కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అందరికీ అవసరమైన సువార్త!

అందరికీ అవసరమైన సువార్త!

అందరికీ అవసరమైన సువార్త!

‘సువార్త, రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తియై యున్నది.’—రోమా. 1:16.

1, 2. మీరు “రాజ్య సువార్త” ఎందుకు ప్రకటిస్తారు? ఏ విషయాలను నొక్కిచెబుతారు?

 ‘ప్రతీరోజు సువార్త ప్రకటించడమంటే నాకు ఎంతో ఇష్టం’ అని మీరు ఏదోక సమయంలో అనుకునేవుంటారు. “ఈ రాజ్య సువార్త” ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో యెహోవా సమర్పిత సేవకులైన మీకు తెలుసు. ప్రకటించడం గురించి యేసు చెప్పిన ప్రవచనాన్ని మీరు కంఠస్థం చేసేవుంటారు.—మత్త. 24:14.

2 మీరు “రాజ్యసువార్తను” ప్రకటించడం ద్వారా యేసు మొదలుపెట్టిన పనిని కొనసాగిస్తున్నారు. (లూకా 4:43 చదవండి.) త్వరలోనే దేవుడు మానవుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడనే విషయాన్ని సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు నిస్సందేహంగా నొక్కిచెబుతారు. ఎందుకంటే, ‘మహాశ్రమలతో’ అబద్ధమతాన్ని నాశనం చేసి భూమ్మీదున్న దుష్టత్వాన్నంతటినీ దేవుడు నిర్మూలిస్తాడు. (మత్త. 24:20, 21) దేవుని రాజ్యం పరదైసును మళ్లీ స్థాపించి భూమ్మీద శాంతి సంతోషాలు విలసిల్లేలా చేస్తుందని కూడా బహుశా మీరు ప్రకటిస్తారు. నిజానికి, ఈ “రాజ్య సువార్త,” “నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు” అని అబ్రాహాముకు దేవుడు ప్రకటించిన సువార్తలో భాగమే.—గల. 3:8.

3. రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు సువార్తను నొక్కిచెప్పాడని మనకెలా తెలుసు?

3 ప్రజలకు అవసరమైన సువార్తలోని ప్రాముఖ్యమైన అంశం గురించి బహుశా మనం ప్రకటించడం లేదేమో? అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ‘రాజ్యము’ అనే పదాన్ని ఒక్కసారే వాడాడు కానీ, “సువార్త” అనే పదాన్ని 12 సార్లు ఉపయోగించాడు. (రోమీయులు 14:17 చదవండి.) ఆ పత్రికలో, సువార్తలోని ఏ అంశం గురించి ఆయన అన్నిసార్లు సూచించాడు? ఆ అంశం ఎందుకు ప్రాముఖ్యమైనది? మన క్షేత్రంలోని ప్రజలకు “దేవుని సువార్తను” ప్రకటిస్తున్నప్పుడు మనం ఆ అంశాన్ని ఎందుకు గుర్తుంచుకోవాలి?—మార్కు 1:14; రోమా. 15:15, 16; 1 థెస్స. 2:2.

రోమాలోని ప్రజలకు ఏమి అవసరమైంది?

4. రోమాలో మొదటిసారి బందీగా ఉన్నప్పుడు పౌలు ఏమి ప్రకటించాడు?

4 రోమాలో మొదటిసారి బంధీగా ఉన్నప్పుడు పౌలు ప్రస్తావించిన అంశాల గురించి ఆలోచిస్తే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఎంతోమంది యూదులు తనను చూడడానికి వచ్చినప్పుడు ఆయన, (1) దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చాడు, (2) యేసు గురించి ఒప్పిస్తూ బోధించాడు. దాని ఫలితమేమిటి? “అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి.” ఆ తర్వాత పౌలు ‘తనయొద్దకు వచ్చువారినందరిని సన్మానించి (1) దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు, (2) ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను.’ (అపొ. 28:17, 23-31) దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి పౌలు ప్రాముఖ్యతను ఇచ్చాడని స్పష్టంగా తెలుస్తోంది. కానీ, ఆయన ఇంకా దేని గురించి కూడా నొక్కిచెప్పాడు? రాజ్యానికి కేంద్రంగా ఉన్న విషయాన్ని అంటే, దేవుని సంకల్పంలో యేసు పాత్ర గురించి కూడా నొక్కిచెప్పాడు.

5. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఏ నిజమైన అవసరం గురించి నొక్కిచెప్పాడు?

5 ప్రజలందరూ యేసు గురించి తెలుసుకొని ఆయనపై విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఆ విషయం గురించి ప్రస్తావించాడు. పత్రిక ప్రారంభంలో, ‘ఆయన కుమారుని సువార్త విషయమై తన ఆత్మయందు సేవించుచున్న దేవుని’ గురించి పౌలు రాశాడు. ఆ తర్వాత ఇంకా ఇలా అన్నాడు: “సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి . . . రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.” ఆ తర్వాత, ఆయన ప్రకటించిన ‘సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనుష్యుల రహస్యములను విమర్శించు దినం’ గురించి ప్రస్తావించాడు. “యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను” అని కూడా అన్నాడు. a (రోమా. 1: 9, 16; 2:16; 15:18, 19) పౌలు రోమీయులకు యేసుక్రీస్తు గురించి ఎందుకు నొక్కిచెప్పాడు?

6, 7. రోమాలోని సంఘం స్థాపించబడిన తీరు గురించి, ఆ సంఘంలోని సహోదర సహోదరీల గురించి ఏమి చెప్పవచ్చు?

6 రోమాలోని సంఘం ఎలా స్థాపించబడిందో మనకు తెలియదు. సా.శ. 33 పెంతెకొస్తు పండుగకు హాజరైన యూదులు లేదా యూదా మతప్రవిష్టులు క్రైస్తవులుగా మారి రోమాకు తిరిగి వెళ్లారా? (అపొ. 2:10) లేక క్రైస్తవ వర్తకులు, ప్రయాణికులు రోమాలో సత్యాన్ని వ్యాప్తి చేశారా? విషయమేదైనా, దాదాపు సా.శ. 56లో పౌలు రోమీయులకు పత్రిక రాసే సమయానికి అక్కడ సంఘం స్థాపించబడి ఎంతో కాలమైంది. (రోమా. 1:8) ఆ సంఘంలో ఎవరెవరు ఉండేవారు?

7 కొంతమంది యూదులు క్రైస్తవులుగా మారారు. తోటి యూదులూ, బహుశా తన బంధువులూ అనే ఉద్దేశంతో అంద్రొనీకు యూనీయలను “నాకు బంధువులు” అని ప్రస్తావించాడు. రోమాలో డేరాలు కుట్టే అకుల, ఆయన భార్య ప్రిస్కిల్ల కూడా యూదులే. (రోమా. 4:1; 9:3, 4; 16:3, 7; అపొ. 18:2) పౌలు తన వందనాలను తెలిపిన సహోదర సహోదరీల్లో చాలామంది బహుశా అంతకుముందు అన్యులే. కొంతమంది ‘కైసరు ఇంటివారు’ అంటే కైసరుకు బానిసలు లేదా కైసరు కింద పనిచేసే చిన్న ఉద్యోగులు అయ్యుండవచ్చు.—ఫిలి. 4:22; రోమా. 1:1-7; 11:13.

8. రోమాలోని క్రైస్తవులందరూ ఏ దీనావస్థలో ఉన్నారు?

