్రసంగి 3:12, 13) పరదైసులో మనం రోబోల్లా ఉండం. మనం చేసే పనివల్ల మనమూ మనం ప్రేమించేవాళ్లూ ప్రయోజనం పొందుతారు. (యెషయా 65:22-24) రోజంతా ఆసక్తితో, శ్రద్ధగా చేయాల్సిన పనివుంటే జీవితం మీద మీకు విసుగుపుడుతుందా?

పరదైసులో జీవించడానికి యెహోవా ఎవర్ని పడితే వాళ్లను అనుమతించడనే విషయాన్ని కూడా గమనించండి. తన కుమారుడైన యేసు అడుగుజాడల్లో నడిచేవాళ్లకే ఆయన నిరంతర జీవితమనే బహుమానం ఇస్తాడు. (యోహాను 17:3) యేసు భూమ్మీదున్నప్పుడు, తన తండ్రి చెప్పింది ఆనందంగా చేశాడు. తీసుకోవడంకన్నా ఇవ్వడం వల్ల వచ్చే సంతోషం ఎక్కువకాలం ఉంటుందని యేసు తన మాటల ద్వారా, జీవన విధానం ద్వారా తన అనుచరులకు నేర్పించాడు. (అపొస్తలుల కార్యములు 20:35) భూమి తిరిగి పరదైసుగా మారినప్పుడు ప్రతీ ఒక్కరు ముఖ్యమైన రెండు ఆజ్ఞల ప్రకారం జీవిస్తారు అంటే దేవుణ్ణి, పొరుగువాళ్లను ప్రేమిస్తారు. (మత్తయి 22:36-40) మిమ్మల్ని, తమ పనిని ప్రేమించే నిస్వార్థమైన ప్రజల మధ్య జీవించడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి! అలాంటి వాళ్ల మధ్య జీవించడం విసుగుపుట్టిస్తుందా?

పరదైసులో జీవితం ఇంకా ఎలా ఉంటుంది? ప్రతీరోజు మన సృష్టికర్త గురించి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉంటాం. యెహోవా సృష్టి గురించి పరిశోధకులు ఇప్పటికే ఆశ్చర్యంగొలిపే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. (రోమీయులు 1:20) అయితే, ఇంతవరకు యెహోవా సృష్టిలో మనం తెలుసుకున్నది చాలాచాలా తక్కువ. వేల సంవత్సరాల క్రితం, దేవుని సృష్టి గురించి నమ్మకస్థుడైన యోబు ఏ ముగింపుకు వచ్చాడో మనమూ అదే ముగింపుకు రావచ్చు. ఆయన ఇలా అన్నాడు: “ఇవి [దేవుని] కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?”—యోబు 26:14.

మనం ఎంతకాలం జీవించినా యెహోవా దేవుని గురించి, ఆయన పనుల గురించి పూర్తిగా తెలుసుకోలేం. నిరంతరం జీవించాలనే కోరికను దేవుడు మన హృదయాల్లో పెట్టాడని బైబిలు చెబుతోంది. కానీ, ‘దేవుడు చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది చాలదు’ అని కూడా చెబుతోంది. (ప్రసంగి 3:10, 11) మీ సృష్టికర్త గురించి కొత్త విషయాలు తెలుసుకోవడం ఎప్పటికైనా విసుగుపుట్టిస్తుందని మీకనిపిస్తుందా?

ఇప్పుడు కూడా, ఇతరులకు ప్రయోజనాన్ని, దేవునికి మహిమను తీసుకొచ్చే పనుల్లో నిమగ్నమైనవాళ్లు ఎక్కువగా విసుగుచెందరు. మనం అలాంటి పనులు చేయడంలో నిమగ్నమైతే, నిరంతర జీవితం కూడా విసుగు పుట్టించదనే నమ్మకంతో ఉండవచ్చు. (w11-E 05/01)

[22వ పేజీలోని చిత్రసౌజన్యం]

భూమి: Image Science and Analysis Laboratory, NASA-Johnson Space Center; నక్షత్రవీధి: The Hubble Heritage Team (AURA/STScI/NASA)