కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఇచ్చే స్పష్టమైన హెచ్చరికలను మీరు పాటిస్తారా?

యెహోవా ఇచ్చే స్పష్టమైన హెచ్చరికలను మీరు పాటిస్తారా?

యెహోవా ఇచ్చే స్పష్టమైన హెచ్చరికలను మీరు పాటిస్తారా?

“ఇదే త్రోవ దీనిలో నడువుడి.”—యెష. 30:21.

1, 2. సాతాను ఏమి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు? దేవుని వాక్యం మనకెలా సహాయం చేస్తుంది?

 తప్పు సైన్‌బోర్డు వల్ల మనం తప్పుదారిలో వెళ్లే అవకాశం ఉంది. అది ప్రమాదకరం కూడా కావచ్చు. అజాగ్రత్తగా ఉన్న ప్రయాణికులను తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో ఒక చెడ్డ వ్యక్తి సైన్‌బోర్డును మార్చాడని మీ స్నేహితుడు మిమ్మల్ని హెచ్చరించాడనుకోండి. ఆ హెచ్చరికను మీరు పట్టించుకోరా?

2 మన శత్రువైన సాతాను ఆ చెడ్డ వ్యక్తిలాంటివాడే. ఎలాగైనా మనల్ని తప్పుదారి పట్టించాలని సాతాను గట్టిగా నిర్ణయించుకున్నాడు. (ప్రక. 12:9) ముందటి ఆర్టికల్‌లో మనం చూసిన ప్రమాదాలన్నిటికీ అతడే కారకుడు. నిరంతర జీవితానికి నడిపించే దారి నుండి మనల్ని పక్కకు మళ్లించాలనేదే అతడి ఉద్దేశం. (మత్త. 7:13, 14) అయితే, సాతాను తంత్రాల గురించి మన స్నేహితుడైన యెహోవా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడని కూడా మనం తెలుసుకున్నాం. మనల్ని మోసం చేయడానికి సాతాను ఉపయోగించే మరో మూడు తంత్రాల గురించీ వాటికి దూరంగా ఉండడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుందనే దాని గురించీ ఇప్పుడు చూద్దాం. మనం బైబిలు చదువుతున్నప్పుడు, యెహోవా మన వెనకాలే ఉంటూ “ఇదే త్రోవ దీనిలో నడువుడి” అని చెబుతున్నట్లు ఊహించుకోవచ్చు. (యెష. 30:21) యెహోవా ఇచ్చే స్పష్టమైన హెచ్చరికల గురించి లోతుగా ఆలోచిస్తే ఆయన చెప్పినట్లే చేయాలనే కోరిక బలపడుతుంది.

‘అబద్ధ బోధకులను’ అనుసరించకండి

3, 4. (ఎ) అబద్ధ బోధకులు ఎండిన బావుల్లా ఉన్నారని ఎలా చెప్పవచ్చు? (బి) అబద్ధ బోధకులు ఎక్కడనుండి వస్తారు? వారికి ఏమి కావాలి?

3 మీరు ఒక ఎడారిగుండా ప్రయాణిస్తున్నట్లు ఊహించుకోండి. కొంత దూరంలో మీకు ఒక బావి కనిపించింది. దాహం తీర్చుకునేందుకు కొన్ని నీళ్లు తెచ్చుకుందామని మీరు దాని దగ్గరకు వెళ్లారు. తీరా అక్కడకు వెళ్లి చూస్తే అది ఎండిన బావి. మీరెంతో నిరాశపడతారు. అబద్ధ బోధకులు ఎండిన బావుల్లాంటివారు. సత్యం అనే నీళ్ల కోసం వారి దగ్గరకు వెళ్లే వారందరూ ఎంతో నిరాశపడతారు. అపొస్తలులైన పౌలు పేతురుల ద్వారా అబద్ధ బోధకుల గురించి యెహోవా మనల్ని హెచ్చరించాడు. (అపొస్తలుల కార్యములు 20:29, 30; 2 పేతురు 2:1-3 చదవండి.) ఇంతకీ అబద్ధ బోధకులు ఎవరు? వారు ఎక్కడనుండి వస్తారు? వారు ప్రజలను ఎలా మోసం చేస్తారు? ఆ ఇద్దరు అపొస్తలులు రాసిన ప్రేరేపిత మాటల్లో వాటికి జవాబులు ఉన్నాయి.

