కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయన జీవితం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

ఆయన జీవితం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

ఆయన జీవితం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

‘యాకోబు దేవుడు తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము.’ —యెష. 2:3.

1, 2. బైబిలు ఉదాహరణల నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?

 బైబిల్లో ఉన్న మాదిరుల నుండి ప్రయోజనం పొందవచ్చని మీరు నమ్ముతున్నారా? దానిలో ప్రస్తావించబడిన నమ్మకమైన స్త్రీ పురుషుల జీవన విధానాన్ని, వాళ్ల గుణాలను మీరు అనుకరించాలనుకోవచ్చు. (హెబ్రీ. 11:32-34) అయితే, దానిలో కొంతమంది చేసిన చెడు పనుల గురించి కూడా ఉంది. వాళ్లు చేసినలాంటి పనులు చేయకూడదని, వాళ్లు చూపించినలాంటి లక్షణాలు చూపించకూడదని మీరు అనుకోవచ్చు.

2 నిజానికి బైబిల్లో ప్రస్తావించబడిన కొంతమంది ఉదాహరణల నుండి ఏమి చేయాలో, ఏమి చేయకూడదో నేర్చుకోవచ్చు. ఒకసారి దావీదు గురించి ఆలోచించండి, ఆయన మొదట్లో వినయంగల గొర్రెలకాపరి, ఆ తర్వాత శక్తివంతమైన రాజయ్యాడు. ఆయన మంచి మాదిరిగా ఉన్నాడు, సత్యాన్ని ప్రేమించి యెహోవా మీద నమ్మకం ఉంచాడు. అయినా ఆయన గంభీరమైన తప్పులు చేశాడు, బత్షెబతో వ్యభిచారం చేశాడు, ఊరియాను చంపించాడు, అంతేకాక దేవుడు ఆజ్ఞాపించకపోయినా జనసంఖ్యను లెక్కించాడు. అయితే ఇప్పుడు మనం ఆయన కుమారుడైన సొలొమోను గురించి చూద్దాం, ఆయన ఒక రాజు, బైబిలు రచయిత. మొదట, ఆయన ఏ రెండు విషయాల్లో ఆదర్శంగా ఉన్నాడో చూద్దాం.

“సొలొమోను జ్ఞానము”

3. సొలొమోను మనకు మంచి మాదిరిగా ఉన్నాడని మనం ఎందుకు చెప్పవచ్చు?

3 గొప్ప సొలొమోను అయిన యేసుక్రీస్తు సొలొమోను రాజు గురించి మంచిగా మాట్లాడి, ఆయనను మనకు ఒక మంచి మాదిరిగా చూపించాడు. సందేహిస్తున్న కొంతమంది యూదులతో యేసు ఇలా చెప్పాడు, “విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.” (మత్త. 12:42) నిజంగానే, అప్పట్లో సొలొమోను తనకున్న జ్ఞానానికి పేరుగాంచాడు, జ్ఞానం సంపాదించుకోమని మనల్ని ప్రోత్సహించాడు.

4, 5. సొలొమోనుకు జ్ఞానం ఎలా లభించింది? కానీ మనం ఎలా సంపాదించుకోవచ్చు?

4 సొలొమోను పరిపాలన ప్రారంభంలో, దేవుడు ఆయనకు ఒక కలలో కనిపించి తనకు ఏమి కావాలో కోరుకోమని అడిగాడు. సొలొమోను తనకు అంతగా అనుభవం లేదని గ్రహించి, తనకు జ్ఞానాన్ని ఇవ్వమని అడిగాడు. (1 రాజులు 3:5-9 చదవండి.) సొలొమోను ధనసంపదల కోసం, పేరుప్రతిష్ఠల కోసం అడగకుండా జ్ఞానం కోసం అడిగినందుకు దేవుడు ఎంతో సంతోషించి ఆయనకు “బుద్ధి వివేకములు గల హృదయము” ఇచ్చాడు, దానితోపాటు ధనసంపదలు కూడా ఇచ్చాడు. (1 రాజు. 3:10-14) యేసు ప్రస్తావించినట్లుగా, సొలొమోను ఎంత జ్ఞానవంతుడంటే షేబదేశపు రాణి ఆయన గురించి విన్నప్పుడు ఆయనను కలిసి ఆయన జ్ఞానవచనాలను వినడానికి ఆమె ఎంతో దూరం నుండి ప్రయాణించి వచ్చింది.—1 రాజు. 10:1, 4-9.

5 సొలొమోను పొందినట్లు మనం జ్ఞానాన్ని అద్భుతరీతిగా పొందాలని ఆశించం. సొలొమోను, “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు” అని చెప్పిన తర్వాత ఆ దైవిక లక్షణాన్ని పొందాలంటే మనం కృషి చేయాలని చెబుతూ ‘జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించాలి’ అని ఆయన రాశాడు. ఆ విషయం గురించి చెబుతూ ‘మనవి చేయండి,’ ‘మొరపెట్టండి,’ ‘వెదకండి,’ వంటి పదబంధాలను ఆయన ఉపయోగించాడు. (సామె. 2:1-6) దీన్నిబట్టి, మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడం సాధ్యమే అని తెలుస్తోంది.

6. జ్ఞానం విషయంలో సొలొమోను మంచి మాదిరి నుండి ప్రయోజనం పొందుతున్నామని మనం ఎలా చూపించవచ్చు?

6 ‘దేవుడిచ్చిన జ్ఞానాన్ని సొలొమోను విలువైనదిగా ఎంచినట్లే నేనూ ఎంచుతున్నానా?’ అని పరిశీలించుకోవడం మంచిది. ఆర్థిక సమస్యల వల్ల చాలామంది తమ ఉద్యోగాలకు, డబ్బు సంపాదనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు, లేదా పెద్ద చదువులు చదవాలని చూస్తున్నారు. ఈ విషయంలో మీరు, మీ కుటుంబ సభ్యులు ఏమి చేస్తున్నారు? మీరు తీసుకునే నిర్ణయాలు, దేవుడిచ్చే జ్ఞానాన్ని మీరు విలువైనదిగా ఎంచుతున్నారనీ దాన్ని సంపాదించుకోవడానికి శ్రమిస్తున్నారనీ చూపిస్తున్నాయా? మీరు మరింత జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి డబ్బు, చదువు విషయంలో మీ ఆలోచనావిధానాన్ని మార్చుకోవడం అవసరమా? జ్ఞానాన్ని సంపాదించుకుని, దాని ప్రకారం నడుచుకుంటే మీరు ఎల్లప్పుడూ ప్రయోజనం పొందవచ్చు. ‘అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును మీరు తెలుసుకుంటారు’ అని సొలొమోను రాశాడు.—సామె. 2:9.

సత్యారాధనకు ప్రాధాన్యతనివ్వడం వల్ల సమాధానం నెలకొంది

7. దేవునికి ఒక గొప్ప ఆలయం ఎలా నిర్మించబడింది?

7 మోషే కాలం నుండి ఇశ్రాయేలీయులు ఉపయోగిస్తూ వచ్చిన గుడారం స్థానంలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడానికి సొలొమోను తన పరిపాలన ఆరంభంలో చర్యలు తీసుకున్నాడు. (1 రాజు. 6:1) సాధారణంగా దాన్ని ‘సొలొమోను ఆలయం’ అంటారు కానీ దాన్ని నిర్మించాలన్న ఆలోచన ఆయనది కాదు. లేదా గొప్ప నిర్మాణకుడిగానో ధనవంతుడైన దాతగానో పేరు సంపాదించుకోవడానికి ఆయన దాన్ని నిర్మించలేదు. నిజానికి ఆలయ నిర్మాణం గురించి మొదట ప్రతిపాదించింది దావీదు, ఆ తర్వాత ఆలయం నిర్మించడానికి అవసరమైన నమూనాల గురించి, దానిలో ఉండవలసిన వస్తువుల గురించి దేవుడు దావీదుకు వివరాలిచ్చాడు. ఆ పనికి అవసరమైన ధనాన్ని కూడా దావీదే సమకూర్చాడు. (2 సమూ. 7:2, 12, 13; 1 దిన. 22:14-16) అయితే ఆ నిర్మాణ పనిని చేపట్టింది మాత్రం సొలొమోను, ఆ పని ఏడున్నర సంవత్సరాల పాటు సాగింది.—1 రాజు. 6:37, 38; 7:51.

8, 9. (ఎ) మంచి పనులు చేయడంలో సొలొమోను ఎలా మనకు మాదిరిగా ఉన్నాడు? (బి) సొలొమోను సత్యారాధనకు ప్రాధాన్యతనివ్వడం వల్ల ఏమి జరిగింది?

8 అలా సొలొమోను మంచి పనులు చేయడంలో, ప్రాముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వడంలో మనకు మంచి మాదిరి ఉంచాడు. ఆలయ నిర్మాణం ముగిసి, నిబంధన మందసం దానిలో ఉంచిన తర్వాత సొలొమోను అందరి ఎదుట ప్రార్థన చేశాడు. ఆయన యెహోవాకు చేసిన ప్రార్థనలో కొంత భాగం ఇలా ఉంది, “నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించునట్లు—నా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక.” (1 రాజు. 8:6, 29) ఇశ్రాయేలీయులు, పరదేశులు దేవుని నామం పెట్టబడిన ఈ ఆలయం వైపు చూసి ప్రార్థించవచ్చు.—1 రాజు. 8:30, 41-43, 60.

9 సొలొమోను సత్యారాధనకు ప్రాధాన్యతనివ్వడం వల్ల ఏమి జరిగింది? ప్రజలు ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలు జరుపుకున్న తర్వాత, “యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులగు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్లిపోయిరి.” (1 రాజు. 8:65, 66) సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరాలు శాంతి, సమృద్ధి విలసిల్లాయి. (1 రాజులు 4:20, 21, 25 చదవండి.) దాని గురించి, గొప్ప సొలొమోను అయిన యేసుక్రీస్తు పరిపాలనలో మనం పొందే ఆశీర్వాదాల గురించి 72వ కీర్తన తెలియజేస్తుంది.—కీర్త. 72:6-8, 16.

సొలొమోను జీవితం మనకు ఒక హెచ్చరిక!

10. సొలొమోను చేసిన ఏ తప్పు మనకు వెంటనే గుర్తొస్తుంది?

10 అయితే సొలొమోను జీవితం మనకు ఒక హెచ్చరికలా కూడా పనిచేస్తుందని ఎందుకు చెప్పవచ్చు? ఈ ప్రశ్న చూడగానే మీకు అన్యులైన ఆయన భార్యల గురించి, ఉపపత్నుల గురించి గుర్తొస్తుండవచ్చు. ‘సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాకపోయెను’ అని బైబిలు చెబుతోంది. (1 రాజు. 11:1-6) ఆయన మూర్ఖంగా ప్రవర్తించినట్లు మీరు ప్రవర్తించకూడదని గట్టిగా నిర్ణయించుకుని ఉంటారు. అయితే సొలొమోను తన జీవితంలో చేసిన మరికొన్ని పనులు కూడా మనకు హెచ్చరికగా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం పరిశీలిద్దాం.

11. సొలొమోను తాను చేసుకున్న మొదటి పెళ్లి విషయంలో తప్పు చేశాడని మనం ఎందుకు చెప్పవచ్చు?

11 సొలొమోను 40 సంవత్సరాలపాటు పరిపాలించాడు. (2 దిన. 9:30) అయితే, 1 రాజులు 14:21 నుండి మనమేమి తెలుసుకోవచ్చు? (చదవండి.) ఆ వచనం ప్రకారం, సొలొమోను చనిపోయిన తర్వాత, 41 ఏళ్లున్న ఆయన కుమారుడు రెహబాము రాజయ్యాడు, ఆయన తల్లి “అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా.” దీన్నిబట్టి సొలొమోను, రాజు అవ్వకముందే విగ్రహాలను ఆరాధించే శత్రు దేశానికి చెందిన స్త్రీని వివాహం చేసుకున్నాడని తెలుస్తోంది. (న్యాయా. 10:6; 2 సమూ. 10:6) ఆమె కూడా విగ్రహారాధన చేసేదా? ఆమె ఒకప్పుడు వాటిని ఆరాధించినా ఆ తర్వాత రాహాబు, రూతు చేసినట్లు వాటిని ఆరాధించడం మానేసి సత్యారాధకురాలు అయ్యుండవచ్చు. (రూతు 1:16; 4:13-17; మత్త. 1:5, 6) అయినా, అమ్మోనీయులైన సొలొమోను అత్తమామలు, బంధువులు యెహోవాను ఆరాధించి ఉండకపోవచ్చు.

