కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిలు జీవితాలను మారుస్తుంది

తన 60వ పడిలో ఉన్న ఒక స్త్రీ విగ్రహాలను పూజించడం ఎందుకు ఆపేసింది? ఒక షింటో పూజారి, మందిరంలో సేవ మానేసి క్రైస్తవ పరిచారకుడు అయ్యేలా ఆయన్ని ఏది కదిలించింది? పుట్టగానే దత్తత తీసుకోబడిన ఒక స్త్రీ, తనను వదిలేశారన్న ఆలోచనల నుండి ఎలా బయటపడింది? వాళ్ల మాటల్లోనే వినండి.

“నేను ఇప్పుడు దేవునికి ఇష్టమైన విధంగా ఆరాధిస్తున్నాను.”​—ఆబా డాన్సూ

పుట్టిన సంవత్సరం: 1938

దేశం: బెనిన్‌

ఒకప్పుడు: విగ్రహాల్ని పూజించేది

నా గతం: నేను సో-చాహూవె అనే గ్రామంలో పెరిగాను. అది ఒక సరస్సుకు దగ్గర్లోని చిత్తడి ప్రాంతంలో ఉంది. ఆ గ్రామంలో ప్రజలు జీవనోపాధి కోసం చేపలు పట్టడం, ఆవుల్ని, మేకల్ని, గొర్రెల్ని, పందుల్ని, పక్షుల్ని పెంచడం చేస్తుంటారు. ఆ గ్రామంలో రోడ్లు ఉండవు కాబట్టి, ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలంటే పడవల్లో వెళ్తుంటారు. కొంతమంది ఇటుకలతో ఇల్లు కట్టుకుంటారు, కానీ ఎక్కువమంది కలప, గడ్డితోనే ఇళ్లు కట్టుకుంటారు. చాలామంది పేదవాళ్లే. అయినాసరే, నగరాల్లో జరిగినన్ని నేరాలు ఇక్కడ జరగవు.

నా చిన్నప్పుడు మా నాన్న నన్నూ మా అక్కను ఫెటిష్‌ కాన్వెంట్‌కి పంపించాడు. అక్కడే మొదటిసారి మాకు ఆ సాంప్రదాయ మత విశ్వాసం గురించి నేర్పించారు. నేను పెద్దైన తర్వాత, యెరూబా సంస్కృతికి చెందిన డూడూవా (ఓడూడూవా) అనే దేవుణ్ణి పూజించడం మొదలుపెట్టాను. ఆ దేవుని కోసం నేనొక గుడి కట్టి, కందగడ్డలు, పామాయిల్‌, నత్తలు, కోళ్లు, పావురాలు, రకరకాల జంతువులు బలిగా అర్పించేదాన్ని. అవి చాలా ఖరీదైనవి, ఒక్కోసారి నా దగ్గర ఉన్నదంతా పెట్టి వాటిని కొనేదాన్ని.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ... నేను బైబిలు స్టడీ మొదలుపెట్టాక, యెహోవా మాత్రమే ఒకేఒక్క నిజమైన దేవుడని తెలుసుకున్నాను. అంతేకాదు, విగ్రహాలతో ఆరాధించడం ఆయనకు ఇష్టంలేదని కూడా నేర్చుకున్నాను. (నిర్గమకాండం 20:4, 5; 1 కొరింథీయులు 10:14) నేనేం చేయాలో నాకు అర్థమైంది. నా దగ్గరున్న ప్రతిమలన్నిటినీ పారేశాను, విగ్రహపూజకు సంబంధించిన ప్రతీదాన్ని ఇంట్లో నుండి తీసేశాను. శకునాలు చూడడం ఆపేశాను, మా ప్రాంతంలో జరిగే అంత్యక్రియల ఆచారాల్లో, ఇతర ఆచారాల్లో పాల్గొనడం మనేశాను.

అలాంటి మార్పులు చేసుకోవడం, 60వ పడిలో ఉన్న నాకు అంత తేలిక కాదు. నా స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగువాళ్లు నన్ను చాలా ఇబ్బందిపెట్టారు, ఎగతాళి చేశారు. సరైనది చేయడానికి శక్తిని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించాను. సామెతలు 18:10 లోని మాటలు నాకు ఊరటనిచ్చాయి. అక్కడ ఇలా ఉంది: “యెహోవా పేరు బలమైన బురుజు. నీతిమంతుడు దానిలోకి పరుగెత్తి ​సురక్షితంగా ఉంటాడు.”

