కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజక్రైస్తవులు దేవుని వాక్యాన్ని గౌరవిస్తారు

నిజక్రైస్తవులు దేవుని వాక్యాన్ని గౌరవిస్తారు

“నీ వాక్యమే సత్యము.”—యోహా. 17:17.

1. యెహోవాసాక్షులు మీతో మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు వాళ్ల గురించి మీకు ఏమనిపించింది?

 యెహోవాసాక్షులు మీతో మొట్టమొదటిసారి మాట్లాడిన సందర్భం గురించి ఆలోచించండి. మీకు ఏ విషయం గుర్తుంది? ‘యెహోవాసాక్షులు బైబిలును ఉపయోగించి నా సందేహాలను తీర్చారు’ అని చాలామంది చెబుతారు. భూమి పట్ల దేవుని సంకల్పం ఏమిటో, చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో, చనిపోయిన మన ప్రియమైనవాళ్లకు ఎలాంటి భవిష్యత్తు ఉందో తెలుసుకున్నప్పుడు మనం ఎంతో సంతోషించివుంటాం.

2. మీరు బైబిలును విలువైనదిగా ఎంచడానికి కొన్ని కారణాలు ఏమిటి?

2 బైబిలు అధ్యయనాన్ని కొనసాగిస్తుండగా బైబిలు నుండి జీవం గురించి, మరణం గురించి, భవిష్యత్తు గురించి మనకున్న ప్రశ్నలకు జవాబులు పొందడమే కాక ఇంకా ఎంతో నేర్చుకోవచ్చని గ్రహించాం. ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నిటిలోకి బైబిల్లో మాత్రమే మన జీవితానికి సంబంధించిన సలహాలు ఉన్నాయని తెలుసుకున్నాం. బైబిల్లోని సలహాలు ఎప్పటికీ ప్రయోజనకరమైనవే. ఆ సలహాలను జాగ్రత్తగా పాటించేవాళ్లు చేసే పనులు సఫలమౌతాయి, వాళ్ల జీవితం సంతోషకరంగా ఉంటుంది. (కీర్తన 1:1-3 చదవండి.) అన్ని కాలాల్లోనూ నిజక్రైస్తవులు బైబిలును “మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని” అంగీకరించారు. (1 థెస్స. 2:13) చరిత్రను కాస్త పరిశీలిస్తే, నిజంగా దేవుని వాక్యాన్ని గౌరవించేవాళ్లకూ గౌరవించనివాళ్లకూ ఉన్న తేడాను తెలుసుకోవచ్చు.

ముల్లులాంటి సమస్య పరిష్కారమైంది

3. ఏ సమస్య వల్ల మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘ ఐక్యత దెబ్బతింది? దాన్ని పరిష్కరించడం ఎందుకు కష్టమైంది?

3 సున్నతి పొందని అన్యుల్లో మొట్టమొదట అభిషేకించబడిన వ్యక్తి కొర్నేలి. ఆయన అభిషేకించబడిన తర్వాతి 13 సంవత్సరాల్లో క్రైస్తవ సంఘ ఐక్యతను దెబ్బతీసే ఒక సమస్య తలెత్తింది. ఆ సమయంలో ఎంతోమంది అన్యులు క్రైస్తవులుగా మారుతున్నారు. అలా మారుతున్న వాళ్లలో, పురుషులు బాప్తిస్మానికి ముందు యూదుల ఆచారం ప్రకారం సున్నతి చేయించుకోవాలా వద్దా అనే ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్నకు ఒక యూదుడైతే అంత సులభంగా జవాబు చెప్పలేడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించే యూదులు అన్యుల ఇళ్లలోకి వెళ్లేవాళ్లుకాదు. అలాంటివాళ్లు ఒక అన్యుణ్ణి తమ సహోదరునిగా ఎంచే అవకాశమే లేదు. అంతేకాక, అప్పటికే క్రైస్తవులుగా మారిన యూదులు యూదా మతాన్ని విడిచిపెట్టినందుకు తీవ్రంగా హింసించబడ్డారు. కాబట్టి, ఒకవేళ వాళ్లు సున్నతి పొందని అన్యుల్ని తమతో కలుపుకుంటే, యూదా మతాన్ని అనుసరిస్తున్నవాళ్లకూ క్రైస్తవులకూ మధ్య దూరం ఇంకా పెరిగి, క్రైస్తవుల మీదికి మరిన్ని నిందలు వచ్చే అవకాశముంది.—గల. 2:11-14.

4. ఆ సమస్యను పరిష్కరించడానికి ఎవరు కూడివచ్చారు? ఆ చర్చకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు?

4 సా.శ. 49లో అపొస్తలులు, యెరూషలేములోని పెద్దలు “ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి,” వాళ్లందరూ సున్నతిపొందిన యూదులే. (అపొ. 15:6) అప్పుడు, అర్థంపర్థం లేని వివరాల గురించిన మతపరమైన వాదన జరగలేదు గానీ బైబిలు బోధలపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. చర్చలో పాల్గొంటున్నవాళ్లంతా తమ తమ అభిప్రాయాల్ని చెప్పారు. ఎవరో ఒకరు తమ సొంత అభిప్రాయాల్ని అవతలి వాళ్లపై రుద్ది తమకు ఇష్టమైన నిర్ణయం తీసుకున్నారా? బాధ్యత గల ఆ పెద్దలు ఇశ్రాయేలులో క్రైస్తవులకు అనుకూలంగా ఉండే పరిస్థితులు వచ్చేదాకా నిర్ణయం తీసుకోవడాన్ని వాయిదా వేశారా? లేక సరైనది కాదనిపించినా, ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని ఏదోక దానికి ఒప్పేసుకున్నారా?

5. సా.శ. 49లో యెరూషలేములో జరిగిన చర్చకూ ఆ తర్వాతి కాలం నుండి చర్చీల్లో జరుగుతున్న చర్చలకూ ఉన్న తేడా ఏమిటి?

5 నేటి చర్చీల్లోనైతే, ఏదైనా ఒక నిర్ణయం నచ్చకపోయినా, పోనీలే ఏదోక నిర్ణయం తీసుకుందామని రాజీపడుతుంటారు లేదా ఏదైనా ఒక అభిప్రాయానికి ఎక్కువ ఓట్లు పడితే దాన్నే తుది నిర్ణయంగా భావిస్తారు. కానీ యెరూషలేములో జరిగిన ఆ చర్చలో అలాంటిదేదీ జరగలేదు. అయినా వాళ్లందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకోగలిగారు. అదెలా సాధ్యమైంది? ఆ చర్చలో పాల్గొన్నవాళ్లు తమ తమ అభిప్రాయాలు సరైనవని బల్లగుద్ది వాదించినప్పటికీ, అక్కడున్న ప్రతి ఒక్కరికీ దేవుని వాక్యంపై గౌరవం ఉంది కాబట్టి ఆ పరిశుద్ధ లేఖనాల సహాయంతోనే ఆ సమస్యను పరిష్కరించగలిగారు.—కీర్తన 119:97-101 చదవండి.

6, 7. అపొస్తలులు, పెద్దలు సున్నతికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి లేఖనాలను ఎలా ఉపయోగించారు?

6 ఆమోసు 9:11, 12 ఆధారంగా ఆ సమస్యను పరిష్కరించగలిగారు. ఆ వచనాల్లోని మాటలు అపొస్తలుల కార్యములు 15:16-18లో ఇలా ఎత్తిచెప్పబడ్డాయి, “ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యులలో కడమవారును, నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువును [యెహోవాను, NW] వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. దాని పాడైనవాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాదికాలమునుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు [యెహోవా, NW] సెలవిచ్చుచున్నాడు.”

7 ‘కానీ అన్యులు సున్నతి పొందాల్సిన అవసరం లేదని ఆ వచనాలు చెప్పడం లేదు కదా?’ అని ఒకరు అనే అవకాశం ఉంది. అది నిజమే కానీ, క్రైస్తవులుగా మారిన యూదులకు విషయం అర్థమై ఉంటుంది. వాళ్లు సున్నతి పొందిన అన్యులను ‘అన్యజనులుగా’ ఎంచలేదు కానీ సహోదరులుగా ఎంచారు. (నిర్గ. 12:48, 49) ఉదాహరణకు, బగ్‌స్టర్‌ సెప్టువజింటు అనువాదంలో ఎస్తేరు 8:17 ఇలా ఉంది, ‘అన్యుల్లో చాలామంది సున్నతి చేయించుకుని యూదులయ్యారు.’ ఇశ్రాయేలులో శేషించినవాళ్లు (యూదులు, సున్నతి పొందిన మతప్రవిష్టులు), ‘అన్యజనులు’ (సున్నతి పొందని అన్యులు) అందరూ కలిసి దేవుని నామం పెట్టబడిన ఒకే జనాంగంగా ఉంటారని లేఖనాలు ముందుగానే చెప్పాయి. కాబట్టి, లేఖనాల నుండి వాళ్లకు స్పష్టమైన జవాబు దొరికింది. క్రైస్తవులుగా మారాలనుకునే అన్యులు సున్నతి పొందాల్సిన అవసరం లేదు.

8. ఆ నిర్ణయం తీసుకోవడానికి వాళ్లకు ధైర్యం ఎందుకు అవసరమైంది?

8 దేవుని వాక్యం సహాయంతో, ఆయన ఆత్మ సహాయంతో నమ్మకమైన ఆ క్రైస్తవులు ‘ఏకాభిప్రాయానికి’ వచ్చారు. (అపొ. 15:25) ఆ నిర్ణయం వల్ల, క్రైస్తవులుగా మారిన యూదుల మీదికి ఎక్కువ హింసలు వచ్చే అవకాశమున్నా, బైబిలు ఆధారంగా తీసుకున్న ఆ నిర్ణయానికి నమ్మకస్థులైన ప్రజలు పూర్తి మద్దతును ఇచ్చారు.—అపొ. 16:4, 5.

స్పష్టమైన తేడా

9. ముఖ్యంగా దేనివల్ల సత్యారాధన కలుషితమైంది? దానితో ప్రాముఖ్యమైన ఏ క్రైస్తవ బోధ భ్రష్టుపట్టింది?

9 అపొస్తలులు చనిపోయిన తర్వాత అబద్ధ బోధల వల్ల క్రైస్తవ విశ్వాసం కలుషితమౌతుందని అపొస్తలుడైన పౌలు ముందే చెప్పాడు. (2 థెస్సలొనీకయులు 2:3, 4, 7 చదవండి.) అప్పట్లో బాధ్యతగల స్థానాల్లో ఉన్న కొంతమంది సహితం “హితబోధను” అనుసరించలేదు. (2 తిమో. 4:3) పౌలు తన కాలంలోని సంఘ పెద్దలను ఇలా హెచ్చరించాడు, “శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.” (అపొ. 20:30) అలాంటివాళ్ల ఆలోచనను ముఖ్యంగా ఏది వక్రీకరించిందనే దాని గురించి తెలియజేస్తూ ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఈ వివరాలిచ్చింది: ‘గ్రీకు తత్వజ్ఞానంలో శిక్షణ పొందిన కొంతమంది క్రైస్తవులు తమ క్రైస్తవ నమ్మకాలను వివరించడానికి ఆ తత్వజ్ఞానాన్ని ఉపయోగించారు. అన్యుల్లోని విద్యావంతులు క్రైస్తవత్వాన్ని స్వీకరించడానికి అది సహాయం చేస్తుందని ఆ క్రైస్తవులు అనుకున్నారు. అంతేకాక, వాళ్లు అలా చేసి తమ జ్ఞానాన్ని చూసుకొని మురిసిపోయారు.’ ఆ తత్వజ్ఞానంతో వాళ్లు యేసుక్రీస్తు ఎవరనే ప్రాముఖ్యమైన బైబిలు బోధను భ్రష్టు పట్టించారు. ఆయన దేవుని కుమారుడని బైబిలు చెబుతుంటే, గ్రీకు తత్వజ్ఞానాన్ని అభిమానించిన వాళ్లేమో ఆయన దేవుడని బోధించారు.

10. క్రీస్తు ఎవరనే దాని గురించిన సమస్య ఎలా పరిష్కారమై ఉండేది?