12, 13. సొలొమోను తన పరిపాలన ఆరంభంలోనే ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆయన ఏమి అనుకుని ఉంటాడు?

12 సొలొమోను రాజయ్యాక ఆయన పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఆయన ‘ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసికొని ఆమెను దావీదు పురముకు రప్పించాడు.’ (1 రాజు. 3:1) ఐగుప్తీయురాలైన ఈమె రూతులా సత్యారాధన చేసిందా? ఆమె అలా మారినట్లు చెప్పడానికి ఏ రుజువూ లేదు. కానీ కొంతకాలానికి ఆమె కోసం (బహుశా ఐగుప్తీయులైన ఆమె దాసీల కోసం కూడా) దావీదు పట్టణం వెలుపల సొలొమోను ఒక ఇల్లు కట్టించాడు. ఎందుకు? అబద్ధ ఆరాధకులు నిబంధన మందసం దగ్గర్లో నివసించడం సరికాదని లేఖనాలు చెబుతున్నాయి కాబట్టి ఆయన అలా చేశాడు.—2 దిన. 8:11.

13 ఐగుప్తీయురాలైన రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడం వల్ల రాజకీయపరమైన ప్రయోజనాలు ఉంటాయని సొలొమోను అనుకుని ఉంటాడు, అలాగని ఆయన తాను చేసినదాన్ని సమర్థించుకునే అవకాశముందా? అన్యులైన కనానీయులను పెళ్లి చేసుకోకూడదని దేవుడు ఎంతోకాలం క్రితమే చెప్పాడు, ఇంకా ఏయే జనాంగాల ప్రజలను చేసుకోకూడదో కూడా వివరంగా తెలియజేశాడు. (నిర్గ. 34:11-16) ‘యెహోవా చెప్పిన వాళ్లలో ఐగుప్తీయులు లేరు కదా’ అని సొలొమోను అనుకుని ఉంటాడా? ఆయన అలా అనుకున్నా, ఆ ఆలోచన సరైనదేనా? నిజానికి, అన్యులను పెళ్లి చేసుకుంటే వాళ్లు సత్యారాధన నుండి తొలగిపోయేలా చేస్తారని యెహోవా చెప్పిన ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన పట్టించుకోలేదు.—ద్వితీయోపదేశకాండము 7:1-4 చదవండి.

14. సొలొమోను జీవితంలో జరిగిన సంఘటనలను ఒక హెచ్చరికగా తీసుకుని మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

14 సొలొమోను జీవితంలో జరిగిన సంఘటనలను మనం హెచ్చరికగా తీసుకుంటామా? “ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను” అని దేవుడిచ్చిన ఆజ్ఞను పట్టించుకోకుండా ఒక సహోదరి యెహోవాసాక్షి కాని ఒక వ్యక్తిని ప్రేమించి, తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించవచ్చు. (1 కొరిం. 7:39) మరి కొంతమంది స్కూల్‌ ఆటల పోటీల్లో పాల్గొంటూ, ఆదాయపు పన్నుల విషయంలో మోసం చేస్తూ, సిగ్గుకరమైన పనులు చేసి వాటిని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెబుతూ తమను తాము సమర్థించుకోవడానికి చూస్తారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, సొలొమోనులాగే మనం కూడా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకుని, కుంటి సాకులతో దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించే ప్రమాదం ఉంది.

15. యెహోవా సొలొమోనుపై ఎలా కనికరం చూపించాడు, కానీ దాని గురించి మనం ఏమి గుర్తుంచుకోవాలి?