నాకు సహాయం చేసిన మరో విషయం, యెహోవాసాక్షుల కూటాలకు హాజరవ్వడం. అక్కడ నేను క్రైస్తవ ప్రేమను రుచిచూశాను. వాళ్లు బైబిల్లోని ఉన్నత నైతిక ప్రమాణాలు పాటించడం నాకు బాగా నచ్చింది. యెహోవాసాక్షులు పాటించేది నిజమైన మతమని నాకు నమ్మకం కుదిరింది.

నేనెలా ప్రయోజనం పొందానంటే ... బైబిలు సూత్రాలు పాటించడం వల్ల నా పిల్లలకు మరింత దగ్గరయ్యాను. ఇప్పుడు, నా భుజాల మీది నుండి పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. ప్రాణంలేని, ఏ మేలూ చేయని విగ్రహాల కోసం ఒకప్పుడు నేను ఎంతో ఖర్చుచేశాను. ఇప్పుడు నేను యెహోవాను ఆరాధిస్తున్నాను, ఆయన మన సమస్యలన్నీ శాశ్వతంగా తీసేసే ఏర్పాటు చేశాడు. (ప్రకటన 21:3, 4) నేను ఇప్పుడు దేవునికి ఇష్టమైన విధంగా ఆరాధిస్తున్నాను. విగ్రహాల్ని కాకుండా యెహోవాను ఆరాధిస్తున్నాను! దానివల్ల నిజమైన భద్రతను, కాపుదలను పొందుతున్నాను.

“చిన్నప్పటి నుండి నేను దేవుని కోసం వెదికాను.”​—షింజి శాటో

పుట్టిన సంవత్సరం: 1951

దేశం: జపాన్‌

ఒకప్పుడు: షింటో పూజారి

నా గతం: నేను ఫుకువోకాలోని ఒక చిన్న పట్టణంలో పెరిగాను. మా అమ్మానాన్నలకు దైవభక్తి చాలా ఎక్కువ. వాళ్లు చిన్నప్పటి నుండి నాకు షింటో దేవుళ్లను పూజించడం నేర్పించారు. చిన్నప్పుడే నేను నా విముక్తి గురించి ఆలోచించేవాణ్ణి, కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేయాలనే కోరిక బలంగా ఉండేది. నా చిన్నప్పుడు ఒకసారి మా స్కూల్‌లో టీచరు, మేము పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నామని క్లాసులో పిల్లల్ని అడిగింది. నా తోటివాళ్లకు ఖచ్చితమైన లక్ష్యాలు ఉండేవి, కొంతమంది సైంటిస్ట్‌ అవ్వాలనుకుంటున్నామని చెప్పారు. కానీ నేను మాత్రం దేవుని సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను, దానికి పిల్లలందరూ నవ్వారు.

హైస్కూల్‌ విద్య తర్వాత నేను మత బోధకుల పాఠశాలలో చేరాను. ఆ శిక్షణలో ఒకసారి, నేను ఒక షింటో పూజారిని కలిశాను. అతను ఖాళీ దొరికినప్పుడల్లా, నల్ల అట్ట ఉన్న ఒక పుస్తకం చదివేవాడు. ఒకరోజు అతను నన్ను “శాటో, ఈ పుస్తకం ఏంటో నీకు తెలుసా?” అని అడిగాడు. నేను దాని అట్టను చూశాను కాబట్టి, “బైబిలు” అని చెప్పాను. అప్పుడు అతను, “షింటో పూజారి అవ్వాలనుకునే ప్రతీ ఒక్కరు దీన్ని చదవాలి” అని చెప్పాడు.

నేను వెంటనే వెళ్లి ఒక బైబిలు కొన్నాను. నేను దాన్ని నా పుస్తకాల అరలో మంచి చోట పెట్టి, చాలా జాగ్రత్తగా చూసుకునేవాణ్ణి. అయితే పాఠశాలలో నేను బిజీగా ఉండడంతో దాన్ని చదవడానికి నాకు సమయం ఉండేది కాదు. పాఠశాల కోర్సు అయిపోయాక, ఒక మందిరంలో షింటో పూజారిగా సేవచేయడం మొదలుపెట్టాను. అలా నా చిన్ననాటి కల నెరవేరింది.

