కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాను మీ స్వాస్థ్యంగా చేసుకుంటున్నారా?

యెహోవాను మీ స్వాస్థ్యంగా చేసుకుంటున్నారా?

యెహోవాను మీ స్వాస్థ్యంగా చేసుకుంటున్నారా?

“మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”—మత్త. 6:33.

1, 2. (ఎ) గలతీయులు 6:16లో ప్రస్తావించబడిన “దేవుని ఇశ్రాయేలు” ఎవరు? (బి) మత్తయి 19:28లో, “ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారు” ఎవరిని సూచిస్తున్నారు?

 బైబిల్లో ఇశ్రాయేలు అనే మాట చదివినప్పుడు వెంటనే మీకు ఎవరు గుర్తొస్తారు? ఇస్సాకు కుమారుడైన యాకోబుకు ఇశ్రాయేలు అని పేరు పెట్టబడింది కాబట్టి ఆయన గుర్తొస్తాడా? లేదా ఆయన సంతానమైన ప్రాచీన ఇశ్రాయేలు జనాంగం గుర్తొస్తుందా? బైబిలు ఆధ్యాత్మిక ఇశ్రాయేలు లేదా “దేవుని ఇశ్రాయేలు” గురించి కూడా చెబుతోంది. వాళ్ళు 1,44,000 మంది, పరలోకంలో రాజులుగా, యాజకులుగా ఉండడానికి దేవుడు వాళ్ళను పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. (గల. 6:16; ప్రక. 7:4; 21:12) ఇశ్రాయేలు అనే పేరు మరో ప్రత్యేకమైన విధంగా కూడా ఉపయోగించబడింది. దాని గురించి మత్తయి 19:28లో చూడవచ్చు.

2 యేసు ఇలా చెప్పాడు, “(ప్రపంచ) పునర్జననమందు మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.” ఈ వచనంలో, “ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారు” పరదైసు భూమిపై నిత్యం జీవించేవాళ్ళను సూచిస్తున్నారు. 1,44,000 మంది వాళ్ళకు తీర్పుతీరుస్తారు, యాజకులుగా సేవ చేస్తారు.

3, 4. నమ్మకస్థులైన అభిషిక్తులు ఎలాంటి మంచి మాదిరిని ఉంచారు?

3 అప్పట్లో యాజకులు, లేవీయులు యెహోవా సేవను ఎంతో అమూల్యమైనదిగా ఎంచేవాళ్ళు, ఇప్పుడు అభిషిక్తులు కూడా అలాగే ఎంచుతారు. (సంఖ్యా. 18:20) అభిషిక్తులు ఈ భూమ్మీద తమకు కొంత స్థలం స్వాస్థ్యంగా లభించాలని ఆశించరు కానీ ప్రకటన 4:10, 11 చూపిస్తున్నట్లుగా పరలోకంలో యెహోవా సేవ చేస్తూనే ఉంటారు. అక్కడ వాళ్ళు యేసుక్రీస్తుతో పాటు రాజులుగా, యాజకులుగా ఉంటారు.—యెహె. 44:28.

4 అభిషిక్తులు భూమ్మీద ఉన్నంతకాలం యెహోవాయే తమ స్వాస్థ్యమని చూపించే విధంగా జీవించాలి. దేవుని సేవే వాళ్ళకు ఎంతో ప్రాముఖ్యమైనది. “మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి” అని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (2 పేతు. 1:10) క్రీస్తు విమోచన క్రయధన బలిపై విశ్వాసం ఉంచి, ఆయనను అనుసరిస్తూ ఉండడం ద్వారా అభిషిక్తులు తమ పిలుపును నిశ్చయం చేసుకుంటారు. వాళ్ళకు వేర్వేరు సామర్థ్యాలు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అయినా వాళ్ళు దేవుని సేవ ఎక్కువగా చేయకుండా ఉండడానికి తమ పరిమితుల్ని సాకుగా ఉపయోగించరు. బదులుగా వాళ్ళ జీవితాల్లో దేవుని సేవకే మొదటిస్థానం ఇచ్చి, తాము చేయగలిగినదంతా చేస్తారు. వాళ్ళు భూమ్మీద జీవించే నిరీక్షణ ఉన్నవాళ్ళకు మంచి మాదిరిగా ఉన్నారు.

