కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాకు మీరు తెలుసా?

యెహోవాకు మీరు తెలుసా?

యెహోవాకు మీరు తెలుసా?

‘యెహోవా తనవారిని ఎరుగును.’—2 తిమో. 2:19.

1, 2. (ఎ) యేసు దేని గురించి ఎక్కువగా ఆలోచించాడు? (బి) మనం ఏ విషయాల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి?

 ఒకరోజు ఒక పరిసయ్యుడు యేసు దగ్గరకు వచ్చి, “ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు. దానికి ఆయన, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన [యెహోవాను] ప్రేమింపవలెననునదియే” అని చెప్పాడు. (మత్త. 22:35-37) యేసు నిజంగానే ఆ మాటలకు అనుగుణంగా తన పరలోక తండ్రిని ఎంతో ప్రేమించాడు. యెహోవా తనను ఎలా దృష్టిస్తాడనే దాని గురించి కూడా ఆయన ఎంతో ఆలోచించాడు, ఆయన ఆ విషయాన్ని తన జీవితమంతా నమ్మకంగా ఉండడం ద్వారా చూపించాడు. అందుకే, దేవుని ఆజ్ఞలకు నమ్మకంగా లోబడిన వ్యక్తిగా దేవుడు తనను గుర్తుంచుకుంటాడని తాను చనిపోవడానికి కాస్త ముందు యేసు చెప్పగలిగాడు. అలా యేసు యెహోవా ప్రేమలో నిలిచివున్నాడు.—యోహా. 15:10.

2 ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటారు. మనం కూడా అలాగే చెప్పుకుంటాం. అయితే మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, ‘నేను దేవునికి తెలుసా? నన్ను ఆయన ఎలా దృష్టిస్తాడు? నేను ఆయనకు చెందిన వ్యక్తిగా అందరికీ తెలుసా?’ (2 తిమో. 2:19) విశ్వ సర్వాధిపతికే స్నేహితులుగా ఉండడమంటే ఎంతటి ఘనత!

3. యెహోవాకు చెందినవాళ్ళం కాలేమని కొంతమంది ఎందుకు అనుకుంటారు? అలాంటి ఆలోచనను ఎలా సరిచేసుకోవచ్చు?

3 కానీ యెహోవాను ప్రేమించే కొంతమంది సహితం, ఆయనకు స్నేహితులుగా ఉండలేమని అనుకుంటారు. మరికొంతమంది తాము ఎందుకూ పనికిరాని వాళ్ళమని అనుకుంటారు. అందుకే వాళ్ళు యెహోవాకు చెందినవాళ్ళం కాలేమని అనుకుంటారు. కానీ యెహోవా మనల్ని మరో విధంగా దృష్టించగలడని తెలుసుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుంది. (1 సమూ. 16:7) అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులతో ఇలా చెప్పాడు, “ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.” (1 కొరిం. 8:3) దేవునికి మనం తెలిసివుండాలంటే మనకు ఆయన మీద ప్రేమ ఉండాలి. ఈ విషయాల గురించి ఆలోచించండి, ఈ పత్రిక మీరు ఎందుకు చదువుతున్నారు? పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో, పూర్ణశక్తితో యెహోవా సేవ చేయడానికి మీరు ఎందుకు కృషి చేస్తున్నారు? మీరు దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకొనివుంటే, అలా చేయడానికి కారణాలు ఏమిటి? హృదయాలను పరిశోధించే యెహోవా తనకు ‘ఇష్టమైన’ వాళ్ళను ‘ఆకర్షించుకుంటాడు’ అని బైబిలు వివరిస్తోంది. (హగ్గయి 2:7; యోహాను 6:44 చదవండి.) కాబట్టి యెహోవా మిమ్మల్ని ఆకర్షించినందుకే మీరు ఆయన సేవ చేస్తున్నారని నమ్మవచ్చు. తాను ఆకర్షించినవాళ్ళు నమ్మకంగా కొనసాగితే వాళ్ళను ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన వాళ్ళను అమూల్యంగా ఎంచి ఎంతో ప్రేమిస్తాడు.—కీర్త. 94:14.

4. యెహోవాతో మన స్నేహం ఎంతో విలువైనదనే విషయం గురించి మనమెందుకు ఆలోచిస్తూ ఉండాలి?