అయితే ఒక షింటో పూజారిగా నా జీవితం నేను ఊహించినట్టు లేదని త్వరలోనే అర్థమైంది. చాలామంది పూజారులు వేరేవాళ్లను అస్సలు పట్టించుకునేవాళ్లు కాదు. చాలామందికి దేవుడి మీద విశ్వాసం కూడా ఉండేది కాదు. నా పై స్థానంలో ఉన్న ఒకతను ఒకసారి నాతో ఇలా అన్నాడు: “నువ్వు ఇక్కడ పైకి ఎదగాలి అనుకుంటే, కేవలం తత్వ విషయాల గురించే మాట్లాడాలి. విశ్వాసం గురించి మాట్లాడకూడదు.”

అలాంటి మాటల వల్ల, షింటో మతం పట్ల నాకున్న భ్రమలు తొలిగిపోయాయి. నేను మందిరంలో పూజారిగా సేవ చేస్తూనే ఇతర మతాల గురించి పరిశోధించడం మొదలుపెట్టాను. అయితే, వాటిలో ఏదీ నాకు సంతృప్తి ఇవ్వలేదు. నేను ఎక్కువ మతాల గురించి తెలుసుకునేకొద్దీ, ఎక్కువ నిరుత్సాహానికి గురయ్యాను. ఏ మతంలోనూ సత్యం లేదని నాకు అనిపించింది.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ... నేను 1988 లో ఒక బౌద్ధ మతస్థుణ్ణి కలిశాను, అతను నన్ను బైబిలు చదవమని ప్రోత్సహించాడు. అప్పుడు నాకు, కొన్నేళ్ల క్రితం షింటో పూజారి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నేను ఆ సలహా పాటించాలనుకున్నాను. నేను బైబిలు చదవడం మొదలుపెట్టాను, కొంతకాలానికే దానిలో పూర్తిగా నిమగ్నమైపోయాను. కొన్నిసార్లు రాత్రంతా చదివేవాణ్ణి, అలా చదువుతుండగానే తెల్లారిపోయేది.

నేను చదువుతున్న విషయాలు, బైబిల్లో ఉన్న దేవునికి ప్రార్థించేలా నన్ను కదిలించాయి. నేను మత్తయి 6:9-13 లో ఉన్న మాదిరి ప్రార్థనతో మొదలుపెట్టాను. ప్రతీ రెండు గంటలకు ఒకసారి, చివరికి షింటో మందిరంలో సేవ చేసేటప్పుడు కూడా అలా ప్రార్థించేవాణ్ణి.

నేను చదువుతున్న విషయాల గురించి ఎన్నో ప్రశ్నలు వచ్చేవి. అయితే యెహోవాసాక్షులు ప్రజలకు బైబిలు విషయాలు బోధిస్తారని నాకు తెలుసు. ఎందుకంటే అప్పటికి నాకు పెళ్లయింది, వాళ్లు ఇదివరకు నా భార్యతో బైబిలు గురించి మాట్లాడారు. నేను ఒక యెహోవాసాక్షిని కలిసి, ఆమెను చాలా ప్రశ్నలు అడిగాను. ఆవిడ ప్రతీ ప్రశ్నకు బైబిలు ఉపయోగించి సమాధానం చెప్పడం చూసి ఆశ్చర్యపోయాను. ఆవిడ నాకు బైబిలు స్టడీ ఏర్పాటు చేసింది.

నేను కొద్దికాలానికే యెహోవాసాక్షుల మీటింగ్స్‌కు వెళ్లడం మొదలుపెట్టాను. నేను అప్పట్లో గమనించలేదు గానీ, వాళ్లలో నేను అంతకుముందు దురుసుగా ప్రవర్తించిన కొంతమంది ఉన్నారు. అయినా వాళ్లు ప్రేమతో పలకరించి నన్ను ఆహ్వానించారు.

ఆ మీటింగ్స్‌లో, భర్త తన భార్యాపిల్లల పట్ల ప్రేమ, గౌరవం చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడని నేర్చుకున్నాను. అప్పటివరకు నేను, పూజారిగా నా పనిలో పూర్తిగా మునిగిపోయి, నా భార్యను, ఇద్దరు పిల్లలను అశ్రద్ధ చేశాను. మందిరంలో పూజించడానికి వచ్చేవాళ్లు చెప్పేది శ్రద్ధగా విన్నాను గానీ, నా భార్య ఏం చెప్పాలనుకుంటుందో ఎప్పుడూ వినలేదని గ్రహించాను.