5. క్రైస్తవులందరూ యెహోవాను తమ స్వాస్థ్యంగా ఎలా చేసుకోవచ్చు? అయితే అది ఎందుకు కష్టం?

5 పరలోక నిరీక్షణ ఉన్నా లేదా భూనిరీక్షణ ఉన్నా ప్రతీ క్రైస్తవుడు “తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని” యేసును అనుసరిస్తూ ఉండాలి. (మత్త. 16:24) పరదైసు భూమ్మీద జీవించే నిరీక్షణ ఉన్న లక్షలాదిమంది ఆ విధంగానే దేవుణ్ణి ఆరాధిస్తూ క్రీస్తును అనుసరిస్తున్నారు. వాళ్ళు దేవుని సేవలో ఇంకా ఎక్కువ చేయగలమని గుర్తించినప్పుడు తాము చేస్తున్న కొంచెంతో తృప్తిపడరు. చాలామంది తమ జీవితాల్ని సరళం చేసుకొని క్రమ పయినీరు సేవ చేస్తున్నారు. మరికొంతమంది ప్రతీ సంవత్సరం కొన్ని నెలలు పయినీరు సేవ చేయగలుగుతున్నారు. ఇంకొంతమంది, పయినీరు సేవ చేయలేకపోయినా పరిచర్యలో ఎక్కువ సమయం వెచ్చించడానికి కృషి చేస్తున్నారు. వాళ్ళు యేసుపై సుగంధ తైలాన్ని పోసిన మరియలా ఉన్నారు. ‘ఈమె నా యెడల మంచి కార్యం చేసింది. ఈమె తన శక్తి కొలది చేసింది’ అని యేసు చెప్పాడు. (మార్కు 14:6-8) మనం సాతాను అధీనంలోవున్న లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మన శక్తి కొలది చేయడం మనకు కష్టంగా ఉండవచ్చు. అయినా మనం గట్టిగా కృషి చేయాలి, యెహోవాపై నమ్మకం ఉంచాలి. ఈ విషయంలో మనం చేయాల్సిన నాలుగు పనులను ఇప్పుడు పరిశీలిద్దాం.

దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వండి

6. (ఎ) ప్రస్తుత జీవితమే తమ స్వాస్థ్యమని లోకంలోని ప్రజలు ఎలా చూపిస్తారు? (బి) దావీదు మాదిరిని అనుకరించడం ఎందుకు మంచిది?

6 దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకమని యేసు తన శిష్యులకు నేర్పించాడు. లోకంలోని ప్రజలు సాధారణంగా తమకేది మంచిదనిపిస్తే దాన్నే పొందడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు, ‘ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన లోకులు’ అని బైబిలు చెబుతోంది. (కీర్తన 17:1, 13-15 చదవండి.) వీళ్ళు యెహోవా గురించి అస్సలు ఆలోచించరు. చాలామంది జీవితాన్ని హాయిగా గడుపుతూ, పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ, వాళ్ళ కోసం ఆస్తిపాస్తులు సంపాదించడం గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రస్తుత జీవితమే వాళ్ళ స్వాస్థ్యం. కానీ దావీదు అలా కాదు. ఆయన దేవుని దృష్టిలో “మంచి పేరు” కలిగివుండాలని ఆశించాడు. ఆ తర్వాత కొంతకాలానికి, ఆయన కుమారుడైన సొలొమోను కూడా మనందరం అలాగే చేయాలని చెప్పాడు. (ప్రసం. 7:1) ఆసాపులాగే దావీదుకు కూడా యెహోవా స్నేహితునిగా ఉండడమే మంచిదని తెలుసు. దానివల్ల దావీదు ఎంతో ఆనందాన్ని పొందాడు. మన కాలంలో కూడా చాలామంది క్రైస్తవులు, తమ ఉద్యోగం కన్నా యెహోవా సేవే అత్యంత ప్రాముఖ్యమైనదని చూపించారు.

