కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మీ మధ్యనున్న దేవుని మందను కాయండి’

‘మీ మధ్యనున్న దేవుని మందను కాయండి’

‘మీ మధ్యనున్న దేవుని మందను కాయండి’

‘బలిమిచేత కాక ఇష్టపూర్వకంగా మీ మధ్యనున్న దేవుని మందను కాయండి.’—1 పేతు. 5:2.

1. పేతురు మొదటి పత్రిక రాసేనాటికి క్రైస్తవులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు?

 నీరో చక్రవర్తి రోములోని క్రైస్తవులపై హింసలు తీసుకురావడానికి కొంతకాలం ముందు అపొస్తలుడైన పేతురు మొదటి పత్రికను రాశాడు. ఆయన తన తోటి విశ్వాసులను బలపర్చాలనుకున్నాడు. క్రైస్తవులను మింగేయాలనే ఉద్దేశంతో అపవాది “వెదకుచు తిరుగుచున్నాడు.” అతడి దాడిని ఎదుర్కొని స్థిరంగా నిలబడాలంటే వారు “నిబ్బరమైన బుద్ధిగలవారై” ఉంటూ ‘దేవుని బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై’ ఉండాలి. (1 పేతు. 5:6, 8) అంతేకాక వారు ఐక్యంగా ఉండాలి. ‘ఒకనినొకడు కరచుకొని భక్షించుకోవడానికి’ అది సమయం కాదు. ఒకవేళ అలాచేస్తే వారు ‘ఒకనివల్ల ఒకడు బొత్తిగా నశించిపోయే’ అవకాశముంది.—గల. 5:15.

2, 3. మనం ఎవరితో పోరాడాలి? ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

2 ఇప్పుడు మనమూ అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. అపవాది మనల్ని మింగేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. (ప్రక. 12:12) ‘లోకారంభం నుండి ఇప్పటివరకు కలగని మహాశ్రమ’ త్వరలో కలగబోతుంది. (మత్త. 24:20, 21) కాబట్టి, అనవసరమైన విషయాల గురించి తగవులాడుకోకుండా మనం కూడా మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లాగే జాగ్రత్తగా ఉండాలి. అందుకు మనకు కొన్నిసార్లు అర్హులైన పెద్దల సహాయం అవసరం.

3 పెద్దలు ‘తమ మధ్యనున్న దేవుని మందను’ కాయడమనే సేవాధిక్యతను మరింత విలువైనదిగా ఎంచడానికి ఏమి చేయవచ్చో ఇప్పుడు చూద్దాం. (1 పేతు. 5:2) అలాగే సరైన పద్ధతిలో వారు మందను ఎలా కాయవచ్చో కూడా పరిశీలిద్దాం. తర్వాతి ఆర్టికల్‌లో, ‘ప్రయాసపడుచు’ మందను పర్యవేక్షిస్తున్నవారిపట్ల సంఘంలోనివారు ‘మన్నన’ లేదా గౌరవం ఎలా చూపించవచ్చో పరిశీలిస్తాం. (1 థెస్స. 5:12) ఈ విషయాలను పరిశీలిస్తే, మనం పోరాడాల్సింది ప్రధాన శత్రువైన సాతానుతోనే అని గుర్తించి వాడి దాడులను స్థిరంగా ఎదుర్కోగలుగుతాం.—ఎఫె. 6:12.

దేవుని మందను కాయండి

4, 5. పెద్దలు మందను ఎలా పరిగణించాలి? ఒక ఉదాహరణ చెప్పండి.