4 ఎఫెసు సంఘంలోని పెద్దలకు పౌలు ఇలా చెప్పాడు: “వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.” తోటి క్రైస్తవులకు పేతురు ఇలా రాశాడు: “మీలోను అబద్ధబోధకులుందురు.” అంటే, అబద్ధ బోధకులు సంఘంలో నుండే రావచ్చని ఆ మాటలను బట్టి తెలుస్తోంది. వారే మతభ్రష్టులు. a వారికి ఏమి కావాలి? యెహోవా సంస్థను విడిచివెళ్తున్నప్పుడు, “శిష్యులను తమవెంట ఈడ్చుకొని” పోవడమే వారికి కావాల్సింది. ఇక్కడ శిష్యులు అనే పదం యేసు శిష్యులను సూచిస్తోంది. అబద్ధ బోధకులు బయటకు వెళ్లి ఇతరులను శిష్యులనుగా చేసుకునే బదులు క్రీస్తు శిష్యుల్నే తమతోపాటు తీసుకెళ్లాలనుకుంటారు. వారు గొర్రెలను తినేసే ‘క్రూరమైన తోడేళ్లలాంటి’ వారని యేసు చెప్పాడు. సంఘంలోనివారు తమ విశ్వాసాన్ని కోల్పోయి సత్యాన్ని విడిచిపెట్టేలా చేయాలని అబద్ధ బోధకులు కోరుకుంటారు.—మత్త. 7:15; 2 తిమో. 2:17, 18.

5. అబద్ధ బోధకులు ప్రజలను ఎలా మోసం చేస్తారు?

5 అబద్ధ బోధకులు ప్రజలను చాలా తెలివిగా మోసం చేస్తారు. వస్తువులను రహస్యంగా దేశంలోకి తీసుకొచ్చే నేరస్థుల్లా వారు “రహస్యముగా” తప్పుడు ఆలోచనలను సంఘంలోకి తీసుకొస్తారు. మతభ్రష్టులు “కల్పనావాక్యములు” ఉపయోగిస్తారు. అంటే, నేరస్థులు నకిలీ పత్రాలను అసలు పత్రాల్లా చూపించినట్లే మతభ్రష్టులు తమ తప్పుడు ఆలోచనలను సరైనవాటిలా చూపిస్తారు. వారు మోసపూరితమైన బోధలను వ్యాప్తిచేస్తూ తమ ఆలోచనలకు తగినట్లు “లేఖనములను అపార్థము” చేస్తారు. (2 పేతు. 2:1, 3; 3:16) మనకు మంచి చేయాలన్న ఆలోచన కూడా మతభ్రష్టులకు రాదు. వారిని అనుసరిస్తే నిరంతర జీవితానికి నడిపించే దారి నుండి మనం పక్కకు మళ్లిపోతామంతే.

6. అబద్ధ బోధకుల గురించి బైబిలు ఏ స్పష్టమైన ఉపదేశాన్నిస్తోంది?

6 అబద్ధ బోధకుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? వారి విషయంలో మనం ఎలా ఉండాలనే దానిగురించి బైబిలు స్పష్టమైన ఉపదేశాన్నిస్తోంది. (రోమీయులు 16:17, 18; 2 యోహాను 9-11 చదవండి.) “వారిలోనుండి తొలగిపోవుడి” అని అది చెబుతోంది. ఇతర బైబిలు అనువాదాలు ఆ పదబంధాన్ని “వారికి దూరంగా ఉండండి” అని అనువదిస్తున్నాయి. ఆ ప్రేరేపిత ఉపదేశం చాలా స్పష్టంగా ఉంది. ఉదాహరణకు, ప్రమాదకరమైన అంటువ్యాధి సోకిన ఒక రోగి నుండి దూరంగా ఉండమని వైద్యుడు మీకు చెప్పాడనుకోండి. ఆయన హెచ్చరికను మీరు ఖచ్చితంగా పాటిస్తారు ఎందుకంటే, ఆయన మీకలా చెప్పడానికి గల కారణమేమిటో మీకు తెలుసు. అలాగే, మతభ్రష్టులు కూడా “చెడిపోయిన మనస్సు” గలవారు లేదా మానసిక రోగులు. తమ తప్పుడు బోధలతో ఇతరులకు ఆ వ్యాధిని అంటించడానికి చూస్తారు. (1 తిమో. 6:3-5) వారికి దూరంగా ఉండమని గొప్ప వైద్యుడైన యెహోవా చెబుతున్నాడు. ఆయన ఎందుకు అలా చెప్పాడో మనకు తెలుసు. కానీ, ఆ హెచ్చరికను అన్ని సందర్భాల్లో పాటించాలని మనం గట్టిగా నిర్ణయించుకున్నామా?

7, 8. (ఎ) అబద్ధ బోధకులకు దూరంగా ఉండడమంటే ఏమిటి? (బి) అబద్ధ బోధకుల మాటలను నమ్మవద్దని మీరెందుకు గట్టిగా నిర్ణయించుకున్నారు?

7 అబద్ధ బోధకులకు దూరంగా ఉండాలంటే మనం వారిని మన ఇంట్లోకి రానివ్వకూడదు, వారిని పలకరించకూడదు. అంతేకాక మనం వారి పుస్తకాలను చదవకూడదు, టీవీలో వారి కార్యక్రమాలను చూడకూడదు, ఇంటర్నెట్‌లో వారు రాసేది చదవకూడదు లేదా దానిలో వారు రాసిన దానికి మన వ్యాఖ్యానాలను చేర్చకూడదు. మనం అంత స్థిరంగా ఉండడానికి గల కారణమేమిటి? ప్రేమే. మనం ‘సత్య దేవుడైన యెహోవాను’ ప్రేమిస్తాం కాబట్టి ఆయన ఇచ్చిన సత్య వాక్యానికి విరుద్ధంగా ఉన్న వంకర బోధలను ఇష్టపడం. (కీర్త. 31:5; యోహా. 17:17) అంతేకాక, పులకరింపజేసే సత్యాలను అంటే యెహోవా పేరుకున్న అర్థం, భూమిపట్ల ఆయన ఉద్దేశం, చనిపోయినవారి స్థితి, పునరుత్థానం వంటి వాటి గురించి బోధించిన ఆయన సంస్థను మనం ప్రేమిస్తాం. వాటిని, అలాంటి ఇతర విలువైన సత్యాలను మొదటిసారి తెలుసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో గుర్తుచేసుకోగలరా? మరైతే, అలాంటి సత్యాలను బోధించిన సంస్థకు ఎదురుతిరిగేలా చేసే అబద్ధ బోధకుల మాటలను నమ్మకండి.—యోహా. 6:66-69.

8 అబద్ధ బోధకులు ఏమి చెప్పినా సరే మనం మాత్రం వారిని అనుసరించం. కేవలం మోసగించి, నిరాశకు గురిచేసే అలాంటి ఎండిన బావుల దగ్గరకు మనం ఎందుకు వెళ్లాలి? అందుకే, ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యంలోని స్వచ్ఛమైన, ఉత్తేజకరమైన సత్యాలతో మన దాహాన్ని తీరుస్తున్న యెహోవా సంస్థకూ ఆయనకూ నమ్మకంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుందాం.—యెష. 55:1-3; మత్త. 24:45-47.

‘కల్పనాకథలను’ అనుసరించకండి

9, 10. “కల్పనాకథల” గురించి తిమోతికి పౌలు ఏ హెచ్చరికను ఇచ్చాడు? పౌలు వేటి గురించి మాట్లాడివుంటాడు? (అధస్సూచి కూడా చూడండి.)