7. ఒక సహోదరుడు రాజ్యానికి మొదటిస్థానం ఇచ్చినందువల్ల ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందాడు?

7 సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌లో నివసించే జాన్‌క్లోడ్‌ అనే సహోదరుడు సంఘపెద్దగా సేవచేస్తున్నాడు, ఆయనకు ముగ్గురు పిల్లలు. ఆ దేశంలో ఉద్యోగం సంపాదించుకోవడం చాలా కష్టం, చాలామంది తమ ఉద్యోగాన్ని నిలుపుకోవడానికి ఏమి చేయడానికైనా వెనుకాడరు. ఇకపై రాత్రుల్లో పనిచేయడం మొదలుపెట్టాలని వాళ్ళ ప్రొడక్షన్‌ మేనేజరు ఒకరోజు జాన్‌క్లోడ్‌తో చెప్పాడు. అంటే ప్రతిరోజూ సాయంత్రం 6:30కు పని మొదలుపెట్టి, వారంలో అన్ని రోజులూ పని చేయాలి. దానికి జాన్‌క్లోడ్‌, తన కుటుంబ వస్తుపరమైన అవసరాలను చూసుకోవడమే కాక, వాళ్ళకు దేవునితో మంచి సంబంధం ఉండడానికి కూడా తాను సహాయపడాలని ఆయనతో చెప్పాడు. అంతేగాక సంఘంలో కూడా తన అవసరం ఉందని చెప్పాడు. దానికి ఆ మేనేజరు ఇలా అన్నాడు, “నీ ఉద్యోగం ఉండాలంటే నువ్వు అన్నీ మర్చిపో, నీ సమస్యల్నే కాదు చివరికి నీ భార్యాపిల్లల్ని కూడా. పనికే నీ జీవితం అంకితం చేసుకో. ఏది కావాలో తేల్చుకో మతమా, ఉద్యోగమా?” మీకే ఆ పరిస్థితి వస్తే మీరేమి చేసేవాళ్ళు? తన ఉద్యోగం పోయినా దేవుడు తనను చూసుకుంటాడని జాన్‌క్లోడ్‌కు తెలుసు. దేవుని సేవలో ఆయన ఎంతో చేయవచ్చు, ఆయన కుటుంబ వస్తుపరమైన అవసరాలు తీర్చడానికి యెహోవా ఆయనకు సహాయం చేస్తాడు. అందుకే ఆయన తర్వాతి కూటానికి వెళ్ళాడు. ఆ తర్వాత, తన ఉద్యోగం ఉంటుందో లేదో తెలియకపోయినా ఆయన పనికి వెళ్ళేందుకు సిద్ధమయ్యాడు. సరిగ్గా అప్పుడే ఆయనకు ఫోను వచ్చింది. మేనేజరును ఉద్యోగంలో నుండి తీసేశారు, కానీ మన సహోదరుని ఉద్యోగం మాత్రం పోలేదు.

8, 9. యాజకులు, లేవీయులు యెహోవాను తమ స్వాస్థ్యంగా చేసుకున్నట్లు మనమెలా చేసుకోవచ్చు?