నా స్టడీ కొనసాగుతుండగా, నన్ను యెహోవాకు దగ్గర చేసిన అనేక విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా రోమీయులు 10:13 వంటి కొన్ని వచనాలంటే నాకు చాలా ఇష్టం. ఆ వచనంలో ఇలా ఉంది: “యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.” నేను చిన్నప్పటి నుండి దేవుని కోసం వెదికాను, చివరకు ఇప్పటికి ఆయన్ని తెలుసుకున్నాను!

నేనిక మందిరంలో సేవ చేయలేనని నాకు అనిపించేది. మొదట్లో, నేను షింటో మతాన్ని వదిలేస్తే, వేరేవాళ్లు ఏమనుకుంటారో అని ఎక్కువగా ఆలోచించేవాణ్ణి. అయితే మొదటినుండి, వేరే ఎక్కడైనా సత్యదేవుణ్ణి కనుగొంటే, నా మతాన్ని వదిలేస్తానని మనసులో అనుకునేవాణ్ణి. చివరికి 1989 వసంతకాలంలో, నా మనస్సాక్షి చెప్పినట్లు చేయాలని నిర్ణయించుకున్నాను. నేను మందిరాన్ని వదిలేసి, నా జీవితాన్ని యెహోవాకు అప్పగించాను.

మందిరాన్ని వదిలిపెట్టడం తేలిక అవలేదు. నా పైస్థానంలో ఉన్నవాళ్లు నన్ను తిట్టారు, అక్కడే ఉండమని ఒత్తిడి చేశారు. విషయాన్ని మా అమ్మానాన్నలకు చెప్పడం ఇంకా కష్టమైంది. అది చెప్పడం కోసం వాళ్ల ఇంటికి వెళ్తున్నప్పుడు ఎంత ఆందోళన పడ్డానంటే గుండె దడదడ కొట్టుకుంది, కాళ్లు చచ్చుబడిపోయాయి. దారిలో చాలాసార్లు ఆగి, బలం కోసం యెహోవాకు ప్రార్థించాను.

మా అమ్మానాన్నల ఇంటికి చేరుకున్నప్పుడు, వెంటనే ఆ విషయం చెప్పడానికి చాలా భయపడ్డాను. కొన్ని గంటలు గడిచాయి. చివరికి, చాలా ప్రార్థించాక, మా నాన్నతో విషయం చెప్పాను. నేను సత్యదేవుణ్ణి తెలుసుకున్నానని, ఆయన్ని సేవించడం కోసం షింటో మతాన్ని వదిలేస్తున్నానని చెప్పాను. మా నాన్నకు ఏమనాలో అర్థం కాలేదు, చాలా బాధపడ్డాడు. మా బంధువులు వచ్చి నా మనసు మార్చడానికి ప్రయత్నించారు. మా వాళ్లను బాధపెట్టాలని నాకు లేదు, అదే సమయంలో యెహోవాను సేవించడమే సరైనదని నాకు తెలుసు. కొంతకాలానికి, మా కుటుంబం నా నిర్ణయాన్ని బట్టి నన్ను గౌరవించింది.

నేను మందిరానికి వెళ్లడం అయితే మానేశాను గానీ, దాని గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. పూజారి జీవితానికి నేను బాగా అలవాటు పడిపోయాను. మర్చిపోవడానికి తీవ్రంగా ప్రయత్నించాను, కానీ ఎటుచూసినా నా పాత జీవితపు జ్ఞాపకాలే కనిపించేవి.

