కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు అధ్యయనాన్ని మరింత ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా చేసుకోండి

బైబిలు అధ్యయనాన్ని మరింత ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా చేసుకోండి

బైబిలు అధ్యయనాన్ని మరింత ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా చేసుకోండి

బైబిలు అధ్యయనం మరింత ఆహ్లాదకరంగా, మరింత ప్రయోజనకరంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి? వ్యక్తిగత బైబిలు అధ్యయనం నుండి సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం పొందడానికి తోడ్పడే మూడు విషయాల గురించి మనమిప్పుడు చూద్దాం.

1 ప్రార్థించండి: మొట్టమొదటిగా, మనం ప్రార్థించాలి. (కీర్త. 42:8) ఎందుకు? దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడాన్ని మన ఆరాధనలో భాగంగా పరిగణించాలి. కాబట్టి, మనం చదివిన విషయాలన్నిటినీ ఏకాగ్రతతో మనసులోకి తీసుకునేలా సహాయం చేయమని, పరిశుద్ధాత్మను ఇవ్వమని మనం యెహోవాను అడగాలి. (లూకా 11:13) ఎంతోకాలం నుండి మిషనరీ సేవచేస్తున్న బార్‌బ్ర ఇలా అంటోంది, “ఎప్పుడూ నేను బైబిలు చదివే ముందు లేదా అధ్యయనం చేసే ముందు యెహోవాకు ప్రార్థిస్తాను. ఆ తర్వాత, యెహోవా నాతో ఉన్నాడని, నేను చేస్తున్నదాన్ని ఆయన ఇష్టపడుతున్నాడని నాకు అనిపిస్తుంది.” మన ముందున్న పుష్కలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవడానికి మన మనసులు, హృదయాలు తెరుచుకోవాలంటే అధ్యయనానికి ముందు ప్రార్థన చేయాలి.

2 ధ్యానించండి: సమయం లేకపోవడం వల్ల, కొంతమంది దేవుని వాక్యాన్ని ఏదో అలా చదువుకుంటూ వెళ్లిపోతారు. అలా చేస్తే, అధ్యయనం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను వాళ్లు పొందలేరు. 50 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా యెహోవా సేవచేస్తున్న కార్లోస్‌ తన బైబిలు అధ్యయనాన్ని మరింత ప్రయోజనకరంగా చేసుకోవాలంటే ధ్యానించడానికి సమయం తీసుకోవాలని గుర్తించాడు. ఆయన ఇలా అంటున్నాడు, “ఇప్పుడు నేను బైబిల్లో రోజుకు దాదాపు రెండు పేజీలు చదువుతున్నాను. దానివల్ల, ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకునేలా ధ్యానించడానికి నేను ఎక్కువ సమయం వెచ్చించగలుగుతున్నాను.” (కీర్త. 77:12) మనం ధ్యానించడానికి సమయం తీసుకుంటే, దేవుని చిత్తం గురించిన జ్ఞానాన్ని, అవగాహనను పెంచుకోగలుగుతాం.—కొలొ. 1:9-11.

3 పాటించండి: ఏదైనా పనిచేయడం వల్ల వచ్చే ఉపయోగాన్ని మనం గుర్తిస్తే దాన్నుండి మరింత ప్రయోజనం పొందుతాం. బైబిలు అధ్యయనం విషయంలో కూడా అంతే. క్రమంగా బైబిలు అధ్యయనం చేసే అలవాటున్న గాబ్రీయెల్‌ అనే యువ సహోదరుడు ఇలా అంటున్నాడు, “రోజువారీ సమస్యలతో పోరాడడానికి అధ్యయనం నాకు సహాయం చేస్తుంది. అంతేకాక, ఇతరులకు సహాయం చేయడానికి అది నన్ను సిద్ధం చేస్తుంది. నేను నేర్చుకునే ప్రతీదాన్ని నా జీవితంలో పాటించడానికి ప్రయత్నిస్తాను.” (ద్వితీ. 11:18; యెహో. 1:8) మనం తెలుసుకొని, పాటించగల దైవిక సమాచారం బైబిల్లో ఎంతో ఉంది.—సామె. 2:1-5.

సారాంశం: సర్వజ్ఞానానికి మూలమైన యెహోవా ఇచ్చే జ్ఞానాన్ని పరిశోధించే గొప్ప అవకాశం మనకుంది. (రోమా. 11:33) కాబట్టి, మీరు ఈసారి బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు, చదివిన విషయాలన్నిటినీ ఏకాగ్రతతో మనసులోకి తీసుకునేలా సహాయం చేయమని, పరిశుద్ధాత్మను ఇవ్వమని యెహోవాకు ప్రార్థించండి. ఆ తర్వాత కొంచెం సమయం తీసుకొని, మీరు చదివిన విషయాల గురించి ధ్యానించండి. అంతేకాక, మీరు నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకొని మీ రోజువారీ జీవితంలో పాటించండి. ఈ ప్రాముఖ్యమైన పనులను చేస్తే, మీ బైబిలు అధ్యయనం ఎంతో ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది.