కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మీ మధ్య ప్రయాసపడుతున్నవారిని’ గౌరవించండి

‘మీ మధ్య ప్రయాసపడుతున్నవారిని’ గౌరవించండి

‘మీ మధ్య ప్రయాసపడుతున్నవారిని’ గౌరవించండి

‘మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేయండి.’ —1 థెస్స. 5:12.

1, 2. (ఎ) పౌలు థెస్సలొనీక సంఘానికి మొదటి పత్రిక రాసేనాటికి అక్కడి పరిస్థితి ఎలా ఉంది? (బి) ఆయన వారిని ఏమని ప్రోత్సహించాడు?

 ఐరోపాలో మొట్టమొదటిగా స్థాపించబడిన సంఘాల్లో ఒకటైన మొదటి శతాబ్దపు థెస్సలొనీక సంఘంలో మీరు కూడా సభ్యులని ఊహించుకోండి. అపొస్తలుడైన పౌలు కొంతకాలం అక్కడ ఉండి సహోదరులను బలపర్చాడు. అంతేకాక, నాయకత్వం వహించేందుకు ఇతర సంఘాల్లో పెద్దలను నియమించినట్లే అక్కడా నియమించివుంటాడు. (అపొ. 14:23) అయితే, సంఘం ఏర్పడిన తర్వాత, యూదులు ఆ ఊరి నుండి పౌలు సీలలను వెళ్లగొట్టడానికి అల్లరిమూకను ఉసిగొల్పారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడి క్రైస్తవులు తాము ఒంటరివాళ్లమైపోయామని భయపడివుంటారు.

2 తాను థెస్సలొనీక సంఘాన్ని విడిచి వెళ్లినప్పుడు శైశవ దశలో ఉన్న ఆ సంఘం గురించి పౌలు చింతించాడనేది అర్థంచేసుకోదగినదే. ఆయన తిరిగి అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించాడు కానీ ‘సాతాను ఆయనను అభ్యంతరపరిచాడు.’ అందుకే పౌలు ఆ సంఘాన్ని బలపర్చేందుకు తిమోతిని పంపించాడు. (1 థెస్స. 2:18; 3:1-4) తిమోతి అక్కడి నుండి మంచి వార్తతో వచ్చినప్పుడు పౌలు ఆ సంఘపువారికి పత్రిక రాయాలనుకున్నాడు. పౌలు ఆ పత్రికలో ఎన్నో విషయాలను రాస్తూ ‘వారికి పైవారైవుండేవారిపట్ల మన్నన’ లేదా గౌరవం కలిగివుండమని ప్రోత్సహించాడు.—1 థెస్సలొనీకయులు 5:12, 13 చదవండి.

3. సంఘంలోని పెద్దలను మరింతగా ఘనపర్చేందుకు థెస్సలొనీక క్రైస్తవులకు ఏ కారణాలున్నాయి?

3 పౌలుకు, ఆయన ప్రయాణ సహచరులకు ఉన్నంత అనుభవం థెస్సలొనీక సంఘ పెద్దలకు లేదు. అలాగే యెరూషలేములోని పెద్దలతో పోలిస్తే వీరు సత్యంలో కాస్త కొత్త. అంతెందుకు ఆ సంఘం స్థాపించబడి కనీసం సంవత్సరం కూడా కాలేదు! అయినా, వారిపట్ల సంఘంలోనివారు కృతజ్ఞత కలిగివుండాలి. ఎందుకంటే ఆ పెద్దలు ‘పైవారిగా’ ఉన్నారు లేక నాయకత్వం వహిస్తున్నారు, ‘ప్రయాసపడుతున్నారు,’ సహోదరులకు ‘బుద్ధి చెబుతున్నారు.’ ‘వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచడానికి’ ఆ సంఘ సభ్యులకు ఎన్నో కారణాలున్నాయి. ఆ మనవి చేసిన తర్వాత పౌలు “ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి” అని వారికి ఉపదేశించాడు. మీరు థెస్సలొనీక సంఘంలో ఉండివుంటే, ఆ పెద్దలు చేస్తున్న పనిని మనస్ఫూర్తిగా మెచ్చుకునేవారా? క్రీస్తు ద్వారా దేవుడు మీ సంఘానికి ఇచ్చిన ‘మనుష్యుల్లోని ఈవులను’ మీరెలా పరిగణిస్తున్నారు?—ఎఫె. 4:8.

‘ప్రయాసపడుతున్నారు’

4, 5. సంఘానికి బోధించడానికి పౌలు కాలంలోని పెద్దలు ఎందుకు ప్రయాసపడాల్సి వచ్చింది? నేడు కూడా పెద్దలు అలాగే చేస్తున్నారని ఎందుకు చెప్పవచ్చు?

4 పౌలు సీలలను బెరయ సంఘానికి పంపించిన తర్వాత, థెస్సలొనీక సంఘ పెద్దలు ఏ విధంగా ‘ప్రయాసపడ్డారు’? ఖచ్చితంగా పౌలులా వారు లేఖనాలను ఉపయోగించి సంఘానికి బోధించివుంటారు. అయితే ‘థెస్సలొనీక క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ఇష్టపడ్డారా?’ అనే అనుమానం మీకు రావచ్చు. ఎందుకంటే, బెరయలోనివారు “థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి. . . . ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి” అని బైబిలు చెబుతోంది. (అపొ. 17:11) ఆ వచనం, థెస్సలొనీకలోని క్రైస్తవుల గురించి కాదుగానీ అక్కడి యూదుల గురించి చెబుతోంది. నిజానికి, థెస్సలొనీకలో క్రైస్తవులైనవారు ‘దేవుని వాక్యాన్ని మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అంగీకరించారు.’ (1 థెస్స. 2:13) అలాంటివారి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి ఆ సంఘ పెద్దలు ఎంతో ప్రయాసపడివుంటారు.

5 నేడు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి దేవుని మందకు ‘తగినవేళ అన్నము పెడుతోంది.’ (మత్త. 24:45) దాసుని నిర్దేశంలో స్థానిక పెద్దలు తమ సహోదరులను ఆధ్యాత్మికంగా పోషించడానికి కష్టపడి పనిచేస్తారు. సంఘంలో ప్రచారకుల దగ్గర ఎన్నో బైబిలు సాహిత్యాలు ఉండవచ్చు. కొన్ని భాషల్లోనైతే వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌, వాచ్‌టవర్‌ లైబ్రరీ సీడీ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. అయినా, పెద్దలు సంఘ ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేలా కూటాల భాగాలను చక్కగా అందించడానికి ఎన్నో గంటలపాటు సిద్ధపడతారు. అలా వారు సంఘానికి ఉపయోగపడే విధంగా వాటిని అందించేందుకు కృషిచేస్తారు. కూటాల్లో, సమావేశాల్లో వివిధ భాగాలను అందించడానికి పెద్దలు ఎంత సమయం వెచ్చిస్తారో మీరు ఆలోచించారా?

6, 7. (ఎ) పౌలు థెస్సలొనీకలోని పెద్దలకు ఎలాంటి మాదిరినుంచాడు? (బి) నేటి పెద్దలకు పౌలు మాదిరిని అనుకరించడం ఎందుకు కష్టంకావచ్చు?

6 మందను కాయడంలో పౌలు మంచి మాదిరిని థెస్సలొనీక సంఘ పెద్దలు గుర్తుంచుకున్నారు. పౌలు కాపరి పనిని మొక్కుబడిగా చేయలేదు. ముందటి ఆర్టికల్‌లో చూసినట్లు, ‘స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లు సాధువుగా’ లేదా మృదువుగా పౌలు ప్రవర్తించాడు. (1 థెస్సలొనీకయులు 2:7, 8 చదవండి.) వారి కోసం ‘తన ప్రాణాన్ని ఇవ్వడానికి’ కూడా సిద్ధపడ్డాడు! పెద్దలు కాపరి పనిని పౌలులా చేయాలి.

7 మందను ప్రేమించి, సంరక్షించడం ద్వారా నేడు క్రైస్తవ కాపరులు పౌలును అనుకరిస్తారు. మందలో కొందరు స్వతహాగా స్నేహశీలురుగా, దయగలవారిగా ఉండకపోవచ్చు. అయినా, పెద్దలు వారి పరిస్థితిని అర్థం చేసుకొని వారిలో మంచిని చూడడానికి ప్రయత్నిస్తారు. అపరిపూర్ణతనుబట్టి ఒక పెద్దకు ఇతరుల్లో మంచిని చూడడం కష్టమైనా, అందరితో మృదువుగా ప్రవర్తించేందుకు ఆయన శాయశక్తులా కృషిచేస్తాడు. అలా క్రీస్తు కింద మంచి కాపరిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నందుకు అలాంటి పెద్దను మనం మెచ్చుకోవాలి కదా?