4 ఒకసారి యెహోవా మనల్ని ఆకర్షించాడంటే, అప్పటినుండి మనం ఆయన ప్రేమలో నిలిచివుండడం గురించి ఆలోచించాలి. (యూదా 20, 21 చదవండి.) దేవుని నుండి దూరంగా కొట్టుకొనిపోయే లేదా ఆయనను విడిచిపెట్టే ప్రమాదం గురించి బైబిలు చెబుతోందని గుర్తుంచుకోండి. (హెబ్రీ. 2:1; 3:12, 13) ఉదాహరణకు అపొస్తలుడైన పౌలు, 2 తిమోతి 2:19లోని మాటలు చెప్పడానికి కొంచెం ముందు ‘హుమెనైయు, ఫిలేతు’ గురించి ప్రస్తావించాడు. ఒకప్పుడు వాళ్ళిద్దరూ యెహోవాకు చెందినవాళ్ళేనని తెలుస్తోంది, కానీ తర్వాత వాళ్ళు సత్యం నుండి తొలగిపోయారు. (2 తిమో. 2:16-18) గలతీయలోని సంఘాల్లో దేవునికి తెలిసిన కొంతమంది సత్యంలో నిలవలేకపోయారని కూడా గుర్తుంచుకోండి. (గల. 4:9) యెహోవాతో మన స్నేహం ఎంత విలువైనదో మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

5. (ఎ) యెహోవాకు మనం తెలిసివుండాలంటే మనకు ఎలాంటి లక్షణాలు ఉండాలి? (బి) ఇప్పుడు మనం ఏ ఉదాహరణలు చూస్తాం?

5 యెహోవాకు మనం తెలిసివుండాలంటే మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. (కీర్త. 15:1-5; 1 పేతు. 3:4) వాటిలో రెండు నమ్మకం, వినయం. ఈ లక్షణాలు చూపించినందుకు యెహోవా ప్రేమను పొందిన ఇద్దరి గురించి మనం ఇప్పుడు చూద్దాం. అంతేకాక, గర్వం చూపించడం వల్ల దేవుడు తృణీకరించిన ఇంకో వ్యక్తి గురించి కూడా చూద్దాం. ఈ మాదిరుల నుండి మనం ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు.

నమ్మినవాళ్ళకు తండ్రి

6. (ఎ) యెహోవా చేసిన వాగ్దానాల మీద నమ్మకం ఉన్నందుకు అబ్రాహాము ఏమి చేశాడు? (బి) యెహోవాకు నిజంగా అబ్రాహాము ఎలా తెలుసు?

6 అబ్రాహాము “యెహోవాను నమ్మెను.” నిజానికి అబ్రాహాము ‘నమ్మినవాళ్ళందరికీ తండ్రి.’ (ఆది. 15:6; రోమా. 4:11) ఆయనకు నమ్మకం ఉండబట్టే తన ఇంటిని, స్నేహితులను, పనిని, తనకున్న వాటన్నిటినీ విడిచిపెట్టి దూర దేశానికి వెళ్ళేందుకు ఇష్టపడ్డాడు. (ఆది. 12:1-4; హెబ్రీ. 11:8-10) ఎన్నో సంవత్సరాలు గడిచినా ఆయన నమ్మకం ఏ మాత్రం తగ్గలేదు. అందుకే ఆయన యెహోవా ఆజ్ఞకు లోబడి, తన కుమారుడైన ఇస్సాకును యెహోవాకు బలిగా అర్పించడానికి వెనుకాడలేదు. (హెబ్రీ. 11:17-19) ఆయన యెహోవా చేసిన వాగ్దానాల మీద నమ్మకం ఉంచాడు కాబట్టే దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయ్యాడు. యెహోవాకు నిజంగా అబ్రాహాము తెలుసు. (ఆదికాండము 18:19 చదవండి.) యెహోవాకు అబ్రాహాము అనే వ్యక్తి ఉన్నాడని తెలియడమే కాదు, యెహోవా ఆయనను ఒక స్నేహితునిలా ప్రేమించాడు కూడా.—యాకో. 2:22, 23.

7. యెహోవా వాగ్దానాల గురించి అబ్రాహాముకు ఏమి తెలుసు? ఆయన తన నమ్మకాన్ని ఎలా చూపించాడు?

7 అబ్రాహాము సంతానం శత్రువుల ‘గవిని స్వాధీనపరచుకొని, సముద్రతీరమందలి ఇసుకవలే’ విస్తరిస్తారని యెహోవా ఆయనకు వాగ్దానం చేశాడు. (ఆది. 22:17, 18) ఈ వాగ్దానాలు తన జీవితకాలంలో నెరవేరకపోయినా అబ్రాహాము యెహోవా మీద గట్టి నమ్మకం ఉంచాడు. దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరతాయని ఆయన నమ్మాడు, ఆ నమ్మకాన్ని తన జీవిత విధానంలో చూపించాడు. (హెబ్రీయులు 11:13 చదవండి.) అబ్రాహాముకు ఉన్నలాంటి నమ్మకం ఉన్న వ్యక్తులుగా మనం యెహోవాకు తెలుసా?

యెహోవా కోసం ఎదురుచూడడం ద్వారా నమ్మకం చూపించండి

8. సహజంగానే కొంతమంది ఏమి కోరుకుంటారు?

8 మనం ఎంతగానో కోరుకొనే విషయాలు కొన్ని ఉండవచ్చు. పెళ్ళి చేసుకోవాలని, పిల్లలను కనాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని సహజంగా అందరూ కోరుకుంటారు. అయితే చాలామందికి కావాలనుకున్నవన్నీ దొరక్కపోవచ్చు. మనం ఎంతగానో కోరుకునేదేదైనా ఒకటి, ప్రస్తుతం మనకు దొరకదని తెలిసినప్పుడు మనం ఏమి చేస్తాం? ఆ పరిస్థితిలో మనం ప్రవర్తించే తీరు మనకు ఎంత గట్టి నమ్మకం ఉందో చూపిస్తుంది.

9, 10. (ఎ) తమ కోరికలు తీర్చుకునేందుకు కొంతమంది ఏమి చేశారు? (బి) యెహోవా చేసిన వాగ్దానాలు నెరవేరడం గురించి మీరు ఏమనుకుంటున్నారు?

9 ఆ కోరికలు తీర్చుకునేందుకు దేవుని నిర్దేశానికి వ్యతిరేకంగా వెళ్ళడం అవివేకం. అలా చేస్తే దేవునితో మనకున్న స్నేహం దెబ్బతింటుంది. ఉదాహరణకు కొంతమంది, బైబిలు సూత్రాలకు వ్యతిరేకంగా ఉండే కొన్ని రకాల చికిత్సలను ఎంచుకున్నారు. మరికొంతమంది సంఘ కూటాలకు వెళ్ళడానికి లేదా కుటుంబంతో గడపడానికి సమయం లేకుండా చేసే ఉద్యోగాలు ఎంచుకున్నారు. ఇంకొంతమంది యెహోవాను ఆరాధించని వ్యక్తులతో ప్రేమలోపడ్డారు. క్రైస్తవులు అలా చేస్తే వాళ్ళు యెహోవాకు తెలిసినవాళ్ళుగా ఉండడానికి నిజంగా ప్రయత్నిస్తున్నట్లేనా? తన విషయంలో దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరడం కోసం అబ్రాహాము ఎదురుచూడకపోయుంటే, యెహోవా ఆయన గురించి ఏమనుకునేవాడు? ఒకవేళ అబ్రాహాము తన ఇష్టం వచ్చినట్లు చేస్తూ అక్కడ కూడా స్థిరపడడానికి ప్రయత్నించి ఉంటే ఎలా ఉండేది? యెహోవా కోసం ఎదురుచూడకుండా పేరు ప్రతిష్ఠలు సంపాదించుకోవాలని అనుకునివుంటే ఏమయ్యేది? (ఆదికాండము 11:4 పోల్చండి.) యెహోవా అబ్రాహామును తన స్నేహితునిగానే చూసేవాడా?

10 మీరు వేటిని ఎక్కువగా కోరుకుంటారు? వాటిని యెహోవా ఇచ్చేంత వరకూ ఎదురుచూసేంతటి నమ్మకం మీకు ఉందా? ఆయన ‘ప్రతి ఒక్కరి కోరికను తృప్తిపరుస్తాను’ అని వాగ్దానం చేస్తున్నాడు. (కీర్త. 145:16) యెహోవా వాగ్దానాల్లో కొన్ని మనం కావాలనుకున్నంత త్వరగా నెరవేరకపోవచ్చు. కానీ అబ్రాహాముకు ఉన్నలాంటి నమ్మకం మనకుందని చూపించే విధంగా జీవిస్తూనే ఉంటే, యెహోవా మనల్ని మర్చిపోడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు.—హెబ్రీ. 11:6.

వినయానికి, అహంకారానికి ఉన్న తేడా

11. కోరహు చాలా సంవత్సరాల పాటు ఏమి చేశాడు?

11 యెహోవా ఏర్పాట్లను, నిర్ణయాలను గౌరవించే విషయంలో మోషే, కోరహు వేరువేరుగా వ్యవహరించారు. యెహోవా వాళ్ళ గురించి ఏమనుకుంటాడనేది వాళ్ళు స్పందించే తీరుపైనే ఆధారపడి ఉంటుంది. కోరహు కహాతీయుడైన లేవీయుడు. యెహోవా ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం దాటించి ఎలా తీసుకువచ్చాడో చూసే అవకాశం ఆయనకు దొరికివుంటుంది. సీనాయి పర్వతం దగ్గర అవిధేయులైన ఇశ్రాయేలీయులపై యెహోవా తీర్చిన తీర్పుకు ఆయన మద్దతు ఇచ్చాడు, నిబంధన మందసాన్ని తీసుకువెళ్ళడంలో కూడా ఆయన తన వంతు సహాయం చేశాడు. (నిర్గ. 32:26-29; సంఖ్యా. 3:30, 31) ఆయన చాలా సంవత్సరాల పాటు యెహోవాకు నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది, అందుకే ఇశ్రాయేలీయుల్లో చాలామంది ఆయనను గౌరవించారు.

12. ఇరవై ఎనిమిదవ పేజీలోని చిత్రంలో ఉన్నట్లు కోరహు అహంకారం చూపించినందు వల్ల, దేవునితో ఆయనకున్న స్నేహానికి ఏమైంది?

12 కానీ ఇశ్రాయేలీయులు వాగ్దానదేశానికి వెళ్తున్నప్పుడు, యెహోవా వాళ్ళను నడిపించే విధానంలో ఏదో తప్పు ఉందని కోరహు భావించాడు. ఆయన మార్పులు చేయాలనుకున్నాడు. ఆ జనాంగంలోని 250 మంది ఆయనతో చేతులు కలిపారు. యెహోవాతో తమకు సంబంధం ఉందని, ఆయన అనుగ్రహం తమమీద ఉందని వాళ్ళు నమ్మారు. మోషేతో వాళ్ళు ఇలా అన్నారు, “మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు.” (సంఖ్యా. 16:1-3) వాళ్ళు అహంకారంగా ఆలోచించారు, ప్రవర్తించారు. యెహోవా నడిపించే తీరుకన్నా తాము నడిపించే తీరే బాగుంటుందని వాళ్ళు నమ్మారు. మోషే వాళ్ళతో ఇలా అన్నాడు, ‘తనవాళ్ళు ఎవరో యెహోవా తెలియజేస్తాడు.’ (సంఖ్యాకాండము 16:5 చదవండి.) మరుసటి రోజు సాయంత్రానికల్లా కోరహు, ఆయనతో చేతులు కలిపినవాళ్ళందరు చనిపోయారు.—సంఖ్యా. 16:31-35.

13, 14. మోషే ఏ విధంగా వినయం చూపించాడు?

13 మోషే కోరహుకు పూర్తి విరుద్ధం. ఆయన “భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.” (సంఖ్యా. 12:3) ఆయన యెహోవా చెప్పినట్లే చేయాలని గట్టిగా నిర్ణయించుకోవడం వల్ల తాను సాత్వికుణ్ణని, వినయం గలవాణ్ణని చూపించాడు. (నిర్గ. 7:6; 40:16) యెహోవా పనులు చేసే విధానాన్ని మోషే వ్యతిరేకిస్తూ ఉండేవాడని గానీ, యెహోవా నుండి వచ్చే నిర్దేశాలను పాటించాల్సి వస్తున్నందుకు చికాకుపడ్డాడని గానీ బైబిల్లో ఎక్కడా లేదు. ఉదాహరణకు, మందిర నిర్మాణానికి సంబంధించి ప్రతీ చిన్న విషయంలో యెహోవా నిర్దిష్టమైన సూచనలు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు గుడారపు తెరలను తయారుచేయడానికి ఏ రంగు దారం వాడాలో, ఎన్ని కొలుకులు చేయాలో కూడా ఆయన చెప్పాడు. (నిర్గ. 26:1-6) ఒకవేళ దేవుని సంస్థలోని ఒక పర్యవేక్షకుడు మీకు దేని గురించైనా నిర్దిష్టమైన సూచనలు ఇస్తే కొన్నిసార్లు మీకు చికాకు కలగవచ్చు. కానీ యెహోవా పరిపూర్ణ పర్యవేక్షకుడు. ఆయన తన సేవకులకు పని అప్పగించి వాళ్ళు దాన్ని సరిగ్గా నిర్వహిస్తారని వాళ్ళ మీద నమ్మకం ఉంచుతాడు. యెహోవా దేనికైనా ఎన్నో వివరాలు ఇచ్చాడంటే దానికి సరైన కారణమే ఉంటుంది. యెహోవా మోషేకు సవివరమైన సూచనలు ఇచ్చినందుకు మోషే యెహోవా మీద కోపగించుకోలేదు, తనను గౌరవించడం లేదని అనుకోలేదు. తనకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడని కూడా ఆయన అనుకోలేదు. యెహోవా ఆజ్ఞాపించినట్లే చేయమని ఆయన పనివాళ్ళకు చెప్పాడు. (నిర్గ. 39:32) ఆయన వినయంగా ఆలోచించాడు, ప్రవర్తించాడు. అది యెహోవా పని అని, కేవలం ఆ పని కోసం ఆయన తనను ఉపయోగించుకుంటున్నాడని మోషేకు తెలుసు.

14 నిరాశ చెందడానికి తగిన కారణాలు ఉన్నప్పుడు కూడా మోషే తాను వినయం గలవాడినని చూపించాడు. ఉదాహరణకు, నీళ్ళు లేవని ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు, మోషేకు వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది. ఆ సమయంలో ఆయన యెహోవాను ఘనపర్చలేదు. అందుకే మోషే ఆ ప్రజలను వాగ్దానదేశానికి తీసుకువెళ్ళేందుకు అనుమతించనని యెహోవా ఆయనకు చెప్పాడు. (సంఖ్యా. 20:2-12) ఆయన, ఆయన అన్నయైన అహరోను ఇశ్రాయేలీయుల సణుగుళ్ళను ఎన్నో సంవత్సరాల పాటు భరించారు. కానీ ఆ ఒక్క సందర్భంలో మోషే తప్పు చేశాడు కాబట్టి ఆయన ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న దాన్ని పొందలేడని యెహోవా ఆయనకు చెప్పాడు. దానికి ఆయన ఎలా ప్రతిస్పందించాడు? ఆయన కాస్త నిరాశ చెందివుండవచ్చు. అయినా ఆయన యెహోవా నిర్ణయాన్ని వినయంతో అంగీకరించాడు. యెహోవా నీతి గల దేవుడు కాబట్టి అన్యాయం చేయడని ఆయనకు తెలుసు. (ద్వితీ. 3:25-27; 32:4) మీరు మోషే గురించి ఆలోచించినప్పుడు ఆయన యెహోవాకు తెలుసని మీకు అనిపించదా?—నిర్గమకాండము 33:12, 13 చదవండి.

యెహోవాకు లోబడాలంటే వినయం అవసరం

15. కోరహు అహంకారంతో చేసిన దాన్నిబట్టి మనమేమి నేర్చుకోవచ్చు?

15 ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘంలో వచ్చే మార్పులకూ, సంఘంలో నాయకత్వం వహించేవాళ్ళు తీసుకొనే నిర్ణయాలకూ మనం ప్రతిస్పందించే విధానాన్ని బట్టే యెహోవాకు మనం ఎంత తెలుసు అనేది ఆధారపడివుంటుంది. మితిమీరిన ఆత్మ విశ్వాసం, అహంకారం, అవిశ్వాసం వల్ల కోరహు, ఆయన అనుచరులు దేవునికి దూరమయ్యారు. రోజువారీ నిర్ణయాలు తీసుకుంటున్నది వృద్ధుడైన మోషే అని కోరహుకు అనిపించినప్పటికీ నిజానికి ఆ జనాంగాన్ని నడిపిస్తున్నది యెహోవాయే. కోరహు ఆ వాస్తవాన్ని మరచిపోయాడు కాబట్టి దేవుడు ఉపయోగించుకుంటున్న వాళ్ళ మీద నమ్మకాన్ని చూపించలేదు. యెహోవా చర్య తీసుకుంటాడని కోరహు ఎదురుచూడాల్సింది. పరిస్థితులు ఎందుకు అలా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి యెహోవా కోరహుకు సహాయం చేసివుండేవాడు లేదా నిజంగా మార్పులు అవసరమైతే చేసివుండేవాడు. అయితే చివరకు కోరహు అహంకారంతో చేసిన పనులవల్ల, నమ్మకంగా సేవ చేశాడన్న మంచి పేరు పాడుచేసుకున్నాడు.

16. వినయం చూపించడంలో మోషే మాదిరి మనకెలా సహాయం చేస్తుంది?

16 ఆ వృత్తాంతంలో నేటి సంఘ పెద్దలకు, సంఘంలోని ఇతరులకు ఒక హెచ్చరిక ఉంది. యెహోవా కోసం ఎదురు చూడడానికి, సంఘంలో నాయకత్వం వహించేందుకు నియమించబడిన వాళ్ళ నిర్దేశాలను అనుసరించడానికి వినయం అవసరం. మోషేకు ఉన్నంత వినయం, సాత్వికం మనకూ ఉన్నాయని చూపిస్తున్నామా? మన మధ్య నాయకత్వం వహిస్తున్న వాళ్ళకున్న స్థానాన్ని గుర్తించి, వాళ్ళకు లోబడుతున్నామా? నిరాశ కలిగించే పరిస్థితులు ఎదురైనప్పుడు మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతున్నామా? అలా చేస్తే మనం యెహోవా ఆమోదాన్ని పొందుతాం. మనం వినయాన్ని, విధేయతను చూపిస్తే యెహోవా మనల్ని ఇష్టపడతాడు.

తనవాళ్ళెవరో యెహోవాకు తెలుసు

17, 18. యెహోవా ఆమోదాన్ని పొందిన వ్యక్తులుగా ఎలా కొనసాగవచ్చు?

17 యెహోవా ఆకర్షించినవాళ్ళ గురించి, ఇష్టపడినవాళ్ళ గురించి ధ్యానించడం ప్రయోజనకరంగా ఉంటుంది. అబ్రాహాము, మోషే ఇద్దరూ మనలాగే అపరిపూర్ణులు, వాళ్ళలో కూడా లోపాలు ఉన్నాయి. అయినా తనకు చెందిన వ్యక్తులుగా వాళ్ళు యెహోవాకు తెలుసు. కోరహు ఉదాహరణ చూస్తే, యెహోవాకు దూరమై ఇక ఏమాత్రం ఆయన స్నేహితులుగా ఉండలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ‘యెహోవా నన్ను ఎలా చూస్తాడు? ఈ బైబిలు ఉదాహరణల నుండి నేనేమి నేర్చుకోవచ్చు?’ అని మనలో ప్రతీ ఒక్కరం ప్రశ్నించుకోవాలి.

18 తాను ఆకర్షించిన నమ్మకమైనవాళ్ళను యెహోవా తనవాళ్ళుగా దృష్టిస్తాడని తెలుసుకొని మీరు ఎంతో ఓదార్పు పొందవచ్చు. దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇష్టపడేలా చేసే విశ్వాసాన్ని, వినయాన్ని, మరితర లక్షణాలను అలవర్చుకోవడంలో కొనసాగండి. మనం యెహోవాకు తెలిసివుండడం ఖచ్చితంగా ఎంతో గొప్ప ఘనత, దానివల్ల ఇప్పుడు సంతృప్తికరమైన జీవితం గడపవచ్చు, అంతేగాక భవిష్యత్తులో అద్భుతమైన ఆశీర్వాదాలు పొందవచ్చు.—కీర్త. 37:18.

మీకు గుర్తున్నాయా?

• యెహోవాకు తెలిసినవాళ్ళముగా ఉండడం అంటే ఏమిటి?

• అబ్రాహాము లాంటి విశ్వాసాన్ని మీరెలా చూపించవచ్చు?

• కోరహు, మోషే నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[26వ పేజీలోని చిత్రం]

యెహోవా తన వాగ్దానాలను పూర్తిగా నెరవేరుస్తాడన్న విశ్వాసం అబ్రాహాముకు ఉన్నట్లే మనకూ ఉందా?

[28వ పేజీలోని చిత్రం]

ఇవ్వబడిన నిర్దేశానికి వినయంగా లోబడేందుకు కోరహు ఇష్టపడలేదు

[29వ పేజీలోని చిత్రం]

ఇవ్వబడిన నిర్దేశాలకు వినయంగా లోబడే వ్యక్తిగా మీరు యెహోవాకు తెలుసా?