4 తమకు అప్పగించబడిన మందపట్ల దేవునికున్న అభిప్రాయాన్నే కలిగివుండమని పేతురు మొదటి శతాబ్దంలోని క్రైస్తవ పెద్దలను ప్రోత్సహించాడు. (1 పేతురు 5:1, 2 చదవండి.) అప్పట్లో సహోదరులు ఆయనను సంఘంలో ఒక స్తంభంగా పరిగణించేవారు. అయినా పేతురు పెద్దలతో చిన్నబుచ్చినట్లు మాట్లాడలేదు. బదులుగా, వారిని తోటి పెద్దలుగా పరిగణించి ప్రోత్సహించాడు. (గల. 2:8, 9) అలాగే నేటి పరిపాలక సభ, దేవుని మందను కాయడమనే బరువైన బాధ్యతను నిర్వర్తించడానికి కృషిచేయమని పెద్దలను ప్రోత్సహిస్తోంది.

5 ‘తమ మధ్యనున్న దేవుని మందను కాసే’ బాధ్యత పెద్దలకు ఉందని అపొస్తలుడైన పేతురు రాశాడు. మంద యెహోవాది, యేసుక్రీస్తుది అని వారు గుర్తించడం చాలా ప్రాముఖ్యం. దేవుని గొర్రెలను చూసుకుంటున్న తీరు విషయంలో వారు లెక్క ఒప్పజెప్పాలి. ఉదాహరణకు, తను ఊర్లో లేనప్పుడు తన పిల్లలను చూసుకోమని మీ దగ్గరి స్నేహితుడు కోరాడనుకుందాం. మీరు వారిని బాగా చూసుకుంటూ, వారికి కావాల్సిన ఆహారం సమకూర్చరా? వారిలో ఎవరికైనా బాగాలేకపోతే, డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లరా? అలాగే సంఘ పెద్దలు, ‘దేవుడు తన సొంత కుమారుని రక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని’ కాయాలి. (అపొ. 20:28, NW) మందలోని ప్రతీ ఒక్కరిని క్రీస్తుయేసు అమూల్యమైన రక్తంతో యెహోవా కొన్నాడని వారు గుర్తుంచుకుంటారు. పెద్దలు లెక్క ఒప్పజెప్పాలి కాబట్టి, వారు మందను పోషిస్తారు, కాపాడతారు, సంరక్షిస్తారు.

6. ప్రాచీన కాలంలో గొర్రెల కాపరులు ఏమేమి చేయాల్సివచ్చేది?

6 ప్రాచీన కాలంలో గొర్రెల కాపరులు ఏమేమి చేయాల్సివచ్చేదో ఆలోచించండి. మందను చూసుకోవడానికి వారు పగటిపూట ఎండను, రాత్రిపూట చలిని భరించాల్సివచ్చేది. (ఆది. 31:40) గొర్రెల కోసం వారు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టేవారు. చిన్నప్పుడు కాపరిగా పనిచేసిన దావీదు, సింహం ఎలుగుబంటి లాంటి క్రూర జంతువుల నుండి మందను రక్షించాడు. సింహం గురించి, ఎలుగుబంటి గురించి చెబుతూ దావీదు, “దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని” అని అన్నాడు. (1 సమూ. 17:34, 35) ఎంతటి సాహసం! జంతువు దవడలకు ఆయన ఎంత దగ్గరగా వెళ్లాడు! అయినా, గొర్రెను రక్షించాలనే ఉద్దేశంతో ఆయన ఆ సాహసానికి వెనకాడలేదు.

7. పెద్దలు ఎలా సాతాను దవడల నుండి గొర్రెలను రక్షించాల్సి రావచ్చు?

7 నేడు, సింహంలా అపవాది చేస్తున్న దాడుల విషయంలో పెద్దలు అప్రమత్తంగా ఉండాలి. కొన్నిసార్లు వారు అపవాది దవడల నుండి గొర్రెలను లాగేయాల్సి రావచ్చు. మరో మాటలో చెప్పాలంటే దావీదులా పెద్దలు క్రూరమృగం గడ్డం పట్టుకొని గొర్రెలను కాపాడాల్సి రావచ్చు. అప్రమత్తంగా లేని సహోదరులు సాతాను ఉరుల్లో చిక్కుకున్నప్పుడు పెద్దలు వారికి వాస్తవాలు అర్థమయ్యేలా వివరించాల్సిరావచ్చు. (యూదా 22, 23 చదవండి.) అయితే, యెహోవా సహాయం లేకుండా పెద్దలు ఈ పనిని చేయలేరు. వారు గాయపడిన గొర్రెతో మృదువుగా ప్రవర్తిస్తారు. ఉపశమనమిచ్చే దేవుని వాక్యమనే తైలం రాసి ఆ గొర్రెకు కట్టుకడతారు.

