కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అబ్రాహాము ప్రేమ గల వ్యక్తి

అబ్రాహాము ప్రేమ గల వ్యక్తి

అబ్రాహాము ప్రేమ గల వ్యక్తి

అబ్రాహాము తట్టుకోలేనంత దుఃఖంలో ఉన్నాడు. తన ప్రియాతిప్రియమైన భార్య శారా కన్నుమూసింది. ఆమెకు తుది వీడ్కోలు పలుకుతుండగా ఎన్నో మధురస్మృతులు ఆయన మదిలో మెదిలాయి. దుఃఖంతో గుండె బరువెక్కి ఆయన కన్నీళ్ల పర్యంతమయ్యాడు. (ఆదికాండము 23:1, 2) అలా ఏడవడం ఆయన బలహీనతకు గుర్తు కాదు, దాన్నిబట్టి ఆయన సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆయనకున్న అత్యంత మంచి లక్షణాల్లో ఒకటైన ప్రేమకు అది నిదర్శనం.

ప్రేమ అంటే ఏమిటి? ఒకరితో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని లేదా వారిపట్ల ఉన్న ప్రగాఢమైన అనురాగాన్నే ప్రేమ అంటారు. ప్రేమగల వ్యక్తి, తను ప్రేమించే వాళ్లమీద ఉన్న భావాలను చేతల్లో చూపిస్తాడు, దానికోసం అవసరమైతే త్యాగాలు కూడా చేస్తాడు.

అబ్రాహాము ప్రేమను ఎలా చూపించాడు? అబ్రాహాము, తన కుటుంబం పట్ల ఉన్న ప్రేమను చేతల్లో చూపించాడు. అబ్రాహాముకు తీరిక దొరికేది కాదు అయినా ఆయన తన ఇంటివాళ్ల ఆధ్యాత్మిక, భావోద్వేగ అవసరాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కుటుంబ యజమానిగా, ఆరాధన విషయంలో అబ్రాహాము నాయకత్వం వహించాడని యెహోవాయే స్వయంగా గుర్తించాడు. (ఆదికాండము 18:19) అంతేకాదు, అబ్రాహాముకున్న ప్రేమ గురించి యెహోవా స్పష్టంగా చెప్పాడు. ఒక సందర్భంలో యెహోవా అబ్రాహాముతో మాట్లాడుతూ, ఇస్సాకును ‘నువ్వు ప్రేమించే నీ కుమారుడు’ అని అన్నాడు.—ఆదికాండము 22:2.

తన ప్రియమైన భార్య శారా చనిపోయినప్పుడు అబ్రాహాము స్పందించిన తీరులో కూడా ఆయనకున్న ప్రేమ కనబడుతుంది. అబ్రాహాము ఆమె కోసం ప్రలాపించాడు. ఆయన బలమైనవాడే, ధైర్యస్థుడే అయినా తన దుఃఖాన్ని వ్యక్తం చేయడానికి సంకోచించలేదు. ఆయన ధీరత్వాన్ని, మృదుత్వాన్ని సమపాళ్లలో చూపించాడు.

అబ్రాహాము తన దేవుణ్ణి ప్రేమించానని చేతల్లో చూపించాడు. ఆయన జీవితమంతా ఆ ప్రేమను చూపించాడు. ఎలా? 1 యోహాను 5:3లో బైబిలు ఇలా చెబుతోంది: ‘మనం ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.’ ఆ మాటలను బట్టి చూస్తే, దేవునిపట్ల ప్రేమ చూపించడంలో అబ్రాహాము ఎంతో ఆదర్శప్రాయుడని చెప్పవచ్చు.

యెహోవా దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞ ఇచ్చిన ప్రతీసారి ఆయన దాన్ని వెంటనే పాటించాడు. (ఆదికాండము 12:4; 17:22, 23; 21:12-14; 22:1-3) వాటిని పాటించడం కష్టమో తేలికో ఆలోచించలేదు, యెహోవా ఎందుకలా చెప్పాడో తనకు తెలిసినా తెలియకపోయినా ఆయన ఆజ్ఞలను పూర్తిగా పాటించాడు. తన దేవుడు చెప్పిన ప్రతీది చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రతీసారి, ఆయన పట్ల తన ప్రేమ చూపించడానికి తనకొక అవకాశం దొరికిందని భావించాడు.

దీన్నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? అబ్రాహాములా మనం కూడా ఎదుటివాళ్ల పట్ల, ముఖ్యంగా కుటుంబ సభ్యుల పట్ల అనురాగం చూపించాలి. మన ఆత్మీయులకు సమయం ఇవ్వలేనంతగా జీవిత ఒత్తిళ్లలో మునిగిపోకుండా ఉందాం.

అంతేకాదు, యెహోవా పట్ల మనం నిజమైన ప్రేమ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాంటి ప్రేమ మన జీవితాలపై శక్తివంతమైన ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మన వైఖరిని, మాట తీరును, ప్రవర్తనను మార్చుకునేందుకు అది మనకు ప్రేరణనిస్తుంది.—1 పేతురు 1:14-16.

నిజమే, యెహోవా ఆజ్ఞలు పాటించడం అన్నివేళలా అంత సులువేమీ కాదు. కానీ అబ్రాహామును “నా స్నేహితుడు” అని పిలిచిన యెహోవా దేవుడు ఆయనకు సహాయం చేసినట్లే మనకూ సహాయం చేస్తాడని మనం నమ్మవచ్చు. (యెషయా 41:8) ఆయన వాక్యమైన బైబిలు ఇలా హామీనిస్తోంది: ‘ఆయనే మిమ్మల్ని స్థిరపర్చి, బలపరుస్తాడు.’ (1 పేతురు 5:10) అబ్రాహాముకు నమ్మదగిన స్నేహితుడైన యెహోవా చేసిన ఆ వాగ్దానం మనకెంత ఊరటనిస్తుందో కదా! (w12-E 01/01)

[13వ పేజీలోని బాక్సు]

ఏడవడం మగతనం కాదా?

కాదనే చాలామంది అంటారు. కానీ కష్ట సమయాల్లో చాలామంది నమ్మకస్థులైన, బలవంతులైన పురుషులు ఏడ్చారని బైబిలు చెబుతోందనే విషయం తెలిస్తే వాళ్లు ఆశ్చర్యపోతారు. అలా ఏడ్చిన వాళ్లలో అబ్రాహామే కాదు యోసేపు, దావీదు, అపొస్తలుడైన పేతురు, ఎఫెసు సంఘంలోని పెద్దలు, యేసు కూడా ఉన్నారు. (ఆదికాండము 50:1; 2 సమూయేలు 18:33; లూకా 22:61, 62; యోహాను 11:35; అపొస్తలుల కార్యములు 20:36-38) అంటే, ఏడవడం మగతనం కాదని బైబిలు చెప్పడం లేదు.