కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఉల్లాసం కోసం చేసేవి ప్రయోజనకరంగా ఉంటున్నాయా?

మీరు ఉల్లాసం కోసం చేసేవి ప్రయోజనకరంగా ఉంటున్నాయా?

మీరు ఉల్లాసం కోసం చేసేవి ప్రయోజనకరంగా ఉంటున్నాయా?

‘ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించండి.’—ఎఫె. 5:10.

1, 2. (ఎ) మనం జీవితాన్ని సంతోషంగా గడపాలన్నదే యెహోవా కోరిక అని మనకెలా తెలుసు? (బి) ఉల్లాసం కోసం మనం చేసేవాటికి వెచ్చించే సమయం కూడా యెహోవా ఇచ్చిన బహుమానంలో భాగమే కాబట్టి, మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి?

 మనం జీవితాన్ని సంతోషంగా గడపాలన్నదే యెహోవా కోరిక అని బైబిలు స్పష్టంగా చూపిస్తోంది. ఉదాహరణకు యెహోవా, ‘పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూరమొక్కలను మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలోనుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు’ అని కీర్తన 104:14, 15లో ఉంది. మనం జీవించడానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చేది యెహోవాయే. మనకు ధాన్యం, నూనె, ద్రాక్షారసం ఇవ్వడానికి విత్తనాలు మొలకెత్తేలా చేసేది ఆయనే. జీవించి ఉండాలంటే ద్రాక్షారసం అవసరం లేకపోయినా, అది ‘నరుల హృదయాన్ని సంతోషపెట్టగలదు.’ (ప్రసం. 9:7; 10:19) మనం సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. మన హృదయాలు “ఉల్లాసముతో” నిండాలని ఆయన కోరుకుంటున్నాడు.—అపొ. 14:16, 17.

2 “ఆకాశ పక్షులను,” ‘అడవిపువ్వులను’ గమనించడానికి కొంత సమయం తీసుకోవడం తప్పని మనం అనుకోకూడదు. అలాంటి పనులు చేస్తే మనం బలాన్ని పొంది మన జీవితాన్ని మరింత సంతోషంగా గడపగలుగుతాం. (మత్త. 6:26, 28; కీర్త. 8:3, 4) ఆరోగ్యంగా ఉండి జీవితాన్ని సంతోషంగా గడపడం అనేది “దేవుడిచ్చు బహుమానమే.” (ప్రసం. 3:12, 13) ఉల్లాసం కోసం మనం చేసేవాటికి వెచ్చించే సమయం కూడా దేవుడిచ్చిన బహుమానంలో భాగమే. కాబట్టి ఆ సమయాన్ని మనం దేవుడు ఇష్టపడే విధంగా ఉపయోగించుకోవాలి.

ఉల్లాసం కోసం చేసేవి, వాటి హద్దులు

3. ఉల్లాసం కోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైన వాటిని ఎందుకు ఎంచుకుంటారు?

3 ఉల్లాసం కోసం చేసేవాటి గురించి సరైన అవగాహన ఉన్నవాళ్ళకు వాటిని ఎంచుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలుసు. వాటికి హద్దులు ఉన్నాయని కూడా వాళ్ళకు తెలుసు. ఉల్లాసం కోసం ప్రజలు ఎందుకు వేర్వేరు వాటిని ఎంచుకుంటారు? దీన్ని అర్థం చేసుకునేందుకు, ఉల్లాసం కోసం వేటినైనా ఎంచుకోవడాన్ని ఆహార పదార్థాలను ఎంచుకోవడంతో పోల్చవచ్చు. ఒక్కో దేశంలోని ప్రజలు ఒక్కో రకమైన ఆహార పదార్థాలను ఇష్టపడతారు. అలాగే, ఒక్కో దేశంలోని క్రైస్తవులు ఉల్లాసం కోసం ఒక్కో రకమైన వాటిని ఇష్టపడతారు. అంతెందుకు, ఒకే ప్రాంతంలోని ప్రజలు వేర్వేరు విషయాలను ఎంచుకుంటారు. ఉదాహరణకు, మంచి పుస్తకాలను చదివితే సేదదీర్పు పొందవచ్చని ఒక వ్యక్తి అనుకుంటే, అలా చేస్తే బోరు కొడుతుందని మరో వ్యక్తి అనుకోవచ్చు. అందమైన పరిసరాలను చూస్తూ తిరిగితే బాగుంటుందని కొంతమంది అనుకుంటే, దానివల్ల చాలా అలసిపోతామని మరికొంతమంది అనుకుంటారు. ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకున్నట్లే, ఉల్లాసం కోసం తమకు నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు.—రోమా. 14:2-4.

4. ఉల్లాసం కోసం మనం ఎంచుకునే వాటి విషయంలో ఎందుకు హద్దులు విధించుకోవాలి? ఏ ఉదాహరణను పరిశీలిస్తే దీన్ని అర్థంచేసుకోగలుగుతాం?

4 ఉల్లాసం కోసం ఎంచుకునే వాటి విషయంలో మనకు స్వేచ్ఛ ఉన్నా, మనకు తోచిన ప్రతీదాన్ని ఎంచుకోకూడదు. ఆహారం గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడవచ్చు. కానీ, పాడైపోయిన ఆహారాన్ని ఎవ్వరూ తినాలనుకోరు. అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే, ఉల్లాసం కోసం వేర్వేరు రకాల మంచి కార్యకలాపాలను ఎంచుకోవడానికి మనం ఇష్టపడవచ్చు. కానీ, మన ప్రాణాన్ని ప్రమాదంలో పడవేసే అనైతికమైన, క్రూరమైన లేదా మరితర రకాలైన వాటిని ఎంచుకోం. అలాంటివి బైబిలు సూత్రాలకు విరుద్ధమైనవి. అవి యెహోవాతో మనకున్న స్నేహాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాక, మన ఆరోగ్యాన్ని కూడా పాడుచేయవచ్చు. కాబట్టి ఉల్లాసం కోసం మనం ఎంచుకునే వాటి విషయంలో హద్దులు విధించుకోవాలి. మనం చేయాలనుకున్నదాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ తర్వాతే, మనకు ప్రయోజనం చేకూర్చే వాటిని, యెహోవా ఇష్టపడే వాటిని ఎంచుకోవాలి. (ఎఫె. 5:10) అయితే, ఏవి మంచివో మనకెలా తెలుస్తుంది?

5. ఉల్లాసం కోసం మనం ఎంచుకునేవి యెహోవా ఇష్టపడేవిధంగా ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది?

5 ఉల్లాసం కోసం మనం ఎంచుకునేవి మనకు ప్రయోజనం చేకూర్చాలన్నా, యెహోవా ఇష్టపడేవిధంగా ఉండాలన్నా అవి బైబిలు ప్రమాణాలకు తగినట్లుగా ఉండాలి. (కీర్త. 86:11) ఈ విషయంలో మనం తగిన నిర్ణయం తీసుకోవాలంటే మనం ఈ మూడు ప్రశ్నల గురించి ఆలోచించాలి: ఎలాంటి వినోదాన్ని ఎంచుకుంటాం? ఎంత సమయం వెచ్చిస్తాం? ఎవరితో కలిసి పాల్గొంటాం? మనం వాటినిప్పుడు పరిశీలిద్దాం.

ఎలాంటి వినోదాన్ని ఎంచుకుంటాం?

6. మనం ఎలాంటి వినోదాన్ని ఎంచుకోకూడదు? ఎందుకు?

6 వినోదాన్ని ఎంచుకునే ముందు, ‘ఎలాంటి వినోదాన్ని ఎంచుకుంటాం?’ అని ప్రశ్నించుకోవాలి. రెండు రకాల వినోదాలు ఉన్నాయని గుర్తుంచుకోవడం మంచిది. మొదటి రకాన్ని క్రైస్తవులు అస్సలు ఎంచుకోరు. రెండవ రకాన్ని మనం ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇంతకీ మొదటి రకమైన వినోదం ఏది? ఈ దుష్టలోకంలో ఉన్న వినోదంలో చాలామేరకు బైబిలు సూత్రాలకు పూర్తిగా వ్యతిరేకమైనవే లేదా దేవుని నియమాలను ఉల్లంఘించేవే ఉన్నాయి. (1 యోహా. 5:19) నిజక్రైస్తవులు ఎన్నడూ అలాంటి వినోదాన్ని ఎంచుకోకూడదు. అంటే దయ్యాల సంబంధమైనవి, స్వలింగ సంయోగం, అశ్లీలత, క్రూరత్వం వంటివి ఉన్న వినోదాన్ని ఎంచుకోకూడదు. సంతోషం కోసం ఇతరులకు శారీరక హాని చేయడాన్ని చూపించే లేదా అనైతికమైన పనులు చేస్తే తప్పులేదని చూపించే వినోదాన్ని కూడా ఎంచుకోకూడదు. (1 కొరిం. 6:9, 10; ప్రకటన 21:8 చదవండి.) మనం ఒంటరిగా ఉన్నా పదిమందిలో ఉన్నా, అలాంటి వినోదాన్ని ఎంచుకోవాలని ఎన్నడూ అనుకోం కానీ ‘చెడ్డదాన్ని’ అసహ్యించుకుంటున్నామని యెహోవాకు చూపించాలనుకుంటాం.—రోమా. 12:9; 1 యోహా. 1:5, 6.

7, 8. వినోదం విషయంలో మనమెలా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు? వినోదాన్ని ఎంచుకునేటప్పుడు మనం ఏ ఉదాహరణ గురించి ఆలోచించవచ్చు?

7 రెండవ రకం వినోదం విషయంలోనైతే మనం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బైబిలు వీటి గురించి పూసగుచ్చినట్లు చెప్పకపోవచ్చు. కానీ, యెహోవా దృష్టిలో ఏది మంచిదో, ఏది సరైనదో అర్థంచేసుకోవడానికి సహాయం చేసే సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి, ఇలాంటి వినోదాన్ని ఎంచుకునే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే ముందు అవి బైబిలు సూత్రాలకు వ్యతిరేకంగా లేవని నిర్ధారించుకోవాలి. (సామె. 4:10, 11) ఆ తర్వాతే, మనం మంచి మనస్సాక్షిని కాపాడుకోవడానికి తోడ్పడే నిర్ణయాన్ని తీసుకోవాలి. (గల. 6:5; 1 తిమో. 1:19) అయితే మనమెలా మంచి నిర్ణయాన్ని తీసుకోవచ్చు? మళ్ళీ ఒకసారి ఆహారం గురించి ఆలోచించండి. మనం ఒక కొత్త రకమైన ఆహారాన్ని తినే ముందు, అందులో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటాం. అలాగే, ఏదైనా వినోదాన్ని ఎంచుకునే ముందు అందులో ఏముందో తెలుసుకోవాలనుకుంటాం. అప్పుడే అది క్రైస్తవులకు తగినదో కాదో తెలుసుకొని ఒక నిర్ణయానికి రాగలుగుతాం.—ఎఫె. 5:17.

8 ఉదాహరణకు, చాలామంది ఆటలను ఎక్కువగా ఇష్టపడవచ్చు. ఆటలాడితే సంతోషంగా, సరదాగా ఉంటుంది. కానీ కొన్ని ఆటల్లో పోటీతత్వం క్రూరమైన స్థాయికి చేరుకోవచ్చు లేదా దానివల్ల ప్రాణాలకే ముప్పు రావచ్చు. కొన్ని ఆటలు ప్రమాదకరంగా ఉంటాయి, వాటివల్ల చాలా దెబ్బలు తగులుతాయి. మరికొన్ని ఆటల్లో, విజయం సాధించినవాళ్ళ ఉత్సాహధ్వనులు శృతిమించుతాయి, వాళ్ళు దేశాభిమానంతో ఊగిపోతారు. అలాంటివి జరిగే ఆటల్ని మీరు ఇష్టపడుతుంటే మీరేమి చేయవచ్చు? అవి ఎలాంటి ఆటలో ఆలోచిస్తే, బహుశా అలాంటి వినోదం యెహోవా ఆలోచనా తీరుకూ లేదా ప్రేమాసమాధానాలతో కూడిన సువార్తకూ వ్యతిరేకంగా ఉందనే నిర్ణయానికి మీరు రావచ్చు. (యెష. 61:1; గల. 5:19-21) ఒకవేళ ఆ వినోదం యెహోవా ప్రమాణాలకు అనుగుణంగానే ఉందన్న నమ్మకం మీకు కుదిరితే, అలాంటి వినోదం నుండి మీరు ప్రయోజనం పొందుతారు. అంతేకాక అది మీకు బలాన్ని కూడా ఇస్తుంది.—గల. 5:22, 23; ఫిలిప్పీయులు 4:8 చదవండి.

ఎంత సమయం వెచ్చిస్తాం?

9. ‘ఎంత సమయం వెచ్చిస్తాం?’ అనే ప్రశ్నకు మనమిచ్చే జవాబును బట్టి ఏమి తెలుస్తుంది?

9 మనం ఇప్పటివరకు, ‘ఎలాంటి వినోదాన్ని ఎంచుకుంటాం?’ అనే మొదటి ప్రశ్నను పరిశీలించాం. ఆ ప్రశ్నకు మనమిచ్చే జవాబును బట్టి మనం ఏమి ఇష్టపడతామో మనకు ఏవి నచ్చుతాయో తెలుస్తుంది. ‘ఎంత సమయం వెచ్చిస్తాం?’ అనే రెండవ ప్రశ్నను ఇప్పుడు పరిశీలిద్దాం. ‘నేను ఎంత తరచుగా ఉల్లాసకార్యక్రమాల్లో పాల్గొంటాను? వాటికోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తాను?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ‘ఎంత సమయం వెచ్చిస్తాం?’ అనే ప్రశ్నకు మనమిచ్చే జవాబును బట్టి మన దృష్టిలో ఏవి ప్రాముఖ్యమైనవో తెలుస్తుంది. మరి ఉల్లాసం కోసం మనం చేసేవి మన జీవితంలో ఎంత ముఖ్యమైనవో ఎలా తెలుసుకోగలుగుతాం?

10, 11. మత్తయి 6:33లోని యేసు మాటలను బట్టి ఉల్లాసం కోసం మనం చేసే పనులకు ఎంత సమయం వెచ్చించాలనేది మనమెలా నిర్ణయించుకోవచ్చు?

10 యేసుక్రీస్తు తన అనుచరులకు ఇలా చెప్పాడు: “నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ.” (మార్కు 12:30) అంతేకాక, “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అని కూడా యేసు చెప్పాడు. ఆయన చెప్పిన ఆ మాటకు లోబడితే, యెహోవాను ప్రేమించడానికే మన జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నామని చూపించగలుగుతాం. (మత్త. 6:33) యేసు చెప్పిన మాటలను పరిశీలిస్తే, ఉల్లాసం కోసం మనం చేసేవి మన జీవితంలో ఎంత ముఖ్యమైనవో, వాటికోసం మనం ఎంత సమయం వెచ్చించాలో తెలుసుకోవచ్చు.

11 మనం ‘రాజ్యాన్ని మొదట వెదకడం’ గురించి యేసు చెప్పాడని గమనించండి. అయితే కేవలం రాజ్యాన్ని మాత్రమే వెదుకుతూ ఉండమని ఆయన చెప్పలేదు. రాజ్యాన్ని వెదకడంతో పాటు జీవితంలో మనం ఎన్నో పనులు చేయాల్సి ఉంటుందని ఆయనకు తెలుసు. ఉద్యోగం, ఆహారం, ఇల్లు, వస్త్రాలు, కనీస విద్య, ఉల్లాసం కోసం మనం చేసే పనులు వంటి వాటికోసం తగినంత సమయాన్ని వెచ్చించాలి. కానీ, మన జీవితంలో వాటికి మొదటిస్థానం ఇవ్వకూడదు, రాజ్యానికే ఇవ్వాలి. (1 కొరిం. 7:29-31) దేనికి మొదటిస్థానం ఇవ్వాలో గ్రహిస్తే వినోదాన్ని, ఇతర విషయాలన్నిటినీ రెండవస్థానంలోకి నెట్టివేసి, రాజ్యానికే మొదటిస్థానం ఇస్తాం. అప్పుడు, ఉల్లాసం కోసం మనం చేసే వాటి వల్ల మనం ప్రయోజనం పొందుతాం.

12. ఉల్లాసం కోసం మనం చేసేవాటి విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి లూకా 14:28 ఎలా సహాయం చేస్తుంది?

12 ఉల్లాసం కోసం మనం చేసేవాటి విషయంలో మనం నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ‘లెక్క చూసుకోవాలి’ లేదా వాటికి ఎంత సమయం పడుతుందో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. (లూకా 14:28) ఏదైనా వస్తువు కొనడానికి డబ్బు అవసరమైనట్లే ఉల్లాసకార్యక్రమాలకు సమయం అవసరమౌతుంది. వాటికోసం ఎంత సమయం వెచ్చిస్తామనే దానిగురించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తిగత బైబిలు అధ్యయనం, కుటుంబ ఆరాధన, క్రైస్తవ కూటాలకు వెళ్ళడం లేదా ప్రకటనా పని చేయడం వంటి ప్రాముఖ్యమైన విషయాలకు సమయం లేకుండా అయ్యేంతగా మనం ఉల్లాసకార్యక్రమాలకు సమయాన్ని వెచ్చించకూడదు. (మార్కు 8:36) కానీ, ఒకవేళ ఉల్లాసం కోసం మనం చేసేవి దేవుని సేవలో కొనసాగడానికి మనకు బలాన్ని ఇస్తున్నట్లైతే మనం వాటికి సమయం వెచ్చించడం ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

ఎవరితో కలిసి పాల్గొంటాం?

13. మనం ఎవరితో కలిసి ఉల్లాసకార్యక్రమాల్లో పాల్గొంటామనే దానిగురించి ఎందుకు జాగ్రత్తగా ఆలోచించాలి?

13 ‘ఎవరితో కలిసి ఉల్లాసకార్యక్రమాల్లో పాల్గొంటాం?’ అన్నది మూడో ప్రశ్న. దీనికి జవాబు తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే, మనం ఈ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడమనేది మన స్నేహితులపై ఆధారపడివుంటుంది. ఉదాహరణకు, మనం ఇతరులతో కలిసివున్నప్పుడు వాళ్ళతో కలిసి సంతోషంగా భోజనం చేస్తాం. ఉల్లాసకార్యక్రమాల విషయంలో కూడా అంతే. మంచి స్నేహితులతో ఉన్నప్పుడు మనం మరింత సంతోషంగా వాటిలో పాల్గొంటాం. కాబట్టి, మనలో చాలామంది, ముఖ్యంగా యౌవనస్థులు ఇతరులతో కలిసి ఉల్లాసకార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ఇష్టపడతారనేది అర్థంచేసుకోదగిన విషయమే. కానీ, వాటిని ఎంచుకునే ముందు ఎవరు మంచి స్నేహితులు, ఎవరు కాదు అనేది నిర్ధారించుకోవాలి. అలాచేస్తే మనం ఎంచుకునే ఉల్లాసకార్యక్రమాల వల్ల ప్రయోజనం పొందుతాం.—2 దిన. 19:2; సామెతలు 13:20 చదవండి; యాకో. 4:4.

14, 15. (ఎ) యేసు మాదిరిని అనుసరిస్తే మనం మంచి స్నేహితులను ఎలా ఎంచుకోగలుగుతాం? (బి) స్నేహితులను ఎంచుకునేటప్పుడు మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

14 యేసు మాదిరిని అనుసరిస్తే మంచి స్నేహితులను సంపాదించుకోగలుగుతాం. యేసు ప్రజల్ని ప్రేమించేవాడు. (సామె. 8:31) ఆయన భూమ్మీదున్నప్పుడు ప్రతీ ఒక్కరిని ప్రేమించాడు, గౌరవించాడు. (మత్త. 15:29-37) స్నేహపూరితంగా ఉండడానికి, దగ్గరి స్నేహితులుగా ఉండడానికి మధ్య తేడా ఉందని యేసుకు తెలుసు. ప్రజలందరితో యేసు స్నేహపూరితంగానే ఉన్నా, ఆయన అందరికీ దగ్గరి స్నేహితుడిగా లేడు. తన 11 మంది నమ్మకమైన అపొస్తలులతో మాట్లాడిన మాటలను బట్టి ఆయన తన దగ్గరి స్నేహితులను ఎలా ఎంచుకున్నాడో తెలుస్తుంది. ఆయనిలా అన్నాడు, “నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.” (యోహా. 15:14; యోహాను 13:27, 30 కూడా చూడండి.) తనను అనుసరిస్తూ, యెహోవాను సేవిస్తున్నవాళ్ళను మాత్రమే ఆయన తన దగ్గరి స్నేహితులుగా ఎంచుకున్నాడు.

15 మీరు ఒక వ్యక్తిని మీ దగ్గరి స్నేహితునిగా చేసుకునే ముందు యేసు చెప్పిన మాటలను గుర్తుంచుకోవడం మంచిది. ఈ ప్రశ్నలు వేసుకోండి, ‘ఈ వ్యక్తి తన మాటల్లో, చేతల్లో యెహోవా ఆజ్ఞలకు, యేసు ఆజ్ఞలకు లోబడుతున్నట్లు చూపిస్తున్నాడా? ఆయన మంచిదాన్ని ప్రేమించి చెడ్డదాన్ని అసహ్యించుకుంటున్నాడా? రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వడానికి, యెహోవా నమ్మకమైన సేవకునిగా కొనసాగడానికి ఈయన నాకు సహాయం చేస్తాడా?’ ఈ ప్రశ్నలకు మీరు ‘అవును’ అని జవాబు ఇవ్వగలిగితే, ఉల్లాసకార్యక్రమాల్లో కలిసి సమయాన్ని వెచ్చించగల మంచి స్నేహితుడు ఆయనేనని చెప్పవచ్చు.—కీర్తన 119:63 చదవండి; 2 కొరిం. 6:14; 2 తిమో. 2:22.

ఉల్లాసం కోసం మనం చేసేవి బైబిలు ప్రమాణాలకు తగినట్లు ఉంటున్నాయా?

16. ఉల్లాసకార్యక్రమాల గురించి మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

16 ‘ఎలాంటి వినోదాన్ని ఎంచుకుంటాం? ఎంత సమయం వెచ్చిస్తాం? ఎవరితో కలిసి పాల్గొంటాం?’ అనే మూడు ప్రశ్నలను మనం పరిశీలించాం. మనం ఉల్లాసకార్యక్రమాల్లో పాల్గొనేముందు అవి ఎలాంటివో, వాటికి ఎంత సమయం వెచ్చిస్తామో, ఎలాంటి స్నేహితులతో కలిసి వాటిలో పాల్గొంటామో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఉల్లాసం కోసం మనం చేసే వాటివల్ల మనం ప్రయోజనం పొందాలంటే అవి బైబిలు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వాటి గురించి ఆలోచించేటప్పుడు, ‘ఈ వినోదంలో ఏమి ఉన్నాయి? ఇలాంటివి యెహోవాకు ఇష్టమేనా? ఇవి క్రూరమైనవా, అనైతికమైనవా?’ అని ప్రశ్నించుకోవాలి. (సామె. 4:20-27) వాటికోసం ఎంత సమయం వెచ్చిస్తున్నామనే దాని గురించి ఆలోచించేటప్పుడు, ‘నేను ఉల్లాసకార్యక్రమాల్లో ఎంత తరచుగా పాల్గొంటాను? వాటికి అంత సమయం వెచ్చించడం వల్ల నేను ప్రయోజనం పొందుతున్నానా?’ అని ప్రశ్నించుకోవాలి. (1 తిమో. 4:8) వాటిలో ఎవరితో కలిసి పాల్గొంటామనే దానిగురించి ఆలోచించేటప్పుడు, ‘నా సహవాసులు ఎవరు? వాళ్ళు ఎలాంటివాళ్ళు?’ అని ప్రశ్నించుకోవాలి.—ప్రసం. 9:18; 1 కొరిం. 15:33.

17, 18. (ఎ) ఉల్లాసం కోసం మనం చేసేవి బైబిలు ప్రమాణాలకు తగినట్లు ఉంటున్నాయా లేదా అని ఎలా పరిశీలించుకోవచ్చు? (బి) వాటి విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు?

17 మనం చర్చించిన ఆ మూడు విషయాల్లో ఏ ఒక్కదాంట్లో తప్పినా మనం పాల్గొనే ఉల్లాసకార్యక్రమాలు బైబిలు ప్రమాణాలకు తగినట్లుగా లేనట్లే. కానీ, ఆ మూడు విషయాల్లో ఉల్లాసకార్యక్రమాలు బైబిలు ప్రమాణాలకు తగినట్లుగా ఉంటే, అవి యెహోవాను ఘనపరుస్తాయి, మనకు ప్రయోజనకరంగా ఉంటాయి.—కీర్త. 119:33-35.

18 ఉల్లాసం కోసం మనం చేసే వాటి విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మనం సరైన సమయంలో సరైన వ్యక్తులతో సరైనదాన్ని చేయడానికి శాయశక్తులా కృషి చేయాలి. బైబిలు చెబుతున్న ఈ మాటకు లోబడాలనే కోరిక మనకు ఉండాలి: “మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.”—1 కొరిం. 10:31.

మీరు వివరించగలరా?

ఉల్లాసం కోసం చేసే వాటి విషయంలో ఈ కింది లేఖనాల్లోని సూత్రాలను ఎలా అన్వయించుకోవచ్చు?

ఫిలిప్పీయులు 4:8

మత్తయి 6:33

సామెతలు 13:20

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఎలాంటి వినోదాన్ని ఎంచుకుంటాం?

[10వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఎంత సమయం వెచ్చిస్తాం?

[12వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఎవరితో కలిసి పాల్గొంటాం?

[10వ పేజీలోని చిత్రం]

యెహోవాను సేవిస్తున్నవాళ్ళనే యేసు తన దగ్గరి స్నేహితులుగా ఎంచుకున్నాడు