కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి’

‘స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి’

‘స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి’

“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.” —సామె. 3:5.

1, 2. (ఎ) మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురుకావచ్చు? (బి) కష్టాల్లో ఉన్నప్పుడు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, తప్పుడు ఆలోచనల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి? ఎందుకలా చేయాలి?

 సింథీయ a పనిచేసే కంపెనీ యజమాని అప్పటికే కొన్ని విభాగాలను మూసేశాడు. వాటిలో పనిచేస్తున్న చాలామందిని ఉద్యోగంలో నుండి తీసేశాడు. తర్వాత తన వంతేనని సింథీయకు అనిపిస్తోంది. ఉద్యోగం పోతే పరిస్థితి ఏమిటి? నెల ఖర్చులకు డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి? పమేలా అనే సహోదరికి, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలనే కోరిక ఉంది, కానీ వెళ్ళాలా, వద్దా? సామ్యూల్‌ అనే యౌవనస్థునిది మరో సమస్య. చిన్న వయసులో ఉన్నప్పుడు అతను అశ్లీల చిత్రాలు చూశాడు. సామ్యూల్‌కి ఇప్పుడు 20 ఏళ్ళు దాటాయి, అయితే విడిచిపెట్టిన ఆ చెడ్డ అలవాటు వైపు మళ్ళీ అతని మనసు లాగుతోంది. ఈ తప్పుడు ఆలోచనల నుండి బయటపడాలంటే అతను ఏమి చేయాలి?

2 కష్టాల్లో ఉన్నప్పుడు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, తప్పుడు ఆలోచనల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఎవరి మీద ఆధారపడతారు? మీ మీద మాత్రమే నమ్మకం పెట్టుకుంటారా, లేక మీ ‘భారం యెహోవామీద మోపుతారా?’ (కీర్త. 55:22) “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి” అని బైబిలు చెబుతోంది. (కీర్త. 34:15) కాబట్టి, మనం స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, పూర్ణహృదయంతో యెహోవా మీద నమ్మకముంచడం చాలా ప్రాముఖ్యం.—సామె. 3:5.

3. (ఎ) మనం యెహోవా మీద నమ్మకం పెట్టుకుంటే ఏమి చేస్తాం? (బి) కొంతమంది ఎందుకు స్వబుద్ధి మీద ఆధారపడడానికే ఇష్టపడతారు?

3 పూర్ణహృదయంతో యెహోవా మీద ఆధారపడినప్పుడు ఆయన చెప్పినట్లు చేస్తాం, ఆయన చిత్తానికి తగినట్లు నడుచుకుంటాం. అలా చేయాలంటే మనల్ని నడిపించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆయనకు పదేపదే ప్రార్థించాలి. అయితే, యెహోవా మీద పూర్తిగా ఆధారపడడం అందరికీ అంత సులభంగా ఉండదు. ఉదాహరణకు, లిన్‌ అనే సహోదరి, “యెహోవా మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం నాకు ఎప్పుడూ కష్టంగానే ఉండేది” అని చెప్పింది. ఆమెకు ఎందుకలా అనిపించేది? “మొదటి నుండి నాకు మా నాన్నతో ఎలాంటి సంబంధాలూ లేవు, అమ్మ ఉన్నా ఆవిడ నా అవసరాల గురించి పట్టించుకునేది కాదు. కాబట్టి చిన్నప్పటి నుండి నా విషయాలు నేనే చూసుకోవడం నేర్చుకున్నాను” అని ఆమె వివరిస్తోంది. లిన్‌ పెరిగిన పరిస్థితులను బట్టి ఆమెకు ఎవరినైనా పూర్తిగా నమ్మాలంటే కష్టంగా అనిపించేది. అనుకున్నవన్నీ చక్కగా చేయగలుగుతున్నందువల్ల కూడా కొంతమంది తమపై తాము ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. సంఘ పెద్దలు కొన్నిసార్లు ముందుగా యెహోవాకు ప్రార్థించకుండా తమకున్న అనుభవాన్ని బట్టి సంఘంలోని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటారు.