15 అయితే ఆసక్తికరంగా, అప్పటికే సొలొమోను వేరే దేశానికి చెందిన రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నా, జ్ఞానం కోసం సొలొమోను చేసిన విజ్ఞప్తిని దేవుడు విని ఆయనకు జ్ఞానాన్ని, ధనసంపదలను ఇచ్చాడు. (1 రాజు. 3:10-13) సొలొమోను దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేశాడు. అయినా యెహోవా ఆయనను వెంటనే రాజుగా ఉండకుండా తీసేశాడనో, ఆయనను గట్టిగా గద్దించాడనో సూచించేదేదీ బైబిల్లో లేదు. దీన్ని బట్టి, మనం మంటితో చేయబడిన అపరిపూర్ణ మానవులమనే విషయాన్ని దేవుడు మనసులో ఉంచుకుంటాడని అర్థమౌతోంది. (కీర్త. 103:10, 13, 14) అయితే, మనం చేసే పనులకు మనం ఎప్పుడో ఒకప్పుడు పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని గుర్తుంచుకోవాలి.

చాలామందిని పెళ్లిచేసుకున్నాడు

16. దేన్ని పట్టించుకోనందువల్ల సొలొమోను ఎక్కువమందిని పెళ్లి చేసుకున్నాడు?

16 పరమగీతములో సొలొమోను ఒక కన్యను పొగడుతూ ఆమె 60 మంది రాణుల కన్నా, 80 మంది ఉపపత్నుల కన్నా అందమైనదని అన్నాడు. (పరమ. 6:1, 8-10) కాబట్టి అప్పటికి ఆయనకు అంతమంది భార్యలు, ఉపపత్నులు ఉండి ఉంటారని తెలుస్తోంది. వాళ్లలో ఎక్కువమంది సత్యారాధకులే అయినా లేదా అందరూ సత్యారాధకులే అయినా, మోషే ద్వారా దేవుడు ఏమి చెప్పాడంటే, ఇశ్రాయేలీయులపై రాజుగా ఉన్న వ్యక్తి, “తన హృదయము తొలగి పోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు.” (ద్వితీ. 17:17) అయితే, యెహోవా సొలొమోనుపై మళ్లీ కనికరం చూపించాడు. నిజానికి, బైబిలు పుస్తకమైన పరమగీతమును రాయడానికి సొలొమోనును ఉపయోగించుకోవడం ద్వారా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు.

17. మనం ఏ వాస్తవాన్ని అలక్ష్యం చేయకూడదు?

17 సొలొమోను దేవుని నిర్దేశాన్ని నిర్లక్ష్యం చేసి కూడా శిక్ష పడకుండా తప్పించుకున్నాడనీ, మనం కూడా అలాగే తప్పించుకోవచ్చనీ ఇది సూచిస్తోందా? అలా సూచించడం లేదు గానీ దేవుడు కొంతకాలం పాటు సహనం చూపిస్తాడని అది తెలియజేస్తోంది. అయితే, దేవుని ప్రజల్లో ఒకరు ఆయన నిర్దేశాన్ని అలక్ష్యం చేసిన వెంటనే తగిన పర్యవసానాలను అనుభవించనంత మాత్రాన దానివల్ల ఎప్పటికీ చెడు పరిణామాలు ఉండవని చెప్పలేము. సొలొమోను ఇలా రాశాడని గుర్తుంచుకోండి, ‘దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు. దేవునియందు భయభక్తులు కలిగి ఆయనకు భయపడువారు క్షేమముగా ఉందురని నేను ఎరుగుదును.’—ప్రసం. 8:11-13.

18. గలతీయులు 6:7లోని మాటలు సొలొమోను జీవితంలో నిజమయ్యాయని ఎలా చెప్పవచ్చు?