8 మీలో కొందరికి అలాంటి పరిస్థితి ఎదురైవుంటుంది. ఉద్యోగం పోతే కుటుంబాన్ని ఎలా పోషించాలా అని మీరు ఆందోళన చెందివుంటారు. (1 తిమో. 5:8) మీకు అలాంటి పరిస్థితి ఎదురైనా, ఎదురు కాకపోయినా, యెహోవాను తమ స్వాస్థ్యంగా చేసుకొని తమ జీవితాల్లో ఆయన సేవకు మొదటిస్థానం ఇచ్చే వాళ్ళను ఆయన నిరాశపర్చడని మీకు తెలిసే ఉంటుంది. రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వమని యేసు తన శిష్యులతో చెప్పినప్పుడు, దేవుడు వాళ్ళకు కావాల్సిన మిగతా వాటన్నిటిని అంటే తినడానికి, తాగడానికి, ధరించడానికి కావాల్సినవాటిని ఇస్తాడని మాటిచ్చాడు.—మత్త. 6:33.

9 భూమిని స్వాస్థ్యంగా పొందని లేవీయుల గురించి ఆలోచించండి. జనాంగాన్నంతటినీ స్వచ్ఛారాధనలో నడిపించడమే వాళ్ళ పని కాబట్టి యెహోవాయే తమ స్వాస్థ్యమని, ఆయనే వాళ్ళ వస్తుపరమైన అవసరాలు తీరుస్తాడని వాళ్ళు నమ్మాలి. (సంఖ్యా. 18:20) యాజకులు, లేవీయులు చేసినట్లు మనం అక్షరార్థమైన ఆలయంలో సేవ చేయకపోయినా వాళ్ళలాగే మనం కూడా యెహోవాపై నమ్మకం ఉంచవచ్చు. అంతం దగ్గరౌతుండగా, దేవుడు మనపట్ల శ్రద్ధ తీసుకుంటాడని నమ్మడం చాలా ప్రాముఖ్యం.—ప్రక. 13:16, 17.

దేవుని నీతికి మొదటిస్థానం ఇవ్వండి

10, 11. కొంతమంది తమ ఉద్యోగం విషయంలో ఎలా యెహోవాపై నమ్మకం ఉంచారు? ఒక ఉదాహరణ చెప్పండి.

10 దేవుని నీతికి మొదటిస్థానం ఇవ్వాలని కూడా యేసు తన శిష్యులతో చెప్పాడు. (మత్త. 6:33) అంటే తప్పొప్పుల విషయంలో యెహోవా అభిప్రాయాన్నే మనం అనుసరిస్తాం గానీ మనుష్యుల అభిప్రాయాన్ని కాదు. (యెషయా 55:8, 9 చదవండి.) గతంలో కొంతమంది పొగాకు పండించి దాని ఉత్పత్తులను అమ్మేవాళ్ళు, యుద్ధం చేయడానికి ఇతరులకు శిక్షణ ఇచ్చేవాళ్ళు, లేదా యుద్ధ సామగ్రి తయారుచేసి వాటిని అమ్మేవాళ్ళు. కానీ సత్యం తెలుసుకున్న తర్వాత చాలామంది వేరే పని చూసుకొని బాప్తిస్మానికి అర్హులయ్యారు.—యెష. 2:4; 2 కొరిం. 7:1; గల. 5:14.

11 ఆండ్రూ అనే సహోదరుడు కూడా అలాగే చేశాడు. ఆయన, ఆయన భార్య యెహోవా గురించి తెలుసుకున్నప్పుడు యెహోవా సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆండ్రూ యుద్ధంతో సంబంధమున్న సంస్థలో పనిచేసేవాడు, ఆయనకు తన ఉద్యోగం అంటే చాలా ఇష్టం కానీ దాన్ని వదిలేశాడు. ఎందుకంటే ఆయన దేవుని నీతికి మొదటిస్థానం ఇవ్వాలనుకున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు, ఉద్యోగం వదిలేసే సమయానికి ఆయన దగ్గర కొన్ని నెలలకు సరిపడేంత డబ్బు మాత్రమే ఉంది. లేవీయుల్లాగే ఆయనకు కూడా స్వాస్థ్యం ఏమీ లేనట్లే కనిపించింది. కానీ ఆయన దేవుని మీద భారం వేసి మరో ఉద్యోగం కోసం వెదికాడు. ఆండ్రూ, ఆయన కుటుంబ సభ్యులు ఆ రోజుల గురించి ఆలోచించినప్పుడు తమ విషయంలో “యెహోవా హస్తము కురుచకాలేదు” అనే మాటలు నెరవేరాయని చెప్పగలుగుతున్నారు. (యెష. 59:1) వాళ్ళు తమ జీవితాన్ని సరళం చేసుకున్నందుకు ఆండ్రూ, ఆయన భార్య పయినీరు సేవ కూడా చేయగలిగారు. కొన్నిసార్లు డబ్బు గురించి, ఇల్లు గురించి, ఆరోగ్యం గురించి, వయసు పైబడడం గురించి చింతించేవాళ్ళమని ఆయన చెబుతున్నాడు. అయితే యెహోవా వాళ్ళను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. యెహోవా సేవ చేయడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పొందామని, అది మానవులు పొందగల గొప్ప ఘనత అని వాళ్ళు నిస్సందేహంగా చెప్పగలరు.—ప్రసం. 12:13.