8, 9. నేడు పెద్దలు ఏయే విధాలుగా ‘మన ఆత్మలను కాస్తున్నారు’?

8 పెద్దలకు ‘లోబడివుండడానికి’ మనకు ఎన్నో కారణాలున్నాయి. వారు ‘మన ఆత్మలను కాయుచున్నారు’ అని పౌలు చెప్పాడు. (హెబ్రీ. 13:17) ఆ మాటలు మందను కాపాడేందుకు నిద్రను త్యాగం చేసే కాపరిని గుర్తుచేస్తాయి. అలాగే, నేడు పెద్దలు అనారోగ్య, భావోద్వేగ, ఆధ్యాత్మిక సమస్యలతో బాధపడుతున్నవారికి సహాయం చేసేందుకు కొంత నిద్రను త్యాగం చేస్తారు. ఉదాహరణకు, ఆసుపత్రి అనుసంధాన కమిటీల్లో పనిచేసే సహోదరులు అత్యవసర పరిస్థితుల్లో మధ్యరాత్రి కూడా మేల్కోవాల్సివచ్చింది. మనకు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వారు చేసే సేవపట్ల ఎంత కృతజ్ఞత కలిగివుంటాం!

9 రాజ్యమందిర నిర్మాణ పనులను చూసుకునే లేదా సహాయక కమిటీల్లో సేవచేసే పెద్దలు సహోదరులకు సహాయం చేయడానికి ఎంతో కష్టపడి పనిచేస్తారు. వారికి మనం మనస్ఫూర్తిగా మద్దతునివ్వాలి. ఉదాహరణకు, 2008లో మ్యాన్‌మార్‌ మీద నార్గిస్‌ తుఫాను విరుచుకుపడినప్పుడు తీసుకున్న సహాయక చర్యల గురించి ఆలోచించండి. తుఫానువల్ల తీవ్రంగా నష్టపోయిన ఇర్రావాడి తీర ప్రాంతంలో ఉన్న బోథిన్‌గోన్‌ సంఘానికి చేరుకోవడానికి శవాలు చెల్లాచెదరుగా పడివున్న ప్రాంతాల మీదుగా సహాయక బృందం ప్రయాణించింది. ఆ ప్రాంతానికి వచ్చిన మొదటి సహాయక బృందంలో తమ ప్రాంతీయ కాపరిని చూసినప్పుడు అక్కడి సహోదరులు, “అదిగో చూడండి, మన ప్రాంతీయ కాపరి వస్తున్నాడు! యెహోవా మనల్ని కాపాడాడు!” అని కేకలువేశారు. రాత్రనకా పగలనకా ప్రయాసపడుతున్నందుకు పెద్దలను మెచ్చుకుంటున్నారా? కొందరు పెద్దలు న్యాయపరమైన పెద్దపెద్ద సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీల్లో నియమించబడతారు. వారు తాము సాధించిన దాని గురించి గొప్పలు చెప్పుకోరు. అయితే, వారి సేవల నుండి మేలు పొందే సహోదరసహోదరీలు వారిపట్ల ఎంతో కృతజ్ఞత కనబరుస్తారు.—మత్త. 6:2-4.

10. పెద్దలు చేసే ఏయే పనులు సంఘంలోని వారికి అంతగా తెలియకపోవచ్చు?

10 నేడు చాలామంది పెద్దలు ఉత్తరాలు, నివేదికలు, రికార్డుల వంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, పెద్దల సభ సమన్వయకర్త వారపు కూటాలకు సంబంధించిన పట్టికలు తయారుచేస్తాడు. సంఘ కార్యదర్శి మాసిక, వార్షిక రిపోర్టులను సేకరిస్తాడు. పాఠశాల పర్యవేక్షకుడు బాగా ఆలోచించి పాఠశాల పట్టికను తయారుచేస్తాడు. మూడు నెలలకు ఒకసారి, పెద్దలు సంఘ అకౌంట్స్‌ ఫైళ్లను తనిఖీ చేస్తారు. ‘విశ్వాసం విషయంలో ఏకత్వాన్ని’ కాపాడేందుకు పెద్దలు బ్రాంచి కార్యాలయం నుండి వచ్చే ఉత్తరాలను చదివి వాటిలోని నిర్దేశాలను అనుసరిస్తారు. (ఎఫె. 4:1, 11, 12) అలా కష్టపడి పనిచేసే పెద్దల వల్ల ‘సమస్తం మర్యాదగా, క్రమంగా జరుగుతాయి.’—1 కొరిం. 14:39, 40.