10 ఎన్నో చర్చీల్లో ఆ ప్రశ్న గురించి చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో పాల్గొన్నవాళ్లు, లేఖనాలను పరిగణనలోకి తీసుకొని ఉంటే ఆ సమస్య చాలా సులభంగా పరిష్కరించబడి ఉండేది కానీ చాలామంది అలా చేయలేదు. నిజానికి, ఆ చర్చల్లో పాల్గొనడానికి వచ్చినవాళ్లలో ఎక్కువమంది అక్కడికి రాకముందే బలమైన అభిప్రాయాల్ని ఏర్పర్చుకున్నారు. అక్కడికి వచ్చాక తమ అభిప్రాయాల్ని అసలేమాత్రం మార్చుకోలేదు. ఆ చర్చల తర్వాత విడుదలైన ఆదేశాల్లో గానీ నిర్ణయాల్లో గానీ లేఖనాల ప్రస్తావన అంతగా లేదు.

11. చర్చీ ఫాదర్లు అని పిలువబడేవాళ్లకు ప్రజలు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారు? ఎందుకు?

11 వాళ్లు లేఖనాలను ఎందుకు లోతుగా పరిశీలించలేదు? యేసు దేవుడని నమ్మినవాళ్లు, “తాను తండ్రికన్నా తక్కువ స్థానంలో ఉన్నానని యేసు చెప్పిన చాలా మాటలు తప్పని నిరూపించలేకపోయారు” అని చార్ల్స్‌ ఫ్రీమన్‌ జవాబిచ్చాడు. దానివల్ల, వాళ్లు సువార్తలను పక్కన బెట్టి చర్చి సాంప్రదాయాలకు, ఆ తర్వాతి కాలంలోని అధికారుల అభిప్రాయాలకు ప్రాముఖ్యతనిచ్చారు. ఇప్పుడు కూడా చాలామంది మతనాయకులు దేవుని వాక్యం కన్నా చర్చీ ఫాదర్లు అని పిలువబడేవాళ్ల దైవప్రేరితంకాని మాటలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. సెమినరీల్లో శిక్షణ పొందినవాళ్లతో మీరెప్పుడైనా త్రిత్వ సిద్ధాంతం గురించి చర్చించివుంటే మీరు ఆ విషయాన్ని గమనించివుంటారు.

12. చక్రవర్తి ఎలాంటి ప్రభావం చూపించగలిగాడు?

12 చర్చీల్లో జరిగే చర్చల్లో రోమా చక్రవర్తుల ప్రమేయం ఉండేది. ఉదాహరణకు, కౌన్సిల్‌ ఆఫ్‌ నైసియా గురించి ప్రొఫెసర్‌ రిచర్డ్‌ ఈ. రూబన్‌స్టైన్‌ ఇలా రాశాడు, ‘కాన్‌స్టంటైన్‌ బిషప్పులకు మద్దతునిచ్చి వాళ్లను తాము ఊహించనంత ధనవంతుల్ని చేశాడు. ఒక సంవత్సరం తిరిగేలోపే, ఈ కొత్త పరిపాలకుడు దాదాపు వాళ్ల చర్చీలన్నిటినీ తిరిగి ఇచ్చేశాడు లేదా వాటిని తిరిగి కట్టించాడు, వాళ్లకు మళ్లీ ఉద్యోగాలు, హోదాలు ఇచ్చాడు. అంతకుముందు అన్య మతాచార్యులకు తానిచ్చిన ఘనతాగౌరవాలను ఆ తర్వాత క్రైస్తవ మతనాయకులకు ఇచ్చాడు.’ ఫలితంగా, ‘కాన్‌స్టంటైన్‌ నైసియాలో జరుగుతున్న చర్చల్ని చాలామేరకు ప్రభావితం చేయగలిగాడు, ఆఖరికి వాటిని నిర్దేశించగలిగాడు కూడా.’ చార్ల్స్‌ ఫ్రీమన్‌ ఆ విషయాన్ని ఇలా ధృవీకరించాడు, “దాంతో చక్రవర్తి చర్చీలను బలపర్చడమే కాదు బైబిలు బోధలను ప్రభావితం చేయవచ్చనే సాంప్రదాయం మొదలైంది.”—యాకోబు 4:4 చదవండి.

13. చర్చీ నాయకులు ఏ కారణాల వల్ల బైబిలు స్పష్టమైన బోధలను పక్కనబెట్టారని మీకనిపిస్తోంది?

13 చర్చీ నాయకులు యేసుక్రీస్తు ఎవరనే దానిగురించి సరిగ్గా గ్రహించలేకపోయారు కానీ చాలామంది సాధారణ ప్రజలు దాన్ని సులభంగా గ్రహించగలిగారు. ఎందుకంటే వాళ్లు చక్రవర్తుల నుండి వచ్చే డబ్బు మూటలకు ఆశపడలేదు లేదా చర్చీల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశించలేదు కానీ లేఖనాల్లో ఉన్న విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా గ్రహించి వాటిని స్వీకరించారు. ఆ కాలంలో, నిస్సాకు చెందిన గ్రెగరీ అనే ఒక క్రైస్తవ మత పండితుడు సాధారణ ప్రజల గురించి వ్యంగ్యంగా ఇలా అన్నాడు, “బట్టలు అమ్ముకునేవాళ్లు, రూకలు మార్చేవాళ్లు, కిరాణా కొట్టువాళ్లు అందరూ బైబిలు పండితులే. మీరు మీ రూకల విలువెంతో అడగడానికి వెళ్తే ‘తండ్రి, కుమారుడు వేర్వేరు వ్యక్తులు’ అని ఒక తత్వజ్ఞాని చెబుతాడు. బ్రెడ్డు ఖరీదు ఎంతో అడిగితే, ‘తండ్రి కుమారుని కన్నా గొప్పవాడు’ అని చెబుతాడు. స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయో లేవో తెలుసుకోవాలనుకుంటే ‘కుమారుడు శూన్యం నుండి సృష్టించబడ్డాడు’ అనే జవాబు వస్తుంది.” చర్చీ సభ్యుల్లా కాక, చాలామంది సాధారణ ప్రజలు తమ నమ్మకాలను దేవుని వాక్యం ఆధారంగా వివరించగలిగేవాళ్లు. గ్రెగరీ, ఆయన సహవాసులు ఆ ప్రజల మాటలు విన్నా బాగుండేది.

“గోధుమలు,” “గురుగులు” కలిసి పెరుగుతాయి

14. మొదటి శతాబ్దం నుండి కొంతమంది నిజమైన అభిషిక్త క్రైస్తవులు ఈ భూమ్మీద ఎప్పుడూ ఉండేవుంటారని మనమెలా చెప్పవచ్చు?

14 మొదటి శతాబ్దం నుండి కొంతమంది నిజమైన అభిషిక్త క్రైస్తవులు ఈ భూమ్మీద ఉండనే ఉంటారని యేసు ఒక ఉపమానంలో సూచించాడు. ఆయన వాళ్లను గురుగులతో పాటు పెరుగుతున్న ‘గోధుమలతో’ పోల్చాడు. (మత్త. 13:30) అయితే, ఎవరు లేదా ఏ గుంపు అభిషిక్త గోధుమల తరగతికి చెందినవాళ్లు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ, దేవుని వాక్యాన్ని ధైర్యంగా సమర్థించి చర్చీల లేఖనవిరుద్ధ బోధలను బహిర్గతం చేసినవాళ్లు మాత్రం అన్ని కాలాల్లో ఉండనే ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు మనం అలాంటివాళ్లలో కొందరి గురించి చూద్దాం.

15, 16. దేవుని వాక్యాన్ని గౌరవించిన కొందరి పేర్లు చెప్పండి.

15 ఫ్రాన్స్‌లోని లయన్స్‌కు చెందిన ఆర్చ్‌బిషప్‌ అగోబార్డ్‌ (సా.శ. 779-840) విగ్రహారాధన చేయడాన్ని, సెయింట్‌లకు చర్చీలను అంకితం చేయడాన్ని, చర్చీల్లో లేఖనవిరుద్ధమైన మతసేవలూ ఆచారాలూ జరపడాన్ని ఖండించాడు. ఆయన సమకాలీనుడైన బిషప్‌ క్లౌడియస్‌ కూడా చర్చీ సాంప్రదాయాల్ని తిరస్కరించి సెయింట్‌లకు ప్రార్థనలు చేయడాన్ని, చిహ్నాలను పూజించడాన్ని ఖండించాడు. 11వ శతాబ్దంలో, ఫ్రాన్స్‌లోని ట్యూర్స్‌కు చెందిన ఆర్చ్‌డీకన్‌ బెరన్‌గరీయస్‌ రొట్టె, ద్రాక్షారసం యేసు శరీరంగా, రక్తంగా మారతాయనే క్యాథలిక్‌ బోధను ఖండించినందుకు చర్చీ నుండి బహిష్కరించబడ్డాడు. అంతేకాక, చర్చీ సాంప్రదాయాలకన్నా బైబిలే గొప్పదని ఆయన నమ్మాడు.