4. ఈ ఆర్టికల్‌లో మనం ఏమి నేర్చుకుంటాం?

4 ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అడిగినవాటికి తగినట్లుగా జీవించడానికి మనస్ఫూర్తిగా కృషి చేయాలని, తన చిత్తానికి తగినట్లుగా నడుచుకోవాలని యెహోవా కోరుకుంటాడు. మన భారాన్ని యెహోవా మీద వేస్తూనే సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం చేయాల్సింది ఎలా చేయవచ్చు? నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఎలా జాగ్రత్త వహించాలి? తప్పుడు ఆలోచనల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రార్థన చేయడం ఎందుకు అవసరం? బైబిల్లోని ఉదాహరణలు పరిశీలిస్తూ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

కష్టాల్లో ఉన్నప్పుడు

5, 6. అష్షూరును పరిపాలించిన సన్హెరీబు బెదిరించినప్పుడు హిజ్కియా ఏమి చేశాడు?

5 యూదా రాజ్యాన్ని పరిపాలించిన హిజ్కియా ‘యెహోవాను హత్తుకొని, ఆయనను వెంబడించడంలో వెనుకతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనేవాడు’ అని బైబిలు చెబుతోంది. ఎందుకంటే ఆయన ‘ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాపై విశ్వాసముంచాడు.’ (2 రాజు. 18:5, 6) అష్షూరును పరిపాలించిన సన్హెరీబు తన సేవకుడైన రబ్షాకేను, మరికొంతమందిని పెద్ద సైన్యంతో యెరూషలేము మీదకు పంపించినప్పుడు హిజ్కియా ఏమి చేశాడు? ఆ బలమైన అష్షూరు సైన్యం అప్పటికే యూదాలోని ఎన్నో పటిష్ఠమైన నగరాలను చేజిక్కించుకుంది. ఇప్పుడు సన్హెరీబు కళ్ళు యెరూషలేము మీద పడ్డాయి. అప్పుడు హిజ్కియా యెహోవా మందిరానికి వెళ్ళి “యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలిసికొనునట్లుగా అతనిచేతిలో నుండి మమ్మును రక్షించుము” అని ప్రార్థించాడు.—2 రాజు. 19:14-19.

6 హిజ్కియా తాను ప్రార్థించిన దానికి తగినట్లు ప్రవర్తించాడు. ప్రార్థించేందుకు ఆలయానికి వెళ్ళేముందు, రబ్షాకే ఎంత ఎగతాళి చేసినా అతనికి బదులు చెప్పవద్దని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. ప్రవక్తయైన యెషయా నుండి సలహా తీసుకోవడం కోసం హిజ్కియా ఆయన దగ్గరకు కూడా మనుష్యులను పంపించాడు. (2 రాజు. 18:36; 19:1, 2) హిజ్కియా తాను చేయాల్సిందంతా చేశాడు. ఆయన యెహోవా చిత్తానికి వ్యతిరేకంగా ఐగుప్తు లేదా ఇతర పొరుగు దేశాల సహాయం తీసుకొని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించలేదు. ఆయన స్వబుద్ధి మీద ఆధారపడకుండా యెహోవా మీద నమ్మకం పెట్టుకున్నాడు. అప్పుడు యెహోవా దూత సన్హెరీబు సైన్యంలోని 1,85,000 మందిని మట్టుపెట్టాడు. దాంతో సన్హెరీబు నీనెవెకు ‘తిరిగి పోయాడు.’—2 రాజు. 19:35, 36.

7. హన్నా, యోనా చేసిన ప్రార్థనల నుండి మనకు ఎలాంటి ఓదార్పు దొరుకుతుంది?