9 సైన్‌బోర్డును ఎవరో మార్చారని, అది తప్పుగా చూపిస్తోందని గుర్తించడం కొన్నిసార్లు చాలా కష్టం. సాతాను తంత్రాల విషయంలో కూడా అంతే. అతడు ఉపయోగించే ప్రమాదకరమైన తంత్రాల్లో “కల్పనాకథలు” కూడా ఉన్నాయని అపొస్తలుడైన పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. (1 తిమోతి 1:3, 4 చదవండి.) కల్పనాకథలు అంటే ఏమిటి? వాటికి మనం ఎలా దూరంగా ఉండవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే నిరంతర జీవితానికి నడిపించే దారి నుండి పక్కకు మళ్లకుండా ఉంటాం.

10 పౌలు క్రైస్తవ పెద్ద అయిన తిమోతికి రాసిన మొదటి పత్రికలో కల్పనాకథల గురించిన ఆ హెచ్చరికను ఇచ్చాడు. సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచమని, సహోదర సహోదరీలు యెహోవాపట్ల నమ్మకంగా ఉండేందుకు సహాయం చేయమని పౌలు తిమోతికి చెప్పాడు. (1 తిమో. 1:18, 19) “కల్పనాకథలు” అని అనువదించబడిన గ్రీకు పదానికి “అబద్ధాలు” లేదా “కట్టుకథలు” అని అర్థం. వాస్తవంతో ఏమాత్రం సంబంధం లేని (మతపరమైన) కథలే కల్పనాకథలని ది ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. గతంలో ప్రజాదరణ పొందిన మతపరమైన కట్టుకథలు, ఊహాకల్పనల గురించి పౌలు ఇక్కడ మాట్లాడివుండవచ్చు. b అలాంటి కథలు కేవలం అర్థంలేని పరిశోధనకు నడిపించే, సమయాన్ని వృథా చేసే ప్రశ్నలను లేవదీస్తాయి. పచ్చి మోసగాడైన సాతాను అజాగ్రత్తపరులను పక్కదారి పట్టించడానికి మతసంబంధమైన అబద్ధాలను, దేవుడు లేడని చెప్పే కట్టుకథలను ఉపయోగిస్తాడు. అందుకే కల్పనాకథలకు దూరంగా ఉండమని పౌలు స్పష్టంగా చెప్పాడు.

11. ప్రజలను మోసం చేయడానికి సాతాను అబద్ధమతాన్ని తెలివిగా ఉపయోగిస్తున్నాడని ఎలా చెప్పవచ్చు? ఏ హెచ్చరికను పాటిస్తే మోసపోకుండా ఉంటాం?

11 అజాగ్రత్తపరులను తప్పుదారి పట్టించగల కల్పనాకథలు ఏవి? ‘సత్యానికి చెవినివ్వకుండా’ చేసే అంటే సత్యాన్ని వినకుండా చేసే ఎలాంటి మతసంబంధమైన బోధైనా సరే అది కల్పనాకథే. (2 తిమో. 4:3, 4) “వెలుగు దూత” వేషం వేసుకున్న సాతాను చాలా తెలివిగా అబద్ధమతాన్ని ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నాడు. (2 కొరిం. 11:14) ఉదాహరణకు, నామకార్థ క్రైస్తవ మతాలు తాము క్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకుంటారు కానీ త్రిత్వం, నరకాగ్ని, అమర్త్యమైన ఆత్మ వంటి అబద్ధాలను బోధిస్తారు. అంతేకాక క్రిస్మస్‌, ఈస్టర్‌ వంటి పండుగలను దేవుడు ఇష్టపడతాడని వారు అనుకుంటారు. కానీ అలాంటి పండుగల్లో ప్రజలు చేసేవి నిజానికి అబద్ధ మతాల నుండి వచ్చాయి. అయితే అబద్ధ మతానికి దూరంగా ఉండమని, ‘అపవిత్రమైనదాన్ని ముట్టవద్దని’ దేవుడు ఇచ్చే హెచ్చరికను పాటిస్తే కల్పనాకథల వల్ల మోసపోకుండా ఉంటాం.—2 కొరిం. 6:14-18.