18 దేవుడు చెప్పిన ఆ సత్యాన్ని సొలొమోను పట్టించుకుని ఉంటే ఎంత బాగుండేదో కదా! ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు, ఎంతోకాలం పాటు దేవుని ఆశీర్వాదాలు పొందాడు. కానీ కాలం గడుస్తుండగా, ఆయన ఒక తప్పు తర్వాత మరొకటి చేస్తూ పోయాడు. అది ఆయనకు అలవాటుగా మారిపోయింది. “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అని ఆ తర్వాత అపొస్తలుడైన పౌలు రాసిన ప్రేరేపిత మాటలు ఎంత నిజమో కదా! (గల. 6:7) దేవుని నిర్దేశాన్ని నిర్లక్ష్యం చేసినందుకు సొలొమోను చివరికి చెడు పరిణామాలను ఎదుర్కొన్నాడు. ‘రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులలో ఇంక అనేకమంది పరస్త్రీలను మోహించాడు’ అని బైబిలు చెబుతోంది. (1 రాజు. 11:1) వీళ్లలో చాలామంది అబద్ధ దేవుళ్లను ఆరాధిస్తూనే ఉన్నారు, దాని ప్రభావం సొలొమోను మీద పడింది. దానితో ఆయన కూడా విగ్రహారాధన చేస్తూ సహనంగల మన దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడు.—1 రాజులు 11:4-8 చదవండి.

వాళ్ల జీవితం నుండి నేర్చుకోగల విషయాలు

19. బైబిల్లో ఎన్నో మంచి ఉదాహరణలు ఉన్నాయని మనం ఎందుకు చెప్పవచ్చు?

19 “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి” అని పౌలు దైవప్రేరణతో రాశాడు. (రోమా. 15:4) రాయబడిన వాటిలో గొప్ప విశ్వాసం చూపించిన స్త్రీపురుషుల మంచి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ‘ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి’ అని పౌలు చెప్పగలిగాడు. (హెబ్రీ. 11:32-34) బైబిల్లోని ఆ చక్కని వృత్తాంతాల్లో చెప్పబడిన దాన్ని అనుసరించడం ద్వారా లేదా అనుకరించడం ద్వారా లేఖనాల్లో ఉన్న మంచి ఉదాహరణల నుండి మనం ప్రయోజనం పొందవచ్చు, పొందాలి కూడా.

20, 21. దేవుని వాక్యంలో ఉన్న ఉదాహరణల నుండి ప్రయోజనం పొందాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు?

20 బైబిల్లో మనకు హెచ్చరికగా పనిచేసే ఉదాహరణలు కూడా ఉన్నాయి. వాళ్లలో కొంతమంది ఒకప్పుడు యెహోవా సేవ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందారు. మనం బైబిలు చదువుతుండగా, దేవుని ప్రజల్లో కొంతమంది ఎప్పుడు, ఎలా తప్పిపోయారో, దానివల్ల వాళ్లు మనకు ఎలా హెచ్చరికగా ఉన్నారో తెలుసుకోవచ్చు. వాళ్లలో కొంతమంది మెల్లగా చెడు లక్షణాలను అలవర్చుకుని, చెడు పరిణామాలు ఎదుర్కొన్నారని మనం గ్రహించవచ్చు. అలాంటి వృత్తాంతాల నుండి మనం ఎలా పాఠాలు నేర్చుకోవచ్చు? మనకు మనం ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే మంచిది, ‘అలాంటి చెడు లక్షణం ఎలా వృద్ధి అయ్యింది? నా విషయంలో కూడా అలా జరిగే అవకాశం ఉందా? వాళ్ల ఉదాహరణ నుండి ప్రయోజనం పొందాలంటే నేనేం చేయాలి?’

21 మనం ఆ ఉదాహరణలను గంభీరంగా తీసుకోవాలి, ఎందుకంటే పౌలు దైవప్రేరణతో ఇలా రాశాడు, “ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.”—1 కొరిం. 10:11.

మీరేమి నేర్చుకున్నారు?

• బైబిల్లో మంచివాళ్ల గురించి, చెడ్డవాళ్ల గురించి ఎందుకు ఉంది?

• చెడ్డ పనులు చేయడం సొలొమోనుకు ఎలా అలవాటుగా మారిపోయింది?

• సొలొమోను జీవితాన్ని హెచ్చరికగా తీసుకుని మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రం]

దేవుడిచ్చిన జ్ఞానాన్ని సొలొమోను ఉపయోగించుకున్నాడు

[12వ పేజీలోని చిత్రాలు]

మీరు సొలొమోను జీవితాన్ని హెచ్చరికగా తీసుకుంటున్నారా?