7 అలాగే లేవీయుడైన ఎల్కానా భార్య హన్నా పిల్లలు లేరని ఎంతో బాధపడుతున్న సమయంలో యెహోవా మీద ఆధారపడింది. (1 సమూ. 1:9-11, 18) మరో ఉదాహరణ యోనా. పెద్ద చేప కడుపులో నుండి యెహోవా యోనాను విడిపించకముందు ఆయన ఇలా ప్రార్థించాడు, “నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.” (యోనా 2:1, 2, 10) మన పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మనం యెహోవాకు ‘విన్నపం’ చేసుకోవచ్చని అర్థం చేసుకున్నప్పుడు మనకు ఎంతో ఓదార్పుగా ఉంటుంది.—కీర్తన 55:1, 16 చదవండి.

8, 9. హిజ్కియా, హన్నా, యోనా ముఖ్యంగా దేని గురించి ప్రార్థించారు? దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

8 మనం కష్టాల్లో ఉండగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విషయాన్ని మరచిపోకూడదో కూడా హిజ్కియా, హన్నా, యోనా ఉదాహరణల నుండి తెలుసుకోవచ్చు. కష్టకాలాల్లో ఆ ముగ్గురూ ఎంతో బాధపడ్డారు. వాళ్ళు చేసిన ప్రార్థనల గురించి చదివినప్పుడు, వాళ్ళు కేవలం తమ కష్టాలు తొలగిపోతే చాలని అనుకోలేదు కానీ దేవుని పేరు, ఆయన ఆరాధన, ఆయన చిత్తంచేయడం అన్నింటికన్నా ప్రాముఖ్యమని అనుకున్నారని తెలుస్తోంది. హిజ్కియా, యెహోవా పేరు అపకీర్తి పాలవుతోందని ఎంతో వేదన చెందాడు. హన్నా, తాను అంతగా కోరుకున్న కొడుకును షిలోహులోని యెహోవా గుడారంలో సేవచేయడానికి అప్పగిస్తానని ప్రమాణం చేసింది. యోనా, “నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను” అన్నాడు.—యోనా 2:9.

9 ఇబ్బందుల నుండి బయటపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నప్పుడు మనం ముఖ్యంగా దేని గురించి ఆలోచిస్తున్నామో పరిశీలించుకోవాలి. కేవలం సమస్యల నుండి ఉపశమనం పొందడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నామా లేక యెహోవా గురించి ఆయన చిత్తం గురించి ఆలోచిస్తున్నామా? కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు మనం వాటి గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తూ ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెట్టేసే అవకాశం ఉంది. మనం సహాయం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ముఖ్యంగా యెహోవా గురించి, ఆయన నామం పరిశుద్ధపర్చబడడం గురించి, ఆయన సర్వాధిపత్యం సరైనదని నిరూపించబడడం గురించి ఆలోచించాలి. అలా చేసినప్పుడు, మనం కోరుకున్నట్లుగా సమస్య పరిష్కారం కాకపోయినా నిరాశపడకుండా ముందుకు వెళ్ళగలుగుతాం. కొన్నిసార్లు, దేవుని సహాయంతో సమస్యను సహించి నిలబడాలనేదే మన ప్రార్థనలకు సమాధానం కావచ్చు.—యెషయా 40:29; ఫిలిప్పీయులు 4:13 చదవండి.

నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు

10, 11. ఏమి చేయాలో తోచని పరిస్థితి వచ్చినప్పుడు యెహోషాపాతు ఏమి చేశాడు?

10 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మీరు ఏమి చేస్తారు? ఏదైనా ఒక విషయంలో ఏమి చేయాలనేది ముందుగానే నిర్ణయించుకొని, దాన్ని ఆశీర్వదించమని యెహోవాకు ప్రార్థిస్తారా? బైబిల్లో ఉన్న ఒక సంఘటనను పరిశీలిద్దాం. యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో మోయాబీయులు, అమ్మోనీయులు కలిసి దానిపై దండెత్తారు. వాళ్ళ మీద యూదా రాజ్యం గెలిచే అవకాశమేలేదు. అప్పుడు యెహోషాపాతు ఏమి చేశాడు?