12, 13. (ఎ) సాతాను ఎలాంటి అబద్ధాలను వ్యాప్తి చేశాడు? వాటి గురించిన నిజాలేమిటి? (బి) మనం కల్పనాకథల వల్ల మోసపోకుండా ఎలా ఉండవచ్చు?

12 సాతాను ఇతర అబద్ధాలను కూడా వ్యాప్తి చేస్తున్నాడు. మనం జాగ్రత్తగా లేకపోతే వాటివల్ల మోసపోతాం. అలాంటి కొన్ని అబద్ధాల గురించి ఇప్పుడు చూద్దాం. మొదటి అబద్ధం: మీకు ఏదనిపిస్తే అదే చేయవచ్చు. తప్పొప్పులను మీరే నిర్ణయించుకోండి. ఇది టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో, పత్రికల్లో, ఇంటర్నెట్‌లో ఎక్కువగా ప్రచారం చేయబడుతోంది. అలాంటి మాటలను పదేపదే వింటుంటాం కాబట్టి మనం కూడా అలాగే ఆలోచిస్తూ లోకంలోని అనైతిక ఆలోచనలను అనుసరించే ప్రమాదం ఉంది. కానీ నిజమేమిటంటే, ఏది తప్పో ఏది ఒప్పో దేవుడే మనకు చెప్పాలి. (యిర్మీ. 10:23) రెండవ అబద్ధం: భూమికి సంబంధించిన విషయాల్లో దేవుడు అస్సలు జోక్యం చేసుకోడు. ఈ అబద్ధం వల్ల ప్రజలు కేవలం నేటి గురించే ఆలోచిస్తున్నారు. భవిష్యత్తు గురించి గానీ, దేవుణ్ణి సంతోషపెట్టడం గురించి గానీ వారు ఆలోచించడం లేదు. మెల్లగా మనం కూడా వారిలా ఆలోచించడం మొదలుపెట్టి, దేవుని సేవలో ‘సోమరులం లేదా నిష్ఫలులం’ అయ్యే ప్రమాదం ఉంది. (2 పేతు. 1:8) కానీ నిజమేమిటంటే యెహోవా దినం త్వరలోనే రాబోతోంది కాబట్టి మనం దానికోసం కనిపెట్టుకొని ఉండాలి. (మత్త. 24:44) మూడవ అబద్ధం: దేవునికి మీపై శ్రద్ధ లేదు. ఈ అబద్ధాన్ని నమ్మడం వల్ల, మనం దేవుని ప్రేమకు అనర్హులమనుకుని ఆయనను సేవించడం మానేసే ప్రమాదం ఉంది. కానీ నిజమేమిటంటే, యెహోవా తన సేవకుల్లో ప్రతీ ఒక్కరిని ప్రేమిస్తాడు, వారిని ఎంతో విలువైనవారిగా ఎంచుతాడు.—మత్త. 10:29-31.

13 సాతాను లోకంలోని ప్రజల్లా ఆలోచించకుండా మనం ఎల్లప్పుడూ జాగ్రత్తపడాలి. ఎందుకంటే కొన్నిసార్లు వారి మాటలు, ఆలోచనలు సరైనవిగానే కనిపించవచ్చు. అయితే, మోసం చేయడంలో సాతాను దిట్ట అని మనం గుర్తుంచుకోవాలి. సాతాను వ్యాప్తిచేసే కల్పనాకథల వల్ల మనం మోసపోకుండా ఉండాలంటే దేవుని వాక్యంలోని హెచ్చరికలను తప్పకుండా పాటించాలి.—2 పేతు. 1:16.

“సాతానును” అనుసరించకండి

14. కొందరు యౌవనస్థులైన విధవరాండ్రను పౌలు ఏమని హెచ్చరించాడు? ఆయన మాటలను మనందరం ఎందుకు పాటించాలి?