12. దేవుని నీతికి మొదటిస్థానం ఇవ్వాలంటే ఏ లక్షణం అవసరం? మీ ప్రాంతంలోని అనుభవాలు చెప్పండి.

12 “మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి—ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదు” అని యేసు తన శిష్యులతో చెప్పాడు. (మత్త. 17:20) దేవుని నీతికి మొదటిస్థానం ఇవ్వడం వల్ల కష్టాలు వచ్చినా మీరు అలాగే కొనసాగుతారా? అలా కొనసాగగలమనే నమ్మకం మీకు కుదరకపోతే సంఘంలోని ఇతరులతో మాట్లాడండి. యెహోవా వాళ్ళకు ఎలా సహాయం చేశాడో తెలుసుకుంటే మీ విశ్వాసం ఖచ్చితంగా బలపడుతుంది.

యెహోవా చేసే ఏర్పాట్లకు కృతజ్ఞత చూపించండి

13. యెహోవా సేవలో మరింతెక్కువ చేయడానికి కృషి చేసినప్పుడు మనం ఏ నమ్మకాన్ని కలిగివుండవచ్చు?

13 యెహోవా సేవను మీరు విలువైనదిగా ఎంచితే, ఆయన లేవీయుల అవసరాలు తీర్చినట్లే మీ అవసరాలు కూడా తీరుస్తాడని మీరు నమ్మవచ్చు. ఉదాహరణకు, దావీదు గుహలో దాక్కున్నప్పుడు కూడా దేవుడు తన అవసరాలు తీరుస్తాడని నమ్మాడు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని అనిపించినప్పుడు మనం కూడా యెహోవాపై నమ్మకం ఉంచవచ్చు. అప్పటివరకు తనను నిరుత్సాహపరచిన విషయాన్ని ఆసాపు “దేవుని పరిశుద్ధ స్థలములోనికి” వెళ్ళినప్పుడు బాగా అర్థం చేసుకోగలిగాడని గుర్తుంచుకోండి. (కీర్త. 73:17) ఆసాపులాగే, మనం కూడా యెహోవాతో స్నేహాన్ని కాపాడుకోవడానికి మనకు అవసరమైనదాన్నిచ్చే యెహోవావైపు తిరగాలి. అప్పుడే మన పరిస్థితులు ఎలావున్నా మనం యెహోవా సేవనే విలువైనదిగా ఎంచుతున్నామని చూపిస్తాం. అలా యెహోవాను మన స్వాస్థ్యంగా చేసుకుంటాం.

14, 15. బైబిల్లోని ఏదైనా ఒక లేఖనం గురించిన అవగాహనలో మార్పు వస్తే మనం ఏమి చేయాలి? ఎందుకు?