‘మీ పైనున్నవారు’

11, 12. సంఘంలో ‘పైనున్నవారు’ ఎవరు? వారేమి చేయాలి?

11 కష్టపడి పనిచేసిన థెస్సలొనీక సంఘంలోని పెద్దలను ‘పైనున్నవారు’ అని పౌలు వర్ణించాడు. మూలభాషలో ఆ పదానికి “ముందు నిల్చోవడం” అనే అర్థముంది. దాన్ని “నిర్దేశిస్తారు, నాయకత్వం వహిస్తారు” అని కూడా అనువదించవచ్చు. (1 థెస్స. 5:12) ‘ప్రయాసపడుతున్నారు’ అన్నప్పుడు ఆయన ఆ పెద్దలందరి గురించి మాట్లాడాడు. నేడు చాలామంది పెద్దలు సంఘం ముందు నిల్చొని కూటాలను నిర్వహిస్తారు. ఈ మధ్యకాలంలో పరిచయం చేయబడిన “పెద్దల సభ సమన్వయకర్త” అనే కొత్త పదప్రయోగాన్ని బట్టి పెద్దలందరూ ఐక్య సభగా పనిచేస్తారని అర్థమౌతోంది.

12 సంఘంలో ‘పైనుండడం’ లేదా నాయకత్వం వహించడం అంటే కేవలం బోధించడం మాత్రమే కాదు. మూలభాషలో ఆ పదాన్నే 1 తిమోతి 3:4లో ఉపయోగించారు. పర్యవేక్షకుడు “సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను” అని పౌలు చెప్పాడు. పర్యవేక్షకుడు ‘ఏలువాడై’ ఉండాలంటే కేవలం బోధిస్తే సరిపోదు కానీ కుటుంబంలో నాయకత్వం వహించి, ‘పిల్లలను స్వాధీనంలో ఉంచుకోవాలి.’ అలాగే సంఘంలోని వారందరూ యెహోవాకు లోబడివుండేందుకు సహాయం చేస్తూ పెద్దలు సంఘంలో నాయకత్వం వహిస్తారు.—1 తిమో. 3:5.

13. పెద్దల కూటంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు సమయం పడుతుంది?

13 మందకు సరిగ్గా నాయకత్వం వహించడానికి పెద్దలు సంఘ అవసరాల గురించి, వాటిని తీర్చడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తారు. నిర్ణయాలన్నిటినీ ఒకే పెద్ద తీసుకుంటే సంఘాన్ని మరింత సమర్థంగా నడిపించవచ్చేమో. కానీ, మొదటి శతాబ్దపు పరిపాలక సభ మాదిరిని అనుసరిస్తూ, మన కాలంలోని పెద్దల సభలు లేఖనాల నిర్దేశాలను పరిగణనలోకి తీసుకుంటూ వివిధ విషయాలను స్వేచ్ఛగా చర్చిస్తాయి. స్థానిక సంఘ అవసరాలకు తగ్గట్టు లేఖన సూత్రాలను అన్వయించాలన్నదే పెద్దల సభ లక్ష్యం. లేఖనాలను, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి నిర్దేశాలను పరిగణనలోకి తీసుకుంటూ పెద్దల కూటాల కోసం ప్రతీ పెద్ద సిద్ధపడితే దాన్ని ఎంతో సమర్థంగా చేయగలుగుతారు. అలా సిద్ధపడడానికి కాస్త సమయం తీసుకోవాల్సివుంటుంది. మొదటి శతాబ్దంలో సున్నతి గురించి పరిపాలక సభ చర్చిస్తున్నప్పుడు అభిప్రాయభేదాలు వచ్చాయి. ఇప్పుడు కూడా పెద్దల కూటాల్లో, ఏ అంశం గురించైనా చర్చిస్తున్నప్పుడు భేదాభిప్రాయాలు రావచ్చు. అలాంటప్పుడు, లేఖనాల ఆధారంగా ఏకగ్రీవ నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం తీసుకొని, పరిశోధించాల్సిరావచ్చు.—అపొ. 15:2, 6, 7, 12-14, 28.

14. పెద్దలు ఓ సభగా కలిసి ఐక్యంగా పనిచేయడం గురించి మీకేమనిపిస్తుంది? ఎందుకు?

