కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి దగ్గరవ్వండి

‘నీ దేవుడనైన యెహోవానగు నేను నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను’

‘నీ దేవుడనైన యెహోవానగు నేను నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను’

ర  ద్దీగా ఉన్న రోడ్డు దాటబోయే ముందు ఓ తండ్రి తన చిన్న బాబుతో “నా చేయి పట్టుకోరా నాన్నా” అన్నాడు. తన చిట్టి చేయి తండ్రి బలమైన చేతిలో ఉన్నప్పుడు తాను సురక్షితంగా ఉన్నానని, భయపడాల్సిన అవసరం లేదని వాడు అనుకుంటాడు. జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, చేయి పట్టుకుని మిమ్మల్ని కష్టాల కడలి దాటించేవారెవరైనా ఉంటే బాగుంటుందని మీకెప్పుడైనా అనిపించిందా? అలాగైతే, యెషయా రాసిన మాటల నుండి మీరు ఊరట పొందవచ్చు.—యెషయా 41:9, 10, 13 చదవండి.

ఆ మాటల్ని, యెషయా ప్రవక్త ఇశ్రాయేలు జనాంగంతో అన్నాడు. దేవుడు వాళ్లను తన ‘స్వకీయ సంపాద్యంలా’ లేదా ప్రత్యేకమైన సొత్తులా చూసుకున్నాడు. కానీ, వాళ్ల చుట్టూ శత్రువులు ఉన్నారు. (నిర్గమకాండము 19:5) అయినా ఇశ్రాయేలీయులు వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదని యెషయా ప్రవక్త ద్వారా యెహోవా వాళ్లకు అభయమిచ్చాడు. ఆ మాటలు పరిశీలిస్తే, ఇప్పటి దేవుని సేవకులకు కూడా ధైర్యం కలుగుతుంది.—రోమీయులు 15:4.

‘భయపడవద్దు’ అని యెహోవా తన ఆరాధకులకు చెబుతున్నాడు. (9, 10 వచనాలు) ఇవి ఒట్టి మాటలు కావు. తన ప్రజలు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదో వివరిస్తూ, ‘నేను మీకు తోడుగా ఉన్నాను’ అని యెహోవా అన్నాడు. ఆయన ఎక్కడో దూరంగా ఉండి, అవసరమైనప్పుడు మాత్రమే సహాయం చేయడానికి వస్తానని చెప్పట్లేదు. తాను వాళ్లతోనే, వాళ్ల పక్కనే ఉన్నానని, వాళ్లకు సహాయం చేయడానికి సదా సిద్ధంగా ఉన్నానని తన ప్రజలు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. అది మనకు ఎంతో ఊరటనిస్తుంది.

అంతేకాదు, ‘దిగులుపడవద్దు’ అని కూడా యెహోవా అభయమిస్తున్నాడు. (9, 10 వచనాలు) హీబ్రూలో ఆ పదం స్థానంలో ఉన్న క్రియాపదానికి “ఎవరైనా తమకు హానిచేస్తారేమోనని భయపడుతూ బిత్తరచూపులు చూడడం” అనే అర్థం ఉంది. తన ప్రజలు ఎందుకలా బిత్తరచూపులు చూడాల్సిన అవసరం లేదో వివరిస్తూ యెహోవా ఇలా అన్నాడు, ‘నేను మీ దేవునిగా ఉన్నాను.’ దేవుని ఆరాధకులకు అంతకన్నా ఇంకేమి కావాలి. యెహోవా ‘మహోన్నతుడు,’ ‘సర్వశక్తిమంతుడు.’ (కీర్తన 91:1) సర్వశక్తిమంతుడైన యెహోవాయే తమ దేవుడైనప్పుడు వాళ్లు ఎందుకు భయపడాలి?

యెహోవా తన ఆరాధకుల కోసం ఇంకా ఏమి చేస్తాడు? ‘నేనే నీతియను నా దక్షిణ హస్తంతో మిమ్మల్ని ఆదుకుంటాను’ అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. (9, 10 వచనాలు) ఆయన ఇంకా ఇలా అంటున్నాడు, ‘నీ దేవుడనైన యెహోవానగు నేను నీ కుడిచేతిని పట్టుకొని ఉన్నాను.’ (13వ వచనం) ఆ మాటలు విన్నప్పుడు మీకు ఏమి గుర్తొస్తుంది? ఒక రెఫరెన్సు గ్రంథం ఇలా చెబుతోంది: “ఆ వచనాలు తండ్రీకొడుకుల అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి . . . [తండ్రి] తన కొడుకును కాపాడడానికి సిద్ధంగా ఉండడమే కాదు, వాడి పక్కనే ఉంటాడు. వాణ్ణి తన నుండి దూరం కానివ్వడు.” యెహోవా కూడా అంతే, తమ జీవితంలోని అత్యంత విషాదకరమైన సమయాల్లో కూడా తన ప్రజలను తన నుండి దూరం కానివ్వడు.—హెబ్రీయులు 13:5, 6.

యెషయా రాసిన మాటల నుండి నేటి యెహోవా ఆరాధకులు ఎంతో ఊరట పొందవచ్చు. ఈ ‘అపాయకరమైన కాలాల్లో’ కష్టాలు ఎదురైనప్పుడు మనం కొన్నిసార్లు ఎంతో ఆందోళనపడతాం. (2 తిమోతి 3:1) అయితే మనం ఒంటరి వాళ్లమేమీ కాదు, యెహోవా మన చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లవాడు తండ్రిమీద నమ్మకంతో అతని చేయి పట్టుకున్నట్లే, యెహోవా సరైన దారిలో మనల్ని నడిపిస్తాడనే, అవసరమైనప్పుడు మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఆయన బలమైన చేతిని పట్టుకుందాం.—కీర్తన 63:7, 8. (w12-E 01/01)