కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మెలకువగా ఉండడం’ ఎందుకు అంత ప్రాముఖ్యం?

‘మెలకువగా ఉండడం’ ఎందుకు అంత ప్రాముఖ్యం?

‘మెలకువగా ఉండడం’ ఎందుకు అంత ప్రాముఖ్యం?

“నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” (మత్త. 24:3) ఈ ప్రశ్నకు జవాబుగా యేసు తన శిష్యులతో చెప్పిన స్పష్టమైన, సవివరమైన, గుర్తించదగిన, ఖచ్చితమైన సూచన గురించి మత్తయి 24, మార్కు 13, లూకా 21 అధ్యాయాల్లో ఉంది. ఆ సూచన గురించి చెప్పిన తర్వాత “మెలకువగా నుండుడి” అని కూడా ఆయన చెప్పాడు.—మత్త. 24:42.

యేసు చెప్పిన ఆ సూచన ఒకవేళ స్పష్టంగా ఉండివుంటే “మెలకువగా నుండుడి” అని కూడా ఆయన ఎందుకు చెబుతాడు? దీనికి జవాబు తెలుసుకోవడానికి రెండు విషయాలను పరిశీలిద్దాం. మొదటిగా, కొంతమంది కొన్ని కారణాల వల్ల సూచనను పట్టించుకోకపోవడంతో వాళ్ళ ఆధ్యాత్మికత దెబ్బతిని మెలకువగా ఉండలేకపోవచ్చు. రెండవదిగా, మరికొంతమంది సూచనలోని కొన్ని విషయాలను గుర్తించినా తమ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దాని ప్రభావం తమ మీద లేదనుకోవచ్చు. దానివల్ల, యేసు చెప్పిన ప్రవచనంలో చివరిదైన ‘మహాశ్రమ’ ఇప్పుడప్పుడే రాదని, ప్రస్తుతం ‘మెలకువగా ఉండడం’ అవసరం లేదని వాళ్ళు అనుకోవచ్చు.—మత్త. 24:21.

వాళ్ళు పట్టించుకోలేదు

నోవహు కాలంలోని ప్రజల గురించి యేసు తన అనుచరులకు గుర్తుచేశాడు. అప్పటి ప్రజలు నోవహు ప్రకటించడాన్ని, పెద్ద ఓడ నిర్మించడాన్ని గమనించేవుంటారు. అంతేకాక ఆ రోజుల్లో ఉన్న క్రూరత్వాన్ని కూడా చూసేవుంటారు. అయినా చాలామంది పట్టించుకోలేదు. (మత్త. 24:37-39) ఈ రోజుల్లో కూడా చాలామంది హెచ్చరికల్ని పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు, ఫలానా వేగంతో మాత్రమే వాహనాలు నడపాలని రోడ్డు మీద అక్కడక్కడ సైన్‌ బోర్డులు పెట్టి ఉంటాయి. అయినా చాలామంది వాటిని పట్టించుకోరు. దాంతో, డ్రైవర్ల వేగాన్ని తగ్గించడానికి అధికారులు రోడ్లమీద స్పీడ్‌ బ్రేకర్లు పెట్టాల్సివస్తోంది. అలాగే, కొంతమంది క్రైస్తవులు అంత్యదినాల సూచనను గ్రహించినా దానికి అనుగుణంగా లేని కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే అవకాశముంది. పశ్చిమ ఆఫ్రికాకు చెందిన ఆరీయెల్‌ అనే యౌవనస్థురాలి విషయంలో అలాగే జరిగింది.

ఆరీయెల్‌కు టీవీలో ప్రసారమయ్యే స్త్రీల హ్యాండ్‌బాల్‌ ఆటను చూడడమంటే చాలా ఇష్టం. వాళ్ళ స్కూల్లో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసినప్పుడు, ఆడాలనే బలమైన కోరిక వల్ల ఆమె తన ఆధ్యాత్మికతకు రాగల హానిని గ్రహించలేకపోయింది. ఆమె గోల్‌కీపర్‌గా ఉండడానికి ఒప్పుకుంది. ఆ తర్వాత ఏమి జరిగింది? ఆమె ఇలా వివరిస్తోంది, “మా టీమ్‌లో కొంతమందికి బాయ్‌ఫ్రెండ్స్‌ ఉండేవాళ్ళు. వాళ్ళు డ్రగ్స్‌ తీసుకునేవాళ్ళు, సిగరెట్లు కాల్చేవాళ్ళు. నేను అవన్నీ చేయనందుకు వాళ్ళు నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. కానీ, నేను వాళ్ళను ఎదిరించి నిలబడగలనని అనుకున్నాను. అయితే ఊహించని విధంగా ఆ ఆట వల్ల నా ఆధ్యాత్మికత దెబ్బతినడం మొదలైంది. ఆ ఆటే నా జీవితమైపోయింది. రాజ్యమందిరంలో క్రైస్తవ కూటాలకు వెళ్ళినప్పుడు, నా మనసంతా హ్యాండ్‌బాల్‌ కోర్టులోనే ఉండేది. ఒక క్రైస్తవురాలిగా నాకు ఉండాల్సిన లక్షణాలను కూడా పోగొట్టుకున్నాను. ఒకప్పుడు ఆటను ఇష్టపడ్డాను కానీ ఆ తర్వాత గెలవాలని తపించిపోయాను. కొత్తగా నాలో కలిగిన పోటీతత్వాన్ని తృప్తిపర్చుకోవడానికి నేను ఎంతో కష్టపడి ప్రాక్టీస్‌ చేసేదాన్ని. దాంతో నాలో ఒత్తిడి పెరిగిపోయింది. హ్యాండ్‌బాల్‌ ఆట కోసం నేను స్నేహాలను కూడా వదులుకున్నాను.

“ఒకరోజు ఆటలో మా ప్రత్యర్థులు పెనాల్టీ షాట్‌ కొట్టాల్సి వచ్చింది. ఆ రోజుతో నా ఆలోచనా తీరు మారిపోయింది. ఎందుకంటే ఆ సమయంలో నేను గోల్‌ను ఆపడానికి సిద్ధంగా నిలబడ్డాను. అప్పుడు, వాళ్ళు కొట్టే గోల్‌ను ఆపడానికి సహాయం చేయమని నాకు తెలియకుండానే యెహోవాకు ప్రార్థించాను. ఆ సంఘటనతో, నా ఆధ్యాత్మికత ఎంతగా దెబ్బతిందో గ్రహించాను. అయితే నా ఆధ్యాత్మికతను మళ్ళీ ఎలా సంపాదించుకున్నానో తెలుసా?

“నేను ముందు ఒకసారి, యువత ఇలా అడుగుతోంది—నేను నా జీవితంలో ఏమి చేస్తాను? (ఆంగ్లం) a అనే మన వీడియోను చూశాను. దాన్ని మళ్ళీ చూడాలని, ఈసారి చూస్తున్నప్పుడు దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. నా పరిస్థితి ఆ నాటకంలోని ఆండ్రే అనే యౌవనస్థుని పరిస్థితిలానే ఉంది. ఫిలిప్పీయులు 3:8 చదివి, దానిగురించి ఆలోచించమని ఒక సంఘ పెద్ద ఆండ్రేకు చెప్పిన మాటలను నేను ప్రత్యేకంగా గమనించాను. అంతే, నా ఆలోచన మారిపోయింది. నేను టీమ్‌ను వదిలి వచ్చేశాను.

“దాంతో పెద్ద మార్పు వచ్చింది. నా పోటీతత్వం, దానివల్ల నాలో కలిగిన ఒత్తిడి లేకుండాపోయాయి. నేను ఎంతో సంతోషించాను, నా క్రైస్తవ స్నేహితులకు మరింత దగ్గరయ్యాను. ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాను. కూటాల్లో మళ్ళీ శ్రద్ధగా వింటూ ఎంతో సంతోషాన్ని పొందాను. నా పరిచర్య కూడా మెరుగైంది. ఇప్పుడు నేను క్రమంగా సహాయ పయినీరు సేవ చేస్తున్నాను.”

యేసు ఇచ్చిన సూచనను అలక్ష్యం చేసేలా మిమ్మల్ని ఏదైనా పక్కదారి పట్టిస్తుంటే ఆరీయెల్‌లాగే తగిన చర్యలు తీసుకోండి. వీటిలో కొన్ని చేయడానికి ప్రయత్నించవచ్చు. దాగివున్న సంపదలను తెలుసుకోవడానికి సహాయపడే మ్యాపు అని ఆ వీడియోలో చెప్పబడిన వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ను చూడండి. అందులో మంచి ఉపదేశం ఉంటుంది. అంతేకాక శోధనలను ఎదుర్కొన్న తీరు గురించి కొంతమంది స్వయంగా చెప్పిన అనుభవాలు ఉంటాయి. క్రైస్తవ కూటాలకు చక్కగా సిద్ధపడి, నోట్సు తీసుకోవడం ద్వారా వాటి నుండి పూర్తి ప్రయోజనం పొందండి. ముందు వరుసలో కూర్చోవడం ప్రయోజనకరంగా ఉంటుందని కొంతమంది గ్రహించారు. ప్రేక్షకులు పాల్గొనే భాగాల్లో మొదట్లోనే వ్యాఖ్యానించడానికి ప్రయత్నించండి. అంతేకాక, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను యేసు ఇచ్చిన సూచనలోని వివిధ అంశాలతో, ‘అంత్యదినాలకు’ సంబంధించిన ఇతర విషయాలతో పోల్చి చూడడం ద్వారా ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండండి.—2 తిమో. 3:1-5; 2 పేతు. 3:3, 4; ప్రక. 6:1-8.

‘సిద్ధంగా ఉండండి’

అంత్యదినాల సూచన “లోకమందంతట” నెరవేరుతుంది. (మత్త. 24:7, 14) లక్షలాదిమంది తెగుళ్ళు, కరువులు, భూకంపాలు, ప్రవచింపబడిన ఇతర సంఘటనలు జరుగుతున్న ప్రాంతాల్లో జీవిస్తున్నారు. అయితే, చాలామంది కొంత ప్రశాంతమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. సూచనలోని కొన్ని అంశాలను వ్యక్తిగతంగా మీరు అనుభవించనంతమాత్రాన మహాశ్రమ ఇప్పుడే రాదని అనుకోవచ్చా? అలా అనుకోవడం సరికాదు.

ఉదాహరణకు, ‘తెగుళ్లు, కరువుల’ గురించి యేసు ఏమి చెప్పాడో గమనించండి. (లూకా 21:11) మొదటిగా, ఇవన్నీ ప్రతీచోట ఒకేసారి, ఒకేస్థాయిలో జరుగుతాయని ఆయన చెప్పలేదు. కానీ, ఇవి “అక్కడక్కడ” జరుగుతాయని ఆయన చెప్పాడు. కాబట్టి, అన్నిచోట్ల ఒకేసారి ఒకేవిధమైన సంఘటనలు జరుగుతాయని మనం అనుకోలేం. రెండవదిగా, కరువుల గురించి చెప్పిన తర్వాత, అతిగా తినే విషయంలో తన అనుచరుల్లో కొంతమంది జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, ‘మీ హృదయాలు తిండి వల్ల మందముగా ఉండకుండా జాగ్రత్తపడండి’ అని యేసు అన్నాడు. (లూకా 21:34) కాబట్టి, సూచనలోని ప్రతీ సంఘటన తమ ప్రాంతంలో జరుగుతుందని క్రైస్తవులందరూ అనుకోకూడదు. బదులుగా, “మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి” అని యేసు చెప్పాడు. (లూకా 21:31) మన ప్రాంతంలో వ్యక్తిగతంగా మనమేమి అనుభవిస్తున్నా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల సూచనలోని అంశాలన్నీ నెరవేరడాన్ని మనం చూడవచ్చు.

మహాశ్రమ మొదలయ్యే ‘దినాన్ని, గడియను’ యెహోవా నిర్ణయించేశాడని కూడా గుర్తుంచుకోండి. (మత్త. 24:36) భూమ్మీద జరిగే సంఘటనలేవీ ఆ తేదీని మార్చలేవు.

‘సిద్ధంగా ఉండండి’ అని యేసు క్రైస్తవులందరికీ ఉపదేశించాడు. (మత్త. 24:44) మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనం ప్రతిరోజూ మొత్తం సమయాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసమే ఉపయోగించలేం. అంతేకాక, మహాశ్రమ మొదలయ్యే సమయానికి ఏమి చేస్తుంటామో మనలో ఎవ్వరికీ తెలియదు. కొంతమంది పొలంలో పనిచేస్తుండవచ్చు లేదా ఇంటిపనులు చేసుకుంటుండవచ్చు. (మత్త. 24:40, 41) కాబట్టి, సిద్ధంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి?

ఎమ్మాన్వెల్‌, వీక్టొరీన్‌, వాళ్ళ ఆరుగురు అమ్మాయిలు ఆఫ్రికాలో ఉంటున్నారు. వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో యేసు చెప్పిన సూచనను తెలియజేసే సంఘటనలు అంతగా జరగడం లేదు. కాబట్టి, సిద్ధంగా ఉండడానికి వాళ్ళు ప్రతీరోజు ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మాన్వెల్‌ ఇలా అంటున్నాడు, “అందరికీ అనుకూలంగా ఉండే సమయాన్ని నిర్ణయించుకోవడం కష్టమైంది. చివరికి ఉదయం ఆరు గంటల నుండి ఆరున్నర వరకు ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవాలని నిర్ణయించుకున్నాం. దినవచనాన్ని పరిశీలించిన తర్వాత, ఆ వారం సంఘంలో అధ్యయనం చేయబడే ప్రచురణల్లో ఒకదాన్నుండి కొన్ని పేరాలు సిద్ధపడతాం.” అలా చేయడంవల్ల వాళ్ళు మెలకువగా ఉండగలుగుతున్నారు. ఎమ్మాన్వెల్‌ సంఘంలో పెద్దల సభ సమన్వయకర్త. ఆయన భార్య వీక్టొరీన్‌ తరచూ సహాయ పయినీరు సేవ చేస్తుంది. సత్యం తెలుసుకోవడానికి ఆమె ఎంతోమందికి సహాయం చేసింది. వాళ్ళ అమ్మాయిలంతా ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తున్నారు.

‘జాగ్రత్తపడండి, మెలకువగా ఉండండి’ అని యేసు మనకు ఉపదేశమిచ్చాడు. (మార్కు 13:33) ఆధ్యాత్మికతను అలక్ష్యం చేసేలా మిమ్మల్ని ఏదీ పక్కదారి పట్టించకుండా చూసుకోండి. ఆరీయెల్‌లా మన ప్రచురణల్లో, సంఘ కూటాల్లో ఇవ్వబడే చక్కని ఉపదేశాన్ని పాటించండి. సిద్ధంగా ఉండి ‘మెలకువగా ఉండడానికి’ ఎమ్మాన్వెల్‌ కుటుంబంలా, ప్రతీరోజు ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడానికి ప్రయత్నించండి.

[అధస్సూచి]

a యెహోవా దృష్టిలో సరైనది చేయడానికి ఒక క్రైస్తవ యౌవనస్థుడు ఎంత కృషి చేయాల్సి వచ్చిందో తెలియజేసే ఆధునిక నాటకం.

[4వ పేజీలోని చిత్రం]

ప్రతీరోజు ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడం వల్ల ఎమ్మాన్వెల్‌, ఆయన కుటుంబ సభ్యులు ‘సిద్ధంగా ఉండగలుగుతున్నారు’