కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకుల ప్రశ్న

తన కుమారుణ్ణి బలి ఇవ్వమని అబ్రాహామును దేవుడు ఎందుకు అడిగాడు?

తన కుమారుణ్ణి బలి ఇవ్వమని అబ్రాహామును దేవుడు ఎందుకు అడిగాడు?

▪ తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని యెహోవా దేవుడు అబ్రాహామును అడిగినట్లు ఆదికాండము అనే బైబిలు పుస్తకంలో మనం చదువుతాం. (ఆదికాండము 22:2) బైబిలు చదివే కొందరు ఆ విషయాన్ని అంత తేలిగ్గా జీర్ణించుకోలేరు. ప్రొఫెసర్‌ కారల్‌ అనే ఆమె ఇలా అంది: “చిన్నతనంలో మొదటిసారి ఆ కథ విన్నప్పుడు నాకు చాలా కోపమొచ్చింది. ఇలా చేయమని అడిగాడంటే ఆయన ఎలాంటి దేవుడైయుంటాడు?” అలా అనిపించడం సహజమే, కానీ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవడం మంచిది.

మొదటిగా, యెహోవా ఏమి చేయలేదో చూడండి. అబ్రాహాము బలి ఇవ్వడానికి సిద్ధపడినా, చివరికి యెహోవా దాన్ని ఇవ్వనివ్వలేదు. అంతేకాదు అలా చేయమని ఇంకెప్పుడూ ఎవర్నీ అడగలేదు. పిల్లలతో సహా తన ఆరాధకులందరూ కలకాలం సంతోషంగా జీవించాలని యెహోవా కోరుకుంటున్నాడు.

రెండవదిగా, ఇస్సాకును బలి ఇవ్వమని యెహోవా అడగడానికి ఒక ప్రత్యేక కారణముందని బైబిలు చెబుతోంది. చాలా శతాబ్దాల తర్వాత తన సొంత కుమారుడైన a యేసును మనకోసం చనిపోవడానికి అనుమతిస్తానని దేవునికి తెలుసు. (మత్తయి 20:28) కుమారుణ్ణి బలివ్వడం తనకెంత బాధ కలిగిస్తుందో యెహోవా మనకు చెప్పాలనుకున్నాడు. భవిష్యత్తులో తాను ఇవ్వబోయే బలిని మనం బాగా అర్థంచేసుకోవడానికి ఆ సంఘటనను ఒక ఉదాహరణగా ఉపయోగించాడు. అది మనకెలా తెలుసు?

యెహోవా అబ్రాహాముతో ఏం చెప్పాడో ఒకసారి గమనించండి: “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని . . . దహనబలిగా అతనిని అర్పించుము.” (ఆదికాండము 22:2) యెహోవా ఇస్సాకును “నీవు ప్రేమించు” కుమారుడు అన్నాడు. ఇస్సాకంటే అబ్రాహాముకు ఎంత ఇష్టమో యెహోవాకు తెలుసు. తన కుమారుడైన యేసును తాను ఎంతగా ఇష్టపడుతున్నాడో కూడా ఆయనకు తెలుసు. యెహోవా యేసును ఎంతగా ప్రేమించాడంటే, రెండుసార్లు ఆయనే స్వయంగా పరలోకం నుండి మాట్లాడుతూ, యేసును “నా ప్రియకుమారుడు” అన్నాడు.—మార్కు 1:11; 9:7.

ఇస్సాకును బలివ్వమని అడిగిన సందర్భంలో యెహోవా, “దయచేసి” అనే అర్థమున్న ఒక హీబ్రూ పదాన్ని ఉపయోగించాడు. దేవుడు ఈ పదాన్ని ఉపయోగించడం, “తాను అడిగేది ఎంత బాధ కలిగిస్తుందో ప్రభువు గుర్తించాడు” అని సూచిస్తోందని ఒక బైబిలు పండితుడు అభిప్రాయపడ్డాడు. ఆ విన్నపం అబ్రాహాముకు ఎంతో బాధ కలిగించి ఉంటుంది. అలాంటప్పుడు తన ప్రియ కుమారుడు వేదనతో మరణించడాన్ని కళ్లారా చూసిన యెహోవా ఇంకెంతగా బాధపడి ఉంటాడనేది కనీసం మన ఊహకు కూడా అందదు. నిస్సందేహంగా, ఆ బాధ యెహోవా ఇప్పటివరకు అనుభవించిన, ఇకపై అనుభవించబోయే బాధలన్నింటిలోనూ తీవ్రమైనది.

యెహోవా అబ్రాహామును అడిగిన దాని గురించి ఆలోచించడం మనకు కష్టంగా అనిపించవచ్చు. కానీ, బలి ఇవ్వకుండా నమ్మకస్థుడైన ఆ పితరుణ్ణి యెహోవా ఆపాడని గుర్తుంచుకోవడం మంచిది. ఏ తండ్రీ తట్టుకోలేని కడుపుకోతను యెహోవా అబ్రాహాముకు కలగనివ్వలేదు, ఆయన ఇస్సాకును చనిపోకుండా ఆపాడు. అయినా యెహోవా, ‘తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుకతీయకుండా మనందరి కోసం ఆయనను అప్పగించాడు.’ (రోమీయులు 8:32) అయితే తనకు అంత బాధ కలిగించే పనిని యెహోవా ఎందుకు చేశాడు? ‘మనం జీవించాలనే’ ఆయనలా చేశాడు. (1 యోహాను 4:9) దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనడానికి అదెంత చక్కని రుజువు! మరి మనం కూడా దేవుణ్ణి ప్రేమించేలా అది మనల్ని కదిలించడం లేదా? b (w12-E 01/01)

[అధస్సూచీలు]

a యెహోవా అక్షరార్థంగా, ఒక స్త్రీ ద్వారా యేసును కన్నాడని బైబిలు చెప్పడం లేదు. మొదట్లో యెహోవా ఆయనను ఒక ఆత్మప్రాణిగా సృష్టించాడు. తర్వాత యేసును ఈ భూమ్మీదకు పంపించాలని అనుకున్నప్పుడు ఆయన మరియ అనే కన్యకు పుట్టేలా చేశాడు. యేసును యెహోవా దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయనను యేసుకు తండ్రి అనడం సబబే.

b యేసు ఎందుకు చనిపోవాల్సివచ్చింది? ఆయన బలిని విలువైనదిగా ఎంచుతున్నామని మనమెలా చూపించవచ్చు? అనే వాటి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 5వ అధ్యాయం చూడండి.