11 ‘యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొన్నాడు’ అని బైబిలు చెబుతోంది. యూదా రాజ్యంలోని వాళ్ళందరూ “యెహోవాయొద్ద విచారించుటకు” ఒకచోట చేరి ఉపవాసం ఉండాలని ఆయన ప్రకటించాడు. యూదా యెరూషలేముల ప్రజల ఎదుట ఆయన నిలబడి, “మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు” అని ప్రార్థించాడు. సత్య దేవుడు యెహోషాపాతు ప్రార్థన విని అద్భుతంగా వాళ్ళను రక్షించాడు. (2 దిన. 20:3-12, 17) ముఖ్యంగా, దేవునితో మనకున్న సంబంధాన్ని పాడుచేసే అవకాశం ఉన్న విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనం స్వబుద్ధి మీద ఆధారపడకుండా యెహోవా మీద నమ్మకం పెట్టుకోవడం అవసరం.

12, 13. నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దావీదు రాజు చేసిన మంచి పని ఏమిటి?

12 కొన్ని సమస్యలు మనం సులువుగానే పరిష్కరించగలమని అనుకుంటాం. బహుశా అంతకుముందు అలాంటి సమస్యనే పరిష్కరించడం వల్ల మనకు అలా అనిపిస్తుండవచ్చు. కానీ అలాంటి పరిస్థితిలో మనం ఏమి చేయాలి? ఒక సందర్భంలో రాజైన దావీదు చేసిన దాన్నిబట్టి మనం ఏమి చేయాలో తెలుసుకోవచ్చు. అమాలేకీయులు సిక్లగు అనే ప్రాంతం మీద దాడిచేసి దావీదు భార్యలను, పిల్లలను, ఆయనతోపాటు ఉన్న వాళ్ల భార్యలను, పిల్లలను తీసుకువెళ్ళిపోయారు. అప్పుడు దావీదు యెహోవాకు ప్రార్థన చేసి, ‘నేను ఈ దండును తరమనా?’ అని అడిగాడు. అందుకు యెహోవా, “తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువు” అని చెప్పాడు. దావీదు ఆ మాట విని బయలుదేరి, “అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను.”—1 సమూ. 30:7-9, 18-20.

13 అమాలేకీయులు దాడి చేసిన కొంతకాలానికి ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకు దండెత్తారు. దావీదు మళ్ళీ యెహోవాను అడిగాడు, అందుకు యెహోవా, “పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికప్పగించుదును” అని స్పష్టంగా చెప్పాడు. (2 సమూ. 5:18, 19) కొంతకాలానికే ఫిలిష్తీయులు మళ్ళీ దండెత్తారు. ఈసారి దావీదు ఏమి చేశాడు? ‘ఇలాంటి పరిస్థితే ఇంతకుముందు రెండుసార్లు వచ్చింది. ఇంతకుముందులాగే ఇప్పుడు కూడా నేను దేవుని శత్రువులతో యుద్ధం చేస్తాను’ అని ఆయన అనుకునే అవకాశం ఉంది. మరి దావీదు, ఏమి చేయాలో యెహోవాను అడిగాడా? అంతకుముందు చేసినట్లే చేస్తే సరిపోతుందని దావీదు అనుకోలేదు. ఆయన మళ్ళీ యెహోవాను అడిగాడు. ఆయన అలా అడిగి చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే ఈసారి యెహోవా మరోలా చేయమని చెప్పాడు. (2 సమూ. 5:22-24) ముందు వచ్చినలాంటి సమస్యే మళ్ళీ తలెత్తితే, అప్పుడు చేసినట్లు చేస్తే సరిపోతుందని అనుకోకుండా మనం జాగ్రత్తపడాలి.—యిర్మీయా 10:23 చదవండి.

14. గిబియోనీయులు వచ్చినప్పుడు యెహోషువ, ఇతర పెద్దలు చేసిన దాన్నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

14 మనందరం అపరిపూర్ణులం కాబట్టి అనుభవం ఉన్న పెద్దలతో సహా ఎవరమైనా సరే నిర్ణయం తీసుకునే ముందు ఆ విషయంలో యెహోవా ఏమి చెబుతున్నాడో తెలుసుకోవడం ప్రాముఖ్యమని మర్చిపోకూడదు. తెలివిగా ప్రవర్తిస్తూ దూర ప్రాంతం నుండి వచ్చినట్లు ఇశ్రాయేలీయులను నమ్మించాలని గిబియోనీయులు ప్రయత్నించినప్పుడు మోషే తర్వాతి నాయకుడైన యెహోషువ, ఇతర పెద్దలు ఏమి చేశారో తెలుసుకుందాం. యెహోషువ, ఆయనతోపాటు ఉన్నవాళ్ళు యెహోవాను అడగకుండా గిబియోనీయులతో స్నేహం చేసి, వాళ్ళతో నిబంధన చేసుకొన్నారు. తర్వాత కొంతకాలానికి యెహోవా వాళ్ళు చేసిన దాన్ని ఒప్పుకున్నా తనను అడగకుండా ఇశ్రాయేలీయులు నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని మన ప్రయోజనం కోసం బైబిల్లో రాయించాడు.—యెహో. 9:3-6, 14, 15.

తప్పుడు ఆలోచనల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు

15. తప్పుడు ఆలోచనల నుండి బయటపడాలంటే ఎందుకు తప్పకుండా ప్రార్థన చేయాలి?

15 మనలో “పాప నియమము” ఉంది కాబట్టి తప్పుడు ఆలోచనల నుండి బయటపడడానికి మనం తీవ్రంగా పోరాడాల్సి ఉంటుంది. (రోమా. 7:21-25) ఈ పోరాటంలో మనం విజయం సాధించగలం. అదెలా సాధ్యం? తప్పుడు ఆలోచనల నుండి బయటపడాలంటే తప్పకుండా ప్రార్థన చేయాలని యేసు తన అనుచరులకు చెప్పాడు. (లూకా 22:40 చదవండి.) దేవునికి ప్రార్థన చేసిన తర్వాత కూడా తప్పుడు ఆలోచనల నుండి బయటపడలేకపోతుంటే మనం ఏమి చేయాలి? ఆ ఆలోచనలకు లొంగిపోకుండా ఉండడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వమని మనం ‘దేవుణ్ణి అడుగుతూనే’ ఉండాలి. ‘ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగ దయచేస్తాడు’ అని బైబిలు మనకు మాటిస్తోంది. (యాకో. 1:5) “మీలో ఎవడైనను [ఆధ్యాత్మికంగా] రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును” అని కూడా యాకోబు రాశాడు.—యాకో. 5:14, 15.

16, 17. తప్పుడు ఆలోచనల నుండి బయటపడడానికి సహాయం చేయమని దేవునికి ఎప్పుడు ప్రార్థిస్తే మంచిది?

16 తప్పుడు ఆలోచనల నుండి బయటపడాలంటే ఎప్పుడు ప్రార్థన చేయాలో మనకు తెలియాలి. సామెతలు 7:6-23 వచనాల్లో ఉన్న యౌవనస్థునికి ఏమి జరిగిందో గమనించండి. ప్రొద్దు గ్రుంకే వేళలో అతను జారస్త్రీ ఉండే సందు వైపుకు వెళ్ళాడు. మృదువైన ఆమె మాటల వల్ల తప్పుదారి పట్టి, ఆమె వలలో పడిపోయి వధకు తీసుకువెళ్ళబడే పశువులా ఆమె వెంట వెళ్ళాడు. ఈ యౌవనస్థుడు అసలు ఆ సందు వైపుకు ఎందుకు వెళ్ళాడు? అతను ‘బుద్ధిలేని పడుచువాడు’ కాబట్టి, బహుశా తప్పుడు ఆలోచనలతో సతమతమౌతుండవచ్చు. (సామె. 7:7) అతను ఎప్పుడు ప్రార్థన చేసివుంటే ఉపయోగం ఉండేది? ఆ పరిస్థితుల్లో ఎప్పుడు ప్రార్థన చేసినా బావుండేదే. అయితే ఆ సందు వైపుకు వెళ్ళాలనే ఆలోచన వచ్చిన క్షణంలోనే ప్రార్థన చేసివుంటే ఉపయోగం ఉండేది.