8 రోమాలోని క్రైస్తవులందరూ దీనావస్థలో ఉన్నారు. నేడు మన పరిస్థితి కూడా అదే. దాని గురించి పౌలు ఇలా రాశాడు: “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (రోమా. 3:23) దీన్నిబట్టి, పౌలు రాసిన పత్రికను చదివే వారంతా తాము పాపులమని, పాపం నుండి విముక్తి పొందడానికి దేవుడు చేసిన ఏర్పాటుపై విశ్వాసం ఉంచాలని గుర్తించాలి.

ప్రజలు తాము పాపులమని గుర్తించాలి

9. సువార్త వల్ల వచ్చే ఏ గొప్ప ప్రయోజనం గురించి పౌలు మాట్లాడాడు?

9 తాను పదేపదే ప్రస్తావించిన సువార్త వల్ల వచ్చే గొప్ప ప్రయోజనాన్ని పౌలు రోమీయులకు రాసిన పత్రిక ఆరంభంలో సూచించాడు. అక్కడిలా ఉంది: “సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.” అవును, రక్షణ సాధ్యమే. కానీ, హబక్కూకు 2:4లో ఉన్న అద్భుతమైన సత్యానికి అనుగుణంగా విశ్వాసం చూపించాలి. ఆ లేఖనంలో ఇలా ఉంది: “నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.” (రోమా. 1:16, 17; గల. 3:11; హెబ్రీ. 10:38) రక్షణనిచ్చే ఆ సువార్తకు, ‘అందరూ పాపం చేశారు’ అనే వాస్తవానికి మధ్య సంబంధం ఏమిటి?

10, 11. రోమీయులు 3:23లో ప్రస్తావించబడిన అంశం కొంతమందికి ఎందుకు వింతగా ఉండదు? మరికొంతమందికి ఎందుకు వింతగా ఉంటుంది?

10 ప్రాణాల్ని కాపాడే విశ్వాసాన్ని పెంపొందించుకునే ముందు ఒక వ్యక్తి తాను పాపినని గుర్తించాలి. దేవునిపై నమ్మకమూ బైబిలు లేఖనాలతో పరిచయమూ ఉన్న కుటుంబంలో పెరిగిన వారికి ఆ విషయం అంత వింతగా కనిపించదు. (ప్రసంగి 7:20 చదవండి.) ‘అందరూ పాపం చేశారు’ అనే పౌలు మాటలను వారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన మాటల ఉద్దేశం ఏమిటనే దాని గురించి వారికి కొంత అవగాహన ఉంది. (రోమా. 3:23) అయితే, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోని ఎంతోమందిని మనం పరిచర్యలో కలుస్తాం.

11 కొన్నిదేశాల్లో, సాధారణంగా ప్రజలకు తాము పుట్టుకతోనే పాపులమనే లేదా పాపాన్ని వారసత్వంగా పొందామనే ఆలోచనే వింతగా ఉండవచ్చు. అయినా, తాము తప్పులు చేస్తామనీ ఇతరులు ఇష్టపడని కొన్ని లక్షణాలు తమలో ఉన్నాయనీ తాము కొన్ని చెడ్డ పనులు చేసివుంటామనీ బహుశా వారు గుర్తిస్తారు. అంతేకాక, ఇతరులు కూడా తమలాంటి పరిస్థితిలోనే ఉన్నారని వారు గమనిస్తారు. కానీ, తాము పెరిగిన విధానం వల్ల తామూ ఇతరులూ ఎందుకు అలాంటి స్థితిలో ఉన్నారో గుర్తించరు. నిజానికి కొన్ని భాషల్లో, ఒక వ్యక్తిని పాపి అంటే అతడు ఏదో నేరం చేశాడనో నియమాలను ఉల్లంఘించాడనో ప్రజలు అనుకోవచ్చు. అలాంటి వాతావరణంలో పెరిగిన ఒక వ్యక్తి పౌలు చెప్పిన భావంలో తనను తాను పాపిగా దృష్టించుకోడు.

12. మానవులందరూ పాపులనే విషయాన్ని చాలామంది ఎందుకు నమ్మరు?