14 బైబిల్లోవున్న “దేవుని మర్మములను” అర్థం చేసుకోవడానికి ఆయన సహాయం చేస్తున్నప్పుడు మీరు ఆయనపై నమ్మకం ఉంచుతారా? (1 కొరిం. 2:10-13) అలా నమ్మకం ఉంచడంలో అపొస్తలుడైన పేతురు ఎంతో మంచి మాదిరి. యేసు ఒక సందర్భంలో యూదులతో ఇలా చెప్పాడు, “మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.” యేసు ఇక్కడ నిజమైన శరీరం, రక్తం గురించి మాట్లాడుతున్నాడు అనుకొని చాలామంది శిష్యులు ‘ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు?’ అని చెప్పుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ‘వెనుక తీసి’ యేసును వెంబడించడం మానేశారు. కానీ పేతురు “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు” అన్నాడు.—యోహా. 6:53, 60, 66, 68.

15 పేతురుకు యేసు మాటలు పూర్తిగా అర్థం కాలేదు. అయినా సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన యెహోవాపై నమ్మకం ఉంచాడు. బైబిల్లోని ఏదైనా ఒక లేఖనం గురించిన అవగాహనలో మార్పు వస్తే, దానికి గల కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామా? (సామె. 4:18) మొదటి శతాబ్దంలో బెరయలోని వాళ్ళు “ఆసక్తితో వాక్యమును అంగీకరించి . . . ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.” (అపొ. 17:11) వాళ్ళ మాదిరిని అనుకరిస్తే దేవుని సేవను మరింత విలువైనదిగా ఎంచుతాం. యెహోవా మన స్వాస్థ్యంగా ఉన్నందుకు మనం నిజంగా కృతజ్ఞులమై ఉంటాం.

ప్రభువునందు మాత్రమే పెళ్ళి చేసుకోండి

16. పెళ్ళి చేసుకోని క్రైస్తవులు 1 కొరింథీయులు 7:39 ప్రకారం దేవుణ్ణి తమ స్వాస్థ్యంగా ఎలా చేసుకోవచ్చు?

16 “ప్రభువునందు మాత్రమే” పెళ్ళి చేసుకోవాలనే బైబిలు ఆజ్ఞకు లోబడడం ద్వారా కూడా క్రైస్తవులు దేవుని ఉద్దేశాలను మనసులో ఉంచుకోవాలి. (1 కొరిం. 7:39) చాలామంది, ఈ ఆజ్ఞను అతిక్రమించే బదులు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోవాలని నిర్ణయించుకుంటారు. అలాంటి వాళ్ళ విషయంలో దేవుడు మంచి శ్రద్ధ తీసుకుంటాడు. తనకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరని, ఒంటరివాడినని దావీదుకు అనిపించినప్పుడు ఆయన ఏమి చేశాడు? సహాయం కోసం యెహోవాను వేడుకున్నాడు. ‘బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱపెట్టుచున్నాను. నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను’ అని దావీదు అన్నాడు. (కీర్త. 142:1-3) యిర్మీయా అవివాహితునిగా ఎన్నో సంవత్సరాలపాటు యెహోవాకు నమ్మకంగా సేవ చేశాడు. ఆయన కూడా ఒంటరివాడినని అనుకొనివుండవచ్చు. ఆయన మాదిరి గురించి, యిర్మీయా ద్వారా దేవుడు మనకిచ్చిన వాక్యం (ఆంగ్లం) అనే పుస్తకంలోని 8వ అధ్యాయంలో చదవవచ్చు.

17. పెళ్ళికాని ఒక సహోదరి తాను ఒంటరిదాన్నని భావించినప్పుడు ఏమి చేస్తుంది?

