కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నేను ఈ స్థితిలో ప్రకటనాపని ఎలా చేయగలుగుతాను?’

‘నేను ఈ స్థితిలో ప్రకటనాపని ఎలా చేయగలుగుతాను?’

‘నేను ఈ స్థితిలో ప్రకటనాపని ఎలా చేయగలుగుతాను?’

తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా నమ్మకంగా ప్రకటనాపని చేస్తున్న సహోదర సహోదరీల చక్కని అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు, డాల్య అనే సహోదరి లిథువానియా రాజధాని అయిన విల్నియస్‌లో నివసిస్తోంది.

డాల్యకు దాదాపు 35 ఏళ్లుంటాయి. సెరెబ్రల్‌ అపొప్లెక్సీ వల్ల ఆమెకు పుట్టుకతోనే పక్షవాతం వచ్చింది, అంతేకాక ఆమె సరిగా మాట్లాడలేదు. అందుకే ఆమె మాటలు ఆమె కుటుంబంలోని వాళ్లకు తప్ప వేరేవాళ్లకు అంతగా అర్థం కావు. డాల్య వాళ్ల అమ్మ పేరు గలీన. డాల్య ఆలనాపాలనా చూసుకుంటున్నది ఆవిడే. డాల్య ఎంతో బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. అదెలా సాధ్యం?

గలీన ఇలా వివరిస్తోంది, “1999లో అపల్యానియ అనే మా దగ్గరి బంధువు ఒకసారి మా ఇంటికి వచ్చింది. యెహోవాసాక్షి అయిన అపల్యానియకు లేఖనాలు బాగా తెలుసు, డాల్య ఆమెను చాలా ప్రశ్నలు అడిగేది. కొంతకాలానికి ఆమె డాల్యతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. డాల్య చెబుతున్నది అపల్యానియకు వివరించడానికి నేను అప్పుడప్పుడు అధ్యయనానికి కూర్చునేదాన్ని. అయితే, డాల్య తాను నేర్చుకుంటున్న విషయాల వల్ల సంతోషంగా ఉంటోందని నేను గమనించాను. అందుకే నాతో కూడా బైబిలు అధ్యయనం చేయమని అపల్యానియను అడిగాను.”

డాల్య బైబిలు సత్యాలను అర్థం చేసుకుంటున్న కొద్దీ, పదేపదే ఒక ప్రశ్న ఆమెను కలవరపర్చేది. చివరికి ఒక రోజు ఆమె అపల్యానియను ఇలా అడిగింది, “పక్షవాతంతో బాధపడుతున్న నేను ప్రకటనాపని ఎలా చేయగలుగుతాను?” (మత్త. 28:19, 20) అపల్యానియ ప్రశాంతంగా డాల్యకు ఇలా ధైర్యం చెప్పింది, “దాని గురించి ఆందోళనపడకు. యెహోవా నీకు సహాయం చేస్తాడు.” యెహోవా నిజంగా సహాయం చేస్తాడు.

మరైతే డాల్య ప్రకటనాపని ఎలా చేస్తోంది? చాలా విధాలుగా చేస్తోంది. ఉత్తరాల ద్వారా సాక్ష్యమిచ్చేందుకు కొంతమంది సహోదరీలు డాల్యకు సహాయం చేస్తారు. ఎలాగంటే డాల్య తన తలంపులను సహోదరీలకు తెలియజేస్తుంది, ఆ తర్వాత వాళ్లు ఆమె తలంపులను చేర్చి ఒక ఉత్తరాన్ని తయారు చేస్తారు. మొబైల్‌లో మెసేజ్‌లు పంపించడం ద్వారా కూడా ఆమె సాక్ష్యమిస్తుంది. వాతావరణం కాస్త బాగున్నప్పుడు సంఘ సభ్యులు ఆమెను బయటికి తీసుకువెళ్తే ఆమె పార్కుల్లో, వీధుల్లో ప్రజలను కలిసి వాళ్లతో మాట్లాడుతుంది.

డాల్య, వాళ్లమ్మ గలీన మంచి ప్రగతి సాధించి 2004 నవంబరులో యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నారు. 2008 సెప్టెంబరులో విల్నియస్‌లో పోలిష్‌ భాషా గుంపు ఏర్పడింది. ఆ గుంపుకు రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉండడంతో డాల్య, వాళ్లమ్మ ఆ గుంపుతో సహవసించడం మొదలుపెట్టారు. డాల్య ఇలా అంటోంది, “కొన్నిసార్లు, సగం నెల గడిచిపోయినా నేను పరిచర్యకు వెళ్లలేకపోతుంటే ఎంతో బాధపడతాను. కానీ దాని గురించి నేను యెహోవాకు ప్రార్థిస్తే, వెంటనే ఎవరో ఒకరు వచ్చి నన్ను పరిచర్యకు తీసుకువెళ్తారు.” డాల్య తన పరిస్థితి గురించి ఎలా భావిస్తోంది? ఆమె ఇలా చెబుతోంది, “నా శరీరానికే పక్షవాతం వచ్చింది గానీ, నా మనసుకు కాదు. యెహోవా గురించి ఇతరులతో మాట్లాడగలుగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.”