వాటిని వదిలించుకోవడానికి నాకు రెండు విషయాలు సహాయం చేశాయి. ఒకటి, నా పాత మతానికి సంబంధించిన వస్తువులు ఏమైనా ఇంట్లో ఉన్నాయేమో అని ఇల్లంతా క్షుణ్ణంగా వెదికాను. తర్వాత వాటన్నిటినీ అంటే పుస్తకాల్ని, చిత్రాల్ని, చివరికి ఖరీదైన జ్ఞాపక చిహ్నాల్ని కూడా కాల్చేశాను. రెండోది, సాక్షులతో సమయం గడపడానికి వీలైనన్ని ఎక్కువ అవకాశాల కోసం వెదికాను. వాళ్ల స్నేహం, మద్దతు నాకెంతో సహాయం చేశాయి. అలా మెల్లమెల్లగా పాత జ్ఞాపకాల నుండి బయటపడ్డాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే ... అంతకుముందు, నేను నా భార్యాపిల్లల్ని అస్సలు పట్టించుకునేవాణ్ణి కాదు, దానివల్ల వాళ్లు చాలా ఒంటరిగా భావించేవాళ్లు. అయితే భర్తలకు బైబిలు చెప్తున్నట్లు, నేను వాళ్లతో సమయం గడపడం మొదలుపెట్టినప్పుడు ఒకరికొకరం బాగా దగ్గరయ్యాం. కొంతకాలానికి, నా భార్య కూడా యెహోవాను సేవించడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేను, నా భార్య, మా అబ్బాయి, మా అమ్మాయి, అల్లుడు అందరం కలిసి సత్యదేవుణ్ణి ఆరాధిస్తున్నాం.

దేవున్ని సేవించాలనే, ప్రజలకు సహాయం చేయాలనే నా చిన్ననాటి కల గురించి ఆలోచిస్తే, నేను కోరుకున్న ప్రతీది నాకు దొరికింది. ఇంకా ఎక్కువే దొరికింది. నేను యెహోవాకు ఎంత రుణపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను.

“నేను ఏదో కోల్పోతున్నాను అనిపించేది.”​—లినెట్‌ హాటింగ్‌

పుట్టిన సంవత్సరం: 1958

దేశం: దక్షిణ ఆఫ్రికా

ఒకప్పుడు: వదిలేయబడ్డాను అనే ఆలోచనలు

నా గతం: నేను గెర్మిస్టన్‌ పట్టణంలో పుట్టాను. అది ఒక మధ్య తరగతి మైనింగ్‌ (గనుల తవ్వకాలు జరిగే) పట్టణం. నేరాలు తక్కువే. నన్ను పెంచే స్తోమత లేదని మా అమ్మానాన్నలు నన్ను దత్తత ఇవ్వాలనుకున్నారు. కేవలం 14 రోజుల పసిబిడ్డగా ఉన్నప్పుడు, ప్రేమగా చూసుకునే ఒక జంటకు నన్ను దత్తత ఇచ్చారు. వాళ్లే మా అమ్మానాన్నలు అని నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నా గతం గురించి నాకు తెలిసిందో, నన్ను వదిలేశారనే ఆలోచనలతో నలిగిపోయాను. నన్ను పెంచిన వాళ్లకు నేను ఏమీ కానని, వాళ్లు నన్ను నిజంగా అర్థం చేసుకోలేదని అనిపించేది.

దాదాపు 16 ఏళ్లప్పుడు నేను కాక్‌టేల్‌ బార్లకు వెళ్లడం మొదలుపెట్టాను. అక్కడ నేను, నా ఫ్రెండ్స్‌ డాన్స్‌ చేస్తూ లైవ్‌ మ్యూజిక్‌ వింటూ ఉండేవాళ్లం. 17 ఏళ్లకు సిగరెట్‌ తాగడం అలవాటైంది. సిగరెట్‌ యాడ్‌లలో చూపించే మోడల్స్‌లా నాకు సన్నగా ఉండాలనిపించేది. నాకు 19 ఏళ్లు వచ్చినప్పుడు జొహన్నస్‌బర్గ్‌లో పనిచేయడం మొదలుపెట్టాను. అక్కడ చెడ్డవాళ్లతో సహవాసం చేయడంవల్ల కొంతకాలానికే బూతులు మాట్లాడడం, విపరీతంగా సిగరెట్లు కాల్చడం, వారాంతాల్లో అతిగా మందు తాగడం అలవాటయ్యాయి.