14 తాను అనుకున్నట్లే జరగాలని లేదా తన అభిప్రాయమే నెగ్గాలని ఒక పెద్ద పట్టుబట్టినప్పుడు ఏమౌతుంది? లేదా మొదటి శతాబ్దంలోని దియొత్రెఫేలాగే ఎవరైనా భేదాభిప్రాయాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే ఏమౌతుంది? (3 యోహా. 9, 10) దానివల్ల సంఘమంతా నష్టపోతుంది. మొదటి శతాబ్దంలోలాగే, నేడు కూడా సంఘ శాంతికి భంగం కలిగించాలని సాతాను చూస్తున్నాడు. ప్రాధాన్యత కోసం ప్రాకులాడడం వంటి మానవ బలహీనతలను వాడుకోవడానికి అతడు ప్రయత్నించవచ్చు. అందుకే, పెద్దలు వినయాన్ని పెంచుకొని, ఐక్యంగా పనిచేయాలి. ఓ సభగా కలిసి వినయంగా పనిచేస్తున్నందుకు మనం పెద్దలను ఎంతో మెచ్చుకుంటాం కదా!

‘బుద్ధిచెబుతున్నారు’

15. పెద్దలు ఒక సహోదరునికి/సహోదరికి ఎందుకు బుద్ధిచెబుతారు?

15 మందకు బుద్ధిచెప్పే బాధ్యత పెద్దలకు ఉందని పౌలు చెప్పాడు. ఆ బాధ్యత కష్టమైనదే అయినా, ఎంతో ప్రాముఖ్యమైనది. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, ‘బుద్ధిచెప్పడం’ అని అనువదించబడిన గ్రీకు పదాన్ని పౌలు మాత్రమే ఉపయోగించాడు. అది గట్టి ఉపదేశాన్ని మాత్రమే సూచిస్తుంది కానీ ద్వేషాన్ని కాదు. (అపొ. 20:31; 2 థెస్స. 3:15) ఉదాహరణకు, పౌలు కొరింథీయులకు ఇలా రాశాడు: “మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధిచెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను.” (1 కొరిం. 4:14) ఇతరులపట్ల ప్రేమాశ్రద్ధలు ఉన్నాయి కాబట్టే ఆయన బుద్ధిచెప్పాడు.

16. ఇతరులకు బుద్ధిచెప్పేటప్పుడు పెద్దలు ఏమి గుర్తుంచుకుంటారు?

16 తాము ఇతరులకు బుద్ధిచెప్పే పద్ధతి విషయంలో జాగ్రత్త వహించాలని పెద్దలు గుర్తుంచుకుంటారు. వారు పౌలులా దయతో, ప్రేమతో, శ్రద్ధతో వ్యవహరించేందుకు కృషిచేస్తారు. (1 థెస్సలొనీకయులు 2:11, 12 చదవండి.) అదే సమయంలో వారు, ‘హితబోధవిషయమై జనులను హెచ్చరించడానికి నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకొని ఉంటారు.’—తీతు 1:5-9.

17, 18. ఒక పెద్ద మీకు బుద్ధిచెబుతున్నప్పుడు మీరేమి గుర్తుంచుకోవాలి?

17 నిజమే, పెద్దలు అపరిపూర్ణులు కాబట్టి, వారు కూడా కొన్నిసార్లు నోరుజారే అవకాశముంది. (1 రాజు. 8:46; యాకో. 3:8) అంతేకాక, ఆధ్యాత్మిక సహోదర సహోదరీలకు సలహా తీసుకోవడం ‘దుఃఖకరంగా ఉంటుంది కానీ సంతోషకరంగా ఉండదు’ అని పెద్దలకు తెలుసు. (హెబ్రీ. 12:11) కాబట్టి, బుద్ధిచెప్పడానికి మీ దగ్గరికి వచ్చేముందు దాని గురించి ఒక పెద్ద ఎంతో ఆలోచించి, ప్రార్థించి ఉంటాడని గుర్తుంచుకోండి. మీకు పెద్దలు బుద్ధి చెబితే వారు చూపించే ప్రేమను, శ్రద్ధను మీరు అర్థం చేసుకుంటారా?