17 మన కాలంలోని పరిస్థితి గురించి ఆలోచించండి, అశ్లీల చిత్రాలు చూడకుండా ఉండాలని ఒక వ్యక్తి తీవ్రంగా ప్రయత్నిస్తుండవచ్చు. అయితే అతను అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉంటాయని తనకు తెలిసిన ఇంటర్నెట్‌ సైట్లకు వెళ్తున్నాడు అనుకుందాం. అప్పుడతను సామెతలు 7వ అధ్యాయంలోవున్న యౌవనస్థుడిలాగే చేస్తున్నట్లవదా? అతను వెళ్తున్నది ఎంత ప్రమాదకరమైన మార్గమో కదా! అశ్లీల చిత్రాలు చూడాలనే కోరిక నుండి బయటపడాలంటే అతను ఇంటర్నెట్‌లో ఆ చెడ్డ సైట్లకు వెళ్ళకముందే సహాయం కోసం యెహోవాకు ప్రార్థన చేయాలి.

18, 19. (ఎ) తప్పుడు కోరికల నుండి బయటపడడం ఎందుకు కష్టమనిపించవచ్చు? అయితే మనం ఆ సమస్యను విజయవంతంగా ఎలా ఎదుర్కోవచ్చు? (బి) మీరేమి చేయాలని నిర్ణయించుకున్నారు?

18 తప్పుడు ఆలోచనల నుండి, అలవాట్ల నుండి బయటపడడం అంత సులభం కాదు. “శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. అందుకే ‘మనమేమి చేయాలని ఇచ్ఛయిస్తామో వాటిని చేయము.’ (గల. 5:17) ఈ సమస్యను ఎదుర్కోవాలంటే, తప్పుడు ఆలోచనలు లేదా కోరికలు మన మనసులోకి వచ్చినప్పుడే మనం పట్టుదలతో ప్రార్థన చేస్తూ మన ప్రార్థనకు తగినట్లుగా నడుచుకోవాలి. ‘సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మనకు సంభవించదు,’ అయినా యెహోవా సహాయంతో మనం ఆయనకు నమ్మకంగా ఉండడం సాధ్యమే.—1 కొరిం. 10:13.

19 మనం కష్టాల్లో ఉన్నా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నా, తప్పుడు ఆలోచనల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నా యెహోవా మనకిచ్చిన అద్భుతమైన బహుమానాన్ని ఉపయోగించుకోవాలి అంటే ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు మనం ఆయన మీదే నమ్మకం పెట్టుకున్నామని చూపిస్తాం. అంతేకాకుండా మనల్ని నడిపించే, మనల్ని బలపర్చే పరిశుద్ధాత్మను దయచేయమని దేవుణ్ణి మనం అడుగుతూ ఉండాలి. (లూకా 11:9-13) కాబట్టి మనం స్వబుద్ధి మీద ఆధారపడకుండా యెహోవాపై నమ్మకం పెట్టుకుందాం.

[అధస్సూచి]

a అసలు పేర్లు కావు.

మీకు జ్ఞాపకమున్నాయా?

• యెహోవా మీద నమ్మకం పెట్టుకునే విషయంలో హిజ్కియా, హన్నా, యోనా నుండి ఏమి నేర్చుకోవచ్చు?

• నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని దావీదు, యెహోషువ ఉదాహరణలు ఎలా చూపిస్తున్నాయి?

• తప్పుడు ఆలోచనల నుండి బయటపడాలంటే మనం ఎప్పుడు ప్రార్థన చేయడం అన్నింటికన్నా మంచిది?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రం]

తప్పుడు కోరికల నుండి బయటపడాలంటే ఎప్పుడు ప్రార్థన చేయడం అన్నింటికన్నా మంచిది?