14 ఒక సైన్‌బోర్డు మీద, “సాతానును అనుసరించాలంటే ఈ దారిలో వెళ్లండి” అని రాసివుంది అనుకోండి. క్రైస్తవులెవరూ ఆ దారిన వెళ్లాలనుకోరు. అయినా, వారు సరైన “త్రోవనుండి తొలగిపోయి సాతానును” వెంబడించేలా చేసే అనేక మార్గాల గురించి పౌలు హెచ్చరించాడు. (1 తిమోతి 5:11-15 చదవండి.) పౌలు ఆ మాటలను కొందరు “యౌవనస్థులైన విధవరాండ్రను” ఉద్దేశించి చెప్పినా అందులోని సూత్రాలు మనందరికీ వర్తిస్తాయి. మొదటి శతాబ్దంలోని ఆ క్రైస్తవ స్త్రీలు తాము సాతానును అనుసరిస్తున్నామని అనుకుని ఉండకపోవచ్చు, కానీ వారు అదే చేస్తున్నారని వారి ప్రవర్తన చూపించింది. మనకు తెలియకుండానే సాతానును అనుసరించే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదాల్లో ఒకటి ఇతరుల గురించి చెడుగా చెప్పడం. దాన్నుండి మనమెలా దూరంగా ఉండవచ్చు? ఈ విషయంలో పౌలు ఇచ్చిన హెచ్చరికను ఇప్పుడు పరిశీలిద్దాం.

15. సాతాను లక్ష్యం ఏమిటి? అతడి తంత్రాల గురించి పౌలు ఏమి చెప్పాడు?

15 మన నమ్మకాల గురించి మనం ఇతరులతో మాట్లాడడం సాతానుకు ఇష్టం లేదు. మన ప్రకటనా పనిని ఆపేయాలని అతడు కోరుకుంటున్నాడు. (ప్రక. 12:17) అందుకోసం అతడు మన సమయాన్ని వృథా చేసే లేదా మనలో విభేదాలు కలుగజేసే వాటిని మనం అనుసరించేలా చేస్తాడు. సాతాను తంత్రాల గురించి పౌలు ఏమి చెప్పాడో గమనించండి: ‘ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాండ్రగుదురు.’ ఆ విధవరాండ్రు తమ స్నేహితులను కలిసి అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ ఎక్కువ సమయాన్ని వృథా చేసేవారు. అయితే మనం వారిలా చేయకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు, అనవసరమైన లేదా అవాస్తవమైన విషయాల గురించి ఈ-మెయిల్స్‌, మెసేజ్‌లు పంపుతూ చదువుతూ, వాటి గురించి మాట్లాడడానికి ఫోను చేస్తూ లేదా నేరుగా కలుస్తూ మన సమయాన్ని, ఇతరుల సమయాన్ని ఎంతగానో వృథా చేసే అవకాశం ఉంది. అంతేకాక, ఆ విధవరాండ్రు “వదరుబోతులు” అని కూడా పౌలు అన్నాడు. వదరుబోతులు కొన్నిసార్లు ఇతరుల గురించి చెడుగా మాట్లాడతారు. అది ప్రమాదకరం, ఎందుకంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం కొన్నిసార్లు కొండెములకు అంటే ఇతరుల గురించి అబద్ధాలు చెప్పడానికి దారితీయవచ్చు. దానివల్ల ప్రజల్లో విభేదాలు కలుగుతాయి. (సామె. 26:20) వారు గుర్తించినా గుర్తించకపోయినా కొండెములు చెప్పేవారు అపవాదియైన సాతానును అనుసరిస్తున్నారు. c అంతేకాక, ఆ విధవరాండ్రు “పరులజోలికి పోవువారు” అని కూడా పౌలు అన్నాడు. ఎలా జీవించాలో ఇతరులకు చెప్పడానికి వారు ప్రయత్నించేవారు. అలా చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. ఈ ప్రమాదాలన్నీ యెహోవా మనకిచ్చిన ప్రాముఖ్యమైన పని గురించి మనం ఆలోచించకుండా చేస్తాయి. మనం దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి మన సమయాన్ని ఉపయోగించాలి. ఒకవేళ మనం ప్రకటించడం మానేస్తే సాతానును అనుసరించడం మొదలుపెడతాం. అయితే మనం ఇటు యెహోవాను అటు సాతానును అనుసరించడం కుదరదని గుర్తుంచుకోవాలి.—మత్త. 12:30.

16. సరైన “త్రోవనుండి తొలగిపోయి సాతానును” అనుసరించే ప్రమాదానికి గురికాకుండా ఉండాలంటే మనం ఏ సలహాను పాటించాలి?

16 సరైన “త్రోవనుండి తొలగిపోయి సాతానును” అనుసరించే ప్రమాదానికి గురికాకుండా ఉండాలంటే మనం బైబిలు సలహాను పాటించాలి. పౌలు ఇచ్చిన కొన్ని జ్ఞానయుక్తమైన ఉపదేశాలను చూడండి. ‘ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి.’ (1 కొరిం. 15:58) మనం రాజ్య కార్యకలాపాల్లో నిమగ్నమైతే ఖాళీగా ఉండము, సమయాన్ని వృథా చేసే పనులు చేయము. (మత్త. 6:33) “క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి.” (ఎఫె. 4:29) ఎవరైనా ఇతరుల గురించి చెడుగా చెప్తున్నప్పుడు వినకూడదని, దాన్ని వ్యాప్తి చేయకూడదని గట్టిగా నిర్ణయించుకోండి. d తోటి విశ్వాసులపై నమ్మకాన్ని, గౌరవాన్ని వృద్ధిచేసుకోండి. అలాచేస్తే మనం ఎల్లప్పుడూ ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేసే వాటి గురించే మాట్లాడాలనుకుంటాం. ‘మీ సొంత కార్యాలను జరుపుకోవడంలో ఆశ కలిగివుండండి.’ (1 థెస్స. 4:10, 11) ఇతరులపట్ల శ్రద్ధ చూపించండి కానీ, వారి గౌరవం దెబ్బతినేలా వ్యక్తిగత విషయాల్లో కలుగజేసుకోకండి. వారు సొంతగా నిర్ణయించుకోవాల్సిన విషయాల్లో తలదూర్చి మన అభిప్రాయాల్ని వారిపై రుద్దకూడదని గుర్తుంచుకోండి.—గల. 6:5.

17. (ఎ) మనం అనుసరించకూడనివాటి గురించి యెహోవా ఎందుకు హెచ్చరిస్తున్నాడు? (బి) యెహోవా చూపిస్తున్న దారి విషయంలో మీరు ఏమని నిర్ణయించుకున్నారు?

17 మనం వేటిని అనుసరించకూడదో స్పష్టంగా చెబుతున్నందుకు యెహోవాకు ఎంతో రుణపడివున్నాం. అయితే, ముందటి ఆర్టికల్‌లో అలాగే ఈ ఆర్టికల్‌లో ఉన్న యెహోవా హెచ్చరికలు ఆయనకు మనపై ఉన్న గొప్ప ప్రేమకు రుజువని అస్సలు మర్చిపోకండి. మనం సాతాను చేతుల్లో మోసపోకూడదని, బాధపడకూడదని యెహోవా కోరుకుంటున్నాడు. యెహోవా మనకు చూపిస్తున్న దారి కొంచెం ఇరుకుగా ఉండవచ్చు కానీ, ఆ దారి మాత్రమే నిరంతర జీవితానికి నడిపిస్తుంది. (మత్త. 7:13, 14) “ఇదే త్రోవ దీనిలో నడువుడి” అని యెహోవా ఇస్తున్న నిర్దేశాన్ని ఎల్లప్పుడూ పాటించాలని గట్టిగా నిర్ణయించుకుందాం.—యెష. 30:21.

[అధస్సూచీలు]

a సత్యారాధనకు ఎదురుతిరిగి దాన్ని విడిచిపెట్టడమే “మతభ్రష్టత్వం.”

b సుమారు సా.శ.పూ. మూడవ శతాబ్దంలో రాయబడిన తోబీతు (తోబియా) అనే పుస్తకం బైబిల్లోనిదని కొంతమంది అనుకుంటారు. పౌలు కాలంలో ఉన్న కట్టుకథల్లో అది కూడా ఒకటి. దాని నిండా తప్పుడు నమ్మకాలు, ఇంద్రజాలానికి సంబంధించిన కథలు ఉన్నాయి. అది అర్థంపర్థంలేని కథలను నిజమైనవన్నట్లు చూపిస్తుంది.—లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) 1వ సంపుటిలోని 122వ పేజీ చూడండి.