8. పెద్దలు మందను ఎక్కడికి నడిపిస్తారు? ఎలా?

8 సాధారణంగా గొర్రెల కాపరి నీళ్లు, పచ్చికబయలు ఉన్న మంచి ప్రాంతానికి మందను నడిపించేవాడు. అలాగే, “తగినవేళ అన్నము” భుజించి, బలంపొందేలా క్రమంగా కూటాలకు హాజరుకమ్మని ప్రోత్సహించడం ద్వారా పెద్దలు తప్పిపోయిన గొర్రెను సంఘంవైపు నడిపిస్తారు. (మత్త. 24:45) ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్నవారిని దేవుని వాక్యంలోని పోషకాలను తీసుకునేలా ఒప్పించడానికి పెద్దలు అదనంగా కొంత సమయాన్ని వెచ్చించాల్సిరావచ్చు. తప్పిపోయిన గొర్రె మందలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుండవచ్చు. అలాంటి సహోదరుణ్ణి భయపెట్టే బదులు, పెద్దలు మృదువుగా లేఖన సూత్రాలను వివరించి, వాటిని ఆయనెలా అన్వయించుకోవచ్చో చూపిస్తారు.

9, 10. ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్నవారిని పెద్దలు ఎలా చూసుకోవాలి?

9 మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎలాంటి డాక్టరు దగ్గరికి వెళ్లాలనుకుంటారు? తర్వాతి రోగిని చూడాలనే తొందరలో మీరు చెప్పేది ఏదో కొద్దిసేపు విని హడావిడిగా మందులు రాసే డాక్టరు దగ్గరికి వెళ్తారా? లేక మీరు చెప్పేది ఓపిగ్గా విని, మీ సమస్యేమిటో వివరించి, దానికి ఏయే చికిత్సలు ఉన్నాయో చెప్పే డాక్టరు దగ్గరికి వెళ్తారా?

10 అలాగే పెద్దలు ఆధ్యాత్మిక అనారోగ్యంతోవున్న వ్యక్తి చెప్పేది ఓపిగ్గా విని, అతని గాయం మానేలా సహాయం చేయడం ద్వారా ‘యెహోవా నామమున అతనికి నూనె రాస్తారు.’ (యాకోబు 5:14, 15 చదవండి.) గిలాదులోని గుగ్గిలములా దేవుని వాక్యం అనారోగ్యంతో ఉన్నవారికి ఉపశమనాన్నిస్తుంది. (యిర్మీ. 8:22; యెహె. 34:16) ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి బైబిలు సూత్రాలను అన్వయించుకుంటే తిరిగి యెహోవా సేవలో స్థిరంగా నిలబడగలుగుతాడు. ఆధ్యాత్మిక అనారోగ్యంతోవున్నవారి కష్టాలను విని, వారితో కలిసి ప్రార్థిస్తే పెద్దలు వారికి ఎంతో మేలు చేయగలుగుతారు.

బలిమిచేత కాక ఇష్టపూర్వకంగా కాయండి

11. పెద్దలు మందను ఇష్టపూర్వకంగా ఎందుకు కాస్తారు?

11 కాపరి పనిని ఎలా చేయాలో, ఎలా చేయకూడదో పేతురు పెద్దలకు ఆ తర్వాత గుర్తుచేశాడు. వారు దేవుని మందను ‘బలిమిచేత కాక ఇష్టపూర్వకంగా’ కాయాలి. ఎందుకు? ఒకసారి ఆలోచించండి, అసలు యేసు గొర్రెలను పేతురు ఎందుకు కాశాడు? ఎందుకు మేపాడు? ప్రభువు పట్ల ప్రేమ, ఆప్యాయత ఉండబట్టే ఆయన అలా చేశాడు. (యోహా. 21:15-17) అదే విధంగా ప్రేమనుబట్టే పెద్దలు, ‘తమ కోసం కాక, తమ నిమిత్తము మృతిపొందినవాని’ కోసం జీవిస్తారు. (2 కొరిం. 5:14, 15) అంతేకాక పెద్దలు దేవుణ్ణి, తోటి సహోదరులను ప్రేమిస్తారు కాబట్టి తమ శక్తిని, వనరులను, సమయాన్ని వెచ్చించి మందను కాస్తారు. (మత్త. 22:37-39) వారు సణగకుండా ఇష్టపూర్వకంగా మంద కోసం తమను తాము అంకితం చేసుకుంటారు.

12. అపొస్తలుడైన పౌలు ఎంతమేరకు తనను తాను అంకితం చేసుకున్నాడు?

12 పెద్దలు తమను తాము ఎంతమేరకు అంకితం చేసుకోవాలి? యేసును అనుకరించిన అపొస్తలుడైన పౌలులా వారు గొర్రెలను చూసుకుంటారు. (1 కొరిం. 11:1) థెస్సలొనీకలోని సహోదరులపట్ల అనురాగంతో పౌలు, ఆయన సహచరులు ‘దేవుని సువార్తను మాత్రమే గాక తమ ప్రాణాలను కూడా’ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అలా చేయడానికి వారు “స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా” సహోదరులతో మృదువుగా ప్రవర్తించారు. (1 థెస్స. 2:7, 8) పాలిచ్చే తల్లికి శిశువు పట్ల ఎలాంటి భావాలు ఉంటాయో పౌలు అర్థం చేసుకున్నాడు. శిశువు కోసం తల్లి ఏమైనా చేస్తుంది, పాలిచ్చేందుకు మధ్యరాత్రిలోనైనా సరే లేస్తుంది.

13. పెద్దలు ఏ విషయంలో జాగ్రత్త వహించాలి?

13 పెద్దలు కాపరి పని చేయడంతోపాటు, కుటుంబ బాధ్యతను కూడా జాగ్రత్తగా నిర్వహించాలి. (1 తిమో. 5:8) పెద్దలు కుటుంబంతో వెచ్చించగల అమూల్యమైన సమయాన్ని సంఘంతో వెచ్చిస్తారు. కాబట్టి, రెండు బాధ్యతలకూ తగినంత ప్రాముఖ్యత ఇవ్వడానికి వారు కొన్నిసార్లు తమ కుటుంబ ఆరాధనకు ఇతరులను ఆహ్వానించవచ్చు. జపాన్‌లోని మాసానావో అనే పెద్ద ఎన్నో సంవత్సరాలుగా అవివాహితులను లేక ఒంటరివాళ్లను, తండ్రి సత్యంలోలేని కుటుంబాలను తమ కుటుంబ అధ్యయనానికి ఆహ్వానిస్తూ వస్తున్నాడు. దానివల్ల వారిలో కొందరు పెద్దలుగా ప్రగతి సాధించి ఆయన చేసినట్లే చేస్తున్నారు.

దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతో మందను కాయండి

14, 15. “దుర్లాభాపేక్ష” విషయంలో పెద్దలు ఎందుకు జాగ్రత్తపడాలి? ఈ విషయంలో వారు పౌలును ఎలా అనుకరించవచ్చు?

14 “దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతో” మందను కాయమని కూడా పేతురు పెద్దలను ప్రోత్సహించాడు. పెద్దలు సంఘ పని చేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చించాల్సి వచ్చినా, దానికి జీతం ఆశించరు. “దుర్లాభాపేక్షతో” మందను కాసే ప్రమాదం గురించి తోటి పెద్దలను హెచ్చరించాల్సిన అవసరముందని పేతురు గుర్తించాడు. “మహాబబులోనుకు” చెందిన మతనాయకులను చూస్తే ఆ ప్రమాదం స్పష్టమౌతుంది. ఒకవైపు చాలామంది కడుపేదరికంలో మగ్గుతుంటే ఆ నాయకులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. (ప్రక. 18:2, 3) అందుకే, నేడు పెద్దలు అలాంటి ఆలోచనా తీరును పెంపొందించుకోకుండా జాగ్రత్తపడాలి.

15 క్రైస్తవ పెద్దలకు పౌలు మంచి మాదిరిని ఉంచాడు. ఆయన అపొస్తలుడైనప్పటికీ థెస్సలొనీకలోని సహోదరులకు గొప్ప “భారంగా” మారలేదు. ఆయన ‘ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకోకుండా ప్రయాసముతో, కష్టముతో రాత్రింబగళ్లు పనిచేశాడు.’ (2 థెస్స. 3:8) ఆయనలాగే, నేడు ప్రయాణ పర్యవేక్షకులతోపాటు అనేకమంది పెద్దలు ఈ విషయంలో మంచి ఉదాహరణగా ఉన్నారు. వారు తోటి విశ్వాసుల ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు కానీ, ఎవరికీ గొప్ప “భారంగా” మారరు.—1 థెస్స. 2:9.

16. “సిద్ధమనస్సుతో” మందను కాయడమంటే ఏమిటి?

16 పెద్దలు “సిద్ధమనస్సుతో” మందను కాస్తారు. మందకు సహాయం చేసే విషయంలో వారు త్యాగాలు చేయడానికి ముందుకు రావడం ద్వారా ఆ లక్షణాన్ని చూపిస్తారు. అయితే, ప్రేమగల పెద్దలు యెహోవాను సేవించమని మందను బలవంతపెట్టరు. అలాగే పోటీ స్వభావంతో దేవుణ్ణి సేవించమని ఇతరులను ప్రోత్సహించరు. (గల. 5:26) గొర్రెల పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని పెద్దలకు తెలుసు. యెహోవాను సంతోషంగా సేవించేలా తోటి సహోదరులకు సహాయం చేయడానికి వారు ఎంతో ఇష్టపడతారు.

మందపై ప్రభువులైనట్టుండక మాదిరులుగా ఉండండి

17, 18. (ఎ) వినయం గురించి యేసు చేసిన బోధను అపొస్తలులు కొన్నిసార్లు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? (బి) మనం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశముంది?

17 మనం పైన చూసినట్లు, పెద్దలు తాము కాస్తున్న మంద తమది కాదుగానీ దేవునిదని గుర్తుంచుకోవాలి. దేవుడు ‘అప్పగించినవారిపై ప్రభువులుగా’ ఉండకుండా జాగ్రత్తపడాలి. (1 పేతురు 5:3 చదవండి.) కొన్నిసార్లు, యేసు అపొస్తలులు కూడా తప్పుడు ఉద్దేశంతో అన్యజనుల్లోని అధికారుల్లా ప్రముఖ స్థానం కోసం తపించారు.—మార్కు 10:42-45 చదవండి.

18 ‘అధ్యక్ష్యపదవిని ఆశించే’ లేదా పర్యవేక్షకుడయ్యేందుకు కృషిచేసే సహోదరులు తాము ఎందుకు దాని కోసం ప్రయత్నిస్తున్నారో ఆలోచించుకోవాలి. (1 తిమో. 3:1) ఇప్పుడు పెద్దలుగా సేవచేస్తున్నవారు తమకు అధికారంపై లేదా ప్రముఖ స్థానంపై మోజు ఉందా అని నిజాయితీగా ప్రశ్నించుకోవాలి. అపొస్తలులకే ఆ సమస్య వచ్చిందంటే, ఇతరులపై అధికారం చెలాయించాలని చూసే లోకస్థుల్లా ఆలోచించకుండా ఉండేందుకు తాము ఇంకెంతగానో కష్టపడి పనిచేయాలని పెద్దలు గుర్తించాలి.

19. మందను రక్షించేందుకు చర్య తీసుకుంటున్నప్పుడు పెద్దలు దేన్ని గుర్తుంచుకోవాలి?

19 నిజమే, కొన్నిసార్లు పెద్దలు స్థిరంగా వ్యవహరించాలి. ఉదాహరణకు “క్రూరమైన తోడేళ్ల” నుండి మందను కాపాడేందుకు వారు అలా ప్రవర్తించాల్సిరావచ్చు. (అపొ. 20:28-30) “హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో . . . ఖండించుచునుండుము” అని పౌలు తీతును ప్రోత్సహించాడు. (తీతు 2:15) అలాంటి చర్య తీసుకుంటున్నప్పుడు కూడా పెద్దలు తప్పు చేసినవారితో గౌరవపూర్వకంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తారు. తప్పు చేసిన వ్యక్తి తన తప్పు తెలుసుకొని, తన పద్ధతిని మార్చుకోవాలంటే ఆయనను తీవ్రంగా విమర్శించడం కన్నా మృదువుగా ఒప్పించడమే ఎంతో మంచిదని పెద్దలు గుర్తిస్తారు.

20. పెద్దలు ఏ విధంగా యేసులా మంచి మాదిరిని ఉంచవచ్చు?

20 మందను ప్రేమించేలా క్రీస్తు మంచి మాదిరి పెద్దలను పురికొల్పుతుంది. (యోహా. 13:12-15) ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో ఆయన శిక్షణనిచ్చిన తీరు గురించి చదివినప్పుడు మనం ప్రోత్సాహం పొందుతాం. ఆయన చూపించిన వినయం శిష్యుల హృదయాలను స్పర్శించి “వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని” ఎంచుకునేలా వారిని ప్రోత్సహించింది. (ఫిలి. 2:3) అలాగే నేటి పెద్దలు యేసు మాదిరి గురించి చదివినప్పుడు దాన్ని అనుకరించాలనే ప్రేరణ పొందుతారు, “మందకు మాదిరులుగా” ఉండాలనుకుంటారు.

21. పెద్దలు ఏ బహుమానం కోసం ఎదురుచూడవచ్చు?

21 పెద్దలకు తాను ఇచ్చిన ఉపదేశం ముగింపులో భవిష్యత్తుకు సంబంధించిన ఒక వాగ్దానం గురించి పేతురు చెప్పాడు. (1 పేతురు 5:4 చదవండి.) అభిషిక్త పర్యవేక్షకులు క్రీస్తుతోపాటు పరలోకంలో “వాడబారని మహిమ కిరీటము” పొందుతారు. “ప్రధాన కాపరి” పరిపాలనలో భూమ్మీదున్న దేవుని మందను కాసే గొప్ప అవకాశం ‘వేరే గొర్రెలకు’ చెందిన ఉపకాపరులకు ఉంటుంది. (యోహా. 10:16) నాయకత్వం వహించేందుకు నియమించబడినవారికి సంఘ సభ్యులు ఎలా మద్దతునివ్వవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

పునఃసమీక్ష

• తమ కాపుదలలో ఉన్న దేవుని మందను కాయమని పేతురు తోటి పెద్దలను ఎందుకు ప్రోత్సహించాడు?

• ఆధ్యాత్మిక అనారోగ్యంతోవున్నవారిని పెద్దలు ఎలా చూసుకోవాలి?

• తమ కాపుదలలో ఉన్న దేవుని మందను పెద్దలు ఎందుకు కాస్తారు?

[అధ్యయన ప్రశ్నలు]

[21వ పేజీలోని చిత్రం]

ప్రాచీన కాలంలోని కాపరుల్లాగే నేటి పెద్దలు తమ కాపుదలలో ఉన్న ‘గొర్రెలను’ రక్షించాలి