16 పన్నెండవ శతాబ్దంలో జీవించిన మరో ఇద్దరు వ్యక్తులు అంటే బ్రవీకి చెందిన పీటర్‌, లౌసాన్‌కు చెందిన హెన్రీ కూడా బైబిలు సత్యాన్ని ప్రేమించారు. రొట్టె, ద్రాక్షారసం యేసు శరీరంగా, రక్తంగా మారతాయనే బోధ, శిశు బాప్తిస్మం, చనిపోయినవాళ్ల కోసం ప్రార్థించడం, సిలువను ఆరాధించడం వంటి క్యాథలిక్‌ బోధలకు బైబిల్లో ఆధారం లేదని గ్రహించి ప్రీస్టు పదవికి పీటర్‌ రాజీనామా చేశాడు. తన నమ్మకాల వల్ల ఆయన 1140లో సజీవదహనం చేయబడ్డాడు. క్రైస్తవ సన్యాసియైన హెన్రీ చర్చీల్లో జరిగే అక్రమాలను, లేఖనవిరుద్ధమైన మతసేవలను ఖండించాడు. ఆయన 1148లో అరెస్టు చేయబడి తన శేష జీవితం జైల్లోనే గడిపాడు.

17. వాల్డో, ఆయన అనుచరులు ఏ ప్రాముఖ్యమైన పనులు చేశారు?

17 చర్చీని విమర్శించినందుకు బ్రవీకి చెందిన పీటర్‌ సజీవదహనం చేయబడిన రోజుల్లో వాల్డెస్‌ లేదా వాల్డో a అనే వ్యక్తి జన్మించాడు. ఆయన ఆ తర్వాత సత్యాన్ని వ్యాప్తి చేయడంలో ఎంతగానో తోడ్పడ్డాడు. బ్రవీకి చెందిన పీటర్‌, లౌసాన్‌కు చెందిన హెన్రీ మతపరమైన శిక్షణ పొందినట్లు వాల్డో పొందలేదు, ఆయన ఒక సాధారణ వ్యక్తి. అయినా, ఆయన దేవుని వాక్యాన్ని ఎంత విలువైనదిగా ఎంచాడంటే, ఆగ్నేయ ఫ్రాన్స్‌లో మాట్లాడే భాషలోకి బైబిల్లోని కొన్ని భాగాలను అనువదించే పని మీద దృష్టి నిలపడానికి తన ఆస్తిపాస్తుల్ని వదులుకున్నాడు. బైబిలు సందేశాన్ని తమ భాషలో విని ఎంతగానో మురిసిపోయిన కొంతమంది కూడా తమకున్నవాటిని ఇతరులకు దానం చేసి బైబిలు సత్యాన్ని ప్రకటించడానికే తమ జీవితాల్ని అంకితం చేశారు. వాళ్లకు ఆ తర్వాత వాల్డెన్సులు అనే పేరు వచ్చింది. వాళ్లు సత్యాన్ని ప్రకటించడం చర్చీకి మింగుడుపడలేదు. దానితో 1184లో ఉత్సాహవంతులైన ఈ స్త్రీపురుషులను పోప్‌ చర్చీ నుండి బహిష్కరిస్తే, బిషప్‌ ఏకంగా వాళ్లను ఊర్లో నుండి వెళ్లగొట్టేసి వాళ్ల సొంత ఇళ్లలోకి వాళ్లను మళ్లీ రానివ్వలేదు. నిజానికి, అలా చేసినందువల్ల బైబిలు సత్యం ఇతర ప్రాంతాలకు చేరింది. కొంతకాలానికి వాల్డో అనుచరులు, బ్రవీకి చెందిన పీటర్‌ అనుచరులు, లౌసాన్‌కు చెందిన హెన్రీ అనుచరులు, అలాంటి ఇతర వ్యక్తుల అనుచరులు ఐరోపాలోని చాలా ప్రాంతాలకు చేరుకున్నారు. తర్వాతి శతాబ్దాల్లో జాన్‌ విక్లిఫ్‌ (దాదాపు 1330-1384), విలియం టిండేల్‌ (దాదాపు 1494-1536), హెన్రీ గ్ర్యూ (1781-1862), జార్జ్‌ స్టార్జ్‌ (1796-1879) బైబిలు సత్యాన్ని సమర్థించారు.