12 మానవులు పాపులనే విషయాన్ని క్రైస్తవ దేశాలని పిలవబడుతున్న వాటిలో ఉండే చాలామంది నమ్మరు. ఎందుకు? ఎందుకంటే, అప్పుడప్పుడు చర్చికి వెళ్తున్నా ఆదాముహవ్వల గురించిన వృత్తాంతాన్ని వారు కల్పిత కథగానే చూస్తారు. కొంతమందేమో దేవుడు లేడనే నమ్మకంతో పెరుగుతారు. అందుకే, సర్వోన్నతుడు మానవులకు నైతిక నియమాలను విధించాడనీ వాటిని ఉల్లంఘిస్తే పాపం చేసినట్లేననీ వారికి అర్థంకాదు. ఒక విధంగా చెప్పాలంటే వారు మొదటి శతాబ్దంలోని ప్రజల్లాగే ఉన్నారు. వారు ‘నిరీక్షణలేనివారని, లోకమందు దేవుడులేనివారని’ పౌలు అన్నాడు.—ఎఫె. 2:12.

13, 14. (ఎ) దేవునిపై నమ్మకం లేని, తాము పాపులమని నమ్మని వారు క్షమార్హులుకారు అని చెప్పేందుకున్న ఒక కారణం ఏమిటి? (బి) దేవునిపై నమ్మకం లేనందువల్ల చాలామంది ఏమి చేస్తున్నారు?

13 అలాంటి నేపథ్యాన్ని సాకుగా చూపించడం సరైనది కాదని చెబుతూ రోమీయులకు రాసిన పత్రికలో పౌలు రెండు కారణాలను ప్రస్తావించాడు. ఆ కారణాలు ఇప్పటికీ వర్తిస్తాయి. మొదటిది, సృష్టికర్త ఉన్నాడని సృష్టే స్వయంగా నిరూపిస్తోంది. (రోమీయులు 1:19, 20 చదవండి.) ఈ విషయం, పౌలు రోమాలో ఉండి హెబ్రీయులకు రాసిన పత్రికలో పేర్కొన్న విషయానికి అనుగుణంగా ఉంది. ఆయనిలా రాశాడు: “ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.” (హెబ్రీ. 3:3, 4) ఆ వాదన, విశ్వం అంతటినీ కట్టిన లేదా సృష్టించిన సృష్టికర్త ఉన్నాడనే విషయాన్ని బలపరుస్తోంది.

14 ప్రాణంలేని విగ్రహాలను ఆరాధించేవారు ఇశ్రాయేలీయులైనా, మరెవరైనా సరే వారు క్షమార్హులుకారు అని పౌలు బలమైన కారణంతోనే రాశాడు. తమ స్వాభావిక ధర్మములను విడిచి లైంగిక దుర్నీతికి పాల్పడిన స్త్రీపురుషుల విషయం కూడా అంతే. (రోమా. 1:22-27) “యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని” పౌలు సరిగ్గానే రాశాడు.—రోమా. 3:9.

ఒక ‘సాక్షి’

15. ఎవరికి మనస్సాక్షి ఉంది? దానివల్ల వారేమి చేస్తున్నారు?

15 తాము పాపులమనీ పాపం నుండి విముక్తి పొందాలనీ ప్రజలు ఎందుకు గ్రహించాలో తెలిపే రెండవ కారణం రోమీయుల పత్రికలో ఉంది. ప్రాచీన ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం గురించి పౌలు ఇలా రాశాడు: “ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.” (రోమా. 2:11, 12) తన వాదనను కొనసాగిస్తూ, దైవిక నియమాలు తెలియని అన్యులు లేదా ఇతర మతస్థులు తరచూ “స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను” చేస్తారని పౌలు అన్నాడు. నరహత్యను, దొంగతనాన్ని, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు లైంగిక సంబంధాలు పెట్టుకోవడాన్ని సాధారణంగా వారు ఎందుకు తిరస్కరిస్తారు? వారికి మనస్సాక్షి ఉంది కాబట్టే అలాంటివాటిని తిరస్కరిస్తారని పౌలు చెప్పాడు.—రోమీయులు 2:14, 15 చదవండి.

16. మనస్సాక్షి ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి పాపం చేయకుండా ఉంటాడని మనం ఎందుకు చెప్పలేము?

16 మనస్సాక్షి ఉన్నంతమాత్రాన ప్రజలు అది చెప్పినట్లే చేస్తారని ఖచ్చితంగా చెప్పలేమని మనకు తెలుసు. ప్రాచీన ఇశ్రాయేలీయుల విషయాన్ని పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమౌతుంది. వారికి దేవుడిచ్చిన మనస్సాక్షితో పాటు దొంగతనం, వ్యభిచారం వంటి విషయాల్లో ఆయనిచ్చిన స్పష్టమైన నియమాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ తరచూ తమ మనస్సాక్షికి, యెహోవా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. (రోమా. 2:21-23) వారు రెండు విధాలా అపరాధులయ్యారు, దేవుని ప్రమాణాలకు సరితూగలేదు, ఆయన చిత్తాన్ని చేయలేదు. అలా వారు పాపులైనందువల్ల తమ సృష్టికర్తతో వారికున్న సంబంధం ఘోరంగా దెబ్బతింది.—లేవీ. 19:11; 20:10; రోమా. 3:20.

17. రోమీయుల పుస్తకంలో మనకు ఏ ప్రోత్సాహం దొరుకుతుంది?

17 ఇప్పటిదాకా మనం రోమీయుల పత్రికలో పరిశీలించిన విషయాలు సర్వోన్నతుని ముందు మానవులందరి దీనావస్థను చిత్రీకరిస్తున్నట్లుగా కనిపించవచ్చు. కానీ, పౌలు అంతటితో ఆపలేదు. కీర్తన 32:1, 2లోని దావీదు మాటలను ఎత్తిచెబుతూ పౌలు ఇలా రాశాడు: “తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు [యెహోవా] చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు.” (రోమా. 4:7, 8) అవును, న్యాయపరంగా పాపాలను క్షమించడానికి కావాల్సిన ఏర్పాటును దేవుడు చేశాడు.

యేసుపై కేంద్రీకరించబడిన సువార్త

18, 19. (ఎ) రోమీయులకు రాసిన పత్రికలో పౌలు సువార్తలోని ఏ అంశం గురించి ముఖ్యంగా ప్రస్తావించాడు? (బి) రాజ్యాశీర్వాదాలను పొందాలంటే మనం ఏమి గుర్తించాలి?

18 “పాప క్షమాపణ కోసం దేవుడు చేసిన ఏర్పాటు నిజంగా సువార్తే!” అని మీకు అనిపించవచ్చు. అది నిజం కూడా. అయితే ఇది, పౌలు రోమీయుల పుస్తకంలో నొక్కిచెప్పిన సువార్తలోని అంశం గురించి మరోసారి ఆలోచించేలా చేస్తుంది. ముందే ప్రస్తావించబడినట్లు పౌలు ఇలా రాశాడు: “సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. . . . రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.”—రోమా. 1:15, 16.

19 ఆ సువార్త దేవుని సంకల్పంలో యేసు పాత్రపైనే కేంద్రీకరించబడింది. “సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా” దేవుడు “మనుష్యుల రహస్యములను విమర్శించు దినం” కోసం పౌలు ఎదురుచూశాడు. (రోమా. 2:16) అలా చెప్పడం ద్వారా, “క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యము” గురించి లేదా రాజ్యం ద్వారా దేవుడు చేయబోయే దాని గురించి పౌలు తక్కువ చేసి మాట్లాడలేదు. (ఎఫె. 5:5) కానీ, దేవుని రాజ్యంలో జీవించి ఆశీర్వాదాలను పొందాలంటే మనం, (1) దేవుని ముందు మనం పాపులమనే, (2) మన పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తుపై విశ్వాసముంచడం ప్రాముఖ్యమనే విషయాన్ని గుర్తించాలని పౌలు చెప్పాడు. దేవుని సంకల్పంలోని ఆ అంశాలను అర్థం చేసుకొని వాటిని అంగీకరించి, దానివల్ల కలిగే నిరీక్షణను గుర్తించిన వారందరూ, “అవును అది నిజంగా సువార్తే!” అని తప్పక అనుకుంటారు.

20, 21. మనం పరిచర్య చేస్తున్నప్పుడు రోమీయులకు పౌలు రాసిన పత్రికలో నొక్కిచెప్పబడిన సువార్తను ఎందుకు గుర్తుంచుకోవాలి? దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి?

20 పరిచర్య చేస్తుండగా మనం సువార్తలోని ఆ అంశాన్ని గుర్తుంచుకోవాలి. యేసు గురించి మాట్లాడుతూ పౌలు యెషయా పుస్తకం నుండి ఈ విషయాన్ని ఎత్తి చెప్పాడు: “ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు [‘నిరాశ చెందడు,’ NW]” (రోమా. 10:11; యెష. 28:16) పాపం విషయంలో బైబిలు చెబుతున్నదాని గురించి అవగాహన ఉన్నవారికి యేసు గురించిన ప్రాథమిక వార్త వింతగా ఉండదు. కానీ, దాని గురించి తెలియని లేదా అలాంటి నమ్మకమే లేని సంస్కృతిలో పెరిగిన కొంతమందికి మాత్రం అది వింతగా కనిపించవచ్చు. అలాంటి వారు దేవునిపై, లేఖనాలపై నమ్మకాన్ని అలవర్చుకుంటుండగా మనం యేసు పాత్ర గురించి వివరించాల్సి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయం సువార్తలోని ఆ అంశం గురించి మరిన్ని వివరాలు ఇస్తోంది. దాన్ని మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ఆ అధ్యయనం మీ పరిచర్యకు ఎంతగానో ఉపయోగపడుతుందని మీకనిపించవచ్చు.

21 రోమీయులకు పౌలు రాసిన పత్రికలో పదేపదే ప్రస్తావించబడిన సువార్తను అంటే, ‘నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తియైన’ సువార్తను అర్థంచేసుకోవడానికి యథార్థ హృదయులకు మనం సహాయం చేస్తే ఎంతో సంతోషాన్ని పొందుతాం. (రోమా. 1:16) అంతేకాక, “ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి” అని రోమీయులు 10:15లో పౌలు రాసిన మాటలతో వారు ఏకీభవించడాన్ని మనం చూస్తాం.—యెష. 52:7.

[అధస్సూచి]

a “క్రీస్తు సువార్త” గురించి ఇతర ప్రేరేపిత పుస్తకాల్లో కూడా ప్రస్తావించబడింది.—మార్కు 1:1; అపొ. 5:42; 1 కొరిం. 9:12; ఫిలి. 1:27.

మీకు జ్ఞాపకమున్నాయా?

• సువార్తలోని ఏ అంశం గురించి రోమీయులకు రాసిన పత్రికలో నొక్కిచెప్పబడింది?

• ఏ వాస్తవాన్ని అర్థంచేసుకోవడానికి మనం ప్రజలకు సహాయం చేయాలి?

• “క్రీస్తు సువార్త” మనకూ ఇతరులకూ ఎలా ఆశీర్వాదాలను తెస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[8వ పేజీలోని బ్లర్బ్‌]

రోమీయులకు రాసిన పత్రికలో పదేపదే ప్రస్తావించబడిన సువార్త, దేవుని సంకల్పంలో యేసుకున్న ప్రాముఖ్యమైన పాత్రను నొక్కిచెబుతోంది

[9వ పేజీలోని చిత్రం]

మనందరం పాపం అనే మరణకరమైన లోపంతో పుట్టాం!