18 ఉదాహరణకు, వైద్యపరంగా అర్థంకాదనిపించిన ఒక రోగం మీకు ఉందని అనుకుందాం. ఒక వైద్యుడు మీ రోగం ఏమిటో గుర్తించి, దాని గురించి మీకు చెబుతాడు. దాన్ని నమ్మడం మీకు కష్టమనిపించవచ్చు. అలా చెప్పినందుకు మీకు డాక్టరుపై కోపం వస్తుందా? లేదు! ఆయన శస్త్రచికిత్స చేయాలని చెప్పినాసరే అది మీ మంచి కోసమేనని దాన్ని అంగీకరిస్తారు కదా? చికిత్స గురించి డాక్టరు చెప్పిన విధానం మీకు నచ్చకపోవచ్చు. అలాగని మీరు చికిత్సను వద్దంటారా? బహుశా అనరు. అలాగే, పెద్దలు బుద్ధిచెప్పే తీరును బట్టి మీరు ఉపదేశాన్ని వినడం మానేయకండి. ఎందుకంటే, మీరు మీ ఆధ్యాత్మికతను ఎలా కాపాడుకోవచ్చో తెలియజేయడానికి యెహోవా, యేసు వారిని ఉపయోగిస్తున్నారు.

పెద్దలను ఏర్పాటు చేసినందుకు యెహోవాకు కృతజ్ఞత చూపించండి

19, 20. ‘మనుష్యుల్లో ఈవులుగా’ ఉన్నవారి పట్ల మీరెలా కృతజ్ఞతను చూపించవచ్చు?

19 ప్రత్యేకంగా మీ కోసమే తయారుచేసిన ఓ బహుమతిని ఎవరైనా ఇస్తే మీరేమి చేస్తారు? దాన్ని ఉపయోగించడం ద్వారా మీరు దాన్ని విలువైనదిగా ఎంచుతున్నారని చూపిస్తారు కదా? యేసుక్రీస్తు ద్వారా యెహోవా మీకోసం ‘మనుష్యుల్లో ఈవులను’ లేక బహుమతులను అనుగ్రహించాడు. వారిచ్చే ప్రసంగాలను శ్రద్ధగా విని వారు చెప్పేవాటిని పాటించడానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఆ ఈవుల పట్ల కృతజ్ఞతను చూపించవచ్చు. కూటాల్లో అర్థవంతమైన వ్యాఖ్యానాలను ఇవ్వడం ద్వారా కూడా మీ కృతజ్ఞతను తెలియజేయవచ్చు. క్షేత్రసేవ వంటివాటిలో పెద్దల నాయకత్వానికి సహకరించండి. ఒకానొక పెద్ద ఇచ్చిన ఉపదేశం వల్ల మీరు ప్రయోజనం పొందితే, ఆ విషయం ఆయనతో ఎప్పుడైనా చెప్పారా? చెప్పి చూడండి. అంతేకాక, పెద్దల కుటుంబాలను ఎప్పుడైనా మెచ్చుకున్నారా? ఎందుకంటే, సంఘంలో ఒక పెద్ద కష్టపడి పని చేయాలంటే ఆయన కుటుంబ సభ్యులు ఆయనతో గడిపే అవకాశమున్న సమయాన్ని త్యాగం చేస్తున్నారని గుర్తుంచుకోండి.

20 అవును, ఎంతో ‘ప్రయాసపడుతూ,’ ‘పైవారిగా’ ఉంటూ మనకు ‘బుద్ధిచెబుతున్న’ పెద్దల పట్ల కృతజ్ఞత చూపించేందుకు మనకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ‘మనుష్యుల్లో ఈవులైన’ వీరిని యెహోవా నిజంగా చాలా ప్రేమతో ఏర్పాటు చేశాడు.

మీకు జ్ఞాపకమున్నాయా?

• సంఘంలో నాయకత్వం వహిస్తున్న పెద్దల పట్ల కృతజ్ఞత చూపించడానికి థెస్సలొనీకలోని క్రైస్తవులకు ఏ కారణాలున్నాయి?

• మీ సంఘ పెద్దలు మీకోసం ఎలా ప్రయాసపడుతున్నారు?

• మీ సంఘంలో నాయకత్వం వహిస్తున్నవారి వల్ల మీరెలా ప్రయోజనం పొందుతున్నారు?

• ఒక పెద్ద మీకు బుద్ధిచెప్పినప్పుడు మీరేమి గుర్తుంచుకోవాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[27వ పేజీలోని చిత్రం]

ఎన్నో విధాలుగా పెద్దలు సంఘాన్ని కాస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారా?