కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిలు జీవితాలను మారుస్తుంది

జూదగానిగా, దొంగగా ఉన్న వ్యక్తి తన వ్యసనం నుండి ఎలా బయటపడ్డాడు? ఆయన జీవితాన్ని ఏది మార్చింది? ఆయన మాటల్లోనే చూడండి.

“గుర్రపుపందాలంటే నాకు పిచ్చి ఉండేది.”—రిచర్డ్‌ స్టూవర్ట్‌

జననం: 1965

దేశం: జమైకా

ఒకప్పుడు: జూదగాడు, నేరస్థుడు

నా గతం: నేను జమైకా రాజధాని కింగ్‌స్టన్‌లో ప్రజలతో క్రిక్కిరిసిన ప్రాంతంలో పెరిగాను. ఆ ప్రాంతంలో ఎక్కువ పేదవాళ్లే ఉండేవాళ్లు. అక్కడ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేది, ఎక్కడ చూసినా నేరాలే జరిగేవి. రౌడీ ముఠాల వల్ల ప్రజలు భయంభయంగా జీవించేవారు. ఇంచుమించు ప్రతీరోజు తుపాకుల మోత వినబడేది.

మా అమ్మ కష్టజీవి. నాకోసం, నా తమ్ముని కోసం తన సర్వస్వాన్నీ ధారపోసింది. మాకు మంచి విద్యాబుద్ధులు అందేలా చూసింది. స్కూలుకు వెళ్లడమంటే ఇష్టముండేది కాదుగానీ గుర్రపుపందాలంటే నాకు పిచ్చి ఉండేది. స్కూలు ఎగ్గొట్టి గుర్రపుపందాలు చూడడానికి వెళ్లేవాణ్ణి. గుర్రాలపై స్వారీ కూడా చేశాను.

త్వరలోనే గుర్రపుపందాలపై జూదమాడడంలో పూర్తిగా మునిగిపోయాను. ఎంతోమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని చెడు జీవితాన్ని గడిపాను. నేను గంజాయి సేవించేవాణ్ణి, నా వ్యసనాల కోసం దొంగతనాలు చేసేవాణ్ణి. నా దగ్గర ఎన్నో తుపాకులు ఉండేవి, నేను చేసిన లెక్కలేనన్ని దొంగతనాల్లో ఎవరూ చనిపోనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

చివరకు పోలీసులకు దొరికిపోయాను, నన్ను జైల్లో పెట్టారు. జైలు నుండి విడుదలైన తర్వాత మళ్లీ షరామామూలే. చెప్పాలంటే ముందుకన్నా చెడ్డగా తయారయ్యాను. చూడ్డానికి నేను అమాయకంగా కనిపించినా అనుకున్నదే చేసేవాణ్ణి, ఎప్పుడూ చిర్రుబుర్రులాడేవాణ్ణి, క్రూరంగా ప్రవర్తించేవాణ్ణి. నా గురించి తప్ప ఎవరి గురించీ ఆలోచించేవాణ్ణి కాదు.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . . నేను అలాంటి దుర్భర జీవితం గడుపుతున్న రోజుల్లో మా అమ్మ బైబిలు అధ్యయనం చేసి యెహోవాసాక్షి అయ్యింది. ఆమె వ్యక్తిత్వంలో వచ్చిన మంచి మార్పు చూసి నాలో కుతూహలం పెరిగింది. మా అమ్మ ఎందుకలా మారిందో తెలుసుకోవాలనుకుని, యెహోవాసాక్షులతో లేఖనాలను చర్చించడం మొదలుపెట్టాను.

యెహోవాసాక్షుల బోధలకు ఇతర మతాల బోధలకు వ్యత్యాసం ఉందనీ, వాళ్లు ప్రతీది బైబిలు ఆధారంగానే చెబుతారనీ గమనించాను. నాకు తెలిసినంత వరకు, మొదటి శతాబ్ద క్రైస్తవుల్లా ఇంటింటికి వెళ్లి ప్రకటించింది వాళ్లు మాత్రమే. (మత్తయి 28:19; అపొస్తలుల కార్యములు 20:20, 21) వాళ్లు ఒకరిపట్ల ఒకరు చూపించుకున్న నిజమైన ప్రేమను చూసినప్పుడు వాళ్లదే నిజమైన మతమని నమ్మకం కుదిరింది.—యోహాను 13:35.

నేను పెద్దపెద్ద మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని బైబిలు నుండి నేర్చుకున్నాను. యెహోవా దేవుడు జారత్వాన్ని అసహ్యించుకుంటున్నాడని, నేను ఆయన్ని సంతోషపర్చాలంటే నా శరీరాన్ని కలుషితం చేసే అలవాట్లను మానేయాలని తెలుసుకున్నాను. (2 కొరింథీయులు 7:1; హెబ్రీయులు 13:4) యెహోవాకు కూడా భావాలున్నాయని, నేను చేసే పనులను బట్టి ఆయన నొచ్చుకుంటాడని లేదా సంతోషపడతాడని తెలుసుకోవడం నన్నెంతో కదిలించింది. (సామెతలు 27:11) అందుకే గంజాయి సేవించడం మానుకోవాలని, తుపాకులను విడిచిపెట్టాలని, మంచి మనిషిగా మారాలని నిశ్చయించుకున్నాను. చెడు జీవితాన్ని, జూదాన్ని విడిచిపెట్టడం నాకు అన్నిటికన్నా కష్టమైంది.

యెహోవాసాక్షులతో నేను బైబిలు అధ్యయనం చేస్తున్న సంగతి నా స్నేహితులకు తెలియకూడదని మొదట్లో అనుకున్నాను. అయితే, మత్తయి 10:33 చదివిన తర్వాత నాలో మార్పు వచ్చింది, అక్కడ యేసు ఇలా అన్నాడు: “ప్రజల సమక్షంలో నన్ను తిరస్కరించిన వాణ్ణి నేను పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో తిరస్కరిస్తాను.” (పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఆ మాటల వల్ల వచ్చిన ధైర్యంతో, యెహోవాసాక్షుల దగ్గర బైబిలు అధ్యయనం తీసుకుంటున్నానని నా స్నేహితులకు చెప్పేశాను. అది విని వాళ్లు ఆశ్చర్యపోయారు. నాలాంటి వాడు క్రైస్తవుడు అవ్వాలనుకుంటున్నాడన్న విషయం వాళ్లకు మింగుడుపడలేదు. గతంలో చేసిన పనులేవీ ఇకముందు చేయనని వాళ్లకు చెప్పేశాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . . నేను బైబిలు సూత్రాల ప్రకారం జీవించడం చూసి మా అమ్మ ఎంతో సంతోషించింది. నేనేమైనా తప్పు చేస్తానేమోననే దిగులు మా అమ్మకు ఇప్పుడు లేదు. మా ఇద్దరికీ యెహోవా అంటే ఇష్టం కాబట్టి ఆయన పట్ల మాకున్న ప్రేమ గురించి మాట్లాడుకుంటుంటాం. కొన్నిసార్లు, ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినో గుర్తుచేసుకుంటాను, దేవుని సహాయంతో ఎన్ని మార్పులు చేసుకోగలిగానో చూస్తే నాకే ఆశ్చర్యమేస్తుంది. నేను చెడుగా జీవించాలని లేదా వస్తుసంపదల కోసం ప్రాకులాడాలని ఇక ఏమాత్రం అనుకోవడం లేదు.

అప్పుడు నేను బైబిలు సందేశానికి స్పందించకపోతే ఇప్పటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి లేదా జైల్లో ఉండేవాణ్ణి. ఇప్పుడైతే నాకు చక్కని, సంతోషకరమైన కుటుంబం ఉంది. మంచిగా సహకరించే భార్యతో, మాట వినే కూతురుతో కలిసి యెహోవా సేవ చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రేమగల క్రైస్తవ సహోదరులతో కలిసి ఉండే అవకాశమిచ్చిన యెహోవాకు, బైబిలు సత్యాలను నాకు నేర్పించడానికి ప్రయాసపడిన వాళ్లకు నేనెంతో కృతజ్ఞుణ్ణి. బైబిలు గురించి ఇతరులకు నేర్పించడానికి దొరికిన అవకాశాలను విలువైనవిగా ఎంచుతాను. మరిముఖ్యంగా యెహోవా ప్రేమతో, దయతో తన గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు రుణపడివున్నాను. (w11-E 11/01)

[15వ పేజీలోని బ్లర్బ్‌]

“యెహోవాకు కూడా భావాలున్నాయని, నేను చేసే పనులను బట్టి ఆయన నొచ్చుకుంటాడని లేదా సంతోషపడతాడని తెలుసుకున్నాను”

[15వ పేజీలోని చిత్రం]

నా భార్య, కూతురుతో నేను

[15వ పేజీలోని చిత్రం]

మా అమ్మ వ్యక్తిత్వంలో మంచి మార్పు రావడం చూశాను