‘దేవుని వాక్యం బంధింపబడలేదు’

18. బైబిల్లో నిజంగా ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న బైబిలు విద్యార్థులు 19వ శతాబ్దంలో ఎలాంటి పద్ధతిని ఉపయోగించారు? అది ఎందుకు మంచి పద్ధతి?

18 బైబిలు సత్యాన్ని వ్యతిరేకించేవాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యాప్తి చెందకుండా ఆపలేకపోయారు. ‘దేవుని వాక్యం బంధింపబడలేదు’ అని 2 తిమోతి 2:9 చెబుతోంది. బైబిల్లో నిజంగా ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న బైబిలు విద్యార్థుల చిన్న గుంపు 1870లో సత్యాన్వేషణ మొదలుపెట్టింది. వాళ్లు ఎలా అధ్యయనం చేసేవాళ్లు? ఆ గుంపులో ఎవరైనా ఒక ప్రశ్న లేవదీసేవాళ్లు. వాళ్లంతా కలిసి దాని గురించి చర్చించేవాళ్లు. దానికి సంబంధించిన లేఖనాలన్నీ చూసేవాళ్లు. ఆ తర్వాత లేఖనాల మధ్య ఉన్న పొందిక విషయంలో సంతృప్తి చెందితే చివరికి, ఆ ప్రశ్నకు జవాబు అదేనని నిర్ధారించుకొని, దాన్ని రాసి పెట్టుకునేవాళ్లు. అది మంచి పద్ధతి, ఎందుకంటే వాళ్లు మొదటి శతాబ్దంలోని అపొస్తలుల, పెద్దల మాదిరిని అనుకరించారు. యెహోవాసాక్షుల చరిత్రారంభంలో జీవించిన ఈ నమ్మకమైన వ్యక్తులు పూర్తిగా దేవుని వాక్య ప్రకారంగా ఉన్న నమ్మకాలను పెంపొందించుకోవడానికి కృషి చేశారని తెలుసుకోవడం మనకు ప్రోత్సాహాన్నిస్తుంది.

19. మనకు 2012వ సంవత్సరపు వార్షిక వచనం ఏమిటి? అది ఎందుకు సముచితమైనది?

19 ఇప్పటికీ మన నమ్మకాలకు బైబిలే ఆధారం. యెహోవాసాక్షుల పరిపాలక సభ దాన్ని మనసులో ఉంచుకొని, “నీ వాక్యమే సత్యము” అని యేసు పూర్తి విశ్వాసంతో చెప్పిన మాటల్ని 2012వ సంవత్సరపు వార్షిక వచనంగా తీసుకుంది. (యోహా. 17:17) దేవుని ఆమోదాన్ని పొందాలనుకునే ప్రతీ ఒక్కరు సత్య మార్గంలో నడవాలి కాబట్టి, మనమందరం దేవుని వాక్యమిచ్చే నడిపింపును అనుసరించడానికి కృషి చేస్తూ ఉందాం.

[అధస్సూచి]

a వాల్డెస్‌ కొన్నిసార్లు పయెర్‌ వాల్డెస్‌ లేదా పీటర్‌ వాల్డో అని పిలువబడ్డాడు. అయితే ఆయన పూర్తి పేరును ఖచ్చితంగా చెప్పలేం.

[అధ్యయన ప్రశ్నలు]

[8వ పేజీలోని బ్లర్బ్‌]

2012లో మన వార్షిక వచనం: “నీ వాక్యమే సత్యము.” —యోహా. 17:17

[7వ పేజీలోని చిత్రం]

వాల్డో

[7వ పేజీలోని చిత్రం]

విక్లిఫ్‌

[7వ పేజీలోని చిత్రం]

టిండేల్‌

[7వ పేజీలోని చిత్రం]

గ్ర్యూ

[7వ పేజీలోని చిత్రం]

స్టార్జ్‌