అయినాసరే నేను చాలా చురుగ్గా ఉండేదాన్ని. క్రమంగా వ్యాయామం చేసేదాన్ని, ఆడవాళ్ల సాకర్‌, ఇతర ఆటలు ఆడేదాన్ని. నా ఉద్యోగంలో కూడా కష్టపడి పనిచేస్తూ కంప్యూటర్‌ రంగంలో మంచి పేరు సంపాదించాను. దానివల్ల నా దగ్గర కావల్సినంత డబ్బు ఉండేది, చాలామంది నేను జీవితంలో పైకి ఎదిగానని అనుకునేవాళ్లు. కానీ నేను జీవితం పట్ల అసంతృప్తితో చాలా బాధగా ఉండేదాన్ని. లోలోపల, నేను ఏదో కోల్పోతున్నాను అనిపించేది.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ... నేను బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాక, యెహోవా ప్రేమగల దేవుడని నేర్చుకున్నాను. ఆయన తన మాటలు ఉన్న బైబిల్ని మనకిచ్చి ఆ ప్రేమ చూపించాడు. మనం సరైన దారిలో నడిచేలా ఆయన వ్యక్తిగతంగా మనకు రాసిన ఉత్తరం లాంటిది బైబిలు. (యెషయా 48:17, 18) యెహోవా ప్రేమతో ఇచ్చే నిర్దేశం నుండి ప్రయోజనం పొందాలంటే, నా జీవితంలో కొన్ని పెద్దపెద్ద మార్పులు చేసుకోవాలని గ్రహించాను.

అందులో ఒకటి, నా స్నేహితుల్ని మార్చుకోవడం. సామెతలు 13:20 లో ఉన్న మాటల గురించి చాలా ఆలోచించాను. అక్కడిలా ఉంది: “తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసేవాడు ​చెడిపోతాడు.” ఆ సూత్రాన్ని పాటిస్తూ, నా పాత స్నేహితుల్ని వదిలేసి యెహోవాసాక్షుల్లో కొత్త స్నేహితుల్ని వెతుక్కున్నాను.

అన్నిటికన్నా పెద్ద మార్పు, సిగరెట్లు మానేయడం. నేను వాటికి పూర్తిగా బానిసనయ్యాను. మెల్లమెల్లగా ఆ అలవాటును కూడా మానుకున్నాను. కానీ దానివల్ల ఇంకో సమస్య తలెత్తింది. సిగరెట్లు మానేయడం వల్ల చాలా బరువు (13.6 కిలోలు) పెరిగాను! నా ఆత్మగౌరవం బాగా దెబ్బతింది, ఆ బరువు తగ్గడానికి నాకు దాదాపు పది సంవత్సరాలు పట్టింది. అయినాసరే, ఆ అలవాటును మానుకోవడమే సరైనదని నాకు తెలుసు. అందుకే సహాయం చేయమని యెహోవాకు చాలా ప్రార్థించాను, ఆయనిచ్చిన శక్తితో ఆ అలవాటు నుండి బయటపడ్డాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే ... ఇప్పుడు నా ఆరోగ్యం మెరుగైంది. సంతృప్తిగా ఉన్నాను. ఉద్యోగం, హోదా, సంపదలు ఇచ్చే పైపై సంతోషం వెంట పరుగులు తీయట్లేదు. బదులుగా, బైబిలు సత్యాల్ని ఇతరులకు నేర్పిస్తూ అందులో సంతోషం పొందుతున్నాను. దానివల్ల గతంలో నాతో కలిసి పనిచేసిన ముగ్గురు ఇప్పుడు నాతో, నా భర్తతో కలిసి యెహోవాను సేవిస్తున్నారు. నన్ను పెంచిన అమ్మానాన్నలు చనిపోకముందు వాళ్లకు బైబిల్లోని వాగ్దానం గురించి చెప్పాను. చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారని, పరదైసులా మారిన భూమిపై జీవిస్తారని చెప్పాను.

యెహోవాకు దగ్గరవ్వడం వల్ల, నన్ను వదిలేశారనే ఆలోచనల నుండి బయటపడ్డాను. ఆయన తన ప్రపంచవ్యాప్త కుటుంబంలోకి నన్ను చేర్చుకొని నాలో ఉన్న అసంతృప్తిని పోగొట్టాడు. అందులో ఇప్పుడు నాకు చాలామంది అమ్మలు, నాన్నలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఉన్నారు.​—మార్కు 10:29, 30.

[చిత్రం]

యెహోవాసాక్షుల మధ్య క్రైస్తవ ప్రేమను రుచిచూశాను

[చిత్రం]

నేను ఒకప్పుడు పూజలు చేసిన షింటో మందిరం