17 అమెరికాలో ఉంటున్న ఒక సహోదరి, పెళ్ళి చేసుకోకుండా ఉండిపోవాలన్న ఆలోచనే తనకు లేదని చెప్పింది. తగిన వ్యక్తి దొరికితే పెళ్ళి చేసుకోవాలన్నదే ఆమె కోరిక. ఎవరిని పెళ్ళి చేసుకున్నా ఫర్వాలేదు గానీ పెళ్ళి మాత్రం చేసుకోవాల్సిందేనని సాక్షికాని వాళ్ళ అమ్మ పట్టుబట్టింది. ‘పెళ్ళి తర్వాత జీవితం దుర్భరంగా తయారైతే నువ్వు సంతోషిస్తావా’ అని ఆమె వాళ్ళమ్మను అడిగింది. ఆమె మంచి ఉద్యోగం చేస్తూ తనను తాను పోషించుకుంటూ సంతోషంగా ఉండడం చూసి వాళ్ళమ్మ పెళ్ళి గురించి ఆమెను పీడించడం మానేసింది. ఈ సహోదరి కొన్నిసార్లు ఒంటరిదాన్నని భావిస్తుంది. “నేను యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు” అని ఆమె అంది. యెహోవా మీద నమ్మకం ఉంచడానికి ఆమెకు ఏమి సహాయం చేసింది? “దేవుడు ఉన్నాడని, ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టడని గ్రహించేందుకు ప్రార్థన నాకు సహాయం చేస్తోంది. ఈ విశ్వంలోనే మహోన్నతుడైన వ్యక్తి నా ప్రార్థనలు వింటున్నాడు కాబట్టి నాకెంతో సంతోషం కలుగుతోంది, నాకు అరుదైన ఘనత దొరికినట్లు అనిపిస్తోంది” అని ఆమె అంది. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అనే లేఖనంపై ఆమెకు నమ్మకం ఉంది. కాబట్టి ప్రతిఫలం ఆశించకుండా ఆమె ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఇంకా ఇలా అంటోంది, “నేను ‘ఈ వ్యక్తికి ఎలా సహాయం చేయవచ్చు’ అని ఆలోచించినప్పుడల్లా నాకెంతో ఆనందం కలుగుతుంది.” (అపొ. 20:35) ఆమె యెహోవాను తన స్వాస్థ్యంగా చేసుకుంది కాబట్టి ఆయన సేవలో ఆనందిస్తోంది.

18. యెహోవా మిమ్మల్ని తన స్వాస్థ్యంగా ఎలా చేసుకుంటాడు?

18 మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి మీ స్వాస్థ్యంగా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మీరు సంతోషంగా ఉండే ఆయన ప్రజల్లో ఒకరౌతారు. (2 కొరిం. 6:16-18) అప్పుడు మీరు, గతంలోని నమ్మకస్థులైన సేవకుల్లా యెహోవాకు స్వాస్థ్యంగా ఉండవచ్చు. (ద్వితీయోపదేశకాండము 32:9, 10 చదవండి.) దేవుడు అన్యజనాంగాల మధ్య ఇశ్రాయేలీయులను తన స్వాస్థ్యంగా ఎంపిక చేసుకున్నట్లే, మిమ్మల్ని కూడా ఎంపిక చేసుకొని ప్రేమగా చూసుకుంటాడు.—కీర్త. 17:8.

మీరెలా జవాబిస్తారు?

• దేవుని రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇవ్వడం ద్వారా యెహోవాను మీ స్వాస్థ్యంగా ఎలా చేసుకోవచ్చు?

• ఆధ్యాత్మిక ఆహారం పట్ల కృతజ్ఞత కలిగివుండడం ద్వారా యెహోవాను మీ స్వాస్థ్యంగా ఎలా చేసుకోవచ్చు?

• ప్రభువునందు మాత్రమే పెళ్ళి చేసుకోవాలనే దేవుని ఆజ్ఞకు లోబడడం ద్వారా యెహోవాను మీ స్వాస్థ్యంగా ఎలా చేసుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని బ్లర్బ్‌]

జీవితంలో మనం యెహోవా సేవకు మొదటిస్థానం ఇస్తే ఆయన మన స్వాస్థ్యంగా ఉంటాడు

[15వ పేజీలోని చిత్రం]

యిర్మీయా మాదిరి ప్రోత్సాహాన్నిస్తుంది