c “అపవాది” అని అనువదించబడిన గ్రీకు పదానికి “ఇతరులకు హాని చేయాలనే ఉద్దేశంతో వారి గురించి అబద్దాలు చెప్పేవాడు” అని అర్థం. ఇది మొట్టమొదట అబద్ధం చెప్పిన సాతానుకు మరో బిరుదుగా ఉపయోగించబడుతుంది.—యోహా. 8:44; ప్రక. 12:9, 10.

d గాల్లోకి ఈకలను వెదజల్లడం” అనే బాక్సు చూడండి.

మీ జవాబు ఏమిటి?

కింది లేఖనాల్లోని హెచ్చరికలను మీరెలా పాటించవచ్చు?

2 పేతురు 2:1-3

1 తిమోతి 1:3, 4

1 తిమోతి 5:11-15

[అధ్యయన ప్రశ్నలు]

[19వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

 గాల్లోకి ఈకలను వెదజల్లడం

ఇతరుల గురించి చెడుగా చెప్పడం వల్ల వచ్చే చెడు ఫలితాలను ఒక ప్రాచీన యూదుల కథ చక్కగా వివరిస్తోంది. దాన్ని ప్రజలు ఎన్నో రకాలుగా చెప్పినా దాని సారాంశం మాత్రం ఇలా ఉంది:

ఒకానొక పట్టణంలో ఒక జ్ఞానవంతుడు ఉండేవాడు. అదే పట్టణంలో ఉండే మరో వ్యక్తి ఆయన గురించి చెడు విషయాలను పట్టణమంతటా వ్యాప్తిచేశాడు. కొంతకాలానికి, ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకొని క్షమాపణ అడగడానికి ఆ జ్ఞానవంతుని దగ్గరకు వెళ్లి, తన తప్పు దిద్దుకోవడానికి ఆయన ఏమి చెబితే అది చేస్తానన్నాడు. దానికి ఆ జ్ఞానవంతుడు అతనితో, ఒక సంచి నిండా ఈకలు తీసుకొని వాటిని గాల్లోకి వెదజల్లమని చెప్పాడు. ఆయన ఎందుకు అలా చెప్పాడో ఆ వ్యక్తికి అర్థం కాకపోయినా ఆయన చెప్పినట్లే చేసి ఆయన దగ్గరకు తిరిగి వచ్చి,

“ఇప్పుడు మీరు నన్ను క్షమించినట్లేనా?” అని అడిగాడు.

దానికి జ్ఞానవంతుడు, “ముందు వెళ్లి ఆ ఈకలన్నిటినీ ఏరి తీసుకురా” అని చెప్పాడు.

“వాటిని ఇప్పుడు ఎలా తీసుకురాగలను? అవి ఎప్పుడో గాల్లో ఎగిరిపోయాయి కదా” అని ఆ వ్యక్తి అన్నాడు.

“ఇప్పుడు ఆ ఈకలను తేవడం ఎంత కష్టమో నీ మాటలవల్ల కలిగిన నష్టాన్ని పూరించడం కూడా అంతే కష్టం” అని ఆ జ్ఞానవంతుడు అన్నాడు.

ఈ కథలోని పాఠం ఏమిటో మనకు స్పష్టంగా అర్థమౌతోంది. ఒకసారి మాట్లాడిన తర్వాత మన మాటల్ని వెనక్కు తీసుకోలేం. అంతేకాక, వాటివల్ల జరిగిన నష్టాన్ని పూరించలేం. ఇతరుల గురించి ఏదైనా చెడు విషయాన్ని వ్యాప్తి చేసే ముందు, మనం గాల్లోకి ఈకలను వెదజల్లబోతున్నామని గుర్తుంచుకోవడం మంచిది.

[16వ పేజీలోని చిత్రం]

కొందరు ఎలా మతభ్రష్టులను తమ ఇళ్లల్లోకి ఆహ్వానిస్తారు?